ప్రబంధ రత్నావళి/పీఠిక

వికీసోర్స్ నుండి

శ్రీ గురుభ్యోనమః

పీఠిక

ప్రాచీనకావ్యాలంకారము లిప్పుడు కొన్ని బయల్పడుచుండుట మనయాంధ్రభాషావధూటి యదృష్టవిశేష మనవచ్చును. చెల్లాచెదరులై లోకమునం జేకుఱుచున్నయట్టి సుకవితాలంకారములు కాలక్రమమున వంకలుదీరి భాషాసౌభాగ్యమును బరిపుష్టపఱుపఁగలవు. క్రొంగ్రొత్తకవనములఁ గూర్చుటతోఁ బ్రాఁబడినకవనముల బయల్పఱుచుటయు భాషాసౌందర్యమునకుఁ బోషకమేగదా! గ్రంథరూపమును గైకొనకయ, లోకమునఁ జేకుఱుచున్న యాంధ్రకవితావాఙ్మయ మపారముగా నున్నది. అందుఁ గొంత భాషాయోషకుఁ బ్రాణప్రాయ మనఁదగినది కూడను; నాకిట్టి వాఙ్మయమును సేకరించుటయందుఁ గోరిక కొండంత. ప్రాచీనకవీశ్వరరచితము లగుచాటుధారలను బెక్కింటి సమకూర్చి చాటుపద్యమణిమంజరి యను పేర నింతకుముందు సంతరించితిని.[1] మఱియు, నవకము, చవి, చక్కన కలిగి యాంధ్రతావాసనలఁ బరిమళించు మధురకవితలఁ బెక్కింటి సేకరించి వేఱొకగ్రంథమును వెల్వరింపనున్నాఁడను.[2] ప్రాచీనకవీశ్వరకృతములై యీనాఁడు దొరకకున్న ప్రబంధముల నుండి ప్రాచీనులే సేకరించియుంచిన పద్యసముదాయమును “బ్రబంధరత్నావళి" యనుపేర నిప్పుడు ప్రచురించితిని.

ఇందలి పద్యములను సంకలనము సేసినవా రిర్వురు. ఒకఁడు పెద్దపాటి జగన్నాథకవి; నారాయణస్తుతి, శంకరస్తుతి, త్రిపురవిజయము, అర్ధనారీశ్వరము ననిమొదలువెట్టి యిట్టితెఱఁగునఁ బెక్కువర్ణనాంశముల నేర్పఱుచుకొని యైదాశ్వాసములుగాఁ "బ్రబంధరత్నాకర" మనుపేర నీతఁడు గ్రంథము సంధానించెను. పైగ్రంథమున మొదటిమూఁడాశ్వాసములు మాత్రమే తంజాపురపు సరస్వతీపుస్తకభాండాగారమం దున్నది. కడమగ్రంథ మెక్కడను గానరాలేదు. వేఱొక్కనిపేరు తెలియరాదు. అతనిసంధాన మాంధ్రసాహిత్యపరిషద్భాండాగారమునం దున్నది. ఆసంధానమునకుఁ బేరు లేదు. మొదలు లేదు. తుదలేదు. పరిషత్తువా “రుదాహరణపద్యము"లని పేర్కొన్నారు.[3] ఈ యిర్వురకూర్పులందలి పద్యములను గ్రుచ్చియెత్తి నే నీ ప్రబంధరత్నావళిని క్రొత్త వెలయించితిని. పై యిరువుర సంఛానములం దుండినను నిప్పటికి ముద్రితములై సుప్రసిద్ధములై దొరకుచున్న నన్నయాదుల భారతాదులలోని పద్యముల నిందుఁ జేకొనలేదు. కవులను గావ్యము లందలి పద్యములు గూడ నకారాద్యక్షరక్రమమునకుఁ దార్చితిని. భాషాకవిచరిత్రాద్యపేక్షకుల కీచేఁత మిక్కిలి సాహాయ్యక మగునని చక్కఁ బర్చించియే సల్పితిని. ఇర్వురసంధానములు వేర్వేఱు తెఱఁగులవి. ఆ రెంటిని జేర్చుటలో విషయానుక్రమణికిఁ జెక్కుకలదు. పూర్వోత్తరసందర్భరాహిత్య మిప్పుడే కాక యప్పుడు నున్నది. ఆగూర్పులు కూడఁ గథాఘటితములు కావు. కావున నీమార్పుసేఁత కొంత చిక్కును దీర్చుటయే.

ప్రయోగరత్నాకరము[4] రంగరాట్ఛందము మొదలగు కొన్ని లక్షణగ్రంథములందుఁ బ్రాచీనకవికృతములుగాఁ గొన్ని ప్రబంధముల పేళ్లతో బద్యము లుదాహరింపఁబడియున్నవి. ఆ పద్యములనుగూడ నీ కూర్పునందుఁ జేర్పఁ జూచితిని గాని యాలోచింపఁగా నం దసత్యతాసంశయము సంఘటిల్లెను. గణపవరపు వేంకటకవి ప్రభృతులు కొందఱు తమకు సమ్మతము లగుకొన్ని ప్రయోగములను నిల్వరించుకొనుటకయి తమ లక్షణగ్రంథములందు లక్షణకల్పనము చేసి లక్ష్యముగాఁ బ్రాచీనకవీశ్వరకృతు లైన ట్లేవో గ్రంథనామములును, పద్యములును సృష్టించియుందు రని తోఁచెను. నన్నయ ఇంద్రవిజయము లోని దట యీ పద్యము :

క. “అంగజుఁ డను మాసటి చ
     క్కంగను రాయంచ యేనుఁగను నూకుచుఁ జే
     చెంగలువ నేజచే జెలి
     చంగవనడుచక్కిఁ గ్రుమ్మి సరగున నార్చెన్."

విశ్వాస్య మగునా? ఇట్లే భాస్కరుని సుసందోపాఖ్యానము, సోముని హరవిలాసము, భీముని నృసింహపురాణము మొదలగునవి. కావున లక్షణ గ్రంథములందలి పద్యముల నిందుఁ బొందింప మానితిని. అవియేల్ల వేఱొక కూర్పుగా వెల్లడించెదను.

పెద్దపాటి జగన్నాథకవి కృష్ణామండలమందలి యేలూరునకుఁ జేరువనున్న పెదపాడునం దున్నవాఁడు. తన గ్రంథము నతఁడు నీలాచలమందు నెలకొన్న జగన్నాథస్వామి కంకితము సేసినాఁడు. ఆతనివంశస్థితి మొదలగునది యీ గ్రంథము ననుబంధమును జూచి యెఱుంగునది.[5]

ఇర్వురుసంధాతలును గొంచె మించుమించుగా సమకాలమువారనియే తలఁపవచ్చును. మన మెఱిఁగినంతలో జగన్నాథకవి యుదాహరించినవారిలో మాదయగారిమల్లయ్య, తెనాలి రామలింగయ యును, రెండవసంధాత యుదాహరించినవారిలో నల్లసాని పెద్దనార్యుఁడును నర్వాచీనులు. జగన్నాథకవికంటే నిర్వదేండ్లు రెండవసంధాత ప్రాచీనుఁడయిననుఁ గావచ్చును.

గ్రంథమున నకారాద్యక్షరక్రమమున నుదాహరింపఁబడిన యధర్వణాదు లగుకవులను గూర్చియుఁ దత్తత్కృతులనుగూర్చియు దెలుపఁదగిననూత్నవిషయముల నిఁక నించుఁగొండొక వివరించుచున్నాఁడను. ఇందు నేను బేర్కొననివారింగూర్చి భావికాలపరిశీలనములవలనఁ గాని, నేఁడే యింతకంటే హెచ్చు పరిశీలించియుండిన ప్రాజ్ఞలోకము మూలమునఁ గాని విశేషవిషయములు బయల్పడవలయును.

అధర్వణాచార్యుఁడు:- ఈతనిభారతము లాక్షణికు లుదాహరించెదరు. 'తృష్ణాతంతు' అన్నపద్యము లక్షణగ్రంథమందలిదే. ఈతనియాంధ్రచ్ఛందస్సు నాకు లభింపలేదు. వికృతివివేక మనియు, త్రిలింగశబ్దానుశాసన మనియు సంస్కృతమున రెం డాంధ్రవ్యాకరణగ్రంథము లీతనిపేరఁ గానవచ్చుచున్నవి. ఈ రెండును నధర్వణునిపేర నిటీవలఁ గల్పింపఁబడినవే యని యూహ. "శ్లేషే సఖండ నిర్బింద్వో" రిత్యాదిలక్షణము లుండుటనుబట్టి యాయూహ యుక్తము కాఁ దోఁచుచున్నది. అరయఁగా, సంస్కృతమున నున్న యాంధ్రవ్యాకరణము లన్నియుఁ గొంతయసత్యకల్పనముతోఁ గూడినవిగనే కన్పట్టును. రా. బ. కందుకూరు వీరేశలింగము పంతులుగారు:-

"ప్రమాణ మకలంకస్య పూజ్యపాదస్య లక్షణమ్"[6] అని వికృతివివేకమున బేర్కోఁబడిన యకలంకుఁడు కర్ణాటకవ్యాకరణమును రచించిన యకలంకుఁ డనియు, నాతఁడు క్రీ శ. 1604 లో నుండెను గావున నది యహోబలపండితుని కాలముననే సృష్టింపబడియె ననియుఁ గ్రొత్త వెల్వరించిన కవులచరిత్రమున విశేషవిషయము చేర్చినారు. ఇది సిద్ధాంతము కానేరదు. అకలంకుఁడు ప్రాచీనుఁ డున్నాడు. ప్రాకృతవ్యాకరణకర్తలలోఁ బూజ్యపాదుఁడు ప్రాచీనతముఁడు; ప్రసిద్ధుడు; క్రై 1490 ప్రాంతమున 'నౌదార్యచింతామణి'[7] యను ప్రాకృతవ్యాకరణము రచించిన శ్రుతసాగరుఁడు వీరిని బేర్కొన్నాడు. వికృతివివేకమునఁ బేర్కొనఁబడినవారు వీ రేలకారాదు. ఆ శ్లోకము లివి:–

“సమంతభద్రై రపి పూజ్యపాదైః కలంకముక్తై రకలంకదేవైః
యదుక్త మప్రాకృత మర్థసారం త త్ప్రాకృతం చ శ్రుతసాగరేణ
శ్రీపూజ్యపాదసూరి ర్విద్యానందీ సమంతభద్రగురుః
శ్రీమదకలంకదేవో జినదేవో మంగళం దిశతు.

