Jump to content

పోతన తెలుగు భాగవతము/పంచమ స్కంధము (ప్రథమాశ్వాసము)/ఋషభుని జన్మంబు

వికీసోర్స్ నుండి


తెభా-5.1-41-ఆ.
రవరేణ్యుఁడైన నాభి సంతానార్థ
మంగనయును దాను జ్ఞపురుషుఁ
యిన వాసుదేవు తుల భక్తిశ్రద్ధ
ను జెలంగి పూజ లొరఁ జేసి.

టీక:- నర = నరులలో; వరేణ్యుడు = ఉత్తముడు; ఐన = అయిన; నాభి = నాభి; సంతాన = సంతానము; అర్థమున్ = కోసము; అంగనయున్ = భార్య; తానున్ = తను; యజ్ఞ = యజ్ఞమునకు; పురుషుడు = భర్త; అయిన = అయిన; వాసుదేవున్ = విష్ణుదేవుని; అతుల = సాటిలేని; భక్తి = భక్తితోను; శ్రద్ధలను = శ్రద్ధలతోను; చలంగి = విజృంభించి; పూజల్ = పూజలను; ఒనరన్ = చక్కగా; చేసి = చేసి.
భావము:- రాజైన నాభి తన భార్య అయిన మేరుదేవి సమేతంగా సంతానం కోసం శ్రద్ధాభక్తులతో యజ్ఞపురుషుడైన వాసుదేవుణ్ణి పూజించి…

తెభా-5.1-42-వ.
మఱియుం బ్రవర్గ్య సంజ్ఞికంబు లగు కర్మంబులు శ్రద్ధా విశుద్ధద్రవ్య దేశ కాల మంత్రర్త్విగ్దక్షిణా విధాన యోగంబులం బరమేశ్వరుని మెప్పించిన నెవ్వరికిం బ్రసన్నుండు గాని పుండరీకాక్షుండు భక్తవత్సలుం డై సురుచిరావయవంబులతో యజనశీలం బయిన యాతని హృదయంబు నందుఁ బాయని రూపంబు గలిగి మనోనయనానందకరావయవంబులు గల తన స్వరూపం బాతనికిఁ జూపం దలంచి.
టీక:- మఱియున్ = ఇంకను; ప్రవర్గ్య = ప్రవర్గ్యము యనెడి {ప్రవర్గ్యము - యాగవిశేషము, సోమయాగమునకు ముందు చేయబడునొక యజ్ఞ క్రతువు, గానమునకు ముందు గాత సంకల్పమునకు సంకేతము)}; సంజ్ఞకంబులు = పేర్లు గలవి; అగు = అయిన; కర్మంబులున్ = క్రతువులను; శ్రద్ధా = శ్రద్ధతోను; విశుద్ధ = పరిశుద్ధమైన; ద్రవ్య = పదార్థములు; దేశ = ప్రదేశములు; కాల = సమయములు; మంత్ర = మంత్ర; ఋత్విక్ = యజ్ఞములు చేయువారు; దక్షిణా = బ్రాహ్మణాదుల కిచ్చెడి ధనాదులు; విధాన = పద్ధతులు; యోగంబులన్ = యోగములచేత; పరమేశ్వరుని = భగవంతుని; మెప్పించినన్ = అనుగ్రహము వచ్చునట్లు చేసిన; ఎవ్వరికిని = ఎవరికిని; ప్రసన్నుండు = ప్రసన్నము; కాని = కానట్టి; పుండరీకాక్షుండు = విష్ణుమూర్తి {పుండరీకాక్షుడు - పుండరీకములు (పద్మముల) వంటి కన్నులు గలవాడు, విష్ణువు}; భక్త = భక్తుల ఎడ; వత్సలుండు = వాత్సల్యము గలవాడు; ఐ = అయ్యి; సు = చక్కటి; రుచిర = కాంతివంతమైన; అవయవంబుల్ = అవయవముల; తోన్ = తోటి; యజన = యజ్ఞములు చేసెడి; శీలంబున్ = స్వభావములు కలిగినది; అయిన = అయినట్టి; ఆతని = అతని యొక్క; హృదయంబున్ = హదయము; అందున్ = లోని; పాయని = విడువని; రూపంబున్ = స్వరూపము; కలిగి = కలిగిన; మనః = మనసునకు; నయనా = కన్నులకు; ఆనంద = సంతోషమును; కర = కలిగించెడి; అవయవంబుల్ = అవయవముల; కల = కలిగిన; తన = తన యొక్క; స్వరూపంబున్ = స్వరూపమును; ఆతని = అతని; కిన్ = కి; చూపన్ = చూపించవలెనని; తలంచి = భావించి.
భావము:- ఇంకా ప్రవర్గ్యా లనబడే యజ్ఞకార్యాలను శ్రద్ధతో, పరిశుద్ధ ద్రవ్యాలతో, ఉచిత ప్రదేశంలో, కాలానుగుణంగా, విధివిహితంగా మంత్రవేత్తలైన ఋత్విక్కులతో, భూరి దక్షిణలతో ఆచరించి పరమేశ్వరుని మెప్పించాడు. ఎవరికీ సులభంగా ప్రసన్నుడు కాని విష్ణువు భక్తవాత్సల్యంతో, ప్రకాశవంతమైన అవయవ సౌష్ఠవంతో హృదయంలో తాను సదా నెలకొని ఉన్నప్పటికీ ప్రత్యక్ష రూపంలో కనులకు పండువుగా, మనసుకు నిండుగా తన స్వరూపాన్ని అతనికి చూపాలనుకొని…

