Jump to content

పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/నారయణఋషి భాషణ

వికీసోర్స్ నుండి

నారయణఋషి భాషణ

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము)
రచయిత: పోతన


తెభా-11-63-క.
ర్ముండు దక్షపుత్త్రిక
నిర్మలమతిఁ బెండ్లియాడి నెఱిఁ బుత్త్రుని స
త్కర్ముని నారాయణ ఋషి
ర్మిలిఁ గనె నతఁడు బదరికాశ్రమ మందున్‌.

టీక:- ధర్ముండు = ధర్ముడు; దక్ష = దక్షుని యొక్క; పుత్రికన్ = కుమార్తెను; నిర్మల = అమలమైన; మతిన్ = బుద్ధితో; పెండ్లియాడి = వివాహముచేసికొని; నెఱిన్ = గొప్పగా; పుత్త్రుని = కుమారుని; సత్ = మంచి; కర్ముని = కర్మలు చేయువానిని; నారాయణ = నారాయణుడనెడి; ఋషిన్ = ఋషిని; నర్మిలిన్ = కోరి, ఇష్టపూర్తిగా; కనెన్ = పొందెను; అతడు = అతను; బదరికాశ్రమము = బదరికాశ్రమము; అందున్ = అందు.
భావము:- బదరీకాశ్రమంలో ధర్ముడు దక్షపుత్రికను పెండ్లాడాడు. ఆ దంపతులకు సత్కర్ముడు పరిశుద్ధుడు ఐన నారాయణఋషి జన్మించాడు.

తెభా-11-64-తే.
ట్టి నారాయణాహ్వయుం డైన మౌని
దరికాశ్రమమందు నపార నిష్ఠఁ
పముఁ గావింప బలభేది లఁకి మదిని
మీనకేతను దివిజకామినులఁ బనిచె.

టీక:- అట్టి = అటువంటి; నారాయణ = నారాయణ; ఆహ్వయుండు = పేరుకలవాడు; ఐన = అయిన; మౌని = ముని; బదరికాశ్రమము = బదరికాశ్రమము; అందున్ = లో; అపార = అనంతమైన; నిష్ఠ = నిష్ఠతో; తపమున్ = తపస్సును; కావింపన్ = చేయగా; బలభేదిన్ = ఇంద్రుడు {బలభేది - బలాసురుని సంహరించినవాడు, ఇంద్రుడు}; తలకి = బెదిరి; మదిని = మనసునందు; మీనకేతను = మన్మథుని; దివిజకామినులన్ = అప్సరసలను; పనిచెన్ = పంపించెను.
భావము:- ఆ నారాయణముని బదరికాశ్రమంలో అపారమైన నిష్ఠతో తపస్సు చేయసాగాడు ఆయన తపస్సుకు ఇంద్రుడు భయపడి తపోభంగం నిమిత్తం మన్మథుడిని అప్సరసలను పంపించాడు.

