Jump to content

బైబులు భాష్య సంపుటావళి - దేవమాత, అంత్యగతులు/పునీతమాత

వికీసోర్స్ నుండి

1.పునీతమాత

మనవిమాట

ఈ గ్రంథం శ్రీసభలో మరియమాతకుండే స్థానమేమిటో నిర్ధారిస్తుంది. ఆ పునీతమాతపట్ల భక్తి ఎందుకు చూపాలో, ఎలా చూపాలో చెప్తుంది. ఈ పుస్తకాన్ని మరియను గూర్చిన కట్టుకథలతో నింపదలచుకోలేదు. ఇది ప్రధానంగా మరియను గూర్చిన దైవశాస్తాలను వివరించే గ్రంథం. ఈ శాస్త్రాంశాలుకూడ అత్యధికంగా పితృపాదుల పారంపర్య బోధనుండి స్వీకరింపబడ్డాయి. బైబులు వస్తుతః మరియనుగూర్చి చెప్పే అంశాలు చాల స్వల్పం.

మామూలుగా మరియు మాత పేరెత్తగానే ప్రోటస్టెంటు సోదరులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. కాని ఈ భేదభావాలు అడుగంటిపోవాలనే రచయిత కోరిక. అంచేత ఈ పుస్తకంలో మరియనుగూర్చిన క్యాతలిక్ భావాలూ, ప్రోటస్టెంటు భావాలూ నిష్పాక్షికంగా చర్చింపబడ్డాయి. పితృపాదుల పారంపర్యబోధను గుర్తించందే మరియు స్థానమూ, ఆ పునీతమాతపట్ల చూపే భక్తి అర్థంకావని నిరూపింపబడింది. ఈ గ్రంథం క్రైస్తవశాఖల విభజనకు గాక, సమైక్యతకు దోహదం చేయాలనే గ్రంథకర్త ఆశయం. క్రీస్తు జననియైన మరియ క్రైస్తవ ప్రజను ఐక్యం చేస్తుందిగాని విభజించదు.

మామూలుగా క్యాతలిక్ క్రైస్తవులకు మరియమాత పట్ల గాఢభక్తి వుంటుంది. కాని ఈ భక్తి కొన్నిసార్లు అర్థంలేని మూఢభక్తి ఐపోతూంటుంది. ఈ గ్రంథంలో దేవుని రక్షణ ప్రణాళికలో మరియకున్న స్థానమేమిటో శాస్త్రదృష్టితో వివరించి చెప్పాం. ఈ పుస్తకపఠనం వలన మన ప్రజల మరియభక్తి పూర్వంకంటె అర్థవంతమూ ఫలభరితమూ ఐనట్లయితే గ్రంథకర్తకు అదే పదివేలు. ఇది ఆరవ ముద్రణం.

విషయసూచిక

1. నిష్కళంకమాత 2
2. కన్యమాత 6
3. దేవమాత 11
4. రక్షణమాత 15
5. ఉత్థాపితమాత 19
6. మరియరాజ్ఞ 22

7. వరప్రసాదమాత 24
8. ఇద్దరు ఏవలు 27
9. ధీరనారి మరియ 30
10. మరియమాతపట్ల భక్తి 34
11. ఆదర్శమాత 37
12. మరియమాత - సమైక్యత 41
13. మరియమాత - శ్రీసభ 45

1. నిష్కళంకమాత

సెడూలియస్ అనే ఐదవ శతాబ్దపు లాటిను కవి మరియమాతను ప్రశంసిస్తూ "సుందరమైన గులాబిపూవు ముండ్లమొక్క మీద ఎదుగుతుంది. అది తల్లి చెట్టకంటె అందమైంది. తల్లి చెట్టులాగ ముళ్ళు లేందికూడ. అలాగే మరియ అనే పూవుకూడ ఏవ అనే ముండ్ల మొక్కమీద వికసించింది. ఈ కన్య దోషరహితయై దోషసహితయైన ఆ తొలికన్య పాపానికి ప్రాయశ్చిత్తం చేసిం" దని వ్రాసాడు. ఈ కవి భావించినట్లు మరియ నిష్కళంక. ప్రస్తుతం నిష్కళంకమాతను గూర్చి ఐదంశాలు విచారిద్దాం.

1. నిష్కళంకమాత అంటే యేమిటి?

మరియా మనలాగే పాపపు ఆదాము కుటుంబంలో పుట్టింది. కనుక మనలాగే ఆమెకూ జన్మపాపం సోకాలిసింది. కాని పాపం ఆమెకు సోకలేదు. పరలోకంలోని తండ్రి మరియను జన్మపాపం నుండి పదిలపరచాడు. ఎలాగ? భవిష్యత్తులో జన్మింపబోయే క్రీస్తు వర ప్రసాదాలద్వారా దేవుడు ముందుగానే మరియను పాపం నుండి పదిలపరచాడు. మనమంతా పాపంలో పుట్టాం, అలా పుట్టినంక, క్రీస్తు ద్వారా ఆ పాపం నుండి రక్షింపబడ్డాం. కాని అదే క్రీస్తు ద్వారా మరియ అసలు పాపానికి గురికాకుండానే పదిల పరచబడింది. నేలమీద జారిపడిన పసిగందును లేవనెత్తడం కంటె, ఆ బిడ్డ అసలు పడకుండా వుండేలా జాగ్రత్తపడ్డం మేలు. పరలోకపిత మరియమాతనుకూడ అలా జాగ్రత్తతో పదిలపరచాడు.

కనుక మన రక్షణకంటె ఆమె రక్షణం శ్రేష్ఠమైంది. ఆమెకు అబ్బినభాగ్యం మన కబ్బలేదు. ఈ రక్షణ ఫలితంగా ఆమెకు జన్మపాపమూ సోకలేదు, కర్మపాపమూ సోకలేదు. కర్మపాపరూపమైన చావైన పాపంగానీ స్వల్పపాపంగానీ ఆమెకు కళంకం ఆపాదించలేదు. ప్రభువు ఆమెను నీతివస్త్రంతో ఓ వధువునులాగ అలంకరించాడు. వరప్రసాదాలనే ఆభరణాలతో కైసేసాడు. మరియు దేవదూతలకంటె పునీతుల కంటెగూడ అధిక వరప్రసాదాలతో నిండిపోయింది. కాపుననే శ్రీసభ తన ఆరాధనలో ఆ నిర్మలహృదయను కొనియాడుతూ "ఓ మరియా! నీవు పరిపూర్ణ సౌందర్యవతివి. పాపదోషం నీ కేమాత్రమూ సోకలేదు" అంటూ పరమగీత వాక్యాన్నిఆమెకు అన్వయింపజేస్తుంది - 4, 1. ఏ ఘ్రేమా అనే నాల్గవ శతాబ్దపు భక్తుడు క్రీస్తు నుద్దేశించి "ప్రభూ! నీలో పాపదోషమంటూలేదు, మీ తల్లిలో కల్మషమంటూ లేదు" అని వాకొన్నాడు. ఆ భక్తుడే మరోతావులో "దైవవార్త దైవవక్షస్సును వీడి కన్యవక్షస్సు నాశ్రయించి మానవరూపం చేకొంది. ఆదైవవక్షస్సులాగే ఈ కన్యవక్షస్సు కూడ పరమ పవిత్రమైంది. ఇక నేడు మన వక్షస్సున వసించే ప్రభువు స్తుతింపబడునుగాక” అంటాడు. కనుక మరియు పరమ పవిత్రురాలు. పాపమునుండి పదిలపరచబడిన పునీతురాలు. ఎన్మిదవ శతాబ్దంనాటికే క్రేస్తవ ప్రపంచంలో నిష్కళంకమాత ఉత్సవం ప్రచారంలో ఉండేది. 13వ శతాబ్దంలో డన్స్ స్కొటస్ అనే దైవ శాస్త్రజ్ఞడు మరియా నిష్కళంకగా జన్మించిందని రుజువపరచాడు. 1854లో పదవ భక్తినాధ పోపుగారు మరియు నిష్కళంకగా ఉద్భవించిందని అధికార పూర్వకంగా ప్రకటించారు.

2. మరియను ఈలా యెందుకు పదిలపరచాలి?

దేవుడు మరియను జన్మపాపంనుండీ కర్మపాపం నుండీ పదిలపరచాడన్నాం. ఎందుకు? తన తల్లిని తాను ఎన్నుకున్న నరుడు ఒక్కడే ఒక్కడు, క్రీస్తు. ఈలా తానెన్నుకున్న స్త్రీని క్రీస్తు తనకు యోగ్యమైన మాతనుగ తయారుజేసికొన్నాడు. తల్లి కళంకం బిడ్డకు సోకుతుంది. అంచేత జన్మాదినుండీ ఆమె యందు కళంకం ఉండకూడదు. దేవదూత ఆమెకు మంగళవార్తచెపూ "దైవానుగ్రహానికి ప్రాప్తరాలవైన మరియా! నీకు శుభం" అంటాడు-లూకా 1,28. అనగా ఆమె పట్టవునుండి దైవానుగ్రహంతో నిండివుండేదనే భావం. ఈలాంటి తల్లి మరియ. ఈ తల్లివలన క్రీస్తుకు చిన్నతనం కలుగలేదు. అందుకే శ్రీసభ ప్రార్థనలో ఉపయోగింపబడే ఓ గీతం క్రీస్తునుద్దేశించి "ప్రభూ! నీవు కన్యగర్భాన్ని అనాదరం చేయలేదు" అంటుంది. చక్కని ఇల్లు గట్టించి శత్రువు కిచ్చి వేయం. ప్రభువూ తన చక్కని తల్లిని, పిశాచం వశంజేసి పాపకళంకితను జేయడు. మంచిపండ్లు కాసేచెట్టు మంచిచెట్టు. మంచి గొర్రె పిల్లను ఈనిన గొర్రె మంచిగొర్రె, అలాగే పవిత్ర క్రీస్తును మనకందించిన మరియమాతగూడ పవిత్రురాలే.

బైబులు భగవంతుడు పరిశుద్ధుడు. అపవిత్రప్రాణి ఏదికూడ అతని సముఖంలోకి రాలేదు. ఇక మరియు పవిత్రుడైన దేవుణ్ణి మన మానుష కుటుంబంలోనికి తీసికొని రావాలి. కాని ఆమె అపవిత్రురాలైతే క్రీస్తు ఆమె గర్భంలోకి అడుగు పెడతాడా? అంచేత ఆ దేవునిలాగే ఆమెకూడ పరిశుదురాలు కావాలి గదా? కనుకనే పిత ఆమెను ఓ దేవాలయంలాగా పరిశుద్ధపరచాడు. మరియు దేహాత్మలను పవిత్రపరచి ఆ మాతృమూర్తిని క్రీస్తుకు యోగ్యమైన వాసస్థలమయ్యేలా తీర్చిదిద్దాడు. ఆ మంగళమూర్తి క్రీస్తుని తన హృదయంలో నిలుపుకున్న ఓ పవిత్రదేవాలయం, "ప్రభూ! నీ మందిరానికి పారిశుధ్యం తగివుంటుంది" అంటాడు కీర్తనకారుడు - 93,5. ఔను, మరియకు పారిశుధ్యం తగివుంటుంది.

మరియు పిశాచం తలను చిదుకగొట్టబోతుంది - ఆది 3,15. ఈలా సైతానుని జయించే కన్య తానే పాపంద్వారా ఆ సైతానునికి దాసురాలు కాకూడదుగదా? కనుక ఆమెకు పుట్టువునుండీ పాపం సోకలేదు.

దేవదూత ఆ మరియతో "పవిత్రాత్మ నీ మీదికి దిగి వస్తుంది. మహోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది" అంటాడు - లూకా 1, 36. ఈ దివ్యాత్ముడు చాల గొప్ప గొప్పచిత్రకారుడు. చిత్రకారుడు సుందరిని చిత్రించినట్లుగా పరిశుద్ధాత్మడు తనవధువైన మరియమాతను సుందరంగా, పవిత్రంగా తీర్చిదిద్దాడు. ఆమెను అన్ని అలంకరణలతో, అన్ని సౌభాగ్యాలతో, అన్ని పుణ్యాలతో ఓ నిర్మల వధువునులాగ అలంకరించాడు. కావననే ఆ కన్య పాపకళంకం సోకని సంపూర్ణ సౌందర్యవతి. దేవుడు మరిమాతను పాపం నుండి పదిలపరచడంలో, ఓ కల్యాణమూర్తినిగా ఆమెను తీర్చిదిద్దడంలో భావం ఇది.

3. నిష్కళంకమాత మహిమ

జన్మ కర్మపాపాలనుండి విముక్తయైనందున మరియమాతకు సిద్ధించిన మహిమ అంతింతకాదు. ఆమె పితకు ప్రియ కుమారి, సుతునకు ప్రియజనని, పరిశుద్ధాత్మనకు ప్రియవధువు ఔతుంది. పాపపు ప్రపంచాన్నుండి వైదొలగి పవిత్రుడైన భగవంతునికి అంకిత మౌతుంది. ఈ లోకంలో ఇద్దరే యిద్దరు పవిత్రులు. క్రీస్తు, క్రీస్తు మాతయైన మరియూ.

ప్రాచీన క్రైస్తవ వేదశాస్త్రజ్ఞలు మరియను చాలా ఉపమానాలతో స్తుతించారు. పూర్వవేద మందసపకొయ్య చెడిపోకుండా వుండేది. పాపకళంకం సోకని మరియకూడ ఈ మందసపు కొయ్యలాగ చెరుపు నెరగనిది. ఆదామేవలను వెళ్ళగొట్టాక ప్రభువు శృంగారవనాన్ని సురక్షితం చేసి కాపాడాడు. మరియకూడ సురక్షితమైన శృంగారవనం వంటిది. ఆమె మెరపుతో గూడుకొన్న మేఘం లాంటిది. ఉషస్సుతో నిండిన ఆకాశం లాంటిది. ఈమెరపూ, ఈ ఉషస్సు ఆమె కన్న క్రీస్తే .ఈ పనీతరురాలు పాపపు నరజాతిలో జన్మించినా తానుమాత్రం పాపపు బురదలో అడుగుపెట్టలేదు. అంచేత ఆమె ముండ్లపొదలో పూచిన లిల్లీపూవు లాంటిది. ముండ్లమొక్కపై వికసించిన గులాబివంటిది. ఆ పరిపూత హృదయ పాపాత్మురాలై పతనమై పోయిన మొదటి యేవకు పరిహారంచేసిన రెండవయేవ. కనుకనే శ్రీసభకూడ యూదితు వాక్యాలను మరియకు అన్వయించి "యెరూషలేమను సంతోషపరచే కన్యవు నీవు. ఈ జనులను ఆనందపరచే ధన్యవు నీవు" అంటుంది - యూది 15,9. ఆనాడు యూదితు హోలోఫెర్నెసు అనే శత్రుసైన్యాధిపతి నుండి యెరూషలేమును రక్షించింది. అలాగే మరియకూడ పిశాచం అనే శత్రువునుండి క్రైస్తవసమాజాన్ని రక్షిస్తుంది. యూదితు విజయం యెరూషలేమునులాగే కన్యమరియ విజయం క్రైస్తవ లోకాన్ని ఆనందపరుస్తుంది.

4. నిష్కళంకమాత బోధించే సత్యాలు

మరియమాత ఎందుకు, ఎలా నిష్కళంకమాత ఐందో చూచాం. ఆమె పావనరూపాన్ని కొంతవరకు ధ్యానించుకున్నాం. ఆ పుణ్యశీల పతిత నరజాతికి చెందిన మనకు కొన్ని సత్యాలను బోధిస్తుంది.

పవిత్రురాలైన మరియు నేడు పవిత్రుడైన భగవంతుని సన్నిధిలోవుంది. మన యిల్లుకూడ అక్కడేగాని యిక్కడకాదు. అంచేత మరియు మనం దృష్టిని ఆవైపునకు మరల్చాలని ప్రబోధిస్తుంది. మనం ఆ దేవునికోసం కలిగించబడ్డామని హెచ్చరిస్తుంటుంది. అటువైపు పయనించమని మనకు సంజ్ఞ చేస్తుంటుంది.

ఆ తల్లికి పాపమాలిన్యం సోకలేదు. పవిత్రుడైన భగవంతుని తల్లి ఎంత పవిత్రరాలుగా వుండాలో అంత పావిత్ర్యంతో అలరారింది. దేవుడు మనలనుకూడ పవిత్ర జీవితం జీవించడానికే కలిగించాడు. అంచేత మరియు మనలను నిర్దోషంగా నిష్కల్మషంగా జీవించమని ఆదేశిస్తుంది. దేవుని సన్నిధిలో నడుస్తూ ఉత్తమ జీవితం జీవించాలని సూచిస్తుంది.

మరియ పాపాన్ని జయించి మోక్షాన్ని సాధించింది స్వీయశక్తివల్లగాదు, దైవశక్తివల్ల. కనుక ఆమె మనం కూడ దైవబలంతో దివ్యజీవితం జీవించి మోక్షంలో అడుగుపెట్టాలని చెప్తుంది. ప్రభువమీద భారంవేసి జీవించాలని బోధిస్తుంది.


5. నిష్కళంకమాతపట్ల భక్తిభావాలు

నివ్కాళంక మరియను మనం చక్కగా ధ్యానించుకోవాలి. భగవంతుడు నరుణ్ణి తనకు పోలికగా చేసాడు. ఆ దేవుళ్లాగే నరుడుకూడ దివ్యడు. కాని తొలి మానవుడైన ఆదాము పాపంచేసి ఈ దైవసాదృశ్యాన్ని కోల్పోయాడు. నరుడు దేవుడు సంకల్పించు కున్నట్లుగా జీవించడం మానివేసాడు. కాని నరజాతి యంతటిలో దేవునికి పోలికగా, దేవుని సంకల్పం ప్రకారం జీవించిన ఏకైక మానుషవ్యక్తి మరియ. నరుణ్ణి గూర్చిన దేవుని ఆశయాలన్నీ ఆమెయందు సంపూర్ణంగా నెరవేరాయి. ఈ తల్లి మనంకూడ దేవునికి పోలికగా మెలగాలని కోరుకుంటుంది. అనగా, మన తలపులు, పలుకులు చేతలు దివ్యలకు తగినట్లుగా వుండాలని వాంఛిస్తుంటుంది. తన వేడుదలవలన ఈ భాగ్యాన్ని మనకు సంపాదించి పెడుతుందికూడా .

మరియు పరమపవిత్రురాలు అన్నాం. మనం పతిత మానవులం. అయినా ఆమె మనలను అసహ్యించుకోదు. మనతో సంబంధం త్రెంచివేసుకోవాలి అనుకోదు. ఆ విమలమూర్తి మన నరజాతికి చెందిన స్త్రీ .తన బిడ్డలమైన మనం కూడ వైమల్యంతో జీవించాలనే ఆమె కోరిక. అంచేత ఆమె మనలను పవిత్రమూర్తియైన భగవంతుని దాపులోనికి తీసుకొని వస్తుంది. తాను క్రీస్తు సాన్నిధ్యంవలన ధన్యురాలు ఐంది. అలాగే మనమా క్రీస్తు సాక్షాత్కారం పొంది, దైవత్వాన్ని చేకొని దివ్యజీవితం జీవించేలా చేస్తుంది.

మరియు మాతృమూర్తి, ఆ విశ్వజనని క్రీస్తు శిశువుని లాగే మనలను తన గర్భంలో ఇముడ్చుకుంటుంది. ఆ దైవ శిశువునులాగే మనలనూ గారాబంతో సాకుతుంది. పెంచి పెద్దచేస్తుంది. మన అక్కరలు బాగోగులు ఆ తల్లికి తెలియనివికావు. ఆ విశుద్దమూర్తి మనకోసం నిత్యమూ ప్రార్ధిస్తుంటుంది. మనంకూడ వినిర్మల జీవితంజీవించి తన రూపురేఖలు అలవరచుకునేలా చేస్తుంది, ఆ పునీతమాతకు బిడ్డలం కావడం మన భాగ్యవిశేషం.

2. కన్యమాత

నాల్గవ శతాబ్దపు భక్తుడు గ్రెగొరి నీస్సా మరియను ప్రశంసిస్తూ "మోషే కొండవద్ద చూచినపొద కాలుతూ కూడ భస్మంకాలేదు. మరియ దైవతేజస్సును గర్భంలో ధరించినా కూడా కన్యాత్వం కోల్పోలేదు. ఆ తేజస్సే ఆ పొదను కాపాడింది" అని వ్రాసాడు. ప్రాచీనకాలం నుండి వస్తున్న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మరియ నిత్యకన్య .ఇక్కడ కన్యమాతను గూర్చి ఆరంశాలు విచారిద్దాం :

1. మరియ కన్యమాత అంటే ఏమిటి?

89 పవిత్రహృదయ బిడ్డను కనకముందు, కన్న తరువాత కూడ కన్యగానే వుండిపోయింది. అందుచే క్రైస్తవ ప్రపంచం ఆమెను "ధన్యురాలైన నిత్యకన్య" అని కొనియాడుతూంటుంది. దేవదూత "నీవు గర్భం ధరించి బిడ్డను కంటావు" అని చెప్పగానే మరియ "నేను పురుషుని యెరుగను గదా, ఇదెలా జరుగుతుంది?? అని అడుగుతుంది -లూకా 1,34. దేవదూత "నీవు పురుషుని వలనగాక పరిశుద్దాత్మ శక్తివలన గర్భవతి వౌతావు" అని చెప్తాడు. మరియు తన అంగీకారాన్ని సూచిస్తూ "ఇదిగో ప్రభువు దాసురాలను. నీమాట చొప్పననే నాకు జరగాలి” అంటుంది. ఆ విధంగా ఆమె తన కన్యాత్వానికి భంగం కలుగకుండానే బిడ్డను కంది.

అంతకు ఎన్మిదివందల ఏండ్లకు పూర్వమే ప్రవక్త యెషయా "కన్య గర్భవతియై బిడ్డను కంటుంది, ఆ బిడ్డకు ఇమ్మానువేలు అని పేరు పెడతారు" అని ప్రవచనం చెప్పాడు. 7,14. చారిత్రకంగా యీ ప్రవచనం ఆహాసు రాజు భార్య కనిన హిజ్కియా ప్రభువునకు వర్తించినా, ప్రవక్తకుకూడ తెలియరాని పరిపూర్ణార్ధం వలన కన్యమరియకు కూడ వర్తిస్తుంది. అందుకే సువిశేషకారుడు మత్తయి ఈ ప్రవచనాన్ని మరియ పరంగా ఉదాహరించాడు - 1,23.

