Jump to content

బిల్వమంగళ/నాలుగో అంకము

వికీసోర్స్ నుండి

నాలుగో అంకము

_______

మొదటి రంగము

(చింతామణి ఇంట్లో గది - దాసి, సాధువు వత్తురు.)

దాసి - ఎక్కడికి పోయిందో ఊరంతా వెదకినా ఎక్కడా కనబడలేదు.

సాధు - ఆ పిచ్చి సముద్రములో పడి యేవాడకో కొట్టుకొని పోయింది.

దాసి - మన మేమి చేతాము?

సాధు - అదే గొప్ప సమస్య. పోలీసువాళ్ళకి తెలుస్తే ఇదంతా కొనిపోతారు. ఏమిటి దారి?

దాసి - ఔను. మొన్న అంబిక ఆస్తంతా తీసుకొన్నారు. మగవాడవు, నీవే ఆలోచించు - ఆడదాన్ని నాకేమి తెలుస్తుంది?

సాధు - సొత్తంతా బైటికి దాటించవలెను - అదే మనము చేయతగ్గ పని.

దాసి - దాటించడ మేలాగు? పెట్టె చాలా బరువు, గోడలో తాపడము చేసినారు. సాధు - అదే చూస్తూన్నాను.

దాసి - పోదలచుకొన్నది తాళముచెవులేనా నాకిచ్చింది కాదు, దానికి నే నెంతమేలు చేసినాను!... కలికాలము !

సాధు - అంత ధర్మదృష్టి యిప్పటివాళ్ళకా! "ధర్మస్య సూక్ష్మాగతి:" అంటారు.

దాసి - మాటల కేమికాని, ఈ పాడుపెట్టెను పైకి తవ్వగలవా? మగవాడ వాపాటి బలము లేదా? గునప ముంటే నేను తవ్వితీయగలను!

సాధు - చప్పుడు కావచ్చునా? గట్టిగా కొట్టి బద్దలు చేయవచ్చును, కాని చప్పుడు మాటో?

దాసి - మగవాడవు - ఈపాటి ఉపాయము తోచ లేదా నీకు?

సాధు - ఆలోచిస్తూన్నాను.

దాసి - మూడు నాళ్ళనుండీ మొత్తుకొంటున్నావు - మట్టిబుర్ర! ఆలోచన శూన్యము ! పోలీసువాళ్ళు వచ్చేసరికి నీకూ ఉపాయము తోస్తుంది కాబోలు!

సాధు - ఏమి చేయమన్నావు? నేను తలచిందొకటి, జరిగింది ఇంకోటి! గోడత్రవ్వి పెట్టె తీస్తాను - అదృష్ట మెట్లుంటే అట్లు జరుగుతుంది - (త్రవ్వబోవును)

(లోపల - ఎవరక్కడ? తలుపు తీయండి)

దాసి - అమ్మయ్యో! ఎవరు వారు! పోలీసువాళ్లేమో! (లోపల - తీయరేమి? మేము పోలీసువాళ్ళము)

దాసి - అన్నా! ఏమి గతి? కొంప మునిగిందిరా దేవుడా!

(లోపల - తలుపు బద్దలు చేయనా? తీస్తారా?)

సాధు - చూడు - ఇది నాయజమానురాలి సొత్తని నేనంటాను, నీవాలాగే సాక్ష్యమియ్యి.

(పోలీసు ఇన్స్‌పెక్టరు, జవానులు వత్తురు.)

దాసి - ఇనస్పేటు బాబూ! దొంగ! దొంగ!

ఇన - ఔను. ఈయింట చోరీ జరిగిన ట్లున్నది.

దాసి - బాబూ! ఈమనిషి. ఇనప్పెట్టె తవ్వుతున్నాడు.

ఇన - మేము రావడము చూచి "దొంగ" అని కేక వేసినావు. మంచిది (సాధువుతో) నీ వెవడవు!

సాధు - నేను చింతామణి పెంపుడు కొడుకుని. ఇదంతా ఆమెసొత్తు. నా కామె యిచ్చింది.

ఇన - తాళముచెవులు నీవద్ద నున్నావా?

1 జవా - లేనట్టే-ఉంటే పగులగొట్టడ మెందుకు?

ఇన - నీ వూరకుండు. తాళముచెవు లెక్కడ?

సాధు - (స్వ) ఓహో! ఇతడు నన్ను విచారణచేస్తూన్నాడు!

ఇన - వీరిద్దరినీ తీసుకొనిపోయి, వీడిని చెరలోనూ, దానిని గదిలోని ఉంచండి-ఈ యిల్లంతాశోధించి వస్తాను.

దాసి - బాబూ! దండములు-ఈమనిషి దొంగతనా నికి వచ్చినాడు, నే నీయింటి దాసిని, నా కాపుర మిక్కడే, చింతామణి నా యజమానురాలు. బాబూ! దండాలు! నా ధనము, ప్రాణము, మానమూ మీచేతిలో నున్నవి. నాకు బేడీలు వెయ్యకండి-నేను చెప్పినదంతా నిజము.