తెభా-11-65-వ.
వారు నారాయణాశ్రమంబునకు నతని తపోవిఘ్నంబు సేయ వచ్చునప్పు డవ్వనంబు సాల రసాల బిల్వ కదళీ ఖర్జూర జంబు జంబీర చందన వున్నాగ మందారాది వివిధ వృక్ష నిబిడంబును, పుష్ప ఫల భరిత శాఖావనమ్ర తరులతా బృందంబును, మాధవీ కుంజమంజరీ పుంజ మకరందపాన మత్తమధుకర నికర ఝంకారరవ ముఖరిత హరి దంతరంబును, గనక కమల కహ్లార విలసత్సరోవిహరమాణ చక్రవాక బక క్రౌంచ మరాళదంపతీ మండల మండితంబును, మృణాళ భోజనాసక్త సారసచయ చంచూపుట విపాటిత కమలముకుళకేసర విసర వితత ప్రశస్త సరోవరంబును నై వెలయు నవ్వనంబున నిందువదన లందంద మందగమనంబులం జెందు ఘర్మజలబిందుబృందంబులు నఖాంతంబుల నోసరింపుచు డాయంజను నప్పుడు.
టీక:- వారు = వారు; నారాయణా = నారాయణముని యొక్క; ఆశ్రమంబు = ఆశ్రమమున; కున్ = కు; తపః = తపస్సును; విఘ్నంబు = విఘ్నముకలిగించుట; చేయన్ = చేయుటకొరకు; వచ్చున్ = వచ్చెడి; అప్పుడున్ = ఎడ; ఆ = ఆ; వనంబు = ఆశ్రమము; సాల = మద్ధి; రసాల = మామిడి; బిల్వ = మారేడు; కదళీ = అరటి; ఖర్జూర = ఖర్జూరము; జంబు = నేరేడు; జంబీర = నిమ్మ; చందన = చందనం; పున్నాగ = సురపొన్న; మందార = మందారము; ఆది = మున్నగు; వివిధ = అనేక; వృక్ష = చెట్లతో; నిబిడంబును = నిండియున్నది; పుష్ప = పూలు; ఫల = పండ్లు; భరిత = నిండుగాయున్న; శాఖా = కొమ్మలతో; వినమ్ర = కిందికివంగిన; తరు = చెట్లు; లతా = లతల; బృందంబును = సమూహములు; మాధవీ = గురివింద; కుంజ = పొదలు లోని; మంజరీ = పూలగుత్తుల; పుంజ = సమూహములందలి; మకరంద = పూతేనెను; పాన = తాగుటచే; మత్త = మదించిన; మధుకర = తుమ్మెదల; నికర = సమూహముల; ఝంకార = ఝంకారముల; రవ = ధ్వని; ముఖరిత = మొదలగువానితో; హరిదంతరంబును = దిక్కులమధ్యభాగం కలది; కనక = బంగారు; కమల = పద్మాల; కహ్లార = కలువలతో; విలసత్ = ప్రకాశించెడి; సరోవర = సరస్సులలో; విహరమాణ = విహరిస్తున్న; చక్రవాక = చక్రవాక పక్షులు; బక = కొంగలు; క్రౌంచ = క్రౌంచపక్షులు; మరాళ = హంసలు; దంపతీ = జంటలతో; మండల = ప్రదేశములతో; మండితంబును = భాసిల్లుచున్నది; మృణాళ = తామరతూళ్ళను; భోజన = తినవలెనని; ఆసక్త = కోరుచున్న; సారస = సారసపక్షుల; చయ = సమూహముల; చంచూపుట = ముక్కుకొనలతో; విపాటిత = చీల్చబడిన; కమల = తామర; ముకుళ = మొగ్గల; కేసర = కేసరాల; విసర = సమూహములతో; వితత = మిక్కిలి; ప్రశస్త = శ్రేష్ఠమైన; సరోవరంబును = సరస్సులుకలది; ఐ = అయ్యి; వెలయు = విలసిల్లెడి; ఆ = ఆ; వనంబునన్ = తపోవనమునందు; ఇందువదనలు = అందగత్తెలు; అందంద = అక్కడక్కడ; మంద = నెమ్మదైన; గమనంబులన్ = నడకలతో; చెందు = కలుగుతున్న; ఘర్మజల = చెమట; బిందు = బిందువల; బృందంబులున్ = సమూహములను; నఖాంతంబుల = కొనగోటితో; నోసరింపుచున్ = చిమ్ముకుంటూ; డాయంజను = దగ్గరకుచేరు; అప్పుడు = సమయమందు.
భావము:- ఆ ప్రకారం వారు నారాయణాశ్రమానికి అతని తపస్సును భగ్నంచేయడానికి వచ్చారు. ఆ తపోవనం మామిడి, మద్ది, మారేడు, అరటి, ఖర్జూరం, నేరేడు, నిమ్మ, చందనం, సురపొన్న, మందారం మొదలైన అనేక వృక్షాలతో నిండి ఉన్నది. పూలతో, పండ్లతో కొమ్మలు క్రిందికి వంగి ఉన్నాయి. గురువింద పొదల పూలగుత్తుల మకరందం త్రాగి మదించిన తుమ్మెదలు చేసే ఝంకారాలతో దిక్కులు నిండిపోతున్నాయి. బంగారు పద్మాలు, కలువలు, ప్రకాశించే సరస్సులలో జక్కవలు, కొంగలు, క్రౌంచ పక్షులు, హంసలు జంటజంటలుగా విహరిస్తున్నాయి. తామరతూళ్ళను తినుటం కోసం సారసపక్షులు ముక్కులతో చీల్చబడిన తామర మొగ్గలలోని కేసరాలతో సరోవరాలు భాసిస్తూ ఉన్నాయి. అటువంటి తపోవనంలో ఆ చంద్రముఖులైన అప్సరసలు నెమ్మదిగా నడుస్తూ చెమట బిందువులను కొనగోళ్ళతో చిమ్ముకుంటూ నారాయణమహర్షిని సమీపించారు.

తెభా-11-66-చ.
నుని బాణజాలముల గ్నతఁ బొందక ధైర్యవంతుఁ డై,
ముదితల వాఁడిచూపులకు మోహము నొందక నిశ్చలాత్ముఁడై,
హృయమునందు నచ్యుతు రమేశు ననంతు జగన్నివాసునిన్‌
లక భక్తి నిల్పుకొని వారికి నిట్లనె మౌని పెంపునన్,

టీక:- మదనుని = మన్మథుని; బాణ = బాణముల; జాలములన్ = సమూహముల; మగ్నతన్ = మునిగిపోవుట; పొందక = పొందకుండగ; ధైర్యవంతుడు = ధైర్యముకలవాడు; ఐ = అయ్యి; ముదితల = స్త్రీల; వాడు = పదునైన; చూపుల = వీక్షణముల; కున్ = కు; మోహమున్ = మోహము; ఒందక = పొందక; నిశ్ఛల = చలించని; ఆత్ముడు = ఆత్మ కలవాడు; ఐ = అయ్యి; హృదయమున్ = హృదయము; అందున్ = లో; అచ్యుతున్ = హరిని {అచ్యుతుడు - చ్యుతము (దిగజారుట) లోనివాడు, విష్ణువు}; రమేశున్ = హరిని {రమేశుడు - రమ (లక్ష్మీదేవి)కి ఈశుడు, విష్ణువు}; అనంతున్ = హరిని {అనంతుడు - శాశ్వతుడు, విష్ణువు}; జగన్నివాసునిన్ = హరిని {జగన్నివాసుడు - జగత్తునకు నివాసమైనవాడు, విష్ణువు}; వదలక = విడువక; భక్తిన్ = భక్తిని; నిల్పుకొని = ఉంచుకొని; వారి = వారల; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనె = పలికెను; మౌని = ఋషి; పెంపునన్ = గొప్పదనముతో.
భావము:- ఆ సమయంలో నారాయణఋషి మన్మథుని బాణాలకు లొంగ లేదు. ధైర్యము విడువలేదు. ఆ కాంతల వాడి చూపులకు మోహము పొంద లేదు. ఏమాత్రం చలించక తన హృదయంలో అచ్యుతుడు, అనంతుడు, జగన్నివాసుడు, రమేశుడు అయిన శ్రీహరిని నిశ్చలభక్తితో మనసున నిలుపుకుని ఉన్నాడు. ఆయన వారితో ఇలా అన్నాడు.

