పోతన తెలుగు భాగవతము/పంచమ స్కంధము (ప్రథమాశ్వాసము)/భరతుని పట్టాభిషేకంబు
తెభా-5.1-78-వ.
ఇట్లు సదాచారు లగు కుమారులకు లోకానుశాసనార్థం బాచారంబు లుపదేశించి మహాత్ముండును బరమసుహృత్తును నగు భగవంతుండు ఋషభాపదేశంబునం గర్మత్యాగంబు చేసి యుపశమశీలురగు మునులకు భక్తిజ్ఞాన వైరాగ్య లక్షణంబులు గల పారమహంస్య ధర్మం బుపదేశింపఁ గలవా డగుచుఁ బుత్రశతంబునం దగ్రజుండును బరమభాగవతుండును భగవజ్జన పరాయణుండును నగు భరతుని ధరణీపాలనంబునకుఁ బట్టంబు గట్టి తాను గృహమందె దేహమాత్రావలనంబు చేసి దిగంబరుండై యున్మత్తాకారుం డగుచు బ్రకీర్ణ కేశుండై యగ్నుల నాత్మారోపణంబు చేసి బ్రహ్మావర్తదేశంబును బాసి జడాంధ బధిర మూక పిశాచోన్మాదులుం బోలె నవధూత వేషంబునొంది జనులకు మాఱు పలుకక మౌన వ్రతంబునం బుర గ్రామాకర జనప దారామ శిబిర వ్రజ ఘోష సార్థ గిరి వనాశ్రమాదుల యందు వెంటఁ జనుదెంచు దుర్జన తర్జన తాడనావమాన మేహన నిష్ఠీవన పాషాణ శకృద్రజః ప్రక్షేపణపూతి వాత దురుక్తులం బరిభూతుం డయ్యును గణనం బెట్టక వన మదేభంబు మక్షికాదికృతోపద్రవంబునుంబోలెఁ గైకొనక దేహాభిమానంబునం జిత్తచలనంబు నొందక యేకాకియై చరియించు చుండ నతి సుకుమారంబులగు కరచరణోరస్థ్సలంబులు విపులంబులగు బాహ్వంస కంఠ వదనాద్యవయవ విన్యాసంబులుం గలిగి ప్రకృతి సుందరం బగుచు స్వతస్సిద్ధదరహాసరుచిర ముఖారవిందంబై నవ నళిన దళంబులం బోలి శిశిర కనీనికలం జెలువొంది, యరుణాయతంబు లగు నయనంబులచే నొప్పి యన్యూనాధికంబులగు కపోల కర్ణ కంఠ నాసాదండంబులచేఁ దేజరిల్లుచు నిగూఢస్మితవదన విభ్రమంబులం బ్రకాశించు తన దివ్యమంగళ విగ్రహంబుచేఁ బురసుందరుల మనంబుల కత్యంత మోహంబు గలుగఁ జేయుచు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; సత్ = మంచి; ఆచారులు = ఆచరణలుగలవారు; అగు = అయిన; కుమారుల్ = పుత్రుల; కున్ = కు; లోక = లోకులను; అనుశాసన = పరిపాలించెడి; అర్థంబున్ = కోసమైన; ఆచారంబున్ = విధానములను; ఉపదేశించి = తెలియజెప్పి; మహాత్ముండునున్ = గొప్పవాడు; పరమ = అత్యుత్తమ; సుహృత్తు = స్నేహితుడు; అగు = అయిన; భగవంతుండు = భగవంతుడు; ఋషభ = ఋషభుని; అపదేశంబు = నెపమున; కర్మత్యాగంబున్ = కర్మములను విడిచుట; చేసి = వలన; ఉపశమశీలురు = శాంతించిన స్వభావము గలవారు; అగు = అయిన; మునుల్ = మునుల; కున్ = కు; భక్తి = భక్తి; జ్ఞాన = జ్ఞానము; వైరాగ్య = వైరాగ్యము; లక్షణంబులు = లక్షణములుగా; కల = కలిగిన; పారమహంస్య = పరమహంసలకు చెందిన; ధర్మంబున్ = ధర్మములను; ఉపదేశింపన్ = ఉపదేశించుటకు; కలవాడు = సమర్థుండు; అగుచున్ = అగుచున్న; పుత్ర = కుమారులు; శతంబున్ = నూరుగురి; అందున్ = లోను; అగ్రజుండునున్ = పెద్దవాడును; పరమ = అత్యధికమైన; భాగవంతుండును = భాగవతజనుడును; భగవజ్జన = భాగవతజనుల యెడ; పరాయణుండును = ఆసక్తి గలవాడు; అగు = అయిన; భరతునిన్ = భరతుడిని; ధరణీ = భూమిని; పాలనంబున్ = పరిపాలనమున; కున్ = కు; పట్టంబుగట్టి = పట్టాభిషేకము చేసి; తాను = తాను; గృహము = ఇంటి; అందె = అందే; దేహ = శరీరపోషణకు; మాత్ర = మాత్రమే; అవలనంబు = నిలుపుకొనుటను; చేసి = చేసి; దిగంబరుండు = నగ్నముగ ఉండువాడు {దిగంబరుడు - దిక్కులే అంబరము (బట్టగా) కలవాడు, నగ్నుడు}; ఐ = అయ్యి; ఉన్మత్త = పిచ్చివాని; ఆకారుండు = ఆకారము గలవాడు; అగుచున్ = అగుచూ; ప్రకీర్ణ = చెదరిన; కేశుండు = శిరోజములు గలవాడు; ఐ = అయ్యి; అగ్నులన్ = యోగాగ్నులను; ఆత్మన్ = తన యందు; ఆరోపణంబున్ = ఆరోపించుకొనుట; చేసి = చేసికొని; బ్రహ్మావర్త = బ్రహ్మావర్తము యనెడి; దేశంబునున్ = దేశమును; పాసి = విడిచిపెట్టి; జడ = తెలివిహీనుని; అంధ = గుడ్డివాని; బధిర = చెవిటివాని; మూక = మూగవాని; పిశాచ = పిశాచమును; ఉన్మాదులున్ = పిచ్చివాని; పోలెన్ = వలె; అవధూత = అవధూత {అవధూత - దిగంబర సన్యాసి, భగవంతుని తన అవధానమున నిలుపుకొన్నవాడు, విడువబడిన ఇహలోకార్థములు గలవాడు}; వేషంబున్ = వేషమును; ఒంది = పొంది; జనుల్ = లోకుల; కున్ = కు; మాఱుపలుకక = మారు మాట్లాడకుండగ; మౌన = మౌనమునందు; వ్రతంబునన్ = వ్రతదీక్ష చేపట్టి; పుర = పట్టణములు; గ్రామ = పల్లెలు; ఆకర = ఇండ్లు; జనపద = జానపదములు; ఆరామ = విశ్రాంతి గృహములు; శిబిర = శిబిరములు; వ్రజ = గొల్లపల్లెలు; ఘోష = గొడ్లపాకలు; సార్థ = ప్రయాణీకులు విడది గృహములు; గిరి = కొండలు; వన = అడవులు, తోటలు; ఆశ్రమ = ఆశ్రమములు; ఆదులు = మొదలగువాని; అందు = అందు; వెంటన్ = వెనుక; చనుదెంచు = వచ్చెడి; దుర్జన = చెడ్డవారి; తర్జన = అదలింపులు; తాడన = కొట్టుటలు; అవమాన = అవమానము చేయుటలు; మేహన = మూత్రము పోయుటలు; నిష్ఠీవన = ఉమ్మి వేయుటలు; పాషాణ = రాళ్ళు; శకృత్ = మలములు; రజః = దుమ్ము; ప్రక్షేపణ = విసరుట; పూతివాత = కుళ్లినవానిని విసరుట; దురుక్తులన్ = తిట్లతోటి; పరిభూతుండున్ = అవమానింపబడినవాడు; అయ్యున్ = అయినప్పటికిని; గణనంబెట్టక = లెక్కపెట్టకుండ; వన = అడవి; మధేభంబున్ = ఏనుగు; మక్షిక = ఈగలు; ఆది = మొదలైనవానిచే; కృత = చేయబడిన; ఉపద్రవంబునున్ = కీడులను; పోలెన్ = వలె; కైకొనక = లెక్కపెట్టకుండ; దేహా = శరీరము నందు; అభిమానంబునన్ = అభిమానము వలన; చిత్త = మానసిక; చలనంబున్ = చలించుట; ఒందక = పొందకుండ; ఏకాకి = ఒంటరి; ఐ = అయ్యి; చరియించుచుండన్ = వర్తించుచుండగా; అతి = మిక్కిలి; సుకుమారంబులు = సుకుమారమైనవి; అగు = అయిన; కర = చేతులు; చరణ = కాళ్ళు; ఉరస్థలంబులు = వక్షస్థలములు; విపులంబులు = విస్తారమైనవి; అగు = అయిన; బాహు = భుజములు; అంస = గూడలు; కంఠ = మెడ; వదన = మోము; ఆది = మొదలగు; అవయవ = అవయవముల; విన్యాసంబులున్ = రచనలు; కలిగి = ఉన్నట్టి; ప్రకృతి = వైయక్తిక; సుందరంబున్ = అందము; అగుచున్ = కలిగి; స్వతస్సిద్ద = సహజసిద్ధమగు; దరహాస = చిరునవ్వుతో; రుచిర = వెలుగుతున్న; ముఖ = మోము యనెడి; అరవిందంబు = పద్మము; ఐ = కలిగి; నవ = నవనవలాడెడి; నళిన = పద్మము యొక్క; దళంబులన్ = రేఖలను; పోలి = పోలెడి; శిశిర = చల్లని; కనీనికలన్ = కనుపాపలతో; చెలువొంది = చక్కనైన; అరుణ = ఎఱ్ఱని; ఆయతంబులు = విశాలమైనవి; అగు = అయిన; నయనంబుల్ = కన్నుల; చేన్ = తోటి; ఒప్పి = ఒప్పి ఉండి; అన్యునాధికంబులు = తక్కువ ఎక్కువలు లేనివి; అగు = అయిన; కపోల = ముంగురులు; కర్ణ = చెవులు; కంఠ = మెడ; నాసాదండము = ముక్కుదూలముల; చేన్ = తోటి; తేజరిల్లుచున్ = ప్రకాశించుతూ; నిగూఢ = దాగిన; స్మిత = చిరునవ్వులు కలిగిన; వదన = ముఖము యొక్క; విభ్రమంబులన్ = శోభలతో; ప్రకాశించు = ప్రకాశించెడి; తన = తన యొక్క; దివ్య = దివ్యమైన; మంగళ = శుభకరమైన; విగ్రహంబున్ = రూపము; చేన్ = వలన; పుర = పురము నందలి; సుందరుల = సుందరీజనముల; మనంబుల్ = మనసుల; కున్ = కు; అత్యంత = అత్యధికమైన; మోహంబున్ = మోహమును; కలుగ = కలుగునట్లు; చేయుచున్ = చేయుచూ.