తెభా-5.1-43-సీ.
అంత నావిష్కృత కాంత చతుర్భుజం-
బులును బీతాంబరంబును వెలుంగ
శ్రీవత్సకౌస్తుభ శ్రీరమా చిహ్నంబు-
లుమందురమ్యమై యివు పడఁగ
శంఖ చక్ర గదాంబుజాత ఖడ్గాది ది-
వ్యాయుధంబులు చేతులందు మెఱయ
తులిత నవరత్నహాట కాంకిత నూత్న-
నకిరీటద్యుతు ల్గడలుకొనఁగఁ

తెభా-5.1-43.1-తే.
ర్ణ కుండల కటిసూత్ర నకరత్న
హార కేయూర వరనూపురాది భూష
ముల భూషితుఁడైన శ్రీనాయకుండు
దంపతుల కప్పు డెదురఁ బ్రత్యక్ష మయ్యె.

టీక:- అంతన్ = అంతట; ఆవిష్కృత = ప్రత్యక్షము చేయబడిన; కాంత = మనోహరమైన; చతుర్భుజంబులునున్ = నాలుగు చేతులును; పీత = పట్టు; అంబరంబున్ = బట్టలును; వెలుంగన్ = ప్రకాశించుతుండగా; శ్రీవత్స = శ్రీవత్సము {శ్రీవత్సము - విష్ణుమూర్తి వక్షస్థలముపైనుండెడి పుట్టుమచ్చ}; కౌస్తుభ = కౌస్తుభ మణి; శ్రీరమా = లక్ష్మీదేవి యనెడి; చిహ్నంబులు = గుర్తులు; ఉరము = వక్షము; అందున్ = పైన; రమ్యము = మనోహరముగానున్నవి; ఐ = అయ్యి; ఇరవుపడగ = నివాసము యేర్పరుచుకొనగ; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గద = గద; అంబుజాత = పద్మము; ఖడ్గ = ఖడ్గము; ఆది = మొదలగు; దివ్య = గొప్ప; ఆయుధంబులున్ = ఆయుధములు; చేతులు = చేతుల; అందున్ = లో; మెఱయన్ = ప్రకాశించుతుండగా; అతులిత = సాటిలేని; నవరత్న = నవరత్నములు; హాటక = బంగారమున; అంకిత = పొదిగిన; నూత్న = కొత్త; ఘన = గొప్ప; కిరీట = కిరీటము యొక్క; ద్యుతుల్ = కాంతులు; కడలు = దిక్కులందు; కొనగన్ = వ్యాపించగా; కర్ణకుండల = చెవులకుండలములు.
కటిసూత్ర = మొలనూలు; కనకరత్నహార = బంగారురత్నహారములు; కేయూర = భుజకీర్తులు; వర = శ్రేష్ఠమైన; నూపుర = కాలియందియలు; ఆది = మొదలగు; భూషణములన్ = అలంకారములతో; భూషితుడున్ = అలంకరింపబడినవాడు; ఐన = అయిన; శ్రీనాయకుండు = విష్ణుమూర్తి {శ్రీనాయకుండు - శ్రీ (లక్ష్మీదేవికి) నాయకుండు (ప్రభువు), విష్ణువు}; దంపతుల్ = భార్యాభర్తల; కిన్ = కి; అప్పుడు = అప్పుడు; ఎదురన్ = ఎదురుగా; ప్రత్యక్షమున్ = ప్రత్యక్షము; అయ్యెన్ = అయ్యెను.
భావము:- అప్పుడు ప్రకాశమానాలైన చతుర్భుజాలతో; పట్టు పీతాంబరంతో రమణీయాలైన శ్రీవత్సం, కౌస్తుభమణి, శ్రీదేవి విరాజిల్లే వక్షఃస్థలంతో; శంఖం, చక్రం, గద, పద్మం, ఖడ్గం మొదలైన దివ్యాయుధాలతో; సాటిలేని నవరత్నాల కాంతులను వెదజల్లే బంగారు కిరీటంతో; మకర కుండలాలు, మొలనూలు, మణులు చెక్కిన స్వర్ణహారాలు, బాహుపురులు, కాలి అందెలు ప్రకాశిస్తుండగా లక్ష్మీపతి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమైనాడు.

తెభా-5.1-44-తే.
ట్లు ప్రత్యక్షమగు పరమేశ్వరునకుఁ
బెన్నిధానంబుఁ గనుఁగొన్న పేద మాడ్కి
ర్షమున ఋత్విగాదికు వనతాస్యు
గుచు నభినుతి చేసి రిట్లనుచు నపుడు.

టీక:- ఇట్లు = ఈ విధముగ; ప్రత్యక్షమున్ = ప్రత్యక్షము; అగు = అయిన; పరమేశ్వరున్ = పరమేశ్వరుని; కున్ = కు; పెన్నిధానంబున్ = పెద్దనిధిని; కనుగొన్న = కనుక్కొన్న; పేద = పేదవాని; మాడ్కిన్ = వలె; హర్షమునన్ = సంతోషముతో; ఋత్విక్ = యజ్ఞము నడిపించువారు; ఆదికులు = మొదలగువారు; అవనత = వంచిన; ఆస్యులు = మోములు గలవారు; అగుచున్ = అగుచూ; అభినుతిచేసిరి = స్తుతించిరి; ఇట్లు = ఈ విధముగ; అనుచున్ = అనుచూ; అపుడున్ = అప్పుడు;
భావము:- ఈ విధంగా ప్రత్యక్షమైన భగవంతుణ్ణి ఋత్విక్కులు చూసి పెన్నిధిని దర్శించిన పేదలవలె సంతోషంతో తలలు వంచి ఇలా స్తోత్రం చేశారు.