తెభా-11-67-క.
"జంభారిపంపునను మీ
రంభోరుహవదనలార! రుదెంచితి; రా
శుంద్విహారవాంఛా
రంభంబునఁ దిరుగుఁ"డనిన జ్జించి వెసన్‌.

టీక:- జంభారి = ఇంద్రుని {జంభారి - జంభాసురుని శత్రువు, ఇంద్రుడు}; పంపునను = ఆజ్ఞప్రకారము; మీరు = మీరు; అంభోరుహవదనలారా = ఓ వనితలు {అంభోరుహవదన - అంభోరుహ (నీటపుట్టినది, పద్మము) వంటి వదనముకలామె, స్త్రీ}; అరుదెంచితిరి = వచ్చారు; ఆ = ఆ; శుంభత్ = ప్రకాశించెడి; విహార = విహరించవలెననెడి; వాంఛా = కోరిక; ఆరంభంబునన్ = ప్రకారము; తిరుగుడు = వర్తించండి; అనినన్ = అనగా; లజ్జించి = సిగ్గుపడి; వెసన్ = శీఘ్రమే.
భావము:- “పద్మముఖులార! ఇంద్రుడు పంపగా మీరు వచ్చారు. ఇక్కడ విహరించాలనే కోరిక ఉంటే మీ ఇష్టంవచ్చినట్లు తిరగండి.” అనేటప్పటికి వాళ్ళంతా సిగ్గుపడి ఆ మహర్షితో ఇలా అన్నారు.

తెభా-11-68-సీ.
"దేవమునీంద్ర! నీ దివ్యచారిత్రంబు-
నెఱిఁగి సన్నుతిసేయ నెవ్వఁడోపుఁ?
బుత్త్ర మిత్ర కళత్ర భోగాదులను మాని-
పము గావించు సద్ధర్ములకును
విఘ్నముల్‌ సెందునే? విశ్వేశుఁ గొల్చిన-
తనికి నంతరాయంబు గలదె?
కామంబుఁ గ్రోధంబుఁ ల తపస్వితపంబు-
ల్వలోదకములభంగిఁ గాదె?

తెభా-11-68.1-తే.
నిన్ను వర్ణింప నలవియే? నిర్మలాత్మ!
మణ లోఁగొను మా యపరాధ" మనుచు
న్నుతించిన నతఁడు ప్రన్నుఁ డగుచుఁ
నదు సామర్థ్య మెఱిఁగింపఁ లఁచి యపుడు.

టీక:- దేవ = దివ్యమైన; ముని = మునులలో; ఇంద్ర = ఉత్తముడా; నీ = నీ యొక్క; దివ్య = మహిమాన్వితమైన; చారిత్రంబున్ = చరిత్రను; ఎఱిగి = తెలుసుకొని; సన్నుతి = స్తోత్రము; చేయన్ = చేయుటకు; ఎవ్వడు = ఎవరుమాత్రము; ఓపున్ = చేయగలడు; పుత్ర = పుత్రులు; మిత్ర = స్నేహితులు; కళత్ర = భార్య; భోగ = భోగములు; ఆదులను = మొదలగువానిని; మాని = విడిచిపెట్టి; తపమున్ = తపస్సును; కావించు = చేసెడి; సద్ధర్ముల్ = సద్ధర్మపరుల; కును = కు; విఘ్నముల్ = అడ్డంకులు; చెందునే = కలుగుతాయా, కలుగవు; విశ్వేశున్ = జగదీశ్వరుని; కొల్చిన = సేవించు; అతని = వాని; కిన్ = కి; అంతరాయంబున్ = ఆటంకము; కలదె = కలుగునా, కలుగదు; కామంబున్ = కామము; క్రోధంబు = క్రోధము; కల = ఉన్నట్టి; తపస్వి = తాపసుని; తపంబు = తపస్సు; పల్వల = చిన్ననీటిగుంటలోని; ఉదకముల = నీళ్ళు; భంగిన్ = వలె; కాదె = కదా.
నిన్ను = నిన్ను; వర్ణింపన్ = స్తుతించుట; అలవియె = శక్యమా, కాదు; నిర్మలాత్మా = నిర్మలమైన మనసు కలవాడా; రమణన్ = ప్రీతితో; లోగొను = కాయుము, క్షమించుము; మా = మా యొక్క; అపరాధమున్ = తప్పులను; అనుచు = అంటు; సన్నుతించినన్ = స్తుతించగా; అతడు = అతను; ప్రసన్నుడు = ప్రసన్నుడు; అగుచున్ = ఔతు; తనదు = తన యొక్క; సామర్థ్యము = శక్తిని; ఎఱిగింపన్ = తెలుపవలెనని; తలచి = అనుకొని; అపుడు = అప్పుడు.
భావము:- “దేవమునీంద్రా! నీ దివ్యమైన చరిత్ర గ్రహించి స్తుతించటానికి ఎవరికి సాధ్యం అవుతుంది. పుత్రులు, మిత్రులు, భార్యలు మొదలైన భోగాలను వదలి తపస్సు చేసే సద్ధర్మ పరులకు విఘ్నాలు కలుగుతాయా? జగదీశ్వరుడిని కొలిచేవారికి ఆటంకాలు ఉంటాయా? కామం క్రోధం కలిగిన తాపసుల తపస్సు బురదగుంటలోని నీటి వంటిది కదా. ఓ నిర్మలాత్మా! నిన్ను వర్ణించడం మాతరం కాదు. మా తప్పులు క్షమించు.” అని నుంతించారు. అంత నారాయణమహర్షి ప్రసన్నుడై తన సామర్ధ్యాన్ని తెలియజేయాలని అనుకున్నాడు.

