బిల్వమంగళ/ఐదో అంకము
ఐదో అంకము
________
మొదటి రంగము
(బృందావనమున గోవర్ధనగిరి ప్రాంతము)
చింతా - లోగడ ఆత్మవంచన చేయడమునకు నీ వెన్నో వేషములు వేసినావు. శ్రీ కృష్ణు కృపారసము నీపైని వర్షించడాని కెట్టి వేషము వేయవలెనో ఎరుగుదువా ? మా నవులను వశపర్చుకోవడమునకు స్వర్ణాలంకారములను ధరించవలెను, చిత్తమును పాపపంకిల మొనర్చవలెను. ఇప్పుడో, వాటితో పనిసరి. ఇకను విభూతిధారణమే శరణ్యము. లేకుంటే శ్రీ కృష్ణుని కృపకు పాత్రురాలవు కావు - ఇట్టి సుందర పవిత్రాంగలేపన మిదివర కెరుగవు. (పులుము కొనును)
వేషభూషణముల ♦ వేడబము చెల్లె,
కేశపాశమ ! యికను ♦ కికురింప గలవె ?
నాదు మిత్రుడవని ♦ నన్ను వంచించి,
అందకాళ్ళకు మోద ♦ మందజేసితివి,
ఉరులజిక్కియు స్రుక్కి ♦ ఉరుమనో ధైర్య
మును విడనాడి, సత ♦ మును నిన్ను గొల్చి,
భ్రాంతులై, వ్యామోహ ♦ ధ్వాంతమున బడిరి.
శఠుడవు నీవు వం ♦ చకుడవుగాన,
మొదలంట ఖండింతు ♦ సదయులను నింక
వంచింపనేరవు ♦ క్రించుదనమునను;
పాపంబు తొలగ గో ♦ పాలుని కరుణ
వర్షించు, చేకూరు ♦ హర్ష మనిశంబు,
నినుద్రుంప జను పాప ♦ నిచయ, మటుపైని
పతితురాలని బ్రోచు ♦ పతితపావనుడు.
(గోపాలుడు వచ్చును)
గోపా - చాల్చాలు! కేశపాశము నేల ఖండిస్తావు? వద్దు, వద్దు.
చింతా - ఎవ్వ డీ బుడుతడు? వీనిని చూస్తే కళ్లు చల్లనౌతున్నవి.
గోపా - నీవేనా కృష్ణనామస్మరణ చేసినావు?... మాటాడవేమి?...నేనుపోతాను.
చింతా - నీ వెవడవు?
గోపా - నీకు మర్యాద తెలియదు. "ఎవడవు నాయనా?" అనవలెను...అప్పుడు నీతో మాటలాడుతాను.
చింతా - ఎవరి బాలుడవు నాయనా? నిన్ను చూడగానే నాహృదయమున దడ పోయి మనస్సు కుదుటబడ్డది ....ఒక్క మాటాడవా?
గోపా - ఇప్పుడు మనము మిత్రులము-నేస్తము కట్టుదామా?
చింతా - అమ్మయ్య! ప్రాణాలు లేచివచ్చినవి.
గోపా - అయితే కృష్ణుని ప్రేమింతువా? నన్ను ప్రేమింతువా?
చింతా - అయ్యో! నాహృదయము ప్రేమశూన్యము, ప్రేమించుభాగ్యము నా కబ్బునా?
గోపా - కృష్ణుని ప్రేమించి తన్నామస్మరణ మాచరించు, నీ కలవరము తీరును-నేను పోవుదునా?
చింతా - వద్దు-నీవు పోవద్దు, నా మనవి విను.
గోపా - బృందావనము చేరినాము-ఇప్పుడు చెప్పు-కృష్ణుని ప్రేమిస్తావా? నన్నా?
చింతా - ఇద్దరినీ ప్రేమిస్తాను.
గోపా - అది పొసగదు. ఎవరినో ఒకరినే నమ్ముకో-నన్ను నమ్ముమని నిర్బంధించను-నీవే ఆలోచించుకో (బిచ్చగాడు వచ్చును)
బిచ్చ - అహా! ఏమి మోహనగోపాలమూర్తి! ఇతడు వ్రజబాలుడేమో?
గోపా - మనము నేస్తుల మౌదామా?
బిచ్చ - ఆలాగే (మూట సర్దును)
గోపా - అయితే, దొంగా! మూట దాస్తా వేమి? బిచ్చ - అబ్బే! ఇందులో ఏమీ లేదు...(తడబడును)
గోపా - లేకుంటే అది యీలాగు తే. ఆ ముడి ఎందుకు?
