పోతన తెలుగు భాగవతము/పంచమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సుమతి వంశవిస్తారము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-5.2-3-క.
మునులార! బాదరాయణి
ఘాత్మకుఁడైన యుత్త రాత్మజునకు స
ద్వియోక్తి భరతుచరితము
వినిపించుచు మఱియు నిట్లు వినిపించెఁ దగన్.

టీక:- మునులారా = ఓ మునులూ; బాదరాయణి = శుకుడు {బాదరాయణి - బాదరాయణుని పుత్రుడు, శుకుడు}; అనఘాత్ముడు = పుణ్యాత్ముడు {అనఘాత్ముడు - అనఘ (పాపములేని) ఆత్ముడు (ఆత్మ గలవాడు), పుణ్యాత్ముడు}; ఐన = అయినట్టి; ఉత్తరాత్మజున్ = పరీక్షితున {ఉత్త రాత్ముజుడు - ఉత్తర యొక్క ఆత్మజుడు, పరీక్షిత్తు}; కున్ = కు; సత్ = మంచి; వినయ = వినయముతో కూడిన; ఉక్తి = పలుకులతో; భరతు = భరతుని యొక్క; చరితము = కథను; వినిపించుచు = చెప్పుతూ; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; వినిపించెన్ = చెప్పెను; తగన్ = చక్కగా;
భావము:- “మునులారా! బాదరాయణుని కుమారుడైన శుకమహర్షి పుణ్యాత్ముడు, ఉత్తర యొక్క కుమారుడు అయిన పరీక్షిత్తునకు భరతుని చరిత్రను చక్కగా వినిపించి ఇలా అన్నాడు.

తెభా-5.2-4-ఆ.
పార్థివేంద్ర! యిట్లు రతాత్ముజుండైన
"సుతి"ధర్మవర్తమునఁ దిరుగ
ది యెఱింగి దుష్టులైన పాషాండులు
మమతంబు మిగులఁ లఁచి పొగడి.

టీక:- పార్థివేంద్ర = మహారాజ {పార్థివేంద్రుడు - రాజులలో ఇంద్రునివంటివాడు, రాజు}; ఇట్లు = ఈ విధముగ; భరత = భరతుని యొక్క; ఆత్మజుండు = పుత్రుడు; ఐన = అయినట్టి; సుమతి = సుమతి; ధర్మ = ధర్మబద్ధమైన; వర్తనమున = మార్గమున; తిరుగునది = ప్రవర్తించుటను; ఎఱింగి = తెలిసి; దుష్టులు = చెడ్డవారు; ఐన = అయినట్టి; పాషండులు = వేదమార్గము నిందించువారు; తమ = తమ యొక్క; మతంబు = మత ధర్మములను; మిగులన్ = అధికముగ; తలచి = భావించుతూ; పొగడి = స్తుతించి;
భావము:- “రాజేంద్రా! ఆ విధంగా భరతుని యొక్క కుమారుడైన "సుమతి"ధర్మయుక్తంగా గడుపుతుండగా అది తెలిసికొన్న దుర్మార్గులైన పాషండులు తమ మతాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో అతనిని చేరి పొగడి…

తెభా-5.2-5-క.
ణీవల్లభ! నిన్నును
నితంబును బుద్ధదేవునిం గొలిచిన యా
తెఱఁగునఁ గొలిచెద మని భా
సుమతి బోధించి రపుడు సుమతిం బ్రీతిన్

టీక:- ధరణీవల్లభ = రాజ {ధరణీ వల్లభుడు - ధరణి (భూమి)కి వల్లభుడు (ప్రభువు), రాజు}; నిన్నునున్ = నిన్నుకూడ; నిరతంబునున్ = ఎల్లప్పుడును; బుద్ద = బుద్దుడు యనెడి {బుద్ధుడు - 1ఆదిబుద్దుడు ఋషభుడు (సుగతుడు), 2రెండవ బుద్ధుడు భరతుడు (సద్గతుడు), 3మూడవ బుద్ధుడు సుమతి (రెండవ సుగతుడు), ... 6ఆరవ బుద్ధుడు గౌతమ బుద్దుడు (తథాగతుడు), 7ఏడవ బుద్ధుడు మైత్రేయ బుద్ధుడు (భవిష్యత్తులో రాబోవువాడు)}; దేవునిన్ = దేవుడిని; కొలచిన = పూజించెడి; ఆ = ఆ; తెఱంగునన్ = విధముగ; కొలిచెదము = పూజించెదము; అని = అని; భాసుర = ప్రకాశమైన; మతిన్ = భావములతో; బోధించిరి = తెలియజేసిరి; అపుడున్ = అప్పుడు; సుమతిన్ = సుమతికిని; ప్రీతిన్ = ఇష్టముగ;
భావము:- “మహారాజా! మేము నిన్ను కూడా నిత్యం బుద్ధదేవుణ్ణి కొలిచినట్లుగా సేవిస్తాము” అంటూ ప్రియోక్తులు పలికి తెలివితేటలను ప్రదర్శిస్తూ సుమతికి బోధనలు చేశారు.