ఇన - వీళ్లవద్ద తాళము చెవులున్న వేమో పరీక్ష చేయండి.

1 జవా - ఓరీ, నీకు మరణము తప్పదు-ఈనేరమునకు శిక్ష తప్పదు-న్యాయాధికారితో చెప్పుకొందువు పద.

సాధు - ఆలాగే! నడవండి-(వారి నిద్దరిని గొనిపోదురు)

ఇన - మానసింగ్, ఈపెట్టెను బైట కీడ్వాడాని కెంత మంది కావలనె? నీచేత నవుతుందా?

2 జవా - ఇం కిద్దరు కావలెను.

ఇన - మనవల్ల కాదన్నమాటే. ఇద్దరుంటే చాలునా!

2 జవా - ఇం కిద్దరుంటే మంచిది.

ఇన - దొంగ దొరకినాడు కదా? వీడికెంతో చిక్కి యుండదు. ధనమంతా ఈపెట్టెలో నుంటుంది-నీ విక్కడ జాగ్రత్తగా నుండు-నేను బయటికి పోయి రిపోర్టు వ్రాస్తాను.

2 జవా - అలాగే.

ఇన - నేను బైటికి పోతాను-రిపోర్టు నీవు తీసుకొని స్టేషనుకు వెళ్ళుదువు గాని.

[మొదటి జవాను వచ్చి]

1 జవా - మహాప్రభూ! కైదీలు విషము తిని చచ్చి నారు?

ఇన - విషమా ! విష మెక్కడిది?

1 జవా - ఆ మగవానివద్ద నుండెను.

ఇన - వాడు చచ్చెనా!

1 జవా - వాడే కాదు-అదీ చచ్చింది.

ఇన - వదరుబోతా? ఇద్ద రేలాగు చచ్చినారు?

1 జవా - మొదట మగవాడు విషము తిన్నాడు. నేను వాడిని శోధిస్తూంటే ఆడది కూడా విషము తిన్నది-ఇద్దరికీ ఊపిరి లేదు. శవములు స్టేషనులో నున్నవి.

ఇన - చూచితివా ? మానసింగ్, ఎంత ఘోరమో-(పోవుదురు.)

______

రెండో రంగము

______

(నడితోవలో చింతామణీ పిచ్చిది.)

చింతా - ఇక్కడ కొంతసేపు కూర్చుందాము. నేను నడువలేను, అలసినాను.

పిచ్చి - ఆలాగా? నేను కూర్చోలేను. అతడు నాకై యెదురు చూస్తుంటాడు. ఆలస్యమైతే ఏమంటాడో? నీవు నీ నాధునిచేర పొమ్ము. నేను నా నాధుని చేరపోవుదును.... ఇక నీ దారి నీది, నా దారి నాది. కృష్ణునికి పదహారువేల గోపికలు - నీవు నీకృష్ణుని కడక పో - నేను నాకృష్ణుని కడకు పోతాను. అందరు కృష్ణులూ ఒకటే - "ఏక మేవా ద్వితీయం బ్రహ్మ" - నీకు నీలాగూ, నాకు నాలాగూ తోచుతాడు... శఠులకు శఠుడు-లంపటులకు లంపటుడు-కపటులకు కపటి. నేను పోనా? పోనీ, కొంతసే వుండమన్నావు కనుక ఇక్కడే ఉంటాను.

చింతా - (స్వ) ఈమె యెవతయో కాని కేవలమూ పిచ్చిదానిలాగు కనబడలేదు. పైకి మాత్ర మలాగున్నది! సర్వస్వమూ విడిచిననేను ఈ మెను విడువలేనా ? బిల్వమంగళు డొక్కడే పోలేదా ? కృష్ణు డందరివాడని విన్నాను! ఈమె నింక నావద్ద నుండుమని నిర్బంధించను, ఏ మైనా కానీ. నా తలవ్రాత ఎట్లుంటే అట్లవుతుంది. కాని దీనిని విడువడమంటే ఏడుపు వస్తూన్నది, ఎంతమాత్రమూ మనస్సొప్పకుంది.

పిచ్చి - చూడు. ఆపక్షి ఒంటిగా పాడుతూ ఏలా గెగురుతున్నాదో.