తెభా-11-69-వ.
అమ్మునీశ్వరుండు పరమాశ్చర్యవిధానంబుగా నిజతనూరుహంబుల వలనం ద్రికోటి కన్యకానివహంబుల నుద్భవింపం జేసిన, గంధర్వవిబుధకామినీ సముదయంబులు పరమాద్భుత భయంబులు మనంబులం బొడమ సన్నుతించి, యవ్విలాసినీసమూహంబులో నూర్వశియను దానిం గొనిచని, పాకశాసను సభాసదనంబునం బెట్టి తద్వృత్తాంతం బంతయు విన్నవించిన నాశ్చర్య యుక్త హృదయుండయి సునాసీరుం డూరకుండె; నట్టి నారాయణ మునీశ్వరుచరిత్రంబు వినువారలు పరమ కల్యాణగుణవంతు లగుదు"రని చెప్పిన.
టీక:- ఆ = ఆ; ముని = మునులలో; ఈశ్వరుండు = ఉత్తముడు; పరమ = మిక్కిలి; ఆశ్చర్య = అద్భుతమైన; విధానంబుగా = ప్రకారముగ; నిజ = తన యొక్క; తనూరుహంబుల = రోమముల; వలనన్ = నుండి; త్రికోటి = మూడుకోట్ల(30000000); కన్యకా = యువతుల; నివహంబులన్ = సమూహములను; ఉద్భవింపజేసిన = పుట్టింపగా; గంధర్వవిబుధకామినీ = అప్సరసల; సముదయంబులు = సమూహములు; పరమ = మిక్కిలి; అద్భుత = ఆశ్చర్యము; భయంబులు = భయములు; మనంబులన్ = మనస్సులలో; పొడమ = పుట్టగా; సన్నుతించి = స్తుతించి; ఆ = ఆ; విలాసినీ = అందగత్తెల; సమూహంబుల = అందరి; లోనున్ = లో; ఊర్వశి = ఊర్వశి; అను = అనెడి; దానిన్ = ఆమెను; కొని = తీసుకొని; చని = వెళ్ళి; పాకశాసనున్ = ఇంద్రుని {పాకశాసనుడు - వృత్రాసురుని సోదరుడగు పాకాసురుని చంపినవాడు, ఇంద్రుడు}; సభాసదనంబునన్ = సభామండపములో; పెట్టి = నిలబెట్టి; తత్ = ఆ; వృత్తాంతంబు = విషయము; అంతయున్ = సమస్తము; విన్నవించినన్ = తెలుపగా; ఆశ్చర్య = ఆశ్చర్యముతో; యుక్త = కూడిన; హృదయుండు = హృదయము కలవాడు; అయి = ఐ; సునాసీరుండు = ఇంద్రుడు {సునాసీరుడు - శ్రేష్ఠమైన సేనాగ్రభాగము కలవాడు, ఇంద్రుడు}; ఊరకుండెన్ = మాట్లాడకుండా ఉండెను; అట్టి = అలాంటి; నారాయణ = నారాయణ అనెడి; ముని = మునులలో; ఈశ్వరున్ = ఉత్తముని; చరిత్రంబు = వృత్తాంతములు; విను = వినెడి; వారలు = వారు; పరమ = మిక్కిలి; కల్యాణ = శుభకరమైన; గుణవంతులు = గుణసంపన్నులు; అగుదురు = ఔతారు; అని = అని; చెప్పిన = చెప్పినట్టి.
భావము:- ఆ మునిశ్రేష్ఠుడు అందరూ ఆశ్చర్యపోయేలా తన రోమకూపాల నుండి మూడుకోట్ల కన్యకలను పుట్టించాడు. అది చూసిన ఆ అప్సరసలు అత్యంత ఆశ్చర్యంతో భయంతో ఆ మహర్షిని స్తుతించారు. ఆ అందగత్తెలలో నుండి ఊర్వశి అనే ఒక సుందరాంగిని తీసుకుని వెళ్ళి జరిగినదంతా ఇంద్రునికి చెప్పారు. మునిశక్తికి వెరగుపడిన ఇంద్రుడు మిన్నకున్నాడు. అటువంటి నారాయణముని చరిత్ర వినే వాళ్ళు మిక్కిలి శుభకరమైన గుణాలను పొందుతారు.”

తెభా-11-70-తే.
షభునకు నాత్మయోగ మీ రీతిఁ జెప్పె;
చ్యుతుఁడు భూమిభారము డఁప నంత
సొరిది నవతారములు దాల్చి సొంపు మీఱ
రాత్రిచరులను జంపె నీసముతోడ.

టీక:- ఋషభున్ = ఋషభుని; కున్ = కి; ఆత్మయోగము = ఆత్మయోగము; ఈ = ఈ; రీతిన్ = విధముగ; చెప్పెన్ = తెలిపెను; అచ్యుతుడు = హరి; భూమిభారమున్ = భూభారాన్ని; అడపన్ = అణచుటకు; అంతన్ = అప్పుడు; సొరిదిన్ = క్రమముగా; అవతారములున్ = అవతారములను; తాల్చి = ధరించి; సొంపు = ఒప్పు; మీఱన్ = అతిశయించునట్లుగా; రాత్రిచరులను = రాక్షసులను; చంపెన్ = సంహరించెను; ఈరసము = కోపము; తోడన్ = తోటి.
భావము:- ఋషభునకు ఆత్మయోగాన్ని ఈవిధంగా ఉపదేశించిన అచ్యుతుడు విష్ణువు భూభారాన్ని అణచుటకు ఎన్నోఅవతారాలెత్తి పట్టుదలతో దుర్మార్గులు అయిన రాక్షసులను సంహరించాడు.

