పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము/సర్పయాగ విరమణ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము)
రచయిత: నారయ


తెభా-12-27-చ.
మృతియును జీవనంబు నివి మేదినిలోపల జీవకోటికిన్
తము సంభవించు; సహజం బిది; చోర హుతాశ సర్ప సం
తులను దప్పి నాఁకటను బంచత నొందెడు నట్టి జీవుఁడున్
వెలను బూర్వకర్మ భవవేదన లొందుచుఁ గుందు నెప్పుడున్.

టీక:- మృతియును = చావు; జీవనంబు = బతుకులు; ఇవి = ఇవి; మేదిని = భూలోకము {మేదిని - మధుకైటభుల మేధస్సు (మెదడు) చే తడపబడునది, భూమి}; లోపలన్ = అందు; జీవ = ప్రాణులు; కోటి = అన్నిటి; కిన్ = కి; సతతము = ఎల్లప్పడు; సంభవించున్ = కలుగుతుండును; సహజంబు = సహజమైన విషయము; ఇది = ఇది; చోర = దొంగల వలన; హుతాశ = అగ్ని వలన; సర్ప = పాముల; సంహతులను = కాటులవలన; దప్పిన్ = దాహమువలన; ఆకటన్ = ఆకలివలన; పంచతనొందు = చనిపోవు; అట్టి = అట్టి; జీవుడున్ = మానవుడు; వెతలన్ = కష్టములను; పూర్వ = పూర్వజన్మలోచేసిన; కర్మ = పాపములవలన; భవ = పొందిన; వేదనలు = బాధలు; ఒందుచున్ = పొందుతు; కుందున్ = కుమిలిపోతుండును; ఎప్పుడున్ = ఎప్పటికి.
భావము:- అలా స్తుతించిన అంగీరసుడు “చావుబ్రతుకులు భూమిమీద ఉండే జీవకోటికి ఎల్లపుడూ కలుగుతూనే ఉంటాయి. ఇది సహజం. పుట్టుకతో వచ్చేదే. దొంగలవల్ల, అగ్నివల్ల, పాముకాటువల్ల, దప్పికవల్ల, ఆకలివల్ల చనిపోయే మానవుడు కష్టాలతో కుమిలిపోయి తాను పూర్వం చేసిన పాపాల ఫలితాన్ని ఎప్పటికీ అనుభవిస్తాడు.