పై బైబులు సందర్భాలు రెండూ మరియ బిడ్డను కనకముందు కన్యగా వుందని సూచిస్తాయి. కాని బిడ్డను కన్న తరువాత? ఆమె బిడ్డను కన్న తరువాతకూడ కన్యగా వుండిపోయిందని బైబులు ఎక్కడా చెప్పదు. కాని అలా వండిపోలేదని కూడ ఎక్కడా చెప్పదు. సువార్తల్లో పలుతావుల్లో "క్రీస్తు సోదరులు" అనేమాట విన్పిస్తుంది. కాని హీబ్రూభాషా మర్యాద తెలిసినవాళ్లు ఈ "సోదరులు" క్రీస్తు సొంత తముళ్ళు కాదనీ పినతల్లి పెత్తల్లి లేక చిన్నాయన పెదనాయన బిడ్డలని వెంటనే గ్రహిస్తారు. అలాగే “మరియ తొలిచూలు బిడ్డను కంది" అనే ప్రయోగంగూడ ఆమెకు మలిచూలు బిడ్డలున్నారని నిరూపింపదు - లూకా 2,7. "కుమారుని కనేవరకు యేసేపనకు ఆమెతో శారీరక సంబంధంలేదు" అనే మత్తయి 1,25 వచనంకూడ, క్రీస్తు తరువాత మరియమాతకు మళ్ళీ పిల్లలు పుట్టారని రుజువు చేయదు. బైబులు స్పష్టంగా చెప్పదుగాని పారంపర్యంగా వచ్చిన క్రైస్తవ సంప్రదాయం మాత్రం మరియ బిడ్డను కన్న తరువాతగూడ కన్యగానే వుండిపోయిందని చెప్తుంది. అందుకే ఆమెను "నిత్యకన్య" అంటాం.

2. ఆత్మశక్తి

దూత మరియతో "పవిత్రాత్మనీ మీదికి దిగివస్తుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అంచేత నీకు జన్మింపబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడౌతాడు" అంటాడు -లూకా 1,35. కనుక మరియ పవిత్రాత్మ శక్తి వలన గర్భవతి ఐంది. కాని యిక్కడ పరిశుద్ధాత్మ చేసిందేమిటి? ఆ యాత్మడు పిత సుతుడు అనే దైవవ్యక్తులను • ఐక్యపరుస్తుంటాడు. నరునీ దేవునితో జోడిస్తుంటాడు. కనుక ఆ యాత్మడు ఐక్యతా గుణాన్ని ప్రసాదించే దివ్యశక్తి, ఆ దివ్యాత్ముడే రెండవ దైవవ్యక్తియైన వార్తను మరియతో ఐక్యపరుస్తాడు. ఆ దివ్యశక్తి వలననే మరియ గర్భవతి ఔతుంది . ఈ శక్తి శారీరకమైంది కాదు. పరిశుద్దాత్మ మరియకు భర్తాకాదు. క్రీస్తుకు తండ్రీకాదు. అసలు పరిశుద్దాత్మకేవలం ఆత్మస్వరూపం. కనుక మరియమీద పనిచేసింది భౌతికశక్తిగాదు. ఆధ్యాత్మిక శక్తి ఈ ఆధ్యాత్మిక శక్తినే బైబులు చాలాతావుల్లో "అభిషేకం" అని పిలుస్తుంది. ఆత్మ మరియను అభిషేకించింది. అనగా ఆమెయందు ఆంతరంగికంగా, ఆధ్యాత్మికంగా చైతన్యం కలిగించింది. కలిగించి ఆమె స్వయంగానే బిడ్డను కనే శక్తిని ప్రసాదించింది. ఈ అభిషేకం వలననే క్రీస్తుకూడ శక్తిని పొంది మెస్సీయాగా దేవుని ప్రతినిధిగా బహిరంగ జీవితం ప్రారంభించాడు - లూకా 4,18. ఈ అభిషేకం వలననే మనంకూడ జ్ఞానస్నాన సమయంలో ఆధ్యాత్మిక శక్తినిపొంది దేవుని బిడ్డలమౌతాం. 1యేూ 2,27. మరియకూడ ఈలాంటి అభిషేకం వలననే గర్భవతి ఐంది. నూత్నవేద ప్రజల్లో మొదట పరిశుద్దాత్మను పొందిన వ్యక్తి మరియమాత. ఈ యాత్మ శక్తి వలననే ఆమె నరుడ్డి దేవునితో, దేవుణ్ణి నరునితో జోడింప గలిగింది. దేవుణ్ణి నరుడ్డిచేసి నరుణ్ణి దేవుణ్ణి చేయగలిగింది.

3. మరియ కన్యగా ఉండిపోవటానికి కారణాలు

మరియ నిత్యకన్యగా ఉండిపోయిందన్నాం. ఎందుకు? ఆమె దేవునికి తల్లిగా ఎన్నుకోబడింది. కనుక తాను పూర్తిగా దేవునికే చెందివుండాలి. పూర్తిగా దైవసేవకే అంకితంకావాలి. తాను అన్యులకు చెందిపోగూడదు. పౌలు "వివాహిత భర్తనేలా సంతోషపెట్టాలా అని) రేయింబవళ్ళ భర్తృసంబంధ విషయాలతో సతమతమౌతూంటుంది, కాని ప్రభువునకు సమర్పితమైన కన్య ప్రభువునేలా సంతోషపెట్టాలా అని ఆందోళన పడుతూ దేహంనందూ ఆత్మయందూ విశుద్ధరాలై వుంటుంది" అంటాడు - 1 కొ 7, 34. కనుక మరియ కన్యగా వుండిపోయింది పూర్తిగా దేవునికి చెందివుండడము కోసమే. ప్రభుని సంతోషపెట్టడం కోసమే. తన ప్రేమనంతా దేవునికి నైవేద్యం చేయడం కోసమే. అందుకే మానవమాత్రులు ఆమె ప్రేమను పంచుకోలేదు. వివాహం క్రీస్తుకూ శ్రీసభకూ వుండే ఐక్యభావం సూచిస్తుంది. కాని కన్యాత్వం క్రీస్తుకూ కన్యకూ వుండే ఐక్యభావం సూచిస్తుంది. క్రీస్తుకే వివాహమైన వధువు కన్య కావున మరియు పాపంలేకుండా పుట్టడానికీ, కన్యగా వుండిపోవడానికీ కారణం ఒక్కటే. దేవునికి తల్లి అయ్యేందుకు, దేవునికి అంకితమయ్యేందుకు. ఈలా కన్యగా వుండిపోయి • మరియ నిండు హృదయంతో ప్రభువును ప్రేమించేది. పూర్వవేదం చదువుకుంటూ ఆ ప్రభువును ధ్యానించుకునేది. యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆ ప్రభువును ఆరాధించుకునేది. ఆ ప్రభువు పాపపులోకాన్ని ఉద్ధరించాలని వేడుకుంటూండేది. ఆమె ప్రార్ధనా ఫలితంగా ప్రభువు తన ప్రతినిధియైన మెస్సీయాను సత్వరంగా భూమి మీదకు పంపాడు.

పూర్వవేదం కన్యాత్వాన్ని పెద్దచూపు పూర్వ, నూత్న వేదాల మధ్యకాలంలో జీవించిన కుమ్రాను భక్తులు మాత్రం కన్యాత్వాన్ని ఆదరించారు. ఇక క్రీస్తు వచ్చాక నూత్నవేదంలో కన్నెరికానికి విలువ హెచ్చింది. ఈలా శ్రీసభలో కన్యాత్వాన్ని స్థాపించి కన్యా జీవితానికి గౌరవస్థానం కల్పించిన ప్రభువు, తన తల్లికిగూడ ఈ భాగ్యాన్ని ప్రసాదింపకపోడు గదా!

4. కన్నెరికపు విలువలు

మరియ కన్యగా వుండిపోయి చాల విలువలు నెలకొల్పింది. క్రీస్తుకు పరలోకంలో తల్లిలేదు. భూలోకంలో తండ్రిలేడు. అనగా అక్కడ యిక్కడాను మానుష ప్రయత్నం లేకుండానే జన్మించిన ఏకైక కుమారుడు యేసు ఈలాంటి కుమారునికి తల్లియై జన్మ సార్థకం జేసుకుంది మరియ. బలిపీఠంమీది పాత్రం పవిత్రమైంది. దాన్ని వేరేపానీయాలకు వాడం. క్రీస్తు జననంద్వారా మరియమాత గర్భంకూడ పవిత్రమైంది. ఆ గర్భం దేవునికే అంకితమైంది. ఆ గర్భం నుండి వేరే బిడ్డలు కలుగరు. కలుగకూడదు. ఆమె కన్నెరికం అంత విలువైంది.

కన్యాత్వంద్వారానే మరియ దేవునికి యోగ్యురాలైన తల్లి కాగల్లింది. కన్యాత్వం ద్వారానే ఆమె మనకూ తల్లి ఔతుంది. మన రక్షణకోసం ప్రభుని ప్రార్ధిస్తుంది. మనకు వరప్రసాదాలు ఆర్ధించి పెడుతుంది. మనలను పవిత్రులను చేస్తుంది. ప్రాచీన క్రైస్తవ రచయితలు ఆమె కన్నెరికాన్నివేనోళ్ళ కొనియాడారు. సీనాయివద్ద మోషే చూచిన పొద కాలుతూకూడ నుసికాలేదు. సంసారజీవితం జీవించి బిడ్డనుకన్నా మరియు తన కన్యాత్వాన్ని కోల్పోలేదు. ఆమె తన్ను సృష్టించిన దేవుణ్ణి, భూమ్యాకాశాలు భరించలేని ప్రభువుని, తన ఉదరంలో భరించిన భాగ్యమూర్తి. దానియేలు గ్రంథం వర్ణించే అగ్నిగుండంలోని అగ్నిబాలురను తాకలేదు. అలాగే మరియమాత గర్భంలో ప్రవేశించిన దైవతేజస్సుకూడ ఆమె కన్యత్వాన్ని నాశంచేయలేదు. యెహెజ్కేలు గ్రంథం వర్ణించే తూర్పుద్వారం, ఓమారు ప్రభువు ప్రవేశించాక శాశ్వతంగా మూసివేయబడింది - 44, 12.ఇక నరులెవ్వరూ దానిలో ప్రవేశింపలేరు. అలాగే మరియ గర్భమూ ఓమారు క్రీస్తు జన్మించాక పూర్తిగా మూసివేయబడింది. ఇక ఆమెకు వేరే బిడ్డలంటూ కలుగలేదు. క్రీస్తు మృతశరీరాన్ని రాతి బండయందు తొలిచిన సమాధిలో వుంచారు. అంతకుముందు ఆ సమాధిలో ఎవరినీ ఉంచలేదు. క్రీస్తు తర్వాత ఇంకెవ్వరినీ ఉంచలేదు. అలాగే కన్యమాత గర్భంకూడాను. క్రీస్తు జన్మింపక ముందుగాని, జన్మించినంకగాని ఆ గర్భంలో మరో శిశువు నెలకొనలేదు. క్రీస్తు సమాధిరాతిని ఛేదించకుండానే వెలుపలకు వచ్చాడు. గది తలుపులు తీయకుండానే గదిలోపల ప్రవేశించాడు. అలాగే ప్రభువు మరియ కన్యాత్వం చెడకుండానే ఆమె గర్భంలో ప్రవేశించాడు. కన్యాత్వం చెడకుండానే ఆమె గర్భం నుండి వెలువడ్డాడు.

మామూలుగా కన్య తల్లి కాలేదు, తల్లి కన్యగా వుండలేదు. ఐనా మరియ మాత్రం కన్య, తల్లికూడ. ఆమె కన్యగా వుండిపోయింది తన్ను తాను దేవుని సమర్పించుకొనడం కోసం అన్నాం, తాను మాతృమూర్తి కావడం ద్వారా ఈ సమర్పణ భావం ఫలసిద్ధి నందింది. తన్ను తాను అంకితం చేసికొనిన దేవుణ్ణి అధికానురాగంతో ప్రేమించింది. పైగా కన్యగా వుండడంవల్ల ఆమె హృదయం అవిభక్తంగా వుండిపోయింది. కనుక మరియ తన దేవుడు, పుత్రుడు ఐన క్రీస్తుని కన్యా హృదయంతోను, మాతృ హృదయంతోను ప్రేమించిందని చెప్పాలి.

5. కన్య మరియ బోధించే సత్యాలు

ఈ సందర్భంలో కన్య మరియు మనకు మూడు సత్యాలను జ్ఞాపకం చేస్తుంది. మొదటిది, కన్యాత్వం రాబోయే మోక్ష సామ్రాజ్యపు జీవితాన్ని సూచిస్తుంటుంది. వివాహంద్వారా బిడ్డలను కంటాం. కాని ఈలా పట్టిన నరులకు మరణం తథ్యం. ఐతే కన్యాత్వం మరణాన్ని జయించే మోక్ష జీవితాన్నీ ఉత్థాన జీవితాన్నీ సూచిస్తూంది - లూకా 20, 34-36. కనుక వివాహ జీవితం మరణానికీ, కన్యా జీవితం శాశ్వత జీవానికీ సంకేతంగా వుంటాయి.

రెండవది, కన్యాత్వమంటే దేవునికి సమర్పితం కావడం. దేవుని సన్నిధిలో నడవడం. ఆ దేవునికి పరిచర్య చేయడం. ఆ దేవునికోసం తోడిప్రజలను ఆదరించడం. కన్య భగవంతునికి నివేదిత కావున పవిత్రమూర్తి సమర్పణమే కన్యాత్వపు ప్రధాన విలువ.

మూడవది, కన్యాత్వాన్ని మనంతట మనం పాటించలేం. ఆది భగవంతుడు అనుగ్రహించే వరం. మొదటి ధన్యవచనం సూచించే దీనాత్మలు దేవునివద్ద నుండి పొందే భాగ్యం - మత్త 5,3. కనుక మనం దీనభావంతో ఈ భాగ్యాన్నిదేవుని వద్దనుండి అడుగుకోవాలి.

6. కన్యమాతపట్ల భక్తిభావాలు

కన్యాజీవితం జీవించడంలో, పరిశుద్ధ జీవితం గడపడంలో కన్యమరియ మనకు ఆదర్శంగా వుంటుంది. ఈ పరిశుద్ధ జీవితానికి విరుద్ధంగావచ్చే శోధనలను జయించడానికి ఆ తల్లి సహాయపడుతుంది. కన్యమరియ వినయమూ మర్యాదా ఆమె కన్యాత్వాన్ని కాపాడాయి. ఆనాడు ఆమెను చూచినపుడు ఎవరికీ కామభావాలు కలుగలేదు. ఆమె ఆకారమూ, ప్రవర్తనమూ ఇతరులలోకూడ పరిశుద్ధభావాలు కలిగించేలా వుండేవి. మనంకూడ ఈలాగే విశుద్ధ జీవితం జీవించేలా సాయపడమని ఆ తల్లిని అడుగుకుందాం.

మన ఈ దేహం జ్ఞానస్నానం ద్వారా ప్రభువుకే నివేదితమైంది. కనుక మనం అశుభ్రవర్తనంతో ఈ దేహాన్ని అమంగళ పరచకూడదు. క్రైస్తవుడు ఈ దేహంతోను పాపం చేయకూడదు, ఈ దేహంలోను పాపం చేయకూడదు - 1కొ 6,18. ఆ పునీతకన్య తన దేహాన్ని శుచిమంతంగా కాపాడుకుంది. మనమూ మన దేహాలను శుచిమంతంగా వుంచుకునేలా సాయపడమని ఆ తల్లిని వేడుకుందాం.

మరియ దేవునికి నివేదిత. అలాగే మనమూ మన బిడ్డలను దైవసేవకు అర్పిస్తుండాలి. పూవును కోసి ముచ్చటగా జడలో ముడుచుకోవడం మంచిదే. కాని అదే పూవుని భగవంతుని పీఠంమీద సమర్పించడం ఇంకా యోగ్యమైంది. అలాగే మన బాలికను ఓ పురుషునికి సమర్పించడం మంచిదే. కాని దేవునికి అంకితం చేయడం ఇంకా యోగ్యమైనపని. మన పుత్రులను దైవసేవకు అర్పించడమూ ఈలాంటిదే. మరియ మనకు ఈలాంటి కోరికలు కలిగించాలని వేడుకుందాం.

మరియ దేవునికి అంకితమైన భక్తురాలు. ఆమెను చూచి మనంకూడ హృదయం దేవునివైపు మరల్చడం నేర్చుకోవాలి. మన హృదయం ఈ లోక సుఖభోగాలతో సంతృప్తి చెందలేదు. అది దేవునికోసం కలిగింపబడింది. ఆ దేవుని ప్రేమించి ఆ దేవునియందు విశ్రమిస్తే గాని దానికి విశ్రాంతి అంటూ వుండదు. కనుక మన హృదయాలను దేవునివైపు మరల్చే భాగ్యంకోసంగూడ ఆ తల్లిని మనవిచేద్దాం.

3. దేవమాత

సిరియా దేశభక్తుడు ఏఫ్రేము "మరియు తన చేతుల్లో నిప్పును నిలుపుకుంది. తన బాహువులతో అగ్నిజ్వాలను ఆలింగనం చేసుకుంది. ఈ యగ్నిజ్వాలను ఆమె స్తన్యమిచ్చి పోషించింది. సమస్త ప్రాణికోటిని పోషించే పోషకుణ్ణి స్వయంగా చనుబాలతో పోషించి పెద్దచేసింది. భూమ్యాకాశాలు భరించలేని విశ్వభర్తను తన ఉదరంలో భరించింది. ఆ మరియు మహిమను కొనియాడ్డం ఎవరితరం?" అని వ్రాసాడు. మరియు దేవమాత మానవులమాత. ప్రస్తుతం ఆ పునీతమాతనుగూర్చి నాల్గంశాలను విచారిద్దాం.

1. దేవమాత

మరియమాత ఎలా దేవమాత ఔతుంది? క్రీస్తులో రెండు స్వభావాలు ఉన్నాయి. అతడు నరుడూ, దేవుడునూ. ఐనా ఈ క్రీస్తు ఇద్దరు వ్యక్తులు కాదు, ఒకే వ్యక్తి అతడు దేవుడూ మానవుడూ ఐన క్రీస్తు. దైవవార్త మానుషదేహాన్ని స్వీకరింపగా క్రీస్తు ఆవిర్భవించాడు. ఈలా మానవుడు దేవుడూ ఐన ఏకైక వ్యక్తిని మరియ కన్నది. ఆమెకు పట్టిన కుమారుడు క్రీస్తు మొదట దేవుడై అటుతరువాత మానవుడు కాలేదు. లేదా మొదట మానవుడై తర్వాత దేవుడు కాలేదు. అతడు మొదటి నుండి దేవుడూ మానవుడూను. అతడు దేవుడూ మానవుడూ కనుక అతన్ని కన్నతల్లికూడ దేవునికీ మానవునికీ తల్లి ఔతుంది. అందుచేత ఆమెను "దేవమాత" అని పిలుస్తుంటాం.

ఈలా దేవమాత కావడం కోసమే మరియు పాపం లేకుండా నిష్కళంకగా ఉద్భవించింది. ఇందుకోసమే ఆమె కన్యగా వుండిపోయి ప్రభువుకి తన నిండు హృదయాన్ని సమర్పించుకుంది. ఇందుకొరకే ఆమె సకల వరప్రసాదాలూ పొంది సుందరమైన వధువుగా తయారైంది.

మరియు దేవమాత కావడమంటే యేమిటి? ఆమె మూలంగా దేవుడు మన మానవ కుటుంబంలోకి దిగి వచ్చాడు. మన మంటిమీద అడుగుపెట్టాడు. ఆమె వలన క్రీస్తునందు మన రక్తమాంసాలు ఏర్పడ్డాయి. అతడు మనకు పెద్దన్నకాగలిగాడు. మనము అతని తమ్ముళ్ళమూ, చెల్లెళ్ళమూ అయ్యాం. దేవుణ్ణి నరునివద్దకు కొనివచ్చి నరుని దేవుని వద్దకు కొనిపోయే ధన్యురాలు మరియ.

2. విశ్వాసుల మాత

మరియు దేవమాత మాత్రమేకాదు. విశ్వాసులమాత కూడ. ఎలాగ? ఆమె క్రీస్తమాత అన్నాం. క్రీస్తులోకి జ్ఞానస్నానం పొందేవాళ్ళంతా అతనితో ఐక్యమౌతారు. అతడు వాళ్ళకు శిరస్సు వాళ్ళు అతని దేహం - రోమ 12,5. అతడు తల్లితీగ, వాళ్ళు అతనిలోకి అతుక్కపోయిన రెమ్మలు - యోహా 15, 5. అతడు పునాదిరాయి. వాళ్ళ అతనిమీద భవనంగా నిర్మింపబడే సజీవశిలలు -1 పేత్రు 2,5. ఈ క్రీస్తు పూర్తి క్రీస్తు జ్ఞానక్రీస్తు. అనగా రక్షకుడూ, రక్షణం పొందవలసిన వాళ్ళూను. ఇక క్రీస్తును కన్న మరియమాత ఈ పూర్తి క్రీస్తునుకూడ కంది. అనగా క్రీస్తు మాత, క్రీస్తుతో ఐక్యమైన మనకూ తల్లి ఔతుంది. అందుకే ప్రభువు కల్వరిమీద శిష్యునితో "ఇదిగో నీ తల్లి" అని వక్కాణించాడు - యోహా 19,27. ఇక్కడ యీ శిష్యుడు క్రీస్తును నమ్మే శిష్యులందరికీ ప్రాతినిధ్యం వహిస్తాడు. కనుక ఆమె మనకందరికీ తల్లిగా ఈయబడింది. ఆ తల్లి క్రీస్తును గర్భంలో ధరించినపడే మనలనుకూడ తన ఉదరంలో మోసింది. శిరస్సు అవయవాలతో గూడిన పూర్తి క్రీస్తునకు ఆమె జనని. ఇక్కడ ఒక్కటే భేదం, ఆమె క్రీస్తుకు భౌతికంగా జనని. మనకు మాత్రం జ్ఞానరీత్యా తల్లి, అనగా మనం జ్ఞానస్వానం ద్వారా క్రీస్తుతో ఐక్యం గావడంవలన ఆమె మనకు తల్లి ఔతుంది.

ప్రాచీన క్రైస్తవ రచయితలు మరియమాతను తొలి తల్లి ఏవతో పోల్చారు. ఏవ దుష్టదూత మాటవిని తినవద్దన్న పండు తిని అవిధేయత చూపింది. రెండవ యేవయైన మరియు దేవదూత మాటవిని విధేయత చూపింది. ఆమె చెడ్డదూత మాటవిని మోసపోయింది. ఈమె మంచిదూత పలుకు ఆలించి, ఆ చెడ్డదూతను ఓడించింది. ఆ తొలితల్లి తన తెలివితక్కువతనంవల్ల మనకు చావుతెచ్చిపెట్టింది. మన మెడకు ఉరిపెట్టి పోయింది. కావున ఆమె మృతులమాత, కాని యీ రెండవతల్లి తన వివేకంవల్ల మనకు జీవం సంపాదించి పెట్టింది. మన మెడకు తగులుకొనిన ఉరిని తొలగించింది. కావున ఈమె జీవవంతులమాత, ఆ తల్లికంటె యీ తల్లి యోగ్యురాలు. ఆ తల్లి పాపానికి ఈ తల్లి ప్రాయశ్చిత్తం కూడ చేసింది. ఆ తల్లి తరపున ఈ తల్లి ప్రభువునకు విన్నపం చేసింది.