              చింతా - అవగతమయ్యె నో - యమ్మ ! నీ బోధ,
                               పాడు మనసున కేది - పాలు పోదయ్యె !
                        తెలియ జెప్పిన నెంత - తెలుసుకో లేదు.
                               సన్యాసినివి నీకు - సద్భక్తి కుదిరె.
                        ఐహిక వాంఛలు - నమరియుండుటను
                               కనటు పోదయ్యె హృ - త్కమలమున నాకు.
                        బిల్వమంగళ క్షమా - విమలోదకమున
                               నగునేమొ మారన - మతిని యాచింతు,

                        సచ్ఛీలు డాతడు - క్షమియింపకున్న,
                                కృష్ణు డె ట్లాశ్రయము - కృపచేయు నాకు ?
                        సాధు వుదారుడు - సత్కుల సూతి
                                నవమాన పరిచితి - నవలేపమునను.
                        దొరకునా కృష్ణుని - చరణ దాస్యంబు ?
                                అతని వద్దకు బోయి - యంజలి జేసి
                        పదధూళి నొసగంగ - బతిమాలు కొందు;
                                క్షమియింపుమని యతని - చరణముల వ్రాల
                        ననురాగ జలదంబు - నమృతముం జిలుక,
                                క్షాళితంబయి హృదయ - కమలమున కసటు
                        నామది చేరును - నవనీత చోరు.
                                నీదుబోధన నాకు - వేద వాక్యంబు -
                        ఏకాకినై తిరుగ - నీకాననమున.
                                ఇచ్ఛయున్నది నాకు - హృదయంబులోన
                        పక్షి రాణిని బోలె - పాడుచును నెగుర !
                                పోపొమ్ము ప్రాణేశు - పొందుమో యమ్మ
                        నీకు నాయెడ ప్రేమ - నిలిచియుండినను
                                చూచి పొమ్మొకసారి - జోహారు లిత్తు.

పిచ్చి - పోతాను. పిచ్చివాళ్ళకు నేను తల్లిని. నీవు నాకు తల్లివి. (వినుట నభినయించి) అదుగో, విను. వేణునాదములాగుంది.

చింతా - ఏదీ? ఏమీలేదు. నీవు భ్రాంతిపడుతూన్నావు. పిచ్చి - పాట-

                        సలలిత మురళీ - నినాదమే అది - సందేహ మేలా ||స||
                        కాదని మరపించెదవా - ? మరల వినుసఖి-మురళి వినుసఖి
                        లలితా లాపమదిగో - నూతన రాగంబేదో||స||

                               మళ్ళీవస్తాను - సెలవు - సెలవు..(పోవును)

             చింతా - ఏడ్వకున్నా రేమి ♦ యీక్షణములార!
                              ఎప్పుడు నొరులకై ♦ యేడ్చి యెరుగరుగ!
                       అలనాడు గుణఖని ♦ యా మహామహుడు
                              అభిమానభరమున ♦ నడవికి జనియె,
                       నాడైన కరుగవు ♦ పాడు మానసమ
                              చేతనశూన్యమౌ ♦ శిలవొకో నీవు?
                       కన్నులార, మీకు ♦ కలదేని కరుణ
                              విడువుడు బాష్పము ♦ ల్వెల్లువలు గట్ట
                       తన్మూలమున నీహృ ♦ దయమాలిన్య
                              మంతయు క్షాళితం ♦ బగును సత్యంబు.
                       పాపాగ్నితప్తమౌ ♦ ప్రాణంబు దాన
                              శీతలత్వంబును ♦ చెంది సుఖియించు.
                       ప్రవహించునప్పుడా ♦ ప్రబలస్రోతమున
                              బద్దలగునేమొ నా ♦ బండహృదయంబు?
                       జీవితము నాకు తో ♦ చెడు శ్మశానముగ
                              స్వార్థాగ్నిజ్వాలల - సహియించలేను.
                       మరుభూమి యనదగు ♦ మానసంబునను

                              అంకురింపగజాల ♦ దనురాగ లతిక
                     స్వార్థాగ్ని శిఖలందు ♦ పాపసమిధలను
                              వేల్చి నన్దహియించు ♦ వేడ్క యెవ్వరికొ?
                     నను రాయిగా నెవ్వ ♦ రొనరించినారొ?
                              పతితపావన! దీన ♦ బంధు! దయాళు!
                     వేధించు నీమనో ♦ వేదనవల్ల
                              ప్రాణంబుపోయెడు ♦ త్రాణ నాకొసగి
                     హరియింపు మీవ్యధ ♦ అబలనే గాన.

(బిచ్చగాడు వచ్చును)

బిచ్చ - ఏమమ్మా ఒంటిగా కూర్చొని ఏమాలోచిస్తూన్నావు? ఇంటికి పోదామా?

చింతా - నీ వెవడవు?

బిచ్చ - నేను బిచ్చగాడిని-పిచ్చిది తాళము చెవులు నాకిచ్చింది-ఇంటికి రావలెనని నీకుంటే నేను కొనిపోతాను. అదేమి కొరకొరలాడుతూన్నావు ? నేను దొంగలాడడానికి నీవద్ద నేమీ లేదే?

చింతా - నే నింటికి రాను.

బిచ్చ - ఎక్కడికి పోదువు?