భావము:- ఈ విధంగా సదాచార సంపన్నులైన కుమారులకు లోకాన్ని పాలించడానికి అవసరమైన ఆచారాలను ఋషభుడు ఉపదేశించాడు. మహానుభావుడు, లోకబాంధవుడు అయిన భగవంతుడు ఋషభుని రూపంలో కర్మపరిత్యాగం చేసి శాంత స్వభావులైన మునులకు భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణాలతో పరమహంస ధర్మాలను ఉపదేశించాలని ఉద్దేశించాడు. ఆయన తన నూరుమంది కొడుకులలో పెద్దవాడు, పరమ భాగవతుడు, భాగవతుల పట్ల ఆసక్తి కలవాడు అయిన భరతునికి పట్టంగట్టి రాజ్యభారాన్ని అప్పగించాడు. అనంతరం శరీరమాత్ర సహాయుడై, దిగంబరుడై, చింపిరి జుట్టుతో పిచ్చివానిలాగా ప్రవర్తిస్తూ అగ్నుల్ని తనలో ఆరోపించుకొని బ్రహ్మావర్త దేశాన్ని వదలిపెట్టి వెళ్ళిపోయాడు. జడునిలాగా, చెవిటివానిలాగా, మూగవానిలాగా, పిశాచం ఆవహించిన పిచ్చివానిలాగా అవధూత వేషం ధరించాడు. ఎవరైనా పలకరించినా బదులు చెప్పకుండా మౌనవ్రతం చేపట్టాడు. నగరాలు, గ్రామాలు, పల్లెలు, తోటలు, శిబిరాలు, బిడారాలు, గొల్లపల్లెలు, గొడ్లపాకలు, కొండలు, తపోవనాలు, ఋష్యాశ్రమాలు దాటి పోసాగాడు. వెంటపడే దుండగులు కొడుతున్నా, తిడుతున్నా, రాళ్ళు విసురుతున్నా, దుమ్ము చల్లుతున్నా, తనపై మూత్ర విసర్జన చేసినా, ఉమ్మి వేసినా, కుళ్ళిన వస్తువులను తనపైకి విసరి వేసినా, బూతు కూతలు కూస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా జోరీగలను లెక్కపెట్టని ఏనుగులాగా ముందుకు నడచిపోతున్నాడు. ఏమాత్రం దేహాభిమానం లేకుండా నిశ్చలమైన చిత్తంతో ఏకాకిగా సంచరిస్తున్నాడు. అతని చేతులు, కాళ్ళు, ఉరోభాగం చాలా సుకుమారంగా ఉన్నాయి. భుజాలు, కంఠసీమ, ముఖం మొదలైన అవయవాలు విశాలంగా తీర్చినట్లున్నాయి. అతని రూపం సహజ సుందరంగా ఉంది. పద్మంవంటి ముఖంలో స్వతస్సిద్ధమైన చిరునవ్వులు చిందుతున్నాయి. కొంగ్రొత్త తామ రేకులలాగా చల్లని కనుపాపలు కనిపిస్తున్నాయి. విప్పారిన కళ్ళల్లో ఎఱ్ఱదనం ప్రకాశిస్తున్నది. చెక్కిళ్ళు గాని, చెవులు గాని, మెడభాగం కాని, ముకుపుటాలు గాని ఏమాత్రం లోపం లేకుండా దిద్ది తీర్చినట్లున్నాయి. అతని పెదవుల లోపలి చిరునవ్వు ఇతరులను భ్రమింపజేసేట్లు ఉంది. అటువంటి అతని దివ్య మంగళ విగ్రహం ముద్దుగుమ్మలను మోహంలో ముంచెత్తుతున్నది.
తెభా-5.1-79-ఆ.
ధూళిచేత మిగుల ధూసరితంబునై
జడలుగట్టి కడుఁ బిశంగవర్ణ
ము నగు కేశపాశమును వెలిఁగించుచు
నితరు లెవరుఁ దన్నునెఱుఁగకుండ.
టీక:- ధూళి = ధూళి; చేత = తోటి; మిగులన్ = మిక్కిలి; ధూసరితంబున్ = దుమ్ముకొట్టుకుపోయినది; ఐ = అయ్యి; జడలుగట్టి = జడలు కట్టి; కడు = మిక్కిలి; పిశంగ = నలుపు కలసిన పసుపు; వర్ణమున్ = రంగుకలది; అగు = అయిన; కేశ = వెంట్రుకల; పాశమును = సమూహములను; వెలిగించుచున్ = ప్రకాశింపజేయుచు; ఇతరులు = ఇతరులు; ఎవరున్ = ఎవ్వరు; తన్నున్ = తనను; ఎఱుగకుండ = తెలిసికొనలేకుండ; =
భావము:- ఋషభుని జుట్టు దుమ్ము కొట్టుకొని ధూసరవర్ణం ధరించింది. వెంట్రుకలు జడలు కట్టి గోరోచనం రంగుతో మెరిసి పోతున్నాయి. అటువంటి వేషంలో అతడు ఎవరూ గుర్తుపట్టకుండా తిరుగుతున్నాడు.
తెభా-5.1-80-క.
అవధూత వేషమున ని
ట్లవనిన్ మలినంబు లైన యవయవములతోఁ
దవిలి చరించుచు నుండును
భువి భూతాక్రాంతుఁ డయిన పురుషుని మాడ్కిన్.
టీక:- అవధూత = అవధూత యొక్క; వేషమునన్ = వేషములో; ఇట్లు = ఈ విధముగ; అవనిన్ = భూమిపైన; మలినంబులు = మాసిపోయినవి; ఐన = అయిన; అవయవముల = అవయవముల; తోన్ = తోటి; తవిలి = తగుల్కొని; చరించుచున్ = తిరుగుతూ; ఉండును = ఉండును; భువిన్ = నేలపైన; భూత = దయ్యము; ఆక్రాంతుడు = పట్టినవాడు; అయిన = అయిన; పురుషుని = మానవుని; మాడ్కిని = వలె.
భావము:- ఆ ఋషభుడు పిశాచాక్రాంతుడైన వానిలాగా మురికిపట్టిన అవయవాలతో అవధూత వేషంలో సంచరింప సాగాడు.
తెభా-5.1-81-ఆ.
జనుల కిట్లు యోగసంచార మెల్ల వి
రుద్ధ మనుచు నాత్మ బుద్ధిఁ జూచి
యజగరంబు మాడ్కి నవనిపై నుండె బీ
భత్సకర్మమునకుఁ బాలుపడుచు.
టీక:- జనుల్ = లోకుల; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; యోగసంచారము = యోగ పూర్వక సంచారము; ఎల్లన్ = అంతయు; విరుద్ధము = వ్యతిరేకము; అనుచున్ = అనుచూ; ఆత్మ = తన యొక్క; బుద్ధిన్ = మనసులో; చూచి = చూసి; అజగరంబున్ = కొండచిలువ; మాడ్కిన్ = వలె; అవని = భూమి; పైన్ = మీద; ఉండె = పడియుండెను; బీభత్స = అసహ్యకరమైన; కర్మమున్ = కర్మమున; కున్ = కు; పాలుపడుచున్ = పూనుకొనుచు.
భావము:- తన యోగవిధానం లోకవిరుద్ధంగా ఉంటుందని ఋషభుడు గ్రహించి ఒకచోట అజగరం లాగా భూమిపై అసహ్యంగా పొరలసాగాడు.
తెభా-5.1-82-వ.
