Jump to content

పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/ధరణీ ధర్మదేవత లుద్ధరణంబు

వికీసోర్స్ నుండి


తెభా-1-437-వ.
"నరేంద్రా! నిన్ను నారోపితశరశరాసను సర్వప్రదేశంబు లందును విలోకించుచున్నవాడ; నే నెక్కడ నుండుదు నానతిమ్మ"నిన, రాజన్యశేఖరుండు ప్రాణవధ, స్త్రీ, ద్యూత, పానంబు, లనియెడు నాలుగు స్థానంబుల నిచ్చి, మఱియు నడిగిన సువర్ణ మూలం బగు నసత్య, మద, కామ, హింసా, వైరంబు, లనియెడు పంచప్రదేశంబుల నొసంగి, యితరస్థలంబుల స్పృశియింపకుండ నియమించె; నిట్లు కలినిగ్రహంబుసేసి; హీనంబు లయిన తప, శ్శౌచ, దయ లనియెడి మూఁడుపాదంబులు వృషభమూర్తి యయిన ధర్మదేవుని కిచ్చి, విశ్వంభరకు నిర్భరం బయిన సంతోషంబు సంపాదించి.
టీక:- నరేంద్రా = రాజా {నరేంద్ర - నరులకు ఇంద్రుడు రాజు}; నిన్నున్ = నిన్ను; ఆరోపిత = ఎక్కుపెట్టిన; శరశరాసను = విల్లంబులు కలవానిగా; సర్వ = సమస్త; ప్రదేశంబులు = స్థలములు; అందునున్ = లోను; విలోకించుచున్ = చూచుచు; ఉన్నవాడ = ఉన్నాడను; నేన్ = నేను; ఎక్కడన్ = ఎక్కడ; ఉండుదున్ = ఉండను; ఆనతి = ఆజ్ఞ; ఇమ్ము = ఇమ్ము; అనిన = అనగా; రాజన్య = రాజులలో, క్షత్రియులలో; శేఖరుండు = శిఖరము వంటివాడు, శ్రేష్ఠుడు; ప్రాణవధ = జీవులను చంపుట; స్త్రీ = స్త్రీలోలత్వమును; ద్యూత = ద్యూతమును, జూదమును; పానంబులు = మద్యపానమును, తాగుడును; అనియెడు = అనెడు; నాలుగు = నాలుగు (4); స్థానంబులన్ = స్థలములను; చోటులను; ఇచ్చి = ఇచ్చి; మఱియున్ = ఇంకను; అడిగిన = అడుగగా; సువర్ణ = బంగారము, విత్తము; మూలంబు = మూలకారణము; అగు = అయిన; అసత్య = అసత్యమును, అబద్దమును; మద = మదమును, గర్వమును; కామ = అధికమైన ఆసక్తి; హింస = జీవులను బాధించుట; వైరంబులు = కయ్యములు, కలహములు; అనియెడు = అనే; పంచ = ఐదు; ప్రదేశంబులన్ = స్థలములను; ఒసంగి = ఇచ్చి; ఇతర = ఇతర; స్థలంబులన్ = స్థలములను; స్పృశియింపకన్ = ముట్టుకొనక; ఉండన్ = ఉండునట్లు; నియమించెన్ = కట్టడి చేసెను; ఇట్లు = ఈ విధముగ; కలి = కలి యొక్క; నిగ్రహంబు = కట్టడి; చేసి = చేసి; హీనంబులు = క్షీణించినవి; అయిన = అయినట్టి; తపస్ = తపస్సును; శ్శౌచ = శౌచమును; దయలు = దయయు; అనియెడి = అనెడి; మూఁడు = మూడు (3); పాదంబులున్ = కాళ్ళు; వృషభ = ఎద్దు; మూర్తి = రూపమున ఉన్నవాడు; అయిన = అయినట్టి; ధర్మదేవుడు = ధర్మదేవత; కిన్ = కు; ఇచ్చి = ఇచ్చి; విశ్వంభర = విశ్వమును భరించునది, భూదేవి; కున్ = కి; నిర్భరంబు = నిర్భరము, అధికము; అయిన = అయినట్టి; సంతోషంబున్ = సంతోషమును; సంపాదించి = కలిగించి.
భావము:- రాజేంద్రా! ఎటు చూస్తే అటు సర్వత్రా ధనుర్ధరుడవైన నీ రూపమే నా లోచనాలకు గోచరిస్తున్నది. మరి నేను ఎచట తలదాచుకొనేది ఆజ్ఞాపించు” అని అలమటించే కలిపురుషుని ప్రార్థన ఆలకించి పరీక్షిత్తు వానికి ”జూదం, మద్యపానం, స్త్రీలు, ప్రాణివధ” అనే నాలుగు స్థానాలు ఇచ్చాడు. ఇంకా అతడు అర్థించగా మహారాజు ”సువర్ణం” కారణంగా కలుగు అసత్యం, గర్వం, కామం, హింస, వైరం అనే ఇంకా ఐదు స్థానాలు ఇచ్చాడు. ఈ స్థానాలలో తప్ప ఇతర స్థలాలను స్పృశించవద్దని కలిని కట్టడి చేసాడు పరీక్షిత్తు. ఈ ప్రకారం ఆ మహారాజు కలిపురుషుణ్ణి నిగ్రహించి పోగొట్టుకొన్న తపస్సు, శౌచం, దయ అనే మూడు పాదాలూ వృషభమూర్తి అయిన ధర్మదేవతకు అర్పించి భూదేవికి అపారమైన ఆనందాన్ని కలిగించాడు.