తెభా-5.1-45-క.
"పరిపూర్ణుఁడ వై యుండియ
ఱువక మా పూజ లెల్ల న్నింతువు; నీ
ణార వింద సేవయు
రఁ బెద్దలు వినిచి నటుల గఁ జేసెదమౌ.

టీక:- పరిపూర్ణుడవు = పరిపూర్ణుడవు; ఐ = అయ్యి; ఉండియున్ = ఉండికూడ; మఱువక = మరచిపోకుండగ; మా = మా యొక్క; పూజలు = సేవలు; ఎల్లన్ = అన్నిటిని; మన్నింతువు = మన్నించెదవు; నీ = నీ యొక్క; చరణ = పాదములు అనెడి; అరవింద = పద్మముల; సేవయున్ = సేవించుటలు; ధరన్ = భూమిపై; పెద్దలు = పెద్దలు; వినిచినటులన్ = చెప్పిన విధముగ; తగన్ = అవశ్యము; చేసెదము = చేయుదుము; ఔ = ఔను చేసెదము.
భావము:- “నీవు పరిపూర్ణుడవై కూడా మమ్మల్ని మరచిపోకుండా మా పూజలను స్వీకరిస్తావు. పెద్దలు మాకు చెప్పిన విధంగా నీ పాదపద్మాలను సేవిస్తాము.

తెభా-5.1-46-క.
మిపుడు చేయు సంస్తుతి
నీ హిమ నెఱింగి కాదు; నిరతముఁ బెద్దల్
దా మెది యుపదేశించిరొ
యా తమునఁ బ్రస్తుతింతు య్య! మహాత్మా!

టీక:- ఏము = మేము; ఇపుడున్ = ఇప్పుడు; చేయు = చేసెడి; సంస్తుతి = స్తోత్రము; నీ = నీ యొక్క; మహిమన్ = మహత్య్యమును; ఎఱింగి = తెలిసి; కాదు = కాదు; నిరతమున్ = ఎల్లప్పుడును; పెద్దల్ = పెద్దవారు; తాము = వారు; ఎది = ఏదైతే; ఉపదేశించిరో = నేర్చుకొనునట్లు చెప్పిరో; ఆ = ఆ; మతమునన్ = విధముగా; ప్రస్తుతింతుము = స్తుతింతుము; అయ్య = తండ్రి; మహాత్మా = గొప్పవాడ.
భావము:- మహాత్మా! మే మిప్పుడు నీ మహిమలు తెలిసి సంస్తుతి చేయడం లేదు. పెద్దలు మాకు ఏ విధంగా ఉపదేశించారో ఆ విధంగా ప్రస్తుతి చేస్తున్నాము.