శ్రీ పూజ్యపాదనకలంకసమంతభద్ర
శ్రీ కుందకుందజినచంద్రవిశాఖసంజ్ఞాః
శ్రీ మాఘనందిశివకోటిశివాయనాఖ్యాః
విద్యాచనంది గురవశ్శ మమీ దిశంతు.”

సమయసంకోచముచే నీవిషయ మింతట విడిచెదను. బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు,


“క.

మగణముఁ గదియ రగణము
వగవక కృతిమొదుట నిలుపు వానికి మరణం
బగు నిక్క మండ్రు మడియఁడె
యగునని యిడి తొల్లి టెంకణాదిత్యుఁ డనిన్.”

అను పద్య మధర్వణాచార్యుని ఛందమందలిదని కుమారసంభవ పీఠికలోఁ జేర్చినారు. వారు దీని నేదేని లక్షణగ్రంథమును జూచి కైకొనిరో యధ ర్వణఛందమును జూచియే కైకొనిరో చెప్పలేదు. ఇది యధర్వణుని దగునాఁ డాతఁడు నన్నిచోడనికంటెఁ దర్వాతివాఁడగును. మఱియు వారే క్రీడాభిరామమును ముద్రించుచు దానికి నాందిగా “అంబరసీమఁ దారలు" అను పద్యము నతకరించి యది 'యధర్వణుని భారత విరాటపర్వమున మొదటి యాశ్వాసము నుండి' యెత్తఁబడినట్లు వ్రాసినారు. వారు దాని నధర్వణభారత విరాటపర్వ ప్రథమాశ్వాసమునఁ జూచిరేమోగాని, యిందు 'దామరాజు సోమయభరత' మండలిదిగాఁ గూర్పఁబడియున్నది. ఏది సత్యమో?

అన్నమయ్యంగారు, తాళ్లపాక:— ఈతఁడు రా. బ. కం. వీరేశలింగము పంతులుగారి కవులచరిత్ర ప్రథమభాగమునఁ జేరవలసినవాఁడు. పదునాల్గవశతాబ్దిలో నించుమించుగా శ్రీనాథునికాలమున నున్నవాఁడు. తిరుపతి తామ్రశాసనమునుండి ఈ విషయ మెఱుఁగఁబడును.

అప్పన:— ఈతఁడు భోజమహారాజుచే సంస్కృతమున రచియింపఁబడిన చారుచర్యను దెలుఁగుసేసినవాఁడు. ఏనాఁటివాఁడో తెలియదు. రచనమును బట్టి ప్రాచీనుఁ డని యూహించితిని. గ్రంథారంభ మిట్లున్నది.[8]


క.

ప్రత్యూహబహుళతిమిరా
దిత్యుఁడు శ్రీకీర్తిభారతీసంతతసం
పత్త్యున్నతుండు శ్రీహరి
నిత్యుఁడు నాగాంబయప్పనికిఁ బ్రియ మొసఁగున్.


సీ.

విద్వన్నుతుండు భారద్వాజగోత్రుఁ డాపస్తంబసూత్రుండు పరమపుణ్య
వినులోజ్జ్వలాంగి గోవిందార్యునకుఁ గులద్వయశిరోభూషణధర్మచరిత
నాగమాంబకుఁ గూర్మినందనుఁ డప్పయమణిమౌళి సింగననామాత్యుమేన
యల్లుఁడు ధార్మికుఁ డనఘుండు శ్రీవల్లభాచార్యుతమ్ముండు హరిపదాంబు


గీ.

జాతషట్పదుఁ డుభయభాషాకవిత్వ
మానవైదగ్ధ్యుఁ డప్పయమంత్రివిదుఁడు

సంస్కృతంబున నొప్పారు చారుచర్యఁ
     దెనుఁగు సేసేఁ దా నెంతయుఁ దేఁటపడఁగ.

ఉ. రాజహితంబుపొంటె సుకరంబుగ వైద్యసునీతిధర్మని
     ర్వ్యాజపథానుసారమధురంబుగ నిర్జరభాషఁ దొల్లి యా
     భోజునిచేతఁ జెప్పఁబడి పొల్పగు నీకృతి నూత్నసత్కళా
     భోజుఁడు మంత్రియప్పన ప్రబుద్ధుఁడు చేసెఁ దెనుంగు బాసఁగన్.

ఎఱ్ఱయ, కూచిరాజు :-- సకలకథానిధాన మని,[9] కొక్కోకమని యీతని కృతులు రెండున్నవి. కొక్కోకము సర్వత్ర దొరకునదియే ఇందలి సకలపురాణసారము మూఁడవది. ఇది యింతదనుక లభింపలేదు. సకలకథానిధానపు బీఠికలో నిది పేర్కొ నఁబడినది. చూడుఁడు.

'సీ. శ్రీవత్సగోత్రవారిధిపూర్ణశీతాంశుఁ డగుకూచమంత్రికి నాత్మజుఁడవు,
     వివిధాష్టభాషాకవిత్వవాచాప్రౌఢిఁ బూర్వకవీంద్రులఁ బోలినాఁడ,
     వఖిలపురాణేతిహాసకావ్యస్మృతిచయము రచించిన చారుమతివి,
     మాపినతండ్రి యౌ మల్లమంత్రికిని గొక్కోకంబు సెప్పినకోవిదుఁడవు,
గీ. రసికు లభినుతి సేయఁ బురాణసార
     మనుపమంబుగ నాకిచ్చినట్టి ప్రోడ
     వట్లుగావున నొకటి నిన్నడుగఁదలఁచి
     యిచ్చటికిఁ బిల్వఁబంచితి నెఱ్ఱనార్య'

కేతనప్రెగడ: - ప్రయోగరత్నాకరమందు “భాస్కరుని కేతన కాదంబరి" అని కలదు దశకుమారచరిత్రకర్త మ్రానయ కేతన కావున నాతఁడు వేఱగును. తిక్కన సోమయాజి పితృవ్యుఁ డొక కేతన కలఁడు. అతని తండ్రి భాస్కరుఁడే. దశకుమారచరిత్రమం దీవిషయము గానవచ్చుచున్నది. అందలి వర్ణనమునుబట్టి చూడఁగా నా భాస్కరునికేతనయుఁ గవిగా నెఱుగఁబడుచున్నాడు.

“చ. కవితకు ముఖ్యుఁ డీతఁ డనఁ గామితవస్తువు లిచ్చువాఁడు నా
     నవరసభావకుం డితఁ డనన్ బురుషార్థపరాయణుండు నా
     నవునన రాజనీతివిషయజ్ఞుఁ డితం డనఁ గీర్తిచంద్రికా
     ధవళితదిక్కుఁడై నెగడె ధన్యుఁడు కేతనమంత్రి యిమ్మహిన్. (దశకుమార)

కాదంబరీదశకుమారచరిత్రములందు రసవత్తర మగుకాదంబరిని వీడి రెండవది యగు దశకుమారచరిత్రమునే కేతన తెలిఁగించుటకుఁ గారణము తతఃపూర్వమే యది తెలిఁగింపఁబడియుండుట యగునేమో? తన కృతికిఁ బతి యగుచున్న తిక్కనసోమయజికృతులనే పేర్కొనని యీయభినవదండి యిఁక నాతనికిఁ బెదతండ్రి యగువాని కృతిని బేర్కొనక పోవుటలో నసందర్భ మేమి యుండును? కాఁబట్టి యీ కాదంబరీకర్త కేతన తిక్కన పెద్దతండ్రి కేతన కాఁ గూడును. ఇక నా కువలయాశ్వచరిత్రకర్త కేతన ప్రెగ్గడ యేతఁడో? ఇది యెల్ల నానుమానికమే.

కొమ్మయ, నిశ్శంక : -- ఈతని వీరమాహేశ్వరము దొరకలేదు. శివలీలావిలాసము[10] రెండాశ్వాసములు మాత్రము చేకూఱెను.

గంగరాజు (గంగాధరుఁడు) చిరుమూరి :- రా. బ. వీరేశలింగము పంతులుగారు కవులచరిత్ర ప్రథమభాగ పీఠిక లో నైరావతచరిత్ర మీతని కృతిగా వ్రాసినారు. ఐరావతచరిత్ర ప్రతులు రెండు నే నెఱుంగుదును.[11] రెండింటను బీఠికాగద్యములు లేవు. కృతిమంచిది. చిన్నది. కథ భారతేతిహాసప్రసక్తము. కాని సంస్కృతాంధ్రభారతములం దాకథ గానరాదు. కర్ణాటభారతమందు మాత్ర మున్నది. ఆంధ్రమున వేఱుగ నున్నయీకృతి యత్కర్తృకమో నా కెఱుఁగరాలేదు. గంగరాజుకృతి యని మీ రెట్లు వ్రాయఁగల్లితి రని శ్రీ వీరేశలింగముపంతుల వారికి వ్రాసి కనుఁగొంటిని. శ్రీరామకృష్ణకవిగా రపూర్వవాఙ్మయపరిశోధన మను పేరఁ బ్రచురించిన యుపన్యాసమునఁ జూచి వ్రాసితిమని బదులు వ్రాసిరి. [12] కవిగా రట్లుపన్యసించినచో నాధార మేమో! తెలయవలసి యున్నది.

