పోతన తెలుగు భాగవతము/పంచమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/గయుని చరిత్రంబు

వికీసోర్స్ నుండి


తెభా-5.2-7-ఆ.
ట్టి గయునివలన ఖిలజీవులఁ బ్రోవఁ
లఁచి సాత్వికప్రధాన మయిన
ట్టి మేను దాల్చి యాత్మతత్త్వజ్ఞానుఁ
గుచు నుండె హరి నిజాంశమునను.

టీక:- అట్టి = అటువంటి; గయునిన్ = గయుని; వలనన్ = ద్వారా; అఖిల = సమస్తమైన; జీవులన్ = ప్రాణులను; ప్రోవన్ = కాపాడవలెనని; తలచి = భావించి; సాత్విక = సాత్వికగుణము; ప్రధానము = ముఖ్యమైన లక్షణముగ కలది; అయిన = ఐన; అట్టి = అటువంటి; మేనున్ = దేహమును; తాల్చి = ధరించి; ఆత్మతత్త్వ = ఆత్మత్త్వము యొక్క; జ్ఞానుండు = జ్ఞానము గలవాడు; అగుచున్ = అయ్యి; ఉండెన్ = ఉండెను; హరి = విష్ణుమూర్తి; నిజ = తన యొక్క; అంశమునను = అంశతో;
భావము:- అటువంటి గయుని చేత సమస్త జీవులను రక్షించాలని తలచాడు విష్ణువు. అందుకే సత్త్వ ప్రధానమైన దేహాన్ని ధరించి, ఆత్మతత్త్వం తెలిసినవాడుగా తన అంశతో గయుని రూపంలో అవతరించాడు.

తెభా-5.2-8-వ.
ఇట్టి మహనీయ గుణాకరుండగు గయుని గాథానువర్ణనంబు పురావిదులగు మహాత్ములచే నీ తెఱంగున నుతింపంబడుచున్నది; సావధానమనస్కుండవై యాలకింపు"మని యిట్లనియె.
టీక:- ఇట్టి = ఇటువంటి; మహనీయ = గొప్పవైన; గుణ = సుగుణములకు; ఆకరుండు = గనివంటివాడు; అగు = అయినట్టి; గయునిన్ = గయుని; గాథ = కథ; అనువర్ణనంబు = చక్కగా వర్ణించుటలు; పురావిదులు = పురాణ ఇతిహాసములు ఎరిగినవాడు; అగు = అయినట్టి; మహాత్ముల్ = గొప్పవారి; చేన్ = చేత; ఈ = ఈ; తెఱంగునన్ = విధముగ; నుతింపబడుచున్నది = స్తుతింపబడుతున్నది; సావధాన = శ్రద్ధ కలిగిన; మనస్కుండవు = మనసు గలవాడవు; ఐ = అయ్యి; ఆలకింపుము = వినుము; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;
భావము:- ఇటువంటి సద్గుణవంతుడైన గయుని కథలు పురాణ ఇతిహాసములు ఎరిగిన మహాత్ములచేత ఈ విధంగా స్తుతింపబడుతున్నది. సావధాన చిత్తంతో విను” అని చెప్పి ఇలా అన్నాడు.

తెభా-5.2-9-సీ.
"ర్మమార్గంబున ధారుణీజనులను-
బ్రేమతోఁ బోషణ ప్రేషణోప
లాలనశాసనక్షణాదులచేతఁ-
బోషించుచును యజ్ఞములను యజ్ఞ
పురుషు నీశ్వరుఁ జిత్తమున నిల్పి సేవించి-
స్వాంతమందున్న యీశ్వరునిఁ గాంచి
ఖిల జీవతతికి నానంద మొసఁగుచు-
నిభిమానతమెయి ణి నేలె

తెభా-5.2-9.1-ఆ.
త్యమందు మిగులు త్సేవయందును
ర్మమందు యజ్ఞర్మమందు
యుఁడు వసుధలోనఁ గంజాక్షుఁడే కాని
మానవుండు గాఁడు మానవేంద్ర!

