పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి


పోతన తెలుగు భాగవతము
షష్ఠ స్కంధము

తెభా-6-1-శా.
శ్రీత్సాంకిత కౌస్తుభస్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల
శ్రీవిభ్రాజితు నీలవర్ణు శుభరాజీవాక్షుఁ గంజాత భూ
దేవేంద్రాది సమస్తదేవ మకుటోద్దీప్తోరు రత్నప్రభా
వ్యావిద్ధాంఘ్రిసరోజు నచ్యుతుఁ గృపావాసుం బ్రశంసించెదన్.


 కొన్ని ప్రతులందు “శా. శ్రీవత్సాంకిత..” పద్యమునకు మాఱుగా 
“క.
భూదయాహృదయస్థిత
పాకహర! సర్వలోకపావన! భువనా
తీగుణాశ్రయ! యతివి
ఖ్యా సురార్చితపదాబ్జ! రుణానిలయా!”
అని పద్యం ఉన్నది.

- తంజనగరము - తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి


టీక:- శ్రీవత్సాంకిత కౌస్తుభస్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల శ్రీవిభ్రాజితున్ = శ్రీమన్నారాయణుని {శ్రీవత్సాంకిత కౌస్తుభస్ఫురిత లక్ష్మీ చారు వక్షస్థల శ్రీవిభ్రాజితుడు – శ్రీవత్స మనెడి పుట్టుమచ్చ అంకిత (గుర్తుగాగలిగి) కౌస్తుభమణిచే స్ఫురిత (ప్రకాశిస్తున్న) లక్ష్మీదేవితోకూడిన చారు (అందమైన) వక్షస్థలసంపదచే విభ్రాజితుడు (విశేషముగా ప్రకాశించుచున్నవాడు), హరి}; నీలవర్ణున్ = శ్రీమన్నారాయణుని {నీలవర్ణుడు - నీలమైన రంగుగల దేహము గలవాడు, హరి}; శుభరాజీవాక్షున్ = శ్రీమన్నారాయణుని {శుభరాజీవాక్షుడు - శుభ (శుభప్రదమైన) రాజీవ (పద్మదళముల) వంటి అక్షుడు (కన్నులుగలవాడు), హరి}; కంజాత భూదేవేంద్రాది సమస్త దేవ మకుటోద్దీప్తోరు రత్న ప్రభావ్యావిద్ధాంఘ్రి సరోజున్ = శ్రీమన్నారాయణుని {కంజాత భూదేవేంద్రాది సమస్త దేవ మకుటోద్దీ ప్తోరురత్న ప్రభావ్యావిద్ధాంఘ్రి సరోజుడు - కంజాతభూ (నీటపుట్టునట్టి పద్మమున జనించినవాడు, బ్రహ్మదేవుడు) దేవేంద్రుడు ఆది (మొదలగు) దేవమకుట (దేవతల కిరీటములందు) ఉద్దీప్త (మిక్కిలి ప్రకాశిస్తున్న) ఉరు (పెద్ద) రత్నముల ప్రభా (కాంతులు) వ్యావిద్ధ (విశేషముగా పరచబడిన) అంఘ్రి (పాదములనెడి) సరోజుడు (పద్మములుగలవాడు), హరి}; అచ్యుతున్ = శ్రీమన్నారాయణుని {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేని వాడు, హరి}; కృపావాసున్ = శ్రీమన్నారాయణుని {కృపావాసుడు - కృప (దయ)కు ఆవాసుడు (నివాసమైనవాడు)}; ప్రశంసించెదన్ = స్తుతించెదను.
భావము:- శ్రీవత్సమనే పుట్టుమచ్చతో ప్రకాశించేదీ లక్ష్మీదేవికి నెలవైనదీ అయిన వక్షఃస్థలంతో విరాజిల్లేవాడు, నీలవర్ణం కలిగినవాడు, శుభాలను చేకూర్చే పద్మాలవంటి కన్నులు కలవాడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతల కిరీటాలలోని రత్నకాంతులతో ప్రకాశించే పాదపద్మాలు కలవాడు అయిన శ్రీమన్నారాయణుని స్తుతిస్తాను.