చిక్కయ, చందలూరి:- నాచికేతూపాఖ్యానము నిర్వురు తెల్గున రచియించినారు. ఈతఁడును, శ్రీనాథుని బావమఱఁది దగ్గుఁబల్లి దుగ్గనయును. ఈతఁ డేనాఁటివాఁడో! దుగ్గన నాసికేత (నాసికా + ఇత) పదమును బ్రాసమున 'స' వచ్చునట్లు సవ్యుత్పత్తికముగాఁ బేర్కొనుటచే నదే ముద్రించితిని. ఉపనిషత్తులయందు నాచికేతుపదమే కన్పట్టును. దుగ్గనకృతి శివకాంచీమాహాత్మ్యము దొరకలేదు. నాసికేతోపాఖ్యాన [13]మున్నది. చౌడయ, గంగరాజు : - కసువామాత్యున కంకితముగా నొక సాముద్రిక మున్నది. అది యీతని దగునో? ఈతఁ డేనాఁటివాఁడో? నంద(న)చరిత్రము దొరకలేదు.

తిక్కన:- విజయసేనమునందలి దని యిందు వైశ్యవర్ణన (156- వ పద్య మున్నది. ప్రబంధమణి భూషణమున నీ క్రింది పద్యము తిక్కన విజయసేనములోని దని శ్రీకవిగారు వ్రాసినారు.

“సీ. అమ్మెద ననినఁ బద్మాక్షు కౌస్తుభ మైన వెఱవక కొనియెడు వెరవు గలిగి,
     విలువ యిచ్చెద మని వేడినఁ బులిజున్నుఁ గమ్మపసిండియు నమ్మఁ గలిగి,
     యేవస్తు వెంత ప్రొ ద్దెందఱు చనుదెంచి యెంతటి కడిగిన నెదురఁ గలగి,
     తమయింట లేనియర్థము లర్థపతియింట నైన వెదకిన లే వనుట గలిగి,
గీ. తమకులాచారవర్తన [క్రమ]ము కొఱకు
     నంగడులయొప్పునకును బేహార మాట
     గాని లాభమునకు నాట గాదనంగ
     వఱులుదురు పురవరమున వైశ్యవరులు.”

ఇదియు వైశ్యవర్ణనమే. రెండుపద్యములును విజయ సేనమందలివే యగునా?

తిమ్మయ్య, కుంటముక్కల :- ఈతని శైవాచార సంగ్రహము1[14]దొరకి యున్నది.

త్రిపురాంతకుఁడు, రావిపాటి :. ఈ కవీశ్వరునికృతి 2[15] యుదాహర ణము మాత్రమే సమగ్రముగా దొరకియున్నది. తారావళి, అంబికాశతకము, పేమాభిరామము దొరకలేదు. క్రీడాభిరామమునకు సంస్కృతమైన ప్రేమాభి రామమును రచియించుటచేతనే యేమో యీతనిఁ గూచిరాజు - ఎఱయి యిట్లు తన కొక్కోకమునఁ బేర్కొన్నాఁడు.

“సి-గీ, ముని సనత్కుమారు ధనదతనూభవు
నాశ్వినుల జయంతు నభిన తించి
పృథివి రావిపాటి త్రిపురాంతకాదిశృం
గారకవుల నెల్ల గౌరవించి."


ప్రేమాభిరామము శృంగారకావ్యమే యగును గదా ! రామకృష్ణకవిగారు త్రిపురాంతకు (డు మదనవిజయ మను కామశాస్త్ర గ్రంథమును ( వాత్స్యాయన సూత్రఘులకుఁ దెలుఁగఁట) రచియించెనని వ్రాసినారు. [16]3 దొరకినంతవఱకుఁ బరి కింపఁగా నీతనీయాంధ్రకవిత యతిప్రశస్తముగా నున్నది. ఈ క్రింది రెండు పద్యములు గూడ సంబికాశతకమందలివి.4[17]

“చ. బెడఁ గగురత్నదర్పణముఁ బేరిన వెన్నెల పోసి నిచ్చలుం
దుడుపక పాలసంద్రమునఁ దోఁచి సుధాకరుమేనికందుఁబోఁ
గడుగక నేరెటేట సితకంజము ముంపక నై జకాంతి తోఁ
దొడరినఁ దల్లి ! నీ మొగముతో సరిపోల్పఁగఁ జాలు నంబికా !

ఉ. టెప్పలబోరుఁదల్పు లిసిటింతలు వాటెడుచూపుఁ గుంచియం
ద్రిప్పి తళుక్కనం దెఱచి తిన్న నిమోమునఁ గాయు వెన్నెలల్


1. 2. 3.

4.

ముప్పిరిగొన్న వేడుకలు మూఁగినసిగ్గ'సియాడ, బ్రీతి నీ
వప్పరమేశుఁ జూచి తనువర్ధముఁ గోంటి పొసంగ నంబికా ! "

నరసింహభట్టు, ఆమడూరి ఈతని షోడశకుమార చరిత్రముదొరకలేదు; కాని, వేఱొక కవి, వెన్నెలకంటి సూరనకుమారుఁ డన్నయామాత్యుఁడు రచియించిన షోడశ రాజచరిత్ర మొకటి దొరికినది.. [18]శ్రీ బహుజనపల్లి సీతారామా చార్యు లుగారు శబ్దరత్నాకరమున షోడశకుమార చరిత్ర మొకటియెల్లనకృతముగా నుదాహరించినారు. వారు పరికించి.. యాప్రం యెక్కడ నున్నదో !


నాగనాథుఁడు, పశుపతి :- ఈతఁడు వెన్నెలకంటి సూరనకంటెఁ బ్రాచీనుఁడే కావలెను. శ్రీ వీరేశ లింగముపంతులుగారు వెన్నెలకంటి సూరన (విష్ణు పురాణకర్త) కాలము క్రీ.శ. 1480-90 ప్రాంత మని యసమర్థ సాధనములతో సిద్ధాంతపఱచినారు. కాని, తత్కృతిపతి యగు బసవయ రాఘవుఁడు2[19] క్రీ. శ. 1628. 29 ప్రాంతమున నున్న వాఁ డగుటచే నాతఁ డంతకుఁ గొంత తర్వాతి వాక డగును.


నన్నిచోడఁడు ఈ కవి కాలనిర్ణయాదికమును గూర్చి పెక్కురు చర్చించి యున్నారు. అన్ని చర్యల పర్యవసానము నింతే. ఈ కాలమువారని సిర్ధారించుటకుఁ దగిన సాధనములు లేవు. శ్రీచిలుకూరి వీరభద్రరావుగారాంధ్రుల చరిత్రమున నిట్లు వ్రాసినారు. క్రీ. శ. 925-40 సం, ప్రాంతమున నున్న యీ సత్యాశ్రయుని నన్నెచోడమహాకవి తన కుమారసంభపకావ్యమున నీక్రింది పద్యములోఁ బేర్కొనియున్నాఁడు.

“క. మును మార్గకవిత లోకం
బున వెలయగ దేశిక వితఁ బుట్టించి తెనుం
గు నిలిపి రంధ్రవిషయమున
జన సత్యాశ్రయునిఁ దొట్టి చాళుక్యనృపుల్."


1. 2. దీనింబట్టి నన్న మభట్టారకునకు నూడేండ్లకుఁ బూర్వమే యాంధ్రకవితా సతి వర్ధిల్లుచున్నదని స్పష్ట మగుచున్నది.

శ్రీ వీరభద్రరావుగారుగాని, మఱియెవరుగాని నన్నిచోడఁడు నన్నయ కంటెఁ ద్రాచీనుఁ డని చెప్పఁజూచుటకును, గావచ్చు నని లోకము విశ్వసిం చుటకు నీ పద్యమే ప్రధానాధారముగా నున్నది. శ్రీ రామకృష్ణ కవి గారు ప్రచురించిన కుమార సంభవముద్రితప్రతిలో నీపద్య మిట్లున్నది. 1909 సం|| దీనిని ముద్రించినారు. అప్పు డి పద్యమునకు వారు పాఠాంతరమును జూపలేదు, వారి యచ్చునకు మాతృక యెక్కడిదో చెప్పను లేదు. కవిగారు కుమార సంభ వము రెండవ భాగపుఁ బీఠిక లో నిట్లు వాసినారు. "కుమారసంభవ ప్రతులలో నొకటి నాకు నైజాము రాజ్యమునఁ బ్రాచీనకా సాసన శోధనార్ధము పోవుచుండఁగాఁ గర్ణాట దేశముననే లభించెను. తక్కినవి రెండును శుద్ధ ద్రవిడ దేశముననే యగపడెను" ద్రవిడ కర్ణాట దేశ ముందు మూఁడు ప్రతులు దొరకినను నచ్చులో! బెక్కులు గ్రంథపాతములుండుట వింతగానన్నది ఆ మూఁడు ప్రతులు నొక్క మాతృకకే పుత్రిక లాయేమి ? కాకున్నచో నవి పాఠభేదములు లేకయు సమాన గ్రంథపాతములు గలిగియు నుండుట వింతగదా ? పట్టిక లో ముఖ్య పాఠభేదము లని వారు చూపినవి ప్రాయికముగా ముద్రణమం దర్థానుగుణముగాఁ జేయఁబడిన సంస్కారములకు వ్రాత ప్రతిలో నున్న తప్పుపాఠములుగా గోచరించుచున్నవి. కుమార సంభవ ప్రతులయొక్కయుఁ బాఠముల యొక్కయు రహస్యము లింకను బయల్పడవలసియే యున్నవి. కాని తంజాపురపు సరస్వతీపుస్తక భాండాగారమునఁ దాటియాకులపై ప్రొయఁబడిన కుమార సంభవపుఁబ్రతి యున్నది. అక్కడఁ దక్క నింతవఱకుఁ బ్రత్యంతర మెక్కడను మనకుఁ గనరాదు. వినరాదు. ఆ పుస్తకముల్ పై పద్యమిట్లున్నది.