చింతా - కళ్లెక్కడి కీడిస్తే అక్కడికి.

బిచ్చ - నేను నిన్నెందు కడిగినానో ఆకారణము విను. నేను బృందావనము పోవలెనని నిశ్చయించుకొన్నాను. నీకు కూడా రావలెనని ఉంటే ఇద్దరమూ పోదాము. నన్ను పోషించే భారము మాత్రము నీది.

చింతా - నాచేతిలో ఎర్రని ఏగాణి లేదు. బిచ్చమెత్తి పొట్టపోసుకోవలసి ఉంటుంది.

బిచ్చ - నన్ను పోషించు భారము నీది.

చింతా - నే నింటికిపోయి సొత్తు తెస్తానని తలచు తున్నావు కాబోలు! అట్లు జరుగనేరదు. నాసొత్తుకోసము నాకు విషము పెట్టడమునకు తత్తరపడినవాళ్ళకి దాని నిచ్చినాను. సొత్తెట్టివిషమో వా ళ్ళెరుగరు. తాళము చెవులు నేను పారవేయడము నీవు చూడలేదా?

బిచ్చ - చూచినాను. ఉండుండు. ఈమూట విప్పుతాను, ఈ యాభరణ మెవరిది?

చింతా - అదేమో?

బిచ్చ - చక్కగా చూడు - ఇది నీది-పోల్చుకోలేదా? - పిచ్చిదాని కివ్వలేదా?

చింతా - అది నీకెట్లు వచ్చింది?

బిచ్చ - దీనిని నేను దొంగిలించ నక్కరలేకుండానే ఆపిచ్చిది నాకిచ్చింది.

చింతా - అది నీది-నాదంటా వేమి?

బిచ్చ - ఇది నావద్దనుంటే నాకు జెయిలు తప్పదు. పిచ్చిదానినీ పిల్లవాళ్ళనూ మరపించుట సులభము.

చింతా - అందుకే అది నీది.

బిచ్చ - పిచ్చిది నాకు దీని నిచ్చింది కనుక ఇది నా దన్నావు, సరే, నేను నీకిస్తాను; అప్పుడు నీది కాదా?

చింతా - నాకు సొమ్ములతో పనిలేదు.

బిచ్చ - ఒక్కసారి దీనిని పుచ్చుకో, నేను తీసుకొంటాను.

చింతా - నీకు పిచ్చిపట్టి నట్లుంది.

బిచ్చ - నేను మూర్ఖుడననీ, నీవు వివేకము కలదానవని అనుకొన్నాను... నా వృత్తాంతము చెప్తాను విను. నాకు దొంగలాడడ మలవాటు; ఈరోగము పోయేటట్టు లేదు. ఏదైనా దొంగలాడకపోతే నాకు నిద్రపట్టదు. ఇది నా కనుభవమే. ఏమి చేయగలను? ఎక్కడా పాచిక పారకుంటే ఒక చెట్టును మనుష్యుడని భావించి యీ మూట నొక కొమ్మకు తగిలించి "ఇది నీది" అని చెప్పి, అర్ధరాత్రమున చెట్టు ఆకులు కదలనప్పుడు, అది నిద్రపోతూన్నదని భావించి తక్కుతూ తారుతూ మూట మెల్లగావిప్పి వెన్క పోలీసు వారు వెంబడిస్తూన్నట్లు భావించి, పరుగుపరుగున దాటి పోయి, తుప్పచాటున నక్కి కొంతసేపటి కామూటను తలక్రింద పెట్టుకొని నిద్రపోతూంటాను. ఈ నగ నీవు పుచ్చుకుంటే నీవద్దనుండి దానిని దొంగలాడి, దాని నమ్మి యీ మూటతో నీవెంటా తిరుగుతుంటాను. నీమేలుకే చెప్పుతూన్నాను. సుకవాసివి కాయక్లేశమున కోర్వలేవు, పిచ్చి దానిలాగు నీకు శక్తికల్గితే నన్ను పోషించుదువు.

చింతా - (స్వ) పూర్వసంస్కారమా! ♦ పోజాలవేమొ

                              ఎంతకాలంబునకు ♦ అంతమొందెదవు?
                      తారాడుచున్నను ♦ తరువులనడుమ
                              కలుషితశయ్యయే ♦ కన్నులను కట్టు,
                      తనువు నమ్మితి నట ♦ ధనము చేకూర్ప.
                              జిహ్వ గోరుచునుండు ♦ శ్రేష్ఠ రుచిచయము,
                      విసమును బంధువులు ♦ మెసవింపనున్న.
                              మలినవస్త్రంబులు ♦ మదికి నచ్చవుగ
                      ఆభరణంబుల ♦ నాశించుచుంటి
                              మోహజాలంబున ♦ మున్గిపోవగను.
                      నెర చింతచచ్చిన ♦ విరుగదు పులుపు,
                              పాడుసంస్కారంబు ♦ బాధించుచుండు.
                      చిరజీవిగా దీని ♦ జేసెనో బ్రహ్మ
                              అంత మొందదు కల్ప ♦ మంతమగుచుండ!