తెభా-5.1-47-వ.
మఱియు నీవు సంసారాసక్తమతి గలిగిన వారికి వశ్యుండవుగావు; యీశ్వరుండవును బ్రకృతి పురుష వ్యతిరిక్తుండవును బరమ పురుషుండవును నయిన నిన్నుఁ బొందని ప్రపంచాంతర్గతంబు లయిన నామరూపంబులు గల యస్మదాదులచేత నిరూపింప నశక్యంబగు; సర్వజీవులం జెందిన దురిత సంఘంబుల నిరసించు స్వభావంబు గల నీ యుత్తమ గుణంబులందు నేకదేశంబ గాని సర్వగుణనిరూపణంబు చేయ శక్యంబుగానేరదు; నీ భక్తులు మిక్కిలి భక్తింజేసి సంస్తుతించు గద్గదాక్షరంబులను సలిల శుద్ధ పల్లవ తులసీదళ దుర్వాంకురంబులను సంపాదించిన పూజను సంతసిల్లెడి నీకు బహువిధ ద్రవ్య సంపాదనంబు గలిగి విభవ యుక్తంబు లయిన యశ్వమేధాదులును దృప్తికరంబులు గానేరవు స్వభావంబున సర్వకాలంబులందును సాక్షాత్కరించి యతిశయంబై వర్తించుచు నశేషపురుషార్థ స్వరూపంబుఁ బరమానంద రూపంబు నైనవాఁడ వగుటం జేసి యజ్ఞాదుల యందు నీకుఁ దృప్తి లేక యున్న నస్మదాదుల కోరికల కుపచరించు కతంబున యజ్ఞాదుల నొనరింతు; మని మఱియు నిట్లనిరి.
టీక:- మఱియున్ = ఇంకను; నీవున్ = నీవు; సంసార = సంసారమునందు; ఆసక్త = ఆసక్తిగల; మతిన్ = బుద్ధి; కలిగిన = కలిగిన; వారి = వారి; కిన్ = కి; వశ్యుండవు = వశమగువాడవు; కావు = కావు; ఈశ్వరుండవును = ప్రభువునవు; ప్రకృతిపురుషువ్యతిరిక్తుండవును = ప్రకృతి పురుషలకు అతీతమైనవాడవు; పరమపురుషుండవును = అత్యుత్తమ పురుషుడవును; అయిన = అయినట్టి; నిన్నున్ = నిన్ను; పొందని = పొందని; ప్రపంచ = ప్రపంచము యొక్క; అంతర్గతంబులు = లోపల ఉండునవి; అయిన = అయినట్టి; నామ = పేర్లు; రూపంబులున్ = స్వరూపములు; కల = కలిగినట్టి; అస్మదాదుల్ = నావంటివారి; చేతన్ = వలన; నిరూపింపన్ = నిరూపించుటకు; అశక్యంబు = అసాధ్యము; అగు = అగును; సర్వ = సకల; జీవులన్ = ప్రాణులను; చెందిన = చెందినట్టి; దురిత = పాపముల యొక్క; సంఘంబులన్ = సమూహములను; నిరసించు = తిరస్కరించెడి; స్వభావంబున్ = స్వభావము; కల = కలిగిన; నీ = నీ యొక్క; ఉత్తమ = ఉత్తమమైన; గుణంబుల్ = గుణములు; అందున్ = లలో; ఏకదేశంబ = అనన్యముగ, ఒక భాగము లేక అంశము మాత్రమె; కాని = కాని; సర్వ = సకల; గుణ = గుణములను; నిరూపణంబున్ = నిరూపించుటకు; చేయన్ = చేయుటకు; శక్యంబున్ = సాధ్యము; కాదు = కాదు; నీ = నీ యొక్క; భక్తులు = భక్తులు; మిక్కిలి = అధికమైన; భక్తిన్ = భక్తి; చేసి = వలన; సంస్తుతించు = స్తుతించెడి; గద్గద = బొంగురుపోతున్న గొంతుతో పలికెడి; అక్షరంబులను = పలుకులను; సలిల = నీరు; శుద్ధ = స్వచ్ఛమైన; పల్లవ = చిగుర్లు; తులసీదళ = తులసీ దళములు; దూర్వాంకురంబులును = గరిక మొలకలు; సంపాదించిన = సమీకరించికొని చెసిన; పూజనున్ = పూజలతో; సంతసిల్లెడి = సంతోషించెడి; నీకున్ = నీకు; బహు = అనేక; విధ = రకముల; ద్రవ్య = పదార్థములను; సంపాదనంబున్ = సమీకరించుకొనుట; కలిగి = కలిగి; విభవ = వైభవముతో; యుక్తంబులు = కూడుకొన్నవి; అయిన = అయినట్టి; అశ్వమేధ = అశ్వమేధము; ఆదులన్ = మొదలగువానిచే; తృప్తి = తృప్తిని; కరంబులునున్ = కలిగించునవి; కానేరవు = కాలేవు; స్వభావమునన్ = స్వభావము నందు; సర్వ = సకల; కాలంబుల్ = కాలముల; అందునున్ = లోను; సాక్షాత్కరించి = సాక్షాత్కరించి; అతిశయంబు = అతిశయించినది; ఐ = అయ్యి; వర్తించుచున్ = వర్తించెడి; అశేష = సమస్తమైన; పురుషార్థంబున్ = ధర్మార్థ కామ మోక్ష ప్రయోజనముల; స్వరూపంబున్ = స్వరూపమును; పరమ = అత్యధికమైన; ఆనంద = ఆనందము యొక్క; రూపంబున్ = స్వరూపమును; ఐన = అయినట్టి; వాడవు = వాడవు; అగుటన్ = అగుట; చేసి = వలన; యజ్ఞ = యజ్ఞములు; ఆదులన్ = మొదలగువాని; అందున్ = అందు; నీకున్ = నీకు; తృప్తి = తనివినొందుట; లేక = లేకుండగ; ఉన్నన్ = ఉండికూడ; అస్మదాదులన్ = నాలాంటివారి; కోరికల్ = కోరికల; కున్ = కు; ఉపచరించు = సమ్మతించు, ఉపకరించు; కతంబునన్ = కారణముచేత; యజ్ఞ = యజ్ఞములు; ఆదులన్ = మొదలగువానిని; ఒనరింతుము = ఆచరింతుము; అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ఇంకా సంసారంలో మునిగి తేలే వారికి నీవు పట్టుబడవు. నీవు ఈశ్వరుడవు. ప్రకృతి కంటే జీవుని కంటే భిన్నమయినవాడవు. పరమ పురుషుడవు. మేము పంచభూతాల సృష్టికి లోనైన నామరూపాలను ధరించిన వాళ్ళం. అటువంటి మాకు నీ తత్త్వాన్ని నిరూపించడం సాధ్యం కాదు. సకల జీవరాసుల పాపసమూహాలను తొలగించడం నీ స్వభావం. అటువంటి నీ ఉత్తమ గుణాలలో ఏదో ఒక అంశమే కాని సమస్త గుణాలను నిరూపించడం ఎవరికీ ఏమాత్రం సాధ్యం కాదు. నీ భక్తులు భక్తితో గద్గద స్వరంతో సంస్తుతిస్తూ, నీ కర్పించే నిర్మల జలం, చిగురుటాకులు, తులసీదళాలు, దూర్వాంకురాలు మొదలైన వాటితో నీవు సంతృప్తి పడతావు. అంతేకాని నానావిధ ద్రవ్యాలు సంతరించికొని మహా వైభవంతో చేసే అశ్వమేధాది యాగాలు కూడా నీకు సంతృప్తిని కలిగించవు. స్వాభావికంగానే నీవు సర్వకాలాలలోను సాక్షాత్కరిస్తావు. నీవు సర్వాతిశాయివి. సమస్త పురుషార్థాలు నీవే. పరమానంద స్వరూపుడవైన నీకు యజ్ఞయాగాదుల వల్ల తృప్తి లేకున్నా మా కోరికలను తీర్చుకోవడానికి మేము యజ్ఞాలను చేస్తున్నాము” అని ఇంకా ఇలా అన్నారు.

తెభా-5.1-48-క.
"బాలిశుల మగుచు మిక్కిలి
మే లెఱుగని మమ్ము నీదు మించిన దయచేఁ
బాలింతు విత్తు వెప్పుడుఁ
జాలఁగ నిహపరములందు కల సుఖములున్.

