బొబ్బిలియుద్ధనాటకము/అష్టమాంకము
అష్టమాంకము.
స్థలకము: - బొబ్బిలికోట లోపల.
(బుస్సీ, విజయరామరాజు, హైదరుజంగు, ముసేపనాల్, పరివారముతో ప్రవేశింతురు.)
హైదరు. - ఏమి ముసేపనాల్ బహద్దర్ ? ఈలూటిలో విస్తారం ధనం దొరికిందా మీకి ?
ముసే. - ఎక్కువగానే దొరికింది, హైదర్సాబ్. ఈయాశ్చర్యం ఇనండి. మాదీ పాడు జీవణం. వఖరిసావు మాకీ పెళ్లి వఖరినాశం మాకి హవిశ్యర్వం ;మాదీ చావూ నాశం అలాగే ఎవరికో పెళ్లి హవిశ్యర్వం అయితుంది. వారిధనం మొత్తంగా మాకి ఎక్కడా దొరకలేదు. బుగ్గిఐన వల్లుతో బంగారపు జవాహరీ కరిగినపెళ్లలు దొరికినయి. కొన్ని ఇస్త్రీ శపాల్మీద విశేషించి జవాహరీ దొరికింది. ఖిల్లామే ధనం దాశిన సోటు అడ్గడానికి వఖ నరపురు గయినా లేదు.
బుస్సీ. - స్త్రీ లే మయినారు ? ఒక స్త్రీయైనను కోటనుండి తప్పించుకొని పోలేదు గదా !
ముసే. - స్త్రీ లంతా సచ్చి పడివుంది. శానా మంది కాలిపోయింది.
బుస్సీ. - ఏమి యిది ! పెండ్లి యని చెప్పినాడే యీరాజు !
ఒకసిపాయి. - [సంభ్రాంతుఁడై ప్రవేశించి] నాకీ ఆయింట్లోదూరినదాన్కి కిఫాయత్ ఇద్గో నాదాడీ కాలిపోవడం. [అని నిష్క్రమించును.]
బుస్సీ. - ఏమిరాజా, యీవింతలు చూతము రండి [అని పరిక్రమింతురు.]
రాజు. - [ఆత్మగతము] నాచేఁతను నాకనులారం జూచెదఁగాక.
బుస్సీ. - [పరికించి] యీ యిండ్లన్నీ కాలిపోయినవి ! ఇంకను కాలుచునే యున్నవి ! [కాంచి] ఏమి యివి ! కాలిపోయిన స్త్రీ దేహములు ! [నిర్వర్ణించి] ఎక్కడను పురుషదేహము అగపడదు. [ఒండుచోఁగాంచి] హా! యిక్కడ ఈపసి కూన సోలి పడిపోయి, పాలు త్రాగు చున్నట్లు నోరు కదలించుచున్నది ! [మఱియొక చోటంగాంచి] హా ! హా ! ఇక్కడ ఈశిశువు చచ్చిన తల్లిమీఁద పడి పాలకై పీఁకు చున్నది ! హా ! హా! రాజా ! ఈకోటలోని స్త్రీ లందఱు నీవు చేసిన ద్రోహముచేత గోహారు చేసినారా యేమి ? ముసే. - అవును సర్దార్ ; ఆలాగే జర్గింది.
బుస్సీ. - ఏమి రాజా ? ఇండ్లు కాలుచున్న మంటలను పెండ్లిబాణ సంచా అంటివే. ఎంత పాపాత్ముఁడవయ్యా !
రాజు. - [విసుగుతో] ఆ! నేనుమాత్రము చూచి చెప్పితినా యేమి ? ఊరక నన్ను పట్టుకొని సివాలు మాటమాటకు.
బుస్సీ. - రాజా ఈపాపము ఎవరి దయ్యా ?
రాజు. - ఏమి చేయను! మనదే.
బుస్సీ. - అది యె ట్లయ్యా, ఉమ్మడిమాటగా పలికెదవు ?
రాజు. - నాకు ఈజమీను వచ్చినది, మీకు పేష్కస్సుధనము వచ్చినది.