తెభా-6-2-ఉ.
నిండుమతిం దలంతుఁ గమనీయ భుజంగమరాజమండలీ
మంనుఁ జంద్రఖండ పరిమండితమస్తకుఁ దారమల్లికా
పాండురవర్ణుఁ జండతరభండను హేమగిరీంద్రచారు కో
దండు మహేశు గంధగజదానవభంజను భక్తరంజనున్.

టీక:- నిండుమతిన్ = సంపూర్ణమైన మనస్సుతో; తలంతు = సంస్మరించెదను; కమనీయ భుజంగమరాజ మండలీ మండనున్ = పరమశివుని {కమనీయ భుజంగమ రాజ మండలీ మండనుడు - కమనీయ (మనోహరమైన) భుజంగమ (సర్ప) రాజ (రాజుల) మండలీ (సమూహములచే) మండనుడు (అలంకరింపబడినాడు), శివుడు}; చంద్రఖండపరిమండితమస్తకున్ = పరమశివుని {చంద్రఖండ పరిమండిత మస్తకుడు - చంద్రఖండ (చంద్రకళచే) పరిమండిత (చక్కగా అలంకరింపబడిన) మస్తకుడు (శిరస్సు గలవాడు), శివుడు}; తారమల్లికాపాండురవర్ణున్ = పరమశివుని {తార మల్లికా పాండుర వర్ణుడు - తార (తారక లేదా వెండి) వంటి మల్లికా (మల్లెపూల) వంటి పాండుర (తెల్లని) వర్ణుడు (రంగు దేహము గలవాడు), శివుడు}; చండతరభండనున్ = పరమశివుని {చండతర భండనుడు - చండతర (మిక్కిలి భయంకరముగ) భండనుడు (యుద్ధము చేయువాడు), శివుడు}; హేమగిరీంద్రచారుకోదండున్ = పరమశివుని {హేమగిరీంద్ర చారు కోదండు - హేమగిరీంద్ర (మేరుపర్వతోత్తమును) చారు (అందమైన) కోదండు (విల్లుగా గలవాడు), శివుడు}; మహేశున్ = పరమశివుని {మహేశుడు - మహ (గొప్ప) ఈశుడు, శివుడు}; గంధగజదానవభంజనున్ = పరమశివుని {గంధ గజదానవ భంజనుడు - గంధ (మదించిన) గజదానవ (గజాసురుని) భంజనుడు (సంహరించినవాడు), శివుడు}; భక్తరంజనున్ = పరమశివుని {భక్త రంజనుడు - భక్తులను రంజనుడు (రంజింపజేయువాడు), శివుడు}.
భావము:- అందమైన నాగరాజులను భూషణాలుగా ధరించినవాడు, తలపై నెలవంకను అలంకరించుకొన్నవాడు, నక్షత్రం వలె మల్లెపువ్వు వలె తెల్లని మేనిఛాయ కలవాడు, భయంకరంగా యుద్ధం చేసేవాడు, మేరుపర్వతాన్ని విల్లుగా ధరించినవాడు, గర్వించిన గజాసురుణ్ణి సంహరించినవాడు, భక్తులను రంజింపజేసేవాడు అయిన మహేశ్వరుణ్ణి నిండు మనస్సుతో స్మరిస్తాను.

తెభా-6-3-ఉ.
హంతురంగముం బరమహంసము నంచితదేవతా కులో
త్తంము నాగమాంత విదిధ్రువపుణ్యరమావతంసమున్
కంజిఘాంసు నంశమును ర్బురసూత్ర సమావృతాంసమున్
హిం నడంచు బ్రహ్మము నహీనశుభంబులకై భజించెదన్.