టీక:- బాలిశులము = మూర్కులము; అగుచున్ = అగుచూ; మిక్కిలి = అధికమైన; మేలు = మంచి; ఎఱుగని = తెలియని; మమ్మున్ = మమ్ములను; నీదు = నీ యొక్క; మించిన = అతిశయించిన; దయ = కృప; చేన్ = తోటి; పాలింతువు = పరిపాలించెదవు; ఇత్తువు = ఇచ్చెదవు; ఎపుడున్ = ఎల్లప్పుడును; చాలగన్ = అదికముగా; ఇహ = ఇహలోకము; పరములు = పరలోకమున; అందున్ = లోను; సకల = సమస్తమైన; సుఖములన్ = సౌఖ్యములను.
భావము:- మూర్ఖులమైన మాకు ఏది మంచిదో ఏది కాదో మాకే తెలియదు. అయినా ఎంతో దయతో మమ్మల్ని కాపాడి ఇహపరాలకు తగిన సకల సుఖాలను నీవు మాకు ప్రసాదిస్తున్నావు.

తెభా-5.1-49-ఆ.
పుడు మేము నీకు నిష్టంబు లగు పూజ
లాచరింపకున్న నైన నధిక
యిన నీ కృపాకటాక్ష వీక్షణములఁ
క్కఁ జూచి తగఁ బ్రన్నుఁ డగుచు.

టీక:- ఇపుడున్ = ఇప్పుడు; మేమున్ = మేము; నీకున్ = నీకు; ఇష్టంబులు = ప్రీతికరములు; అగు = అయిన; పూజలున్ = పూజలను; ఆచరింపకున్నన్ = ఆచరింపకపోయి; ఐననున్ = అయినను; అధికమయిన = మిక్కిలి; నీ = నీ యొక్క; కృపా = దయతోకూడిన; కటాక్ష = కడగంటి; వీక్షణములన్ = చూపులతో; చక్కన్ = చక్కగా; చూచి = చూసి; తగన్ = అవశ్యము; ప్రసన్నుడు = ప్రసన్నమైనవాడు; అగుచున్ = అగుచూ.
భావము:- ఇప్పుడు మేము నీకు సంతృప్తి కలిగేటట్లు ఇష్టమైన పూజలు చేయక పోయినా మా మీద కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరింప జేసి ప్రసన్నుడవైనావు.

తెభా-5.1-50-క.
మీయఁ దలఁచి మమ్ముం
రుణించితి గాక; నిన్నుఁ నుగొనుటకునై
సి నుతింపఁగ మాకుం
మగునే? వరద! నీరశ్యామాంగా!

టీక:- వరమున్ = వరములను; ఈయన్ = ఇవ్వవలెనని; తలచి = భావించి; మమ్మున్ = మమ్ములను; కరుణించితి = దయచూపితివి; కాక = అంతేకాని; నిన్నున్ = నిన్ను; కనుగొనుట = తెలిసికొనుట; కున్ = కోసము; ఐ = అయ్యి; అరసి = తరచిచూసుకొని; నుతింపగన్ = స్తుతించుటకు; మాకున్ = మాకు; తరమున్ = సాధ్యము; అగునే = అగునా ఏమి; వరద = నారాయణ {వరద - వరములను ద (ఇచ్చువాడు), విష్ణువు}; నీరదశ్యామాంగా = నారాయణ {నీరద శ్యామాంగ - నీరదము (మేఘము) వంటి శ్యామాంగ (నల్లని దేహము గలవాడు), విష్ణువు}.
భావము:- కోరిన కోరికలను అనుగ్రహించేవాడా! నీలమేఘం వంటి శరీరచ్ఛాయ కలవాడా! వరమివ్వడానికి నీవు మా ముందు సాక్షాత్కరించావు. నిన్ను సందర్శించడానికి కాని సంస్తుతించడానికి కాని మాకు సాధ్యమౌతుందా?