బిచ్చ - ఏ మాలోచిస్తూన్నావు. తల్లీ పిల్లడువలె తరలుదాము రా.

చింతా - ఎక్కడికి?

బిచ్చ - నీచిత్తమునకు నచ్చిన చోటికి.

చింతా - సరే-పద....(పాడుతూ పోవుదురు)

_________

మూడో రంగము

________

వర్తకుని యింటిలో దంపతులు.

వర్త - ప్రేయసీ, నవ్వుతూన్నా వేమి?

అహ - తల నెరిసింది, ముసలివా రవుతూన్నారని నవ్వినాను. మీ రెందుకు నవ్వుతూన్నారు?

వర్త - వయస్సు ముదిరినకొద్దీ ఈషణత్రయము హెచ్చుతూందని !

అహ - మీకై తే పెళ్ళియాడవలెనని యున్నది గాని, పిల్ల నెవ రిస్తారు ? మీ రేమివీగుతారు!

వర్త - అయితే ఇక్కడున్న లాభము లేదు - పోదాము పద.

అహ - ఆలాగే కానీ.

వర్త - ఎక్కడికి పోదాము?

అహ - నాకేమి తెలుసును? మీరే చెప్పండి.

వర్త - తెలియ కేమి?

                    వలితకేశము చెప్పు ♦ పల్కులను వినుము; -
                                "వచ్చుజుమీ జముడు ♦ వడి గొనిపోవ,
                    కాలంబు సమకూరె ♦ బాలుడవు కావు,
                                ముడివేయు మీవింక ♦ ముత్తి బత్తెమును,
                    సంపదలన్ని నీ ♦ సరస రాబోవు,
                                పోవునప్పుడు రాదు ♦ పుచ్చివక్కైన,

                      కాలంబు గడిపెదు ♦ కౌతుకములందు,
                                హరిని భజింప వీ ♦ వన్యముల దగిలి.
                      బాల్యంబు జారెగా ♦ బాడిలో నాడ -
                                 కనక కామినులతో ♦ గడచె యవ్వనము -
                      పాతగిల్లిన యాట ♦ బాగులే దంచు
                                 కొత్తయాటల నాడ ♦ గోరుచున్నావా?
                      జీవితమంతయు ♦ జీర్ణించె గనుము -
                                 నీ వారలందరు ♦ నీవెంట రారు,
                      ఎట్లుపుట్టితివొ నీ ♦ వట్లె పోవలయు,
                                 చిరసంగు లెవ్వరు ♦ జేరంగ రారు,
                       ఒక్కడవె వచ్చినా ♦ వొక్కడవె పొమ్ము"

             అహ - ప్రాణనాధా, యిట్లు ♦ పాడియే తలప?
                                 మొదట పుట్టిరి మీరు ♦ ముక్కంటి కరుణ
                      మీవెన్క జేరితిని ♦ మేదినీతలము;
                                 అగ్నిసాక్షిగ నన్ను ♦ నందుకొను నాడె,
                      అర్థదేహం బిచ్చి ♦ యాదరించితిరి,
                                 మీ ప్రాణసమితియు ♦ నా ప్రాణసమితి
                      యొండొంట బంధించి ♦ రొప్పుగను మీరు.
                                 నాదు ప్రాణంబులు ♦ నాధ మీయవిగ -
                      మీదాననే గాన ♦ మిమ్మెట్లు విడుతు ?
                                 ఇద్దర మొకసారి ♦ యేగుదము నాకు
                      మీరలే ప్రాణంబు ♦ మీరలే యాత్మ,

                             మీరలే జ్ఞానంబు ♦ మీరె ధ్యానంబు,
                    వస్తువు తోడనే ♦ వచ్చుచుండును నీడ
                             చంద్రిక బాయునే ♦ చంద్రు నెపుడైన
                    భర్తవెంటనె పోక ♦ పతిపత్నులగువారి
                             ప్రకృతి ధర్మంబయి ♦ పరుగుచుండు.

వర్త - అట్లైన బృందావనము పోదాము.

అహ - మీచిత్తము.

వర్త - సరే - సిద్ధము చేయుము.

(గోపబాలుడు వచ్చును)

గోపా - అయ్యా, మీరు బృందావనము పోవుదురా?

అహ - నాధా! చూడం డీబాలు డెంత చక్కనివాడో - నీ వెవరి బాలుడవు నాయనా!

గోపా - నేను గోపాల బాలుడను.

వర్త - ఇక్కడికి కెందుకు వచ్చినావు?

గోపా - ఈలాగే తిరుగుతూందును.

వర్త - కారణము?