టీక:- హంసతురంగమున్ = బ్రహ్మదేవుని {హంస తురంగము - హంసను తురంగము (వాహనము) గాగలవాడు, బ్రహ్మ}; పరమహంసమున్ = బ్రహ్మదేవుని {పరమహంసము - పరమ హంస యైనవాడు, బ్రహ్మ}; అంచితదేవతాకులోత్తంసమున్ = బ్రహ్మదేవుని {అంచిత దేవతా కులోత్తంసము - అంచిత (చక్కగా) దేవతా (దేవతల) కుల (సమూహమునందు) ఉత్తంసము (శ్రేష్ఠమైనవాడు), బ్రహ్మ}; ఆగమాంతవిదితధ్రువపుణ్య రమావతంసమున్ = బ్రహ్మదేవుని {ఆగమాంత విదిత ధ్రువ పుణ్య రమా వతంసము - ఆగమాంత (వేదాంతములో) విదిత (తెలుపబడి) ధ్రువ (నిశ్చయమైన) పుణ్యము యొక్క రమా (శోభను) వతంసము (శిరస్సున ధరించినవాడు), బ్రహ్మ}; కంసజిఘాంసునంశమున్ = బ్రహ్మదేవుని {కంసజింఘాంసు నంశము - కంసజింఘ (కంసునిశత్రువైన కృష్ణుని) యొక్క అంశము (అంశ అయినవాడు), బ్రహ్మ}; కర్బురసూత్రసమావృతాంసమున్ = బ్రహ్మదేవుని {కర్బుర సూత్ర సమావృతాంసము - కర్బుర (బంగారు) సూత్ర (యజ్ఞోపవీతము)చే సమావృత (చక్కగా కలిగిన) అంసము (మూపు గలవాడు), బ్రహ్మ}; హింసనడంచుబ్రహ్మమున్ = బ్రహ్మదేవుని {హింస నడంచు బ్రహ్మము - హింసను అణచివేసెడి పరబ్రహ్మ, బ్రహ్మ}; అహీన = గొప్ప; శుభముల్ = శుభముల; కై = కొరకు; భజించెదన్ = కొలిచెదను;
భావము:- హంస వాహనుడు, పరమహంస ఐనవాడు, దేవతలలో ఉత్తముడు, వేదాంతంలో నిక్షిప్తమైన పుణ్యపు శోభ కలవాడు, కంసమర్దనుడైన వాసుదేవుని అంశావతార మైనవాడు, బంగారపు యజ్ఞోపవీతం కలిగిన భుజాగ్రం కలవాడు, హింసను అణచివేసేవాడు అయిన బహ్మదేవుణ్ణి గొప్ప శుభాలకోసం భజిస్తాను.

తెభా-6-4-ఉ.
మోకహస్తునిన్ సమదమూషకవాహను నేకదంతు లం
బోరు నంబికాతనయు నూర్జితపుణ్యు గణేశు దేవతా
హ్లాగరిష్ఠు దంతిముఖు నంచిత భక్తఫలప్రదాయకున్
మోముతోడ హస్తములుమోడ్చి భజించెద నిష్టసిద్ధికిన్.