తెభా-11-71-వ.
అట్టి పరమేశ్వరుని లీలాగృహీతంబులగు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామ రఘురామ రామ బుద్ధ కల్క్యాద్యవతారంబు లనేకంబులు గలవు; వాని నెఱిఁగి నుతియింప శేషభాషాపతులకైన నలవి గాదు; మఱియును.
టీక:- అట్టి = అటువంటి; పరమేశ్వరుని = నారాయణునిచేత; లీలా = లీలగా; గృహీతంబు = గ్రహింపబడినవి; అగు = ఐన; మత్స్య = మత్యావతారము; కూర్మ = కూర్మావతారము; వరాహ = వరాహావతారము; నారసింహ = నరసింహావతారము; వామన = వామనావతారము; రామ = పరశురామావతారము; రఘురామ = రామావతారము; రామ = బలరామావతారము; బుద్ధ = బుద్ధావతారము; కల్క్య = కల్క్యవతారము; ఆది = మున్నగు; అవతారంబులు = అవతారములు; అనేకంబులు = చాలా; కలవు = ఉన్నాయి; వానిని = వాటిని; ఎఱిగి = తెలిసి; నుతియింపన్ = స్తుతించుటకు; శేష = ఆదిశేషుని (వేయితలల); భాషాపతి = బ్రహ్మదేవుని {భాషాపతి - భాషా (సరస్వతీదేవికి) పతి (భర్త), బ్రహ్మ}; కైనను = కైనప్పటికి; అలవి = శక్యము; కాదు = కాదు; మఱియును = ఇంకను.
భావము:- అటువంటి పరమేశ్వరుడు లీలావిలాసంగా గ్రహించిన అవతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రఘురామ బలరామ బుద్ధ కల్కి అనే దశావతారాలే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని తెలిసి స్తుతించటం బ్రహ్మదేవుడికైనా, ఆదిశేషునికైనా అలవి కాదు.” అని పలికి శ్రీహరిని ఇలా స్తుతించాడు.

తెభా-11-72-ససీ.
వ వికచ సరసిరుహ యనయుగ! నిజచరణ-
నచరనది జనిత! నిమవినుత!
లధిసుత కుచకలశ లిత మృగమద రుచిర-
రిమళిత నిజహృదయ! రణిభరణ!
ద్రుహిణముఖ సురనికర విహిత నుతికలితగుణ!-
టిఘటిత రుచిరతర నకవసన!
భుగరిపు వరగమన! తగిరిపతివినుత!-
తతజపరత! నియమరణి చరిత!

తెభా-11-72.1-తే.
తిమి, కమఠ, కిటి, నృహరి, ముదిత బలి నిహి
పద, పరశుధర, దశవన విదళన,
మురదమన, కలికలుష సుముదపహరణ!
రివరద! ముని నర సుర రుడ వినుత!

టీక:- నవ = కొత్తగా, తాజా; వికచ = వికసించిన; సరసిరుహ = పద్మములవంటి; నయన = కన్నుల; యుగ = జంట కలవాడా; నిజ = తన యొక్క; చరణ = పాదముల; గగనచరనది = దేవగంగ {గగనచరనది - ఆకాశమునందు వర్తించు నది, గంగ}; జనిత = పుట్టించినవాడా; నిగమ = వేదములచే; వినుత = స్తుతింపబడినవాడా; జలధిసుత = లక్ష్మీదేవి {జలధిసుత - అమృత మథన కాలమందు సముద్రమున పుట్టిన దేవి, లక్ష్మి}; కుచ = వక్షోజములనెడి; కలశ = కలశములందిలి; లలిత = మనోజ్ఞమైన; మృగమద = కస్తూరిచే; రుచిర = చక్కటి; పరిమిళిత = సువాసనుగల; నిజ = తన; హృదయ = హృదయము కలవాడా; ధరణి = భూమిని; భరణ = మోసినవాడా; ద్రుహిణ = బ్రహ్మదేవుడు; ముఖ = మొదలగు; సుర = దేవతల; నికర = సమూహముల; విహిత = చేయబడిన; నుతి = స్తుతించుట; కలిత = కలిగిన; గుణ = గుణములు కలవాడా; కటి = నడుమునకు; ఘటిత = కట్టిన, ధరించిన; రుచిరతర = మిక్కిలి ప్రకాశవంతమైన {రుచిరము - రుచిరతరము - రుచిరతమము}; కనక = బంగారు; వసన = చేలము కలవాడా; భుజగరిపు = గరుత్మంతుడు {భుజగరిపుడు - సర్పములకు శత్రువైనవాడు, గరుత్మంతుడు}; వర = ఉత్తమమైన; గమన = వాహనముగా కలవాడా; రజతగిరిపతి = పరమ శివునిచే {రజతగిరిపతి - రజతగిరి (కైలాసపర్వతము) పై నుండు పతి (ప్రభువు), శివుడు}; వినుత = స్తుతింపబడువాడా; సతత = నిరంతర; జప = జపముచేసేవారియందు; రత = ఆసక్తి కలవాడా; నియమసరణి = నియమబద్ధమైన; చరిత = వర్తన కలవాడా.
తిమి = మత్యావతారము; కమఠ = కూర్మావతారము; కిటి = వరాహావతారము; నృహరి = నరసింహావతారము; ముదితబలినిహితపద = వామనావతారము {ముదితబలినిహితపద - ముదిత (సంతోషము నొందిన) బలిచక్రవర్తిని నిహిత (తొక్కిన) పద (పాదములు కలవాడు), వామనుడు}; పరశుధర = పరశురామావతారము {పరశుధరుడు - పరశువు (గొడ్డలి)ని ధరించినవాడు, పరశురాముడు}; దశవదనవిదళన = రామావతారము {దశవదనవిదళనుడు - దశవదను (పదితలలవాడు, రావణాసురు)ని విదళన (సంహరించినవాడు), రాముడు}; మురదమన = కృష్ణావతారము {మురదమనుడు - మురాసురుని చంపినవాడు, కృష్ణుడు}; కలికలుషసుముదపహరణ = కల్క్యవతారము {కలికలుషసుముదపహరణ - కలియుగమున కలుగు కలుష (పాపములను) సు (మిక్కిలి) ముద (సంతోషముతో) అపహరణ (తొలగించువాడు), కల్కి}; కరి = గజేంద్రుని; వరద = వరమిచ్చినవాడా; ముని = మునులచేత; నర = మానవులచేత; సుర = దేవతలచేత; గరుడ = గురుడులచేత; వినుత = స్తుతింపబడినవాడా.
భావము:- “నవవికసిత పద్మములవంటి కన్నుల జంట కలవాడ! హరి! పాదము మూలము లందు ఆకాశగంగ పుట్టినవాడ! వేదములచేత పొగడబడు వాడ! లక్ష్మీదేవి యొక్క కలశముల వంటి వక్షోజాలకు అలరుతుండెడి కస్తూరి పరిమళాలు అంటిన హృదయం కలవాడ! భూమిని మోసిన వాడ! బ్రహ్మదేవుడు మున్నగు దేవతలు సంస్తుతించు వాడ! నడుము నందు బంగారచేలము ధరించినవాడ! గరుత్మంతుడు వాహనముగా కలవాడ! కైలాసపతి శంకరునిచే నుతింపబడు వాడ! నిరంతర జపం చేసే వారి యందు ఆసక్తి కలవాడ! నియమబద్ధమైన చరిత్ర కలవాడ! మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, బలరామ, రామ, కృష్ణ, కల్కి అను దశావతారములను దాల్చినవాడ! గజేంద్రవరదా! మునులు నరులు సురలు గరుడులు మున్నగు వారిచే పొగడబడు వాడ!”