బుస్సీ. - లేదు, నీవు మమ్ము మోసము చేసితివి. నేను ఏత ప్పయిన మన్నింతును గాని, మోసమును మన్నింపను. హా ! హా ! ఎంత మోసపోయితిమి ! ఇందులకు శిక్ష రాజా, యీజమీనును మీకు మే మియ్యము.
రాజు. - [ఆత్మగతము] బెదరింపే. [ప్రకాశము] ఈపాపము నాయొక్కనిదే.
బుస్సీ. - అట్లు పలుకు. 'మనది' అనకు. [సూక్ష్మశ్రవణ మభినయించి] ఏమి యిది తెంపులేని ఘంటానాదమువలె వినఁబడుచున్నది! హైదరుజంగ్, మీకు వినఁబడ లేదా ?
హైదరు. - అదుగో యినండి. అరబ్బీరాత్రులకథల్లో కొండమీద్కి ఆబంగారపు వున్నికీ తేబోయేవాడ్కి రాయిరాయిన్ని 'చీచీ' యన్న చీవాట్లలాగ మనకీ యిక్కడ 'చీచీ' ఇనబడటం లేదా ?
ముసే. - అవు నవును. ఇంకా ఇంకా ఏమ్టేమ్టో ఇనబడతా వుంది.
హైదరు. - ఇప్పు డేమి చెప్తారు ? ఇంకా రాత్రియైనకొద్దీ కోళాహళం వుంటుంది. గుండెబద్దల్ అయ్యే షబ్దాలు ఇనబడుతుంది.
రాజు. - ఇన్ని చావులు అయిన యీ చోట శాకినీ డాకినీ బ్రహ్మరాక్షస బేతాళులు వేఁటలాడుట ఆశ్చర్యమా ?
హైదరు. - నేలదేకినీ, నింగినాకిని, జిన్, పిసాసీ, సైతాన్లు కూడా. ఈటి భయానికే నేను రాత్రి నాడేరాబైటికి అడ్గుపెడ్తాన్ లేదు.
బుస్సీ. - మనమిక్కడ ఉండఁ దగదు. డేరాలకే పోదము రండి. మనకే మందుగుండ్లు లేకపోయిన, మనది 174000 సేనయు, యీబొబ్బిలిబంట్లు 2000 మందిచేత నాశమై యుండును. [అందఱు పరిక్రమింతురు.] స్థలకము: - బుస్సీ డేరా.
బుస్సీ. - ఇదే మాడేరాలో కూర్చుందము [అట్లు చేయుట నభినయింతురు.]
బుస్సీ. - ఎవరురా అక్కడ ?
నౌకరు. - సర్దార్, ఏమి సెలవు ?
బుస్సీ. - ఆ బాలుని వేంకటలక్ష్మమ్మను తోడ్కొనిరండు.
[నౌకర్లు అట్లే చేయుదురు. వేంకటలక్ష్మి బాలుని కుర్చీలో కూర్చుండఁబెట్టి నిలుచుండును.]
వేంక. - బాబూ, దొరగారికి సలాము చేయుము.
బాలుఁడు. - సలాము బూచీ దొలగాలికి [అని సలాము చేయును.]
బూసీ. - [టోపితీసి] సలాము చినవేంకటరాయనింగారికి - హైదరుసాహెబు, ఈయన నేమి చేయుదము ?
రాజు. - ఏనుఁగుకాల మట్టింపుఁ డని నే నప్పుడే చెప్పలేదా ?
బుస్సీ. - ఏమి పాపాత్ముఁడా. అట్లు పలికెదవు. బిడ్డల గన్నవాఁడవు కావు గదా. ఆ నిసువును చంపి అతని నోటిముందఱి యన్నమును హరించెదవా ; నీది యెట్టి రాతిహృదయ మయ్యా !
రాజు. - అటయిన మీరు నాకు చేసినమేలు సున్న. వాఁడే నా ప్రాణానకు మృత్యువు.
బుసీ. - ఎ ట్లయ్యా ?
రాజు. - పరీక్షించి చూడుఁడు.