తెభా-1-438-క.
నామధేయపురమున
రిపుపీఠమున ఘనుఁడు లిదమనుం డున్
వైరిపరాక్రముఁ డే
జిబిజి లేకుండఁ దాల్చెఁ గౌరవలక్ష్మిన్.

టీక:- గజనామధేయపురమున = హస్తినాపురమునందు {గజ నామధేయ పురము - గజ (హస్తిన అను) నామధేయ (పేరు కల) పురము (పురము) హస్తినాపురము}; గజరిపుపీఠమున = సింహాసనమున {గజ రిపు పీఠము - గజ (ఏనుగు) రిపు (శత్రువు, సింహము) పీఠము (ఆసనము), సంహాసనము}; ఘనుఁడున్ = గొప్పవాడు; కలి = కలిని; దమనుండున్ = అణచిన వాడును; గజ వైరి పరాక్రముడు = సింహపరాక్రముడు {గజ వైరి పరాక్రముడు – (గజ (ఏనుగు) వైరి (శత్రువు, సింహ) పరాక్రముఁడు (పరాక్రమము కలవాడు, - సింహపరాక్రముడు}; ఏ = ఎట్టి; గజిబిజి = గజిబిజి, గందరగోళం; లేకుండన్ = లేకుండగ; తాల్చెన్ = ధరించెను; గౌ(కౌ)రవ = గౌరవము అను, కౌరవ సామ్రాజ్యం అను; లక్ష్మిన్ = సంపదను.
భావము:- సింహపరాక్రముడు, కలిని నిగ్రహించిన ఘనుడు ఆయిన పరీక్షిత్తు హస్తినాపురంలో సింహాసనాసీను డై కౌరవ రాజ్యలక్ష్మిని గౌరవపూర్వకంగా ప్రశాంతంగా పరిపాలించాడు.

తెభా-1-439-వ.
ఇట్లు కృష్ణుని యనుగ్రహంబున నశ్వత్థామ బాణపావకంబు వలన బ్రతికి; వృషభమూర్తి యయిన ధర్మదేవతకు నభయం బిచ్చిన పరీక్షిన్నరేంద్రుండు బ్రాహ్మణశాపప్రాప్త తక్షకాహిభయంబు వలనఁ బ్రాణంబులు వోవు నని యెఱింగి, సర్వసంగంబులు వర్జించి శుకునకు శిష్యుండై విజ్ఞానంబు గలిగి, గంగాతరంగిణీ తీరంబునం గళేబరంబువిడిచె వినుఁడు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; కృష్ణుని = శ్రీకృష్ణుని; అనుగ్రహంబునన్ = అనుగ్రహము వలన; అశ్వత్థామ = అశ్వత్థామ యొక్క; బాణ = బాణముల; పావకంబు = అగ్ని; వలనన్ = నుండి; బ్రతికి = జీవించి; వృషభ = ఎద్దు; మూర్తి = రూపి; అయిన = అయినట్టి; ధర్మదేవత = ధర్మదేవత; కున్ = కు; అభయంబున్ = అభయము; ఇచ్చిన = ఇచ్చిన; పరీక్షిత్ = పరీక్షిత్తుడు అను; నరేంద్రుండు = నరులకు ఇంద్రుడు; రాజు; బ్రాహ్మణ = బ్రాహ్మణుని యొక్క; శాప = శాపము ద్వారా; ప్రాప్త = కలిగిన; తక్షక = తక్షకుడు అను; అహి = పాము యొక్క; భయంబు = భయము; వలనన్ = వలన; ప్రాణంబులు = ప్రాణములు; వోవున్ = పోవును; అని = అని; ఎఱింగి = తెలిసి; సర్వ = సమస్తమైన; సంగంబులు = బంధములు; వర్జించి = విడిచిపెట్టి; శుకుడు = శుకుడు; కున్ = కి; శిష్యుండు = శిష్యుడు; ఐ = అయి; విజ్ఞానంబున్ = విశిష్టమైన జ్ఞానమును; కలిగి = పొంది; గంగా = గంగ అను; తరంగిణీ = నది యొక్క; తీరంబునన్ = ఒడ్డున; కళేబరంబున్ = శరీరమును; విడిచెన్ = విడిచి పెట్టెను; వినుఁడు = వినుడు.
భావము:- ఈ విధంగా వాసుదేవుని అనుగ్రహం వల్ల అశ్వత్థామ అస్త్రానల జ్వాలలో నుంచి బ్రతికి బయటపడి వృషభరూపంలోని ధర్మ దేవతకు అభయమిచ్చిన పరీక్షిత్తు మునిశాపగ్రస్తుడై, తక్షకుని విషానలజ్వాలల వల్ల మరణం ప్రాప్తిస్తుందన్న సంగతి తెలుసుకొని సర్వసంగ పరిత్యాగియై శుకయోగిని ఆశ్రయించి, పరమార్థాన్ని గ్రహించి, గంగానదీ తీరంలో శరీరాన్ని పరిత్యజించాడు” అని చెప్పి సూతుడు శౌనకునితో ఇంకా ఇలా అన్నాడు.
ఈ భాగవతాన్ని పారీక్షితం అని కూడా చెప్తారు. ఎందుకంటే భాగవత పురాణం, పరీక్షిత్తు అడుగగా, పరీక్షిత్తు ముక్తి పొందడం కోసం, పరీక్షిత్తుకు చెప్పబడింది. అలా కృతకృత్యం అయింది. అట్టి మహానుభావుని జీవితం పుట్టుక నుండి భౌతికదేహం విడవటం వరకు ఈ చిన్న వచనంలో సంక్షిప్తంగా చెప్పబడింది. .