తెభా-11-73-వ.
ఇవ్విధంబునం బ్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసంబు లనంతంబులు గలవు; మనోవాక్కాయకర్మంబుల హరిపూజనంబు సేయక, విపరీత గతులం దిరుగుచుండు జడుల కెవ్విధం బగు గతిగలుగు?” ననిన నప్పు డప్పుడమిఱేఁ డప్పరమపురుషుం జూచి “యట్టి జడులు ముక్తి నొందు నుపాయం బెట్టు లంతయు నెఱింగింపుఁ” డనినఁ జమసుం డిట్లనియె
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ; ప్రవర్తిల్లిన = విలసిల్లినట్టి; శ్రీమత్ = శ్రీమంతుడైన; నారాయణమూర్తి = హరి యొక్క; లీలా = లీలల; విలాసంబు = విలాసములు; అనంతంబులు = అనేకములు; కలవు = ఉన్నాయి; మనః = మనసుతో; వాక్కు = నోటితో; కర్మంబులన్ = పనులతో; హరి = విష్ణు; పూజనంబు = భక్తిని; చేయక = చేయకుండ; విపరీత = ఇతరమైన; గతులన్ = విధములుగ; తిరుగుచుండు = మెలగెడి; జడులు = మూఢుల; కిన్ = కు; ఏ = ఏ; విధంబు = విధము; అగు = ఐన; గతి = సుస్థితి; కలుగున్ = కలుగుతుందా, కలుగదు; అనినన్ = అని పలికిన; ఆ = ఆ; పుడమిఱేడు = భూనాథుడు, రాజు; ఆ = ఆ ప్రసిద్ధుడైన; పరమ = పావనమైన; పురుషున్ = పురుషుని; చూచి = చూసి; అట్టి = అటువంటి; జడులు = మూఢులు; ముక్తిన్ = మోక్షమును; ఒందు = పొందెడి; ఉపాయంబు = ఉపాయము; ఎట్టులు = ఎలాగ; అంతయున్ = ఇది సమస్తము; ఎఱిగింపుడు = తెలుపండి; అనినన్ = అనగా; చమసుండు = చమసుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;
భావము:- ఇలా హరిస్తుతి చేసి ఇలా అన్నాడు. “ఈ విధంగా ప్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసములు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. మనోవాక్కాయకర్మలా హరిపూజ చేయకుండా విపరీత మార్గాలలో తిరుగుతూ ఉండే మూఢులకు ఏవిధంగానూ సద్గతి కలుగదు.” అని మహాముని అనగా ఆ మహారాజు ఆ పరమపురుషులతో “అటువంటి మూర్ఖులు ముక్తిపొందే ఉపాయం తెలియ జెప్పండి.” అని అడిగాడు. వారిలో చమసు డనే మునిముఖ్యుడు విదేహుడితో ఇలా అన్నాడు.

తెభా-11-74-సీ.
"రిముఖ బాహూరు రపదాబ్జములందు-
రుసఁ జతుర్వర్ణ ర్గసమితి
నియించె; నందులో తులును శూద్రులు-
రిఁ దలంతురు; కలిహాయనముల
వేదశాస్త్ర పురాణ విఖ్యాతులై కర్మ-
ర్తలై విప్రులు ర్వ మెసఁగి
రిభక్తపరులను హాస్యంబు సేయుచు -
నిరయంబు నొందుట నిజము గాదె?

తెభా-11-74.1-తే.
మృదుల పక్వాన్న భోజనమును మాని
జీవహింసకుఁ జనువానిఁ జెందు నఘము;
రి నుతింపక స్త్రీలోలుఁ డైనఁవాడు
రకవాసుండు నగుచుండు నవరతము.