“క. మునుమార్గకవిత లోకం
బున వెలయఁగ దేశికవితఁ బుట్టించి తెనుం
గును నిలిపి రంధ్రవిషయం
బునఁ జనఁ జాళుక్యరాజు మొదలుగఁ బలువుర్ ."

కవిగారికి "చన సత్యాశ్రయునిఁ దొట్టి చాళుక్యనృపుల్" అన్న పాఠ మెక్కడనుండి వచ్చినదో ! వా రింక నెక్కడి ప్రతీసంపాదించినారో , ప్రథమ భాగమును ముద్రించునప్పటికి వారీతంజాపూరు బ్రతి నెఱుఁగనే యెఱుఁగరు గావలయు ఎఱిఁగియుందురేని యనర్ఘ మగునీపాఠమును జూపకుండుట కేమికారణము ? తంజావూరు పుస్తకళాలలో నన్ని చోడని కుమారసంభవ మున్న దని యెల్లరు నెఱింగిన తర్వాత క్రీ. 1914 లో వీరు ప్రచురించిన కుమార సంభవపు రెండవభాగమున “చాళుక్యరాజు మొదలుగఁబలుపుర్" అనుపాఠాంతర మున్నట్లు తెలిపిరి. కాని యిప్పుడయినను దంజాపురపుఁ బుస్తకమును వీరు చూచినట్లు వ్రాయలేదు. కావున నీపాఠము మఱియొక ప్రతిలో జూచినా రేమే ? అత్యూహ లెందులకు ? తంజావూరుపుస్తక పాఠముమాత్రమే మనకిప్పుడు గ్రాహ్యము: శ్రీకవిగారిపాఠము గలమాతృక బయల్పడువఱకును. అట్టి ప్రత్యంత రము బయల్పడెనా యది పాఠాంతరముగాఁ గూర్చుకొందము. ఇక, “కాళుక్య రాజు మొదలుగ" నన్నప్పుడు రాజరాజనరేంద్రుఁడే యేల కారాదు , చోడఁడు నన్నయకంటెఁ బ్రాచీనుఁ డనుట కాధారములు తగినవి లేవు. శ్రీవీరేశలింగము పంతులుగారు నన్నిచోడని భాషాప్రయోగములను గూర్చి చేసిన యాక్షేపములు నిలువజాలనివి.1[20] పోనీనెల్ల నిర్వచించుట కిక్కడ స్థలము జాలదు పాల్కురికి సోమనాధుఁడు 1190 ప్రాంతముల నున్నవాఁ డను పంతులవారి సిద్ధాంతము పోలును నన్నీ చోడఁ డంతకు ముందటివాఁడో వెనుకటివాఁడో సిద్ధాంత మేర్పడ లేదుగదా ! ఈయిర్వురిలో నొకనిపుస్తకము నింకొకడు చక్కగా సంగ్ర హించు కొన్నాఁడు. ఇది చదివిచూడుఁడు !

"ద్వి, నెట్టన నేలకు నింగికి సూత్ర,
పట్ట మ్రోకాళ్లకు బట్టతలలకు
ముడిపెట్టఁ దననీడ గడవంగఁ బాలు ,
వడి నెండ మావులకడగళ్లు కట్ట ;
పాయక రెండుగాఁ బారెడునీరు,
వ్రేయఁ బుట్టున్ను గోరో యని యమ్మ ;
జానార యొలువఁ జట్రాతిపైఁ గ్రుంక,
నేనుంగుపురు డోమ నిసుము త్రాడ్పేన ;
లలిగొన దెసలు తాళములు వాయింపఁ,
శెలఁగుచు రోకటఁ జిగురులు గోయ ;
కలి వెన్న పుచ్చఁ గొందలు దొతిఁ బేర్ప,

1

నిల మంచుఁ గుంచానఁ గొలువ రేబవలు
సేయ నాక సమునఁ జిత్రరూపములు,
వ్రాయ వాయువుఁ బట్ట వడగళ్లుగుళ్లు
గట్ట వెన్నెలగుంపుగాఁ జేయవచ్చి
పుట్టినప్పుడే నేర్చు బుద్ధుల ప్రోక."

"సీ. నేలయు నిఁగియుఁ దాలముల్ వాయింప నెండమావులఁ బట్ట బండతలయు,
మ్రోకాలు ముడిపెట్ట రోకటఁ జిగుళులు గోయఁ జట్రాతి పైఁ గ్రుంగ నిడుపు,
లేక చిత్రము వ్రాయ నాకాశమునఁ దాఁపరము నిడ మంచుఁ గుంచములఁగొలువ
నేనుంగుపురు డోమ దానార గొన గాలి గంటిడ నిసుమున గట్టు దాల్ప,

గీ, నీరినడుము డెంప నేలఁ దెన్నుండి చే
వెల్పఁ గలిగియుఁ ద్రచ్చి వెన్న గొనగఁ
గడవ నేర్పు గలిగి కందువు చూ నెఁడై
క తీగంటు లయిన యత్తగంతు. " కుమా. భా. 2-185.

ఇట్లియిర్వుర గ్రంథములనుండియు వలసినన్ని సంవాదములు వచ్చును. సులువుగా ద్వీపదలో సోమనాథుఁడు కూర్పఁగా నన్నె చోడఁ డిట్లు సీసపద్యమునఁ జేర్చుకొన్నా డేమో ![21] సుసూక్ష్మముగా నీయిర్వుర కృతులను బరిశీలించినచో నీవిషయము బయల్పడ గలదు. భాషావ్యుత్పత్తిలోఁ జోడఁ డును సోమనాథుఁడును గూడ సమధికులేయని యాయాగ్రంథములఁ జక్కం జదివి యెఱిగినవారు భావి:ంతు రని నా నమ్మకము.

పెద్దిరాజు, పొన్నాడ :- ప్రబంధమణిభూషణపుఁ బీఠిక లో శ్రీరామకృష్ణ కవిగా రిట్లు వ్రాసిరి. "విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణియుఁ1 బ్రద్యుమ్న చరితయు రచియించెను.రెండవకృతి చాలఁ బ్రౌఢమయినది. దానిలోనుండి 113-ప పచ్యము మాత్రమే గ్రహింపఁబడినది." కావ్యాలంకార చూడామణి కర్తయింటి పేరు విన్నకోట గదా! ప్రద్యుమ్న చరిత్రకర్త యింటి పేరు పొన్నాడ యని యిందున్నది. కవిగారట్లువ్రాయుట


1 కేమి యాధారమో ? ప్రద్యుమ్న చరిత్రము చారికడ సమగ్రముగానుండెను గాఁబోలును. లేనిచో నదిచాలఁ బ్రౌఢమయినదనియు నన్నూటయేఁబదికిఁ బై పడిన పద్యములు యత్కర్తృకములో, యేకృతులలోనివో తమ రేఱుగ రాకపోయిన యాప్రబంధ మణిభూషణమున, 113-వ పద్యమొకటి మాత్రమే ప్రద్యుమ్న చరిత్రమునుండి గ్రహింపఁబడినదనియు నెట్లు చెప్పఁగల్గుదురు? కవిగారు ప్రబంధమణిభూషణ మను పేరుతోఁ బ్రచురించిన సంధాసమునకుఁ బ్రతులు నాల్గయిదు తంజాపురపుఁ బుస్తకశాలలోనున్నవి. కాని వానియందు లేనిపద్యముల నేకములు వీరి ముద్రణమునఁ జేరీసవి. వీరే యేప్రతులను బట్టి యాగ్రంథమును ముద్రింపఁగల్గినారో తెలియదు.

పోతరాజు :- ఈతఁడొక (బేతాళ పంచవింశతి) రచియించెనట : శ్రీ రాము కృష్ణకవిగారు తమకు దొరికిన కవిభల్లటుని విక్రమార్క చరిత్ర బేతాళ పంచమిశతి యందలి వని యుదాహరించిన పద్యములు కూచిరాజు ఎఱ్ఱయ రచించిన సకల కథానిధానమండలి బేతాళ పంచవింశతి కథలలోనివే. ఇటీవల నొకరు పంచవింశతి భాగము దొరికినది.1[22] ఆదీ యత్కృతియో ?