ఇట్లు బీభత్సరూపంబున వసుంధరం బడియుండి యన్నంబు భుజించుచు నీరు ద్రావుచు మూత్రపురీషంబులు విడుచుచు నవి శరీరంబు నంటం బొరలుచుండు; మఱియుఁ దత్పురీష సౌగంధ్య యుక్తంబగు వాయువు దశదిశలన్ దశయోజన పర్యంతంబు పరిమళింపం జేయుచుండ గో మృగ కాక చర్యలం జరించుచు భగవదంశంబైన ఋషభుండు మహానందంబు ననుభవించుచుఁ దనయందు సర్వభూతాంతర్యామి యగు వాసుదేవునిం బ్రత్యక్షంబుగాఁ గనుంగొనుచు సిద్ధిం బొందిన వైహాయస మనోజవ పరకాయప్రవేశాంతర్ధాన దూరగ్రహణ శ్రవణాది యోగసిద్ధులు దమంత వచ్చినం గైకొనక యుండె;" నని పలికిన శుకయోగీంద్రునకుం బరీక్షింన్నరేంద్రు డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; బీభత్స = అసహ్యకరమైన; రూపంబునన్ = రూపముతో; వసుంధరన్ = భూమిపై; పడియుండి = పడియుండి; అన్నంబున్ = అన్నమును; భుజించుచున్ = తినుచూ; నీరు = నీరు; త్రావుచు = తాగుతూ; మూత్ర = మూత్రము; పురీషంబులున్ = మలములు; విడుచుచున్ = వదలుతూ; అవి = వానిని; శరీరంబునన్ = దేహమున; అంటన్ = అంటుకొనుచుండ; పొరలుచుండు = దొర్లుతుండును; మఱియున్ = ఇంకను; తత్ = ఆ; పురీష = మలము యొక్క; సౌగంధ్య = సుగంధముతో; యుక్తంబు = కూడినది; అగు = అయిన; వాయువు = గాలి; దశ = పది {దశదిశలు - 1తూర్పు 2ఆగ్నేయము 3దక్షిణము 4నైరృతి 5పశ్చిమము 6వాయవ్యము 7ఉత్తరము 8ఈశాన్యము 9 క్రింద 10 పైన}; దిశలన్ = దిక్కులలోను; దశ = పది; యోజన = యోజనముల; పర్యంతంబు = వరకు; పరిమళింపన్ = పరిమళించునట్లు; చేయుచుండన్ = చేయుచుండగా; గో = పశువుల; మృగ = జంతువుల; కాక = కాకుల వంటి; చర్యలన్ = చర్యలను; చరించుచున్ = వర్తించుచు; భగవత్ = భగవంతుని యొక్క; అంశంబు = అంశ; ఐన = అయిన; ఋషభుండు = ఋషభుడు; మహానందంబున్ = మహానందమును; అనుభవించున్ = అనుభవించుతూ; తన = తన; అందున్ = అందు; సర్వ = సకల; భూత = జీవుల; అంతర్యామి = లోన ఉండువాడు; అగు = అయిన; వాసుదేవుని = నారాయణుని; ప్రత్యక్షంబునన్ = ప్రత్యక్షముగా; కనుగొనుచున్ = చూచుచూ; సిద్ధిన్ = సిద్ది; పొందిన = పొందినట్టి; వైహాయస = ఆకాశమున తిరుగుట; మనోజవ = మనసుతో సమానమైన వేగమున తిరుగుట; పరకాయప్రవేశ = ఇతర దేహములలో ప్రవేశించుట; అంతర్ధాన = అదృశ్యమగుట; దూరగ్రహణ = దూరముగా ఉన్నవానిని గ్రహించుట; శ్రవణ = వినుట; ఆది = మొదలగు; యోగసిద్ధులు = ఐశ్వర్యములు; తమంత = తమంత తామె; వచ్చినన్ = వచ్చినప్పటికిని; కైకొనక = చేపట్టక; ఉండెన్ = ఉండెను; అని = అని; పలికిన = పలికినట్టి; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = ఇంద్రుని వంటివాని; కున్ = కి; పరీక్షిత్ = పరీక్షిత్తు అనెడి; నరేంద్రుడున్ = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా జుగుప్స కలిగించే తీరున నేలమీద పడి ఉండి, అన్నం తింటూ, నీళ్ళూ త్రాగుతూ, మల మూత్రాలలో పొరలుతుండేవాడు. అతని మల సుగంధంతో కూడిన వాయువు పది దిక్కులలోను పది ఆమడల దూరం పరిమళిస్తుండేది. భగవదంశ సంభూతుడైన ఋషభుడు వృషభం వలె, మృగం వలె, వాయసం వలె ప్రవర్తిస్తూ మహదానందాన్ని పొందేవాడు. సర్వాంతర్యామి అయిన వాసుదేవుణ్ణి తనలో ప్రత్యక్షంగా దర్శించుకుంటూ యోగసిద్ధుడైనాడు. అపుడు ఆకాశగమనం, మనోవేగం, పరకాయ ప్రవేశం, అంతర్ధానం, దూర దర్శనం, దూర శ్రవణం మొదలైన సిద్ధులు తమంత తాముగా ఋషణుణ్ణి ఆశ్రయించాయి. అయినా ఋషభుడు ఆ సిద్ధులను స్వీకరించలేదు” అని శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు.
తెభా-5.1-83-క.
"మునివర! యోగజ్ఞానం
బునఁ జెఱుపంబడ్డ కర్మములు గల పెద్దల్
కని యుండెడి యైశ్వర్యం
బును ఋషభుం డెఱిఁగి యేల పొందక యుండెన్?"
టీక:- ముని = మునులలో; వర = శ్రేష్ఠుడ; యోగ = యోగము యొక్క; జ్ఞానంబునన్ = విజ్ఞానమువలన; చెఱుపంబడ్డ = పోగొట్టబడిన; కర్మములు = కర్మములు; కల = కలిగిన; పెద్దల్ = గొప్పవారు; కనియుండెడి = చూడగలిగెడి; ఐశ్వర్యంబునున్ = ఐశ్వర్యములు; ఋషభుండు = ఋషభుడు; ఎఱిగి = తెలిసి తెలిసి; ఏల = ఎందులకు; పొందక = చేపట్టక; ఉండెన్ = ఉండెను.
భావము:- “మునివర్యా! యోగాభ్యాసం వల్ల జ్ఞానం కలుగుతుంది. కర్మలు నశిస్తాయి. అలాంటి మహనీయులకు మహాసిద్ధులు ప్రాప్తిస్తాయి. అయినా తమంత తాము వచ్చిన ఐశ్వర్యాలను ఋషభుడు ఎందుకు స్వీకరించలేదు?”
తెభా-5.1-84-వ.
అనిన శుకుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; శుకుండున్ = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని (పరీక్షిత్తు) ప్రశ్నించగా శుకుడు ఇలా అన్నాడు.
తెభా-5.1-85-మ.
"ధరణీవల్లభ! నీదు వాక్యములు తథ్యం; బింతయుం దప్ప; దె
ట్లరయన్ వన్యమృగంబు పట్టుబడి తా నావేళ నా లుబ్ధకున్
ధర వంచించిన మాడ్కి నింద్రియములన్ దండించి చిత్తంబు ని
ర్భర కామాదుల కాస యిచ్చుఁ గడు సంరంభంబుతో గ్రమ్మఱన్.
టీక:- ధరణీవల్లభ = రాజా {ధరణీ వల్లభుడు - ధరణి (భూమికి) వల్లభుడు (భర్త), రాజు}; నీదు = నీ యొక్క; వాక్యములున్ = మాటలు; తథ్యంబున్ = నిజమే; ఇంతయున్ = ఇదంతా; తప్పదు = తప్పనిది; ఎట్లు = ఏవిధముగ; అరయన్ = చూసిన; వన్యమృగంబున్ = అడవిజంతువు; పట్టుబడి = దొరికిపోయి; తాన్ = తను; ఆవేళ = ఆసమయమునకు; ఆ = ఆ; లుబ్దకున్ = వేటగానిని, బోయను; ధరన్ =లోకంలో; వంచించిన = మోసగించెడి; మాడ్కిన్ = విధముగా; ఇంద్రియములన్ = ఇంద్రియములను; దండించి = నియమించుకొని; చిత్తంబు = మనసు; నిర్భర = భరింపలేని; కామ = కోరికలు; ఆదులన్ = మొదలగువానికి; ఆస = అవకాశము; ఇచ్చున్ = ఇచ్చును; కడు = మిక్కిలి; సంరంభంబుతో = వేడుకతో; క్రమ్మఱన్ = మఱల.
భావము:- “రాజా! నీ వన్నది నిజమే. అడవిలోని మృగాలు వేటగానికి పట్టుబడతాయి. అయినా ఏదో విధంగా వాణ్ణి వంచించి తప్పించికొని బయటపడతాయి. ఇది లోక సహజం. అలాగే ఇంద్రియాలను లొంగదీసుకున్నా మనస్సు మళ్ళీ ఏదో విధంగా విజృంభించి కోరికలకు అవకాశ మిస్తుంది.
తెభా-5.1-86-క.
చిరకాల తపము నైనను
హరియింపఁగ నోపుఁ జిత్త మని పెద్దలు న
మ్మరు జారులకున్ జారిణి
కరణిని నడరించు మనసు కామాదులకున్.
టీక:- చిర = ఎక్కువ; కాల = కాలము చేయబడిన; తపమున్ = తపస్సును; ఐననున్ = అయినప్పటికిని; హరియింపన్ = నాశనము చేయుటకు; ఓపున్ = సమర్థత గలది; చిత్తము = మనసు; అని = అని; పెద్దలు = గొప్పవారు; నమ్మరు = విశ్వసింపరు; జారుల్ = వ్యభిచారుల; కున్ = కి; జారిణి = వ్యభిచారి; కరణిన్ = వలె; అడరించు = ఉద్రేకింప జేయును; మనసు = మనసు; కామ = కోరికలు; ఆదులన్ = మొదలగువాని; కున్ = కి.