టీక:- హరి = విష్ణుమూర్తి యొక్క; ముఖ = ముఖము; బాహు = చేతులు; ఊరు = తొడలు; వర = శ్రేష్ఠమైన; పద = పాదములు అనెడి; అబ్జములు = పద్మముల; అందున్ = అందు; వరుసన్ = క్రమముగా; చతుర్వర్ణ = అన్నిజాతులమానవుల {చతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు నాలుగు}; వర్గ = వర్గముల; సమితి = సమూహములు; జనియించెన్ = పుట్టెను; అందు = వారి; లోన్ = లో; సతులును = స్త్రీలు; శూద్రులు = శూద్రులు; హరిన్ = హరిని; తలతురు = సేవించెదరు; కలి = కలియుగపు; హాయనములున్ = సంవత్సరములలో; వేద = వేదములు; శాస్త్ర = శాస్త్రములు; పురాణా = పురాణములందు; విఖ్యాతులు = ప్రసిద్ధులు; ఐ = అయ్యి; కర్మ = కర్మలను; కర్తలు = చేయువారు; ఐ = అయ్యి; విప్రులు = బ్రాహ్మణులు; గర్వము = అహంకారము; ఎసగి = మితిమీరి; హరి = విష్ణు; భక్తి = భక్తి యందు; పరులను = ఆసక్తి కలవారిని; హాస్యంబు = పరిహాసము; చేయుచు = చేస్తూ; నిరయంబున్ = నరకమును; ఒందుట = పొందుట; నిజము = తథ్యము; కాదే = కదా.
మృదుల = మృదువైన; పక్వ = చక్కగా ఉడికిన; అన్న = అన్నపు; భోజనములను = భోజనములను; మాని = విడిచి; జీవ = ప్రాణులను; హింస = చంపుట; కున్ = కు; చను = పోయెడి; వానిన్ = వాడిని; చెందున్ = చెందుతుంది; అఘము = పాపము; హరి = విష్ణుమూర్తిని; నుతింపక = స్తుతించకుండగ; స్త్రీ = యువతుల ఎడ; లోలుడు = లాలస కలవాడు; ఐన = అయినట్టి; వాడు = అతడ; నరక = నరకలోకమున; వాసుండు = వసించెడి వాడు; అగుచునుండున్ = ఔతుంటాడు.
భావము:- విష్ణుమూర్తి ముఖం బాహువులు తొడలు పాదములు వీటి యందు వరుసగా వర్ణములు నాలుగు పుట్టాయి. అందులో స్త్రీలు శూద్రులు హరిని తలుస్తారు. కలికాలంలో విప్రులు వేద శాస్త్ర పురాణాలందు ప్రసిద్ధులై, కర్మలుచేస్తూ గర్వంతో హరిభక్తులను అపహాస్యం చేస్తారు. వారు నరకానికి పోవటం ఖాయం. స్వచ్ఛమైన పక్వాన్నం భుజించుట మాని మాంసాహారులై జీవహింసకు పాల్పడేవాడికి పాపం తగులుతుంది. శ్రీహరిని నుతింపక స్త్రీలోలు డైనవాడికి ఎప్పుడూ నరకమే నివాసం.

తెభా-11-75-వ.
అట్లు గావున గృహ క్షేత్ర పుత్త్ర కళత్ర ధనధాన్యాదులందు మోహితుండయి ‘ముక్తిమార్గంబు లప్రత్యక్షంబు’ లని నిందించువాఁడును, హరి భక్తివిరహితుండును, దుర్గతిం గూలుదు” రని మునివరుం డానతిచ్చిన విదేహుం డిట్లనియె.
టీక:- అట్లుగావున = అందుచేత; గృహ = ఇళ్ళు; క్షేత్ర = పొలాలు; పుత్ర = కొడుకులు; కళత్ర = భార్య; ధన = సంపదలు; ధాన్య = ధాన్యము; ఆదుల = మున్నగువాటి; అందు = ఎడల; మోహితుండు = వ్యామోహము కలవాడు; అయి = ఐ; ముక్తిమార్గంబులు = మోక్షపదములు; అప్రత్యక్షంబులు = కంటికికనబడనివి; అని = అని; హరి = విష్ణు; భక్తి = భక్తి యందు; విరహితుండును = లేనివాడు; దుర్గతిన్ = నరకములో; కూలుదురు = పడిపోవుదురు; అని = అని; ముని = మునులలో; వరుండు = ఉత్తముడు; ఆనతిచ్చినన్ = చెప్పగా; విదేహుండు = విదేహుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అందుచేత, ఇండ్లు పొలాలు, సంతానం, భార్య, ధనం, ధాన్యం మున్నగు వాటిమీద వ్యామోహంతో మోక్షం కంటికి కనపడేదికాదు. కనుక లేదని నిందించే వారు; హరిభక్తి లేనివారు దుర్గతిలో కూలిపోతారు.” అని మునిశ్రేష్ఠుడు అనగా విదేహుడు ఇలా అడిగాడు.

తెభా-11-76-ఆ.
" యుగంబునందు నే రీతి వర్తించు?
నెట్టి రూపువాఁడు? నెవ్విధమున
మును నుతింపఁబడెను మునిదేవగణముచే
విష్ణుఁ డవ్యయుండు విశ్వవిభుఁడు?