మల్లయ, నంది :- ఈతఁడును ఘంటసింగయయును గలసి కవులుగదా ! అఘోరశివాచార్య దక్షిణామూర్తి శివాచార్యులకు వీరు శిష్యులు. విద్యానగరమున శివాచార్య' పీఠమొకటి యాకాలముననుండెను.అందు వైరాగ్యశివాచార్యా ఘోరశివాచార్యదక్షిణామూ ర్తి శివాచార్యాదు లధిష్ఠాతలు. ఆఘోర శివాచార్యాదుల కృతులు శైవాగమగ్రంథములు శైవతత్త్వామృగాదులు పెక్కు లున్నవి. లక్షద్వయాధ్యాపకుఁడట యమోరశివుఁడు. మా. రా, కవిగారు క్రీడాభి రామపీఠిక లో "......అవి రుచ్యములుగావని సంజసింగసము ఘంట మల్లయయు-(ఇంటి పేర్లుఁ బేర్లును దార్చారు.) గలసి యార్వీటి తిమ్మరాజున కంకితముగా షష్టస్కంధమును శృంగారషష్ఠ మసు పేరుతో రచించిరి" ఆని వ్రాసి నారు. నందిమల్లయ ఘంటసింగయలు ప్రసిద్ధులు. వారుగాక వీరు వ్రాసిన. విధముగాఁగూడ నిర్వురున్నారా ? ఏమో : లక్షణ గ్రంశకర్తలు రాచమల్లు నా శృంగారషష్ఠమని యుదాహరింతురు. ఇదియేట్లో ఆ ప్రయోగ రత్నాకరమున శృంగారషష్ఠమందలిదిగా నీవద్య ముదాహృతము.


1. "ఉ. చండాంశు ప్రభవీక్ష తిమ్మయతనూ కా ! తిమ్మ విధ్వసపా షండంబైన త్రిలింగ భాగవత షష్ఠస్కండభాగంబు నీ కండక్కెం జతురాననత్వగుణయుక్తు ల్మీలు వాణీమనో భండారోద్ధతి చూఱకార బిరుద ప్రఖ్యాతి సార్థంబుగన్.”

ఈ సంధానమున మలయమారుతము సర్వయ షష్ఠస్కంధ ముదాహరింపఁ బడినది. యించి రామయ్య, ఆంధ్రకవి:-పోసిరాజు రామయ్యయు నీతఁడు నొక్క డో ? వేఱో , ఈతఁడు ప్రాచీనకవులను మాత్రమే స్తుతియించినాఁడ . అందు, "ఛందోనిబంధనదాతురీఛారేయ వాగ్దామువేములవాడ భీము" సనుచున్నాఁడు - లాక్షణికులు గూడఁ బెక్కురు కవిజనాశ్రయము వేములవాడ భీమకవి రచితమని యుదాహరించెదరు.

‘‘క. చను సుత్తమగండాఛ, ర్వణహనుమదనంతసకవిరాక్షసజయదే
వనుత శ్రీధరగోళ, భనీలకంఠాది భీమసచ్ఛందఁబుల్

అనఁగా “దశ విధచ్ఛందములు," రంగరాట్ఛందస్సు,

ఈ విషయము మిక్కిలి సందిగ్ధముగానేయున్నది. భీమక వియే రచియించి కోమటియగు మల్లియ రేచని పేరఁ బ్రకటించెనని నానుడి ! ఆకోమటి మిక్కిలిగా నందుఁ బ్రంసించుకొనబడినాఁడు వేములవాడ భీమకవియో కోమట్లను బడఁదిట్టినాడు; వినుఁడు.

ఉ "కోమటి కొక్కటిచ్చి పదిగొన్నను దోసములేద, యింటికిన్
సేమమెఱిం చిచ్చిడినఁ జెందద పాపము; వానినేప్పుడే
నేమఱుపాటున న్మఱి నేమియొనర్చిన లేద దోస; మా
భీమునిలింగ మాన క విభీమునిపల్కులు నమ్మియుండుఁడీ.

చ, గొనకొని మర్త్యలోక మునఁ గోమటి పుట్టఁగఁ బుట్టెఁ దోన బొం
కును గపటంబు లాలసయుఁ గుత్సిత బుద్ధియు రిత్తభక్తియున్
సనుపరిమాటలున్ బర ధనంబును గ్రక్కున మెక్కఁజూచుటల్
కొనుటలు నమ్మటల్ మటియు గొంటుదనంబును మూర్ఖవాదముల్ ,

వేములవాడ భీషున యిట్లు సెప్పగా వేడొకకవి దాని నిట్లు ప్రశం సంచినాఁడు. .

లేములవాడ భీమ | భళిరే ! కవిశేఖర సార్వభౌమ ! నీ
వేమని యానతిచ్చితివి యిమ్ములఁ గోమటి పక్షపాతివై
కోమటి కొక్కటిచ్చి పదిగొన్నను దోసము లేద యంటివా
కోమటి కొక్కటీక 'పది గొన్న' ను ధర్మమె ధర్మపద్ధతిన్ "[23]

కోమటి సొమ్ముఁదిని కృతినమ్ముకొని యాతని నెంతో పెద్దగా ప్రకటిం చిన కవినోరే యాకోమటి కాలము వారినిట్టు తిట్టునా : ఏమో ! కృతి చెప్పించు కొని వెల్లడించుకొని తుదకుఁ గోమటి ద్రోహముచేయఁగాఁ దిట్టినాఁడేమో ఏమో ఊహలెందులకు? “ఘనుఁడన్ వేము వాఁడవంశజు డ" నిత్యాది చాటు పద్యములకుఁ బ్రసక్తుఁ డగు భీమకవి కవిజనా శ్రయకర్త కానేరఁ డనియే నాతలంపు అతఁడు శివభ క్తిపరాయణుఁడు. ఐతిహ్యములు, చాటుపద్యములు, నితరక వికృత స్తుతులు, నీవిషయమును రాద్ధాంతపఱుచుచున్నవి. పార్వతీపర మేశ్వరులే తమకుఁ దల్లితండ్రులనుట శైవుల సంప్రదాయము. "ధర నుమా మాతా పితా రుద్ర యనెడు | వరపురాణోక్తి నీశ్వరకులజుండ బసవని పుత్త్రుండ బసవగోత్రుండ" 2[24] పాల్కురికి సోమనాథుఁడు.

"ఇట్లే భీమకవియుఁ దాక్షారామ భీమేశ నందనుఁడ "నని చెప్పి కొన్నాడు ఇఁకఁ గవిజనాశ్రయకర్తగా గ్రంథమున నెఱుఁగఁబడు రేచనజైసుఁడు శైవులకును జైనులకును బ్రచండ విద్వేషము. ఏరికి వారికి నా నాటుతాళ్ల పెట్టు. మతమున విశ్వాసము, పట్టుదల, నెట్టుకొని యున్నయా కాలమున మాఱుమతము వాని పేరఁగృతిని వెల్లడించుటయేకాక యందుఁ, దనకు మిక్కిలి విద్వేషింపదగిన యామాఱుమతపు దేవరనుబ్రశంసించుటయు 'భీమేశ నందనుఁడ 'నని చెప్పుకో:- స్వమతాభిమానికి భీమకవి వంటివానికి సంభవింపదు కవిజనాశ్రయమున దేవతా ప్రశంసయే కాక స్తోత్రముకూడ నున్నది. శ్రీ జయంతిరామయ్య పంతులుగారు1 [25]దక్షిణదేశమున దొరకిన యొక్క ప్రతిలో మాత్రమున్నవని యేడు పద్యము లవతారిక యను పేర గవిజనాశ్రయమునఁ బ్రకటించినారు. ఇంచు మించుగ ముప్పదినలువది కవి జసాశ్రయపుఁ దాళపత్రప్రతు లాంధ్రదేశమునను దక్షిణ దేశమున బరిశీలించితిని గాని యా పద్యములు నాకెందును గాన రాలేదు. పంతులుగా రాపద్యములను గూర్చి యిట్లు వ్రాసినారు. “ఈ యవతారిక ప్రతిలో మాత్రముండుటచేఁ బ్రక్షిప్త మని తోఁపవచ్చును గాని, కవితా వైఖరిని బట్టిచూడ నది ప్రక్షి ప్రము కాడనియే నా నమ్మకము." పంతులుగారి నమ్మక మసమర్థమని నానమ్మము, అనంతునిచ్ఛందమందలి మొదటి పద్యమే యీష ద్భేదముతో నీయవతారికకు మొదటి పద్యముగా నున్నది.

క. శ్రీపల్లథు యతిగణసం, సేవిత పాదార విందుఁ జింతితఫలతున్ భాసజగురు సలఘుచ్ఛం, దోవినుతు మురారి భక్తితో వినుతింరున్. లేకపోయిసను భీమేశ నందన. ( డగుభీమక వి యిట్లు 'మురారి' నిష్టదైవముగా స్తుతించు సని సమ్మరాదు. కాన యాతనిది కానేరదు, ఇంక రెండవ పద్యము :

"క. శ్రీకరముగ రచనపై
లోకంబున సుకవివరులు లోలత్య బొగడన్
బ్రాకటముగ నీఛందము
లోకం బౌ ననఁగఁ దెలుఁగులో నానరింతున్.