తెభా-5.1-51-వ.
మఱియు, నిస్సంగులై నిశితజ్ఞానంబునంజేసి దోషరహితులై భగవత్స్వభావులు నాత్మారాములు నగు మునులకు స్తుతియింపఁ దగిన గుణంబులు గలవాడ వగుచుండియుఁ బ్రసన్నుండవు; స్ఖలన క్షుత పతన జృంభణాది దురవస్థ లందును జరామరణాది దుర్దశలందును వివశుల మగు మాకుఁ గల్మష నాశకరంబులయిన భవద్దివ్యనామంబులు మా వచనగోచరంబులగుం గాక; మఱియు నీ రాజర్షి పుత్రకాముండై నీ తోడ సమానుండయిన కుమారునిం గోరి కామంబుల స్వర్గాపవర్గంబుల నీనోపిన నినుం బూజించి ధనకాముం డైనవాఁడు ధనవంతునిం జేరి తుషమాత్రం బడిగిన చందంబున మోక్షనాథుండ వైన నీవలన సంతానంబు గోరుచున్నవాఁడు; జయింపరాని నీ మాయ చేత నెవ్వండు మోహంబు నొంది విషయాసక్తుండు గాక యుండు? నర్థకాములము మదాంధులము నగు మేము నిన్ను నాహ్వానంబు చేసిన యపరాధంబు సర్వాత్మకుండ వగుటం జేసి సామ్యంబుచే మన్నింప దగుదువు; మమ్ము దయఁ జూడు"మని ప్రణమిల్లిన సర్వేశ్వరుండు వర్షాధిపతి యగు నాభిచేతను, ఋత్విక్కులచేతను, వంద్యమానుండై దయాకలితుం డగుచు యిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; నిస్సంగులు = విరాగులు {నిస్సంగులు – సాంగత్యముసు అన్నింటిని విసర్జించినవారు, విరాగులు}; నిశిత = వాడియైన; జ్ఞానంబునన్ = జ్ఞానము; చేసి = వలన; దోష = పాపములు; రహితులు = లేనివారు; ఐ = అయ్యి; భగవత్ = భగవంతుని వంటి; స్వభావులు = స్వభావములు గలవారు; ఆత్మారాములు = ఆనందము ఆత్మగా కలవారు; అగు = అయిన; మునులు = మునుల; కున్ = కు; స్తుతియింపన్ = స్తుతించుటకు; తగిన = తగినట్టి; గుణంబులున్ = సుగుణములు; కలవాడవు = కలిగినవాడవు; అగుచుండియు = అయినప్పటికిని; ప్రసన్నుండవు = ప్రసన్నమైనవాడవు; స్ఖలన = జారుట; క్షుత = తుమ్ముట; పతన = పడుట; జృంభణ = ఆవులింతలు; ఆది = మొదలగు; దురవస్థలు = చెడుస్థితుల; అందునున్ = లోను; జర = ముసలితనము; మరణ = మరణము; ఆది = మొదలగు; దుర్దశల్ = చెడు సమయములు; అందున్ = లోను; వివశులము = స్వాధీనము తప్పెడి వారము; అగు = అయిన; మాకున్ = మాకు; కల్మష = పాపములను; నాశ = నాశనము; కరంబులు = చేసెడివి; అయిన = అయినట్టి; భవత్ = నీ యొక్క; దివ్య = దివ్యమైన; నామంబులు = నామములు; మా = మా యొక్క; వచన = మాటలకు; గోచరంబులున్ = అందునవి; అగుగాక = అగుగాక; మఱియున్ = ఇంకను; ఈ = ఈ; రాజర్షి = రాజులలో ఋషివంటివాడు; పుత్ర = కొడుకులను; కాముండు = కోరెడివాడు; ఐ = అయ్యి; నీ = నీ; తోడన్ = తోటి; సమానుండు = సమానమైనవాడు; అయిన = అయినట్టి; కుమారునిన్ = పుత్రుని; కోరి = కోరుతూ; కామంబులన్ = కోరికలను; స్వర్గ = స్వర్గము; అపవర్గంబుల్ = ముక్తులను; ఈన్ = ఇచ్చుటకు; ఓపిన = సమర్థత కలిగిన; నినున్ = నిన్ను; పూజించి = సేవించి; ధన = సంపదలను; కాముండు = కోరెడివాడు; ఐన = అయిన; వాడు = వాడు; ధనవంతునిన్ = భాగ్యశాలిని; చేరి = సమీపించి; తుష = వట్టి ఊకను; మాత్రంబున్ = మాత్రమే; అడిగిన = కోరిన; చందంబునన్ = వలె; మోక్ష = ముక్తికి; నాథుండవు = ప్రభువు; ఐన = అయిన; నీ = నీ; వలనన్ = వలన; సంతానంబున్ = సంతానమును; కోరుచున్నవాడు = కోరెడివాడు; జయింపరాని = జయించుటకు సాధ్యముగాని; నీ = నీ యొక్క; మాయన్ = మాయ; చేతన్ = వలన; ఎవ్వండున్ = ఎవడైతే; మోహంబున్ = మోహమును; ఒంది = పొంది; విషయ = విషయములు యందు; ఆసక్తుండు = ఆసక్తిగలవాడు; కాక = కాకుండగా; ఉండు = ఉండెడి; అర్థ = సంపదలను; కాములము = కోరెడివారము; మద = గర్వముతో; అంధులము = గుడ్డివారము; అగు = అయిన; మేమున్ = మేము; నిన్నున్ = నిన్ను; ఆహ్వానంబు = ఆహ్వానించుట; చేసిన = చేసినట్టి; అపరాధంబున్ = తప్పులను; సర్వ = నిఖిలమైన జీవుల; ఆత్మకుండు = ఆత్మలయందు ఉండెడివాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; సామ్యంబున్ = సమదృష్టి; చేన్ = తోటి; మన్నింపన్ = మన్నించుటకు; తగుదువు = తగినవాడవు; మమ్మున్ = మమ్ములను; దయన్ = కృపతో; చూడుము = చూడుము; అని = అని; ప్రణమిల్లిన = నమస్కరించిన; సర్వేశ్వరుండు = నారాయణుడు {సర్వేశ్వరుడు - అఖిలమైనవారికిని ఈశ్వరుడు, విష్ణువు}; వర్ష = వర్షములకు; అధిపతి = అధికారి; అగు = అయిన; నాభి = నాభి; చేతను = చేతను; ఋత్విక్కుల్ = యజ్ఞము నడపెడివారి; చేతను = చేతను; వంద్యమానుండు = వందనముచేయబడినవాడు; ఐ = అయ్యి; దయా = కృప; కలితుండు = కలిగినవాడు; అగుచున్ = అగుచూ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇంకా మునులు కోరికలు లేనివారు. సునిశ్చితమైన జ్ఞానం కలవారు. దోషాలు లేనివారు. భగవంతుని ప్రతిరూపాలు. ఆత్మారాములు. అలాంటి మునులకు స్తోత్రార్హుడ వైనప్పటికీ అందరిపట్ల అనుగ్రహం చూపుతున్నావు. కాలు జారినప్పుడు, క్రింద పడ్డప్పుడు, తుమ్మినప్పుడు, ఆవులించినప్పుడు, జ్వరంతో పీడింపబడుతున్నపుడు, చావుకు చేరువ అయినప్పుడు, మా మీద మాకే అధికారం తప్పినప్పుడు మా పాపాలను పోగొట్టే నీ దివ్యనామాలు మా నోటివెంట వెడలే విధంగా అనుగ్రహించు. ఈ రాజర్షి అయిన నాభి నీకు సమానమైన సంతానం కావాలని నిన్ను పూజించాడు. కోరిన కోరికలను, స్వర్గాన్ని, మోక్షాన్ని సైతం ఇవ్వగల నిన్ను ఇలా అడగడం ధనం కోసం ధనవంతుని దగ్గరకు వెళ్ళి ఊక అడిగినట్టుంది. మోక్ష ప్రదాతవైన నిన్ను సంతానం కోసం ప్రార్థిస్తున్నాడు. మీ మాయ దాటరానిది. అలాంటి మాయకు లోబడి ఇంద్రియ కాంక్షలకు లోనుకాని వా డెవడు? ప్రతి పనిని ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని చేసేవాళ్ళం మేము. గర్వాంధులము. అయినా నిన్ను ఆహ్వానించిన మా అపరాధాన్ని మన్నించు. మమ్ము అనుగ్రహించు” అని నమస్కరించారు. అప్పుడు సర్వేశ్వరుడు జంబూద్వీపంలోని ఒక వర్షానికి అధిపతి అయిన నాభి ఋత్విక్కులతో కలిసి చేసిన వందనాలు అందుకొంటూ దయతో ఇలా అన్నాడు.