తెభా-5.2-6-వ.
ఇట్లు పాషాండబోధితుండైన సుమతికి ధ్రువసేన యందు దేవతాజిత్తను పుత్రుండు జనించె; వానికి దేవద్యుమ్నుండను సత్పుత్రుం డాసురి యందుదయించె; నమ్మహాత్మునకు ధేనుమతి యందుఁ బరమేష్ఠి జనియించె; నతనికి సువర్చల యందుఁ బ్రతీహుం డనువాఁడు సుతుం డయ్యె; యప్పరమ పురుషుండు సకలజనులకు బ్రహ్మోపదేశంబు జేసి తాను శుద్ధాత్ముండై హరిస్మరణ జేయుచు యజ్ఞకరణ నిపుణు లగు ప్రతిహర్త ప్రస్తోత యుద్గాత యను సత్పుత్రులం గాంచెను; ఆ ప్రతిహర్తకు నుతి యందు వ్యోమ భూమ నామక పుత్రద్వయం బుత్పన్నం బయ్యె; నందు భూమునకు ఋషికుల్య యందు నుద్గీథుం డను సుతుండు జనించె; నతనికి దేవకుల్య యందుఁ బ్రస్తోత గలిగె; యా ప్రస్తోతకు వరరుత్స యందు విభుం డను తనయుం డుద్భవించె; నతనికి భారతి యందుఁ బృథుషేణుం డుదయించె; యతనికి నాకూతి యందు నక్తుండు గలిగె; యా నక్తునకు రాజర్షి శ్రేష్ఠుండగు గయుం డను మహాకీర్తి సంపన్నుం డుదయించె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; పాషాండ = పాషాండమార్గమును; బోధితుండు = ప్రేరింపబడినవాడు; ఐన = అయినట్టి; సుమతి = సుమతి; కిన్ = కి; ధ్రువసేన = ధ్రువసేన; అందున్ = వలన; దేవతాజిత్తు = దేవతాజిత్తు; అను = అనెడి; పుత్రుండు = కుమారుడు; జనించె = పుట్టెను; వానికిన్ = వానికి; దేవద్యుమ్నుండు = దేవద్యుమ్నుండు; అను = అనెడి; సత్ = మంచి; పుత్రుండు = కుమారుడు; ఆసురి = ఆసురి; అందున్ = వలన; ఉదయించెన్ = పుట్టెను; ఆ = ఆ; మహాత్మున్ = గొప్పవాని; కిన్ = కి; ధేనుమతి = ధేనుమతి; అందున్ = వలన; పరమేష్ఠి = పరమేష్ఠి; జనియించెన్ = పుట్టెను; అతని = అతని; కిన్ = కి; సువర్చల = సువర్చల; అందున్ = వలన; ప్రతీహుండు = ప్రతీహుండు; అనువాడు = అనెడివాడు; సుతుండు = కుమారుడు; అయ్యెన్ = పుట్టెను; ఆ = ఆ; పరమ = గొప్ప; పురుషుండు = కుమారుడు; సకల = సమస్తమైన; జనుల్ = ప్రజల; కున్ = కు; బ్రహ్మోపదేశంబున్ = బ్రహ్మజ్ఞానము ఉపదేశించుట; చేసి = వలన; తానున్ = తాను; శుద్ధ = పరిశుద్ధమైన; ఆత్ముండు = ఆత్మ గలవాడు; ఐ = అయ్యి; హరిన్ = విష్ణుమూర్తిని; స్మరణ = ధ్యానము; చేయుచున్ = చేయుచూ; యజ్ఞ = యజ్ఞములను; కరణ = చేయుట యందు; నిపుణులు = మిక్కిలి నైపుణ్యము గలవారు; అగు = అయినట్టి; ప్రతిహర్త = ప్రతిహర్త; ప్రస్తోత = ప్రస్తోత; ఉద్గాత = ఉద్గాత; అను = అనెడి; సత్ = మంచి; పుత్రులన్ = కుమారులను; కాంచెను = పుట్టించెను; ఆ = ఆ; ప్రతిహర్త = ప్రతిహర్త; కున్ = కు; నుతి = నుతి (స్తుతి); అందున్ = వలన; వ్యోమ = వ్యోముడు; భూమ = భూముడు; నామక = పేర్లుగల; పుత్ర = కుమారుల; ద్వయంబున్ = జంట; ఉత్పన్నంబున్ = జన్మించుట; అయ్యెన్ = అయ్యెను; అందున్ = వారిలో; భూమున్ = భూముని; కున్ = కి; ఋషికుల్య = ఋషికుల్య; అందున్ = వలన; ఉద్గీథుండు = ఉద్గీథుడు; అను = అనెడి; సుతుండున్ = కొడుకు; జనించెన్ = పుట్టెను; అతని = అతని; కిన్ = కి; దేవకుల్య = దేవకుల్య; అందున్ = వలన; ప్రస్తోత = ప్రస్తోత; కలిగెన్ = పుట్టెను; ఆ = ఆ; ప్రస్తోత = ప్రస్తోత; కున్ = కు; వరరుత్స = వరరుత్స; అందున్ = వలన; విభుండు = విభుడు; అను = అనెడి; తనయుండు = కొడుకు; ఉద్భవించెన్ = పుట్టెను; అతని = అతని; కిన్ = కి; భారతి = భారతి; అందున్ = వలన; పృథుషేణుండ = పృథుషేణుడు; ఉదయించెన్ = జనించెను; అతని = అతని; కిన్ = కి; ఆకూతి = ఆకూతి; అందున్ = వలన; నక్తుండున్ = నక్తుడు; కలిగెన్ = పుట్టెను; ఆ = ఆ; నక్తున్ = నక్తుని; కున్ = కి; రాజర్షి = రాజులలో ఋషి ఐనవాడు; అగు = అయినట్టి; గయుండు = గయుడు; అను = అనెడి; మహా = గొప్ప; కీర్తి = యశస్సు అనెడి; సంపన్నుండు = సంపద గలవాడు; ఉదయించెన్ = పుట్టెను;
భావము:- ఈ విధంగా పాషండుల బోధనలకు ప్రభావితుడైన “సుమతి”కి, అతని భార్య “దేవసేన”కు “దేవతాజిత్తు” అనే కొడుకు పుట్టాడు. అతనికి “ఆసురి” అనే భార్యవల్ల “దేవద్యుమ్నుడు” అనే సుపుత్రుడు జన్మించాడు. మహాపురుషుడైన ఆ దేవద్యుమ్నునికి “ధేనుమతి” వల్ల “పరమేష్ఠి” పుట్టాడు. అతనికి “సువర్చల” వల్ల “ప్రతీహుడు” కలిగాడు. ఆ మహానుభావుడు జనులందరికీ బ్రహ్మోపదేశం చేసి పరిశుద్ధమైన మనస్సుతో హరి స్మరణ చేస్తూ ఉండేవాడు. అతనికి యజ్ఞాలు చేయడంలో నిపుణులైన “ప్రతిహర్త”, “ప్రస్తోత”, “ఉద్గాత” అనే ముగ్గురు కుమారులు పుట్టారు. వారిలో ప్రతిహర్తకు “నుతి” అనే భార్యవల్ల “వ్యోముడు”, “భూముడు” అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. వారిలో భూమునికి “ఋషికుల్య” అనే భార్యవల్ల “ఉద్గీథుడు” అనే కొడుకు పుట్టాడు. అతనికి “దేవకుల్య” వల్ల “ప్రస్తోత” అనే కుమారుడు జన్మించాడు. ఆ ప్రస్తోతకు “వరరుత్స” వల్ల “విభుడు” అనే కొడుకు పుట్టాడు. విభునికి “భారతి” అనే భార్య వల్ల “పృథుషేణుడు” కలిగాడు. పృథుషేణునికి “ఆకూతి” వల్ల “నక్తుడు” జన్మించాడు. ఆ నక్తునకు రాజర్షులలో చాల గొప్పవాడై కీర్తి సంపాదించిన “గయుడు” పుట్టాడు.