పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము/కల్పప్రళయ ప్రకారంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము)
రచయిత: నారయ


తెభా-12-22-వ.
అనినఁ గల్పప్రళయ ప్రకారం బెట్లనిన నతం డిట్లనియెఁ; “జతుర్యుగ సహస్రంబులు సనిన నది బ్రహ్మకు నొక్క పవలగు; నా క్రమంబున రాత్రియు వర్ధిల్లు; నంత బ్రహ్మకు నొక్కదినం బగుటవలన నది నైమిత్తిక ప్రళయం బనంబడు; నందు విధాత సమస్త లోకంబులం దన యాత్మ యందు నిలిపి శయనింప ప్రకృతి వినష్టంబయిన నది ప్రాకృత ప్రళయం బని చెప్పంబడు; నా ప్రళయ ప్రకారంబు విను; మిట్లు పవలు నైమిత్తిక ప్రళయంబును, రాత్రి ప్రాకృత ప్రళయంబు నగుట గలిగిన, నది యజునకు దినప్రమాణం; బిట్టి దినప్రమాణంబున మున్నూటయఱువది దినంబు లయిన నలువకు నొక్క సంవత్సరంబు పరిపూర్ణం బగుఁ; దద్వత్సరంబులు శతపరిమితంబు లయిన.
టీక:- అనినన్ = అనగా; కల్ప = కల్పము; ప్రళయ = ప్రళయము; ప్రకారంబు = జరుగువిధానము; ఎట్లు = ఏవిధముగా; అనినన్ = అని అడుగగా; అతండు = అతను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; చతుర్యుగ = చతుర్యుగములు {చతుర్యుగములు - 1కృత 2త్రేత 3ద్వాపర 4కలియుగములు నాలుగు}; సహస్రంబులు = వెయ్యి (1000); చనినన్ = జరిగినచో; అది = అది; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కున్ = కి; ఒక్క = ఒక; పవలు = పగలు; అగున్ = జరుగును; ఆ = అదే; క్రమంబునన్ = విధముగా; రాత్రియున్ = రాత్రి కూడ; వర్ధిల్లున్ = పెద్దదై ఉంటుంది; అంత = అటువంటి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కున్ = కి; ఒక్క = ఒక; దినంబు = రోజు; అగుట = అగుట; వలన = చేత; అది = దానిని; నైమిత్తికప్రళయంబు = నైమిత్తిక ప్రళయము {నైమిత్తిక ప్రళయము - తాత్కాలమైన నాశనము, సృష్టి ఆగుటవలన కలుగునది}; అనంబడున్ = అనబడుతుంది; అందున్ = ఆ సమయమునందు; విధాత = బ్రహ్మదేవుడు {విధాత - సర్వమును సృజించువాడు, బ్రహ్మ}; సమస్త = సర్వ; లోకంబులన్ = లోకములను; తన = తన యొక్క; ఆత్మ = ఆత్మ; అందున్ = లో; నిలిపి = చేర్చుకొని; శయనింపన్ = నిద్రపోగా; ప్రకృతి = ప్రకృతి; వినష్టంబు = అంతరించినది; అయినన్ = అయినచో; అది = దానిని; ప్రాకృతప్రళయంబు = ప్రాకృతప్రళయము {ప్రాకృతప్రళయము - ప్రకృతికే నాశము కలుగుట}; అని = అని; చెప్పంబడున్ = చెప్పబడును; ఆ = ఆ; ప్రళయ = ప్రళయముల; ప్రకారంబున్ = వివరములను; వినుము = వినుము; ఇట్లు = ఈ విధముగ; పవలు = పగటిపూట; నైమిత్తికప్రళయంబును = నైమిత్తిక ప్రళయము; రాత్రి = రాత్రిపూట; ప్రాకృతప్రళయంబు = ప్రాకృతప్రళయము; అగుటన్ = జరుగుట; కలిగిన = అయితే; ఆది = అది; అజున్ = బ్రహ్మదేవుని {అజుడు - పుట్టుక లేనివాడు, బ్రహ్మ}; కున్ = కి; దినప్రమాణంబు = రోజుఅంత; ఇట్టి = ఇలాంటి; దినప్రమాణంబులు = రోజులపాటివి; మున్నూటయఱువది = మూడొందలరవై (360); దినంబులు = రోజులు; అయిన = అయినచో; నలువ = బ్రహ్మదేవుని {నలువ - నలు (నాలుగు) వా (ముఖములు కలవాడు), చతుర్ముఖబ్రహ్మ}; కున్ = కి; ఒక్క = ఒకానొక; సంవత్సరంబు = సంవత్సరము; పరిపూర్ణంబు = పూర్తయినట్టు; అగున్ = అగును; తత = అట్టి; వత్సరంబులు = సంవత్సరాలు; శత = వంద (100); పరిమితంబు = వరకు; అయిన = అయినచో.
భావము:- అప్పుడు పరీక్షుత్తు “కల్ప ప్రళయం ఏ ప్రకారం జరుగుతుంది” అని అడిగాడు. దానికి శుకముని ఇలా అన్నాడు. “ఒకవెయ్యి యుగచతుష్టయాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు. అలాగే రాత్రి కూడ ఒకవెయ్యి యుగచతుష్టయాలే. ఇటువంటి రాత్రింబగళ్ళు కలిస్తే బ్రహ్మకు ఒకరోజు అవుతుంది. అందులో పగలు కలుగుదానిని “నైమిత్తిక ప్రళయం” అంటారు. ఆ బ్రహ్మరాత్రి సమయంలో విధాత లోకాలు అన్నింటినీ తనలో చేర్చుకుని నిద్రిస్తాడు. అప్పుడు ప్రకృతి అంతరిస్తుంది దానిని “ప్రాకృత ప్రళయం” అంటారు. ఈ ప్రళయ విషయం వివరిస్తాను విను. పగటిపూట నైమిత్తిక ప్రళయం రాత్రి పూట ప్రాకృత ప్రళయం. ఈ రెండూ కలసి బ్రహ్మదేవునికి ఒక దినము అవుతుంది ఇటువంటివి మూడువందల అరవై అయినప్పుడు బ్రహ్మ కాలమానంలో ఒక సంవత్సరం అయినట్లు లెక్క. అటువంటివి వంద సంవత్సరాలు అయినప్పుడు....