తెభా-1-440-క.
రివార్త లెఱుఁగువారికి
రిపదములు దలఁచువారి నవరతంబున్
రికథలు వినెడివారికి
ణాగతమోహసంభ్రము లే దనఘా!

టీక:- హరి = హరి యొక్క; వార్తలు = విశేషములు; ఎఱుఁగు = తెలియు; వారు = వారు; కిన్ = కి; హరి = హరి యొక్క; పదములు = పాదములు; తలఁచు = స్మరించు; వారు = వారు; కిన్ = కి; అనవరతంబున్ = ఎడతెగక; హరి = హరి యొక్క; కథలు = కథలు; వినెడి = వినుచుండు; వారు = వారు; కిన్ = కి; మరణ = మృత్యువు; ఆగత = పొందుట వలన; మోహ = భ్రాంతి; సంభ్రమమున్ = భయము; లేదు = లేదు; అనఘా = పాపము లేనివాడా.
భావము:- పవిత్ర చరిత్రా! హరి లీలలు అర్థం చేసుకొనేవారూ, హరి చరిత్రలు ఆలకించేవారూ, హరి చరణాల స్మరణం చేసుకోనేవారూ మరణ సమయంలో కూడా ఎటువంటి వేదనా, ఆవేదనా, తొందరపాటూ, తొట్రుపాటూ పొందరయ్యా!

తెభా-1-441-క.
శుచరితుఁడు హరి యరిగినఁ
బ్రవించి ధరిత్రి నెల్లఁ బ్రబ్బియుఁ గలి దా
భిమన్యుసుతుని వేళను
బ్రవింపక యడఁగి యుండె భార్గవముఖ్యా!

టీక:- శుభ = శుభకరమైన; చరితుఁడు = నడవడిక కలవాడు; హరి = హరి; అరిగినన్ = చనగా; ప్రభవించి = పుట్టి, రెచ్చిపోయి; ధరిత్రిన్ = భూమిని; ఎల్లన్ = అంతటి యందు; ప్రబ్బియున్ = అతిశయించియు, వ్యాపించియు; కలి = కలి; తాన్ = తాను; అభిమన్యు = అభిమన్యుని; సుతుని = పుత్రుని; పరీక్షితుని; వేళను = కాలములో; ప్రభవింపక = అతిశయింపక; అడఁగి = అణగి; ఉండెన్ = ఉండెను; భార్గవముఖ్యా = శౌనక మహర్షీ {భార్గవ ముఖ్యా - భృగు వంశములో ముఖ్యుడా, శౌనక మహర్షీ}.
భావము:- పుణ్యచరిత్రుడైన పురుషోత్తముడు అవతారం చాలించిన అనంతరం కలి లోకమంతా వ్యాపించి విజృంభించాడు; కానీ అభిమన్యనందనుడైన పరీక్షిత్తు కాలంలో తలవంచి అణగిమణగి ఉన్నాడు.

తెభా-1-442-వ.
ఇవ్విధంబునఁ జతుస్సముద్రముద్రితాఖిలమహీమండలప్రాజ్య సామ్రాజ్యంబు పూజ్యంబుగాఁ జేయుచు నా యభిమన్యుసంభవుండు
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగా; చతుస్ = నాలుగు (4); సముద్ర = సముద్రముల చేతను; ముద్రిత = చుట్టబడిన; అఖిల = సమస్తమైన; మహీ = భూమి యొక్క; మండల = మండలము కల; ప్రాజ్య = విస్తారమైన; సామ్రాజ్యంబు = సామ్రాజ్యమును; పూజ్యంబుగాన్ = పూజనీయముగా; చేయుచున్ = పాలించుచు; ఆ = ఆ; అభిమన్యుసంభవుండు = పరీక్షిన్మహారాజు {అభిమన్యుసంభవుండు – అభిమన్యుని పుత్రుడు, పరీక్షిన్మహారాజు}.
భావము:- ఈ ప్రకారంగా నాలుగు సముద్రాల నడుమ ఉన్న విస్తారమైన భూమండలాన్ని ఏకచ్ఛత్రాధిపతిగా ప్రజారంజకంగా పరిపాలించాడు ఆ అభిమన్యుని పుత్రుడైన పరీక్షిన్నరేంద్రుడు.