భావము:- చాలాకాలం శ్రమపడి సాధించుకున్న తపస్సునైనా మనస్సు హరిస్తుంది. అందుచేత పెద్దలు మనస్సును నమ్మరు. విటులను ఆకర్షించే జారిణిలాగా మనస్సు నిలకడ కోల్పోయి కామక్రోధాదులను ఆహ్వానిస్తుంది.
తెభా-5.1-87-క.
కామక్రోధాదికముల్
భూమీశ్వర! కర్మబంధములు మఱియును జే
తో మూలము లగుటను దా
రీ మహిలో మనసు నమ్మ రెప్పుఁడుఁ బెద్దల్.
టీక:- కామక్రోధాదికముల్ = కామక్రోధాదులు {కామ క్రోధాదులు - 1కామ 2క్రోధ 3మోహ 4లోభ 5మద 6మాత్సర్యములను అరిషడ్వర్గములు}; భూమీశ్వర = రాజా {భూమీశ్వరుడు - భూమికి ఈశ్వరుడు (ప్రభువు), రాజు}; కర్మ = కర్మముల; బంధములు = బంధనములు; మఱియునున్ = మిక్కిలిగా; చిత్ = మనసును; మూలములు = కారణముగా కలవి; అగుటన్ = అగుటచే; తారు = వారు; ఈ = ఈ; మహి = భూమి; లోన్ = పైన; మనసున్ = మనసుని; నమ్మరు = విశ్వసింపరు; ఎపుడున్ = ఎప్పటికిన్; పెద్దల్ = గొప్పవారు.
భావము:- రాజా! కామక్రోధాది అరిషడ్వర్గాలకు, కర్మబంధాలకు మనస్సే కారణం. అందుచేత ఆర్యులు మనస్సును ఎప్పుడూ విశ్వసించరు.
తెభా-5.1-88-సీ.
అదిగాన యెన్నఁడు నైశ్వర్యములను జే-
పట్టఁ జూడఁడు; లోకభవ్యు లైన
వారలచే నభివందనంబులు వొంది-
వెలయంగ నవధూత వేష భాష
ణంబుల నెఱిఁగికొనఁగరాని భగవత్స్వ-
రూపంబు గలిగి యా రూపమందుఁ
బరమ యోగధ్యాన పరులకు నెల్ల దే-
హత్యాగ సమయంబు నంతలోనఁ
తెభా-5.1-88.1-తే.
జూపు చుండియు దేహంబుఁ బాప నిచ్చ
గించె; నచ్చట దివ్యయోగీంద్రుఁ డాద్యుఁ
డతుల దివ్య ప్రకాశకుఁ డమరగురుడు
పరమపురుషుండు ఋషభుండు పార్థివేంద్ర!
టీక:- అదిగాన = అందుచేత; ఎన్నడున్ = ఎప్పుడును; ఐశ్వర్యములను = ఐశ్వర్యములను; చేపట్టజూడడు = స్వీకరింపదలచడు; లోక = లోకమున; భవ్యులు = యోగ్యులు; ఐన = అయిన; వారల = వారి; చేతన్ = చేత; అభివందనంబుల = స్తుతించుటలు; ఒంది = పొంది; వెలయంగ = ప్రసిద్దముగా; అవధూత = అవధూత; వేష = వేషము; భాషణంబులన్ = వాక్కులతో; ఎఱిగికొనగరాని = తెలియలేని; భగవత్ = భగవంతుని; స్వరూపంబున్ = స్వరూపమును; కలిగి = కలిగుండి; ఆ = ఆ; రూపమున్ = రూపము; అందున్ = అందు; పరమ = అత్యుత్కృష్టమైన; యోగధ్యాన = యోగధ్యానమునందు; పరులు = నిష్ఠ కలవారి; కున్ = కి; ఎల్లన్ = అందరకు; దేహత్యాగ = శరీరమును త్యజించెడి; సమయంబున్ = కాలమును; అంతలోన్ = అంతలోనే; చూపుచుండియున్ = చూపెడుతూ.
దేహంబున్ = శరీరమును; పాపన్ = విడువవలెనని; ఇచ్చగించెన్ = భావించెను; అచ్చటన్ = అక్కడ; దివ్య = గొప్ప; యోగి = యోగులలో; ఇంద్రుండున్ = ఇంద్రునివంటివాడు; ఆద్యుడున్ = మొదటివాడు; అతుల = సాటిలేని; దివ్య = దివ్యమైన; ప్రకాశకుడు = ప్రకాశముగలవాడు; అమర = దేవతలలో; గురుడు = శ్రేష్ఠుడు; పరమ = అత్యుత్తమమైన; పురుషుండు = పురుషుడు; ఋషభుండు = ఋషభుడు; పార్థివేంద్ర = రాజా.
భావము:- రాజా! మనస్సు గతులు తెలిసినవాడు కావడం వల్లనే తమంత తాముగా వచ్చినా సిద్ధులను ఋషభుడు చేపట్టలేదు. లోకాలకు శుభం కోరే వారి అభివందనాలను ఆ మహాత్ముడు అందుకున్నాడు. వేషంలో గాని, మాటల్లో గాని ఋషభుడని గుర్తు పట్టడానికి వీలులేనట్టుగా భగవత్స్వరూపంతో ఋషభుడు వెలిగి పోతున్నాడు. పరమయోగాన్ని ధ్యానించేవారి కందరికీ దేహత్యాగం చేయదగ్గ సమయాన్ని ఋషభుడు సూచిస్తున్నాడు. మహాయోగులలో శ్రేష్ఠుడైనవాడు, మహాత్ములలో అగ్రేసరుడు, సాటిలేని దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు, దేవతలకు గురువైనవాడు, పరమ పురుషుడు అయిన ఋషభుడు శరీరం విడవడానికి నిశ్చయించాడు.
తెభా-5.1-89-వ.
అంత విముక్త లింగుండు భగవంతుండునగు ఋషభుండు మనంబున దేహాభిమానంబు విసర్జించి కులాల చక్రంబు కులాలుని చేత భ్రమియింపంబడి విసృష్టంబయ్యు భ్రమించు గతిం బ్రాచీన సంస్కార విశేషం బగు నభిమానాభాసంబున దేహచలనాదికంబుల నొప్పి యుండియు యోగమాయా వాసనచే యుక్తుండయ్యె; మఱియు నా ఋషభుం డొక్క దినంబునం గోంకణ వంక పట కుటకంబులను దక్షిణ కర్ణాట దేశంబులకు యదృచ్ఛంజని కుటకాచ లోపవనంబున నిజాస్యకృత శిలాకబళుం డగుచు నున్మత్తుని చందంబున వికీర్ణ కేశుండు, దిగంబరుండునై సంచంరింప వాయువేగ విధూత వేణుసంఘర్షణ సంజాతం బగు నుగ్రదావానలంబు తద్వనంబు దహింప నందు దగ్ధుండయ్యె; నంత నతని కృత్యంబులు తద్దేశవాసులగు జనంబులు చెప్ప నర్హన్నామకుండగు దద్రాష్ట్రాధిపతి విని, నిజధర్మంబులం బరిత్యజించి స్వదేశస్థుల తోడంగూడి, దానా యాచారంబుల నంగీకరించి యధర్మబహుళం బగు కలియుగంబున భవితవ్యతచే విమోహితుండై మనుజుల నసమంజసం బగు పాషండ మతాభినివేశులం జేసె; మఱియును గలియుగంబు నందు మనుజాధములు దేవమాయా మోహితులై శాస్త్రోక్త శౌచాచారంబులు విడిచి నిజేచ్ఛం జేసి దేవతాహేళనంబులు చేయుచు నస్నానానాచమనాశౌచ కేశోల్లుంఛనాది కాపవిత్ర వ్రతంబులం జేయుచు నధర్మ బహుళం బగు కలియుగంబునం జెఱుపంబడ్డ బుద్ధి ధర్మంబులం గలిగి వేద బ్రాహ్మణ యజ్ఞపురుషుల దూషించుచు లోకంబులం దమతమ మతంబులకుం దామే సంతసిల్లుచు నవేదమూలం బగు స్వేచ్ఛం జేసి ప్రవర్తించి యంధపరంపరచే విశ్వాసంబు చేసి తమంతన యంధతమసంబునం బడుచు నుండుదు; రీ ఋషభుని యవతారంబు రజోవ్యాప్తులగు పురుషులకు మోక్షమార్గంబు నుపదేశించుటకు నయ్యె; నదియునుంగాక సప్త సముద్ర పరివృతంబు లగు నీ భూద్వీప వర్షంబులందలి జనంబులు దివ్యావతార ప్రతిపాదకంబు లతిశుద్ధంబులునగు నెవ్వని కృత్యంబులు గీర్తింతురు, మఱియు నెవ్వని యశంబున నతికీర్తిమంతుండగు ప్రియవ్రతుండు గలిగె, నెందు జగదాద్యుండగు పురాణపురుషుం డవతారంబు నొంది కర్మహేతుకంబులు గాని మోక్ష ధర్మంబులం దెలిపె, వెండియు నెవ్వండు యోగమాయా సిద్ధుల నసద్భూతంబు లగుటంజేసి నిరసించె నట్టి ఋషభునితోడఁ దత్సిద్ధికృత ప్రయత్నులగు నితరయోగీశ్వరులు మనోరథంబుననైన నెట్లు సరి యగుదు? రిట్లు సకలవేదలోక దేవ బ్రాహ్మణులకు గోవులకుం బరమగురుండు భగవంతుండు నగు ఋషభుని చరిత్రంబు వినినవారలకు దుశ్చరితంబులు దొలంగు మంగళంబులు సిద్ధించు మిక్కిలి శ్రద్ధతోడ నెవ్వండు విను వినిపించు వానికి హరిభక్తి దృఢంబగు, నట్టి హరి భక్తితాత్పర్యంబునం బెద్దలు భాగవతులగుటంజేసి సంప్రాప్త సర్వపురుషార్థులగుచు వివిధ వృజిన హేతుకంబగు సంసారతాపంబును బాసి యవిరతంబుఁ దద్భక్తియోగామృతస్నానంబు చేసి పరమపురుషార్థం బయిన మోక్షంబును జెందుదు; రని సప్తద్వీపవాసులవారు నేఁడునుం గొనియాడుచుండుదురు.