బిచ్చ - ఓహో! ఇది బృందావనము. (మూట పారవేయును)
చింతా - ఏమి నాయనా, నాతో నేస్తముకట్టి ఇంకొకనితో మైత్రి చేస్తావా?
గోపా - ఏమీ? కూడదా?
చింతా - ఆలాగైతే మనకు మైత్రి పొసగదు.
గోపా - పోనీ, నన్ను పిలిచినప్పుడే వస్తాను! (పో బోవును)
చింతా - ఆఁ ఆఁ. ఉండుండు.
గోపా - ఎందుకూ ? మనకు పొసగ దన్నావే! (పోవును)
బిచ్చ - బాబూ, బాబూ, కొంచె ముండు.
చింతా - అయ్యో! పోయెనే! నా కాకలి వేస్తూంది.
బిచ్చ - ఏమైనా తెచ్చిపెట్టనా?-అదిగో పిచ్చిది.
(పిచ్చిది వచ్చును)
పిచ్చి - తెలిసింది-శ్రీకృష్ణుడు నన్నుబ్రోచును, నాతల్లిని చూడగానే నాకు ధైర్యము చిక్కింది. కాత్యాయని నారాధించి గోపికలు శ్రీకృష్ణుని పొందినలాగు నే నేమి నాశ్రయించి నాకోర్కె సఫలము చేసుకుంటాను. మాఅమ్మ ఎవరితో మాట్లాడింది? అధికతేజోవంతుడైన ఆసన్యాసి ఎవరు?
బిచ్చ - ఈమె యిచ్చటికి వచ్చింది గనుక నా కాశ్రయము దొరికింది. (పిచ్చిదీ శిష్యులూ వెంటరా సోమగిరి వచ్చును.)
పిచ్చి - మన కిక్క డేమిపని? పోదమా? ఇల్లు విడచి చాలాకాలమయింది!
సోమ - ఔను, పోవచ్చును.
పిచ్చి - నా మానసమున నేదో యుండి ఇన్నాళ్ళూ నన్ను తిప్పింది. ఎం తవమాన మయింది! అడవులన్నీ తిరిగి తిరిగి దిమ్మరి నైనాను.
చింతా - అమ్మా, కరుణామయీ, నాతో నొక మాటాడవా?
పిచ్చి - తల్లిని నేను కాను. ఇతని నడుగు.
చింతా - నీకొర కెంతో వెదకినాను, ఎందరినో అడిగినాను. నా మనోవాంఛాఫలసిద్ధి అయ్యేటట్టు నన్నాశీర్వదించు. (సోమగిరితో) మహాత్మా, నాకు తరణోపాయ మేది? నేను దౌర్భాగ్యురాలను. రాధావల్లభుడు నాబాధల తొలగించునా?
సోమ - అతడు పతితపావనుడు, తప్పకుండా నిన్ను దరిజేరుస్తాడు, చింతించకు.
చింతా - పాషాణనిర్మితము ♦ దోషకలితంబును
నీరవ మరుభూమి ♦ నీరవర్జితము
నామనం బటనెట్లు ♦ ప్రేమ జనించును?
అనుతాపవహ్నిచే ♦ తను దగ్ధమయ్యె,
ప్రేమాంకురం బెట్లు ♦ పెంపొందుదీన? నిది
ఆర్పింప కృష్ణునకు ♦ నర్హ మయ్యెడునా?
లేకున్న దయజేసి ♦ నాకు బోధింపుమా
ఏ తెరంగున్నదో ♦ ఏర్పరచి తండ్రి!
పాత్రత యబ్బ గో ♦ పాలునిదయకు నే
డైహికమందు నా ♦ కరుచి జనియించె!
సోమ - అమ్మా, నేను దీనుడను, హీనుడను, నీ కేమి యుపాయము జూపగలను? ఈపురముననే బిల్వమంగళుడను సిద్ధుడున్నాడు. అతని శరణు వేడితివా, తరణోపాయము తప్పకుండా చూపగలడు.
చింతా - అయ్యా! మీరు నాకు గురువులు-ఉపాయముందని విన్నతోడనే నా కాశ కలిగింది, కాని నేను మహా పాతకిని, ఆతని యెడ నెన్నో అపరాధము లొనర్చినాను.