తెభా-1-443-ఉ.
చేసినఁ గాని పాపములు సెందవు; చేయఁ దలంచి నంతటం
జేసెద నన్నమాత్రమునఁ జెందుఁ గదా కలివేళఁ బుణ్యముల్
మోము లే దటంచు నృపముఖ్యుఁడు గాచెఁ గలిన్ మరంద ము
ల్లాముతోడఁ గ్రోలి విరులం దెగఁజూడని తేఁటి కైవడిన్.

టీక:- చేసినన్ = చేసిన; కాని = కాని; పాపములు = పాపములు; సెందవు = చెందవు; చేయన్ = చేయుటను; తలంచిన్ = తలచిన; అంతటన్ = అంతటనే; చేసెదన్ = చేసెదను; అన్న = అనిన; మాత్రమునన్ = మాత్రముచేతనే; చెందున్ = చెందును; కదా = కదా; కలి = కలి; వేళన్ = కాలములో; పుణ్యముల్ = పుణ్యములు; మోసము = మోసము; లేదు = లేదు; అటంచున్ = అనుచును; నృపముఖ్యుఁడు = పరీక్షిత్తుడు {నృపముఖ్యుఁడు – నరపాలకులలో ముఖ్యమైనవాడు, పరీక్షిత్తుడు}; కాచెన్ = కాపాడెను; కలిన్ = కలిని; మరందము = మకరందము, తేనె; ఉల్లాసము = ఉత్సాహము; తోడన్ = తో; గ్రోలి = త్రాగి; విరులన్ = పువ్వులను; తెగన్ = తెగబడి; చూడని = చూడని; తేఁటి = తేనేటి; కైవడిన్ = వలె.
భావము:- అయితే ఈ కలియుగంలో ఒక విశేషముంది, చేస్తేనే గాని పాపాలు పట్టుకోవు. ఇక పుణ్యాలందామా ”చేస్తాను’ అని అనుకొంటే చాలు ఫలితాన్ని ఇచ్చేస్తాయి. అందుకనే అభిమన్య కుమారుడు, కలి విజృంభణాన్ని మాత్రం అరికట్టి ప్రాణాలతో విడిచిపెట్టాడు. తుమ్మెద, లోపల ఉన్న మకరందాన్ని మాత్రం ఆనందంతో త్రాగి పూలను వదులుతుంది కదా! అలాగన్నమాట.
పరీక్షిత్తు కలిపురుషుని నిగ్రహించాడు కాని నిర్మూలించలేదు ఎందుకు అనే సందేహానికి తావు లేకుండా వివరించబడింది.

తెభా-1-444-వ.
మఱియుం బ్రమత్తులై యధీరులగు నరులయందు వృకంబు చందంబున నొదిఁగి కాచుకొని యుండి చేష్టించుం గాని, ధీరులైనవారికిం గలివలని భయంబు లేదని కలి నంతంబు నొందింప డయ్యె"ననిన విని ఋషులు సూతున కిట్లనిరి.
టీక:- మఱియున్ = ఇంకను; ప్రమత్తులు = పొరపాటు పడినవారు; ఐ = అయి; అధీరులు = ధైర్యము లేనివారు; అగు = అయినట్టి; నరుల = మానవుల; అందున్ = లో; వృకంబు = తోడేలు; చందంబునన్ = వలె; ఒదిఁగి = ఒదిగి, ఒరిగి; కాచుకొని = పొంచి; ఉండి = ఉండి; చేష్టించున్ = ప్రవర్తించును; కాని = కాని; ధీరులు = ధైర్యము కలవారు; ఐన = అయిన; వారి = వారి; కిన్ = కి; కలి = కలి; వలని = వలన; భయంబు = భయము; లేదు = లేదు; అని = అని; కలిన్ = కలిని; అంతంబున్ = అంతము, తుద; ఒందింపడు = పొందింపడు, ముట్టింపడు; అయ్యెన్ = ఆయెను; అనినన్ = అనగా; విని = విని; ఋషులు = మునులు; శౌనకాది మునులు; సూతుడు = సూతుడు; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- అదీగాక కాచుకుని పొంచి యుండి పైకి దూకే తోడేలులాగా ప్రమత్తులై ధైర్యము లేని వారిని మాత్రమే కలి బాధిస్తుంది, కానీ ధీరులైన వారికి కలి వల్ల ఎట్టి భయమూ కలగదని భావించినవాడై ఆ మహారాజు కలిని సర్వనాశనం చెయ్యలేదు” అని చెప్పగానే విని శౌనకాది మహర్శులు సూతుని అభినందిస్తూ ఇలా అన్నారు.

తెభా-1-445-సీ.
"పౌరాణికోత్తమ! బ్రతుకుము పెక్కేండ్లు-
తామరసాక్షుని వళయశము
రణశీలురమైన మా కెఱింగించితి-
ల్పితంబగు క్రతుర్మమందుఁ
బొగలచేఁ బొగిలి యబుద్దచిత్తులమైన-
ము హరి పదపద్మ ధుర రసమున్
ద్రావించితివి నీవు న్యులమైతిమి-
స్వర్గమేనియు నపర్గమేని

తెభా-1-445.1-తే.
భాగవత సంగ లవ భాగ్యలము కీడె?
ప్రకృతిగుణహీనుఁడగు చక్రి ద్రగుణము
లీశ కమలాసనాదులు నెఱుగఁ లేరు
వినియు వినఁజాల ననియెడి వెఱ్ఱి గలఁడె?