టీక:- మోదకహస్తునిన్ = వినాయకుని {మోదక హస్తుడు - మోదక (కుడుములు) హస్తుడు (చేతిలో గలవాడు), విఘ్నేశ్వరుడు}; సమదమూషకవాహనున్ = వినాయకుని {సమద మూషక వాహనుడు - సమద (మదించిన) మూషక (ఎలుక) వాహనుడు (వాహనముగా గలవాడు), విఘ్నేశ్వరుడు}; ఏకదంతున్ = వినాయకుని {ఏకదంతుడు - ఏక (ఒకటే) దంతుడు (దంతము గలవాడు), విఘ్నేశ్వరుడు}; లంబోదరున్ = వినాయకుని {లంబోదరుడు - లంబ (దీర్ఘమైన, వ్రేలాడెడి) ఉదరుడు (పొట్ట గలవాడు), విఘ్నేశ్వరుడు}; అంబికాతనయున్ = వినాయకుని {అంబికా తనయుడు - అంబిక (పార్వతీదేవి యొక్క) తనయుడు, విఘ్నేశ్వరుడు}; ఊర్జితపుణ్యున్ = వినాయకుని {ఊర్జిత పుణ్యుడు - ఊర్జిత (పోగు పడిన) పుణ్యుడు, విఘ్నేశ్వరుడు}; గణేశున్ = వినాయకుని {గణేశుడు - సర్వ గణములకు ఈశుడు (అధిపతి), విఘ్నేశ్వరుడు}; దేవతాహ్లాద గరిష్ఠున్ = వినాయకుని {దేవతాహ్లాదగరిష్ఠుడు - దేవతా (దేవతలకు) ఆహ్లాద (సంతోషమును కలిగించువారిలో) గరిష్ఠుడు (శ్రేష్ఠుడు), విఘ్నేశ్వరుడు}; దంతిముఖున్ = వినాయకుని {దంతి ముఖుడు - దంతి (ఏనుగు) ముఖుడు (ముఖము గలవాడు), విఘ్నేశ్వరుడు}; అంచితభక్తఫలప్రదాయకున్ = వినాయకుని {అంచిత భక్త ఫల ప్రదాయకుడు - అంచిత (చక్కటి) భక్తులకు ఫల (సత్ఫలములను) ప్రదాయకుడు (చక్కగా ఇచ్చువాడు), విఘ్నేశ్వరుడు}; మోదము = సంతోషము; తోడన్ = తోటి; హస్తములు = చేతులు; మోడ్చి = ముడిచి; భజించెదన్ = కొలిచెదను; ఇష్ట = కోరిన వరములు; సిద్దికిన్ = సిద్దించుటకు;
భావము:- చేత కుడుములు కలవాడు, మూషిక వాహనుడు, ఏకదంతుడు, లంబోదరుడు, పార్వతీ నందనుడు, గణాధిపతి, దేవతలకు ఆనంద సంధాయకుడు, గజముఖుడు, భక్తులకు అభీష్ట ఫలాల నిచ్చేవాడు అయిన వినాయకుణ్ణి మా కోరికలు తీరడం కోసం ప్రీతిపూర్వకంగా చేతులు మోడ్చి సేవిస్తాను.

తెభా-6-5-ఉ.
ల్లతనంబు గాక పొడట్టిన పూర్వపురీతి నేఁడు నా
యుల్లమునందు నుండుము సమున్నత తేజముతోడ భక్తి రం
జిల్లిన చూపుగూడ విధిఁజెందిన ప్రోడ బుధాళి నీడ మా
ల్లి దయామతల్లి ప్రణద్రుమకల్పకవల్లి భారతీ!

టీక:- కల్లతనంబుగాక = సత్యముగ; పొడగట్టిన = దర్శన మిచ్చిన; పూర్వపు = ఇంతకు ముందు; రీతిన్ = వలె; నేడున్ = ఈ దినమునకూడ; నా = నా యొక్క; యుల్లమున్ = మనసు; అందున్ = లో; ఉండుము = వసించుము; సమున్నత = మిక్కిలి ఉన్నతమైన; తేజము = ప్రకాశము; తోడన్ = తోటి; భక్తి = భక్తి; రంజిల్లిన = వెలుగులు వెదజల్లెడు; చూపు = చూపు; కూడన్ = కలిగి; విధిన్ = బ్రహ్మదేవుని; చెందిన = చేరిన; ప్రౌడ = ప్రౌడరాలు; బుధ = జ్ఞానుల; ఆళి = సమూహములకు; నీడ = ఆశ్రయమై నామె; మా = మా యొక్క; తల్లి = అమ్మ; దయా = దయ గస; మతల్లి = శ్రేష్ఠురాలు; ప్రణత = నమస్కరించెడి వారికి; ద్రుమకల్పక = కల్పవృక్షము వంటి; వల్లి = లతవంటి యామె; భారతీ = సరస్వతీదేవీ.
భావము:- భారతీ! ఆనాడు నిజంగానే నీవు నాకు సాక్షాత్కరించినట్లు ఈనాడు కూడా వెలుగులు వెదజల్లే రూపంతో, రమ్యత్వం రంజిల్లే చూపుతో నా హృదయంలో ఉండు. విధాతను చెట్టబట్టిన ప్రోడవు. బుధాళికి తోడునీడవు. మా తల్లివి. దయామతల్లివి. ఆశ్రితజన కల్పవల్లివి.

తెభా-6-6-క.
విసత్కంకణరవరవ
లితం బగు నభయ వరద రముల బెరయం
జెరేఁగి భక్తులకు నల
లుములు దయచేయు జలధిన్యకఁ దలతున్.