గోపా - మీరు బృందావనమునకు పోవుదురా అని అడుగ వచ్చినాను.

వర్త - అడగడ మెందుకు ?

గోపా - ప్రతియింటా ఈ లా గడుగుతాను.

వర్త - కారణము?

గోపా - చెప్పనా? అహ - నీవుకూడా మావెంట వత్తువా ?

గోపా - ఆఁ.

అహ - (స్వ) ఈ బాలకుని ఎత్తుకొని ముద్దాడవలెనని యున్నది. (ప్ర) మీఅమ్మ యే మంటుందో?

గోపా - నాకు తల్లీ లేదు తండ్రీ లేడు.

అహ - మీయి ల్లెక్కడ బాబూ?

గోపా - గోపకుల యింటగోవులు కాచుతూంటాను.

అహ - ఇంత చిన్నవాడవు! గోవులను కాయగలవా.

గోపా - ఆహా.

అహ - నిజముగా నీ కెవ్వరూలేరా?

గోపా - మీరే నాకు తల్లిదండ్రులు.

అహ - ఆలాగా? ఏదీ పిలువు అమ్మా అని.

గోపా - అమ్మా! అమ్మా!

వర్త - పాపము, దిక్కులేని పసివాడు.

గోపా - నాకు నేనే దిక్కు, ఇం కెవ్వరూ లేరు.

వర్త - మేము నేడే బృందావనము పోతాము?

గోపా - మరీ మేలే!

వర్త - నీవుకూడా బృందావనము రావడమెందుకు?

గోపా - నా కోచిక్కు ప్రాప్తించింది.

వర్త - ఏ దది?

గో - అందువల్ల గోవులు కాయలేను, ఆడుకోలేను, బృందావనమునకు పోలేను! నన్ను బృందావనము మీతో రానిస్తే అదేమిటో చెప్పుతాను, మీతో బృందావనము రానిస్తారా.

వర్త - ఎందుకు?

గోపా - అతనికి కళ్ళులేవు. "హాకృష్ణా, కృష్ణా" అని అరుస్తూ గుండెలు బాదుకొంటాడు, నేను చూడలేకున్నాను. దేనిలో పడతాడో అని ఎప్పుడూ కాచుకొనే ఉంటాను. కబోది-కూడే ముట్టడు. నేను బలవంతపెట్టితే కాస్తతింటాడు.

వర్త - ఆ మహ్మాత్ముడే!

అహ - ఔనౌను - బోధపడ్డది-

వర్త - అత డేడీ?

గోపా - అడవిలో నున్నాడు.

వర్త - ఏమి చేస్తూండును?

గోపా - ఎప్పుడూ కృష్ణనామస్మరణే. కృష్ణా, కృష్ణా! అని అరుస్తాడు! కృష్ణుడు ఇతని తాతముత్తాతలనాటి సేవకుడనుకొన్నాడు కాబోలు?

వర్త - (నవ్వి) ఇంకా ఏమి చేస్తూండును?

గోప - జపమూ, సాష్టాంగ నమస్కారాలు. ఒకప్పుడు నేల నెత్తి కొట్టుకొంటాడు...మీవెంటా అతన్ని తీసుకొని పోతారా?

వర్త - ఆతడు వస్తాడా?

గోపా - నే నొప్పించి తీసుకొస్తాను. బృందావనము తీసుకొనిపోతే అక్కడ కృష్ణుడు దొరకుతాడువర్త - ఆ సంగతి నీ కేలాగు తెలుసును?

గోపా - కృష్ణనామస్మరణతప్ప అతని కింకో పనిలేదు, ఆలాటివాడు బృందావనము పోతే కృష్ణుడు డగపడడూ?

వర్త - బృందావనము పోతే కృష్ణుడు లభించునా?

గోపా - దొరకడేమి ? నీవు గొప్ప జ్ఞానివే!

అహ - నీకు కృష్ణు డగుపడ్డాడా?

గోపా - నేను కృష్ణా కృష్ణా అని తదేక ధ్యానముగా భజన చేస్తున్నానా ? నామనస్సంతా గుడ్డివానిమీదే ఉంది, అతని నామమే నేను స్మరిస్తూంటాను. నా కతడే కనిపిస్తూన్నాడు. దేనిమీద గురి ఉంటే అది లభించును.

వర్త - నీమాటలు వింటే నాచిత్త క్షేత్రమందు కొత్తగా ఆశాంకూరము మొలుస్తూంది...బృందావనము వెళ్లితే ఎవరికి దేనియందు గురిఉంటే వారికది లభిస్తుందా?

