వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/నందివాహనుం డై శంకరుండు పరిణయంబునకుం జనుట

వికీసోర్స్ నుండి


నందివాహనుం డై శంకరుండు పరిణయంబునకుం జనుట

103-సీ.
గగనవాహిని కప్పు మకుటంబు ధరియించి
  లేఁత వెన్నెలఁ బువ్వుభాతిఁ దుఱిమి
ప్రాఁత పాములనెల్ల పరిహారమును చేసి
  మఱిక్రొత్త పాములమణులు దొడిగి
దందశూకాధిశుఁ దలచుట్టుగాఁ జుట్టి
  పొలుపార నెద భూతిపూతఁ బూసి
పొడల నున్నని క్రొత్తపుట్టంబు ధరియించి
  యేనుగుచర్మంబు మేనఁ గప్పి
ఆ.
నీలకంధరబున నెమ్మితోఁ బటికంపుఁ
బూససరులు వైచి పొలుపు మిగులఁ
జెలువు చేసి యిట్లు శివుడు చతుర్ధశ
భువనరాజ్యలక్ష్మి పొలుపు మిగుల.
104-వ.
మఱియును శృంగారవారాశి యై మారారాతి మహామోదంబున.
105-సీ.
ఘణిఘణిల్లున వైచు ఘన మైన ఱంకెలఁ
  గులశైలగుహలు ఘూర్నిలి చెలంగ
మహితవాలోద్దూత మారుతవశమున
  దిక్కులు చొరుగు లై తిరుగుచుండ
కొండలు కోరాడు కొమ్ముల నమ్మేటి
  ధారాధరంబులు దగులుపడఁగ
పదఘట్టనమున భూభారదక్షుం డగు
  శేషాహి యల్లన శిరము వంపఁ
ఆ.
గొమరుశృంగములును ఖురములుఁ గింకిణీ
ఘంటలును జెలంగఁ గడఁకతోడ
నందమైన యట్టి నందికేశ్వరు నెక్కి
పుష్పవృష్టి గురియ భూతవిభుఁడు.
106-క.
హరుఁ గొల్చి సకలజనములు
కరమొప్పగ నడువఁ గదలి గణనాథుం డా
సరిబొజ్జ పెంచి నిక్కుచు
మురియుచు మూషకము నెక్కి ముందట నడిచెన్.
107-వ.
ఇట్లు గతశృంగార వైభవాడంబరంబున నప్పరమేశ్వరుండు గోరాజగమనుం డై; గౌరీకళ్యాణం బవధరించు తలంపు మనంబున సందడిప సొంపు మిగిలి తుహినగిరి కుధరంబునకుఁ బ్రయాణంబు సేయ గమకించి; సమంచితాలంకారుం డై తన వూర్వభాగంబునఁ దుంబురు నారదాది వీణానాదంబుల వారును; దివ్య దుందుభి నిస్సాణ శంఖ కాహళ ఘంటికా వాద్యంబుల వారును; దండి చండీశ్వరాది మంగళపాఠక జనంబులుఁ గొలిచి నడువ; వారలం గదసి తానును తన యిరుగెలంకు లందు నాసన్నవర్తు లై తమతమ వాహనంబులతో నారాయణ భారతీశులును; వారలం గదసి దేవేంద్రాగ్ని దినేంద్రతనయ దితిసుత వరుణ వాయు కుబేర ప్రముఖు లైన దిక్పాలకులును; వారల దక్షిణోత్తర భాగంబుల సూర్య చంద్రాది నవగ్రహంబులును; మఱియును దన యుపరి భాగంబున సుబల సుమంత మాండవ్య మరీచి మందపాల మార్కుండేయ దధీచ్యూపమన్య వామదేవ దూర్వాస వసిష్ఠ గౌత మాగస్త్య కౌశిక కణ్వాది ముని జనంబులును; మూర్తిమంతంబు లైన వేదశాస్త్ర తపోధర్మ సత్యంబులును; వారల పిఱుంద వాలఖిల్యాది మహపురాణసిద్ధులును సనక సనందన సనత్కుమారాది యోగీంద్రులును; దివిజముని గరుడ కిన్నర గంధర్వ సిద్ధ విద్యాధర కన్యకా జనంబులును; భృంగిరిటి వీరభద్రాది గణంబులును గతిపయ దూరంబునఁ బ్రమథగణంబులును: దైత్య దానవాధీశ్వరులును బరివేష్టింప; నమ్మహమూకలలోనఁ జొచ్చి యెడనెడ సందడి నేయుచు సూర్యవర్ణసోమవర్ణాది మహాప్రమథ నాయకులు మహాలెక్కలై కొలువ నందంద కుసుమవర్షంబులు విడువక జడివట్ట కురియ నానాలోక రంజనామోద సుగంధ మారుత స్పర్శనంబున జనంబులు మనంబులు పల్లవింప నమ్మహేశ్వరుండు జగన్మోహన మహిమాభిరాముండై వివాహంబునకు వచ్చుచున్న సమయంబున.
108-క.
మలహరుఁడును బెండ్లికి రాఁ
గలవాఁడని మున్నె యెఱిఁగి గౌరవమున బం
ధులకును లేఖలు బంపఁగఁ
దలఁచె గిరీంద్రుండు వేగఁ దగఁ జారులచేన్.
109-సీ.
మలహరుఁ డీశుండు మన పాప నడుగంగఁ
బుత్తెంచుటయు మేము నత్తెఱంగు
మహిఁ బెద్ద లగు వారి మన్నన బంధుల
రప్పించి తగ విచారంబు చేసి
వామదేవుఁడు తగు వరుఁ డని భావించి
నెలఁతకు నీడు గా నిర్ణయించి
యుంకువఁ గొంటిమి యొనరంగ నిటమీఁదఁ
బెండ్లి లగ్నంబు సంప్రీతితోడఁ
తే.
బేర్మి నీ శోభనము చక్కఁ బెట్టవలయుఁ
గరుణ వేంచేసి మీ రెల్లఁ గల ఫలంబు
లీలఁ దన్నొంటిఁ జేయక లేఖఁ గన్న
యపుడ రండని బ్రీతితో నద్రివిభుఁడు.
110-మత్త.
వెండికొండకుఁ బైఁడికొండకు వింధ్యయన్ బలుకొండకున్
చండభానుఁడు దోఁచుకొండకు సాగరాంతపుఁ గొండకున్
మండనం బన నొప్పు కొండకు మందరం బను కొండకున్
కొండరాయఁడు పంపె లేఖలు కోటి కాలరి పంక్తిచేన్.
111-వ.
ఇట్లు తన సర్వబంధుజనులకు గౌరీవివాహమహోత్సవం బెఱింగించి పంచిన వారును నిజ బంధు సహితు లై తక్షణంబునఁ జనుదెంచిన.