టీక:- అంతన్ = అంతట; విముక్తలింగుడు = పరమహంస {విముక్త లింగుడు - లింగదేహము (తనను గుర్తించెడి చిహ్నమలు) నుండి విడువబడినవాడు, పరమహంస}; భగవంతుండు = భగవంతుడు; అగు = అయిన; ఋషభుండు = ఋషభుడు; మనంబునన్ = మనసులో; దేహ = శరీరముపైన; అభిమానంబున్ = ఆసక్తిని; విసర్జించి = విడిచిపెట్టి; కులాల = కుమ్మరి; చక్రంబున్ = చక్రము; కులాలుని = కుమ్మరివాని; చేతన్ = చేత; భ్రమియింపంబడి = తిప్పబడి; విసృష్టంబున్ = విడువబడినది; ఆయ్యున్ = అయనప్పటికిని; భ్రమించు = తిరిగెడు; గతిన్ = విధముగా; ప్రాచీన = పూర్వకర్మము యొక్క; సంస్కార = సంస్కారములు; విశేషంబున్ = విశేషమైనవి; అగు = అయిన; అభిమాన = అభిమానము యొక్క; అభాసంబునన్ = లేకపోవుటచే; దేహ = దేహము; చలన = కదులుట; ఆదికంబులన్ = మొదలగువానితో; ఒప్పి = చక్కగా; ఉండియున్ = ఉండినప్పటికిని; యోగమాయా = యోగమాయ; వాసన = అగరుల; చేన్ = తోటి; యుక్తుండు = కూడి ఉన్నవాడు; అయ్యెన్ = అయ్యెను; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; ఋషభుండు = ఋషభుడు; ఒక్క = ఒక; దినంబునన్ = దినమున; కోంకణ = కొంకణి; వంక = వంగ; పట = పటము; కుటకంబులు = కుటకములు; అను = యనెడి; దక్షిణ = దక్షిణ; కర్ణాట = కర్నాటకము; దేశంబుల్ = దేశముల; కున్ = కి; అదృచ్చన్ = ప్రచ్ఛన్నముగా; చని = వెళ్ళి; కుటక = కుటకముయనెడి; అచల = పర్వతముయొక్క; ఉపవనంబునన్ = ఉపవనము నందు; నిజ = తన; అస్య = నోటితో; కృత = చేసిన; శిలా = రాళ్ళ; కబళుండు = భుజించువాడు; అగుచున్ = అగుచూ; ఉన్మత్తుని = పిచ్చివాని; చందంబునన్ = వలె; వికీర్ణ = చెదరిన; కేశుండు = వెంట్రుకలు గలవాడు; దిగంబరుండున్ = నగ్నముగా ఉన్నవాడు; ఐ = అయ్యి; సంచరింపన్ = తిరుగుతుండగ; వాయు = వాయువుల; వేగ = వేగమువలన; విధూత = ఊపబడిన; వేణు = వెదురుకఱ్ఱల; సంఘర్షణ = రాపిడి వలన; సంజాతంబు = పుట్టినది; అగు = అయిన; ఉగ్ర = భయంకరమైన; దావానలంబున్ = కారుచిచ్చు; తత్ = ఆ; వనంబున్ = అడవిని; దహింపన్ = కాల్చివేయగా; అందున్ = దానిలో; దగ్ధుండున్ = కాలిపోయినవాడు; అయ్యెన్ = అయ్యెను; అంతన్ = అంతట; అతని = అతని; కృత్యంబులున్ = పనులు; తత్ = ఐ; దేశ = దేశ మందు; వాసులు = నివాసము ఉండెడివారు; అగు = అయిన; జనంబులున్ = జనులు; చెప్పన్ = చెప్పగా; అర్హన్ = అర్హనుడు యనెడి; నామకుండు = పేరు గలవాడు; అగు = అయిన; తత్ = ఆ; రాష్ట్రా = దేశమునకు; అధిపతి = రాజు; విని = విని; నిజ = తన; ధర్మంబులన్ = మతములను; పరిత్యజించి = విడిచి; స్వ = స్వంత; దేశస్థులన్ = దేశవాసుల; తోడన్ = తోటి; కూడి = కలిసి; తాన్ = అతను; ఆ = ఆ; ఆచారంబులన్ = ఆచారములను; అంగీకరించి = స్వీకరించి; అధర్మ = అధర్మము; బహుళంబున్ = పెచ్చుపెరిగినది; అగు = అయిన; కలియుగంబునన్ = కలియుగములో; భవితవ్యత = జరుగవలసినదాని; చేన్ = గురించి; విమోహితుండు = మిక్కిలి మోహమున పడినవాడు; ఐ = అయ్యి; మనుజులన్ = మానవులలో; అసమంజసంబున్ = అవలంభింప తగనిది; అగు = అయిన; పాషండ = పాషండ, వేదమార్గవ్యతికర; మతా = మతములందు; అభినివేశులన్ = శ్రద్ధ గలవారిగా; చేసెన్ = చేసెను; మఱియున్ = ఇంకను; కలియుగంబున్ = కలియుగము; అందున్ = లో; మనుజ = మానవులైన; అధములు = నీచులు; దేవ = దేవుని యొక్క; మాయా = మాయచే; మోహితులు = మోహమున పడినవారు; ఐ = అయ్యి; శాస్త్ర = వేదశాస్త్రములలో; ఉక్త = చెప్పబడిన; శౌచ = శుచియైన; ఆచారంబులన్ = ఆచారములను; విడిచి = విడిచిపెట్టి; నిజ = తమ; ఇచ్చంజేసి = ఇష్టానుసారము; దేవతా = దేవతలను; హేళనంబున్ = అపహాస్యము; చేయుచున్ = చేయుచూ; అస్నాన = స్నానము చేయకపోవుట; అనాచమన = అచమనము చేయకపోవుట; అశౌచ = శుద్ది చేసుకొనని; కేశ = శిరోజములను; ఉల్లుంఛన = కత్తిరించుట, క్షౌరము; ఆదిక = మొదలగు; అపవిత్ర = పవిత్రముకాని; వ్రతంబులన్ = పనులను; చేయుచున్ = చేయుచూ; అధర్మ = అధర్మముల; బహుళంబున్ = అధికము; అగు = అయిన; కలియుగంబునన్ = కలియుగములో; చెఱుపంబడ్డ = పోగొట్టబడిన; బుద్ధిన్ = బుద్ధి; ధర్మంబులన్ = ధర్మములును; కలిగి = కలిగి; వేద = వేదములను; బ్రాహ్మణ = బ్రాహ్మణులను; యజ్ఞపురుషులన్ = యజ్ఞపురుషులను; దూషించుచున్ = దూషించుతూ; లోకంబుల్ = లోకముల; అంద = లో; తమతమ = వారివారి; మతంబుల్ = మతముల; కున్ = కు; తామే = వారే; సంతసిల్లుచున్ = సంతృప్తిపడిపోతూ; అవేద = వేదములుకాని; మూలంబు = ప్రమాణములు గలవి; అగు = అయిన; స్వేచ్ఛంజేసి = ఇష్టానుసారము; ప్రవర్తించి = తిరుగుతూ; అంధ = గుడ్డి; పరంపర = ఆచారపు సమూహముల; చేన్ = అందు; విశ్వాసంబున్ = నమ్ముట; చేసి = చేసిన; తమంతన = వారంతట వారే; అంధతమసంబునన్ = గుడ్డిచీకటిలో; పడుచునుండుదురు = పడుతుందురు; ఈ = ఈ; ఋషభుని = ఋషభుని; అవతారంబున్ = అవతారము; రజః = రజోగుణములు; వ్యాప్తులు = అతిశయించినవారు; అగు = అయిన; పురుషుల్ = వ్యక్తుల; కున్ = కు; మోక్ష = ముక్తికి; మార్గంబున్ = దారిని; ఉపదేశించుట = తెలియజెప్పుట; కున్ = కు; అయ్యెన్ = అయినది; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; సప్తసముద్ర = సప్తసముద్రములచే; పరివృతంబులు = చుట్టబడినవి; అగు = అయిన; ఈ = ఈ; భూ = భూమండలపు; ద్వీప = ద్వీపములు; వర్షంబులున్ = వర్షములు; అందలి = వానిలోని; జనంబులున్ = జనులు; దివ్య = దేవుని యొక్క; అవతార = అవతారములను; ప్రతిపాదికంబులున్ = స్థాపించునవి; అతి = మిక్కిలి; శుద్దంబులున్ = పరిశుద్దమైనవి; అగు = అయిన; ఎవ్వని = ఎవని; కృత్యంబులున్ = పనులను; కీర్తింతురు = స్తుతింతురో; మఱియున్ = ఇంకను; ఎవ్వని = ఎవని యొక్క; అంశంబునన్ = అంశతోటి; అతి = మిక్కిలి; కీర్తిమంతుడు = కీర్తి గలవాడు; అగు = అయిన; ప్రియవ్రతుండు = ప్రియవ్రతుడు; కలిగెన్ = జన్మించెనో; ఎందున్ = ఎక్కడైతే; జగత్ = విశ్వమునకు; ఆద్యుండు = కారణభూతుడు; అగు = అయిన; పురాణపురుషుండు = విష్ణువు; అవతారంబున్ = అవతారమును; ఒంది = పొంది; కర్మ = కర్మములకు; హేతుకంబులు = కారణములు; కాని = కాని; మోక్ష = ముక్తి యొక్క; ధర్మంబులన్ = లక్షణములను; తెలిపెను = తెలిపెను; వెండియున్ = మరల; ఎవ్వండు = ఎవరైతే; యోగమాయాసిద్ధులను = ఐశ్వర్యములను; అసద్భూతంబులు = సత్యదూర మైనట్టివి; అగుటన్ = అగుట; చేసి = వలన; నిరసించెన్ = తిరస్కరించెను; అట్టి = అటువంటి; ఋషభుని = ఋషభుని; తోడన్ = తోటి; తత్ = ఆ యొక్క; సిద్ధిన్ = సిద్ధులకై; కృత = చేసిన; ప్రయత్నులు = ప్రయత్నములు గలవారు; అగు = అయిన; యోగి = యోగులలో; ఈశ్వరులు = శ్రేష్ఠులు; మనోరథంబునన్ = కోరికలలోన; ఐనన్ = అయినప్పటికి; ఎట్లు = ఏ విధముగ; సరి = సాటి; అగుదురు = అయ్యెదరు; ఇట్లు = ఈ విధముగ; సకల = అఖిల; వేద = వేదములకు; లోక = లోకములకు; దేవ = దేవతలకు; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; కున్ = కు; గోవుల్ = ఆవుల; కున్ = కు; పరమ = అత్యున్నతమైన; గురుండు = గురువు; భగవంతుండున్ = భగవంతుడు; అగు = అయిన; ఋషభుని = ఋషభుని; చరిత్రంబున్ = చరిత్ర; వినిన = విన్న; వారల్ = వారి; కున్ = కి; దుశ్చరితంబులు = పాపపు వర్తనములు; తొలంగు = తొలగిపోవును; మంగళంబులున్ = శుభకరములు; సిద్ధించున్ = కలుగును; మిక్కిలి = అధికమైన; శ్రద్ధ = శ్రద్ధ; తోడన్ = తోటి; ఎవ్వండున్ = ఎవరైతే; వినున్ = వినునో; వినిపించున్ = వినిపించునో; వాడు = వాడు; కిన్ = కి; హరి = విష్ణువు పైన; భక్తి = భక్తి; దృఢంబున్ = గట్టిపడుట; అగున్ = జరుగును; అట్టి = అటివంటి; హరి = విష్ణువు పైన; భక్తి = భక్తి యందు; తాత్పర్యంబునన్ = నిష్ఠ వలన; పెద్దలు = గొప్పవారు; భాగవతులు = భాగవతానుయాయులు; అగుటన్ = అగుట; చేసి = వలన; సంప్రాప్త = లభించిన; సర్వ = సమస్తమైన; పురుషార్థులు = పురుషార్థములు గలవారు {పురుషార్థంబులు - ధర్మార్థకామమోక్షములు, పురుషులు అర్థించదగినవి (కోరదగినవి)}; అగుచున్ = అగుచూ; వివిధ = అనేకమైన; వృజిన = పాపములకు; హేతుకంబు = కారణభూతములు; అగు = అయిన; సంసార = సాంసారిక; తాపంబులన్ = బాధలనుండి; పాసి = విడువడి; అవితరంబున్ = ఎడతెగని; తత్ = అతని యొక్క; భక్తియోగ = భక్తియోగము యనెడి; అమృత = అమృతము నందు; స్నానంబున్ = స్నానములు; చేసి = చేసిన; పరమ = అత్యున్నతమైన; పురుషార్థంబున్ = పురుషార్థము; అయిన = ఐనట్టి; మోక్షంబునున్ = మోక్షమును; చెందుదురు = చెందుదురు; అని = అని; సప్తద్వీప = సప్తద్వీపములందు {సప్తద్వీపములు - 1జంబూ(జంబూద్వీపము) 2ప్లక్ష(ప్లక్షద్వీపము) 3శాల్మలిద్వీప(శాల్మలీద్వీపము) 4కుశ(కుశద్వీపము) 5క్రౌంచ(క్రౌంచద్వీపము) 6శాక(శాకద్వీపము) 7పుష్కరములు(పుష్కరద్వీపములు)}; వాసులవారు = నివసించువారు; నేడునున్ = ఈనాటికిని; కొనియాడుచుందురు = కీర్తించుతుందురు.
భావము:- ఆ తరువాత పరమహంస, భగవంతుడు అయిన ఋషభుడు మనసులో దేహాభిమానాన్ని వదలుకొని, కుమ్మరిసారె కుమ్మరివానిచే త్రిప్పబడి విడువబడ్డ తర్వాత కూడా అది కొంతసేపు తిరుగుతున్నట్లే పూర్వ సంస్కార విశేషం వల్ల ఆయన దేహ సంచలనం పూర్తిగా ఆగిపోదు. ఋషభుడు లింగ శరీరాన్ని వదలిపెట్టినా యోగమాయా వాసనల కారణంగా లౌకికంగా దేహధారిగా చరించాడు. అతడు ఒకరోజు కోంకణ, వంగ, పట, కుటకాలు అనే దక్షిణ కర్ణాట దేశానికి ప్రచ్ఛన్నముగా వెళ్ళి, కుటక పర్వత సమీపంలోని ఉపవనం చేరుకున్నాడు. అక్కడ శిలాఖండాలను నోటిలో పెట్టుకొంటూ పిచ్చివానిలాగా చెదరిన జుట్టుతో దిగంబరుడై సంచరించాడు. అప్పుడు వీచిన సుడిగాలి విసురుకు వెదురుకఱ్ఱలు రాపిడి చెంది భయంకరమైన కార్చిచ్చు రేగింది. ఆ మంటలలో ఋషభుడు కాలిపోయాడు. ఋషభుని చేతలను ఆ ప్రాంతంవారు చెప్పుకోగా అర్హనుడు అనే పేరుగల ఆ రాష్ట్రాధికారి విని, స్వధర్మం వదలిపెట్టి స్వదేశస్థులతో ఆ ఆచారానికి ఆమోదం తెలిపాడు. అధర్మ బహుళమైన కలియుగంలో భవిష్యత్తుకు లోబడిపోయి తన రాష్ట్రంలోని మానవులను అయోగ్యమైన వేద బాహ్యమతం పట్ల మొగ్గేటట్లు చేసాడు. కలియుగంలో అధములైన మానవులు దేవమాయవల్ల మోహితులై శాస్త్రాలలో చెప్పబడ్డ శౌచాలను, ఆచారాలను వదలిపెట్టి తమకు ఇష్టం వచ్చినట్లు దేవతలను పరిహసిస్తారు. స్నానం, ఆచమనం చేయకపోవడం, జుట్టు కొరిగించుకొంటారు. అపవిత్ర వ్రతాలను చేస్తారు. అధర్మాలు పెచ్చు పెరిగిన కలియుగంలో బుద్ధి, ధర్మం చెడిపోగా వేదాలను, బ్రహ్మణులను, యజ్ఞపురుషులను నిందిస్తూ, తమతమ మతాలకు తామే సంతోషిస్తూ, వేదవిరుద్ధంగా ఇష్టానుసారం ప్రవర్తిస్తూ, అంద విశ్వాసాలకు లొంగి తమంత తామే గుడ్డి చీకటిలో పడుతూ ఉంటారు. రజోగుణంతో నిండిన మానవులకు మోక్షమార్గాన్ని ఉపదేశించడం కోసమే ఋషభుని అవతారం. సప్త సముద్రాలచేత చుట్టుముట్టబడిన ద్వీపాలలోని, వర్షాలలోని జనులు ఎవని దివ్యమైన అవతార లీలలను కీర్తిస్తారో, ఎవడు ఎంతో కీర్తి గడించిన ప్రియవ్ఱ్ఱతుని వంశంలో జన్మించాడో, ఎవడు లోకాలకు ఆది అయిన పురాణపురుషుడో అటువంటి ఋషభ దేవుడు భూలోకంలో అవతరించి కర్మ సంబంధం లేని మోక్ష ధర్మాన్ని ప్రబోధించాడు. యోగమాయవల్ల తమకు తామై లభించిన అసత్యాలైన సిద్ధులను తిరస్కరించాడు. అటువంటి ఋషభునికి సిద్ధులకోసం ప్రయత్నించే యోగీశ్వరులు ఏ విధంగా సాటి అవుతారు? అన్ని వేదాలకు, అన్ని లోకాలకు, సమస్త దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పరమ గురువు, భగవంతుడు అయినవాడు ఋషభుడు. ఆయన చరిత్రం వింటే దుశ్చరిత్రుల పాపం తొలగిపోతుంది. శుభాలు చేకూరుతాయి. ఎవరయితే ఋషభుని చరిత్రను మిక్కిలి శ్రద్ధతో వింటారో, ఎవరు ఇతరులకు వినిపిస్తారో వారికి సుదృఢమైన భక్తి లభిస్తుంది. అటువంటి హరిభక్తి పట్ల తత్పరత కలిగిన పెద్దలైన భాగవతులు హరి కృపవల్ల ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలను సాధించుకుంటారు. నానావిధ పాపకారణమైన సంసార తాపాన్ని పోగొట్టుకుంటారు. హరిభక్తి యోగమనే అమృతస్నానం చేసి పునీతులౌతారు. పరమ పురుషార్థమైన మోక్షాన్ని సిద్ధింపజేసుకుంటారు. ఈ విధంగా సప్తద్వీపాలలోని జనులు నేడుకూడా ఋషభుని మహిమను పొగడుతుంటారు.