గోపా - పోయి చూడరాదా?...నేనాతనితో చెప్పనా?..మీరు రేపుచేరి నావపై పోతారు కదా? నే నతని నక్కడికి తీసుకొని వస్తాను. నదియొడ్డున మర్రిచెట్టుక్రింద అతడున్నాడు, అక్కడ బ్రహ్మరాక్షసి నున్నాదని వదంతి-ఆ చెట్టు క్రిందే అత డున్నాడు! నాకు వేళ మీరుతూన్నది, నేను పోతాను, మీరు రండి..(పోవును)

అహ - ఈబాలుడు గోపాలునిలా గున్నాడు. అమ్మా అని పిలిచినతోడనే నాకు ఒళ్ళు పరవశ మయింది.

వర్త - ఇతడు రావడము చేతనే మన కాశ కల్గింది. ఆమహాత్ముడు మనవెంట వస్తాడా ? మనయింట నుండుమంటేనే ఆతడు సమ్మతించలేదు. దగ్గరే ఉన్నా మనకు దర్శన మబ్బ లేదు... ఈ గోపాలు డెవడో?...నందబాలుడే కాడు గదా! భీక రారణ్య మధ్యమున చీకును కాచుకొని యున్నాడట ! భక్తవత్సలుడైన పరమేశ్వరుడే కాబోలు?

అహ - కోరకుండానే బంధువున్నూ, కనకుండానే కొడుకూ నాకు లంభించారు, నేను గొడ్డువీగినాను. ఈయిద్దరినీ వెంటబెట్టుకొని బృందావనము పోదాము.

వర్త - వాళ్ళు మనవెంటా వస్తారా అని సంశయిస్తూన్నాను.

అహ - తప్పకుండా వస్తారు..ఆ బాలుడు సామాన్య గోపబాలకుడు కాదు. సాక్షాత్తుగ నందనందనుడే! అన్నమాట తప్పుతాడా?

వర్త - సరే-ఇం కాలస్య మెందుకు? ఇప్పుడే పోదాము.

________

నాల్గో రంగము

________

బిల్వ - హకృష్ణా! కృష్ణా! ఎక్క డున్నావు? నాకగుపడవా? నీ వంతర్యామివి కావా? నాప్రాణ మతి వ్యాకుల మైంది. ఇప్పుడైనా దర్శన మివ్వవా?...దీనదయాళూ ! అనాధ నాధా! ఎక్కడున్నావు? కృష్ణా! కృష్ణా! (పడిపోవును)

గోపా - (బిల్వ||చెవిలో) కృష్ణ, కృష్ణ, కృష్ణ! బిల్వ - (దద్దిరిల్లి లేచి)

                      ఏడి కృష్ణుండేడ కేగెను? ♦ వేణునాదం బెట్లు వినబడె?
                                శ్యామలంబగు చంద్రబింబము ♦ సరస చేరదుగా !
                      నాదు కోర్కెల నడ్డు నెవ్వడు? ♦ నీలవర్ణుడు మిర్దయుండా ?
                                ఐనకాని మ్మతనిపంతము ♦ ఆర్తి యణగదొకో ?
                      చెంతజేరియు చిక్కడాయెను ♦ కాలమంతా కడచుతున్నది,
                                కాయముండిన కార్యమేమిల? ♦ అంత యస్థిరమే !
                      తెలుసుకొంటిని తెలివివచ్చెను ♦ నోచితిని కొరనోములన్నియు
                                ఏమిచేతు నికెందుపోవుదు? ♦ ఏదికనబడ దే!
                      శ్రీహరిని నిట కెవరుచేర్తురు? ♦ వీనులందున వేణునాదము
                                నింపి కావుము నీలవర్ణా ♦ నీకు మ్రొక్కెదరా?
                      మోవి పిల్లనగ్రోవి నూదుతు ♦ శిరమునను సిగ శేఖరింపగ
                                కరమునను కంకణవ్రజము ♦ ఘళ్లుఘళ్లుమనన్;
                      చెన్నుమీరెడు చిరుతపాపడ! ♦ వన్యసుమముల వరుస లలరగ
                                నన్నుబ్రోవుము నల్లనయ్యా ! ♦ నాకు దిక్కెవరు ?

గోపా - నీకు దిక్కు లేకేమి? నీవద్ద నే నున్నానే!

బిల్వ - తిరిగి వచ్చినావా ? గోపాలా, నీవు నన్ను పాడుచేయనెంచినావా ? నీమాట వినబడగానే నాకు శ్రీ కృష్ణుడు మరుపు వచ్చును. నీ వెవడవు బాబూ ! దిక్కుమాలిన నాపైని నీకు వాత్సల్యమెట్లు కలిగింది? నన్ను విడిచి పోదూ నాయనా ? నాకు సద్గతి లేకుండా ఏలా బాధించుతావు?