ఇందుఁ బ్రాసమునకై శ్రీ కరముగ' ' లోకంబున' 'ప్రాకటముగ' 'లోకంబౌననఁగ' సని నాల్గుపడిఱాళ్ళు పడినవి. యతికై 'లోలత' వచ్చినది. కవి జనాశ్రయమందలి శైలికి నీపద్యముల శైలికిని బోలికయే లేదు. ఈ ఛందము తెల్గులో నొనరింతునని రచింపబోవువాఁ డెట్లు చెప్పఁగూడును? రచింపఁబోవు దశలో నీఛంద మనుటకుఁ బొసఁగుఁబా టెట్లు, కవి జనాశ్రయమును బఠించిన కవితాలుబ్దు డెవఁడో దాక్షిణాత్యుఁ డిటీవల నీ యవతారిక నైతిహ్యమును బట్టి కూర్చిన ట్టిపద్యమే చెప్పక చెప్పుచున్నది. ఇట్టికవితా వైఖరిని బట్టి చూచి యట . రామయ్య పంతులుగా రీది ప్రక్షిప్తము కాదని నమ్ముచున్నారు. 5, 6, 7, పదములుగూడ సస్వరస మగు కూర్పుతో నున్నవి. మటిఱియుఁ బంతులుగారు;

క. పరఁగిన విమలయశోదా
సురచరితుఁడు భీమనాగ్ర సుతుఁ డఖిలకళా
పరిణతుఁ డయ్యెను భూసుర
వరప్రసాదోదిత ధ్రువతీయుతు డై

క. అసమానదానరవితన
యసమానోస్నతుఁడు వాచకొధరుఁడు ప్రా
ణసమానమిత్రుఁ డికృతి
కిసహాయుఁడు గా నుదాత్తకీర్తి ప్రీతిన్

అని గ్రంథమందుండ వలసిన పద్యములను సాధు పాఠములు గల సముచిత ప్రతులతో డ్పాటు లేమిచేఁ గావలయు , "విముల యశోభాసురునిరతడు' “భూసురవరుఁడు ప్రసాదోదిత ధ్రువవశ్రీయుతుఁడై "'యాచకాభరణుడు' ననునవి పాఠములతో గ్రహించి "ఈ పద్యము లనన్వముగా నుండుట చేత నందు బేర్కొనఁబడిన భీమున కును గ్రంథమునకను గల సం బంద మిట్టిదని నిర్ణయింప . వలను గాకున్న "దీని పీఠిక లో వ్రాసి పక్షిప్తములట్లు గ్రంధమునఁ జేర్చక క్రింద గూర్చినారు. పై పద్యము లసన్విరములుగావు. గ్రంధమున గూచ్చుకొని చూచి సచోఁ దేటపడఁగలదు పాఠము తప్పుగా నున్నప్పుడు సమన్వయ మెట్లేర్పడును

మఱియు, రామకృష్ణకవిగారు భీమకవి దేశము నైజాం రాష్ట్ర మందలి లేములవాడయగునో యని నీతిశాస్త్రముక్తావళీ పీఠికలోఁ తెలిపిన తలపున రామయ్య పంతులు గారు కొన్ని .....చుపపర్తులతో, బొందిచి బలపరచినారు. వాస్తవము కావచ్చును నైజాం రాష్ట్ర మందలి లేములవాడలో వెలసిన యీశ్వరు నకు, రాజేశ్వరుడని : సుప్రసిద్ధనామ మయ్యెను. మనభీమ కవి తరచుగా డనయిష్టదైవమును 'భీమేశ్వర' ‘భీమలింగ' నామములతో నే పేర్కొన్నవా డయ్యెను. ఆ రాజేశ్వనకుఁగూడ భీమేశ్వరుఁడని: సుప్రతీతి కలదా ? అంతటి సుప్రసిద్ధ మయిన రాజేశ్వర నామమును విడచి స్థలాతరమున సుప్ర సిద్ధమైన' భీమేశ్వర నామమును బేర్కొనుట భీమకవి గోలకొండ రాష్ట్ర వాస్తవ్యుత్వమునకు గొంత బాధకము. పద్యములలోనున్న వేములవాడ యన్న పేరు గోదావరీ మండల మందలి వేములవాడకుఁగుదురకపోవుట తత్రత్యత్వమునకు బాధకము. కవిని గూర్చియుఁ గవికావ్యములను గూర్చియు నిన మిత్థమని నిర్ధారణ మేర్పడని యప్పుడీస్థలమును గూర్చి యింతచర్చ యెందులకు ?

మఱియు. రామయ్య పంతులుగారు 'ఘనుఁడన్ వేములవాడ' అన్న పద్య మున శ్రీరామమూర్తిగారు కల్పించిన' ‘వెలుంగాధీశ 'యన్న పాఠమునకు బదులుగా వీరేశలింగము పంతులు గారు 'తెలుంగాధీశ' యన్న పాఠముచు జెప్పి' రనియు , 'దెలుంగ్వధీశ ' యని కాని 'తెలుంగధీశ ' యని కాని యుండవలయునే కానీ 'తెలంగాధీశ ' యనుట వ్యాకరణదుష్ట మనియు నట్లు భీమకవి ప్రయోగింపఁ డనియు గర్జించి 'కళింగాధీశ 'యని చేర్చుకొని "కళింగాధీశ యను పాఠ మీప్ర తీతి కనుగుణము, సర్వవిధముల నిర్దుష్టము ; ఇదియే కవి ప్రయు క్తపాఠ మై యుండవలయును" అని వ్రాసిరి కాని యీపాఠము వీరి కెట్లు వచ్చినదో చెప్పనొల్లక పోయినారు కావుననే వీరేశ లింగము పంతులుగారు “తెలుంగాధీశ యన్న పాఠము వ్యాకరణ దుష్ట మగుటచే నది కళింగాధీశ యని యుండవలెనని యొక రసుచున్నారు" అని యది రామయ్యపంతులుగారు సంస్కరించిన పాఠ ముయిన ట్లభిప్రాయపడినారు. 'తెలుంగాధీశ ' యనుట వ్యాకరణదుష్ట మనెడు వాదము గ్రాహ్యము కాదు తద్భవ, దేశి, నామములకు" డుప్రత్యయము పరమగుచో కా రాదేశము వచ్చును. రంగఁడు, లింగఁడు, మారఁడు, సూరఁడు, గురువఁడు, తిప్పడు, మొ. ఇట్లే తెలుఁగఁడు కూడసు తెలుఁగ (డే తెలగడని కూడ మోఱెను. 'తెలుగుఁడు' అని యుండదు అన్నట్లుకూడఁ గానరాదు సంస్కృతస హూసఘటిత మగునప్పుడా యకారాంతరూపమే ప్రాతిపదిక మగును కళింగ గంగు, సాశ్వామందు అనురూపము లున్నను గంగ్వధీశుఁడు, మంగ్వధీశుఁడు, నని యుండదు. పంతులు గారు 'తెలుంగా ధీశ' యసుట వ్యాకరణదుష్ట మనునప్పుడు, శ్రీనాథక విసార్వభౌముని 'యక్షయ్యంబగు' పద్యమును మరచిపోయినారు. వీరేశలింగము పంతులుగారి పాఠము యుక్తమే. “సుచరి త్రాడ్యుని వత్సవాయతెలుఁగున్ క్షోణీశ చూడా మణిన్" అని కం. వీ. గారు ప్రచురించిరి గాని యదికూడ “వత్సవాయుతెల(ల) గక్షోణీశ చూడామణిన్ "అనియే యగునని నానమ్మకము.

ఇక నా 'కళింగాధీశ' యన్న పాఠమును రామయ్య పంతులుగారు నా చాటుపద్యమణిమంజరి నుండి ' గ్రహించి యుండవచ్చును. ప్రాచ్య లిఖితపుస్తక "లలోని యొక తాళపత్ర ప్రతిలోఁ జూచి దానిని జాటుపద్య మణిమంజరిలో 'తెలుంగాధీశ' యనుటకు బాఠాంతరముగా ముద్రించితిని. లోకమువాకు లందుఁ దెలుంగాధీశ యన్న పాఠమే పాదుకొనియుండు టనుబట్టియు శ్రీనాథు నకుఁ గస్తూరికా భిక్షాదానము సల్పిన తెలుంగురాయని పేరే భీమకవికూడఁ గస్తూ రికా భిక్షమే యాచించినవాని పేరుగా నండుటలో సందర్భవిశేష ముండఁ దగి యుండుటను బట్టియుఁ ద్రోసిపుచ్చుటకు సాహసింపక ప్రధానపాతముగా "దీనినే యుంచితిని ఈ పాఠము పరిత్యజ్య మనుటకు వ్యాకరణముష్ట మనెడుకార ణము తగనిది. ఇతర విధములఁ 'గళింగాధీశ ' యన్న పాఠము పరిగ్రాహ్యతరము కావచ్చును

మఱియు వీరేశలింగముపంతులు గారు “సోమ గురువాక్యములు పెట్టి భీమ సుకవి, గరిమ బసవపురాణంబు గణనచేసె "సని పిడుపర్తి బసవన బసవపురాణ పద్యమును గొని వ్యాఖ్యానచాతుర్యముచే “గణనచే సె' ననుటకుఁ గర్ణాటీకరించు టగా నర్థముఁ గూర్చి, పాల్కురికి సోమనాథుని యాంధ్రబసవపురాణమునుబట్టి కర్ణాటభాషలో భీమకవిచే రచియింపఁబడిన బసవపురాణము నుదాహరించి యా యర్థమును స్పష్టపఱిచిరి. పిడుపర్తి బసవన బసవపురాణపుఁ దాళపత్రప్రతు లలో “గరిమ బసవపురాణంబు కన్నడించె" సని యున్నది గావున వ్యాఖ్యాన శ్రమ మక్కఱలేక యే యయ్యది కంథోక్త మగుచున్నది. కాని యా భీమకవియే వేములవాడ భీమకవి యని పంతులవారు పల్కుటకుఁ బ్రమాణమో ! లేదు వేములవాడ భీమకవి చాటుపద్యములలోఁ గూడ దాక్షారామ భీమేశ్వరుని స్మరించి యున్నాఁడు. కర్ణాటక బసవపురాణకర్త యాతఁడే యగునాఁ డందలి యెన్మి దాశ్వాసములలో నెక్కడ నేని భీమేశ్వరుని స్మరింపకుండునా ? తెలుఁగుఁగవీళ్వ రులచే స్తుతింపఁబడుట కాతఁ డేవేని తెలుఁగుఁగబ్బములను గూర్చియే యుండ వలెను గదా ! ఏవో యవి చేకుఱవలసియే యున్నవి. ప్రయోగరత్నాకరమున వేములవాడ భీమకవి నృసింహపురాణమందలివని కొన్ని పద్యము లుదాహరింప బడినవి. ఎంత నిజమో ! వీరేశలింగముపంతులుగా రీతఁ డారాధ్య బ్రాహ్మణుఁ డనిరి.కోవెల గోపురాజు నన్నయభట్టును భీమక విని వేఱుగా స్తుతియించి, తిక్క నాదులను ““మళ్కులచంద్రు"లని తర్వాతఁ జెప్పుకొన్నాఁడు. మీఁది చర్చవలస వేములవాడ భీమకవి విషయము సర్వమును సందిగ్ధమే యగుచున్నది. రామలింగయ్య-తెనాలి. రామకృష్ణుఁడు వేఱు, రామలింగఁడు వేఱుగా మా. రా. కవిగారు వ్రాసినారు[26]. సత్యము కావచ్చును.2[27] వల్లభరాయుడు.. శ్రీ మా. రా కవిగారు వల్లభరాయఁడు రచించినట్టున్న క్రీడాభిరామ! మను వీధినాటకమే శ్రీనాథుని వీధి నాటకము కావచ్చు ననిరి. శ్రీ కం. వీ, పంతులుగా రది“యతిసాహస' మనిరి. నా నిశ్చయము తప్పక యది శ్రీనాథునికృతియే యగునని; కారణసామగ్రి పుష్కలముగా నున్నది. ముద్రింపఁబడునా "శృంగార శ్రీనాథ" మను గ్రంథమున నీచర్చ కలదు