టీక:- విలసత్ = ప్రకాశిస్తున్న; కంకణరవ = కంకణముల శబ్దముల; రవ = శబ్దముతో; కలితంబు = కూడినదైన; అభయ = అభయమును; వర = వరములను; ద = ఇచ్చెడి; కరములన్ = చేతులతో; పెరయన్ = ప్రకాశించుతూ; చెలరేగి = ఉత్సాహించి; భక్తుల్ = భక్తుల; కున్ = కు; అల = ఆ యొక్క; కలుములు = సంపదలు; దయచేయు = ఇచ్చెడి; జలధికన్యకన్ = లక్ష్మీదేవిని {జలధి కన్య - జలధి (సముద్రము) యొక్క కన్య (పుత్రిక), లక్ష్మి}; తలతున్ = సంస్మరించెదను.
భావము:- మెరిసే కంకణాలు గలగలలాడగా, అభయహస్తంతో భయం తీర్చి, వరదహస్తంతో కోరిన వరాలిచ్చి, భక్తులకు భాగ్యాలను ప్రసాదించే సముద్రుని కుమార్తె అయిన ఆ యొక్క లక్ష్మీదేవిని స్మరించుకొంటాను.

తెభా-6-7-క.
కాళికి బహుసన్నుత లో
కాళికిఁ గమనీయ వలయ రకీలిత కం
కాళికిఁ దాపస మానస
కేళికి వందనము చేసి కీర్తింతు మదిన్.

టీక:- కాళి = పార్వతీదేవి; కిన్ = కి; బహుసన్నుతలోకాళి = పార్వతీదేవి {బహు సన్నుత లోకాళి - బహు (అనేకమైన) సన్నుత (స్తుతించెడి) లోక (లోకముల) ఆళి (సమూహములు గలామె), పార్వతి}; కిన్ = కు; కమనీయవలయకరకీలితకంకాళి = పార్వతీదేవి {కమనీయ వలయ కర కీలిత కంకాళి - కమనీయ (మనోహరమైన) వలయ (కంకణములు) కర (చేతు లందు) కీలిత (అలంకరింపబడిన) కంక (పుఱ్ఱెల) ఆళి (సమూహములు గలామె), పార్వతి}; కిన్ = కి; తాపసమానసకేళి = పార్వతీదేవి {తాపస మానస కేళి - తాపసుల మానస (మనసు లందు) కేళి (విహరించెడి యామె), పార్వతి}; వందనము = నమస్కారము; చేసి = చేసి; కీర్తింతున్ = స్తుతింతును; మదిన్ = మనసు నందు.
భావము:- లోకాలన్నిటి చేత పొగడబడేది, అందమైన కంకణాలు కలిగిన చేతిలో కపాలాన్ని ధరించేదీ. మునుల మనస్సులలో విహరించేది అయిన కాళీమాతను నా మనస్సులో కీర్తిస్తాను.

తెభా-6-8-వ.
అని యిష్టదేవతాప్రార్థనంబు జేసి.
టీక:- అని = అని; ఇష్ట = ఇష్టమైన; దేవతా = దేవతలను; ప్రార్థనంబు = ప్రార్థించుట; చేసి = చేసి.
భావము:- అని ఇష్టదేవతలను ప్రార్థించి...

తెభా-6-9-చ.
మసమాధిధుర్యుఁ బటు పావనకర్మ విధేయు దేవతా
నర వంద్యు సద్విమలవాక్యు జనార్దనకీర్తనక్రియా
ణ సమర్థు వేద చయ పారగు భవ్యుఁ ద్రికాలవేది భా
సుమతిఁ గొల్చుటొప్పు బుధశోభితుఁ బుణ్యుఁ బరాశరాత్మజున్,