3. మాతృత్వపు మహిమలు

మరియు దేవుని తల్లి అన్నాం. దేవమాత గావడమంటే సామాన్య భాగ్యంకాదు. సృష్టి ప్రాణికి ఇక యింతకంటె గొప్ప భాగ్యమూ, మహిమా లేనేలేదు. దేవుని తరువాత దేవుడంతటి వ్యక్తి మరియ. ఆమెకు దేవునికంటె తక్కువ స్థానం. కాని పునీతులకంటె దేవదూతలకంటెకూడ యొక్కువ స్థానం. అనగా దేవునికి చాలా దగ్గరస్థానం. ఆ కుమారుడెంత యోగ్యుడో ఆ తల్లీ అంత యోగ్యురాలు. అందుకే దేవమాత ప్రార్థనలోని బిరుదులన్నిటికంటె “సర్వేశ్వరునిమాత" అనేది చాల గొప్పబిరుదం. ఈ భాగ్యం వలననే సమస్త జాతిజనులూ ఆమెను ధన్యురాలని మెచ్చుకుంటారు - లూకా 1, 48. ఈ భాగ్యం దేవుడే ఆమెకిచ్చిన వరం. కాని ఈ వరంతో ఆమె సహకరించింది. దేవుని పూర్ణహృదయంతో ప్రేమిస్తూ, దివ్య మాతృత్వానికి తన్నుతాను తయారుచేసుకుంది. భక్తుడు అగస్టీనునుడివినట్లు "మరియ దేవుని గర్భంలో ధరించకముందే హృదయంలో ధరించింది." అనగా ఆమె భగవద్దృదయ, సద్భగవద్భక్తురాలు,

                                                                 13 

ఆ తల్లి మనవిని క్రీస్తు త్రోసివేయడు. ఆమె పాపాత్ములకోసం నిత్యం మనవి చేస్తుంది, విశ్వాసులందరికోసం ప్రభుని వేడుకుంటుంది. ఆమెకు మనకు సహాయం చేయాలనే కోరికా వుంటుంది. శక్తి వుంటుంది. కనుక తాను సహాయం చేసితీరుతుంది.

మరియ దేవునికి మాత్రమేగాదు, విశ్వాసులకుగూడ తల్లి అన్నాం. క్రీస్తుకు భౌతికంగాను మనకు జ్ఞానరీత్యాను తల్లి అన్నాం. భౌతికంగా ఆ బిడ్డను చనుబాలతో పెంచి పెద్దజేసింది. జ్ఞానరీత్యా మనలను వరప్రసాదాలతో పెద్దజేస్తుంది. ఈ వరప్రసాదాలను మనతరఫున క్రీస్తు నుండి అడిగి పెడుతుంది.

పరలోకపిత మరియను కలిగించింది కేవలం క్రీస్తుకు తల్లిగా వుండడంకోసం మాత్రమే గాదు. దేవదూతలకు రాబ్దిగా వుండడం కోసం గూడ పిశాచాలను జయించడం కోసం గూడ, నరులకు సహాయం చేయడంకోసం గూడ కనుక ఆ తల్లి మనకు అనుగ్రహాలు ఎన్నైనా ఆర్ధించి పెడుతుంది. మేళ్ళు ఎన్నైనా చేకూర్చి పెడుతుంది.

4. పునీతమాతపట్ల భక్తిభావాలు

పతనమైన మానవుడ్డి భగవంతుడు స్వయంగానే రక్షించి వుండవచ్చు. కాని ఆలాచేయడం నరుని స్వాతంత్ర్యానికి, గౌరవానికి భంగం కలిగించినట్లే ఔతుంది. నరుడ్డి నరుడే రక్షించుకుంటే అతని స్వాతంత్రత్యానికి తగినట్లుగా వుంటుంది. అందుకే దేవుడు నరుడై జన్మించాడు. నరుడైన దేవునినుండే నరునికి రక్షణ కలిగింది. విరిగిపోయిన పూల మొక్కదాన్నదే బాగుచేసికొని మళ్ళాపూలు పూచింది. కాని ఈ దేవుణ్ణి నరకుటుంబములో ప్రవేశపెట్టి నరుల రక్షణం నరకుటుంబంనుండే వచ్చేలా చేసింది మరియ. ఆమెవలన దేవుణ్ణి మన మానవుణ్ణి చేసికున్నాం. మనలను మనమే రక్షించుకున్నాం. మన మర్యాద కాపాడుకున్నాం. ఆలాంటి తల్లికి మనం చేతులెత్తి జోహారులర్పించాలి. ఆమెను వేనోళ్ళ పొగడి కొనియాడాలి.

జంతువులు పిల్లలను కంటాయి. నరులూ బిడ్డలను కంటారు. జంతువులు కేవలం వాటి పిల్లల దేహపోషణం కొరకు చన్ను జేపి పాలిచ్చి పోషిస్తాయి. ఆ పిల్లలు పెద్దయ్యాక వాటినిక పట్టించుకోవు. కాని నరులు అలా కాదు. మూనవ మూత్రాతలు తమ బిడ్డలను వ్యక్తుల్లాగ ఆదరిస్తారు. శాశ్వతంగా ప్రేమిస్తారు, మరియకూడ ఈలాగే, ఆమె మెస్సియాకు తల్లి కావడానికి ప్రేమభావంతో అంగీకరించింది, మెస్సియా శిశువును కంది. ఆ కుమారుడ్డి గాఢంగా ప్రేమించింది, కాని యీ కుమారుడు మన తల్లలంతా కనే కుమారుల్లాంటివాడు కాడు. భగవంతుడు కూడ కనుక మరియు ఈ కుమారుణ్ణి ఎంతగా ప్రేమించేదో అంతగా ఆరాధించేది కూడ ఆమె ప్రేమే ఆరాధన. మనం క్రీస్తుని

                                                           14 

"నా దేవా! నా ప్రభూ!” అంటాం. కాని ఆమె "నా కుమారా! నాదేవా! అనుకునేది. ఈలాంటితల్లి మరియ ఒక్కర్లే. కనుక ఆమెను ఎంతైనా స్తుతించాలి.

క్రీస్తు రక్షకుడు, మనం రక్షింపబడిన వాళ్ళం. ఈ రక్షణం ద్వారానే పరలోకంలోని పిత మనతండ్రి ఔతాడు. క్రీస్తు మన పెద్దన్న ఔతాడు. మరియమాత మానవుల తల్లి అవుతుంది. ఈ తల్లిని మనం స్తుతించి మహిమపరచాలి. ఆమె మహిమలన్నింటిలోను గొప్ప మహిమ దైవమాతృక గావడం. ఈ మాతృత్వాన్ని బట్టే స్త్రీ లందరిలోను మరియ ధన్యురాలు. సమస్త జాతులూ ఆమెను భాగ్యవతి అని కొనియాడతాయి. కొంతమంది భక్తులు దేవమాత వద్దనుండి నిత్యం. అవీ యివీ అడుగుకొంటూ వుంటారు గాని" ఆమె మహిమనూ, మాతృత్వాన్నీ స్మరించనే స్మరించరు. ఎవడో వొకడు నిత్యం మంగళ వార్తజపంలో రెండవభాగం మాత్రమే చెప్పకునేవాడట! ఈ జపంలో మొదటిభాగం మరియను స్తుతిస్తుంది. రెండవభాగం ఆయా మనవులను అడుగుకుంటుంది, అతడు మరియమాతనుండి మనవలు పొందితే చాలు, ఆమెను స్తుతించటం దేనికిలే అనుకున్నాడు, మన ప్రవర్తన ఈలా వుండకూడదు.

మరియమాత ఆనాడు లోకానికి క్రీస్తు నందించింది. ఈనాడు మనకూ ఆ క్రీస్తు నందించమని ఆ తల్లిని అడుగుకోవాలి. ఆమెను కొనియాడుతూ "నీ గర్భఫలం ఆశీర్వదింపబడునుగాక” అంటాం. మరియ అనే చెట్టు క్రీస్తు అనే మంచి పండును కాచింది. ఆ పండును సంపాదించుకొంటే మనమూ ధన్యులమౌతాం. కనుక ఆ పండుకోసం ఆ తల్లిని అడుగుకోవాలి.

భక్తుడు బెర్నారు జీవితంలో ఓ వృత్తాంతం. విన్పిస్తుంది. బెర్నారు మరియ భక్తుడు. ఓనాడు అతడు మరియు మాతమీద సుమ్మర్లు పడుతూ "నీవు నాపట్ల తల్లిలా మెలగడంలేదుకదా?" అన్నాట్ట. వెంటనే మరియ అతని మాటల తీరు సవరిస్తూ "నీవు మాత్రం నాపట్ల బిడ్డలా మెలుగుతున్నావా?" అని అడిగిందిట. మనంకూడ ఏబ్రాసిపనులు చేసినపుడెల్ల మరియమాతపట్ల బిడ్డల్లా మెలగడం మానివేస్తుంటాం. ఈ దౌర్భాగ్యానికి గురికాకుండా వుండాలని కూడ ఆ తల్లినే అడుగుకుందాం,

4.రక్షణమాత

రెండవ శతాబ్దపు భక్తుడు ఇరెనేయున్ "ఏవ అవిధేయురాలై చావు తెచ్చిపెట్టుకుంది. మనకూ చావు కలిగించింది. కాని మరియ దూతవాక్యానికి విధేయురాలై రక్షణం సంపాదించుకుంది. నరజాతి కంతటికీ రక్షణం ఆర్థించి పెట్టింది. ఏవ తన అవిధేయత వలన మనకు ఓ వురి తగిలించిపోయింది.మరియు తన విధేయత వలన ఆ

                                                                 15 

వురి తొలగించింది. ఆ తొలికన్య అవిశ్వాసంతో మనకు ఓ ముడి పెట్టిపోయింది. ఈ మలికన్య విశ్వాసంతో ఆ ముడి విప్పింది" అని వ్రాసాడు. మరియు రెండవ యేవ. ఆ తొలి యేవ మనపతనానికి కారణమైనట్లే ఈ మలియేవ మన ఉద్ధరణానికి కారణమైంది. కనుక ఈమె రక్షణమాత. ప్రస్తుతం రక్షణ మాతనుగూర్చి మూడంశాలు విచారిద్దాం.

1. ఇద్దరు ఏవలు

తొలి ఆదాము పాపంచేసాడు. అతడు మన నరజాతికి శిరస్సు. కనుక అతనిపాపం మనకూ సంక్రమించింది. అతని వలన మనమంతా పతనమైపోయాం. ఈ పాపానికి పరిహారం చేయడం కోసమే రెండవ ఆదాము క్రీస్తు వచ్చాడు.

ఆ తొలి ఆదాము పాపంలో ఓ స్త్రీ కూడ పాల్గొంది. ఆమె పాపం దానంతటదే మనలను నాశంజేసివుండదు, ఆదాము పాపం చేయకుండా ఏవమాత్రమే పాపం చేసినట్లయితే మనం పతనమైపోయివుండం. ఎందుకంటే ఆమె మనకు తలగాదు. కాని ఆదాము పాపముతోగూడి ఆమె పాపం కూడ మనకు నాశం తెచ్చి పెట్టింది.

తొలి ఆదాము మనలను నాశం జేసినట్లే మలి ఆదాము క్రీస్తు మనలను ఉద్ధరించాడు. అతనిలాగే ఇతడూ నరజాతికి శిరస్సు కనుకనే క్రీస్తు రక్షణం మనకూ సంక్రమించింది. ఈ రెండవ ఆదాము ఉద్ధరణంలో ఓ స్త్రీ కూడ పాల్గొంది. ఆమె ఉద్ధరణం దానంతటదే మనలను రక్షించి వుండదు. నరజాతికి శిరస్సు క్రీస్తకాని మరియకాదు. క్రీస్తు సిలువమీద చనిపోకపోయినట్లయితే మరియు ఎంత కృషిచేసినా మనకు రక్షణం లభించివుండదు. కాని క్రీస్తు రక్షణకార్యంలో మరియకూడ పాల్గొనడం వల్ల క్రీస్తుతోపాటు ఆమెకూడ మనలను రక్షించింది.

ఐనా క్రీస్తు రక్షణమూ మరియమాత రక్షణమూ ఒకే కోవకు చెందినవిగావు. క్రీస్తు మనకు అవసరమైన రక్షకుడు. అతడులేక నరజాతికి రక్షణంలేదు. పౌలు వాకొన్నట్లు “దేవునికీ మానవునికీ మధ్య ఒక్కడు మధ్యవర్తి, క్రీస్తు - 1తిమో 2,5. ఇక మరియమాత రక్షణం క్రీస్తు రక్షణంలాగ అవసరమైగాదు. ఔచిత్యంకోసం మాత్రమే. ఏమిటి ఆ ఔచిత్యం?

అక్కడ మన పతనంలో ఓ స్త్రీ పాల్గొంది అన్నాం. ఇక్కడ మన ఉద్ధరణంలోగూడ మళ్ళా ఓ స్త్రీ పాల్గొంటే ఔచిత్యంగా వుంటుందనుకొని దేవుడు క్రీస్తుతో ఈమెను జోడించాడు. ఆ యేవకు ఈ యేవ సరితూగు. క్రీస్తులేక మరియలేదు. క్రీస్తు రక్షణం లేక మరియమాత రక్షణంలేదు. క్రీస్తు రక్షణానికి మరియమాత రక్షణం ఏమి చేర్చదు. ఆమె రక్షణాన్ని తొలగించినా క్రీస్తు రక్షణం తగ్గిపోదు. కాని క్రీస్తు రక్షణంతో పాటు ఆమె రక్షణం కూడ వుంటుంది. క్రీస్తుతోపాటు ఆమెకూ స్థానం వుంది. ఆమెకు అసలు స్థానమేలేదు అనకూడదు.

16

మరియకూడ మన రక్షణంలో పాల్గొంది అన్నపుడు క్రీస్తుకి అప్రియం గలుగదు. ఆమెను గౌరవించడంద్వారా క్రీస్తుకి గౌరవం తగ్గిపోదు. ఆ తల్లిని గౌరవించినపుడు క్రీస్తునే గౌరవించినట్ల

మరియు రెండవ యేవ. మన పతనాన్ని తలంచుకొనేపుడెల్లా తొలియేవను స్మరించక తప్పదు. అలాగే మన ఉద్ధరణాన్ని తలంచుకొనేపడు ఈ రెండవ యేవను స్మరించకతప్పదు. తొలి యేవ పతనమూ, మలియేవ ఉద్ధరణమూ ఈ రెండూ చారిత్రక ఘట్టాలు, వీటిని మనం కాదనకూడదు, కాదనలేము. ఇక మరియ క్రీస్తు రక్షణంతో సహకరించడంవల్ల క్రీస్తుతోపాటు తనూ సహరక్షకి అనబడుతూంది అన్నాం. కాని మరియ క్రీస్తు రక్షణంతో ఏలా సహకరించింది? ఆమె మనలను ఏలా రక్షించింది?

2. మరియ మూడు దశల్లో సహరక్షకి

మరియ మూడుదశల్లో సహరక్షక్రిగా వ్యవహరించింది. క్రీస్తు జననమందు, కల్వరిమీద, మోక్షంనుండి ఈ మూడు దశలను క్రమంగా విచారించి చూద్దాం.

మొదట, క్రీస్తు జననమందు మరియు సహరక్షకి, దేవదూత తన సందేహం తీర్చగానే మరియు "నీ మాట చొప్పున నా కగునుగాక” అంటుంది. ఆ వాక్యం ఈ నేలమీది నరులు పల్మిన వాక్యాలన్నిటిలోను గొప్పవాక్యం. ఈ వాక్యం ద్వారా పితతోపాటు సుతునితోపాటు మరియ కూడ మనుష్యావతారానికి సమ్మతించింది. ఈ సమయంలో ఆమె మానవులందరికీ ప్రాతినిధ్యం వహించింది. అనగా దేవుణ్ణి మానవలోకంలోకి తీసికొనిరావడానికి మనందరి తరపున ఒప్పకుంది. ఇక్కడ ఆమె చూపిన బాధ్యతా, అంగీకారమూ చాల గొప్పవి.

క్రీస్తు ఆమెనుండి జన్మించాడుగదా? మరియు క్రీస్తుకి ఓ మానుషదేహాన్ని అర్పించింది. తరువాత ఈ దేహాన్నే క్రీస్తు సిలువమీద పితకు బలిగా అర్పించాడు. కనుక పూజలో గురువు రొట్టె, రసం అనే కానుకలను సమర్పించినట్లే మరియకూడ దైవవార్తకు మానుషదేహం సమర్చిచింది. ఈ బలివస్తువు వలననే కల్వరియాగం నిర్వహింపబడింది.

ఆ తల్లి బలికై గొర్రెపిల్లను సంసిద్ధం చేసింది. లోకపు పాపాలకు పరిహారం చేయడం కోసమై ఈ గొర్రెపిల్ల సిలువమీద చనిపోయింది. ఈ రీతిగా మరియు క్రీస్తు జననం ద్వారానే మన రక్షణంలో పాల్గొంది. భక్తుడు ఆంబ్రోసు నుడివినట్లు, మరియ రక్షకుడ్డి కనడం ద్వారానే మన రక్షణాన్ని కూడ కంది.

రెండవది, మరియ కల్వరిమీద మన రక్షణంలో పాల్గొంది. ఆమె కల్వరి కొండమీద "క్రీస్తుతోపాటు తానూ బాధలు అనుభవించింది. అతని నెత్తటితో తన కన్నీటిబొట్లను మేళవించింది. అతనితో పాటు తానూ ఇంచుమించుగా చనిపోయింది. తల్లి హక్కులన్నిటినీ విడనాడి క్రీస్తును పరలోకపితకు అర్పించింది. సిలువమీద ఓ బలి అర్పింపబడుతూంటే ఆమె హృదయంలోకూడ ఓ బలి అర్పింపబడింది. ఈలా క్రీస్తును కల్వరి కొండమీద పితకు అర్పించింది. మరియ ఈ యర్పణం ద్వారా క్రీస్తుతోపాటు తానూ మన రక్షణంలో పాల్గొంది. మరియ సహకారం ద్వారా క్రీస్తు స్త్రీ పురుషుల పాపాలకుగూడ పరిహారం చేసినట్లయింది.

మరియ తొలిబిడ్డను కన్నపుడు ఏ బాధా అనుభవించలేదు. కాని కల్వరిమీద మలిబిడ్డలమైన మనలను కన్నపుడు ఎంతైనా బాధ అనుభవించింది. "ఇదిగో నీ కుమారుడు" అని క్రీస్తు నుడివినపుడు, ఆ మాటలద్వారా జ్ఞానవిధంగా తాను మనకు తల్లి ఐనపుడు, మరియ పుట్టెడు దుఃఖం అనుభవించింది. ఈలా ఆమె బాధామయమాతగానే మన రక్షణంలో పాల్గొంది.

ఈలా క్రీస్తుతోపాటు మన రక్షణంలో పాల్గొనేందుకే మరియ నిష్కల్మషగా పవిత్రురాలుగా పదిలపరచబడింది. తానే పాపాత్మురాలైనట్లయితే మనరక్షణంలో పాల్గొని వుండలేదు. తొలిస్త్రీ పాపాత్మురాలై మన నాశంలో పాల్గొంది. ఈ రెండవ స్త్రీ పునీతురాలై మనరక్షణంలో పాల్గొంది.

మూడవది, మరియ మోక్షంనుండిగూడ మన రక్షణంలో పాల్గొంటుంది. ఆమె ఈ లోకంలో వుండగా నరులకు సాయపడింది. ఆమె సాన్నిధ్యం ద్వారా యొలిసబేతు గర్భంలోని యోహాను పునీతుడయ్యాడు - లూకా 1, 44. ఆమె వేడుదలద్వారా ప్రభువు కానావూరిలో నీరు ద్రాక్షసారాయంగా మార్చాడు. యెరూషలేము మీదిగదిలో ఆమె శిష్యులు పరిశుద్ధాత్మను పొందాలి అని ప్రార్ధనం చేసింది - అచ 1,44. ఈలా భూమిమీద జీవించి వున్నపుడు నరులకు సాయపడుతూ వచ్చిన మరియు మోక్షంలో వుండిమాత్రం మనలను మరచిపోతుందా? ఆమె స్వర్గంలో ఉండి అహోరాత్రులూ మన రక్షణకోసం క్రీస్తుని మనవిచేస్తుంది. మనం పిశాచం చేతుల్లో చిక్కుకోకుండా వుండేలా తోడ్పడుతుంది.

ఈలా మరియ క్రీస్తు జననమందు, కల్వరిచెంత, మోక్షంనుండి మన రక్షణంలో పాల్గొంది. క్రీస్తుతోపాటు ఆమెకూడ మనలను రక్షించింది. కావున మరియ సహరక్షకి, రక్షణమాత.

3. రక్షణమాతపట్ల భక్తిభావాలు

మరియ క్రీస్తు శిశువును ప్రేమించినంతగా భూలోకంలో ఏ తల్లికూడ తన బిడ్డను ప్రేమించి యెరుగదు. ఐనా ఈ మరియ తన బిడ్డను మన రక్షణకోసం అర్పించడానికి వెనుదీయలేదు. ఈలాగే క్రైస్తవ తల్లిదండ్రులు కూడ తమ బిడ్డలను క్రీస్తు సేవకు సమర్పించడానికి వెనుకాడకూడదు.

క్రీస్తు జన్మించినపుడూ చనిపోయేప్పడూ ఆ ప్రభుని మరియ పరలోకపితకు అర్పించిందన్నాం. నేడు మనంకూడ పూజలో క్రీస్తుని భక్తితో పరలోకపితకు అర్పించుకునే భాగ్యంకోసం వేడుకుందాం. మరియ గర్భసీమలో గోదుమ పైరు పంటపండింది. ద్రాక్ష పండ్లు కాసింది. ఆ తల్లి మనకు స్వర్గపు రొట్టెను స్వర్గపు రసాన్ని అందిస్తుంది. ఈ రొట్టెను భుజించి ఈ రసాన్ని పానంచేసి ఆకలి తీర్చుకుందాం, సంతృప్తిచెందుతాం.

మరియ రక్షణమాత. కనుక ఆమెను మనకోసం మనవి చేయమందాం. అశ్రద్ధవల్ల మనమాతల్లిని మరచిపోయినా ఆ తల్లి మాత్రం మనలను మరచిపోకుండా వుండాలని విన్నవించుకుందాం.

విశేషంగా మరణ సమయంలో ఆమె మన రక్షణ మాతగా వ్యవహరించాలని మనవి చేసికుందాం. "ఇప్పడూ మా మరణ సమయమందూ ప్రార్ధించ" మని బ్రతిమాలుకుందాం.

5. ఉత్తాపితమాత


స్యూడో అగస్టిన్ అనే ఎన్మిదవ శతాబ్దపు రచయిత మరియనుగూర్చి ప్రస్తావిస్తూ "మరియమాతదేహం క్రీస్తుకు మందసంగా వుండిపోయింది. కనుక ఆ కుమారుడు ఉన్న కాడే ఆ తల్లి దేహంకూడ వుండిపోవడం సముచితం. ఏ దేహంనుండి క్రీస్తు తనదేహాన్ని చేకొన్నాడో ఆ పునీతదేహం ప్రాణం విడిచాక క్రుళ్ళి మన్నయి పోయిందంటే, పరుగులకు మేతయిపోయిందంటే, నాకు నమ్మబుద్ధి ఫుట్టడం లేదు. కనుక ఆమె దేహం క్రీస్తు సన్నిధిని చేరి వుండాలి" అని వ్రాసాడు. మరియమాత ఉత్థాపితమాత ప్రస్తుతం ఉత్తాపితమాతను గూర్చి మూడంశాలు విచారిద్దాం.

1. ఉత్ధానం అంటే యేమిటి?