టీక:- ధర్మమార్గంబునన్ = ధర్మబద్ధమైనవిధముగ; ధారుణీ = భూలోకపు; జనులను = ప్రజలను; ప్రేమ = ప్రేమ; తోన్ = తోటి; పోషణ = పోషించు; ప్రేషణ = నియమించు; ఉపలాలన = బుజ్జగించు; శాసన = పరిపాలించు; లక్షణ = లక్షణములు; ఆదుల్ = మొదలగువాని; చేతన్ = చేత; పోషించుచును = పోషించుతూ; యజ్ఞములను = యజ్ఞములవలన; యజ్ఞపురుషున్ = హరిని; ఈశ్వరున్ = భగవంతుని; చిత్తమునన్ = మనసులో; నిల్పి = నిలుపుకొని; సేవించి = సేవచేసుకొని; స్వాంతము = తనయందు; ఉన్న = ఉన్నట్టి; ఈశ్వరునిన్ = భగవంతుని; కాంచి = దర్శించి; అఖిల = నిఖిలమైన; జీవ = ప్రాణుల; తతి = సమూహమున; కిన్ = కి; ఆనందమున్ = ఆనందమును; ఒసగుచు = ఇస్తూ; నిరభిమానతన్ = స్వాభిమానములేకుండట; మెయి = తోటి; ధరణిన్ = భూమిని; ఏలెన్ = పాలించెను;
సత్యమున్ = సత్యము; అందున్ = లోను; మిగులన్ = మిక్కిలిగ; సత్ = నిజమైన; సేవన్ = సేవ; అందునున్ = లోను; ధర్మము = ధర్మము; అందున్ = లోను; యజ్ఞకర్మము = యజ్ఞముచేయుట; అందున్ = లోను; గయుడు = గయుడు; వసుధ = భూలోకము; లోనన్ = లో యున్న; కంజాక్షుడే = నారాయణుడే {కంజాక్షుడు - కంజము (పద్మముల)వంటి అక్షుడు (కన్నులుగల వాడు), విష్ణువు}; కాని = కాని; మానవుండు = మామూలు మనిషి; కాడు = కాడు; మానవేంద్ర = రాజా {మానవేంద్రుడు - మానవులకి ఇంద్రునివంటి వాడు, రాజు};
భావము:- “రాజా! గయుడు ధర్మమార్గానుసారంగా ప్రజలను ప్రేమతో పోషించడం, సత్కర్మలలో నియమించడం, బుజ్జగించడం, శాసించడం మొదలైన లక్షణాలతో పరిపాలించాడు. యజ్ఞాలు చేస్తున్నపుడు తన మనస్సులో యజ్ఞపురుషుడైన ఈశ్వరుణ్ణి నిలుపుకొని సేవించాడు. తన మనస్సులో ఉన్న ఈశ్వరుణ్ణి దర్శిస్తూ, సకల జీవరాశికి ఆనందం కలిగిస్తూ స్వాభిమానం లేకుండా రాజ్యాన్ని పాలించాడు. సత్య విషయంలో, మంచివారిని సేవించడంలో, ధర్మరక్షణలో, యజ్ఞకర్మలు చేయడంలో గయుడు విష్ణుస్వరూపుడే కాని మానవమాతృడు కాడు.