తెభా-12-23-సీ.
అంత లోకేశున వసానకాలంబు-
చ్చిన నూఱేండ్లు సుధలోన
ర్షంబు లుడిగిన డిఁ దప్పి, మానవుల్-
ప్పి నాఁకటఁ జిక్కి, నొప్పి నొంది,
న్యోన్యభక్షులై, యా కాలవశమున-
నాశ మొందెద ; రంత లినసఖుఁడు
సాముద్ర దైహిక క్ష్మాజాత రసములఁ-
జాతురిఁ గిరణాళిచేతఁ గాల్ప,

తెభా-12-23.1-తే.
నంతఁ గాలాగ్ని సంకర్షణాఖ్య మగుచు,
ఖిల దిక్కులు గలయంగ నాక్రమించు;
ట్టియెడ నూఱువర్షంబు లాదుకొనఁగ
వీఁకతోడుత వాయువుల్ వీచు నపుడు.

టీక:- అంతన్ = అప్పుడు; లోకేశున్ = బ్రహ్మదేవుని; కున్ = కి; అవసానకాలంబు = అంతకాలము; వచ్చిన = రాగా; నూఱు = వంద (100); ఏండ్లు = సంవత్సరములు; వసుధ = భూలోకము; లోనన్ = అందు; వర్షంబులు = వానలు; ఉడిగినన్ = పడకపోవుటచేత; వడిన్ = బిగువు; తప్పి = వదలి; మానవుల్ = మానవులు; దప్పిన్ = దాహముచేత; ఆకటన్ = ఆకలిచేత; చిక్కి = కృశించి; నొప్పిన్ = బాధలు; ఒంది = పొంది; అన్యోన్య = ఒకరినొకరు; భక్షులు = తినువారు; ఐ = అయ్యి; ఆ = ఆ యొక్క; కాల = కాలమునకు; వశమునన్ = లొంగిపోయి; నాశమున్ = నాశనమును; ఒందెదరు = పొందెదరు; అంతన్ = అప్పుడు; నలినసఖుడు = సూర్యుడు {నలినసఖుడు - నలిన (పద్మములకు) సఖుడు (స్నేహితుడు), సూర్యుడు}; సాముద్ర = సముద్రములలోని; దైహిక = శరీరములందు; క్ష్మా = భూమియందు; జాత = కలిగిన; రసములన్ = ద్రవములను; చాతురిన్ = నేర్పుతో; కిరణ = కిరణముల; ఆవళి = సమూహముల; చేతన = చేత; కాల్పన్ = కాల్చివేయగా; అంతన్ = అప్పుటి; కాలాగ్ని = కాలాగ్ని.
సంకర్షణ = సంకర్షణము {సంకర్షణుడు - ప్రళయమందు సర్వులను సంహరించువాడు, విష్ణువు}; ఆఖ్య = పేరుగలది; అగుచున్ = ఔతూ; అఖిల = సర్వ; దిక్కులన్ = దిశలందు; కలయంగ = వ్యాపించి; ఆక్రమించున్ = ఆక్రమిస్తుంది; అట్టి = అటువంటి; ఎడన్ = సమయమునందు; నూఱు = వంద (100); వర్షంబులు = సంవత్సరములు; ఆదుకొనగన్ = ముసురుకొనగా; వీక = విజృంభణము; తోడుత = తోటి; వాయువుల్ = గాలులు; వీచున్ = వీస్తాయి; అపుడు = అప్పుడు.
భావము:- బ్రహ్మదేవునికి అతని కాలమాన ప్రకారం వంద సంవత్సరాలు (365,000 యుగచతుష్టయములు) నిండితే ఒక అవసానకాలం వస్తుంది. అపుడు భూమిమీద నూరేళ్ళపాటు వానలు కురవవు. దానితో మానవులు ఆకలిదప్పులు తట్టుకోలేక అల్లాడిపోతారు. అప్పుడు ఒకరినొకరు తినడం మొదలు పెడతారు. ఆ విధంగా కాలవశులై అంతరిస్తారు. అప్పుడు పద్మబాంధవుడైన సూర్యుడు సముద్ర జలాలను, శరీరము లందున్న రసాలను, భూమి యందు ఉండు ద్రవాలను తన కిరణాలచేత కాల్చి పీల్చివేస్తాడు. ఆ విధమైన కాలాగ్ని సంకర్షణం అనే పేరుతో అన్నిదిక్కులలోనూ వ్యాపించి ఆక్రమిస్తుంది. అప్పుడు నూరు సంవత్సరాలపాటు విడవకుండా వాయువులు వీస్తాయి.