తెభా-5.1-90-ఆ.
యాదవులకు మీకు నత్యంత కులగురు
వైన కృష్ణుఁ డెచట నైనఁ గలఁడు;
కొలుచువారి కెల్ల సులభుఁడై మోక్షంబు
నిచ్చుఁ; జింత చేయ నేల నీకు?
టీక:- యాదవుల్ = యాదవుల; కున్ = కు; మీరు = మీరు; కున్ = కును; అత్యంత = అత్యున్నతమైన; కులగురువు = కులగురువు; ఐనన్ = అయినట్టి; కృష్ణుడు = కృష్ణుడు; ఎచటన్ = ఎక్కడను; ఐనన్ = అయినను; కలడు = ఉన్నాడు; కొలుచు = సేవించెడి; వారు = వారి; కిన్ = కి; ఎల్లన్ = అందరకు; సులభుడు = సుళువుగా లభించువాడు; ఐ = అయ్యి; మోక్షంబున్ = ముక్తిని; ఇచ్చున్ = ఇచ్చును; చింతచేయన్ = వగచుట; ఏల = ఎందులకు; నీకున్ = నీకు.
భావము:- యాదవులకు, మీకు కులగురువైన శ్రీకృష్ణుడు అన్నిచోట్ల ఉన్నాడు. కొలిచేవారికి అతడు సులభుడై తప్పక మోక్షం ప్రసాదిస్తాడు. నీకెందుకు చింత?
తెభా-5.1-91-సీ.
నిత్యానుభూతమౌ నిజరూపలాభ ని-
వృత్తమై తగు మహాతృష్ణ గలిగి
యతులిత విపుల మాయారచితం బైన-
లాభంబునకుఁ దగులంబు లేని
మతి గల్గి లోకుల నతి వేడ్కఁ గరుణించి-
యభయదానం బిచ్చి యందఱ కిల
నవ్యయంబై దివ్యమై మహానందమై-
యత్యంత సేవ్యమై యతుల మైన
తెభా-5.1-91.1-తే.
తనదు లోకంబు చూపంగఁ దగిన యట్టి
మోక్షమార్గంబు నెఱిఁగించి ముక్తదేహుఁ
డగుచుఁ దాదాత్మ్య మొందెఁ బ్రత్యక్ష విష్ణు
వైన ఋషభుండు జనులకు నద్భుతముగ.
టీక:- నిత్య = శాశ్వతమైన; అనుభూతము = అనుభవింపబడుతున్నది; ఔ = అయిన; నిజరూప = స్వస్వరూపము; లాభ = జ్ఞానమువలన; నివృత్తమై = తొలగింపబడినదై; తగు = తగిన; మహాతృష్ణ = తరుగనికోరికలు; కలిగి = పొంది; అతులిత = సాటిలేని; విపుల = విస్తారమైన; మాయా = మాయచేత; రచితంబున్ = ఏర్పరుపబడినది; ఐనన్ = అయినట్టి; లాభంబున్ = ప్రయోజనమున; కున్ = కు; తగులంబు = లాలస; లేని = లేనట్టి; మతిన్ = బుద్ధి; కల్గి = ఉండి; లోకులన్ = ప్రజలను; అతి = మిక్కిలి; వేడ్కన్ = సంతోషముతో; కరుణించి = దయచూపి; అభయ = అభయ, రక్షణ; దానంబున్ = ప్రదానము; ఇచ్చి = ఇచ్చి; అందఱ = అందరి; కిన్ = కి; ఇలన్ = భూమిపైన; అవ్యయంబు = తరుగనిది; ఐ = అయ్యి; దివ్యము = దివ్యమైనది; ఐ = అయ్యి; మహానందము = గొప్ప ఆనందము; ఐ = కలిగి; అత్యంత = అత్యున్నతమైన; సేవ్యము = సేవింపదగినది; ఐ = అయ్యి; అతులమున్ = సాటిలేనిది; ఐనన్ = అయినట్టి.
తనదు = తనయొక్క; లోకంబున్ = లోకమును; చూపంగన్ = చూపుటకు; తగిన = తగినది; అట్టి = అటువంటి; మోక్ష = ముక్తిని చేరెడి; మార్గంబున్ = దారిని; ఎఱిగించి = తెలిపి; ముక్తదేహుడు = మరణించినవాడు {ముక్తదేహుడు - విడిచిన దేహముగలవాడు, మరణించినవాడు}; అగుచున్ = అగుచూ; తాదాత్మ్యంబున్ = తాదాత్మ్యమును; ఒందెన్ = పొందెను; ప్రత్యక్ష = సాక్షాత్; విష్ణువు = విష్ణుమూర్తి; ఐనన్ = అయినట్టి; ఋషభుండు = ఋషభుడు; జనులు = ప్రజల; కున్ = కి; అద్భుతముగ = ఆశ్చర్యకరమగునట్లు.
భావము:- ఋషభుడు నిత్యానుభూత అయిన స్వస్వరూప లాభంవల్ల తృష్ణను నివారింపజేశాడు. యోగమాయా ప్రాప్తాలైన మహాసిద్ధుల చేత ఆయన బుద్ధి ఆకర్షింపబడలేదు. ఆ మహానుభావుడు లోకులందరినీ కనికరించి అభయ మిచ్చాడు. నిత్యమైనది, దివ్యమైనది, ఆనంద ప్రదమైనది, సేవింప దగినది, సాటిలేనిది అయిన వైకుంఠ లోకాన్ని అందింపగల మోక్షమార్గాన్ని అందరికీ ఉపదేశించాడు. ఆ తరువాత దేహాన్ని వదలి జనులంతా ఆశ్చర్యపడేటట్లు విష్ణువులో తాదాత్మ్యం పొందాడు. ఋషభుడు సామాన్యుడు కాడు. ఆయన సాక్షాత్తుగా విష్ణువు.
తెభా-5.1-92-మ.
భరతుం డంత ధరాతలంబుఁ గడఁకం బాలించుచున్ ధారుణీ
శ్వరచంద్రుండగు విశ్వరూపునకు మున్ సంజాతయై యుండి ని
ర్భరకాంతిన్ విలసిల్లు పంచజని పేరం గల్గు కాంతామణిం
గర మర్థిన్ ధరఁ బెండ్లియాడె శుభలగ్నంబందు భూవల్లభా!
టీక:- భరతుండు = భరతుడు; అంతన్ = అంతట; ధరాతలంబున్ = భూమండలమును; కడకన్ = పూని; పాలించుచున్ = పరిపాలించుచూ; ధారుణీశ్వర = రాజులలో {ధారుణీశ్వరుడు - ధరణికి ఈశ్వరుడు, రాజు}; చంద్రుండు = చంద్రునివంటివాడు; అగు = అయిన; విశ్వరూపున్ = విశ్వరూపుని; కున్ = కి; మున్ = ఇంతకుముందు; సంజాత = జన్మించినది; ఐ = అయ్యి; ఉండి = ఉండి; నిర్భర = నిబ్బరమైన; కాంతిన్ = ప్రకాశముతో; విలసిల్లు = విరాజిల్లెడి; పంచజని = పంచజని; పేరన్ = పేరు; కల్గు = ఉన్నట్టి; కాంతా = స్త్రీలలో {కాంత - మనోహరమైన ఆమె, స్త్రీ}; మణిన్ = మణివంటి ఆమెను; కరము = మిక్కిలిగ; అర్థిన్ = కోరినవాడై; ధరన్ = మనస్ఫూర్తిగా; పెండ్లియాడెన్ = పెండ్లాడెను; శుభ = శుభకరమైన; లగ్నంబున్ = ముహూర్తము; అందున్ = అందు; భూవల్లభా = రాజా {భూవల్లభుడు - భూమికి వల్లభుడు (పతి), రాజు}.
భావము:- రాజా! భరతుడు భూమండలాన్ని దీక్షతో పరిపాలించసాగాడు. రాజులలో చంద్రుని వంటివాడైన విశ్వరూపుడనే రాజుకు పంచజని అనే కుమార్తె ఉంది. గొప్పకాంతితో విలసిల్లే ఆ పంచజనిని భరతుడు కోరి శుభలగ్నంలో పెళ్ళి చేసుకున్నాడు.
తెభా-5.1-93-వ.