సోమ - సంకోచింపకు. ఆతడు పరమయోగి, అపరాధములను లెక్కచేయువాడు కాడు.
చింతా - నా దురదృష్టమువల్ల మీ యుపదేశము విఫలము గాకుండుగాక! ఆత డెక్కడ నున్నాడో సెలవిచ్చెదరా? ఇక్కడికి వచ్చినప్పటినుండీ వెతుకుతూన్నాను, దర్శనము కాలేదు.
పిచ్చి - నేను చూపిస్తాను రా. నీవు నాకూతురివి కనుక నిన్ను నీపతి కర్పించుతాను. ని న్నక్కడ విడిచి పోయె దను - ఏడువకు!
బిచ్చ - అమ్మా! నీకొడుకును మరచినావా?
పిచ్చి - లేదులేదు - నీవూ నావెంట రా.
బిచ్చ - నా కేదేనా తరణోపాయ ముందా?
సోమ - నీవు మంచివాడవు, ఈబృందావన మానంద ధామము. ఇక్క డెవ్వరూ దు:ఖించ నవసరము లేదు.
బిచ్చ - నేను దొంగనే!
సోమ - మరీ మంచిది! నవనీతచోరుని దొంగిలించు.
బిచ్చ - గురువర్యా! శక్తియుంటే అందుకు తగిన వాడనే!
సోమ - నీసుతుని వెంటబెట్టుకొని రా, నేను గోవర్ధన గిరికి ప్రదక్షిణము చేసి వస్తాను.
పిచ్చి - సరే, వీరి నిద్దరినీ అక్కడ చేర్చుతాను-ఇంకాలస్య మెందుకు? మనకు తిరిగీ సమావేశ మెక్కడవుతుందో? (పోవును)
______
మూడో రంగము
_______
(వనములో బిల్వమంగళుడు)
బిల్వ - ఈగోపాలుడు నన్ను పాడుచేసినాడు! ఎన్ని విధముల యత్నించినా మరుపు రాకున్నాడు. వీనిమోహమున తగులుకొన్న నాకు శ్రీకృష్ణదర్శనము ప్రాప్తించదు. ఈ సాయంకాలము దాకా వేచి యుంటాను. ఈలోపున చిత్తస్థైర్య మలవడిందా సరే. లేకుంటే ఆత్మహత్య కావించుకొంటాను. అన్నా! నామన:ఫలకమున ఈగోపాలు డేలాగు దాపురించినాడు? వీడే నాచేటునకు మూలకారకుడు. హా! కృష్ణా! నన్నేల మరపిస్తూన్నావు? నన్ను భ్రష్ఠుని చేసెదవేమి? ఈగోపాలుని నామానసమందు అచ్చొత్తి నీవు కనుమొరగితివా? వీడిని వదల్చుకొని నేటికి వారమయింది. కాని వానిరూపము నన్ను వదలకున్నది-అనుక్షణమూ వాడే నామనోవీధిని కాపురముండి నీకు చోటియ్యకున్నాడా ? అతడుంటే నేనెట్లు రాగలనని నీవు రాకున్నావా? నేనేమి చేయుదును? ఈభ్రష్టుడు నా కేమి మందుపెట్టి నాడో కాని నేనతని మరువజాలకున్నాను. నా చిత్త మాతనియందే లగ్నమయింది. ఇరువై రోజులు భుజించకుంటే ప్రాణములు పోవునని వింటిని-అందుచేత నిరాహారుడనై నిన్నే ధ్యానించుచున్నాను. ప్రాణములు పోకున్నవి. ఈగోపాలుడు నన్ను చావనీయకున్నాడు! నిన్ను ధ్యానిస్తూ ఇక్కడే కూర్చుంటాను - చచ్చినా సరే-(ధ్యానించి) గోపాలా! గోపాలా! నేను శ్రీకృష్ణుని ధ్యానిస్తూంటే నీవు కనబడుతా వేమి?--ఇంకోసారి యత్నించెదను. కన్నులారా, చెవులారా, మీరు వీని వ్యామోహము విడువండి. కళ్ళంటే పొడుచుకొన్నాను గాని చెవు లేలాగు మూయగలను? కృష్ణుని రూపము చూడలేక పోయినా, ఆతని మాటలైన వింటాను. కళ్ళులేని లోప మిప్పుడు కనబడుతూంది. మూఢమానసమా, ఈబండ గోపాలుని మరచి నందగోపాలుని ధ్యానించు. గోపాలా! గోపాలా! (ధ్యానించును.)
