బొబ్బిలియుద్ధనాటకము/సప్తమాంకము

వికీసోర్స్ నుండి

సప్తమాంకము.

స్థలకము: - బుస్సీ డేరా.

అంతట బుస్సీయు విజయరామరాజు ప్రభృతులును ప్రవేశింతురు.

[నేపథ్యమున మహాప్రకాశము కలుగును.]

బుస్సీ. - [సంభ్రమమున] రాజా, ఇదే మయ్యా, ఇంతవెల్తురు ?

[రాజును బుస్సీయు పరిక్రమించి పరికించినట్టు అభినయించి కూర్చుందురు.]

బుస్సీ. - ఏ మయ్యా ఆజ్వాల ? కోటయంతటను మంటికి మింటికి అంటి యున్నది.

రాజు. - దొరగారూ, ఈ వెలమవాని గర్వము మీ కేమి తెలియును ? బయట మనతో యుద్ధము, లోపల 50 పెండిండ్లు. ఈ జ్వాల యతని బాణసంచాలమంట.

బుస్సీ. - ఏమి యాశ్చర్యము ! ఏమి యాశ్చర్యము ! 50 పెండిండ్లు! ఇదే సమయమని తెచ్చితివయ్యా ముట్టడి ! ఆహా ! ఆహా !

ప్ర. - సర్దార్, రంగారావు 700 మంది సిబ్బందితో కోట నుంచి మీ డేరాల మీదికి దూకినాడు. దారిలో లాలు ఖుమందాను అడ్డినాడు. అక్కడ వారికి వీరికి లగాలగి మరామరి.

బుస్సీ. - లాలుతో చెప్పుము, రంగారావును ప్రాణముతో ఇక్కడికి తెమ్మని.

ప్ర. - సర్కా రాజ్ఞ. [అని నిష్క్రమించును.]

[అంతట హైదరుజంగు, వేంకటలక్ష్మిని చిన వేంకటరాయని జవానులచే పట్టించి తెప్పించి బుస్సీయెదుట నిలుపును.]

బుస్సీ. - ఎవ రయ్యా వీరు హైదరుసాహెబు ?

హైదరు. - అయ్యా, ఈ బచ్చాకి తీస్కొని ఈమన్సీ కోటకాడినుంచి యెల్తా వుంది. సోల్జర్లు అడ్డంవొస్తే, వరహాలు సల్లుతుంది. వాళ్లు వాట్కీ రాజాయిళాయి యెల్తుర్లో యేరుకొంటా వుంటే, ఇది తప్పించుకొని పారిపోతా వుంది. వరాలు గిరాలు చూచి బొబ్బిలి జమీన్దార్ ఇలాఖా బచ్చాకీ తల్చి, అవిదొరకనివాళ్లు మనసిపాయీలు యీళ్లకిని పట్టుకొని ఇక్కడికి తేబోతే, యిది బాకుకి దూసి లడాయి చేస్తుంది. 100 మందిని కుమ్మింది. చూడడానికి దాసీవుంది, సాముగరిడీలకీ బురాక్ వుంది. పిల్లవాడికి తుపాకి వాత వేస్తామంటే అప్పట్కి యిది మమ్మల్ని సంపడం మానింది. మీరు మాటలాడ వొచ్చును. బుస్సీ. - ఎవ రమ్మా మీరు? సంకోచము లేకుండ ఉన్నమాట చెప్పుఁడు. మీకు మేము చెఱుపు చేయము. ఇంత బీరము గల యాఁడువారికి ఎవరైనను గౌరవము చేయవలసినది.

వెంకట. - అయ్యా, మీరే బుస్సీదొరగా రని నాకు తోఁచుచున్నది. వారే విజయరామరాజుగారు. కానిండు. నేను బొబ్బిలి రంగారాయనింగారి జనానా దాసీ జనము ముప్పది ముగ్గురలో తలదాసిని. ఈ కూన చినవెంకటరావు మాయేలిన వారికి ఒక్కడే కుమారుఁడు. ఈయనను ఈయనతల్లి మల్లమ్మదేవి మమ్మేలినతల్లి ఈ రాజుచేతఁ బడనీయక సామర్లకోటలో చెల్లెలియిల్లు చేర్పు మని నాకు అప్పగించినది. నేను ఒప్పుకొని 'నాబొందిలో ప్రాణ ముండగా' బాలునికి అపాయము లేదని పలికి, బాపన బాలునివేసాన కొనిపోవుచుండఁగా, మీ మ్రోలకు మమ్ము తెచ్చినారు. మీరు దొడ్డవా -----. అటుపైని మీ చిత్తము.

బుస్సీ. - బళిబళీ ! నీవు వారి పాలిటి ధర్మదేవతవు, మిమ్ము నేను రక్షించెదను.

రాజు. - గిళి గిళి ! ఈ బాలుని ఏనుఁగు కాలిక్రింద మట్టించి నేలఁ గలప వయ్యా బూసీదొరా !

బుస్సీ. - ఏమి పాపాత్ముఁడవురాజా ! అట్లు పలికెదవు !

రాజు. - బొబ్బిలిపురుగు మిగిలిన, నిన్ను నన్ను ఇఁక నుంచునా ?