మనం చనిపోయాక మన యీ దేహాలు ఇక్కడే మన్నై పోతాయి. కాని మరియమాత దేహం అలా మన్నైపోలేదు. ప్రభువు ఆమెను దేహాత్మలతో మోక్షానికి తీసికొని వెళ్ళాడు. మరియ ఆత్మతోపాటు దేహంకూడ ప్రభు సన్నిధిలో మహిమను పొందింది. ప్రస్తుతం మానవ మాత్రుల దేహాలేవీ మోక్షంలో లేవు. పునీతుల ఆత్మలు మాత్రమే మోక్షంలో వుంటాయి. పునీతుల దేహాలైనాసరే మన దేహాలైనాసరే లోకాంతంలో గాని ప్రభు సన్నిధిని చేరవు. కనుక ప్రస్తుతం క్రీస్తు మినహా, మోక్షంలోవున్న మానుషదేహం మరియమాత

                                                             19 

దొక్కటే. క్రీస్తుతనంతటతాను ఉత్థానంమయ్యాడు. మరియమాత తనంతటతాను ఉత్థానం కాలేదు. ప్రభువే ఆమె దేహాన్ని ఉత్తాపనం చేసాడు. అనగా లేపాడు. కనుకనే ఆమె దేహం మోక్షాన్ని చేరింది.

2. ఉత్థాపన కారణాలు

దేవుడు మరియమాత దేహాన్ని ఎందుకు ఉత్థాపనం చేసినట్లు? పాపం ద్వారా నరునికి మరణం సిద్ధించింది -1కొ15,56. మరణం చెందిన దేహాలు మన్నైపోతాయి. కాని మరియకు పాపమంటూ లేదు. ఆమె నిష్కళంకమాత, అంచేత ఆమె దేహం పాపశిక్షగా క్రుళ్ళి మన్నై పోవలసిన అవసరం లేదు. నేరుగా మోక్షానికి వెళ్తుంది. మరి ఆమె చనిపోవడం మాత్రం దేనికి? మరియ చనిపోయింది తాను పాపాత్మురాలు కావడంవల్ల కాదు. క్రీస్తుకు పోలికగా వుండడంకోసం. నరజాతికి శిరస్సెన క్రీస్తు చనిపోయాడు కనుక నరులంతా చనిపోవలసిన ధర్మం వుంది. కనుక మరియ కూడ చనిపోయింది. (అసలు ఆమె చనిపోనేలేదు, చనిపోకుండానే నేరుగా మోక్షానికి వెళ్ళిపోయింది అని ప్రాచీన క్రైస్తవ వేదశాస్త్రజ్ఞలు కొంతమంది నుడివారు. కాని అందరూ ఈ వాదాన్ని అంగీకరించరు. మరియ మరణాన్ని గూర్చి మనకేమీ స్పష్టంగా తెలియదు. శ్రీసభ ఈ విషయంలో అధికారపూర్వకంగా ఏమీ బోధించలేదుకూడ.)

క్రీస్తుతోపాటు మరియకూడ మన రక్షణంలో పాల్గొంది. మన వినాశం ఒక పురుషుడు ఒక స్త్రీ ద్వారా, అలాగే మన ఉద్ధరణంకూడ ఒక పురుషుడు ఒక స్త్రీ ద్వారా, తొలి ఆధాము తొలియేవ తెచ్చిపెట్టిన పతనానికి రెండవ ఆదాము రెండవ యేవ ప్రాయశ్చిత్తంచేసి ఉద్ధరణం కలిగించారు. ఇక, ఈ రెండవ ఆదాము దేహం మోక్షంలో మహిమను పొందింది. అతనితో కలసి రక్షణరంగంలో కృషిచేసిన రెండవయేవ దేహంకూడ మహిమను పొందాలి. అలా పొందడమే మరియమాత ఉత్థాపనం.

క్రీస్తుకి ఆ తల్లిపట్ల అపార గౌరవమూ ప్రేమా వుంటుంది. తన్ను ధరించిన ఆ పునీత దేహం క్రుళ్ళి పరుగులకు మేలైపోవడానికి, మన్నెపోవడానికి, క్రీస్తు అంగీకరిస్తాడా? తన్నుకని చనుబాలతో పెంచి, ముద్దాడి పెద్దజేసిన ఆ తల్లి పునీత దేహాన్ని ఆ కుమారుడు ఎలా గౌరవించాలో అలాగే గౌరవించి తీరుతాడు. జీవవంతుడైన దేవుడు ఆమెకు జీవమిచ్చి వెలుగులోకి తీసుకవెళ్ళాడు. క్రీస్తు ఎక్కడవుంటే ఆ తల్లి అక్కడే వుంటుంది. క్రీస్తును గౌరవించాక ఆ తల్లిని గౌరవించాలి. పూర్వవేదపు మందసం కొయ్యలాగ ఆమె దేహం చెరువు నెరుగదు.

దేహాత్మలతో మోక్షం జేరుకొనిన మరియను ముగ్గురు దైవవ్యక్తులు ఆదరించి మహిమ పరుస్తారు. దేవునికి తల్లియైనందుకు తగినట్లుగా, మన రక్షణంలో పాల్గొన్నందుకు తగినట్లుగా, ఆ సర్వమంగళను సన్నుతిస్తారు. నీతిమంతులు ఏలాంటి మహిమను పొందుతారో మనం ఊహించనైనా ఊహించలేం అంటాడు పౌలు. జీవితమంతా పాపం విడనాడి నిర్మలజీవితం జీవించిన మరియకు ఏలాంటి మహిమ సిద్ధిస్తుందో మనం మాత్రం ఊహించగలమా? పునీతులు, కన్యలు, స్తుతీయులు, వేదసాక్షులు, దేవదూతలు మొదలైన వాళ్ళందరికంటె ఆమె స్థానం గొప్పది. వాళ్ళందరికీ ఆమె రాజ్ఞి. చుక్కలన్నిటికంటె సూర్యుడెక్కువ. మోక్షవానులందరికంటె మరియమాత యొక్కువ. అన్ని గ్రహాలూ సూర్యునినుండి వెలుగును పొందుతాయి. ఆమె మహిమ నుండి అందరూ పునీతులూ మహిమను పొందుతారు. మోక్షవాసులందరూ మొదట దేవునియందు సంతోషిస్తారు. ఆ పిమ్మట మరియమాతయందు సంతోషిస్తారు. ఆమె మహిమ వాళ్ళ మహిమ. ఆమె వాళ్ళందరికీ రాజ్ఞి. ఈలా మోక్షంలో క్రీస్తు సమీపంలో మరియమాత, మరియమాత సమీపంలో సకల పునీతులూ శాశ్వతంగా వసిస్తుంటారు.

3. భక్తిభావాలు

మరియమాత మహిమకు మనమూ సంతోషించాలి, మన నరజాతికి చెందిన ఓ స్త్రీదేహాత్మలతో నేడు మోక్షంలో వుందంటే మనకే గౌరవం, మన మానవజాతికంతటికీ మహాలంకారం ఉత్థాపితమాత.

మరియ దేహంలాగే మన దేహమూ ఉత్తాపనమౌతుంది. క్రీస్తు ఉత్తానంలో మరియు పాలుపొందింది. ఆమెలాగే మనంకూడ పాలుపొందుతాం. ఓ రోజు ఉత్థానమౌతాం. అందుకే "శరీరం యొక్క ఉత్తానాన్ని విశ్వసిస్తున్నాను" అంటాం. ప్రభువు మళ్ళా విజయంచేసి మన యీ దీనశరీరాన్ని మహిమాన్విత శరీరంగా మార్చాలని కోరుకుంటాం. ఆయన రెండవ రాకడకోసం కనిపెట్టుకొని వుంటాం – ఫిలి-3,21. ఈలా ఉత్తానంకోసం ఎదురుచూచే క్రైస్తవ ప్రజకు ఉత్తాపితమాత ఓ ద్రువతారలా దారిచూపుతుంది. ఆమె మనలనూ తన చెంతకు పిల్చుకుంటుంది.

మరియమాత దేహంలాగే మన ఈ దేహంకూడ ఉత్థానమై దేవుని యెదుట మహిమను పొందుతుంది అన్నాం. ఈ దేహం ఓనాడు దేవుని యెదుట నిలుస్తుంది. అలాంటి ఈ దేహాన్ని మనం పవిత్రభావాలతో చూస్తూండాలి. ఈ దేహం జ్ఞానస్నానంద్వారా దేవుని ఆత్మకు మందిరమౌతుంది. తేపతేపకు క్రీస్తునే ఆహారంగా పుచ్చుకొంటుంది. కడన ఉత్థానమై ప్రభుసన్నిధిలో నిలుస్తుంది. కనుక ఈ దేహం పవిత్రమైంది. పురుషదేహమైనాసరే స్త్రీదేహమైనా సరే, ఈ దేహాన్నెపుడూ కామభావాలతో చూడకూడదు. గౌరవమర్యాదలతో, భక్తి ప్రపత్తులతో చూస్తుండాలి. పౌలు బోధించినట్లుగా ఈ దేహంతోను పాపం చేయకూడదు, ఈ దేహంలోను పాపం చేయకూడదు. అనగా అశుద్ధ పాపాలతో ఈ దేహాన్ని అమంగళపరచుకోగూగదు - 1కొ 6,8.

ఉత్తాపితమాత మోక్షంలోవుండి మనలను మరచిపోదు. అక్కడనుండి మనకోసం మనవి చేస్తుంటుంది. మనలను కూడ తన చెంతకు పిల్చుకుంటుంది. మనమూ ఆ చోటునకు చేరాలని హెచ్చరిస్తుంటుంది. కావున మనం ఇచటనుండి చూపు మరల్చి అటువైపునకు చూస్తుండాలి. ఆ తల్లి చూపించే దివ్యధామంవైపు పయనం సాగిస్తుండాలి.

6. మరియరాజ్ఞి

ఏడవ శతాబ్దపు భక్తుడు ఇల్డెఫోన్సస్ మరియను గూర్చి చెపూ "నేను క్రీస్తుదాసుడ్డి గనుక మరియదాసుడ్డి మరియే దేవుని దాసురాలు కనుక నా రాబ్ది. నేను మరియ రాజ్ఞని సేవించి క్రీస్తు సేవకుడనని రుజువు చేసికొంటాను" అని వ్రాసాడు. మరియ మన రాబ్ది, ఇక్కడ మూడంశాలు విచారిద్దాం.

1. మరియ రాజ్ఞి అంటే ఏమిటి?

మరియ పరలోక, భూలోకాలకు రాజ్ఞగా నియమింపబడింది. సృస్టి ప్రాణులందరికీ ఆమె రాజ్ఞి. “కృపారసము గల మాతయై యుండెడి రాజ్జీ వందనము" మొదలైన ప్రాచీన జపాలు ఆమెను రాజ్ఞిగా పేర్కొంటాయి. కనుక బహుప్రాచీన కాలం నుండే క్రైస్తవ ప్రజలు ఆమెను రాజ్ఞగా కొనియాడుతూ వచ్చారని విశదమౌతుంది.

మరియ రాజ్ఞత్వం మనలను పరిపాలించడం కోసంగాదు, మనకొరకు మనవిచేయడంకోసం. ఆ తల్లి నరులందరి కోసమూ క్రీస్తుని మనవి చేస్తుంది. అందరికీ వరప్రసాదాలు ఆర్థించి పెడుతుంది. ఆమె కోరికలనూ, మనవులనూ క్రీస్తు ఎప్పడూ కాదనడు. ఆ రాజ్ఞఓ చంద్రబింబం లాంటిది. వేడుదలరూపమైన ఆమె పాలనం మనందరికీ ఆపదం కలిగిస్తుంది.

2. కారణాలు

కాని మరియ ఎందుకు రాజ్ఞ యైనట్లు? క్రీస్తు రాజు. ఆ రాజు తల్లియైన మరియకూడ రాజ్ఞ దేవమాతగా ఆమె పొందిన అంతస్తే ఆమెకు ఉత్థాపనం సంపాదించి

పెట్టింది. ఆ యంతస్తే ఆమెను విశ్వానికి రాజ్ఞిగాగుడ చేసింది. ఆ తల్లి మధ్యవర్తియైన క్రీస్తుతో సహకరించి పనిచేసిందన్నాం. ఆమె క్రీస్తు అనే రాజుకు సహాయురాలుగా నిలిచింది. కనుకనే ఆ ప్రభువు రాచరికంలో తానూ పాలుపొంది మనరాణి ఔతుంది.

క్రీస్తు తాను ఆర్జించిన రక్షణంద్వారా మనకందరికీ ప్రభువయ్యాడు. ఆ రక్షణంలో పాల్గొనిన మరియమాతకూడ మనకు రాజ్ఞి ఔతుంది. దైవరాజ్యాన్ని స్థాపించడానికి క్రీస్తు మరియమాతా ఇద్దరూ పాటుపడ్డారు. ఆ రాజ్యానికి క్రీస్తు రాజైతే, మరియ రాజ్ఞి కాదా?

పిత,సుతుడు,ఆత్మ- ఈ మువ్వురు దైవ వ్యక్తులూ ఆమెను రాజ్ఞిగా నియమించి కిరీటం వుంచారు. శ్రీసభ ఆమెను రాజ్ఞిగా ఎన్నుకొని మరియరాజ్ఞి మహోత్సవం అనే పండుగను నెలకొల్పింది. ఆమె రాజ్యం క్రీస్తురాజ్యమంత విస్తీర్ణమైంది. భూమిమీద, ఉత్తరించే స్థలంలోకూడ ఆమె రాచరికం చెల్లుతుంది. ఆ రాజ్ఞి నరకంలోని పిశాచాలకు గర్వభంగం కలిగిస్తుంది. దేవునికి ఓడిపోతే పోయ్యాంగాక, ఈ సృష్టి ప్రాణికికూడ ఓడిపోయాంగదా అని పిశాచాలు సిగ్గుతో మ్రగ్గిపొతాయి. మోక్షంలోని పూర్వనూత్న వేదాల పునీతులకూ, దేవదూతలకూ మరియ రాజ్ఞి ఔతుంది. ఈ విధంగా భూమిమీద, మోక్షంలో నరకంలో - అంతటా ఆమె ప్రాభవం చెల్లుతుంది. క్రీస్తు ఎన్నాళ్ళు ఎంతవైభవంగా రాజ్యపాలనం చేస్తాడో ఆమెకూడ అన్నాళ్ళు, అంతవైభవంగా రాజ్ఞిగా ఉండిపోతుంది. ఆ కుమారుడు ఆ తల్లి పరిపాలించే రాజ్యానికి అంతమే వుండదు.

క్రీస్తు రాజు అన్నా కాని ఆ ప్రభువు రాచరికం అధికారం చెలాయించడంకోసం గాదు, సేవచేయడంకోసం. "మనుష్య కుమారుడు సేవలు చేయించుకోవడం కోసం గాదు, సేవలు చేయడంకోసం వచ్చాడు" - మార్కు 10,45. ఈ క్రీస్తురాజు లాగే మరియరాజ్ఞికూడ మనకు సేవలు చేస్తుంది. మరియ సేవ ఆమె వేడుకోలే. ఇక క్రీస్తురాజుతో పాటు మనమూ రాచరికం చేస్తాం. క్రీస్తురాజుతోపాటు, మరియ రాజ్ఞితోపాటు మనమూ పరిపాలనం చేస్తాం - 2 తిమో 2, 12. ఆ ప్రభువుని ఆరాధించి సేవించడమే రాచరికం.

3. భక్తి భావాలు

మరియరాజ్ఞిని మనం సేవిస్తుండాలి. మన పనులు కష్టసుఖాలు ఆ తల్లికి అర్పించుకోవాలి. మన జపతపాలు భక్తిక్రియలు, పుణ్యకార్యాలు ఆ రాజ్ఞికి కానుక పెట్టాలి.

ఈ రాజ్ఞికి పిశాచం శత్రువు. ఆమె పిశాచం తల నలగధ్రొక్కుతూంది. నిత్యం పోరాడి ఆ పిశాచాన్ని నరకానికి తరిమివేస్తూంటుంది. ఇటువంటి పిశాచాన్ని మనం సేవించకూడదు. దానితో చేతులు కలుపనూకూడదు. మనం పాపం చేసేప్పడూ, దురభ్యాసాలకు లొంగిపోయేప్పడూ ఆ రాజ్ఞిని సేవించకుండా పిశాచాన్ని సేవిస్తుంటాం. అది ఆ తల్లికి కోపాన్నీ దుఃఖాన్నీ కలిగిస్తుంటుంది.

ఆమె రాజ్జీత్వం మనకోసం విజ్ఞాపనం చేయడమే అన్నాం. మనకు వరప్రసాదాలు ఆర్థించి పెట్టడమే అన్నాం. అంచేత ఆమె ప్రార్ధనంమీద మనకు నమ్మకం వుండాలి. అవసరాల్లో ఆ తల్లిని అడుగుకోవడం నేర్చుకోవాలి. నమ్మికతో ఆమెమీద భారంవేసి జీవించడానికి అలవాటుపడాలి. పన్నెండవ శతాబ్దంలోనే బెర్నార్దు భక్తుడు ఆమెనుద్దేశించి "తల్లీ! నీ శరణుజొచ్చి నీ సహాయమడిగి, నీ వేడుకోలును కోరుకున్న వాళ్ళల్లో నిరాశ చెందినవాడు ఒక్కడూలేడు" అని సవాలు చేసాడు. ఈ సవాలు మనకు ధైర్యాన్ని ఆశనూ కలిగించాలి. కనుక భక్తులు నమ్మకంతో ఆ తల్లిని శరణు వేడుతూండాలి.

7. వరప్రసాద మాత


15 శతాబ్దపు భక్తుడు సియన్నా బెర్నదీను మరియనుగూర్చి చెప్తూ"అన్ని వర ప్రసాదాలూ పితనుండి క్రీస్తుకూ, క్రీస్తునుండి మరియకూ, మరియనుండి శ్రీసభకూ లభిస్తాయి, కనుక అన్నివరప్రసాదాలూ మరియ అధీనంలో వుంటాయి. ఆ వరప్రసాదాలను ఆమె తన చిత్తం చొప్పున, తన కిష్టం వచ్చిన వాళ్ళకి, తనకు తోచినరీతిగా పంచిపెడుతూంటుంది" అని వ్రాసాడు. మరియ వర ప్రసాదాలమాత. ఇక్కడ ఈ విషయాన్ని గూర్చి మూడంశాలు చర్చిద్దాం.

1. వరప్రసాదాల మాత అంటే ఏమిటి

?

ప్రస్తుతం మన పొందేవరప్రసాదాలేవైనాసరే మరియమాతద్వారాగాని లభింపవు. క్రీస్తుద్వారాగాని పితదగ్గరకు వెళ్ళలేం. అలాగే మరియద్వారాగాని క్రీస్తు దగ్గరకు వెళ్ళలేం. క్రీస్తు మనకోసం పితను మనవిచేసినట్లే, ఆ తల్లి మనకోసం క్రీస్తును మనవిచేస్తుంది. ఈ భూమిమీద చరిస్తున్నపుడు ఆ తల్లి ఎలిసబేతును సందర్శించి స్నాపక యోహానునకు మేలుజేసింది — లూకా 1, 41. కానావూరిలో పెండ్లివాండ్ల అక్కర తీర్చింది - యోహా 2, 3. కల్వరికొండ మీద యేసు శిష్యులకు తాను తల్లిగా నిలిచింది - యోహా 19,2. యెరూషలేము మీదిగదిలో వుండి శిష్యులు ఆత్మను పొందాలని ప్రార్ధించింది - లూకా 1,14. ఈలా ఈ లోకంలో జీవించినపుడు క్రీస్తు శిష్యులను ఆదరిస్తూ వచ్చినతల్లి నేడు మోక్షంలో వుండిమాత్రం మనలను మరచిపోతుందా? పోదు. మనకోసం మనవి చేస్తుంది. వరప్రసాదాలను ఆర్థించి పెడుతుంది.

2. మరియు యెందుకు వరప్రసాదాల మాత?

మరియమాత ఏలా వరప్రసాదాల మాత ఐంది? ఆమె మన రక్షణంలో తోడ్పడిందన్నాం, రక్షణంద్వారా క్రీస్తు మన పాపాలను పరిహరించి వరప్రసాదాలను

24 ఆర్థించి పెట్టాడు. ఇక రక్షణ ఫలితమైన వరప్రసాదాలను ఆర్థించడంలో క్రీస్తుకు తోడ్పడిన మరియ, ఆ వరప్రసాదాలను పంచిపెట్టడంలో గూడ తోడ్పడుతుంది. రక్షణంలో ఆమె తోడ్పాటు అవసరమై కాదు. ఔచిత్యంకోసం అన్నాం. వర ప్రసాదాలను పంచిపెట్టడంలోగూడ ఆమె తోడ్పాటు అవసరమై కాదు, ఔచిత్యంకోసం మాత్రమే.

పునీతులు మనకు ఏదో వో ప్రత్యేక వరప్రసాదాన్ని ఆర్థించి పెట్టగలరు. కాని అన్నివరప్రసాదాలను ఆర్థించి పెట్టలేరు. మరియ మనకు ఏ వరప్రసాదానాన్నై సంపాదించి పెట్టగలదు. అన్ని వర ప్రసాదాలూ ఆమెద్వారానే గాని లభించవు. కనుక పునీతులుకూడ ఆమె ద్వారాగాని మనకు ఆయా వరప్రసాదాలను ఆర్థించిపెట్టలేరు. వేయేల, క్రీస్తు వరప్రసాదం మరియ చేతులమీదుగాగాని నరులను చేరదు.

మన అక్కరలు ఆ తల్లికి బాగా తెలుసు. ఆమెకు మనకు సహాయం చేయాలనే కోరికా వుంది, శక్తి వుంది. అంచేత మన తరఫున మనవి చేసితీరుతుంది. ఈ మనవి కూడ మన రక్షణానికి వ్యతిరేకంగా వుండదు. అంచేత ప్రభువు ఆమెకోరికను తప్పక తీరుస్తాడు. వెంటనే తీరుస్తాడు కూడ.

మంచితల్లి బాధ్యత బిడ్డలను కనడంతోనే తీరిపోతుందా? తాను ఆ బిడ్డలను పోషించాలిగదా? తొలియేవ మనలను మరణానికి కంటే యీ రెండవయేవ జీవనానికి కంది. అనగా మరియ మనలను జ్ఞానజీవితానికి ప్రసవించింది. ఈలా ఫుట్టిన బిడ్డలమైన మనలను ఆ తల్లి తన వరప్రసాదాలతో పోషిస్తుంది. కావున ఆ తల్లిమీద మనకు ఎంతైనా నమ్మకముండాలి. బిడ్డ తల్లి పట్లలాగ, పనికత్తె యజమానురాలి పట్లలాగ, మనమూ మరియమాతపట్ల నమ్మికతో జీవిస్తుండాలి. మన అయోగ్యతను ఆమె యోగ్యత పూరిస్తుంది. మన అశక్తతను ఆమెశక్తి సవరిస్తుంది. కనుక మన అక్కరలన్నీ ఆ తల్లిద్వారా దేవునికి విన్నవించుకోవాలి.

వేదశాస్త్రజ్ఞలు మరియమాత మనకు ఎలా వరప్రసాదాలూ ఆర్థించి పెడుతుంది అని ప్రశ్నించుకొని చాల ఉపమానాలు చెప్పారు. 12వ శతాబ్దపు భక్తుడు క్షేర్వో బెర్నారు ఆమెను ఓ కాలువతో పోల్చాడు. దూరప్రాంతంలోని చెరువు లేక ఆనకట్టయందలి నీళ్ళ కాలువద్వారా మన వూరి పొలందాకా వస్తాయి. క్రీస్తు ఓ వరప్రసాదాల చెరువు. ఆ చెరువునుండి వరప్రసాదాలనే జలాలు మరియమాత అనే కాలువద్వారా మన హృదయంల్లోకి ప్రవహిస్తాయి.