(గోపాలుడు వచ్చును.)
గోపా - నీ విక్కడా దాగుకొన్నావు? ఏడురోజుల నుండీ నీకోసము ఊరంతా వెతకుతూన్నాను.
బిల్వ - నన్ను నీవు వెదకడమెందుకు?
గోపా - నీవు దిక్కులేని వాడవు - అనాధలను చూస్తేఎ నామనస్సు కరుగుతుంది.
బిల్వ - దిక్కులేనివాళ్ళ మీద నీకు అనురాగ మెందుకు?
గోపా - అది నా నైజము.
బిల్వ - (స్వ) మూఢమానసమా! ఈ గోపాలు డనాధనాధుడైన నందగోపాలుడే కాబోలు! (ప్ర) గోపాలా! గోపాలా! దయజూపి నన్ను దరిజేర్చవా?
గోపా - నీదగ్గర రాను-నన్ను పట్టుకొంటావు! బిల్వ - లేదులేదు-దగ్గర రా!
గోపా - పాపము! వారము రోజులనుండి నీటిచుక్కైన తాగలేదు, ఇవిగో పాలు, ఎండలో నున్నావు, నీడకు రా.
బిల్వ - నాకు కనబడదు, నాచెయ్యి పట్టుకో.
గోపా - రా. (చేతి నందిచ్చును)
బిల్వ - (గట్టిగా పట్టుకొని) ఇక నిన్ను విడువను-ఇన్నాళ్ళూ నన్ను మరపించినావు.
గోపా - నాచెయ్యి నొప్పి పెట్టుతూన్నది! వదలు. (పారిపోవును)
బిల్వ - మరపించి పోవుట ♦ మానుషంబే నీకు?
ఏడ్పింతు దయచూడ ♦ కిదియేటి మాద్రి?
తప్పించుకొనిపోవ ♦ గొప్పయని యెంచితో?
నాదుహృదయంబునను ♦ నాదుకొను భక్తి
పోగొట్టయత్నించు ♦ పొగడుదు నిన్ను. నా
చేయివీడిననేమి? ♦ చేతమిదెనిన్ను
గట్టిగాబంధించె ♦ పట్టు సడలబోదు
కన్నులేమిని నిన్ను ♦ గందు ననజాల.
మనమున నిల్పి నే ♦ మననంబు చేతును,
ఉండునో నీరూప ♦ మూడునో గాంతు.
గోపా - కో! ఏదీ నన్ను ముట్టుకో-(చుట్టూ తిప్పును)
బిల్వ - మహాత్మా! నిన్ను ముట్టుకొనడాని కెంత పుణ్యముచేసి యుండవలెను. నీవుకృపజూడకున్న నాబోటివారి కది సాధ్యమవునా? కర్మపరిపక్వము కావలదా?
గోపా - ఇదే నీకు జ్ఞాననేత్ర మిచ్చినాను. నా రూపము కన్నార గాంచుము.
బిల్వ - ఆహా! ధన్యోస్మి! ధన్యోస్మి! చూడదగినది చూచినాను - నాతపస్సు ఫలించినది.
నవీనజలధర శ్యామసుందర ♦ మదనమోహనరూప
నయనఖంజనా హృదయరంజన ♦ రాధావల్లభ గోపా||
ధీరనర్తనా సూపురగుంజన ♦ మురళీమోహన తాన
కుసుమభూషణా ఆర్తపోషణా ♦ శరణు గోపికాప్రాణ||
శ్రీపదపంకజనీదు పదరజము ♦ దయజేసియు దరిజూపరా
నిన్నే నమ్మితి నిన్ను భజించితి ♦ నీలో నన్నిక జేర్పరా||
గోపా - ఎవరో వస్తూన్నారు. నేను దాగుకొంటాను. వారు నీకోసము వస్తూన్నట్లుంది, నీవిక్కడే ఉండు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను వస్తాను.
బిల్వ - అమ్మయ్యో? నీవు వెళ్ళకు. నాకింకెవ్వరితోనూ సంబంధము లేదు.
గోపా - ఏమోకాని వాళ్ళేడుస్తూ వస్తూన్నారు. వారిని చూస్తే నాకూ ఏడ్పు వస్తుంది. అందుకే నే నిక్కడుండను.
బిల్వ - ఆహా! నీకేడుపు తెప్పించునంతటివా ళ్ళెంత ధన్యులో!