టీక:- పౌరాణిక = పురాణములు తెలుపు వారిలో; ఉత్తమ = ఉత్తముడా, సూతుడా; బ్రతుకుము = జీవించుము; పెక్కు = చాలా; ఏండ్లు = సంవత్సరములు; తామరసాక్షుని = కృష్ణని {తామరసాక్షుని - పద్మములవంటి కన్నులున్నవాడు, కృష్ణడు}; ధవళ = స్వచ్ఛమైన; యశము = కీర్తి; మరణ = మరణము; శీలురము = లక్షణము కలవారము; ఐన = అయిన; మాకు = మాకు; ఎఱింగించితి = తెలియజేసితివి; కల్పితంబు = సంకల్పితమైనది; అగు = అయినట్టి; క్రతు = యజ్ఞ; కర్మము = కర్మము; అందున్ = లోపల; పొగల = పొగల; చేన్ = తో; పొగిలి = మసిబారి; అబుద్ద = తెలివిలేని; చిత్తులము = మనసుకలవారము; ఐన = అయిన; మము = మమ్ములను; హరి = హరియొక్క; పద = పాదములను; పద్మ = పద్మముల; మధుర = తీయని; రసమున్ = రసము; త్రావించితివి = త్రాగునట్లు చేసితివి; నీవు = నీవు; ధన్యులము = ధన్యత పొందిన వారిమి; ఐతిమి = అయినాము; స్వర్గము = స్వర్గము; ఏనియున్ = అయినను; అపవర్గము = ముక్తి; ఏని = అయినను;
భాగవత = భాగవతముతో; సంగ = సంబంధముయొక్క; లవ = కొంచెము, పిసరు; భాగ్య = అదృష్టము యొక్క; ఫలము = ఫలితము; కున్ = కు; ఈడె = సమానమా ఏమి; ప్రకృతి = ప్రకృతి యందలి; గుణ = గుణములు – త్రిగుణములు; హీనుఁడు = లేనివాడు; అగు = అయినట్టి; చక్రి = హరి {చక్రి - చక్రాయుధుడు, విష్ణువు}; భద్ర = శుభ; గుణములు = గుణములు; ఈశ = ఈశుడు, శివుడు; కమలాసన = బ్రహ్మ {కమలాసన - పద్మము ఆసనముగ కలవాడు, బ్రహ్మ}; ఆదులున్ = మొదలగువారు కూడ; ఎఱుగఁన్ = తెలియ; లేరు = లేరు; వినియున్ = వినినప్పటికిని; వినజాలన్ = వినలేను; అనియెడి = అనెడి; వెఱ్ఱి = వెఱ్ఱివాడు; కలఁడె = కలడాఏమి.
భావము:- “పౌరాణిక శిరోమణీ! నీవు చిరకాలం వర్ధిల్లు. మరణశీలురమైన మాకు అమృతమయమైన హరి లీలావిశేషాలు వినిపించావు. బరువైన ఈ యజ్ఞకార్యం ఆరంభించి హోమధూమాలతో పొగచూరి పోయిన మా హృదయాలకు గోవించ చరణారవింద మధురమకరందాన్ని తనివితీరా త్రాగించావు. ధన్యులమైనాము. స్వర్గమే కాదు. అపవర్గం కూడా భగవద్భక్తుల సాంగత్య ఫలంలో పిసరంతకు కూడా సాటి రాదు కదా! ప్రాకృత గుణాతీతుడైన వాసుదేవుని కల్యాణ గుణవిశేషాలు తెలుసుకోవటం భవునకూ పద్మభవునకూ కూడా సాధ్యం కాదు. అటువంటి భగవంతుని పవిత్రగాథలు వీనులవిందుగా వింటూ, "చాలు, ఇంక వినలేను" అనెడి వెఱ్ఱివాళ్లు ఎక్కడైనా ఉంటారా?

తెభా-1-446-క.
శ్రీపంబులు, ఖండిత సం
తాపంబులు, గల్మషాంధమస మహోద్య
ద్దీపంబులు, పాషండ దు
రాపంబులు, విష్ణు వందనాలాపంబుల్.