ఇంకా కొందరు మరియను ఓ నిచ్చెనతో ఉపమించారు. నిచ్చెనగుండా యింటిమీదికో, చెట్టమీదికో ఎక్కిపోతాం. క్రిందికి దిగివస్తాం, మరియమాత అనే నిచ్చెన గుండా దేవుడు మన మంటిమీదికి దిగివచ్చాడు. మరియ అనే నిచ్చెనను వాడుకొని మనం మోక్షానికి ఎక్కిపోతాం. ఆమెద్వారా క్రీస్తు దగ్గరకు వెత్తాం, అనగా మరియు తన వరప్రసాదాలద్వారా మనలను క్రీస్తు చెంతకు చేరుస్తుంది,

వేరుకొందరు ఆ తల్లి చంద్రబింబంలాంటి దన్నారు. చందమామ సూర్యుని వద్దనుండి వెలుగును పొందుతుంది. తాను వెలుగుతుంది, ఆ వెలుగునే వెన్నెలరూపంలో భూమికి అందిస్తుంది. అలాగే మరియకూడ క్రీస్తు దగ్గరనుండి వరప్రసాదం పొందుతుంది. తాను ధన్యురాలౌతుంది. ఆ వరప్రసాదాన్ని మనకూ అందించి మనలనుకూడ ధన్యులను చేస్తుంది. కనుక సూర్యునికీ భూమికీ మధ్య చంద్రబింబం ఎలాగో, క్రీస్తుకు నరులకూ మధ్య మరియు అలాగు. మరియ యెప్పుడూ క్రీస్తుతో పోటీపడదు. తాను ఆ ప్రభుకార్యాన్ని కొనసాగిస్తుంది, అంతే కనుక క్రీస్తు ఉన్న కాడ మరియ ఉండక తప్పకదు. మరియపట్ల భక్తి చూపడానికి ఇష్టపడనివాళ్ళు ఆమె స్థానాన్ని అర్థం చేసికొనే ప్రయత్నం చేయడంలేదనే చెప్పాలి.

పూర్వవేదప పుణ్యస్త్రీలను చాలమందినిగూడ మరియకు ఉపమానంగా చెప్పారు. ప్రస్తుతానికి ఒక్క ఉపమానాన్ని చూద్దాం. పర్షియారాజు యిస్రాయేలు ప్రజలను నాశం చేయబోతుండగా ఎస్తేరురాణి ఆ ప్రభువును మనవిచేసి తన జనులను కాపాడింది. అలాగే మరియకూడ మోక్షంలో ప్రభుసన్నిధిలో మనకోసం మనవిచేస్తుంది. ఆ ప్రభుకోపం తొలగిస్తూంటుంది.

ఫలితార్థమేటంటే అన్ని వరప్రసాదాలు పితనుండి క్రీస్తుకూ, క్రీస్తునుండి మరియకూ, మరియనుండి విశ్వాసులకూ సంక్రమిస్తాయి. దేవుడు మరియను ఈలా వరప్రసాద ప్రదాయిని చేయడం అవసరమైగాదు. ఔచిత్యం కోసం. ఇది, దేవుడేర్పచిన నిర్ణయం. ఈ నిర్ణయానికి తిరుగులేదు.

3. భక్తి భావాలు

తూర్పుదేశపు జ్ఞానులు ప్రయాణమైవచ్చి తల్లి మరియను ఆమెతోవున్న బిడ్డను చూచారు - మత్త 1,11. సువిశేషం చెప్పదుగాని, ఆ తల్లి క్రీస్తుబిడ్డను వాళ్లకు అందించి వుంటుంది. జ్ఞానులు ఆ శిశువును మద్దిడుకొని ఆరాధించి, వుంటారు. అప్పటినుండి శ్రీసభలో ఆమెస్థానం, క్రీస్తును క్రైస్తవ ప్రజలకు అందిస్తూండడమే. మన తరఫున మనం, ఆ జ్ఞానుల్లాగే, మరియద్వారాగాని క్రీస్తును చేరలేం.

అడగందే అమ్మైనా పెట్టదు. మనం బిడ్డల్లాగ ఆ తల్లి చెంతకు గబగబ పరుగెత్తాలి. మన అవసరాలను ఆ తల్లికి విన్నవించుకొని ఆమె సహాయం అడుగుకోవాలి. మన అయోగ్యతను తలంచుకొని భయపడకూడదు. బిడ్డల దౌర్భాగ్యం ఎంత గొప్పదో ఆంత జాలితో తల్లి వాళ్ళను ఆదరిస్తుంది గదా?

26 మరియ మనకు రకరకాల వరప్రసాదాలు ఆర్థించి పెడుతుంది. కాని ఆమె ఇచ్చే ప్రధాన వరప్రసాదం క్రీస్తే. మరియ క్రీస్తనే పండ్లను కాసిన ద్రాక్షతీగ. క్రీస్తనే వెన్ను వేసిన గోదుమ పైరు. ఈ గోదుమ అప్పం, ఈ ద్రాక్షసారాయం మన పూజలో క్రీస్తుగా మారిపోతాయి. కనుక ఆ తల్లి రోజురోజు మనకు క్రీస్తనే భాగ్యాన్ని ప్రసాదిస్తుండాలని అడుగుకుందాం.

మరియను తల్లిగా బొందడమూ, ఆమెను ప్రేమించడమూ గొప్పభాగ్యం. మరియమాతపట్ల భక్తిలేనివాళ్లు దిక్మూమొక్మూలేని అనాథశిశువుల్లా అలమటించి పోతారు. 12వ శతాబ్దపు భక్తుడైన ఆన్సెల్మ్ "ఓ ప్రభూ! నీవు మీ తల్లిని ఎంతగా ప్రేమించావో, మేముకూడ ఎంతగా ప్రేమించాలని కోరుకొంటున్నావో, అంతగా ఆ తల్లిని ప్రేమించేభాగ్యం నీ మాతృ ప్రేమద్వారా మాకు ప్రసాదించు" అని ప్రార్థించాడు. కాని క్రీస్తు ఎంతగా కోరుకొంటూన్నాడో అంతగా ఆ తల్లిని ప్రేమిస్తున్నామా?

8. ఇద్దరు ఏవలు

క్రైస్తవమతానికి ఆధారాలు రెండు : బైబులు, పితృపాదుల బోధలు. ఈ రెండవదానినే పారంపర్యబోధ అంటాం. పితృపాదులు గ్రీసు, సిరియా, లాటిను దేశాలకు చెందినవాళ్ళ వీళ్ళ గ్రీకు, సిరియను, లాటినుభాషల్లో ప్రజలకు బోధించారు, రచనలు చేసారు. గ్రీకు పిత్రుపాదుల్లో క్రిసోస్తం, అలెగ్జాండ్రియా సిరిల్, గ్రెగోరీనీస్సా, గ్రెగోరీ నాసియాన్సన్, జాన్ డమసిన్ మొదలైనవాళ్ళు ముఖ్యలు. లాటిను పితృపాదుల్లో అగస్టీన్, జెరోము, అంబ్రోసు ముఖ్యలు. సిరియను పితృపాదుల్లో ఏ ఫ్రేము ముఖ్యడు. వీళ్ళంతా క్రీస్తుశకం 2-5 శతాబ్దాల మధ్యలో జీవించినవాళ్ళు అంతా పునీతులు. చాలమంది బిషప్పలు కూడ. వీళ్ళ బోధలు ఇప్పడు గ్రంథరూపంలో లభిస్తాయి.

క్రైస్తవ మతాంశాలన్నీ స్పష్టంగా బైబుల్లో లేవు. కొన్ని అంశాలు పితృపాదుల బోధల్లో మాత్రమే వుండిపోయాయి, అందుకే శ్రీసభ బైబులుతోపాటు పారంపర్య బోధనుకూడ గ్రహించింది. మనకు బైబులు ఎంత ప్రమాణమో పారంపర్య బోధకూడ అంత ప్రమాణం. పరిశుద్ధ రచయితలను ప్రేరేపించి బైబులు గ్రంథాలను వ్రాయించిన పరిశుద్ధాత్మే పితృపాదులను కూడ ప్రేరేపించి వాళ్ళ చేత ఆయా క్రైస్తవ సత్యాలను చెప్పించింది.

16వ శతాబ్దంలో ప్రోటస్టెంటు శాఖలు ఆదిమ క్రైస్తవ సమాజంనుండి చీలిపోయాక పారంపర్య బోధను గ్రహించడం మానివేసాయి. బైబులును మాత్రమే ప్రమాణంగా స్వీకరించాయి. ఈ కారణంచేతనే నేడు క్యాతలిక్ సమాజానికి ఇతర ప్రోటస్టెంటు క్రైస్తవ సమాజాలకూ క్రైస్తవ సత్యాల విషయంలో కొన్ని భేదభావాలు గోచరిస్తాయి.

మరియమాతనుగూర్చి క్యాతలిక్ సమాజం విశ్వసించే సత్యాలన్నీ బైబుల్లో స్పష్టంగా కనిపించవు. కాని పితృపాదలు బోధల్లో వున్నాయి. ప్రోటస్టెంటు శాఖవాళ్ళు పితృపాదుల బోధలను నిరాకరించారు కనుక ఆ శాఖల్లో మరియమాతను గూర్చిన అంశాలు అడుగంటిపోయాయి.

పూర్వాధ్యాయాల్లో మరియమాతనుగూర్చి చెప్పిన అంశాలను చాలవరకు పితృపాదుల రచనల్లోనుండే స్వీకరించాం. మరియనుగూర్చి ప్రస్తావించేవ్పడు పితృపాదులంతా ఆమెను ఏవతో పోలుసూ వచ్చారు. మరియమాత స్థానం అర్థంచేసికోవాలంటే ఈ పోలికను చక్కగా అర్థంచేసికోవాలి. అంచేత ఈ యధ్యాయంలో ఈ పోలికను పరిశీలిద్దాం. ప్రస్తుతం పితృపాదుల రచనల్లో నుండి ఈ యిద్దరు ఏవల పోలికకు సంబంధించిన వాక్యాలను ఇక్కడ సంగ్రహంగా పొందుపరుస్తూన్నాం. తొలియేవ పాపంలేకుండానే జన్మించింది. కాని ఆ భాగ్యాన్ని ఆమె నిలుపుకోలేదు. రెండవయేవకూడ పాపం లేకుండా జన్మించింది. పాపంలేకుండానే జీవించిందికూడ కనుక ఆమె అవివేకవతి, ఈమె వివేకవతి.

తొలియేవ తాను మరణానికి లొంగివుండేదికాదు. ఆ భాగ్యదశలో ఆదిదంపతులకు చావంటూ లేనేలేదు. కాని తొలియేవ మూరురాలై పాపంచేసి మరణం తెచ్చిపెట్టుకుంది. ఐనా రెండవ యేవ పాపాన్ని ఎదుర్కొని నిలిచింది. మరణాన్ని జయించింది. దేహాత్మలతో మోక్షానికి వెళ్ళింది. కనుక ఆమెకంటె యిూమె ధన్యురాలు.

ఆ తొలితల్లి భౌతికంగా ఆధ్యాత్మికంగా గూడ మనకు మాతగా నియమింపబడింది. కాని యేవ ఆయాధ్యాత్మిక జీవితాన్నికోల్పోయింది. మనకూ దాన్నిఅందించలేకపోయింది. కాని యీ రెండవయేవ మాత్రం మనకు ప్రతిదినం జ్ఞానజీవితాన్ని అందిస్తూనే వుంటుంది. రోజురోజు మనకు వరప్రసాదాలు ఆర్థించి పెడుతూనే వుంటుంది. కనుక ఆ తల్లికంటె ఈ తల్లి మేలైంది. ఆమె మృతులమాత ఈమె జీవవంతులమాత.

ఆ తల్లి అవిధేయతవలన దేవుని యాజ్ఞమీరి తనకూ మనకూ చావు తెచ్చి పెట్టింది. ఈ తల్లి విధేయతవలన దేవుని యాజ్ఞకు బదురాలై తనకూ మనకూగూడ జీవం తెచ్చిపెట్టింది. ఆమె అవిధేయవతి, ఈమె విధేయవతి.

ఆ కన్య తన పాపంద్వారా మనగొంతుకు ఉరిపెట్టి పోయింది. మరోకన్య ఈ వురి విప్పింది. ఆ కన్య పాపాత్మురాలు అనబడుతుంది. ఆ తొలికన్య పాపానికి ఈ మలికన్య పరిహారం చేసింది, ఆ తొలి కన్య తప్పిదం క్షమించమని ఈ మలికన్య దేవునికి మనవిచేసింది. ఆమెకు తగిలిన శాపాన్ని ఈమె తీర్చింది. కనుక ఆమె యిూమెను తన రక్షకిగా భావిస్తుంది.

28 పిశాచం ఆ తొలిస్త్రీని వంచించింది. యేవ మోసపోయింది. ఆమె పిచ్చిదై పిశాచం పలుకులు స్వీకరించింది. హృదయంలో నిల్పుకుంది. తన కడుపులో విషం తాల్చింది. కాని ఈ రెండవ స్త్రీ పిశాచం పలుకులకు మోసపోలేదు. ఈమె గబ్రియేలుదూత పలుకులను స్వీకరించింది. తన హృదయంలో నిల్పుకుంది . తన గర్భంలో జీవాన్ని ధరించింది. ఆ స్త్రీ మనకు విషాన్ని అందించింది. కాని ఈ స్త్రీ అమృతాన్ని ప్రసాదించింది.

నాడు ఆ తోటలో చెట్టుదగ్గర నిలుచుండి సైతానుమాటలకు మోసిపోయింది ఆ తెలివితక్కువ కన్య. మళ్ళా మరో చెట్టదగ్గర, అనగా సిలువ చెంత నిలుచుండి సైతానుని జయించింది ఈ తెలివిగల కన్య. ఆనాడు సైతాను కన్య పాదం కరిచింది. ఈనాడు ఈ కన్య సైతాను తలనే కాలితో నలగడ్రొక్కింది. పిశాచం ఆనాడు తాను పొందిన విజయాన్ని తలచుకొని పొంగిపోయింది. కాని ఈనాడు తాను పొందిన పరాభవానికి క్రుంగిపోయింది. “ఆనాడు ఆ కన్యను మోసగించి నేను పాముకుందిమాత్రం ఏముంది? మెదలకుండా వున్నా బాగుండేదిగదా? అని విచారించింది. పిశాచం దేవుడు ఓడిస్తే ఓర్చుకుంటుందిగాని కేవలం ఓ సృష్టిప్రాణి ఓడిస్తే ఓర్చుకోలేదుగదా! ఐనా మరియమాత ఓడించందే పిశాచం ఓటమి పూర్తి యోటమి కాజాలదు. ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని జయించి ఆనాడు తాను పూర్తిగా నెగ్గింది. మళ్ళా ఒక పురుషుడూ ఒక స్తీ గాని దానికి పూర్తిగా శృంగభంగం జరుగదు.
తొలి ఆదాము పాపంచేసాడు. అతడు నరజాతికి శిరస్సు కావున అతని పాపం మనకూ సంక్రమించింది. కాని ఆ తొలి ఆదాము పాపంలో ఓ స్త్రీకూడ పాల్గొంది. ఏవ మన తలగాదు గనుక ఆమెపాపం తనంతటతాను మనలను నాశంజేసి వుండదు. కాని ఆదాము పాపంతోగూడి ఆమె పాపంగూడ మనకు నాశం దెచ్చిపెట్టింది. ఇక ఒక పురుషుడు ఒక స్త్రీ మనకు నాశం దెచ్చిపెట్టినట్లే, మళ్ళా ఒక స్త్రీ ఒక పురుషుడు మనకు రక్షణం దెచ్చిపెట్టారు. ఏవ మన పతనంలో పాల్గొన్నట్లే మరియ మన ఉద్ధరణంలో పాల్గొంది. మరియ తనంతటతాను మనలను రక్షించి వుండలేదు. ఆమె మన తలగాదు. రక్షకుడేమో క్రీస్తే. కాని క్రీస్తు రక్షణంలో తానూ పాల్గొనడంవల్ల క్రీస్తుతో, క్రీస్తునందు, తానూ మన రక్షకి అని చెప్పబడుతుంది.
నేడుమనం మరియమాతను గౌరవించడంలో ఉద్దేశం యిది. తొలియేవ మన పతనంలో పాల్గొన్నట్లే మలియేవ మన ఉద్ధరణంలో పాల్గొంది. ఆదాము పాపంతో గలిసి తొలియేవ పాపం మనలను నాశంజేసింది. క్రీస్తు పరిహారంతో ఐక్యమై మలియేవ పరిహారం మనలను రక్షించింది. యథార్థంగా పాపియేమో ఆదామొక్కడే, రక్షకుడేమో క్రీస్తు ఒక్కడే కాని అతనితోను ఇతనితోను ఓ స్త్రీని జోడించడం దేవునిచిత్తమైంది. రక్షణగాథలో ఆయేవా 

ఈయేవా చారిత్రకంగా నిలిచిపోయారు. ఈ యిద్దరు స్త్రీలు నిర్వహించిన పాత్రలను మరచిపోలేం. ఆమె పతనాన్నీ ఈమె ఉద్ధరణాన్నీ స్మరింపక తప్పదు. ఈ స్మరణమే మరియమాత పట్ల భక్తినీ గౌరవాన్నీ కలిగిస్తుంది. ఆ తల్లి పట్ల మనం చూపే భక్తి క్రీస్తుకి అప్రియం గలిగించదు. ఆ తల్లిని గౌరవించినపుడు ఆ కుమారునే గౌరవిస్తున్నాం. ఆ తల్లిని అనాదరం చేసినపుడు ఆ కుమారునే అనాదరం చేసినట్లు.

9. ధీరనారి మరియ

క్రీస్తు తర్వాత మరియమాత అంతటి వ్యక్తిలేదు. ఆమె రక్షకుని మాత, మోక్షానికి రాజ్ఞి తిరుసభకు తల్లి. మన క్యాతలిక్ సమాజంలో స్త్రీలూ, మఠ కన్యలూ మరియను ఆదర్శంగా పెట్టుకొని తమ వ్యక్తిత్వాన్ని పెంపొందిచుకొంటుంటారు. కనుక మరియ ప్రాముఖ్యం అన్ని విధాల గణనీయమైంది. ప్రాచీన వేదశాస్తులు మరియను గూర్చి సంప్రదాయ పద్ధతిలో మాట్లాడుతూ వచ్చారు. ఆమె కోమల హృదయ. నిష్ర్కియాశీల. దేవుని వరప్రసాదాన్ని స్వీకరించడం మాత్రమే ఆమె చేసిన పని. ఇంకా ఆమె వినయవతి. దేవుని చిత్తప్రకారం జీవించిన భక్తురాలు, సహనశీల. బాధామయురాలు. విశుదురాలు, నిత్యకన్య ప్రార్థనామయి. కరుణాపూరిత. పూర్వరచయితలు మరియను చిత్రించిన తీరు ఇది.

పేదసాదలూ, విశేషంగా స్త్రీలు మరియను ఆదర్శంగా బెట్టుకొని ఓర్పుతో జీవించాలి అన్నారు. ప్రత్యేకించి కాన్వెంటు నాలుగోడలు దాటి వెలుపలికి వెళ్లకుండా సాంఘిక బాధ్యతలు ఏవీ లేకుండా జీవించే మఠకన్యలకు ఆమె ఆదర్శం అని చెప్పారు. ఆమె వినయవిధేయతలూ కన్యాత్వమూ వారికి ప్రేరణం కలిగిస్తాయి అనుకొన్నారు. సిస్టర్లు మరియకు ప్రార్థన చేసి తమ అవసరాల్లో ఆమె నుండి సహాయంపొందాలని కోరారు. మనం చిన్ననాటి నుండి మరియను గూర్చిన ఈలాంటి భావాలకు అలవాటు పడిపోయాం.

కాని నేటి క్రైస్తవవేదాంతులు మరియను ఇలా చిత్రించడంలేదు. వీరి దృష్టిలో మరియ సామాజికబాధ్యతల నెరిగినవ్యక్తి సంఘజీవి. పేదలను ఆదుకొన్నకరుణామయి. ఎన్నో సమస్యల నెదుర్కొని వాటితో నిబ్బరంగా పోరాడిన ధీరవనిత. క్రియాశీల. దేవుని చిత్తానికి కట్టుపడివున్నా తన స్వేచ్చను ఈ క్రింది విధాలుగా సద్వినియోగం చేసికొన్న ఆదర్శ మహిళ.

1. యువతిగా మరియ:

దేవదూత మరియకు మంగళవార్త చెప్పాడు. ఆమె గర్భం ధరించింది. కాని ఆ సంగతిని యోసేపుకి తెలియజేయడం ఎలా? యూదుల సంప్రదాయం ప్రకారం పెండ్లికాకుండానే చూలాలైన యువతిని రాళ్లతో కొట్టి చంపుతారు. కనుక ఆమె యెంతో ఆందోళనకు గురైయుండాలి. ఆమె మంగళవార్తను గూర్చి విన్న యోసేపు కూడ ఆశ్చర్యచకితుడై యుండాలి. ఇంకా మెస్సీయా బాధలనుభవిస్తాడని మరియకు కొంతవరకైనా తెలుసు. ఆలాంటి బాధామయ సేవకునికి తను తల్లికావాలి. ఐనా ఆమె దేవదూతతో నీమాట చొప్పననే నాకు జరుగునుగాక అని ధైర్యంగా పలికింది, మరియు పిరికిది కాదు, సాహసవంతురాలు.

2. ఎలిసబేతును సందర్శించడం :

మరియ తన బంధువైన యెలిసబేతుకు పురుడుపోయడానికి పోయింది. ఈ సందర్భంలో ఆమె మహిమగీతం ఆలాపించింది. ఈ పాట బయటికి చూడ్డానికి భక్తి మంతంగానే వుంటుంది. కాని యిది గొప్ప విప్లవ గీతం. దీనిలో సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మత పరంగాగూడ గొప్ప విప్లవభావాలున్నాయి. ధనవంతులు దైవరాజ్యాన్ని కోల్పోతారు. అది పీడితులకు దక్కుతుంది. పవిత్రుడూ, శక్తిమంతుడూ, కరుణామయుడూ ఐన ప్రభువే దాన్ని పీడితుల పరంజేస్తాడు. దీనులు విజయాన్ని చేపడతారు. అహంకారులు మన్నుగరుస్తారు. ఈలాంటి పాటను విన్పించిన వ్యక్తి గుండెల్లో ఎన్ని తిరుగుబాటు భావాలున్నాయో ఊహించవచ్చు మరియ మన మనుకొన్నట్లుగా వట్టి తీయని తల్లీ, లోకం పోకడలెరుగని భక్తురాలూ కాదు.