గోపా - ఇప్పుడే తెలుస్తుంది గా! ఇక్కడే ఉండు. నే నీ చెట్టుచాటునే ఉంటాను. అదిగో వస్తూన్నారు! (పోవును)
(వర్తకుడూ భార్యా వత్తురు)
వర్త - ప్రియా, ఆ గోపాలు డెవడు? బృందావనమున కృష్ణుడు లభించునని చెప్పి మాయమైనాడు!
అహ - అదేమో కాని, ఆబాలుడు న""న్నమ్మా" అని పిలుస్తునే నాకు కృష్ణు డక్కరలేదు.
(తెరలో) - అమ్మా!
అహ - నాయనా, ఎక్కడ నున్నావు? ఇటురా, ఇటు (తెరలో) - నే నీ చెట్టుచాటున నున్నాను-మీరు కూర్చోండి.
బిల్వ - ఆహా! ఎట్టి దివ్యసుందరవిగ్రహము చూచినాను! గోపాలా! గోపాలా!
(చింతామణి, పిచ్చిది, బిచ్చగాడూ వత్తురు)
పిచ్చి - నీవు ముందరపో అమ్మా! అల్లుని యెదుటకి నే నేలాగు రావడము! నే నిక్కడ కూర్చుంటాను - అయ్యా నీవూ కూర్చో. ఇది పుచ్చుకో. (బంగారువస్తువు లిచ్చును.)
బిచ్చ - ఇది నా కెందు కమ్మా?
పిచ్చి - అక్కర లేదా? ఇలాగే పరులసొమ్ము ఆశించకు!
బిచ్చ - అలాగే.
(సోమగిరి శిష్యుడూ వత్తురు)
సోమ - సంసారాంబునిధీమగ్నులకు వైరాగ్యభిక్ష నొసగడమున కీ వేశ్యయూ ఆ లంపటుడున్నూ నిమిత్తమాత్రులు, వీరిద్దరి కృపచేత మనకు నేడు శ్రీకృష్ణుని దర్శన యోగము కలుగు తుంది.
శిష్యు - గురుదేవా ? నే నజ్ఞానుడను - మీ రిప్పుడు చెప్పిన వేశ్యకూ, ఆ లంపటునికీ కోటి ప్రణామములు. శ్రీ కృష్ణుని దర్శనమునకు ఫలమేది?
సోమ - వత్సా ! శ్రీ కృష్ణదర్శనమునకు శ్రీ కృష్ణ దర్శనమే ఫలము. దానికన్న నెక్కువఫల మేమున్నది?
చింతా - అమ్మయ్య!
కష్టములు గట్టెక్కె ♦ నిష్టములు ఫలియించె
సన్యాసివర నీదు ♦ సందర్శనమున.
చల్లనాయెను కళ్లు ♦ శాంతించె మానసము
నాదెసజూచి విను ♦ నాదు విన్నపము.
చరణదాసిని నీదు ♦ దరి జేర్పగారాదె?
సదయ హృదయుడ వీవు ♦ స్పర్ధ నీకేల?
నీకు తగునా యింత ♦ నిష్ఠురము నా దెస?
ఓ దయాంబుధి చేర్చు ♦ నీదు నాశ్రయము ?
చందమామ వెంట ♦ చంద్రిక బోవనౌ,
మేఘమాల వెంట-మించు బోవు.
కృపజూప వేని నే ♦ నిపుడె త్యజింతును
ప్రాణముల నీమెడ ♦ పాతకము జుట్టు.
స్త్రీ హత్య సంక్రమిం ♦ చిన నూర్ధ్వ!గతులున్నె?
దక్కవు నీకు నన్ ♦ దయజూడకున్న.
నీవు క్షమించిన ♦ నేవత్తు త్రిదివంబు,
ఇద్దర మట నుంద ♦ మీక్షణము లట్ల.
పరితాప భరమున ♦ పాపము ల్కడచనె,
కృపచేసి చూపుమా-కృష్ణు కళ్లారన్||
బిల్వ - ఆహా ! శ్రీకృష్ణనామ మెవ రుచ్చరించినారు! (చింతామణిని పోల్చి) ఓహో! ఏమది! నాగురువు! ప్రేమశిక్షాదాతా! విశ్వమోహినీ! నన్ను కరుణింపుము. (నమస్కరించును.)