టీక:- శ్రీ = సంపదలను; పంబులు = అతిశయింప చేయునది; ఖండిత = బద్దలు చేయబడిన; సంతాపంబులు = వ్యధలు కలవి; కల్మష = పాపము అను; అంధతమస = కటిక చీకటికి {అంధము - అంధతరము - అంధతమము}; మహా = గొప్ప; ఉద్యత్ = పెద్దవి, పైకెత్త బడిన; దీపంబులు = దీపములు; పాషండ = పాషండులకు; దురాపంబులు = పొందవీలుకానివి; విష్ణు = విష్ణుదేవుని; వందన = నమస్కారములు; ఆలాపంబుల్ = స్మరణములు.
భావము:- ఆ నందనందమని వందనాలాపాలు, శ్రీలను చెందించేవి, సంతాపాలను సమూలంగా తొలగించేవి, ఉద్దీపితమైన దివ్వెలై పాపాలనే కటిక చీకట్లను పోగొట్టేవి, పాషండులు పొందలేనివి.
భాగవత భక్తిప్రపత్తుల విశిష్ఠతను ఇలా తలచుకుంటు, శుకుడు పరీక్షిత్తునకు చెప్పిన భాగవతాన్ని వివరించమని శౌనకాదులు సూతుని వేడుకుంటున్నారు

తెభా-1-447-క.
పానములు, దురితలతా
లానములు, నిత్యమంగప్రాభవ సం
జీనములు, లక్ష్మీ సం
భానములు, వాసుదేవు దసేవనముల్.

టీక:- పావనములు = పవిత్రము చేయునవి; దురిత = పాపములు అను; లతా = తీగలను; లావనములు = కోసివేయునవి (కొడవళ్ళు); నిత్య = శాశ్వత మైన; మంగళ = శుభములను ఇచ్చు; ప్రాభవ = వైభవాలను; సంజీవనములు = బ్రతికించునవి; లక్ష్మీ = సంపదలను; సంభావనములు = గౌరవములు ఇచ్చునవి; వాసుదేవు = హరి {వాసుదేవుడు - ఆత్మల వసించు దేవుడు, భగవంతుడు}; పద = పదముల; సేవనముల్ = పూజనములు.
భావము:- విశ్వమంత ఆత్మగా వసించి ఉండే పరమాత్మ వసుదేవుని ఇంటి పంట, శ్రీకృష్ణుని పాదాల యందలి భక్తి ప్రపత్తులు విశ్వానికి పవిత్రత ప్రసాదించేవి; సమస్త పాపాలనే బంధనాలను కోసేసే కొడవళ్ళు; శాశ్వత శుభ వైభవాలను సమకూర్చే సాధనాలు; సిరిసంపదల సుప్రదానములు.
శౌనకాది మహర్షులు భాగవత మహత్యాన్ని, భాగవతుల తోడి సాంగత్య ప్రభావాలను తెలిసిన మహా జ్ఞానులు. వారు హరిభక్తి విశిష్ఠతలను స్మరిస్తు, సూతునికి భాగవతోత్తము డైన పరీక్షిత్తు కథారూప మైన శ్రీమద్భాగవతాన్ని ఉపన్యసించ మని విన్నవించారు.

తెభా-1-448-ఆ.
రమ భాగవతుఁడు పాండవపౌత్రుండు
శుకుని భాషణముల శుద్ధబుద్ధి
యై విరాజమానుఁడై ముక్తి యగు విష్ణు
పాదమూల మెట్లు డసె ననఘ!

టీక:- పరమ = ఉత్కృష్టమైన; భాగవతుఁడు = భాగవత ధర్మము కలవాడు; పాండవపౌత్రుండు = పరీక్షిత్తు {పాండవపౌత్రుండు - పాండవుల యొక్క మనుమడు, పరీక్షిన్మహారాజు}; శుకుని = శుకుని యొక్క; భాషణములన్ = ప్రవచనముల వలన; శుద్ధ = శుద్ధి చేయబడిన; బుద్ధి = బుద్ధి కలవాడు; ఐ = అయి; విరాజ = వెలుగొందుచున్న; మానుఁడు = మానసము కలవాడు; ఐ = అయి; ముక్తి = తామే ముక్తి; అగు = అయినట్టి; విష్ణు = విష్ణుదేవుని; పాదమూలము = చరణములు; ఎట్లు = ఏ విధముగ; వడసెన్ = పొందెను; అనఘ = పాపములేనివాడా;
భావము:- పరమ భాగవతాగ్రేసరుడూ, పాండవ పౌత్రుడూ, సద్గుణ సాంద్రుడూ అయిన పరీక్షిన్నంద్రుడు శుకమహర్షి సూక్తులు ఆలకించి పరిశుద్ధమైన పరమార్థబుద్ధితో తేజరిల్లుతూ ముక్తికి ఆలవాలమైన వాసుదేవుని పాదమూలాన్ని ఎలా పొందాడు.

