పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము/తక్షకదష్ఠుడైన పరీక్షిన్మృతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తక్షకదష్ఠుడైన పరీక్షిన్మృతి

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము)
రచయిత: నారయ


(తెభా-12-26-వ.)[మార్చు]

రాజేంద్రా! జరామరణ హేతుకంబయిన శరీరంబున నుండు జీవుండు ఘటంబులలోఁ గనంబడు నాకాశంబు ఘటనాశంబయిన మహాకాశంబునం జేరు తెఱంగున, శరీరపతనంబగుడు నీశ్వరుం గలయుఁ, దైలనాశ పర్యంతంబు వర్తి తేజంబుతోడ వర్తించు కరణి దేహకృతం బగు భవంబు రజస్సత్త్వతమోగుణంబులచేతం బ్రవర్తించు; నాత్మ నభంబు మాడ్కి ధ్రువంబై యనంతంబై వ్యక్తావ్యక్తంబులకుఁ బరంబై యుండు; నిట్లాత్మ నాత్మస్థునిఁ గా జేసి, హరి నిజాకారంబు భావించుచుండుట విశేషంబు; నిన్నుఁ దక్షకుండు గఱవ సమర్థుండు గాఁడు; హరిం దలంపుము; ధన గృహదారాపత్యక్షేత్రపశుప్రకరంబుల వర్జించి, సమస్తంబు నారాయణార్పణంబు సేసి, విగతశోకుండవై నిత్యంబును హరిధ్యానంబు సేయు” మని వినిపించిన రాజేంద్రుండును గుశాసనాసీనుండై జనార్దనుం జింతించుచుండె; నంత శుకుండును యథేచ్ఛావిహారుండయి చనియె; నిటఁ గ్రుద్ధుండైన బ్రాహ్మణోత్తమునిచేఁ బ్రేరితుండైన తక్షకుండు ద్విజరూపంబుఁ దాల్చి, పరీక్షిద్వధార్థంబుగా నేతెంచుచుండి మార్గమధ్యంబునఁ గాశ్యపుం డను సర్పవిషహరణసమర్థుం డగు నొక్క విప్రునిం గని యతని నపరిమిత ధనప్రదానంబునఁ ద్రుప్తుం గావించి, పరీక్షిన్నికటంబునకు రాకుండు నట్లొనర్చి, యంతటఁ బరీక్షిన్మహారాజు చెంతనున్నవారల చేతి కొక్క ఫలం బిచ్చి చనిన, వారా ఫలంబు రాజున కిచ్చిన నతండా ఫలంబు నాస్వాదించినం గ్రిమిరూపంబున నందుండి వెడలి మహాభయంకర రూపంబునం గాకోదరంబై రాజుం గఱచిన నతండు నా క్షణంబ విషాగ్నిచే భస్మీభూతుం డయ్యె; నట్టి యవసరంబున భూమ్యంతరిక్షంబుల నుండు నిఖిలప్రాణు లాశ్యర్యకరం బగు తన్మరణంబు గని హాహారవంబులు సేసి; రంత నీ యర్థంబు నతని తనయుం డైన జనమేజయుండు విని క్రోధావేశంబున సర్పప్రళయం బగు నట్లు యజ్ఞంబు సేయుచుండ సహస్ర సంఖ్యలు గల సర్పంబులు హతంబు లయ్యె; నా సమయంబునఁ దక్షకుండు రాక వాసవాలయంబున నుండుట యెఱింగి “సహేంద్రతక్షకా యానుబ్రూహి” యను ప్రేషవాక్యంబు నొడువు నంతఁ; దక్షక సహితుం డయి విమానముతో నింద్రుండు స్థానభ్రంశంబు నొంది పడుచుండ, నత్తఱి నాంగీరసుం డేతెంచి పరీక్షిత్తనయుని బహుభంగులం గీర్తించి.

21-05-2016: :

గణనాధ్యాయి 13:16, 12 డిసెంబరు 2016 (UTC)