తెభా-5.2-10-వ.
అట్టి మహాపురుషగుణగణ పరిపూర్ణుండగు గయునికి దక్షకన్యక లగు శ్రద్ధా మైత్రీ దయాదులు దమయంతన వచ్చి కోరిక లొసంగ, నతని ప్రజలకు వసుంధర కామధేనువై పిదుక, వేదంబులు సకల కామంబుల నిచ్చుచుండ, సంగరంబున భంగంబు నొందిన రాజులప్పనంబు లొసంగ, విప్రులు ధర్మం బాఱవపాలు పంచియిడ, నిరంతర సోమపానంబును శ్రద్ధాభక్తి యోగంబుఁ గలిగి యొనర్చు యజ్ఞంబుల నింద్రాది దేవతలు దృప్తులై యజ్ఞ ఫలంబుల నొసంగ, బ్రహ్మాది తృణగుల్మలతాంతంబుగా సకలలోకంబుల వారినిం దృప్తిం బొందించుచు, శ్రీహరిం దృప్తిఁ బొందఁ జేయుచు, గయుండు పెక్కుకాలంబు రాజ్యంబు జేసె; నట్టి గయునికి జయంతియందుఁ జిత్రరథ స్వాత్యవరోధను లను మువ్వురు గొడుకలు పుట్టిరి; యా చిత్రరథునికి నూర్ణయందు సామ్రాట్టును, వానికి నుత్కళ యందు మరీచియు, నా మేటికి బిందుమతియందు బిందుమంతుండును, నా బిందుమంతునకు సరఘయందు మధువును, మధువునకు సుమనస యనుదాని యందు వీరవ్రతుండును, నా వీరవ్రతునకు భోజయందు మన్యు ప్రమన్యువు లను నిరువురును, నందు మన్యువునకు సత్యయందు భువనుండును, నతనికి దోషయందుఁ ద్వష్టయు, నా త్వష్టకు విరోచనయందు విరజుం డను వాఁడును జనియించి; రంత.
టీక:- అట్టి = అటువంటి; మహా = గొప్ప; పురుష = పురుషుల యొక్క; గుణ = సుగుణముల; గణ = సమూహమున; పరిపూర్ణుండు = పూర్తిగా గలవాడు; అగు = అయిన; గయుని = గయుని; కిన్ = కి; దక్ష = దక్షుని యొక్క; కన్యకలు = పుత్రికలు; అగు = అయిన; శ్రద్ధా = శ్రద్ధ; మైత్రి = మైత్రి; దయ = దయ; ఆదులున్ = మొదలగువారు; తమయంతనన్ = తమంత తామె; వచ్చి = వచ్చి; కోరికలున్ = వరములను; ఒసంగన్ = ఇవ్వగా; అతని = అతని; ప్రజల్ = ప్రజల; కున్ = కు; వసుంధర = భూదేవి {వసుంధర - వసు (సంపదలను) ధర (ధరించెడిది), భూమి}; కామధేనువు = కామధేనువు; ఐ = అయ్యి; పిదుకన్ = పితుకుతుండగ; వేదంబులున్ = వేదములు; సకల = సమస్తమైన; కామంబులన్ = వాంఛితములను; ఇచ్చుచుండన్ = కలుగజేయుచుండగ; సంగరంబునన్ = యుద్ధములలో; భంగంబున్ = ఓటమిని; ఒందిన = పొందినట్టి; రాజులు = రాజులు; అప్పనంబులు = కప్పములు; ఒసంగన్ = ఇచ్చుచుండగ; విప్రులున్ = బ్రాహ్మణులును; ధర్మంబున్ = పుణ్యములో; ఆరవ = ఆరవ (1/6); పాలు = వంతు; పంచియిడ = పంచివ్వగ; నిరంతర = ఎడతెగని; సోమపానంబునున్ = సోమపానము {సోమపానము - సోమరసము తాగుట, సామవేదమునందలి స్తోత్రము స్తోమము స్తోభము నుమ్నము శస్త్రము మొదలగువాని గానము ఆస్వాదించుట}; శ్రద్ధా = శ్రద్ధ; భక్తి = భక్తి; యోగంబులు = యోగములు; కలిగి = కలిగి ఉండి; ఒనర్చు = ఆచరించెడి; యజ్ఞంబులన్ = యజ్ఞములతో; ఇంద్ర = ఇంద్రుడు; ఆది = మొదలగు; దేవతలున్ = దేవతలు; తృప్తులు = సంతృప్తి చెందినవారు; ఐ = అయ్యి; యజ్ఞ = యజ్ఞముల యొక్క; ఫలంబున్ = ఫలితములను; ఒసంగన్ = ఇస్తూ ఉండగ; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలు; తృణ = గడ్డిపరక; గుల్మ = పొదలు; లత = లతలు; అంతంబుగాన్ = వరకు; సకల = నిఖిలమైన; లోకంబుల = లోకములలోని; వారినిన్ = వారి నందరను; తృప్తిన్ = సంతృప్తులను; పొందించుచున్ = కలిగించుచూ; శ్రీహరిన్ = నారాయణుని; తృప్తిన్ = సంతృప్తిని; పొందజేయుచున్ = కలిగించుచూ; గయుండు = గయుడు; పెక్కు = ఎక్కువ; కాలంబున్ = కాలము; రాజ్యంబున్ = రాజ్యమును; చేసెన్ = చేసెను; అట్టి = అటువంటి; గయుని = గయుని; కిన్ = కి; జయంతి = జయంతి; అందున్ = ద్వారా; చిత్రరథ = చిత్రరథుడు; స్వాతి = స్వాతి; అవరోధనులు = అవరోధనుడు; అను = అనెడి; మువ్వురు = ముగ్గురు; కొడుకులు = పుత్రులు; పుట్టిరి = జన్మించిరి; ఆ = ఆ; చిత్రరథుని = చిత్రరథుని; కిన్ = కి; ఊర్ణ = ఊర్ణ {ఊర్ణ - అల్లిక, సాలెగూడు, కనుబొమల ముడి యందలి సుడి}; అందు = వలన; సామ్రాట్టును = సామ్రాట్టు; వాని = వాని; కిన్ = కి; ఉత్కళ = ఉత్కళ {ఉత్కళ - నిర్వహకురాలు, ధురీణురాలు}; అందున్ = వలన; మరీచియున్ = మరీచి {మరీచి - వాయువు}; ఆ = ఆ; మేటి = గొప్పవాని; కిన్ = కి; బిందుమతి = బిందుమతి; అందున్ = వలన; బిందుమంతుడునున్ = బిందుమంతుడు; ఆ = ఆ; బిందుమంతున్ = బిందుమంతుని; కున్ = కి; సరఘ = సరఘ; అందున్ = వలన; మధువును = మధువు; మధువున్ = మధువున; కున్ = కు; సుమనస = సుమనస; అను = అనెడి; దాని = ఆమె; అందున్ = ద్వారా; వీరవ్రతుండును = వీరవ్రతుడు; ఆ = ఆ; వీరవ్రతున్ = వీరవ్రతుని; కున్ = కి; భోజ = భోజ; అందున్ = వలన; మన్యు = మన్యువు; ప్రమన్యువుల్ = ప్రమన్యువు; అను = అనెడి; ఇరువురును = ఇద్దరు (2); అందు = వారిలో; మన్యువున్ = మన్యువున; కున్ = కు; సత్య = సత్య; అందున్ = అందు; భువనుండును = భువనుడు; అతని = అతని; కిన్ = కి; దోష = దోష; అందున్ = వలన; త్వష్టయున్ = త్వష్ట; ఆ = ఆ; త్వష్ట = త్వష్ట; కున్ = కు; విరోచన = విరోచన; అందున్ = వలన; విరజుండు = విరజుడు; అనువాడునున్ = అనెడివాడు; జనియించిరి = పుట్టిరి; అంత = అంతట;
భావము:- మహాపురుషుల గుణగణాలు కలిగిన ఆ గయునికి దక్షప్రజాపతి కుమార్తెలైన శ్రద్ధ, మైత్రి, దయ మొదలైనవారు తమంత తాముగా వచ్చి కోరిన వరాలు ప్రసాదించారు. భూదేవి అతని ప్రజలకు కామధేను వయింది. వేదాలు కోరిన కోరికలను ఇచ్చాయి. అతనిచేత యుద్ధంలో ఓడిన రాజులు కప్పం చెల్లిస్తున్నారు. బ్రాహ్మణులు తమ పుణ్యంలో ఆరవపాలు పంచి ఇస్తున్నారు. ఎడతెగని సోమపానంతో, శ్రద్ధాభక్తులతో చేసే యజ్ఞాలతో ఇంద్రాది దేవతలు సంతృప్తి పడుతూ యజ్ఞఫలాన్ని ప్రసాదిస్తున్నారు. బ్రహ్మ మొదలు గడ్డిపరక వరకు అన్ని లోకాల ప్రాణులను, శ్రీహరిని తృప్తిపరుస్తూ గయుడు రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ గయునికి “జయంతి” అనే భార్యవల్ల “చిత్రరథుడు”, “స్వాతి”, “అవరోధకుడు” అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. అందులో చిత్రరథునికి “ఊర్ణ” అనే భార్యవల్ల “సమ్రాట్టు”; అతనికి “ఉత్కళ” వల్ల “మరీచి”; శ్రేష్ఠుడైన మరీచికి “బిందుమతి” వల్ల “బిందుమంతుడు”; అతనికి “సరఘ” వల్ల “మధువు”; మధువుకు “సుమనస” అనే భార్య వల్ల “వీరవ్రతుడు”; అతనికి “బోజ” వల్ల “మన్యువు”, “ప్రమన్యువు” అనే ఇద్దరు కుమారులు; అందులో మన్యువుకు “సత్య” అనే భార్య వల్ల “భువనుడు”; అతనికి “దోష” వల్ల “త్వష్ట”, ఆ “త్వష్ట”కు “విరోచన” వల్ల “విరజుడు” జన్మించారు.