తెభా-1-449-వ.
మహాత్మా! విచిత్రయోగనిష్ఠాకలితంబును, విష్ణుచరితలలితంబునుఁ, బరమ పుణ్యంబును, సకలకల్యాణగుణగణ్యంబును, భాగవతజనాపేక్షితంబునునైన పారీక్షితభాగవతాఖ్యానంబు వినిపింపు"మనినసూతుం డిట్లనియె.
టీక:- మహా = గొప్ప; ఆత్మా = ఆత్మ కలవాడా; విచిత్ర = విచిత్రమైన; యోగ = యోగ; నిష్ఠా = నిష్ఠలతో; కలితంబును = కూడినవి; విష్ణు = విష్ణుదేవుని; చరిత = ప్రవర్తన వలన; లలితంబును = సుకుమారమైనవి; పరమ = ఉత్కృష్ణమైన; పుణ్యంబును = పుణ్యవంతమును; సకల = సమస్త; కల్యాణ = శుభకర; గుణ = గుణములలోను; గణ్యంబును = ఎంచదగ్గవియు; భాగవత = భాగవత ధర్మానుయాయులైన; జల = జనులచే; ఆపేక్షితంబును = కోరదగినది; ఐన = అయినట్టి; పారీక్షిత = పరీక్షితుని; భాగవత = భాగవతము; ఆఖ్యానంబున్ = వ్యాఖ్యనములు; వినుపింపుము = వివరింపుము; అనినన్ = అనగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- మహానుభావా! యోగవిద్యాసముపేతమూ, భగవత్కథాపరిపూతమూ, పరమపుణ్యమూ, సమస్త కల్యాణ సాద్గుణ్యమూ, భక్త జనులకు అపేక్షితమూ అయిన పరీక్షిత్తు శ్రవణం చేసిన భాగవతగాథను మాకు వినిపించు” అని అడుగుతున్న మహర్షులతో సూతుడిలా చెప్పసాగాడు-

తెభా-1-450-క.
"మిముబోఁటి పెద్దవారలు
లాక్షుని చరిత మడుగఁగాఁ జెప్పెడి భా
గ్యము గలిగె నేఁడు నా జ
న్మము సఫలం బయ్యె వృద్ధమాన్యుఁడ నగుటన్

టీక:- మిము = మిమ్ములను; బోఁటి = పోలిన; పెద్ద = పెద్ద; వారలు = వారు; కమలాక్షుని = హరి {కమలాక్షుడు - పద్మములవంటినేత్రములు కలవాడు, హరి}; చరితము = వర్తనలు; అడుగఁగాన్ = అడిగిన; చెప్పెడి = చేప్పేటటువంటి; భాగ్యమున్ = అదృష్టము; కలిగెన్ = కలిగెను; నేఁడు = ఇవేళ; నా = నాయొక్క; జన్మము = పుట్టుక; సఫలంబు = సఫలము; అయ్యె = అయినది; వృద్ద = పెద్దలచే; మాన్యుఁడను = గౌరవింపబడినవాడను; అగుటన్ = అగుట వలన.
భావము:- "అయ్యా! పెద్దలైన మీ వంటి వారు కావాలని కోరగా కమలాక్షుని గాథలు వినిపించే మహాభాగ్యం నాకు ప్రాప్తించింది. నా జన్మం ధన్యమైంది. నా జీవితం సజ్జన సమ్మాన్య మయింది.

తెభా-1-451-క.
కుహీనుఁడు నారాయణ
విసత్కథనములు గడఁక వినిపించినఁ ద
త్కుహీనతఁ బాసి మహో
జ్జ్వ కులజత్వమును బొందు న్మునులారా!

టీక:- కుల = కులములో; హీనుఁడు = తక్కువైనవాడు; నారాయణ = నారాయణుని; భగవంతుని; విలసత్ = వెలుగొందెడి; కథనములు = కథలు; కడఁకన్ = పట్టుదలతో; వినిపించినన్ = వినిపించినచో; తత్ = ఆ; కుల = కులము యొక్క; హీనతన్ = హీనత్వమును; పాసి = విడిచి; మహా = గొప్ప; ఉజ్జ్వల = ఉజ్జ్వలమైన; కుల = కులములో; జత్వమును = పుట్టుటను; పొందు = పొందును; సత్ = మంచి; మునులారా = మునులారా.
భావము:- నికృష్టకులంలో జన్మించినవాడు కూడా ప్రకృష్టమైన భగవంతుని గాథలు పరులకు వినిపించగలిగితే అత్యుత్తమ కులగౌరవాన్ని అందుకొంటాడు.

తెభా-1-452-సీ.
వ్వని గుణజాల మెన్న జిహ్వలు లేక-
లినగర్భాదు లనంతుఁ డండ్రు?
కోరెడు విబుధేంద్రకోటి నొల్లక లక్ష్మి-
ప్రార్థించె నెవ్వని పాద రజము?
బ్రహ్మ యెవ్వని పాదద్మంబుగడిగిన-
లము ధన్యత నిచ్చె నుల కెల్ల?
గవంతుఁ డనియెడి ద్రశబ్దమునకు-
నెవ్వఁ డర్థాకృతి నేపు మిగులు?

తెభా-1-452.1-ఆ.
నే మహాత్ము నాశ్రయించి శరీరాది
సంగకోటి నెల్ల సంహరించి
ప్రాభవమున మునులు పారమ హంస్యంబు
నొంది తిరిగి రాక యుందు రెలమి.