టీక:- పరమ = అత్యుత్తమమైన; సమాధి = యోగనిష్ఠలో; ధుర్యున్ = ధరించి యుండు వానిని; పటు = గట్టి; పావన = పుణ్యవంతమైన; కర్మ = కర్మములు చేయుట యందు; విధేయున్ = అణకువగా ఉండు వానిని; దేవతా = దేవతలచేత; వర = శ్రేష్ఠమైన; నర = మానవులచేతను; వంద్యున్ = నమస్కరింప దగిన వానిని; సత్ = మంచి; విమల = స్వచ్ఛమైన; వాక్యున్ = వాక్కు గలవానిని; జనార్దన = విష్ణుమూర్తిని; కీర్తన = కీర్తించు టనెడి; క్రియా = పనిలో; సమర్థున్ = సమర్థుడైన వానిని; వేద = వేదముల; చయ = సమూహము నందు; పారగున్ = మిక్కిలి నేర్పరుని; భవ్యున్ = యోగ్యుని; త్రికాల = సర్వమును {త్రికాలములు - 1భూత 2భవిష్య 3వర్తమాన కాలములు}; వేదిన్ = తెలిసిన వానిని; భాసుర = ప్రకాశవంతమైన; మతిన్ = మనసుతో; కొల్చుట = పూజించుట; ఒప్పు = సరియైన పని; బుధ = జ్ఞానులచే; శోభితున్ = శోభిల్లువానిని; పుణ్యు = పుణ్యవంతుని; పరాశరాత్మజున్ = వేదవ్యాసుని {పరాశ రాత్మజుడు - పరాశరుని పుత్రుడు, వ్యాసుడు}.
భావము:- గొప్ప యోగనిష్ఠలో ఉండేవాడు, పుణ్యకార్యాలు ఆచరించేవాడు, దేవతలచేత మానవులచేత నమస్కారాలను పొందేవాడు, మంచి స్వచ్ఛమైన వాక్కులు కలవాడు, విష్ణు సంకీర్తనంలో నిష్ణాతుడు, వేదవేత్త, భూతభవిష్యద్వర్తమానాలు తెలిసిన భవ్యుడు, పండితులచేత సేవింపబడేవాడు, పుణ్యాత్ముడు, పరాశరుని కుమారుడు అయిన వేదవ్యాసుని సేవించడం మంచిది.

తెభా-6-10-క.
వ్యాసుని భగవత్పద సం
వాసుని నాగమ పురాణ ర విష్ణుకథా
వాసుని నిర్మల కవితా
భ్యాసుని పదపద్మయుగము భావింతు మదిన్.

టీక:- వ్యాసుని = వ్యాసుని; భగవత్ = భగవంతుని; పద = పాదముల వద్ద; సంవాసుని = చక్కగా నుండు వానిని; ఆగమ = వేదములు; పురాణ = పురాణములు; వర = శ్రేష్ఠమైన; విష్ణు = నారాయణుని; కథా = కథల యందు; వాసుని = విహరించువానిని; నిర్మల = స్వచ్ఛమైన; కవితా = కవిత్వమును; అభ్యాసుని = చేయువానిని; పద = పాదము లనెడి; పద్మ = పద్మముల; యుగమున్ = జంటను; భావింతు = సంస్మరింతు; మదిన్ = మనసు నందు.
భావము:- నిరంతరం భక్తితో భగవంతుని పాదాలు సేవిస్తూ ఉండేవాడు, వేద పురాణాలలోని గొప్ప విష్ణుకథలలో పారీణుడు, కమనీయ కవితా ప్రవీణుడు అయిన వ్యాసభగవానుని పాదపద్మాలను మనస్సులో స్మరిస్తాను.

తెభా-6-11-సీ.
రకవిత్వోద్రేకి వాల్మీకిఁ గొనియాడి-
భాగవతార్థ వైవముఁ బలుకు
శుకమంజులాలాపు శుకయోగిఁ బ్రార్థించి-
బాణ మయూరుల ప్రతిభ నొడివి
భాస సౌమల్లిక భారవి మాఘుల-
న సుధా మధుర వాక్యములఁ దలఁచి
కాళిదాసుఁ గవీంద్రల్పవృక్షముఁ గొల్చి-
న్నపాచార్యు వర్ణనలఁ బొగడి

తెభా-6-11.1-తే.
వెయఁ దిక్కన సోమయాజు భజించి
యెఱ్ఱనామాత్యు భాస్కరు నిచ్చఁ గొల్చి
సుకవిసోముని నాచనసోమునెఱిఁగి
విమనోనాథు శ్రీనాథు నత మెచ్చి.