తెభా-5.2-11-క.
విరజున కుదయించిరి
భూవినుత! విషూచియందుఁ బుత్ర శతంబున్
ల నొక కన్యకయున్
నావేళ సమస్త జనులు ర్షం బందన్

టీక:- ఆ = ఆ; విరజున్ = విరజున; కున్ = కు; ఉదయించిరి = పుట్టిరి; భూవినుత = భూలోకమంతను స్తుతింపబడువాడ; విషూచి = విషూచి; అందున్ = వలన; పుత్ర = కుమారులు; శతంబునున్ = వందమంది; ఆవల = తరువాత; ఒక = ఒక; కన్యకయును = పుత్రిక; ఆవేళ = ఆకాలములో; సమస్త = సమస్తమైన; జనులు = ప్రజలు; హర్షంబున్ = సంతోషమును; అందన్ = పొందగా;
భావము:- ఆ విరజునికి “విషూచి” అనే భార్య వల్ల వందమంది కొడుకులు, ఒక కుమార్తె కలిగారు. ప్రజలంతా సంతోషించారు.

తెభా-5.2-12-క.
నుఁడు ప్రియవ్రతు వంశం
బుకుం దుదయై విరజుఁడు భూపతివంశం
బును దా నలంకరించెను
విను మింద్రావరజుఁ డయిన విష్ణుని మాడ్కిన్.

టీక:- ఘనుడు = గొప్పవాడు; ప్రియవ్రతున్ = ప్రియవ్రతుని; వంశంబున్ = వంశమున; కున్ = కు; తుద = చివరివాడు; ఐ = అయ్యి; విరజుడు = విరజుడు; భూపతి = రాజ; వంశంబునున్ = వంశమును; తాన్ = తనే; అలంకరించెను = అధిష్ఠించెను; వినుము = వినుము; ఇంద్రావరజుడు = హరి {ఇంద్రావరజుడు - ఇంద్రుని యొక్క తమ్ముడు, విష్ణువు}; అయిన = అయినట్టి; విష్ణుని = హరి; మాడ్కిన్ = వలె;
భావము:- గొప్పవాడైన ప్రియవ్రతుని వంశంలో విరజుడు చివరివాడు. అతడు ఇంద్రుని తమ్ముడైన విష్ణువువలె ఆ రాజవంశానికి అలంకారమయ్యాడు.