3. ఎలప్రాయపు తల్లి :

నిండు చూలాలైన మరియ 90 మైళ్లు నడచి బేల్లెహేము చేరుకొంది. కనుక ఆమె మనం మామూలుగా దేవమాత చిత్రాల్లో చూచే సుకుమారి కాదు. దేహదారుఢ్యం గల మహిళ. బేత్తెహేములో ధనవంతులు మరియా యోసేపలకు ఆశ్రయం నిరాకరించారు. కనుక ఆమె వ్యధకు గురైంది. నేడు మురికి వాడల్లో నివసించే పేదవారిలాంటిదైంది. సమాజం అనాధరణకు గురైంది. జంతువులూ పామరులైన గొర్రెల కాపరులూ ఆమెకు సహచరులయ్యారు. ఈ పట్టున ప్రాచీన రచయితలు ఆమె శిశువును కన్నాక గూడ కన్యాత్వాన్నికోల్పోలేదని వ్రాసారు. వారికి ఆమె కన్యాత్వం ముఖ్యం. కాని నేటి రచయితలు ఆమె కటిక పేదల అగచాట్లకు గురైందని చెప్తున్నారు.

4. శిశువను కానుక పెట్టడం :

మరియా యోసేపులు బాలయేసుని దేవాలయంలో కానుకగా అర్పించారు. ఆ సమయంలోనే వృద్దుడైన సిమియోను వచ్చి ఈ శిశువు అనేకులపతనానికీ ఉద్ధరణానికీ కారకుడౌతాడు. ఓ ఖడ్గం నీ హృదయాన్ని గూడ దూసుకొని పోతుందని మరియతో చెప్పాడు. పూర్వరచయితలు ఇక్కడ మరియ మోషే ధర్మశాస్తానికి విధేయురాలు కావడం గొప్ప అని చెప్పారు. కాని ఆధునికులు ఇక్కడ తల్లిగా మరియ అనుభవించిన బాధలు ముఖ్యమని చెప్తున్నారు. బాధ్యత నెరిగిన వ్యక్తిగా ఆమె కుమారునితో పాటు తానూ భావికాలంలో రాబోయే శ్రమలను అనుభవించడానికి సంసిద్ధమైంది.

5. ఈజిప్టుకు పారిపోవడం :

తిరుకుటుంబం రాజకీయంగా దేశబహిష్కృతమైంది. ఇప్పడు కూడ పాలస్తీనానుండి ఈజిప్టుకు మట్టిరోడ్డువెంట ప్రయాణం చేయడం చాలకష్టం. మరియ భద్రంగా గట్టిన కాన్వెంటు గోడల మధ్య వసించలేదు. ఎండవానలకూ శీతోష్ణాలకూ గురైంది. ఆనాటి క్రూరరాజకీయాలకు చిక్కినలిగిపోయింది. మరియా యోసేపలు పూర్వపు యిప్రాయేలీయుల్లాగే కాందిశీకులుగా, పేదలుగా ఈజిప్టుకు వెళ్లారు. అక్కడ బానిస బ్రతుకులు ఈడ్చారు. ఇక్కడ బేల్లెహేములో క్రీస్తుశిశువు తప్పించుకొనిపోయాడని ఆగ్రహించి హెరోదు నిరపరాధులైన శిశువులను మట్టపెట్టించాడు. బలవంతులు దుర్భలులైన పేదలకు చేసే అన్యాయాలకు మరియ పరితపించి కన్నీరు కార్చింది.

6. దేవాలయ సందర్శనం :

క్రీస్తుకు 12 ఏండ్ల యిూడొచ్చినపుడు మరియా యోసేపులు యెరుషలేము పాస్మోత్సవానికి వెళ్లారు. ఆ సమయంలో క్రీస్తు బాలుడు నేను తండ్రి పనిలో నిమగ్నుడ్డికావద్దా అన్నాడు. ఆ మాటలు తల్లికి అర్థం కాలేదు. ఆమెకు క్రీస్తు భవిష్యత్తును గూర్చి స్పష్టంగా తెలియదు. దేవుని మీద భారంవేసి తనకు అంతుబట్టని సంగతులను విశ్వాసంతో నమ్ముతూ వచ్చింది. చీకటిలో తడవుకొంటూ నడచింది. ఈ సంఘటనం తర్వాత కొన్నాళ్లకు యోసేపు చనిపోయి వుండాలి. ఇక కుటుంబం ఆలనాపాలనా అంతా ఆమె నెత్తిన పడింది. కనుక మరియను పవిత్ర కన్యనుగా కంటె కాయకష్టం చేసికొని బ్రతికిన గృహిణినిగా గణించడం మెరుగు.

7. క్రీస్తు బహిరంగ జీవితం :

ప్రభువు తల్లిని వీడి బహిరంగ జీవితం ప్రారంభించాడు. యెరూషలేములోని మతాధికారులు క్రీస్తుకు వ్యతిరేకులయ్యారు. అతడు కూడ యూదుల విశ్రాంతి దినం,ధర్మశాస్త్ర నియమాలు మొదలైన వాటిని నిరసిస్తున్నాడు. పేదలు సుంకరులు మొదలైన అట్టడుగువర్గంవాళ్ల కోపు తీసికొంటున్నాడు. మరియ కలత చెందింది. కుమారుని భావాలు ఆలోచనలు ఆమెకు సరిగా అర్థంకాలేదు. ఐనా విశ్వాసంతో దేవుణ్ణి నమ్మింది. క్రీస్తు ఆదరించే పేదల పట్ల తానూ ఇష్టం పెంచుకొంది.

యేసుకి 30 ఏండ్లు. మరియ 50 ఏండ్ల వితంతువు. కానాపూరి వివాహంలో ఆమె కుమారునడిగి బంధువులకు ద్రాక్షరసం సరఫరా చేయించింది. కొందరు నరులు క్రీస్తుని ఎడబాయని అనుచరులయ్యారు. కొన్ని సార్లు ఆమె కూడ కుమారుని అనుసరించింది. యెరూషలేములోని రాజకీయ నాయకులు మతాధికారులు మాత్రం క్రీస్తును తీవ్రంగా ఎదిరిస్తున్నారు. మరియ భయపడింది. రాజకీయ ప్రాబల్యానికి వెరచింది. అధికారుల బలానికి దడిసింది. ఆమె మన మనుకొన్నట్లుగా కేవలం కోమల హృదయ, మృదుస్వభావ, మననశీల మాత్రమేకాదు. ధీరవనిత. ఆనాటి రాజకీయాల్లో ఆమెకు ప్రవేశముంది. వాటి తాకిడికి గురైంది కూడ.

8. క్రీస్తుకి తీర్పు :

మరియ క్రీస్తుకి జరిగిన తీర్పును, అతడనుభవించిన హింసలనూ కండ్లార చూచి వుంటుంది. సిలువ మార్గంలో ఆమె కుమారునికి ఎదురుపడింది. శిష్యులు ప్రభువును విడచి పారిపోయినా ఆమె అలా చేయలేదు.

9. సిలువ క్రింద :

క్రీస్తు చనిపోయేపుడు మరియ సిలువ క్రింద నిలచివుంది. కుమారుని శ్రమలు కండ్లారా చూస్తూగూడ అతనికి సహాయం చేయలేక దుఃఖించింది. విశేషంగా తన కుమారుడు అపజయం పొంది మరణించినందులకు ఎంతో బాధపడింది. ఐనా ఆమె వేదనలు మానసికమైనవే గాని శారీరకమైనవి కావు. శత్రువులు ఆమెను ఎగతాళి చేసి యేడ్పించి వుంటారు. ఆమె నిబ్బరంగా సహించి ఊరకుంది. క్రీస్తు ఆమెను యోహానుకి తల్లిగాను, యోహానుని ఆమెకు కుమారునిగాను అర్పించాడు. కుమారుని మరణానంతరం ఆమె వయసుమళ్లిన మహిళగా కొన్ని యేండ్ల పాటు జీవించివుంటుంది. ఆ కాలంలో ఒంటరితనం వల్ల క్రుంగిపోయి వుంటుంది.

10. చివరిదాకా విశ్వాసాన్ని నిల్పుకొంది :

శిష్యులు పారిపోయినా మరియ క్రీస్తును విడచి పారిపోలేదు. కుమారునిమరణం వరకు అతనికి అంటిపెట్టుకొని వుంది. క్రీస్తు చర్యలు తనకు అర్థంగాక పోయినా అతన్ని విశ్వసిస్తూవచ్చింది, క్రీస్తు దాటిపోయిన తర్వాత అతని వుద్యమాన్ని బలపరచింది. శిష్యులకు తల్లియై క్రీస్తులేని లోటు తీర్చింది, తన పాలబడిన బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వహించింది. క్రీస్తు జీవితకాలమంతా అతనిపట్ల, క్రీస్తు మరణానంతరం అతని అనుచరుల పట్లను అంకితభావంతో మెలిగింది.

11.ఉత్థాపితమాతయైన మరియ ఈనాడు మనకు స్ఫూర్తినిస్తుంది :

- ــــــــــــ

క్రీస్తులాగే మరియ కూడ నరులదేహాత్మల పరిపూర్ణ విమోచనం కొరకు కృషి చేసింది. మరియను జూచి నేటి మన స్త్రీలు కూడ పరిపూర్ణ విమోచనం కొరకు కంకణం కట్టుకోవాలి. మన దేశంలో, ప్రపంచమంతటా గూడాను, స్త్రీలకు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. మహిళలు మరియ నుండి ప్రేరణం పొంది ఈ యన్యాయాలను ధైర్యంతో ఎదిరించాలి. వాళ్లు వట్టినే పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఆమెకు ప్రార్థనలు చేస్తేనే చాలదు.

చాలా మంది సిస్టర్ల వాళ్ల పేరుకిముందు మరియ పేరుగూడ చేర్చుకొంటారు. మంచిదే. కాని సిస్టర్లు మరియలాగ బాధ్యతాయుతంగా మెలగాలి. దుష్టశక్తులనుండి తమ్ముతామూ, తోడి స్త్రీజాతినీ కూడ విమోచించుకోవాలి. మరియ కన్యాత్వం మాత్రమేగాక ఆమె సామాజిక స్పురణ, ధైర్యము కూడ వారికి ఆదర్శం కావాలి.

మామూలుగా మరియమాత పట్ల మనకందరికీ భక్తివుంటుంది. కాని ఈ సంప్రదాయభక్తి చాలదు. మరియ ఆనాటి విమోచనోద్యమంలో పాల్గొంది. ఆనాటి ఘరానా అధికారుల నెదిరించి పీడితులైన దీనప్రజల కోప తీసికొంది. ఆనాటి పరపీడనం నేడూ లోకంలో కొనసాగుతూనేవుంది. కనుక మరియను ఆదర్శంగా పెట్టుకొని మనం కూడ అన్యాయాలు నెదిరించి పోరాడాలి. అందరికీ న్యాయం జరిగి సమసమాజం ఏర్పడేలా చూడాలి. మన తరపున మనం ఎవరికీ అన్యాయం తలపెట్టకూడదు. ధీరత్వం, క్రియా పరత్వం, అంకితభావం గల మరియమాతను చూచి నేటిలోకంలో మనం కూడ ఆ దొడ్డగుణాలను అలవర్చుకోవాలి.

10. మరియమాతపట్ల భక్తి

పరలోకపిత ఆనాదినుండి మనలను రక్షించాలని సంకల్పించుకున్నపుడే క్రీస్తుతోపాటు మరియనుగూడ ఎన్నుకున్నాడు. ఆమె క్రీస్తుతో సహకరించి మన రక్షణంలో పాల్గొంది. రక్షణమాత ఐంది. నేడు మోక్షంలో వుండి మనకు అన్ని వరప్రసాదాలూ

34 సంపాదించి పెడుతుంది. మన తరఫున క్రీస్తును మనవి చేస్తుంటుంది. ఆ ప్రభువు మళ్ళా రెండవమారు విజయం జేయకముందు విశ్వాసులంతా ఆమెపట్ల భక్తి చూపుతారని చాలమంది పునీతులు అభిప్రాయపడ్డారు.

దేవుడే ఆమెను ఎన్నుకొని మన రక్షణమాతనుగా నియమించాడు. కనుక మనమూ ఆమెను ఎన్నుకొని గౌరవించాలి. ప్రభువు ఆమెద్వారా మనచెంతకు వచ్చాడు. మనమూ ఆమెద్వారాగాని తన్ను జేరలేమని నేర్పాడు . అంచేత మనం ఆ తల్లిపట్ల భక్తి చూపుతూండాలి.

క్రైస్తవ ప్రజలు మరియమాతపట్ల చూపే భక్తి క్రియలు చాలావున్నాయి. ఆమె పండుగలు చేసికొనవచ్చు. నిష్కళంకోద్భవమూ, ఉత్థాపనమూ ఈ పండుగల్లో ముఖ్యమైనవి. శనివారాలను భక్తిపూర్వకంగా ఆమెకు సమర్పించవచ్చు.

మనలనూ మన రోజువారి పనులనూ ఆ తల్లికీ ఆమె ద్వారా క్రీస్తుకీ అర్పించుకోవచ్చు. పాపం కట్టుకోకుండా వుండేలా సాయపడమని ఆ తల్లిని అడుగుకోవచ్చు.

మరియమాత ఉత్తరీయం ఒకటుంది. 1251లో ఆమె సైమన్ స్టోక్ అనే ఆంగ్లభక్తునికి దర్శనమిచ్చి తన ఉత్తరీయాన్ని ధరించేవాళ్ళు నరకానికి పోరని మాటయిచ్చింది. ఈ యుత్తరీయంతోపాటు ఆమె స్వరూపాలు ధరించడమూ, ఆమె చిత్రాలూ ప్రతిమలూ ఇండ్లల్లో పెట్టుకొని పూజించడమూ సనాతన క్రైస్తవాచారం. మరియమాత ప్రతిమకు చూపిన గౌరవం ఆ బొమ్మకు గాదు, మరియకు చెందుతుంది. గతించి పోయిన మన తాతగారి ఫోటోకు చూపిన గౌరవం ఆయనకే చెందుతుంది గదా!

మరియను గౌరవించే సభలు కొన్ని వున్నాయి. సొడాలిటీ, లీజను వీటిల్లో ముఖ్యమైనవి. ఈ సభల్లో చేరి ఆ తల్లిని నుతించవచ్చు.

మరియమాత పేర చెప్పే జపాలూ చాలా వున్నాయి. మరియు నామం, దేవవరప్రసాద జపం, త్రికాలజపం, నవీనా జపాలూ, దేవమాత ప్రార్థన, కృపారస మంత్రం, మిక్కిలి నెనరుగల తల్లి అనే జపం, జపమాల, దేవమాత ఆఫీసు, దేవమాత కీర్తనలు మొదలైనవి భక్తిరసభరితమైన ప్రార్థనలు.

పై జపాల్లో రెండు చాల ముఖ్యమైనవి. అవి మరియ నామం, జపమాల. మరియనామం పవిత్రనామం. ఆ నామం తన్నుచ్చరించే వాళ్ళను పవిత్రపరుస్తుంది. పిశాచాన్ని పారద్రోలి రక్షణను సంపాదించి పెడుతుంది. దేవమాత ప్రార్థనలన్నిటిలో జపమాల శ్రేష్టమైంది. క్రీస్తు మరియల జీవిత ఘట్టాలను ధ్యానం జేసికొంటూ జపమాలను చెప్పినట్లయితే చాలా ఫలితం పొందవచ్చు.

క్రీస్తు సాన్నిధ్యంలాగే మరియ సాన్నిధ్యం అనేది కూడ ఒకటుంది. భక్తులు చాలమంది ఆ తల్లి సాన్నిధ్యాన్ని స్మరించుకొన్నారు. ఆమె వాళ్ళ విశ్వాస నేత్రాలకు ప్రత్యక్షమౌతుంటుంది. వాళ్ళను తన పచ్చడం క్రింద కాచికాపాడుతూంటుంది. రోజురోజు మరియ మనకు చేసే సహాయమే, మనకిచ్చే రక్షణమే ఆమె సాన్నిధ్యానికి నిదర్శనం. కనుక మరియ తాను జీవించినపుడు ఆనాటి స్త్రీ పురుషులతో ఏలా తిరుగాడిందో ఈనాడు తన భక్తులతోను అలా తిరుగుగాడుతూంటుంది. ఆ పునీత హృదయ సాన్నిధ్యాన్ని మననం చేసికొంటూ పాపాన్ని జయించవచ్చు. దివ్యజీవితం జీవించవచ్చు.

మరియకు అంకితమైన గుళ్ళకు వెళ్ళి ఆమెను కొనియాడ్డం కూడ ఓ భక్తిమార్గం. ఆ తల్లి పేర ప్రదక్షిణలు జరుపవచ్చు. ఆమె దర్శనమిచ్చిన పుణ్యక్షేత్రాలు దర్శించవచ్చు. స్మరించవచ్చు. ఈ సందర్భములో విశేషంగా లూర్ధుమాతగుహను పేర్కొనాలి. ఫ్రాన్సునందలి లూర్ధునగర గుహను సందర్శించలేకపోయినా, మన వూళ్ళలో నమూనాగా కట్టుకునే లూర్ధుగుహ యెదుట భక్తిని ప్రదర్శించవచ్చు. మన వూరి గుహ యెదుటనే నిలుచుండి ఆనాడు మరియ బెర్నెదత్తుకిచ్చిన దర్శనాన్నిస్మరించుకొని మన పాపాలకు పశ్చాత్తాపపడి, మన అవసరాలను ఆ తల్లికి విన్నవించుకోవచ్చు.

మరియమాతనుగూర్చిన బైబులు వాక్యాలను చదువుకొని మననంజేసికొంటూ ప్రార్థించుకోవడంగూడ.ఓ చక్కని భక్తిమార్గం. మరియు తాను స్వయంగా మననశీల - లూకా 2,18. సువిశేషకారులు ఆమెను పరమ పవిత్రమూర్తినిగా చిత్రించారు. మరియను ప్రస్తావించే సువిశేష వాక్యాలను ధ్యానించుకొనేవాళ్ళ హృదయం అనతికాలంలోనే భక్తి భావంతో నిండిపోతుంది.

మంచిమరణం దయచేయమనిగూడ మనం ఆ తల్లిని వేడుకొంటూండాలి. ఆమె మన రక్షణాన్ని కోరుకొంటుంది. కనుక ఈ భాగ్యాన్ని తప్పక ప్రసాదిస్తుంది. మంగళవార్త జపం రెండవభాగంలో శ్రీసభ ఈ మనవి చేర్చింది.

వేదశాస్త్రజ్ఞలు చాలామంది "మరియమాత భక్తులు నరకానికి పోరు, తప్పకుండ రక్షణం పొందుతారు" అని నుడివారు. అల్ఫోన్సస్ లిగొరి అనే భక్తుడు తాను వ్రాసిన మరియమాత మహిమలు అనే ఉద్ర్గంథాన్ని "మరియమాత భక్తులకు చేటులేదు" అంటూ ముగించాడు. ఈలాంటే, మనం పాపజీవితం జీవించినా మరియ మనలను అద్భుతంగా మోక్షానికి తీసికొని వెళ్తుందని భావం గాదు. ఆమె తన భక్తులు పాపపు బురదలో అడుగు పెట్టకుండా వుండేలా తోడ్పడుతుంది. ఒకవేళ బలహీనతవల్ల పాపంలో కూలిపోయినటైతే, వాళ్ళకు పశ్చాత్తాపం పట్టించి ఆ బురదలోనుండి వెలుపలకు లాగుతుంది. వాళ్ళకు మంచి మరణం అనుగ్రహిస్తుంది. ఈ సత్యం మనకెంతైనా సంతోషాన్నీ ఉత్సాహాన్నీ కలిగించాలి. తల్లిలేని పిల్లలు దిక్మూమొక్కూలేక బావురు మంటూంటారు. తల్లిగల పిల్లలకు అన్ని హంగులూ అమరుతాయి. మరియమాతను తల్లిగా అంగీకరించి ఆమెపట్ల భక్తిభావంతో చరించేవాళ్ళ భాగ్యం అంతింతగాదు. ఆమెను తల్లిగా అగీకరించనివాళ్ళ దౌర్భాగ్యమూ అంతింతగాదు.

ఇక, మరియమాతపట్ల చూపే భక్తిక్రియలన్నిటిలోను హృదయం ప్రధానం. అనగా నిండు హృదయంతో ఆ తల్లిని పూజించాలి. ఈలా పూజించాలంటే మన రక్షణ చరిత్రలో ఆమె నిర్వహించిన పాత్రను చక్కగా అర్థంచేసికొనివుండాలి. ఆమె దేవమాత, సహరక్షకి. ఈ రెండు బిరుదాలను అర్థంజేసికున్నవాళ్ళ ఆమె స్థానమేంటో వెంటనే గ్రహిస్తారు. "హృదయంలో భక్తి లేకుండా బయటకు మాత్రమే భక్తిక్రియలు చూపెడుతుంటే అవి కేవలం మూధాచారాలే ఔతాయి. ఈ సందర్భంలో "భక్తి గలుగుకూడు పట్టెడైనచాలు" అనే వేమనవాక్యం స్మరింపదగ్గది.

ఇంకో విషయంగూడ. మనం దేవుణ్ణి పూజిస్తాం, ఆరాధిస్తాం. సృష్టి ప్రాణులైన పునీతులు దేవదూతలు మొదలైన వాళ్ళను ఆరాధించం, పూజిస్తాం. ఇక మరియమాతను పునీతుల కంటె అధికంగా పూజిస్తాం. కాని ఓ దేవుణ్ణి ఆరాధించినట్లు ఆరాధించం.

మరియను పూజించడంలో ప్రధానోద్దేశం, దేవుడు ఆమెకు అనుగ్రహించిన భాగ్యాలను స్తుతించడమే. ఆమె అంది "ఇకమీదట సకల తరాలవాళ్ళ నన్నుధన్యురాలినిగా భావిస్తారు. ఎందుకంటే దేవుడు నాకు మహత్తర కార్యాలు చేసాడు" అని. ఆలాగా దేవుని మహత్తర భాగ్యాలను పొందిన తల్లిని మనం స్తుతించవద్దా? ఆమె ధన్యురాలని ఎలుగెత్తి చాటవద్దా? మరియను పూజించడమంటే దేవుణ్ణి అతని క్రీస్తుని ఆరాధించడమే. ఓ పునీతురాలియందు ప్రతిఫలించిన ఆ ప్రభువు వరాలను కొనియాడ్డమే. అసలు పునీతులందుకూడ దేవుణ్ణి మహిమ పరుస్తుంటాంగదా? మరియకు భక్తి చూపే వాళ్ళు ఆ తల్లి పట్ల బిడ్డల్లాగ ప్రవర్తిస్తున్నారని రుజువు చేసికొంటారు. మరియ భక్తి యథార్థ క్రైస్తవ జీవితానికి కొలకర్ర, జీవగర్ర.

11. ఆదర్శ మాత

పూర్వాధ్యాయంలో మరియమాతపట్ల చూపవలసిన భక్తిని గూర్చి ముచ్చటించాం. మరియ క్రైస్తవులకు ఆదర్శంగా వుంటుంది. క్రైస్తవ సమాజంలోని గురువులూ మఠకన్యలూ గృహస్థులూ ఆమెను ఆదర్శంగా బెట్టుకుని జీవిస్తుంటారు. అదేలాగో మూడంశాల్లో పరిశీలించి చూద్దాం.

