Jump to content

బొబ్బిలియుద్ధనాటకము/ప్రవేశకము2

వికీసోర్స్ నుండి

[అష్టమ నవమాంకముల నడుమ]

ప్రవేశకము

స్థలకము - బొబ్బిలికోటలోపల.

[అంతట వెట్టివాండ్రు ప్రవేశింతురు.]

వెట్టినాయకుఁడు. - [చేత చేపాటికఱ్ఱం బట్టుకొని నిలువంబడి, శవములను బండ్ల కెక్కింపించుట నభినయించుచు] యెట్టోడిబదుకు యేంబదుకురా నారాయుడా! ఎ'త్తండిరా ఈ పీనుగలని, బళ్లలోకి. [ఇతరులు అట్లుచేయుట నభినయింతురు.]

వెట్టినాయకుఁడు. - ఆయరె మజ్జా! యేమి శిత్రంరా ! మనము పదిబారల దూరాన వుండాలిశిన యీ ఆడంగులు రానివోసాలు, యేనిగలమీద బంగారపు అంబారీలలోను బంగారపు సవ్వారీలలోను తిరగాలిశిననోరు, మనశాత దున్నపోతుల బళ్లల్లో, యీడ్పులు పడి, గోతులలో పడతా వున్నారు ; ఏంకమ్మ మొచ్చిందిరా యీళ్లకీ ! ఇ దేలా గుం దంటే: -

[గేయము.]


                హరిహరీ నారాయ ణాదినా రాయణో
                కరుణించ వోయ్మమ్ము కమల లో శనుడా.
                నిన్న రా తిరికోట మొన్న రా తిరికోట
                వన్నెమీ రినకోట వశినపుర మాయా. హరి||
                శిన్నమ్మ యిన్నాలు శిందులూ తొక్కితే,
                పెద్దమ్మ పరవళ్లు పెడ తున్న దిపుడు. హరి||
                పెద్ద మెల్తా దంట, శిన్న మొస్తా దంట,
                వశినపురమూ మల్లి వన్నౌత దంట. హరి||
                ఏమొగం పకపక యెగిరెగిరి నవ్విందొ,
                ఆమొగం యెక్కెక్కి అంగలార్శింది. హరి||
                ఏమొగం యెక్కెక్కి యేడస్త వుండిందో
                ఆమొగం నవ్వింది అబ్బరంగాను. హరి||
                రంగరా వెల్లాడు, శింగార మెల్లింది,


                 ఆనందరా జింక ఆడతా డంట. హరి||
                 ఆనందు డిక్కడ ఆడడానికి వొస్తె,
                 యెల్లిన శిన్నమ్మ యెం టొస్త దంట. హరి||
                 అమ్మ లిద్దఱిశాత యిమ్ములూ కుమ్ములూ
                 నరమాన వులనొష్ఠ నలవ రా శినడు. హరి||

[అంతట చాటింపు వెట్టివాఁడు ప్రవేశించును.]

చాటింపు. - ఎందుకన్నా యిక్క డంతా సుబ్బరం శేయిస్తా వున్నావు ?

వెట్టినాయ. - ఱేపు ఆనందమారాజుకి యీడ పట్టం కడతారంట; అందు కోసంరా ! ను వ్వేంట్రా సాటించ నెల్తావు ?

చాటింపు - నాను ఆనందమారాజుకి యీడ పట్టాబిసేకానికే ఊరంతా అలంఖారం శెయ్యాలిశిం దని సాటించ నెల్తా. సూశినావా అన్నా శిన్నమ్మ శపలశిత్తం?

వెట్టినా. - (జనాంతికము) మఱి గంటే, వోరే! నువ్వు నిన్నటి దాక రాయనింగారి వుప్పు తిని, ఇప్పుడు ఆనందరాజుకోసం సాటిస్తా వేంట్రా ?

చాటింపు. - (జనాంతికము) ను వ్వేలా గన్నా ఆనందరాజుకోసం సుభ్రం శేయిస్తావు ?

వెట్టివా. - (జనాంతికము) పాపారాయనిం గారికి కబు రెల్లింది ; నాతమ్ముడే తీసకెల్లాడు. రాత్రి ఆయ నొస్తాడు. పెదరాజుకే పట్టం గడతాడు. (ప్రకాశము) ఈ కంపుకి నిలవలేకున్నానురా. ఈబళ్లు తోలించు కెల్లి కొంచెం నీలుచ్చుకొంటా.

చాటింపు. - నా నెల్లి యెక్కణ్ణయినా మాసులు మిగిలున్నకాడ నాసాటింపు పాడే కొచ్చి నీలకాడ నీతో కలుసు కొంటానన్నా. [అందఱు నిష్క్రమింతురు.]

ప్రవేశకము ముగిసినది.


___________