తెభా-12-28-వ.
అట్లుగావున నసంఖ్యంబులైన దందశూకంబులు హతం బయ్యె; శాంతమానసుండవై, క్రోధంబు వర్జింపు మనిన గురూపదిష్ట ప్రకారంబున సర్పయాగంబు మానియుండె; నంత దేవతలు గుసుమవృష్టిఁ గురియించి; రా రాజన్యుండు మంత్రిసమేతుండై నగరప్రవేశంబు సేసె; బాధ్య బాధకలక్షణంబులు గల విష్ణుమాయా చోదిత గుణవ్యాపారంబుల నాత్మ మోహపడుం గావున, నట్టి మాయావికారంబులం బరిత్యజించి, తదాశ్రయీకృతమానసుండై వర్తించుచు, పరనిందసేయక, వైరంబు వర్జించి, భగవత్పదాంభోజభక్తి సంయుక్తుండై తిరుగునతండు హరిపదంబుఁ జేరు" నని చెప్పి వెండియు సూతుండు పరమ హర్ష సమేతుండై శౌనకున కిట్లనియె.
టీక:- అట్లు = అందు; కావునన్ = చేత; అసంఖ్యంబులు = లెక్కపెట్టలేనన్ని; ఐన = అయిన; దందశూకంబులు = పాములు {దందశూకము - కుత్సితమైన దంశము (కరచుట) కలది, సర్పము}; హతంబు = చనిపోయినవి; అయ్యెన్ = జరిగెను; శాంత = శాంతిపొందిన; మానసుండవు = మనసుకలవాడవు; ఐ = అయ్యి; క్రోధంబున్ = కోపమును; వర్జింపుము = వదలిపెట్టుము; అనిన = అనగా; గురు = గురువుచేత; ఉపదిష్ట = ఉపదేశించిన; ప్రకారంబునన్ = ప్రకారము; సర్పయాగంబున్ = సర్పయాగమును; మాని = విడిచిపెట్టి; ఉండెన్ = ఉండెను; అంత = అంతట; దేవతలు = దేవతలు; కుసుమ = పూల; వృష్టిన్ = వాన; కురియించిరి = కురిపించారు; ఆ = ఆ; రాజన్యుండు = రాజు; మంత్రి = మంత్రులతో; సమేతుండు = కూడుకొన్నవాడు; ఐ = అయ్యి; నగర = రాజధానిలో; ప్రవేశంబు = చేరుట; చేసెన్ = చేసెను; బాధ్య = బాధింపదగినది; బాధక = బాధించునది యను; లక్షణంబులు = లక్షణములు; కల = ఉండెడి; విష్ణుమాయ = విష్ణుమాయచే; చోదిత = ప్రేరేపింపబడిన; గుణ = గుణములందు; వ్యాపారంబులన్ = వ్యవహారములందు; ఆత్మ = ఆత్మ; మోహపడున్ = మోహమునకులోనగును; కావునన్ = కనుక; అట్టి = అటువంటి; మాయా = మాయవలని; వికారంబులన్ = ఏమరుపాటులను; పరిత్యజించి = విసర్జించి; తత్ = తన యందే; ఆశ్రయీకృత = ఆశ్రయించినట్టి; మానసుండు = మనసుకలవాడు; ఐ = అయ్యి; వర్తించుచున్ = మెలగుచు; పరనింద = ఇంతరులనిందించుట; చేయక = చేయకుండ; వైరంబు = శత్రుభావము; వర్జించి = విడిచిపెట్టి; భగవత్ = భగవంతుని; పద = పాదములనెడి; అంభోజ = పద్మముల ఎడ {అంభోజము - నీటి యందు పుట్టినది, పద్మము}; భక్తి = భక్తి; సంయుక్తుండు = కలవాడు; ఐ = అయ్యి; తిరుగున్ = వర్తించును; అతండు = అతను; హరిపదంబున్ = వైకుంఠమును; చేరున్ = చేరుకుంటాడు; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; సూతుండు = సూతుడు; పరమ = మిక్కిలి; హర్ష = ఆనందముతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; శౌనకున్ = శౌనకుని; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- కనుక, మనసున శాంతిని పొందు, మనసులో కలిగే కోపాన్ని విడచిపెట్టు. ఇప్పటికే లెక్కలేనన్ని సర్పాలు మృతిచెందాయి.” అని చెప్పాడు. గురువు ఉపదేశం ప్రకారం జనమేజయుడు సర్పయాగాన్ని మానివేశాడు. అందుకు సంతోషించి దేవతలు పూలవాన కురిపించారు. పిమ్మట, జనమేజయ మహారాజు మంత్రులు వెంటరాగా, తన నగరంలో ప్రవేశించాడు.
గుణాలతో కూడిన ప్రవృత్తులు, విష్ణుమాయవల్ల ప్రేరేపణ పొందుతుంటాయి. వాటికి బాద్యబాధక లక్షణాలు ఉంటాయి. వాటివల్ల ఆత్మ కూడ భ్రాంతిని పొందుతూ ఉంటుంది. ఆవిధమైన మాయా వికారాలను విసర్జించినవాడు. తన మనస్సును వాటికి ఆశ్రయం కాకుండా చేసుకుని, ఇతరులను నిందించడం కానీ ఇతరులతో విరోధించడం కానీ లేకుండా భగవంతుని పాదపద్మాల యందే భక్తి కలవాడై, కాలం వెళ్ళబుచ్చుతున్నవాడు తప్పకుండా విష్ణుపదాన్ని చేరుకుంటాడు.” అని చెప్పి సూతుడు ఆనందంతో శౌనకునితో ఈవిధంగా చెప్పసాగాడు.