1. మరియ గురువులకు ఆదర్శం

మరియ గురువుల మాత. ఆమె గురుపట్టమనే దేవద్రవ్యానుమానం పొందలేదు. ఆ తల్లి గురుత్వం విశ్వాసుల గురుత్వానికి చెందింది. ఆ పునీతురాలు క్రీస్తు గురువుని కని పెంచి పెద్దజేసింది. అతనికి విద్యాబుద్ధులూ దైవభక్తీ నేర్పింది. పరలోకంలోని తండ్రిని ఏలా ఆరాధించాలో బోధించింది. ఆలాగే మరియ గురువులకుకూడ మాతయై వాళ్ళకుకూడ విద్యాబుద్ధులూ దైవభక్తీ దైవారాధన నేర్పుతుంది. క్రీస్తు గురువునకు తల్లియైన మరియ ఆ ప్రధాన గురువుని అనుసరించే మానుష గురువులకుగూడ గారాబు తల్లి,

           గొర్రెపిల్లను బలికి సిద్ధంజేసినట్లుగా మరియ క్రీస్తుని సిలువయాగానికి సిద్ధంజేసింది. కడన ఆ బలిమూర్తిని కల్వరి కొండమీద తండ్రికి సమర్పించింది. అంతమాత్రమే గాదు, క్రీస్తుతోపాటు తాను బలిమూర్తి అయింది. క్రీస్తుతో పాటు తన్నుతాను పరలోకపితకు సమర్పణం చేసికొంది. ఈ సమర్పణ కార్యంలో ఆమె గురువుకి తోడ్పడుతుంది. ఆమె గురువు హృదయంలో భక్తిభావాలు పుట్టించి అతడు యోగ్యంగా తన్ను తాను దేవునికి నివేదించుకొనేలా చేస్తుంది.
          క్రీస్తు జననానికి మరియ భక్తిభావంతో తయారైంది. ఆ ప్రభుని ఆమె మనసార నమ్మింది. అందుకే ఎలిసబేత్తుకూడ "ప్రభువు పలుకులు విశ్వసించిన నీవు చాల ధన్యురాలవు" అని మరియను పొగిడింది. గురువుకూడ పీఠంమీద క్రీస్తు జన్మించేలా చేసేవాడు. అంచేత అతనికి గూడ మరియకున్న విశ్వాసమూ భక్తీ వుండాలి. మరియ తన వేడుకోలుద్వారా గురువు విశ్వాసుల హృదయాల్లో క్రీస్తుని పుట్టించేలా చేస్తుంది.
        మరియు గొప్ప ప్రేషితురాలు. ఆమె పన్నెండు మంది ప్రేషితుల్లో ఒకతెగాదు, కాని ఆమె వస్తుతః ప్రేషితురాలు. ప్రేషితుల రాజ్ఞికూడ. ఆమె సాధించిన గొప్ప ప్రేషితకార్యం లోకానికి క్రీస్తుజ్యోతిని ప్రసాదించడం. అనగా క్రీస్తుని కనడం. తాను కన్న క్రీస్తుని ఆ విశ్వజనని రకరకాలరూపాల్లో ఆనాటి ప్రజలకు అందించింది. ఈ నాడుకూడ ఆ విజ్ఞాపనమాత మోక్షంనుండి విశ్వాసులకోసం ప్రార్ధనచేస్తూ వాళ్ళకు క్రీస్తుని అందిస్తూనే వుంటుంది. ఇక, గురువుకూడ మరియలాగే క్రీస్తుని విశ్వాసులకు అందించేవాడు. గురువు మొదట క్రీస్తుని తాను పొందేలా, అటుతరువాత తానుపొందిన క్రీస్తుని విశ్వాసులకు అందించేలా తోడ్పడుతుంది మరియ.

2. మరియ మఠకన్యలకు ఆదర్శం

                నరుడు నిర్దోషంగాను పవిత్రంగాను జీవించాలని భగవంతుని కోరిక. ప్రభువు కోరుకొన్నట్లుగా నిర్మలజీవితం జీవించిన పునీతురాలు మరియ. ఆమె యేనాడూ పాపపు బురదలో అడుగు పెట్టలేదు. మానవమాత్రుల్లో యింత నిర్మలంగా జీవించిన వ్యక్తి మరెవ్వరూ లేరు. అందుచేత మరియు ప్రభువుకి సర్వవిధాలా ప్రియపడింది. ఇక, మఠకన్యగూడ శరీరాన్నీ హృదయాన్నీ ప్రభువకే అంకితం జేసికొని ప్రభు సంబంధమైన
                                                         38 

కార్యాల్లో నిమగ్నం కావాలి - 1కొ 7,34. పవిత్రజీవితం జీవించాలి. ఈలా నిర్మల జీవితం జీవించడంలో నిర్మలమాతయైన మరియు ఆమెకు తోడ్పడుతుంది. మరియు కేవలం మనకు ఆదర్శమూర్తి మాత్రమే గాదు, ఓ సజీవవ్యక్తి గూడ. కనుక ఆమె తన బిడ్డలమైన మనకు వరప్రసాదాలను ఆర్జించిపెడుతూ అన్ని విధాలా సాయపడుతూంటుంది.

                 పూర్వవేదకాలంలో "హనవిం” లేక "దీనులు" అనే భక్తులు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రభువుమీద ఆధారపడి జీవిస్తూండేవాళ్ళు. తరచుగా పేదజీవితం జీవిస్తూండేవాళ్ళు. బాధలకు గురౌతూండేవాళ్ళుగూడ. నూత్న వేదంలో మరియు ఈ దీనుల కోవకు చెందిన భక్తురాలు. అందుకే ఆమె మహిమ గీతికలో "ప్రభువు నా దీనత్వాన్ని కటాక్షించాడు" అని చెప్పుకొంది — లూకా 1, 48. తాను పూర్తిగా ఆ ప్రభువు మీద ఆధారపడి జీవించింది. ఈమె గొప్పతనమంతా ప్రభువు పెట్టిన భిక్ష కావుననే ఆ పునీతురాలు సర్వశక్తిమంతుడు నాయెడల గొప్ప కార్యాలు చేసాడు అని పలికింది - లూకా 1,49. ఈ మరియలాగే మఠకన్యగూడ "దీనురాలు". ఆమె ప్రభువమీద ఆధారపడి జీవిస్తూండాలి. తనకు సిద్ధించే కష్టాలనూ అపార్థాలనూ వినయంతో సహిస్తూండాలి. మరియనుజూచి, మరియు సహాయంతో, తానూ ఈ దీనత్వాన్ని అలవరచుకోవాలి.
                 మరియు ఇప్పటి మఠకన్యల్లాగ మూడు ప్రతాలు చేపట్టలేదు. ఐనా ఆమె మూడు వ్రతాలను వస్తుతః పాటించింది. "నీ మాట చొప్పననే నాకు జరగాలి” అన్న వాక్యం ఆమె విధేయతకు నిదర్శనం. ప్రభువుకోసం ఆమె కన్యగా, పేదరాలుగా జీవించింది. ఈనాడు మఠజీవితంలో ప్రధానాంశం మూడు వ్రతాలనూ పాటించడం. ఈ జీవితం చాల కష్టమైంది. ప్రత్యేకమైన దైవానుగ్రహంలేందే ఈ ప్రయత్నంలో నెగ్గలేం. ఈ ప్రతజీవితంలో మరియ మఠకన్యకు ఆదర్శంగా వుంటుంది.

3. మరియ గృహస్థులకు ఆదర్శం

                 మరియు అంగీవేసికొని మఠజీవితం జీవించలేదు. బోలెడన్ని గొడవలతోగూడిన సంసారజీవితం జీవించింది. సంసార జీవితంలో మొదటి విషయం, భార్యాభర్తలు అనురాగంతోను ఒద్దికగాను జీవిసూండడం.

మరియా యోసేపులు అలా జీవించారు. మరియు ఆత్మశక్తివలన అద్భుతంగా గర్భవతి అయింది. ఈ రహస్యం మొదట యోసేపుకి తెలియదు. కనుక అతడు ఈ సంగతంతా విని బాధపడ్డాడు. కాని ఆమెపట్లమాత్రం కటువుగా ప్రవర్తించలేదు. మరియను రద్దిజేయకుండా పరిత్యాగ పత్రికనిచ్చి రహస్యంగా విడనాడదామనుకొన్నాడు - అంతే. మత్త 1,19. అనగా ఆమె పట్ల అతనికి ఎంతో గౌరవముండేది. ఆమె యోగ్యురాలనే అతని భావం. అలాగే మరియకూడ యెసేపని

                                                  39 

గౌరవాదరాలతో చూచేది. బాలయేసు కన్పించకుండాబోయి మళ్లా దేవాలయంలో కంటపడ్డప్పడు ఆమె "బాబూ! నీవెక్కడున్నావు? మీనాన్న నేను పుట్టెడు దుఃఖముతో నీకోసం వెదకుతున్నాం గదా!" అంది -లూకా 2,48. ఈ వాక్యాన్నిబట్టే ఆమెకు భర్తపట్ల వున్న గౌరవం వెల్లడి ఔతుంది. కుటుంబజీవితంలో ఆలుమగలు ప్రేమభావంతోను పరస్పర గౌరవంతోను జీవించడానికి మరియ ఆదర్శంగా వుంటుంది. తాను గృహస్థప్రజలకు s వరప్రసాదాన్ని ఆర్ధించి పెడుతూందిగూడ.

తల్లిదండ్రులు పిల్లలను కని పెంచడంగూడ గొప్ప బాధ్యత. మరియ క్రీస్తుబిడ్డనుకని అనురాగంతో పెంచింది. యూదమత నియమాల ప్రకారం ఆ బిడ్డకు జరిపించవలసిన ఆచారాలన్నీ జరిపించింది. యెరూషలేము యాత్రా సందర్భంలో కుమారుణ్ణి కోల్పోయినపుడు ఆమెకు కడుపు తరుగుకొనిపోయింది. ఇక, ఆ కుమారుడుకూడ తల్లిదండ్రులకు విధేయుడై వర్తించాడు — లూకా 1, 51. మన కుటుంబాల్లో తరచుగా తల్లిదండ్రులకూ బిడ్డలకూ మధ్య బోలెడన్ని చిక్కులూ అపార్థాలూ వస్తూంటాయి. ఈ పట్టున తల్లిదండ్రులకూ బిడ్డలకూ తిరుకుటుంబమే ఆదర్శం, మరియు మన తల్లిదండ్రులకూ బిడ్డలకూ గూడ పరస్పర ప్రేమతో జీవించే భాగ్యాన్ని ఆర్ధించి పెడుతుంది.

గృహిణికి దైవభక్తి చాలముఖ్యం. ఆమె భక్తురాలైతే కుటుంబమంతా భక్తిమంతంగా మెలుగుతుంది. మరియ ఈలాంటి భక్తురాలు. ఆమె ప్రభువుమీదనే హృదయం లగ్నంజేసికొని జీవిస్తూండేది. దేవాలయానికివెళ్ళి పూర్వవేదభగవంతుణ్ణి సేవించు కొంటూండేది. పరిశుద్దాత్మవలన అంతరంగంలో ప్రబోధం చెందుతూండేది. పూర్వవేదం చదువుకొని ప్రభు ధర్మశాస్త్రం ధ్యానించుకొంటూండేది. మరియ మననమూర్తి, ధ్యానశీల. “ఆమె యిూ విషయాలన్నీ మనసులో తలపోసికొంటూండేది" అన్న లూకా వాక్యమే ఇందుకు తార్మాణం - 2, 52. ఆ భక్తురాలు క్రైస్తవ గృహిణులకు కుటుంబభక్తిని నేర్పుతుంది. హృదయం భగవంతునిమీద లగ్నం చేసికోవడమూ ప్రభుగ్రంథాన్ని పఠించి ధ్యానం చేసికోవడమూ అనే భాగ్యాలను సంపాదించి పెడుతుంది.

యూదసమాజంలో మగవాళ్ళకుమాత్రమే ప్రాధాన్యముండేది. అలాంటి సమాజంలో ఆడవాళ్ళ తరుచుగా బాధలకూ చిక్కులకూ అపార్థాలకూ గురౌతుండేవాళ్ళు మరియకు కూడ ఈ దుర్గతి తప్పలేదు. యోసేపు గర్భవతియైన మరియను శంకింపగా - అతడు తనపట్ల ఎంతమృదువుగా ప్రవర్తించినాగాని - ఆమెకు కొండంతబాధ కలిగివుండాలి గదా? మన భారతీయ సమాజంకూడ యూదసమాజంలాగే స్త్రీకి విలువనీయని సమాజం. ఈ సమాజంలో స్త్రీకి జరిగే అన్యాయాలూ అపచారాలూ అన్నీ యిన్నీకావు. మన దేశంలో ఆడవాళ్ళు కన్నీరుగార్చని యిండు అరుదంటే అతిశయోక్తి కాదేమో. ఈలాంటి పరిస్థితుల్లో మరియ క్రైస్తవ పురుషులకంటెగూడ క్రైస్తవ స్త్రీకి ఎక్కువ ఆదర్శంగా వుంటుంది. ఆమె పురుషుడుకాదు. స్త్రీ, ఆ మాతృమూర్తి స్త్రీ హృదయంతో తన కొమార్తెల మానసిక బాధలను అర్థం జేసికొంటుంది. తాను వాళ్ళపట్ల సానుభూతి జూపుతుంది. తన పత్రికల బాధోపశమనానికి అవసరమైన వరప్రసాదాన్ని ఆర్థించి పెడుతుంది. కనుక క్రైస్తవ గృహిణి కష్టాల్లో ఆ తల్లివైపు దృష్టిమరల్చి ఆమె సహాయం అడుగుకోవాలి.

12. మరియమాత - సమైక్యత

మరియమాత ఈ ప్రపంచాన్నంతటినీ క్రీస్తుతో ఐక్యపరుస్తూంటుంది. విశ్వజనాన్ని విశ్వమతాలనూ, క్రీస్తుతో జోడిస్తుంటుంది. ఈ యధ్యాయంలో క్యాథలిక్ ప్రోటస్టెంటు శాఖలకూ, హిందూ ముస్లిం శాఖలకు చెందినవాళ్ళను ఆ విశ్వజనని ఏలా ఐక్యపరుస్తుందో విచారించి చూద్దాం.

1. ప్రోటస్టెంటు శాఖలు

నేడు ప్రోటస్టెంటు శాఖలు చాలవున్నాయి. కాని మొదటి శాఖలు లూథరెన్, కాల్వినిష్ణ శాఖలు రెండే. మరియమాత క్రైస్తవ శాఖలన్నిటినీ - అవి క్యాథలిక్ సమాజానికి జెందినా ప్రోటస్టెంటు సమాజానికి చెందినాసరే - క్రీస్తుతో ఐక్యపరుస్తుండాలి. కాని అనేక కారణాలవల్లా, అపార్ధాలవల్లా ఆ తల్లి క్యాథలిక్ క్రైస్తవులకూ ప్రోటస్టెంటు క్రైస్తవులకూ విభజన కారణమైందిగాని ఐక్యతాకారణం కాలేదు. ఈ సమస్యను కొంచెం చారిత్రిక దృష్టితో తర్కించడం అవసరం.

క్యాథలిక్ క్రైస్తవులు మరియమాతనుగూర్చి విశ్వసించే అంశాలను ముందటి అధ్యాయాల్లో విచారించాం. ఇక 16వ శతాబ్దంలో ప్రోటస్టెంటు తిరుగుబాటు వచ్చింది. లూథరు కాల్విను మొదలైన నాయకులు చీలిపోయారు. ఆదిమ క్రైస్తవసమాజం క్యాథలిక్ సమాజంలో కొనసాగుతూవచ్చింది. చీలిపోయిన నాయకులు మాత్రం ఆదిమ క్రైస్తవ సమాజం విశ్వసించే సూత్రాలకు భిన్నమైన సూత్రాలను కొన్నిటిని తమ క్రొత్తశాఖల్లో ప్రవేశపెట్టుకున్నారు. ఈలా ప్రవేశపెట్టుకున్న సూత్రాల్లో ప్రస్తుతం మరియమాతకు సంబంధించిన అంశాలను మాత్రమే విచారించి చూద్దాం.

లూథరు కాల్వినుగూడ మరియమాత దేవమాత అని ఆంగీకరించారు. ఆమె పవిత్రురాలనీ, నిత్యకన్య అనీ భావించారు. కాల్విను మాత్రం ఆమెకు జన్మపాపం సోకిందన్నాడు. ఆమె ఉత్థాపనాన్ని ఇద్దరూ అంగీకరించలేదు. ఆమె మనకోసం క్రీస్తుకు మనవిచేస్తుందనే అంశాన్ని కూడ ఇద్దరూ నిరాకరించారు. మరియమాత విషయంలో క్యాథలిక్ క్రైస్తవులకీ ప్రోటస్టెంటు క్రైస్తవులకీ ప్రధానభేదం యిది. ముందటి అధ్యాయాల్లో చెప్పినట్లు క్యాథలిక్ క్రైస్తవులు ఆమె మన రక్షణంలో పాల్గొంది అంటారు. ఆమెను "రక్షణమాత" "సహరక్షకి" "మధ్యవర్తిని” అనే పేర్లతో పిలుస్తారు. కాని ప్రోటస్టెంటు క్రైస్తవులు ఈ విషయాన్ని అంగీకరించరు. వీళ్ళభావాల ప్రకారం మరియకూడ ఇతర శిష్యుల్లాంటిదే. వాళ్ళలాగ ప్రభుకరుణ స్వీకరించేదే. ఆమె ప్రభురక్షణానికి పాత్రురాలైంది అంతే. మరియ మన రక్షణంలో పాల్గొంది అంటే క్రీస్తు రక్షణం నాశమైపోతుంది. అతడు మనకు మధ్యవర్తి కాకుండాపోతాడు. కనుక మరియ క్రీస్తుతో కలసి మనలను రక్షించింది అనకూడదు. క్రీస్తుతో పనిచేసింది అనాలి. ఆమె క్రీస్తుచెంత నిలచి అతని మధ్యవర్తిత్వానికి సాక్ష్యంగా వుండిపోయిందిగాని, తాను స్వయంగా మధ్యవర్తిని కాలేదు.

కాని క్యాథలిక్ క్రైస్తవులు దీనినంగీకరింపరు. వాళ్ళ ప్రకారం యథార్థ మధ్యవర్తియేమో క్రీస్తే. కాని యీ మధ్యవర్తి మానవ మధ్యవర్తులనుగూడ తనతో జోడించుకొనే తన మధ్యవర్తిత్వాన్ని నెరపాడు. నరుని నరుడే రక్షించుకోవాలి అని దేవుని ఆశయం. కనుకనే దేవుడు నరుడై జన్మించింది. ఈలా నరుడైన దేవునితో మరియకూడ కలసిపోతుంది. దేవుని మధ్యవర్తిత్వం నరుల మధ్యవర్తిత్వాన్ని నిరాకరించదు. కరుణతో తనతోగూడ చేర్చుకుంటుంది. ఈలా చేర్చుకోవడం అవసరమైకాదు, ఔచిత్యం కోసం. కనుక మరియ క్రీస్తు చెంత నిలిచి అతని మధ్యవర్తిత్వానికి సాక్ష్యంగా వుండిపోవటం మాత్రమేగాదు, తాను స్వయంగా మన మధ్యవర్తినిగూడ.

ప్రోటస్టెంటు నాయకులు మొదటిరోజుల్లో మరియు మాతనుగూర్చి చాల విషయాలు అంగీకరించారు. లూథరుకి ఆమెపట్ల చాల భక్తి అభిమానమూ వుండేవి. కాని క్రమేణ ప్రోటస్టెంటు శాఖలు "బైబులుమాత్రమే, దేవుడుమాత్రమే, వరప్రసాదం మాత్రమే" అనే వాదాన్ని లేవదీసారు. ఈ వాదం ప్రకారం బైబులులోలేని క్రైస్తవమత ఆధారాలన్నీ పోయాయి. కనుక పారంపర్యబోధ పోయింది. దేవుడుగాని పునీతులంతాపోయారు. వాళ్ళతోబాటు మరియమాత కూడ పోయింది. వరప్రసాదం కానిదంతా పోయింది. అనగా నరుల సహకారంగూడ పోయింది. ప్రోటస్టెంటులు మరియమాతను తూలనాడ్డం మొదలెట్టారు. అది చూచి క్యాథలిక్కులు ఆమెను అత్యధికంగా స్తుతించడం మొదలెట్టారు. ప్రోటస్టెంటులు ఆమెను పూజించడానికి ఆస్కారమేమిటి అన్నారు. క్యాథలిక్కులు పారపంర్యబోధ అన్నారు. ప్రోటస్టెంటులు ఆమెను కొనియాడితే క్రీస్తు మధ్యవర్తిత్వం పోతుంది అన్నారు. క్యాథలిక్కులు పోదు, ఇంకా అర్థవంతమౌతుంది అన్నారు. ఈలా నిన్నమొన్నటివరకూ ఈ ఉభయశాఖలవాళ్ళూ పోట్లాడుకొంటూనే వచ్చారు. క్రైస్తవులను ఐక్యపరచవలసిన తల్లి ఈలా వాళ్ళ విభజనకు కారణం కావడం చాల దురదృష్టం.

వాటికన్ మహాసభ మొదట మరియమాతమీద గూడ ఓ చట్టం తయారుచేసింది. కాని ఆ చట్టంవలన ప్రోటస్టెంటులను రెచ్చగొట్టినట్లవుతుందని మళ్ళా దాన్ని ఉపసంహరించుకొంది. అందలి ముఖ్యాంశాలను శ్రీసభనుగూర్చిన చట్టంలోనే ఓ అధ్యాయంగా చేర్చింది. ఈ సభ మరియు మాతకు "మధ్యవర్తిని" అనే బిరుదంకూడ కొంచెం జంకుతూనేగాని వాడలేదు. అలా వాడిన తావుల్లోగూడ “మరియు మాత మధ్యవర్తిత్వం క్రీస్తు మధ్యవర్తిత్వానికి ఏమీ చేర్చదు. ఆ మధ్యవర్తిత్వం నుండి ఏమీ తొలగించదు" అని స్పష్టంగా చెప్పింది.

వాటికన్ ధోరణి ఈలా వుండగా మరియమాతను గూర్చిన ప్రోటస్టెంటు దైవశాస్త్రజ్ఞల దృష్టికూడ ఇటీవల చాలవరకు మారిపోయింది. వాళ్ళ బైబులును జాగ్రత్తగా చదివి మరియు స్థానాన్ని గుర్తిస్తున్నారు. ఇప్పడుభయ వర్గాలనుండి సమైక్యతా భావాలు పట్టుకవస్తున్నాయి.

మరియమాత క్రైస్తవశాఖలకు ఐక్యత ప్రసాదించాలి అంటే మొదట ఈ శాఖలవాళ్ళు కొన్ని నూత్న దృక్పథాలు అలవరచుకోవాలి. ప్రోటస్టెంటులు క్యాథలిక్కులు కూడ తమ వైఖరిని మార్చుకోవాలి.