టీక:- వర = ఉత్తమమైన; కవితా = కవిత్వము చెప్పు టందు; ఉద్రేకిన్ = ఉత్సాహము గలవాడైన; వాల్మీకిన్ = వాల్మీకిని {వాల్మీకి – రామాయణ కర్త}; కొనియాడి = కీర్తించి; భాగవత = భాగవతము యొక్క; అర్థ = అర్థమును, ప్రయోజనమును; వైభవమున్ = వైభవమును, గొప్పదనముల; పలుకు = పలికెడు; శుక = చిలుకవలె; మంజుల = మనోహరముగా; ఆలాపు = పలికెడు; శుక = శుకుడు యనెడి {శుకుడు – భాగవత పురాణ ప్రయోక్త}; యోగిన్ = యోగిని; ప్రార్థించి = కీర్తించి; బాణ = బాణుని {బాణుడు – హర్షచరిత్ర, చండికా శతకము, పార్వతీ పరిణయం మున్నగునవి వ్రాసిన హర్షవర్థనుని ఆస్థాన కవి}; మయూరులన్ = మయూరుల యొక్క {మయూరుడు – సంస్కృత సూర్యశతకం వ్రాసిన శ్రీహర్షుని ఆస్థాన కవి}; ప్రతిభన్ = ప్రజ్ఞను; నుడివి = పొగిడి; భాస = భాసుని {భాసుడు – ఊరుభంగం మున్నగు అద్భుత నాటకాలు వ్రాసిన గొప్ప సంస్కృత కవి}; సౌమల్లిక = సౌమల్లికుని {సౌమల్లికుడు – మహాకవి కాళిదాసు అంతనివానిచే సబహుమానంగా పేర్కొనబడిన అంతకు పూర్వకవి}; భారవి = భారవిని {భారవి – కిరాతార్జునీయం వ్రాసిన దక్షిణభారతదేసానికి చెందిన సంస్కృత మహాకవి}; మాఘులన్ = మాఘులను {మాఘుడు – శిశుపాలవధ వ్రాసిన గొప్ప సంస్కృత పండితుడు}; ఘన = గొప్ప; సుధా = అమృతమువంటి; మధుర = తీయని; వాక్యములన్ = మాటలతో; తలచి = సంస్మరించి; కాళిదాసున్ = కాళిదాసుని {కాళిదాసు – మేఘసందేశం, రఘువంశం, కుమారసంభవం మున్నగునవి వ్రాసిన మహా గొప్ప పండితుడు, ఇతనిని మించిన కవి లేడు}; కవి = కవులలో; ఇంద్ర = శ్రేష్ఠమైన; కల్పవృక్షమున్ = కల్పవృక్షము వంటివానిని; కొల్చి = పూజించి; నన్నపాచార్యు = నన్నయ యనెడి ఆచార్యుని {ఆది కవి నన్నయ – మహాభారతం ఆంధ్రీకరించిన కవిత్రయంలో ప్రథముడు}; వర్ణనలన్ = వర్ణనలను; పొగడి = కీర్తించి.
వెలయన్ = ప్రసిద్ధముగా; తిక్కన = తిక్కన యనెడి {తిక్కన - మహాభారతం ఆంధ్రీకరించిన కవిత్రయంలో రెండవవాడు}; సోమయాజులన్ = సోమయాజిని; భజించి = పూజించి; ఎఱ్ఱన = ఎఱ్ఱన {ఎఱ్ఱన - మహాభారతం ఆంధ్రీకరించిన కవిత్రయంలో మూడవవాడు }; ఆమాత్యున్ = మంత్రిని; భాస్కరున్ = భాస్కరుని {భాస్కరుడు – రామాయణం ఆంధ్రీకరించిన మహాకవి}; ఇచ్చన్ = ఇష్టపూర్తిగా; కొల్చి = పూజించి; సుకవి = మంచి కవి యైన; సోముని = సోముని; నాచనసోముని = నాచనసోముని {నాచన సోమన – ఉత్తర హరివంశం వ్రాసిన మహాకవి}; ఎఱిగి = తెలిసికొని; కవి = కవుల యొక్క; మనస్ = మనసులకు; నాథున్ = పతివంటి వాడైన; శ్రీనాథు = శ్రీనాథుని యొక్క {శ్రీనాథుడు – మరుత్తరాట్చరిత్ర, కాశీఖండము, హరవిలాసము మున్నగునవి వ్రాసిన ప్రౌఢకవి, వీరు పోతనకు మేనమామ అని నానుడి}; ఘనతన్ = గొప్పదనమును; మెచ్చి = శ్లాఘించి.
భావము:- ఉత్తమ కవితావేశం కలిగిన వాల్మీకిని కీర్తించి, భాగవత పరమార్థాన్ని చక్కగా వివరించి చెప్పిన శుకమహర్షిని ప్రార్థించి, బాణుడు మయూరుడు మొదలైన కవుల ప్రతిభను పొగడి, భాస సౌమిల్లక భారవి మాఘ కవుల సుధామధురోక్తులను స్మరించి, కవుల పాలిటి కల్పవృక్షమైన కాళిదాసును కొలిచి, నన్నపార్యుని వర్ణనలను పొగడి, తిక్కన సోమయాజిని కీర్తించి, ఎఱ్ఱన భాస్కర కవులను మెచ్చి, సుకవి అయిన నాచన సోమునికి నమస్కరించి, కవిజన మనోనాథుడైన శ్రీనాథుని గొపతనాన్ని మెచ్చుకొని...