శేషనాథుఁడు :-ఈతనిపర్వతపురాణము ముద్రితము

శ్రీనాథుఁడు-- వల్లభాభ్యుదయ మను శ్రీనాథకృతి యొక్కటియన్నట్టిం దలి యొక్క పద్య మెఱిగించుచున్నది. వల్లభాభ్యుదయమునుగూర్చి శ్రీ మా. రా. కవిగారిట్లు వ్రాసినారు. “వల్లభాభ్యుదయములోఁ గృష్ణాతీరమున నుండు శ్రీకాకుళస్వామి తిరునాళ్ళలో జరుగు నసభ్యములు దీనికంటెఁ బచ్చిగానున్నవి. మఱియు నాంధ్రవల్లభుని తిరునాళ్లలోని విధవాదుర్వర్తనములు శ్రీ నాథుఁడు విశదముగా వర్ణించియున్నాఁడు...... శ్రీనాథుఁడు శ్రీకాకుళాధీశ్వరుఁడగు తెలుఁగురాయని దర్శించి యతని కంకితముగా వల్లభాభ్యుదయమును జెప్పేసు గదా ! అప్పుడు 'అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ ' అని శ్రీనాథుఁడు చెప్పెను" ఈ వ్రాఁత శ్రీ కవిగారావల్లభాభ్యుదయమును జక్కఁగాఁ యెటి:గినవా రనిచెప్పుచున్నది గదా ! ఆ గ్రంథము శ్రీకాకుళాధీశ్వరుఁ డగు తెలుంగురాయఁని కంకిత మట! అతఁడేయట సొంపరాయని తెలుంగురాయఁడు, సాంపరాయని తెలుంగురాయఁడు కృష్ణాతీరమందలి శ్రీకాకుళ మునేలినాఁడనుట కట్టుకత. ఆధారము లేవియునులేవు. ఈ విషయమునఁగల యసందర్భములు పూర్ణముగా నా "శృంగార శ్రీనాథము. "న వెల్లడింపఁబడినవి. ఇప్పటికి నఱువది యేండ్ల కుఁబూర్వ మొకకు శ్రీకాకుళ క్షేత్ర మాహాత్మ్యమును వల్లభాభ్యుచయ మన పేరఁ దేల్గించినాఁడు అది యున్నది. శ్రీ రాథునీ వల్లభాభ్యుదయమునుగూర్చి యందలి పద్యమొకటితకు మనకిఁక సమియుఁదేలియదు. శ్రీ కవిగారు గ్రంథ మును జదివినట్లు వ్రాయుచున్నారు వారు దానిని వెలడింపవలసి యున్నారు.1[28] ఈతడు హరిభట్టు:-----బహుగ్రంథకర్త గా నున్నాఁడు. ఈతని మాత్స్యవారాహపురాణములు దొరికియున్నవి. ఉత్తర నృసింహపురాణము దొరక లేదు. విష్ణుభాగవతము నే కాదశ ద్వాదశ స్కంధములుగూడ నీతఁడు తెలిఁగించినాఁడు. ఆంధ్ర సాహిత్యపరిషత్పుస్తక భాండాగారమున 'హరి' భట్టు రచించినట్టు పై రెండు స్కంధములు నున్నవి. హరిభట్టనుటకు హరికభట్ట సుట వ్రాఁత గాని దోషమే.

సితిసారము, పంచతంత్రి, కామందకము, మొదలగు కొన్ని గ్రంథము లకు గర్త లేవనో యెఱుఁగ రాదు, మఱికొన్ని పద్యము లేగ్రంథము లందలివో కూడ నెఱుఁగరాక యున్నవి. ఇందుఁ బేర్కొనఁబడిన కవీశ్వరులు పెక్కురు పాయికముగా కం. వీ. కవులచరిత్రము ప్రథమభాగమునఁ జేరఁదగినవా రగు దురు. ఇంతవఱకు నాంధ్రభాష లోఁ గవిజనాశ్రయముతక్క జైన ప్రసక్త మగు కబ్బము కానరాలేదు. ద్రవిడకర్ణాటభాషలలో జైనకృతులు పెక్కులున్నవి. ఇందు జినేంద్రపురాణ మనియు నాదిపురాణమనియు రెండు జైనప్రబంధము బుదాహరింపఁబడినవి. కాని వానియందలిపద్యము లెక్కువగాఁ జేకొనఁబడ వయ్యేను. ఉన్న పద్యములంజూడగాఁ బ్రాచీనతర రచనముగాఁ దో పకున్నది


సంస్కృత వాజ్మయమున జార్జ ధరుని పద్ధతి, జల్హణుని సూక్తి ముక్తా వళి, వల్లభదేవుని సుభాషితావళి మొదలగు సంధాన గ్రంథముల మూలమున నిప్పుడను పలభ్యమాసము లగు కావ్యములయుఁ గవులయు వృత్తాంతము లెన్నోగుర్తింపఁబడు చున్నవి; అట్లే యీ సంధానములు గూడ నెందఱునో యపూర్వకవుల , నెన్నింటినో యపూర్వకావ్యములను బయల్పరచినవి. ఇందుఁ గొన్నియేని మన భావిపరిశీలన మూలన బయల్పడఁగల వని విశ్వసింతము, మటియు నెట్టా పెగ్గడరామాయణము మొదలగు ప్రాచీన ప్రబంధము లిందుఁగూడ నను


యము ప్రాచ్యలిఖిత పుస్తకాలలో సున్నది. అందెక్కడను సరసింగరాయలకుఁ జంద్రశేఖరుఁ డసు నియోగిపుంగవుడుఁ మంత్రిగా నున్నట్లు కానరాదు. మఱెక్కడి ప్రతిలో నట్టు చూచినారో ! ఆచరణమున కట్టి యర్ధములేదు. శృంగార శ్రీనాథమందలి " కనకాభిషేకము చూ, \ 1. తంజావూరు పుస్తకళాలలో వేంకటరాజప్రణీత మగుకామందకము పద్యకావ్య మున్నది. అది యిది కానట్టున్నది. దాహృతములు పెక్కులు మనకు దొరకవలసియున్నవి.పేరుకూడ లేకుండం గాలప్రవాహమింక నెన్ని మంచికావ్యములను ముంచి వై చినదో గదా ! ఈ సంధాతలు ప్రాచీనులే యగుటచే వారి కాయా కవీశ్వరుల కావ్య ములు దొరికి పోయుండుననియు వారు దానిని బథించియే పద్యములను సంగ్రహించిరనియు విశ్వసింపఁగూడును అయినను బ్రతివిలేఖకా దులమూలమున నిప్పుడు దొరకిన ప్రతులందుఁ గొన్ని కావ్యముల పేళ్ళును గవుల పేళ్ళును దార్మా రయియుండవచ్చును. కొన్ని పద్యముల విషయమున నీ రెండుసంధానములకును దైవిధ్య మేర్పడెను. ఈపద్య మీకావ్యమందలి దగును గాదని నిర్ధారింప కావ్యములు దొరకినంగాని కుదురచుగదా: ఈసంధానములకుఁ బ్రత్యంతరము లేని లభింపవయ్యె.


ఈ గ్రంథము చెన్నపురిలో ముద్రింపఁబడుచుండుటయు నే నక్కడ నుండరాకయవిరత ప్రయాణములతో దేశాటనము సల్పవలసియుండుటయు సంఘటిల్లుటచే నచ్చుపని చూడ నేకాక పీఠిక వ్రాయను వలసిన గ్రంథపరికరము పరికింపను గూడఁ గుదురదయ్యెను. అయినను నా రెండు ప్రాచీనసంధాన ములను జతకూర్చుట మొదలుగా సిట్లు ముద్రితమై వెల్వడుదాఁకఁ జెన్నపురిలో మన్మిత్రులు బ్రహ్మశ్రీ గన్నవరపు సుబ్బరామయ్య గారు సల్పిన తోడ్పాటు, పరిశ్రమము, మిక్కిలి పెక్కువ. వారితోడ్పాటు లేనిచో నే నిప్పుడిగ్రంథమిట్లు ముద్రింపఁజాలను. మాముద్రణావసరమునఁగూడఁ గొన్నిపొర పాట్లు పొసఁగియుండవచ్చును. సందిగ్ధము లగు పద్యభాగము లట్లే నిల్పితిమి ప్రయత్నపూర్వక మగు విపర్యయ మిందేదియు నుండదు. ప్రమాద ములు సరిపఱుచుకొసఁ బ్రాజ్ఞులకు నమస్కారము.