ప్రోటస్టెంటు శాఖలవాళ్ళ బైబులే కాకుండా పారంపర్య బోధనుగూడ గుర్తించాలి. క్రైస్తవమతం 16వ శతాబ్దంలో లూథరు తిరుగుబాటుతోనే పుట్టలేదు. ఆ మాతానికి అంతకుముందే పదహారు వందల యేండ్ల జీవితచరిత్ర వుంది. ఆ పదహారు వందల యేండ్లలో క్రైస్తవ ప్రజలు మరియమాతను ఎలా పూజించారో ఎందుకు పూజించారో అర్థం చేసికోవాలి. బైబులు మరియమాతను గూర్చి అన్ని విషయాలూ చెప్పదు. అసలు దాన్ని వ్రాసినప్పటి పరిస్థితులువేరు. కాని బైబులుచెప్పిన విషయాలను జాగ్రత్తగా పరిశీలించి చూచినట్లయితే నేడు క్యాథలిక్ సమాజం మరియు మాతనుగూర్చి విశ్వసించే విషయాలు అంత అసందర్భంగా దోపవు. ఉదాహరణకు, నూత్నవేదమెక్కడాకూడా మరియు నిష్కళంకోద్బవి అని చెప్పదు. ఐనా క్యాథలిక్ శ్రీసభ అలా నమ్ముతుంది. ఈ నమ్మికకు ఆధారం లూకా 1, 28 వాక్యంలోని దైవానుగ్రహ పరిపూరురాలు" అనే మాటలో లేక పోలేదు. ఈలాగే మిగతా విషయాలు కూడాను.

క్యాథలిక్ క్రైస్తవులు మరియమాతను కొనియాడేపుడు ఎందుకు అలా కొనియాడుతున్నారో ప్రోటస్టెంటులకు వివరించి చెప్పగలిగి వుండాలి. ఈ విషయంలో ప్రోటస్టెంటులు ప్రశ్నించినా క్యాథలిక్కులు తరచుగా తృప్తికరమైన జవాబు ఈయలేకపోతున్నారు. అంచేత వాళ్ళసందేహం ఇంకా బలపడుతూంటుంది. పైగా క్యాథలిక్కులు కొంతమంది క్రీస్తును మరియమాతను కలిపివేస్తుంటారు. క్రీస్తును ఆరాధించినా మరియను పూజించినా ఒకటే అనుకుంటూంటారు. ఇంకా కొంతమంది అజ్ఞానంవల్ల క్రీస్తును విస్మరించి మరియను మాత్రమే పూజిస్తుంటారు. ఈలా చేయడం తప్పు. క్రీస్తువేరు, మరియవేరు. వాళ్ళిద్దరూ చేసిన కృషికూడ వేరువేరు. మనలను రక్షించింది. క్రీస్తు. ఆ క్రీస్తుని బట్టి మరియమాత వచ్చింది. అంతేగాని, మరియమాతను బట్టి క్రీస్తు రాలేదు. కనుక మనం మొదట రక్షకుడైన క్రీస్తును ఆరాధించి ఆ పిమ్మట మరియమాతనుగూడ గౌరవించాలి. ఇది ప్రాచీన క్రైస్తవ సంప్రదాయం. మరియు మాతనేమో గౌరవించవలసిందే. కాని క్రీస్తునిబట్టి మాత్రమే. "ఇకమీదట సకలతరాలవాళ్ళు నన్ను ధన్యురాలినిగా భావిస్తారు. ఎందుకంటె సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేసాడు ' అన్న మరియు వాక్యంగూడ యిదే. వాటికన్ సభ దృక్పథం వలననైతేనేమి, ప్రపంచమందలి వివిధ క్రైస్తవ శాఖల నాయకుల కృషివలన నైతేనేమి మరియమాత వివిధ క్రైస్తవ సంప్రదాయాల వాళ్ళను ఐక్యపరుస్తుందని విశ్వసిద్దాం.

2. హైందవ సంప్రదాయం

}}

ఈ దేశంలో చాలమంది హిందువులు కన్యమరియను గౌరవిస్తుంటారు. మన ప్రాంతంలోనే చూచినట్లయితే గుణదలలో జరిగే లూర్దుమత తిరునాళ్ళలో చాలమంది హిందువులు పాల్గొని కానుకలు అర్పిస్తుంటారు. మరియమాత ప్రతిమనో, చిత్రాన్నో ఇండ్లల్లో వుంచుకొని ఆమెను గౌరవించే హిందూ కుటుంబాలుకూడ కొన్ని ఈ రచయితకు తెలుసు. ఇక హిందూమతంలో మరియలోలాగ కన్యాత్వమూ మాతృత్వమూ ఒకేవ్యక్తియందు కన్పించే దేవత ఎవరూలేరు. కాని తల్లిగానో కన్యగానో పరిగణింపబడే దేవతామూర్తులు మాత్రం చాలమంది వున్నారు. ఈ "కన్యలు" ఈ 'అంబలు" మరియమాతను సూచిస్తుంటారు. వీళ్ళందరికీ ఆమె ప్రాతిపదికగా వుంటుంది. మరియ క్రైస్తవ ప్రజనేగాదు, సర్వమానవాళిని క్రీస్తుతో జోడిస్తుంది అన్నాం. అంబలనూ, కన్యలనూ గౌరవించే హిందూ ప్రజలను, హృదయశుద్ధితో భగవంతుని వెదకే జనులందరినీ, ఆ తల్లి తన చెంతకూ తన కుమారుని చెంతకూ చేర్చుకోవాలని మనవిచేద్దాం. చేర్చుకుంటుందని ఆశిద్దాం.

3. ముస్లిముల సంప్రదాయం

}}

హిందూవుల్లాగే ముస్లిములు చాలమందిగూడ మరియను గౌరవిస్తుంటారు. మరియమాత గుళ్ళకువెళ్ళి ఆమెను పూజిస్తూంటారు. కొరాను ప్రకారం మరియ పాపంలేకుండా జన్మించింది. పవిత్రురాలు. కన్యగానే బిడ్డను కంది. ఆ గ్రంథం ఓ తావులో "ఓ మిరియం! దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. పవిత్రపరచాడు. ప్రపంచంలోని స్త్రీ లందరికంటెగూడ నిన్ను ధన్యురాలినిగా జేసాడు." అంటుంది - 3,41. కాని కొరాను క్రీస్తుని ఓ ప్రవక్తగానేగాని దేవునిగా అంగీకరింపదు. కనుక మరియనుగూడ దేవమాతగా అంగీకరింపదు. ఇప్పుడు ముస్లిము దైవశాస్త్రజ్ఞల్లో చాలమంది కూడ నిష్టతో బైబులు చదువుతూన్నారు. అసలు ఆత్మశక్తి వల్ల అన్ని మతాలూ సమైక్యమైపోతూన్న రోజులివి. కనుక ఆ తల్లి ముస్లిము సోదరులనుగూడ క్రీస్తు చెంతకు చేర్చాలని ప్రార్థిద్దాం.

13. మరియమాత - శ్రీసభ

దేవుడు ప్రేమమూర్తి. అతడు ముగ్గురు వ్యక్తులతో గూడిన సమాజం. దేవుడు తన ప్రేమను మానవసమాజానికి అందించాలనుకున్నాడు, అందించాడు. కాని నరుడు దేవుని ప్రేమను ధిక్కరించాడు, పాపం కట్టుకున్నాడు. ఐనా భగవంతుడు కరుణతో పాపపు నరజాతిని రక్షింపబూనాడు. కాని నరజాతి రక్షణ నరజాతినుండే రావాలన్న తలంపుతో దేవుడు తన కుమారుడ్డి నరుణ్ణిగా పంపగోరాడు. ఇక ఈ దేవుణ్ణి నరుణ్ణిజేసి మన సమాజంలోనికి తీసికొని రాదగిన తల్లి ఒకర్తె వుండాలి. దేవుడు ఎన్నుకున్న ఆతల్లే మరియ. ఈ యధ్యాయంలో రెండంశాలు విచారిద్దాం. మరియు మంగళగుణాలన్నిటికీ ఆమె మాతృత్వమే ఆధారం. మరియ మంగళగుణాలన్నీ శ్రీసభకూ, అనగా మనకూ, అక్షరాలా వరిసాయి.

1. దైవసంకల్పంలో మరియ

}}

అనాదినుండి దేవుని రక్షణప్రణాళికలో క్రీస్తు ఉన్నాడు. మరియమాతా వుంది. క్రీస్తుదేహం గాబోయే శ్రీసభా వుంది. మరియద్వారాగాని దేవుడు మానవసమాజానికి తన కుమారుణ్ణి ప్రసాదించలేడు. ఆమెద్వారాగాని పరలోకపిత మానవసమాజంతో రక్షణ సంబంధం పెట్టుకోలేడు. సరే, భగవంతుని కోరిక ప్రకారం మరియ దేవుని కుమారుణ్ణి నరుణ్ణిజేసి మన మంటిమీదికి ప్రవేశపెట్టింది. ఈ మహత్తర కార్యంద్వారా ఆమె దేవమాత ఐంది. మరియ గుణాలన్నిటిలో శ్రేషాతిశ్రేష్టమైంది ఈ దైవ మాతృత్వమే. ఆమె గొప్పతనమంతా ఈ లక్షణంమీదనే ఆధారపడివుంది.

ఈ మరియు రక్షిత మానవ సమాజంలో మొదటి వ్యక్తి రక్షిత మానవసమాజమే శ్రీసభ, క్రీస్తుదేహం. కనుక శ్రీసభకు మరియ ఆదర్శంగా వుంటుంది. పూర్వాధ్యాయాల్లో కన్యాత్వం, నిష్కళంకత్వం మొదలైన మరియ భాగ్యగుణాలను వివరించాం. ఈ భాగ్యగుణాలన్నీ ఆమె దైవ మాతృత్వాన్నిబట్టి సిద్ధించినవే. ఈ విషయాన్ని కొంత సవిస్తరంగా విచారించి చూద్దాం.

మరియ దేవమాత కావాలి గనుకనే నిష్కళంకంగా జన్మించింది. పరమ పవిత్రుడైన దేవుడు ఈ మరియద్వారా పాపపు నరజాతిని సమీపింపబోతున్నాడు. అతన్ని మన మానుష కుటుంబంలో ప్రవేశపెట్టబోయే తల్లీ పవిత్రురాలై యుండాలి. సూర్యుడు భూమిమీద పడేట్లయితే ఆ భూమిని చేరకముందే నేలమీద తాను పడబోయేచోటిని కాల్చివేస్తాడు. అలాగే దేవుడుకూడ తాను మానవసమాజంలోకి దిగిరాకముందే, ఏ వ్యక్తిద్వారా అలా దిగిరానున్నాడో ఆ వ్యక్తిని తన ప్రేమాగ్నితో కాల్చి పునీతం జేసాడు. అందువలననే ఆమె నిష్కళంకగా జన్మించింది. నిష్కల్మషుడైన దేవునికి పుట్టువు ఈయడం కోసం మరియ నిష్కల్మషగా ఉద్భవించింది.
మరియ నిత్యకన్య అన్నాం. దేనికి? తన పూర్ణ హృదయాన్ని ప్రభువుకే సమర్పించుకోవడం కోసం. కన్యమరియ తన హృదయాన్ని దేవుడైన తన కుమారునికే అర్పించుకుంది. మరో కుమారుడు ఆమెకు పుట్టనూలేదు, ఆ తల్లి ప్రేమలో పాలుపంచుకోనూలేదు. కనుక ఆమె కన్యాత్వం గూడ దైవమాతృత్వం కోసమే.
మరియ సహరక్షకి అన్నాం. ఆమె దేవమాత కనుకనే సహరక్షకి ఐంది. దేవుని కుమారుని కని అతనికి మానుష దేహం ఇచ్చింది. ఈ దేహాన్నే క్రీస్తు సిలువమీద బలిగా అర్పిస్తాడు. అనగా ఆమె క్రీస్తుకు బలివస్తువును అందించింది. క్రీస్తును బలిమూర్తిగా సిద్ధం చేసింది. అటుపిమ్మట మరియ సిలువచెంత నిలుచుండి బాధననుభవిస్తూ క్రీస్తును అర్పించింది. క్రీస్తు స్వీయార్పణంతో తన ఆత్మార్పణను కూడా ఐక్యం చేసింది. ఈ సన్నివేశంలో సిలువచెంత నిలిచిన మరియ మానవులందరికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుక, ఆమె సహకారం ద్వారా క్రీస్తు రక్షణం మరింతగా మానవులనుండి పట్టే రక్షణమైంది. మానవుడ్డి మానవుడే రక్షించుకోవడం దైవప్రణాళిక అన్నాంగదా! ఈలా మరియ దేవమాత కనుకనే మనకు సహరక్షకి కాగలిగింది.
క్రీస్తు ఉత్తానమై మోక్షరోహణం చేసాడు. క్రీస్తు రక్షణకార్యంలో పాల్గొనిన రక్షణమాతకుగూడ ఉత్థాపనం లభించింది. ఉత్తానక్రీస్తు మనకు వరప్రసాదం ఆర్ధించి పెట్టాడు. ఆ వరప్రసాదాన్ని రక్షణమాత మనకు పంచిపెడుతూంటుంది. ఆమె వరప్రసాధాలమాత, క్రీస్తుతో పాటు ఆమెకూడ నిత్యం మనకోసం మనవి చేస్తుంటుంది. క్రీస్తుకు భౌతిక మాతయైన మరియు క్రీస్తు దేహమైన శ్రీసభకు జ్ఞానమాత ఔతుంది. ఆమె రెండవయేవ. జీవమిచ్చే యేవ. కనుక మరియు దైవమాతృత్వమే ఆమె ఉత్తాపనానికీ, వరప్రసాద ప్రదానానికీ, జ్ఞానమాతృత్వానికీ కారణం అని చెప్పాలి. 

క్రీస్తు తన తండ్రిసమక్షంలో కూర్చుండి రాజుగా పరిపాలనం చేస్తుంటాడు. మరియగూడ ఆ క్రీస్తుతోపాటు తానూ రాబ్దిగా పాలనం చేస్తుంది. మనతరపున ఆమె చేసే వేడుదలే ఆమె రాచరికం. మరియు రాజ్జీత్వంకూడ ఆమె దైవమాతృత్వం యొక్క ఫలితమే. ఈ విధంగా మరియమాత మంగళగుణాలన్నీ ఆమె దివ్యమాతృత్వం వలననే సిద్ధించాయని చెప్పాలి. కనుక దేవుడు తన రక్షణ ప్రణాళికలోనే ఆమెను దేవమాతనుగా ఎన్నుకున్నాడు.

3. మరియ - శ్రీసభ

మనుష్యావతారం అంటే దేవుడు నరుడు గావడం మాత్రమేగాదు, నరులు ఆ దేవుని దేహం గావడంకూడా, అనగా క్రైస్తవసమాజం లేక శ్రీసభ ఏర్పడ్డంగూడ, ఈ శ్రీసభలో మరియు మొదటి వ్యక్తి కనుక ఆమె శ్రీసభ కంతటికీ పోలికగా, ఆదర్శంగా వుంటుంది. ఇక మానుష క్రీస్తునకు అతని తల్లికీ ఏలాంటి మహిమాన్విత లక్షణాలు సిద్ధించాయో శ్రీసభకూ ఆలాంటి లక్షణాలే సిద్ధిస్తాయి. శ్రీసభ అంటే క్రైస్తవ ప్రజలమైన మనమందరమూను. కనుక మనకందరకూ క్రీస్తు మరియలకు ఒనగూడిన లక్షణాలే ఒనగూడుతాయి. మరియు మహిమలు ఆమెకోసం మాత్రమేగాదు, శ్రీసభ కోసమూ మనకోసమూను. మరియ గుణాలు శ్రీసభలోను మనలోను ఏలా ప్రతిఫలిస్తాయో విచారించి చూద్దాం.

మరియ ఓ మాతృమూర్తి, అదేవిధంగా శ్రీసభకూడ మాత. జ్ఞానస్నానంద్వారానే శ్రీసభ మనలను కంది. క్రైస్తవుడుకూడ ప్రేషితుడుగా వ్యవహరించినప్పుడల్లా క్రీస్తుబిడ్డలను కంటాడు. తల్లీ తండ్రీ ఔతాడు - గల 4,19. శ్రీసభ మాతృత్వానికీ మరియు మాతృత్వానికీ, ఒక భేదం వుంది.
శ్రీసభ క్రీస్తు దేహమైన క్రైస్తవులను మాత్రమే కనగలదు. ఈ దేహానికి శిరసైన క్రీస్తును కనలేదు. జజ్ఞానదేహపు శిరసైన క్రీస్తును కనగల్గిన తల్లి మరియ ఒకర్లే. అది ఆమె సాధించిన మహాకార్యం. ఆమె మహత్వం కూడ అదే.
నిష్కల్మషుడైన దేవుణ్ణి మన మానుషజాతిలోనికి ప్రవేశపెట్టడంకోసం మరియ నిష్కల్మష కావలసివచ్చిందన్నాం. క్రీస్తు దేహమూ క్రీస్తుపత్నీ ఐన శ్రీసభకూడ నిష్కల్మష కావాలి - ఎఫే 5,27. శ్రీసభ సమస్తంగా తీసికొంటే నిష్కల్మష ఐనా వ్యస్తంగా తీసికొంటే, అనగా తన సభ్యులందు కల్మషగానే వుంటుంది. ఈ సభలో సంపూర్ణ నిష్కల్మష ఒకరే, 47 మరియ. కనుక పాపాన్ని జయించి నిష్కల్మషత్వాన్ని బడయడంలో ఆమె మనకూ శ్రీసభకూ ఆదర్శంగా వుంటుంది.

మరియ కన్య మరియలాగే శ్రీసభకూడ కన్య - 2కొ 11,2. మరియలాగే శ్రీసభకూడ కన్యగావుండే పవిత్రాత్మ శక్తివలన జ్ఞానస్నానం ద్వారా మనలను కంటుంది. మరియ కన్యగా వుండి అవిభక్త హృదయంతో ప్రభువుకి అంకితమైంది.కాని శ్రీసభ, ఈసభ సభ్యులు అంతటి గాధ హృదయంతో ప్రభువుకి సమర్పితులు కారు. కనుక ఈ సమర్పణ విషయంలోకూడ మరియు మనకు ఆదర్శంగా వుంటుంది.

నరులను నరులే రక్షించుకోవాలి అన్న భావంతో దేవుడు మరియను క్రీస్తుతో సహరక్షికిని చేసాడన్నాం, మరియలాగే శ్రీసభకూడ సహరక్షకి - కొలో 1-24. శ్రీసభ సంస్కారాలు, ఆరాధనా, ప్రేషితకార్యం ఇవన్నీ క్రీస్తు రక్షణాన్ని కొనసాగించడం కోసమేగదా! కాని మరియు క్రీస్తు పుట్టువునందు మరణంనందు సహరక్షికి ఐనంతగా శ్రీసభ తాను కాలేదు. ఈ రక్షణం విషయంలోకూడ మరియు శ్రీసభకు ప్రేరణంగా వుంటుంది.

క్రీస్తు మరియలు ఉత్తానమహిమ పొందారు. మరియలాగే శ్రీసభకూడ ఉత్తానభాగ్యం పొందుతుంది - 1కొ 15, 20-23. కాని ఈ భాగ్యం వెంటనే లభించదు. లోకాంతం వరకూ వేచివుండాలి. ఈ వరకే ఉత్తానమహిమను బడసిన మరియు ఇకమీదట ఉత్థానాన్ని పొందవలసిన శ్రీసభకు ప్రేరణంగా వుంటుంది.

క్రీస్తు మోక్షంలో వుండి మన తరపున తండ్రిని మనవి చేస్తూంటాడు - హెబ్రే 7,25. మనకు వరప్రసాదాలు ఇస్తూంటాడు. అలాగే మోక్షాన్ని చేరుకున్న శ్రీసభకూడా పనీతుల రూపంలో మనకోసం దేవుని మనవి చేస్తూంటుంది. కాని ఈ పునీతులందరికంటె కూడ మరియు అధికంగా విన్నపం జేస్తూ వీళ్ళందరికీ తాను విజ్ఞాపన విషయంలో ప్రేరణంగా వుంటుంది.

ఉత్తానక్రీస్తు రాజుగా పరిపాలనం జేస్తూంటాడు. శ్రీసభకూడ ఈ క్రీస్తు రాచరికంలో పాల్గొనాలి - 2 తిమో 2,12. మరియ రాజ్ఞత్వం శ్రీసభ రాజ్ఞత్వానికి ప్రేరణం.

సంగ్రహంగా చెప్పాలంటే మరియు శ్రీసభకు, అనగా మనకు ఆశగాను ఆదరువుగాను వుంటుంది. ఆమె మహిమను పొంది మోక్షంలోవుంది. మనమూ ఆ పదవిని పొందాలి. కాని ఇంకా పొందలేదు. అంచేత ఈ లోకంలో వున్నంత కాలం ఆమెవైపుచూస్తూంటాం. ఆమె వున్నచోటికి వెళ్ళాలని ఉవ్విళూరుతుంటాం. ఆమె మనకు అండదండగా ఆదరువుగా ఉంటుంది. క్రీస్తు మనకోసం ఏమి సాధించాడో, క్రీస్తునుండి మనం ఏమి సాధించ గోరుతుంటామో అదంతా మరియ ఈవరకే సాధించింది. కనుక ఆమె శ్రీసభకూ, క్రైస్తవ ప్రజలకూ ప్రేరణం. మాతృ ప్రతిని చూచి మరో ప్రతిని వ్రాస్తారు. మాతృచిత్రాన్ని చూచి మరో చిత్రాన్ని గీస్తాం. అలాగే మాతృకయైన మరియనుచూచి మనమూ ఆమెలాగే తయారు కాగోరుతాం. ఆమె శ్రీసభకు మాతృక, ఆదర్శం, పోలిక, ప్రాతిపదిక అంటే భావం యిదే.

మరియను ఎప్పుడూ శ్రీసభతో జోడిస్తుండాలి. ఆమెను అర్థం చేసికుంటే శ్రీసభను అర్థం చేసుకున్నట్లు, శ్రీసభను అర్థం జేసికుంటే ఆమెను అర్థం జేసుకున్నట్లు, ఇక మరియ శ్రీసభలను అర్థం జేసికుంటే క్రీస్తును అర్థం జేసుకున్నట్లు, క్రీస్తు రక్షణం మరియ యందు వ్యక్తిగతంగా, శ్రీసభయందు సామాజికంగా ఫలసిద్ధి నిస్తుంది. మరియయందు క్రీస్తురూపం సంపూర్ణంగా ప్రతిఫలించింది. అనగా ఆ విశుదురాలు దేవుడు సంకల్పించుకున్న నరులు ఎల నిర్మలంగా వండాలో అలా వుండిపోయింది. కనుక దేవుడు సంకల్పించుకున్న క్రైస్తవ సమాజానికి - ఆ సంకల్పం ప్రకారం జీవించలేకపోతూన్న శ్రీసభకు - ఆమె ఆదర్శంగా నిలుస్తుంది.

దేవుడు నరుల్లో ఎలా కన్పిస్తాడో, క్రీస్తు మానవుల్లో ఎలా ప్రతిఫలిస్తాడో చూడాలంటే మరియను చూడాలి. మంగళప్రదమైన ఆమె మహిమాన్విత గుణాలన్నీ మన మీద పనిచేస్తాయి. మనమూ ఆమె మహిమను పొందేలా చేస్తాయి. ఆమె శ్రీసభలో తొలివ్యక్తి మనం మలివ్యక్తులం. అందుకే మనం ఆ యావలితీరాన్ని చేరుకోవాలంటే ఆమె సహాయం పొందుతూండాలి.

దేవుడు మానవులమధ్యలో జన్మించడానికీ, అలా జన్మించి మానవులను దేవుని బిడ్డలను చేయడానికి మరియ నుండి జన్మింపవలసి వచ్చింది - గల 4,5. కనుక ఆ తల్లి దేవమాత, మానవులమాత, ఆ పునీతమాతకు జోహారు!