తెభా-5.1-52-క.
"మునులార! వేదవాక్యము
ను బ్రస్తుతి చేసి సర్వక్షణముల నా
కె యగు పుత్రుని నిమ్మని
వినఁ బలికితి రిపుడు మిగుల వేడుకతోడన్

టీక:- మునులార = ఓ మునులు; వేద = వేదము లందలి; వాక్యములను = పలుకులతో; ప్రస్తుతి = స్తోత్రము; చేసి = చేసి; సర్వ = సకలమైన; లక్షణములన్ = లక్షణములలోను; నా = నా; కున్ = కు; ఎనయు = సాటి; అగు = అయిన; పుత్రునిన్ = కుమారుని; ఇమ్ము = ఇవ్వవలసినది; అని = అని; వినబలికితిరి = అడిగితిరి; ఇపుడున్ = ఇప్పుడు; మిగులన్ = మిక్కిలి; వేడుక = సంతోషము; తోడన్ = తోటి.
భావము:- “మునులారా! నన్ను వేదమంత్రాలతో ప్రస్తుతి చేసి సకల లక్షణాలలో నాకు సాటి అయిన కొడుకును నాభికి ప్రసాదించవలసిందిగా ఎంతో కుతూహలంతో నన్ను కోరారు.

తెభా-5.1-53-క.
నాకాది లోకములలో
నాకున్ సరివచ్చు నట్టి నందను నెటు నా
లోకింప లేరు; గావున
నాకున్ సరి నేన కా మమున నెఱుఁగుఁడీ.

టీక:- నాక = స్వర్గము; ఆది = మొదలగు; లోకములలోన్ = లోకము లయందు; నాకున్ = నాకు; సరివచ్చునట్టి = సాటి ఐనట్టి; నందనున్ = పుత్రుని; ఎటున్ = ఏ విధముగను; ఆలోకింపలేరు = చూడలేరు; కావునన్ = కనుక; నాకున్ = నాకు; సరి = సాటి; నేన = నేను మాత్రమే; కాన్ = అయినట్లు; మనమునన్ = మనసులలో; ఎఱుగుడీ = తెలిసికొనండి.
భావము:- స్వర్గాది లోకాలలో నాకు సాటి రాదగ్గ కుమారుడు ఎక్కడా కనిపించడు. నాకు సాటి నేనే అని మీరు తెలుసుకొనండి.