పట్టుకొందును పాదపద్మము ♦ లెట్టుతీర్చెదొ తాపజ్వాలలు

                                 కట్టికుడుపుచు నున్న పాపము ♦ లెట్లు నశియించున్?
                     పొమ్ము కృష్ణుని నరసిరమ్మా ♦ అమ్ముకొందును నీకు దేహము
                                 తెమ్ము కృష్ణుని లేకయుండిన ♦ వమ్ము బ్రతుకు సుమా?
                     ఏల తీసెదు నాదుప్రాణము ? ♦ జాలి యిసుమంతైన లేదా ?
                                 కలయె కద సంసార మంతట ♦ కలుగు చేటు యిటుల్.
                     కాటి కిక నే కాలుసాచితి ♦ నీటముంతువొ పాల ముంచెదొ
                                 కూటికిని మరి గుడ్డకేనియు ♦ కోరబోను నినున్.
                     నాకు తోడుగ నిట్టియడవిని ♦ పాకులాడగనేల నీవిక
                                 నీకు తెలుసును తెమ్ము కృష్ణుని ♦ పోకు పెరపోకల్.
                     ప్రేమక్షుధ దహియించుచున్నది ♦ నా మనో వాంఛితము తీరదు
                                 కామజనకుని గాంచగల్గిన ♦ కామమే యడుగున్.

గోపా - నే నెంత మొరపెట్టినా ఆహారము నంటకున్నావు?

బిల్వ - తింటాను కాని నీవుపో, నీవు నాదగ్గరుంటే కృష్ణుని మీదికి నాచిత్తము పోనే పోదు. త్వరలో పోయిరా బాబూ?

గోపా - భోజనము చేసెదవా ? నేను కాక వేరెవ్వరు నిన్నిట్లు నిర్బంధించేవాళ్లు? బ్రహ్మారాక్షసి భీతిచేత ఇక్కడి కెవ్వరూ రారు.

బిల్వ -

                      అరుగు మిప్పుడే నీవు - గోపాలా - బాధ - భరియింపజాలను ||గో||
                      నల్లనయ్య చిక్కడాయె-గో|| మనసు-తల్లడిల్లు చున్నదయ్య||గో||

బిల్వ - అన్నా ! నీ వెక్కడనాకు ఎదురుచుక్కలాగు దాపురించినావు! నిన్ను వదలుకో లేను! చక్కినుంటే చావమివ్వవు !

గోపా - నీకు బృందావనము పోవలెనని లేదా ? నడువు-పోదాము.

                       సనకాది యోగిసుతు-జనకాది యోగినతు
                       కనక వసనాలంకృ-తుని గాంతు వచటన్.

బిల్వ -

                       బృందావనమున కేగుదుము-అట-కందర్పజనకుని గాంచుదము||
                       ప్రేమధామమునుజేరుదము-మన-కామిత ఫలముల గాంచుదము
                       యమునాపులినమునరయుదము-అనయము గో-పాలునిపాడుదము
                       ఆలమందలనుగాయుదము-వన-మాలాధరుతో నాడుదము
                       గోపబాలు నటగూడుదము-మన-పాపసంచయముబాయుదము||
                       కృష్ణకృష్ణయని కేరుదము-మన-తృష్ణల దీర్పగ వేడుదము||
                       పార్థసారథిని పాడుదము-పురు-షార్థములన్నిటి బడయుదము||
                       ఈషణత్రయమును వీడుదము-భక్త దూషణసరులత్యజించుదము
                       యుక్తులన్నిటి నొలయుదము-అల-ముక్తిసతీమణి ముట్టుదము.
                                                                 (పోబోవును)

గోపా - అటు కాదు, బృందావన మిటుంది. (త్రిప్పును)

బిల్వ -

                      కందు మల బృందావనంబును-అందమున నగునందనంబు-ము
                                     కుందపదరాజీవరంజిత-సైకతస్థలముల్||

                     జుమ్ముజుమ్మను తుమ్మెదలరొద-లిమ్ముగా మురళీరవమ్మును
                                కమ్మనగు పారిజాతమ్ములు-గ్రమ్ము వాసనలన్||
                     గోపికాబృందంబు నడుమను-గోపబాలుడు పట్టమహిషులు
                                తాపసేశ్వరు లెల్ల గొలువగ - రాసములు సలుపన్||
                     కట్టిపీతాంబరము చేతను-పట్టిమురళిని పాలసంద్రపు
                                పట్టి రాధయు రెండుప్రక్కల-నింపుతళుకొత్తన్||
                     మాధవార్పితమైన భక్తి ర-మాధవార్చనలగ్నశక్తియు
                                సాధనంబులు గాన ముక్తియు-సాధ్యమగు మనకున్||
                                గోపా - దా, పోదాము
                                       తోడిరాగము
                     బృందావనవీధులగో-బృందములను గాచుదము
                               సుందరులగు గోపయువక-దంబంబుల సందడితో||బృం
                     ధ్యానించుచు శ్రీకృష్ణుని-గానము వినుచుండి సుధా
                               పానముజేయుచును దేవు-నాసనమును వీక్షించుచు||బృం