బుస్సీ. - ఇంత ద్రోహము తలంచిన, నీ నెత్తిపైని దేవుఁడు పిడుగు వైచును జుమా. నౌకరులారా ! వీరిని గౌరవముగా విచారించుచు, సుఖముగా, మాడేరాలోనే, మాపడుకగదిలో నుంపుఁడు.

[నౌకరులతో వేంకటలక్ష్మి బాలుంగొని నిష్క్రమించును.]

ప్ర. - సర్దార్ ; యుద్ధం మాని పది తెల్లజెండాలు వేసుకొని సమీపించి రాయనింగారితో 'వీరాగ్రేసరా, మీతో బూసీదొరగారు సఖ్యం కోరుతూ వున్నారు. మీరు ప్రాణంతో వారి దగ్గరికి విజయం చేయవలెను.' అని కోరితే, ఆలాగే వస్తాము విజయరాముణ్ణి మాకాడికి దెస్తే, అందాకా పోరుతూనే వుంటాము; మీరు దోరుతూనే వుండండి.' అని మల్లీ మన దండును రూపుమాపుతూ వున్నారు.

బుస్సీ. - మరల పోయి ఆయనతో 'అయ్యా, మీకుమారుని బాలుని చినవేంకటరావును దాసివేంకటలక్ష్మి సామర్లకోటకు కొనిపోవుచు మాకు పట్టుఁబడినది. వారిని మేము కాచియున్నాము. బాలుని క్షేమముగా మీ కందించెదము, సఖ్యము చేసికొన దయ చేయవలయును.' అని వేడుకొని తెండు. [ప్ర. నిష్క్రమించును.] చ. - సలాం సర్కార్. రంగారావు కుడి బుజం తెగిపోయింది, యెడ్మ మోకాలికి తుపాకిగుండు తగ్లి మోకాలు పగ్లీ పోయింది. రగతం దూకుతూ వుంది. మండీ యేస్కొని యెనకాకి ముందూకి పక్కలాకి యెడ్మాచేతితో నఱుకుతాడు. సాబ్. [అని నిష్క్రమించును.]

బుస్సీ. - ఆయన యేమి యంత్రమా వీరుఁడా ! హా ! హా !

ప్ర. - సర్దార్, దగ్గిరికి వెళ్లడానికి గుఱ్ఱం చొఱడానికి సందు లెదు. రాణువ ఆయనికి చుట్టూ వెదురు పొద వుంది.

బుస్సీ. - [లేచి] అ టయిన మేమే వెళ్లి దారిచేసికొనియెదము. [రాజుంగూర్చి చిఱునవ్వుతో] మహారాజా, మీరు వచ్చిన ఆయన వచ్చునఁట గదా, మీరు కూడ రండి. [రాజు గునగునం బాఱి నిష్క్రమించును.]

బుస్సీ. - పంద ! మేమే పోయెదము. [అని పరిక్రమించును.]

చ. - సర్కార్, రంగారావు రక్తం కారికారి సొమ్మసిల్లి పోయినాడ్. మనవాళ్లు పట్టి ఎత్తబోతే తెప్పిరిల్లి మాల్లీసొమ్మసిల్లిన్యాడు. గుండెగాయంగుండా బొట్న వేలు వుండ్లే అంతహాత్మ లేచి పోయింది చెప్పిన్యార్. ఆమహాపురుషుడి ధేధీప్యమానం రూపాన్ని రాణువ అంతా, మీద మీద పడి సూస్తావున్యారు సర్కార్ ; యేడుస్తా వున్యారు కూడా. నేను వెంటనే మీకి చెప్పువెయ్యాల ఘన్క ఇక్కడ మీతోనే యేడ్వడాన్కి వచ్చిన్యాను సర్కార్.

బుస్సీ. - అటయిన మేమును అక్కడనే చూచెదము. [అని లేచి తూర్పు దెసం బరికించి] ఆహా ! సూర్యుఁ డుదయించినాఁడు! ఇతఁడిచ్చట నిన్న సంజవేళ నేమి కాంచినాఁడు! ఇపు డేమిచూడవచ్చినాఁడు! కెంపెక్కిన యీసూర్యుని ఇతని చెంగటి యీ సాంధ్యమేఘములను గనఁగా నిట్లు తోఁచుచున్నది. వీరిమతములో ఱొమ్ముగాయముల వీరులు సూర్యమండలమును భేధించుకొని వీరస్వర్గమునకేగుదురు గదా. దానంజేసి


          ఉ. రావుకులాగ్రగణ్యునికి రంగమహీపతికిన్ బ్రియంబునన్
              ద్రోవ యొసంగి త ద్రుధిర ధోరణిచే రవి దాల్చె శోణతన్ ;
              రావున కోహటి ల్కలవరంబున గుంపులువడ్డ తక్కు ర
              క్తావిల వీర కోటులు సుమా తరు ణారుణ సాంధ్యమేఘముల్.

ఉదయించిన యీ నభోమణిం గంటిని. పోయి అస్తమించిన యాధరామణిం గనియెద.

[అందఱు నిష్క్రమింతురు.]


___________