ఇట్లు వివాహితుండై యా పంచజని వలన నహంకారంబునం బంచతన్మాత్రలు జనించిన తెఱంగున సుమతి రాష్ట్రభృక్సుదర్శనాచరణ ధూమ్రకేతువు లను నేవురు పుత్రులం బుట్టించె; నటమున్న యజనాభం బను పేరం బరఁగు వర్షంబు భరతుండు పాలించు కతంబున భారతవర్షంబు నాఁ బరగె; నంత.
టీక:- ఇట్లు = ఈ విధముగ; వివాహితుండు = వివాహము చేసుకొన్నవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; పంచజని = పంచజని; వలనన్ = వలన; అహంకారంబునన్ = అహంకారము వలన; పంచతన్మాత్రలు = పంచతన్మాత్రలు {పంచతన్మాత్రలు - 1 శబ్దము 2 స్పర్శము 3 రూపము 4 రుచి 5 వాసన}; జనించిన = పుట్టెడి; తెఱంగునన్ = విధముగ; సుమతి = సుమతి; రాష్ట్రభృక్ = రాష్ట్రభృక్కు; సుదర్శన = సుదర్శనుడు; ఆచరణ = ఆచరణుడు; ధూమ్రకేతువు = ధూమ్రకేతువు; అను = అనెడి; ఏవురన్ = ఐదుగురిని; పుత్రులన్ = కుమారులను; పుట్టించెన్ = పుట్టించెను; అటమున్ను = అంతకు పూర్వము; అజనాభంబు = అజనాభము {అజనాభము - అజ (మేషము) రాశి నాభము (ముఖ్యముగాగలది), రాశిచక్రము}; అను = అనెడి; పేరన్ = పేరుతో; పరగు = ప్రసిద్దమైన; వర్షంబున్ = వర్షము, భూఖండము; భరతుండు = భరతుడు; పాలించు = పాలించిన; కతంబునన్ = కారణముచేత; భారతవర్షంబున్ = భారతవర్షము; నా = అని; పరగెన్ = ప్రసిద్దమైనది; అంతన్ = అంతట; =
భావము:- అహంకారానికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనబడే పంచతన్మాత్రలు పుట్టినట్లు భరతునికి పంచజని వలన సుమతి, రాష్ట్రభృక్కు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రకేతువు అనే అయిదుగురు కొడుకులు పుట్టారు. అంతకుముందు అజనాభం అనే పేరుతో పిలువబడిన భూభాగం భరతుడు పాలించడం వల్ల భరతవర్షం అనే పేరును పొందింది.
తెభా-5.1-94-క.
భరతుఁడు నిజపిత లేలిన
కరణిని గర్మముల నెల్లఁ గైకొని ప్రజలన్
హరికృప నొందుచు నేలెను
ధరణీసురవరులు పొగడ ధరణీనాథా!
టీక:- భరతుడు = భరతుడు; నిజ = తన; పితలు = తండ్రులు, పూర్వులు; ఏలిన = పాలించిన; కరణిన్ = విధముగ; కర్మములన్ = సత్కర్మలను; ఎల్లన్ = అన్నిటిని; కైకొని = స్వీకరించి; ప్రజలన్ = ప్రజలను; హరి = విష్ణుమూర్తి; కృపన్ = కరుణను; ఒందుచున్ = పొందుతూ; ఏలెన్ = పరిపాలించెను; ధరణీసుర = బ్రాహ్మణులలో; వరులు = ఉత్తములు; పొగడన్ = కీర్తించగా; ధరణీనాథా = రాజా {ధరణీనాథ - ధరణి (భూమికి) నాథుడు, రాజు}.
భావము:- రాజా! భరతుడు తన పూర్వులు పాలించిన విధంగానే శ్రీహరి అనుగ్రహంతో బ్రాహ్మణోత్తములు పొగిడే విధంగా సత్కర్మలు ఆచరిస్తూ ప్రజలను పరిపాలించాడు.
తెభా-5.1-95-సీ.
భగవంతుఁడగు జగద్భరితు నల్పంబులు-
నధికంబు లైన పె క్కధ్వరముల
దర్శపూర్ణిమలచేఁ దగను జాతుర్మాస్య-
ముల నగ్నిహోత్రమువలనఁ గడఁకఁ
బశుసోమములచేతఁ బలుమాఱుఁ బూజించి-
వేదోక్త మైన యా విమలకర్మ
ములఁ గల్గు ధర్మంబుఁ బురుషోత్త మార్పణం-
బుగఁ జేయుచును మఖంబులను మంత్ర
తెభా-5.1-95.1-తే.
ములను బలికెడు నా దైవములను శ్రీశు
నవయవంబులు గాఁగ భూధవుఁడు ప్రేమ
ననుదినంబును బాయక ఘనతఁ దలఁచి
యఖిల రాజ్యానుసంధానుఁ డగుచు నుండె.
టీక:- భగవంతుడు = హరి; అగు = అయిన; జగద్భరితున్ = నారాయణుని {జగత్భరితుడు - జగత్తును భరించెడివాడు, విష్ణువు}; అల్పంబులున్ = చిన్నవి; అధికంబులున్ = పెద్దవి; ఐన = అయినట్టి; పెక్కు = అనేకమైన; అధ్వరములన్ = యజ్ఞములచే; దర్శ = అమావాస్యనాటి యాగములు; పూర్ణిమ = పున్నమినాటి యాగములు; చేన్ = వలన; చాతుర్మాస్యములన్ = త్రికాలములందు {చాతుర్మాసములు - నాలుగు నెలలచొప్పున యుండెడి త్రికాలములు (ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము)}; అగ్నిహోత్రము = హోమము; వలనన్ = తోటి; కడకన్ = పూని; పశుసోమముల్ = పశుయాగముల {పశుసోమములు - పశువులను బలిచ్చెడి సోమములు (యజ్ఞములు)}; చేతన్ = చేత; పలుమఱు = మాటిమాటికిని; పూజించి = పూజించి; = = వేద = వేదములందు; ఉక్తము = ఉదహరింపబడినవి; ఐన = అయిన; ఆ = ఆ; విమల = స్వచ్ఛమైన; కర్మములన్ = కర్మలలో; కల్గు = ఉండెడి; ధర్మంబున్ = ధర్మములను; పురుషోత్తమ = నారాయణునికి {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; అర్పణంబుగన్ = అర్పించెడిది యగునట్లు; చేయుచున్ = చేయుచూ; మఖంబులనున్ = యాగములయందు; మంత్రములను = మంత్రములను; పలికెడు = ఉచ్చరించెడి; ఆ = ఆ.
దైవములను = బ్రాహ్మణులను; శ్రీశు = విష్ణుని {శ్రీశః- లక్మీదేవికి నాథుడు, విష్ణుసహస్రనామాలలో 606వ నామం}; అవయవంబులున్ = అవయవములు; కాగన్ = అన్నట్లు; భూధవుడు = రాజు {భూధవుడు - భూమికి భర్త, రాజు}; ప్రేమన్ = ప్రీతిపూర్వకముగ; అనుదినంబును = ప్రతిదినమును; పాయకన్ = విడువక; ఘనతన్ = గొప్పగా; తలచి = భావించుతూ; అఖిల = సమస్తమైన; రాజ్య = రాజ్యమును; అనుసంధానుడు = కూర్చెడివాడు; అగుచునుండె = అగుతుండె.
భావము:- భరతుడు లోకాలను భరించే భగవంతుణ్ణి చిన్నవి, పెద్దవి అయిన యజ్ఞాలతో ఆరాధించాడు. అమావాస్య పూర్ణిమలలో చేసే సత్కర్మలను, చాతుర్మాస్యల కాలంలో చేసే అగ్నిహోత్రాదులను ఆచరించాడు. ఇంకా పశుయాగాలను, సోమయాగాలను నిర్వర్తించాడు. వేదోక్తంగా నిర్వహించిన ఆ సత్కర్మల ఫలాన్ని పరమేశ్వరార్పణం చేసాడు. యాగాలలోను, మంత్రాలలోను పలికే దేవతలను వాసుదేవుని అవయవాలుగా భావించాడు. ఆ మహారాజు భగవంతుని గొప్పతనాన్ని తలచుకుంటూ భక్తిమయమైన హృదయంతో శ్రద్ధతో సమస్త రాజ్యాన్ని పరిపాలించాడు.
తెభా-5.1-96-క.
ఈ రీతిఁ గర్మసిద్ధుల
నారయ నత్యంత శుద్ధ మగు చిత్తముతో
నా రాచపట్టి భరతుఁడు
ధారుణిఁ బాలించె నధిక ధర్మాన్వితుఁడై.
టీక:- ఈ = ఈ; రీతిన్ = విధముగ; కర్మ = వేదకర్మములు; సిద్ధులన్ = సిద్ధించుటలను; ఆరయన్ = తరచిచూసిన; అత్యంత = మిక్కిలి; శుద్ధము = స్వచ్ఛమైనది; అగు = అయిన; చిత్తము = మనసు; తోన్ = తోటి; ఆ = ఆ; రాచపట్టి = రాకుమారుడు; భరతుడు = భరతుడు; ధారుణిన్ = భూమండలమును; పాలించెన్ = పరిపాలించెను; అధిక = మిక్కిలి; ధర్మ = ధర్మములతో; ఆన్వితుడు = కూడినవాడు; ఐ = అయ్యి.
భావము:- ఈ విధంగా పరిశుద్ధమైన చిత్తంతో, ధర్మదీక్షతో, తాను చేస్తున్న కర్మలు ఫలించే విధంగా రాకుమారుడైన భరతుడు భూమిని పాలించాడు.