చింతా - ప్రభూ ! ఇంకా వంచనయేనా ? - ప్రేమ మయా! యోగివర్యా! ప్రేమ స్వరూపుడగు భగవంతుడు నీవద్ద నున్నాడు. నిన్నేమడిగిన నది యిచ్చెదవని నాగురువు నా కుపదేశించెను. నీకృష్ణుని నాకిమ్ము - ఇవ్వడమున కిష్టము లేకుంటే నీవద్దనే నిల్పుకొని నాకొక్కసారి చూపించుము. పాపాత్మురాల - పతితపావను సందర్శనము నాకు కల్గించుము.
బిల్వ - కృష్ణునియందే నీచిత్తము జొత్తిల్లిన కాని నీకు దర్శనము కాదు. అది సాధకమున చేకూరును కాని ఒకరిస్తే లభించేది కాదు.
చింతా - నా హృదయము ప్రేమ శూన్య పాషాణము. యోగివరేణ్యా! శ్రీకృష్ణుడు నాకు చిక్కు టెలాగు?
బిల్వ - భక్తిచే సకలమూ సిద్ధించ గలదు. తరింపన్ - కోర్కె కలదేనిన్ - తలపుమీ - కృష్ణునామాళిన్!
నిరంతర - మాతనిన్ - కరుణానిరతునిన్ - నిల్పుమా మదిని||త||
మదింపకు భాగ్యమున్ ధనమున్ ఘనంబౌ - మానముం జూచి
ఎదంగని న్యాయనిర్ణేత పరాత్పరు-డేలు నిన్నంచున్||త||
శరీర దుర్గమం దకటా చరింతురు-శత్రులారుగురు
--కును మాని భవవార్ధిన్ గడుపుమా-భక్తియను నౌకన్||
చింతా - యోగివరా ! నీవు కృష్ణుని జూపుదువని నా గురు వుపదేశించెను, ఏడీ చూపు మాకృష్ణుని-లేకున్న ఆప్త వాక్య మబద్ధమవును!
(తెఱలో) నన్ను మరచినారా?
చింతా - చూచినానా నిన్ను ? ఆగోపాలుడే నన్ను ప్రేమించెను. నేను ప్రేమశూన్యను. గోపాలా - ఆదదానను అజ్ఞురాలను, నాపై కోపమా ? నీకు నాపైని పంతమా? దయచేసి దర్శనమియ్యవా?
(తెఱలో) ఇక్కడికి రా, చూచెదవు.
(తెర ఎత్తితే రాధా కృష్ణులు ప్రత్యక్ష మవుదురు)
అందరు - జే రాధావల్లభా! జే జే రాధాకృష్ణా జే! జే! జే!
వర్త - ఆహా ! కలియుగమున వైకుంఠము!
అహ - ఏది నాయనా ఒక్కసారి "అమ్మా" అనుము.
గోపా - అమ్మా! అమ్మా! చింతా - హృదయమందలి దప్పి తీరునట్లు కృష్ణదర్శన సుధా రసముగ్రోలుడు. భక్తులారా! - భాగవతోత్తములారా! జన్మ సార్థక మవును.
శిష్యు - గురువర్యా! శ్రీకృష్ణ దర్శనమునకు ఫలము శ్రీ కృష్ణదర్శనమేకదా!
సోమ - వత్సా, నిరతిశయానంద వైభవము నొసంగ జాలున దింకోటి లేదు-దాని ననుభవించుటే ఉత్కృష్ట ఫలము.
బిచ్చ - నవనీతచోరా, నిన్ను దొంగిలించగల్గితే నా చౌర్యవిద్య సార్థక మవుతుంది.
పిచ్చి - నా కేడ్పు వస్తూన్నది. నానాధుడు లేడు, నే నొక్కర్తె నైనాను. అతని వెతకి తెచ్చి శ్రీ కృష్ణుని చూపుతాను.
సోమ - అమ్మా ! మనకర్మ ఇంకా పరిపక్వము కా లేదు. కొంతవరకూ పారబ్ధ మనుభవించవలెను. పోదాముపద.
బిల్వ - శ్రీ గురుచరణాల విందములకు నమస్కారము! భక్త బృందమునకు ప్రణామము! మీయందరికృపచేత గోపీ వల్లభుని దర్శనము ప్రాప్తించినది, తరించినాను.
స:నా వవతు, స: నౌభునక్తు, సహవీర్యం కరవావహై,
తేజస్వినా వధీత మస్తు-మా విద్విషావహై-
ఓం శాంతి శ్శాంతి శ్శాంతి:.
సమాప్తము.