బుస్సీ. - నౌకరులారా, దివ్యపదార్థము లన్నియు బాలునిమ్రోల పెట్టుఁడు. పుస్తకములు, కత్తి, కటారి, ఈఁటె, ఇంక వేఱుకైదువులు కూడ పెట్టుఁడు. [నౌకర్లు అట్లే చేయుదురు.]
బుస్సీ. - బాబూ, ఇందులో నీ కేమి కావలయునో దానిని తీసికొమ్ము. [బాలుడు పోయి కత్తింగైకొని రాజుమొగముమీఁదికి ఎత్తును.]
బూసీ. - బళీ! బళీ! బలారే ! బలారే! తండ్రిపగ తీర్చుకొనెడి కుమారుఁడవు బాబూ, తుపాకికడుపున ఫిరంగిలాగున పుట్టినాఁడవు. (రాజు నుద్దేశించి) రాజా, నీపాపము నిన్ను త్వరలోనే కొట్టును గాని తప్పదయ్యా. వేంకటలక్ష్మమ్మా! ఈరాజు వలన మోసపోయి మేము ఆమహాత్ములకు చేసిన కీడునకు మితిలేనిదానికి కొంచెము పరిహారముగా, ఈ చిన్నిబాలుని నీతో సురక్షితముగా పంపెదను. ఎవరు రా అక్కడ? [నౌకరు ప్రవేశించును.] బుస్సీ. - ఈక్షణము పోయి, హసేనల్లీ సర్దారుతో మామాటగా చెప్పుము. 'నీవు మా పరంగి తురుపు 200లతో, సకలపదార్థములతో, సవారిలో ఈవేంకటలక్ష్మమ్మను ఈచిన్న రాయనింగారిని, ఎక్కించుకొని, సామర్లకోటకు కోనిపోయి, తగిన మరియాదతో ఈయన పినతల్లికి అప్పగించి, మాసలాములుచెప్పి, మమ్ము కలసికోవలసినది.' అనియు, 'దారిలో ఈరాజు ఏమయిన శిశువునకు అపాయము చేయుటకు పన్నాగము పన్నెనా, దానిని నీవు హతము చేయవలసినది.' అనియు, 'ఇక్కడ రాజును మేము భద్రముగా కాపు కాచెదము,' అనియు, చెప్పుము. వీరిం దోడ్కొని పొమ్ము. [అని బాలుని ఎత్తుకొని ము ద్దిడి, పండిచ్చి, దింపి] బాబూ, పోయివచ్చెదవా ?
బాలు. - పోయి వత్తాం, తలాం.
వేంకట. - సలాము దొరగారికి. ఒక మడుగులోనే మొసలియు, రాజహంసయు నున్నవి. అట్లే ఈసేనలోనే ఈరా జున్నాఁడు, మీరును ఉన్నారు. మీ రన్నట్లు, ఈయనను, పాపము కొట్టునుగాని మానదు. సెలవు పుచ్చుకొంటిమి.
[నౌకరు, బాలుఁడు, వేంకటలక్ష్మియు నిష్క్రమింతురు.]
రాజు. - ఎవరురా అక్కడ మానౌకరులు ?
నౌకరు. - [ప్రవేశించి] జయము జయము మహాప్రభువుగారికి. ఏమి యాజ్ఞ?
రాజు. - ఈక్షణమే పోయి, ఎల్లుండి తెల్లవాఱు నప్పటికి మాబాబును ఆనందరావును ఇక్కడికి బొబ్బిలి పట్టాభిషేకార్థమై సర్వసన్నాహముతో తోడ్కొనిరండు.
నౌకరు. - చిత్తము ఏలినవారియాజ్ఞ. [అని నిష్క్రమించును.]
బుస్సీ. - ఇఁక మారందఱు పొండయ్యా; నేనును నాయాందోళన తీఱునట్లుగా, ఏసుదేవుని గూర్చి నాతప్పులు మన్నింపు మని ప్రార్థనచేసికొని విశ్రమించెదను.
ఇతరులు. - సలాము, సలాము, సలాము. [అని నిష్క్రమింతురు.]
బుస్సీ. - నేనును ప్రార్థానాపవరకమున కేఁగెద. [అని నిష్క్రమించును.]
- ____________