తెభా-5.1-54-వ.
అదియునుం గాక భూసురోత్తములు నా ముఖంబగుటం జేసి విప్రవాక్యంబు దప్పింపరాదు; మీరు నా యీడు కుమారు నడిగితిరి గావున నాభిపత్ని యగు మేరుదేవి యందు నేన పుత్రుండనై జనియించెద"నని పలికి పరమేశ్వరుం డాగ్నీధ్రీయపత్ని యగు మేరుదేవి చూచుచుండ నా యజ్ఞంబున నంతర్ధానంబు నొంది యా నాభిమీఁది దయం జేసి దిగంబరులును దపస్వులును జ్ఞానులును నూర్ధ్వరేతస్కులును నగునైష్ఠికులకు యోగధర్మంబుల నెఱింగింపం దలంచి పుండరీకాక్షుండు నాభిపత్నియగు మేరుదేవి గర్భాగారంబునం బ్రవేశించె; నంత.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ; భూసుర = బ్రాహ్మణులలో {భూసురులు - భూమిపైన సురులు (దేవతలు), బ్రాహ్మణులు}; ఉత్తములు = ఉత్తములు; నా = నా యొక్క; ముఖంబున్ = ముఖము; అగుటన్ = అగుట; చేసి = వలన; విప్ర = బ్రాహ్మణుల; వాక్యంబున్ = వాక్కు; తప్పింపన్ = తప్పించుటకు; రాదు = వీలుకాదు; మీరు = మీరు; నా = నా యొక్క; ఈడు = సాటి అగు; కుమారున్ = పుత్రుని; అడిగితిరి = అడిగినారు; కావునన్ = కనుక; నాభి = నాభి యొక్క; పత్ని = భార్య; అగు = అయిన; మేరుదేవి = మేరుదేవి; అందున్ = అందు; నేన = నేనే; పుత్రుడను = కుమారుడను; ఐ = అయ్యి; జనియించెదన్ = పుట్టెదను; అని = అని; పలికి = పలికి; పరమేశ్వరుండు = నారాయణుడు {పరమేశ్వరుడు - పరమమైనట్టి ఈశ్వరుడు, విష్ణువు}; ఆగ్నీధ్రీయ = ఆగ్నీధ్రుని పుత్రుని; పత్ని = భార్య; అగు = అయిన; మేరుదేవి = మేరుదేవి; చూచుచుండన్ = చూస్తుండగా; ఆ = ఆ; యజ్ఞంబునన్ = యజ్ఞము నందు; అంతర్ధానంబున్ = మాయ మగుటను; ఒంది = పొంది; ఆ = ఆ; నాభి = నాభి; మీది = పైనున్న; దయన్ = దయ; చేసి = వలన; దిగంబరులునున్ = అవధూతలు {దిగంబరులు - దిక్కులే అంబరము (బట్టలు)గా గలవారు, బట్టలుకట్టనివారు, అవధూతలు}; తపస్వులును = మునులు; జ్ఞానులును = మిక్కిలి జ్ఞానముగలవారు; ఊర్థ్వరేతస్కులును = బ్రహ్మచారులు {ఊర్థ్వరేతస్కులు - పైకి మరలించబడిన ఇంద్రియములు కలవారు, బ్రహ్మచారులు}; అగు = అయిన; నైష్ఠికుల్ = నిష్ఠ గలవారల; కున్ = కు; యోగ = యోగము యొక్క; ధర్మంబులన్ = లక్షణములను; ఎఱిగింపన్ = తెలుప; తలంచి = భావించి; పుండరీకాక్షుండు = హరి; నాభి = నాభి యొక్క; పత్ని = భార్య; అగు = అయిన; మేరుదేవి = మేరుదేవి; గర్భాగారంబునన్ = గర్భాశయములో; ప్రవేశించెన్ = ప్రవేశించెను; అంతన్ = అంతట.
భావము:- అంతేకాక బ్రాహ్మణులు నాకు ముఖం వంటివారు కనుక వారి మాట దాటడానికి వీలుకానిది. మీరు నాకు సమానుడైన కుమారుణ్ణి కోరారు. అందుచేత ఈ నాభి మహారాజు భార్య అయిన మేరుదేవికి నేనే కొడుకునై జన్మిస్తాను” అని నాభి, మేరుదేవి చూస్తుండగా యజ్ఞంలో అంతర్ధాన మయ్యాడు. ఆ తర్వాత దిగంబరులు, తాపసులు, జ్ఞానులు, ఊర్ధ్వరేతస్కులు అయిన నైష్ఠికులకు యోగధర్మాలు బోధించడానికి నాభి మీద దయతో విష్ణువు మేరుదేవి గర్భంలో ప్రవేశించాడు. అప్పుడు…

తెభా-5.1-55-ఆ.
మేరుదేవియందు మేరుధీరుం డగు
రి సమస్త లక్షణాన్వితుండు
మదమాదిగుణ విశారదుం డుదయించె
కలజనుల కపుడు సంతసముగ.

టీక:- మేరుదేవి = మేరుదేవి; అందున్ = అందు; మేరు = మేరునగము అంతటి; ధీరుండు = ధీరత్వము గలవాడు; అగు = అయిన; హరి = విష్ణువు; సమస్త = సమస్తమైన; లక్షణ = లక్షణములను; ఆన్వితుండు = కూడినవాడు; శమదమాది = శమదమాది; గుణ = సుగుణములతో; విశారదుండు = నేర్పరి ఐనవాడు; ఉదయించెన్ = పుట్టెను; సకల = అఖిలమైన; జనులు = వారల; కిన్ = కి; అపుడున్ = అప్పుడు; సంతసముగ = సంతోషము కలుగ.
భావము:- సమస్త శుభలక్షణాలు కలవాడు, శమదమాది గుణ సంపన్నుడు, మేరుధీరుడు అయిన శ్రీహరి మేరుదేవికి కుమారుడుగా అవతరించాడు. సమస్త జనులు సంతోషించారు.

తెభా-5.1-56-ఆ.
వళ కాంతియుక్తిఁ నరు దేహంబును
హిత బలపరాక్రమంబు వీర్య
మును దలంచి చూచి కుండు పేరిడె
సుతుని ఋషభుఁ డనుచు సొంపుతోడ.

టీక:- ధవళ = తెల్లని; కాంతి = ప్రకాశముతో; యుక్తిన్ = కూడి; తనరు = అతిశయించెడి; దేహంబునున్ = శరీరము; మహిత = గొప్ప; బల = శక్తి; పరాక్రమంబున్ = పరాక్రమములు; వీర్యమున్ = శౌర్యములు; తలంచి = ఆలోచించి; చూచి = చూసి; జనకుండు = తండ్రి; పేరు = పేరు; ఇడెన్ = పెట్టెను; సుతుని = పుత్రుని; ఋషభుడు = ఋషభుడు; అనుచున్ = అని; సొంపు = చక్కదనము; తోడన్ = తోటి.
భావము:- పుట్టిన శిశువు వెలుగులు వెదజల్లుతూ ఉండడం గమనించి, అతడు బలవంతుడని, పరాక్రమవంతుడని, శౌర్య కలవాడని అర్థం చేసికొని నాభి తన కుమారునికి “ఋషభుడు” అని పేరు పెట్టాడు.