వేటూరి ప్రభాకరశాస్త్రి, 9-1-18.

  1. చాటు-ప్రథమ భాగము 1914: ద్వితీయభాగము 1922, 1952 (ప్రకాశకులు).
  2. ఇందు 'బాలభాష' అను విభాగము మాత్రమే వెలువడినది. 1930 (భారతి). ఇదే ఆ తరువాత గ్రంథరూపమున వెలువడినది. (ప్రకాశకులు).
  3. ఇది నాకు శ్రీ కే. వి. లక్ష్మణరావు పంతులుగారి మూలమున వచ్చినది.
  4. ఇది గణపవరపు వేంకటకవిది. తంజాపుర పుస్తకశాలలో నున్నది.
  5. చూ. ఇందలి అనుబంధము-1, పుట. 128. (ప్రకాశకులు).
  6. జైనులకు:- శ్లో॥ ప్రమాణకలంకస్య పూజ్యపాదస్య శాసనమ్। ద్విస ధాన కవేః కావ్యం రత్నత్రయమిదంస్మృతమ్.
  7. ఇది విశాఖపట్టణమున శ్రీపరవస్తువారి యార్షపుస్తకశాలలో నున్నది.
  8. ఇది శ్రీముక్త్యాల ప్రభువులగు శ్రీ రాజా వాసిరెడ్డి చంద్రమౌళీశ్వర ప్రసాదబహద్దరు గారి పుస్తకశాలలో నున్నది. తంజావూరు పుస్తకశాలలో గ్రంథారంభము కొంచె మున్నది.
  9. ఇది ప్రాచ్యలిఖితపుస్తకశాలలో గ్రంథపాతములతో నున్నది. ముద్రింపదగిన యుత్తమకావ్యము. ప్రత్యంతరము దొరకలేదు.
  10. ఇది నాదగ్గరనున్నది. తప్పులకుప్ప. ఆరంభము రెండుకాగితములుపోయినవి. మచిలీపట్టణములో నున్న యిమ్మానేని వీరేశలింగమునాయనిగారివలనఁ జేకుఱినది.
  11. ఒకటి ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో నున్నది, వేఱొకటి విశాఖపట్టణమున శ్రీ పరవస్తువారి యార్షపుస్తకశాలలో నున్నది.
  12. శ్రీవీరేశలింగముపంతులుగా రన్యదీయములగు విషయము లనేకములు స్వకపోలసాధితములట్లు కవులచరిత్రమునఁ జేర్చినారు. ఆయా విషయముల తెలుపకుండుట భావివరిశీలకులకుఁ జిక్కుఁగల్గించును.
  13. ప్రాచ్యలిఖితపుస్తకశాలలో.
  14. ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో ;
  15. తంజాపూరుపుస్తకశాలలో నున్నది. శ్రీ రామకృష్ణ కవిగారు ముద్రించినారు
  16. క్రీడాభిరామ వీఠికాదులు చూడుఁడు.
  17. ప్రయోగరత్నాకరమునం దున్నవి. మా. రా, కవిగారు ఉదాహరణ పీఠికలో గూడ నుదాహరించినారు. మొదటిపద్యము సర్ధ మసందర్భముగా నున్నది. తుడువఁగ, కడుగఁగ, ముంపఁగ, తొడరిన తల్లి, అని యుండఁగూడును.
  18. ఇది నా దగ్గజ నున్నది. గ్రంథపాతములతో నిండి యందనుకులుగా నించుకమాత్ర మున్నది.
  19. బసవయరాఘవుని శాసనము, (బట్టర్వర్తుగారి శిలాశాసనముల వాల్యూము 2 లో, నెల్లూరుజిల్లా, కనిగిరి తాలూకా శాసనములలోఁ జూడుఁడు.)
  20. ఆంధ్రకవుల చరిత్రము 1 భాగము.
  21. . కావ్యాలంకారచూడామణి " ఉల్లాసములు మాత్రము ముద్రింపఁబడెను. ఇంకను మఱి కొంత గ్రంధము ముద్రింపఁబడవలసి యున్నది.
  22. ప్రాచ్య లిఖిత పుస్తకణాలలో నున్నది.
  23. ఈ పద్యమున లేములవాడ యనియె కలదు. తక్కిన భీమకవి చాటువుల్నుటిలోకి
    గూడ లేములవాడ, యను పారమున్నది, పయోగరత్నాకరమున నుదాహ
    రింపఁబడినది.
  24. కం. వీ. కపులచరిత్రమున, “దీనినిబట్టి సోమనాథుఁడు లింగాస్యని, పౌత్రుఁ డయినట్టును బసవేటని పుత్రుఁ డయినట్టును గనంబడుచున్నాఁడు" అని యుండుట సరికాదు.
  25. 1. కవిజనాశ్రయము శ్రీ రామయ్యపంతులుగారిచేఁ బ్రకటింపఁబడినది. అందు రెండవ పద్యమున “పరహిత చరితుండ నాద్రపదభక్తి మెయిన్" అను పారమున్నది. ఒక పత్రికలో “జితేంద్ర యని యున్నదనియు, నది కవి సమ్మతమైనచో “జినేంద్ర' యని యుండవలెననియు వారు వ్రాసిరి, అనేక తాళపత్రప్రతులలో 'జినేంద్ర' యన్న పాఠ మున్నది
  26. 1. ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక. 1. క్రీడాభిరామపీఠిక చూడుఁడు.
  27. 2.

    ఉ, గ్రాంథిక సన్నుత ప్రతిభఁ గాంచి రసజ్ఞత మించి యాదిమ
    గ్రంధము లాగ్గడించి ఫణిరాట్పరికల్పితశాప్రవీథికిన్
    బంధువు లైనసత్కవులఁ బ్రార్థన చేపెద దుష్ప్రబంధ సం
    బంధమహాంధకారథరభానుగ భీరపచోమచర్చికన్,

    నీ. మహిత మూలస్థావమల్లికార్జున శిరస్థలచంద్రచంద్రికా ధవళితంబు,
    చెదలువాటిపుర శ్రీరఘూద్వహభుజా స్తం భరక్షలు విధాసంభృత: బు,
    వేదండముఖతటాకోచిత పద్మ సౌగంధికి గంధ పాణి ధమంబు,
    రాజబింబాననారాజిత గాంధర్వ మాధురీ సాధుర తీధరఁబు,

    గీ, కరటికటనిర్గ ధ్వాననిరవధిక సమగనూతనవృష్టిజంబాలితాఖి
    లాసనీ పాలమందిరప్రాంగణంబు ! గురుసమృద్ధుల సైదోడు కొండవీడు

    మ. పరగన్ వారిధి వేష్టితాఖిల మహిభాగంబునన్ రెడ్డిభూ
    వరసింహాసన మై గుభాయతన మై వర్ధిల్లు తత్పట్టణం
    బురుబాహాబలసంవదం బెసుచు శద్రోద్యోగి నాదెండ్ల గో
    పరసాధీశుఁ డ శేషబంధుకుముదప్రాలేయధామాకృతిన్ .

    గద్యము. ఇది శ్రీమదే లేశ్వరగురువరేణ్యచరణారవిందషట్చరణ సకలకళాభరణ రామ నార్యసుపుత్ర సుకవిజనమిత్ర కుమార ఖారవిదిరుదాభిరామ రామలింగయప్రణితం బైస యుద్భటారాధ్యచరిత్రంబునఁ ...... ......... ............. .........

    మన్మిత్రులు చల్లా సూర్యనారాయణరావుపంతులుగారు దీనిని బంపినారు. పాండురంగ మాహాత్మ్యకర్తయు, నేతత్కృతికర్తయు నొక్కఁడే యని గాని, వేఱనిగాని నిర్ధారింపఁ దేలకున్నది. అతఁడు నీతఁడును రామయపుత్రులే. "తైన వైష్ణవపురా ణావళినా నార్ధరచనాపటిష్టైకరమ్యమతివి. " కావున నాతఁడుకూడ నీ వకథ రచియించి యుండఁ దగును, అక్కడ రామకృష్ణుఁడని యిక్కడ రామలింగఁడని యున్నది. ఇక్కడఁ దెనాలి ప్రశంసకానరా లేదు. ఈ యుద్భటారాధ్యచరిత్రము కూడ బయల్పడినఁగాని యదార్ధముతేలదు. ఇందుదాహరింపఁబడిన పద్యమందు నాదెండ్ల గోప మంత్రి పేర్కొఁబడినాఁడు. ఈ రామలింగనికి గుమారభారవి యవి బిరుదు.

  28. 1. మా.రా. కవిగారు, క్రీడాభిరామఁపుభీఠిక లో నే యిట్లు వ్రాసినారు. "చంద్ర శేఖరుఁ డను నియోగిపుంగవుఁడు నరసింగరాయలమంత్రి యని పాళువాభ్యుదయమున నున్నది. కావున "చంద్రశేఖరుక్రియాశ క్తిరాయలయొద్దఁ బాదుకొల్పితి సార్వభౌమ బిరుదు” అనునది స్పష్టముగా నర్థమగుచున్నది." స్వాళ్వాభ్యుద