టీక:- ఎవ్వని = ఎవ్వాని; గుణ = గుణముల; జాలము = సమూహము; ఎన్నన్ = ఎన్నుటకు; జిహ్వలు = నాలుకలు; లేక = లేక; నలిన = పద్మము అను; గర్భ = గర్భములో పుట్టినవాడు, బ్రహ్మ; ఆదులు = మొదలగు వారు; అనంతుఁడు = అంతము లేని వాడు; అండ్రు = అందురు; కోరెడు = కోరుచున్న; విబుధ = మిక్కిలి బుద్ధిమంతులలో; ఇంద్ర = ఉత్తముల; కోటిన్ = కోటిమందిని, సమూహమును; ఒల్లకన్ = ఒప్పుకొనక; లక్ష్మి = లక్ష్మీదేవి; ప్రార్థించెన్ = ప్రార్థించెను; ఎవ్వని = ఎవ్వని; పాద = పాదముల; రజము = రజము – ధూళి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఎవ్వని = ఎవ్వని; పాద = పాదములు అను; పద్మంబు = పద్మములు; కడిగిన = కడిగిన; జలము = జలమును; ధన్యతన్ = ధన్యతతో, పుణ్యముతో; ఇచ్చెన్ = ఇచ్చెను; జనులు = మానవులు; కున్ = కు; ఎల్లన్ = అందరికి; భగవంతుఁడు = భగవంతుడు; అనియెడి = అనెడి; భద్ర = శుభమైన, క్షేమకరమైన; శబ్దము = పేరు; కున్ = కు; ఎవ్వఁడు = ఎవ్వడు; అర్థ = అర్థముయొక్క; ఆకృతిన్ = ఆకారమునకు; ఏపు = అతిశయించి; మిగులున్ = ఉండును; ఏ = ఏ;
మహా = గొప్ప; ఆత్మున్ = ఆత్మకలవానిని; ఆశ్రయించి = ఆశ్రయించి; శరీర = శరీరము; ఆది = మొదలగు; సంగ = బంధముల; కోటి = పెద్ద సమూహమును; ఎల్లన్ = అంతటిని; సంహరించి = అణిచివేసి; ప్రాభవమునన్ = ప్రాభవముతో; మునులు = మునులు; పారమ హంస్యంబున్ = పరమహంసత్వమును, ముక్తిని; ఒంది = పొంది; తిరిగి = తిరిగి; రాక = రాకుండగ; ఉందురు = ఉందురు; ఎలమిన్ = వికసించి.
భావము:- ఏ దేవుని గుణగణాలను గణించటానికి నాలుకలు చాలక పద్మగర్భాది దేవతలు అనంతుడని అంటారో? తనను వాంఛించే తక్కిన ముక్కోటి దేవతలనూ తిరిస్కరించి శ్రీదేవి ఎవని పాద పరాగాన్ని స్వీకరించిందో? బ్రహ్మదేవుడు ఏ పాదపద్మాలు కడిగి ఆ పవిత్రగంగను అఖిలజగతికి అనుగ్రహించాడో? భగవంతుడు అనే పరమ పవిత్ర శబ్దానికి అర్థంగా ఏ దేవుని స్వరూపం విరాజిల్లుతున్నదో? ఏ దేవుని ఆశ్రయించి మహామునులు నిస్సంగులై తిరిగిరాని పరమహంస పదాన్ని అందుకొన్నారో?
ఆ వాసుదేవుని దివ్యగాథలు సమగ్రంగా గుర్తించి తెలుసుకోవటానికి ఎవరికి సాధ్యమౌతుంది?

తెభా-1-453-చ.
క్రమున మింటికై యెగయుఁగాక విహంగము మింటిదైన పా
ము గన నేర్చునే? హరిపరాక్రమ మోపినయంతఁ గాక స
ర్వము వివరింప నెవ్వఁడు ప్రర్తకుఁడౌ? మునులార! నాదు చి
త్తమునకు నెంత గానఁబడెఁ ప్పక చెప్పెద మీకు నంతయున్.

టీక:- క్రమమునన్ = క్రమముగ - చక్కగ; మింటి = ఆకాశము; కై = నకు; ఎగయుఁన్ = ఎగురును; కాక = ఐతే ఐ ఉండవచ్చు - అయినప్పటికిని; విహంగము = పక్షి; మింటిది = ఆకాశమునది; ఐన = అయినట్టి; పారమున్ = అంతు - దరి; కనన్ = చూచుట – కనుగొనుట; నేర్చునే = నేర్చుకొన కలదా; హరి = హరి యొక్క; పరాక్రమము = తేజస్సు; ఓపిన = అనుమతించిన; అంతన్ = అంతే; కాక = కాకుండగ; సర్వము = సమస్తము; వివరింపన్ = వివరించుటకు; ఎవ్వండు = ఎవడు మాత్రము; ప్రవర్తకుఁడు = సామర్థ్యము కలవాడు; ఔ = అవుతాడు; మునులార = మునులారా; ఓ మునులూ; నాదు = నా యొక్క; చిత్తము = మనసు; కున్ = కు; ఎంతన్ = ఎంత అయితే; కానఁబడెన్ = కనబడెనో; తప్పక = తప్పకుండగ; చెప్పెదన్ = చెప్పుదును; మీకున్ = మీకు; అంతయున్ = అంతా.
భావము:- పక్షులు తమ శక్తి కొద్దీ రెక్కలాడిస్తూ ఎంత పైకి ఎగిరినా, ఆకాశం అంతు కనుక్కోలేవు. అదేవిధంగా, వాసుదేవుని మహావైభవాన్ని తనకు తెలిసినమాత్రం తప్ప సమగ్రంగా వివరించి చెప్పగల సమర్థు డెవడున్నాడు.