బైబులు భాష్య సంపుటావళి - దేవమాత, అంత్యగతులు/ముందుమాట

వికీసోర్స్ నుండి

ముందుమాట

   ఫా.జోజయ్య గారు తమ రచనల ద్వారా ఆంధ్ర శ్రీసభకు సుపరిచితులు, వారి అవిరళకృషి సేవాతత్పరత, తెలుగులో చక్కని సాహిత్యాన్నిరాయాలనే తపన, దానికితగిన అంకితభావం వేనోళ్ల కొనియాడదగింది. వీరు రచించిన చిన్నచిన్న పుస్తకాలను సంకలనం చేయడం అనే ప్రక్రియ వీరి జీవితకాలంలోనే జరగకపోయినటైతే, ఈ గొప్ప సాహిత్యాన్ని కోల్పోయే అపాయం వుండేది. అరుదుగా పాఠకులకు తెలుగులో లభ్యమయ్యే బైబులును మరియు కతోలిక వేదాంతమునకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశోధన జరిపి చక్కని భాషలో ఆంధ్ర కతోలిక సంఘానికి గత ముప్పది సంవత్సరాలపైగా అందించారు ఫా,జోజయ్య గారు,
    తెలుగు కతోలిక శ్రీసభకు, బైబులును క్రైస్తవ సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలన్న కోరిక గల క్రైస్తవేతరులకు ఫా-జోజయ్య గారు గొప్ప వరమని నేను భావిస్తున్నాను. వీరి రచనలు సత్యాన్ని అన్వేషించడం యెడల ఆయనకున్నపట్టుదలకు, అందరికి జ్ఞానోదయాన్ని కలిగించాలన్న తపనకు, మరియు ఆంధ్ర శ్రీసభ పురోభివృద్ధి యెడల ఆయనకున్నతృష్ణకు నిదర్శనాలు. సరళమైన స్వచ్ఛమైన, సామాన్య ప్రజలకు అర్థమయ్యే తెలుగుభాషలో రచింపబడిన ఈ పుస్తకాలను చదివి, ఆధ్యాత్మిక జీవిత వికాసానికి క్రైస్తవ సిద్ధాంతాలను లోతుగా అర్థం చేసికోవటానికి వీటిని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఎంతో నేర్చుతో, క్రమపద్ధతిలో విభజింపబడిన రచనలను "బైబులు భాష్య సంపుటావళి" అన్న పేరుతో పదిసంపుటాలుగా అచ్చు వేస్తున్నందుకు అభినందిస్తున్నాను. ఈ గ్రంధాల ప్రచురణ బాధ్యతను తన భుజాలపై వేసికొని, సమయాన్ని వెచ్చించి, వలసిన ఆర్థిక వనరులను చేకూర్చినందుకు, ఆంధ్ర శ్రీసభకు ఉపయోగకరమైన ఈ సాహిత్యాన్ని ప్రజలకు అందించాలనే మంచికార్యాన్ని చేపట్టి విజయంతంగా పూర్తి చేసినందుకు ఫా.మర్రెడ్డి గారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
    ఆణిముత్యాల్లాంటి ఈ రచనలను ఆధ్యాత్మిక సంపత్తిగా అందరూ గుర్తించాలని, కతోలిక క్రైస్తవ సమాజమంతా ముఖ్యంగా మేత్రాణులు, గురువులు, మఠవాసులు అందరు ఈ కృషిని అభినందించాలని, ఆదరించాలని నా ఆకాంక్ష. మన ప్రజల స్తోమతకు తగినట్లుగా వీటి వెల కూడ చాల తగ్గించడమైనది. కావున ప్రతి ఒక్కరు, గ్రంథాలయాలు, ఆశ్రమాలు, మఠాలు, కతోలిక కేంద్రాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నా మనవి.
    ఫా.జోజయ్య గారు చేసిన ఈ కృషిని మరోసారి అభినందిస్తూ, వారు ఇంకా ఆంధ్ర శ్రీసభకు తమ అమూల్యమైన సేవలను రానున్న కాలంలో అందించాలని మనసారా
కోరుకుంటూ, ప్రార్ధిసూ.

ఇట్లు
మీ జ్ఞానతండ్రి
+ మల్లవరపు ప్రకాష్
విజయవాడ పీఠాధిపతులు