తెభా-6-12-ఉ.
మ్మెలు చెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్
సొమ్ముగ వాక్యసంపదలు సూఱలు చేసినవాని భక్తి లో
మ్మినవాని భాగవత నైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో
మ్మెఱ పోతరాజుఁ గవిట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్.

టీక:- ఎమ్మెలు = ప్రగల్భములు; చెప్పన్ = చెప్పుట; ఏల = ఎందులకు; జగము = లోకము; ఎన్నగన్ = కీర్తించగా; పన్నగరాజశాయి = నారాయణుని {పన్నగ రాజ శాయి - పన్నగరాజు (ఆదిశేషుని) శాయి (శయ్యగా కలవాడు), విష్ణువు}; కిన్ = కి; సొమ్ముగా = అలంకారమైన; వాక్య = మాట లనెడి; సంపదలు = సంపదలను; చూఱలుచేసినవానిన్ = కొల్లగొట్టిన వానిని; భక్తిన్ = భక్తిగా; లో = మనసులో; నమ్మినవాని = నమ్మినట్టి వానిని; భాగవత = భాగవతులలో; నైష్ఠికుడు = నిష్ఠాగరిష్ఠుడైన వాడు; ఐ = అయ్యి; తగువానిన్ = తగినవానిని; పేర్మితో = ఆదరముతో; బమ్మెఱ పోతరాజు = బమ్మెఱ పోతనను; కవి = కవులలో; పట్టపురాజున్ = పట్టాభిషిక్తుడైన రాజుని; తలంచి = సంస్మరించి; మ్రొక్కెదన్ = కొలిచెదను.
భావము:- ప్రగల్భాలు చెప్పడం ఎందుకు? జగమంతా మెచ్చగా శేషశయనుడైన విష్ణుదేవునికి తన కవితా సంపదలనే భూషణాలుగా కోకొల్లలుగా సమర్పించుకొన్నవాడు, భక్తినే నమ్మినవాడు, భగవత్పరమైన పరమ నిష్ఠా గరిష్ఠుడు (భాగవత రచనా నిష్ఠ కలవాడు), కవిరాజు అయిన బమ్మెర పోతనను తలచుకొని నమస్కరిస్తాను.

తెభా-6-13-వ.
అని సకల సుకవి నికరంబులకు ముకుళిత కరకమలుండనై.
టీక:- అని = అని; సకల = నిఖిలమైన; సుకవి = మంచికవుల; నికరంబుల్ = సమూహముల; కున్ = కు; కుళిత = మోడ్చిన; కర = చేతులనెడి; కమలుండను = పద్మములు గలవాడను; ఐ = అయ్యి.
భావము:- అని సకల సత్కవి సమూహానికి చేతులు జోడించినవాడనై...