టీక:- ఏ = ఏ ఏ; యుగంబునన్ = యుగములందు; ఏ = ఏ ఏ; రీతిన్ = ప్రకారముగా; వర్తించున్ = చరించును; ఎట్టి = ఎలాంటి; రూపు = రూపములధరించిన; వాడు = వాడు; ఏ = ఏ ఏ; విధమునన్ = విధముగ; మునున్ = పూర్వము; నుతింపబడెను = స్తుతించబడెను; ముని = మునుల; దేవ = దేవతల; గణము = సమూహముల; చేన్ = చేత; విష్ణుడు = హరి {విష్ణువు - విశ్వమునందు వ్యాపించి ఉండువాడు, హరి}; అవ్యయుండు = హరి {అవ్యయుండు - తరుగుట లేనివాడు, విష్ణువు}; విశ్వవిభుడు = హరి {విశ్వవిభుడు - సకలలోకాలకి ప్రభువు, విష్ణువు}.
భావము:- “అవ్యయుడు, జగన్నాథుడు అయిన విష్ణుమూర్తి ఏ యుగంలో ఏ రీతిగా ఉన్నాడు? ఏ రూపం ధరించాడు? ఏ విధంగా మునులచేత, దేవతలచేత కీర్తించబడ్డాడు?”

తెభా-11-77-వ.
అనిన విని యందుఁ గరభాజనుం డిట్లనియె; “ననేకావతారంబులు నానా రూపంబులును బహువిధ వర్ణంబులునుం గలిగి, రాక్షసులను సంహరించి, దుష్టజన నిగ్రహంబును శిష్టజన పరిపాలనంబునుం జేయుచుఁ గృతయుగంబున శుక్లవర్ణుండై చతుర్బాహుండై జటావల్కల కృష్ణాజినోత్తరీయ జపమాలికా దండ కమండలు ధరుండయి హరి నిర్మలతపోధ్యానానుష్ఠానగరిష్ఠు లైన పురుష శ్రేష్ఠులచేత హంసుండు, సువర్ణుండు, వైకుంఠుండు, ధర్ముం, డమలుండు, యోగేశ్వరుం, డీశ్వరుండు, పురుషుం, డవ్యక్తుండు, పరమాత్ముం డను దివ్యనామంబులం బ్రసిద్ధి వహించి గణుతింపంబడుఁ; ద్రేతాయుగంబున రక్తవర్ణుం డయి బాహుచతుష్క మేఖలాత్రయ విశిష్టుం డయి హిరణ్యకేశుండును, వేదత్రయస్వరూపుండును, స్రుక్‌ స్రువాద్యుపలక్షణ శోభితుండునయి విష్ణు, యజ్ఞ, పృశ్నిగర్భ, సర్వదేవోరుక్రమ, వృషాకపి, జయంతోరుగాయాఖ్యల బ్రహ్మవాదుల చేత నుతియింపంబడు; ద్వాపరంబున శ్యామలదేహుండును, పీతాంబరధరుండును, బాహుద్వయోపశోభితుండును, దివ్యాయుధధరుండును, శ్రీవత్స కౌస్తుభ వనమాలికా విరాజమానుండును, మహారాజోపలక్షణుండు నై జనార్దన, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నానిరుద్ధ, నారాయణ, విశ్వరూప, సర్వభూతాత్మ కాది నామంబుల వెలసి, మూర్ధాభిషిక్తులచేత సన్నుతింపంబడు; కలియుగంబునఁ గృష్ణవర్ణుండును గృష్ణనామకుండునునై భక్తసంరక్షణార్థంబు పుండరీకాక్షుండు యజ్ఞ సంకీర్తనంబుల చేతం బ్రస్తుతింపబడు; హరి, రామ, నారాయణ, నృసింహ, కంసారి, నలినోదరాది బహువిధ నామంబులచే బ్రహ్మవాదులైన మునీంద్రులు నుతియింపుదురు; మఱియును.
టీక:- అనినన్ = అని అడుగగా; విని = విని; అందున్ = వారిలో; కరభాజనుండు = కరభాజనుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అనేక = పెక్కు; అవతారంబులు = అవతారములు; నానా = పలు; రూపాలును = స్వరూపాలు; బహు = చాలా; విధ = రకముల; వర్ణంబులునున్ = రంగులు; కలిగి = ధరించి, ఉండి; రాక్షసులను = రాక్షసులను; సంహరించి = చంపి; దుష్ట = చెడ్డ; జన = వారిని; నిగ్రహంబును = శిక్షించుట; శిష్ట = మంచి; జన = వారిని; పరిపాలనంబునున్ = రక్షణంబు; చేయుచున్ = చేస్తు; కృతయుగంబునన్ = కృతయుగములో; శుక్ల = తెల్లని; వర్ణుండు = రంగు కలవాడు; ఐ = అయ్యి; చతుర్ = నాలుగు (4); బాహుండు = చేతులు కలవాడు; ఐ = అయ్యి; జట = జటలుకట్టిన శిరోజములు; వల్కల = నారచీరలు; కృష్ణాజిన = జింకచర్మము చేసిన; ఉత్తరీయము = పైబట్ట; జపమాలిక = జపమాల; దండ = దండము {దండము - పైన చేతిని ఆన్చుకొని ఉంచుటకు అనువుగా ఉండి జపమునకు అనుకూలమైన కఱ్ఱ}; కమండలు = కమండలము {కమండలము - జలమును సన్నని ధారగా పోయుటకు వీలై జల భక్షణ, యోగ క్రియాదులకు అనుకూలమైన తొండము ఉండు కలశము, జలపాత్ర}; ధరుండు = ధరించినవాడు; అయి = ఐ; హరి = విష్ణువు {హరి - భక్తుల హృదయములను ఆకర్షించువాడు, విష్ణువు}; నిర్మల = పరిశుద్ధమైన; తపః = తపస్సు; ధ్యాన = ధ్యానము; అనుష్ఠాన = యోగాది అనుష్ఠానాలలో; గరిష్ఠులు = మిక్కిలి గొప్పవారు; ఐన = అయినట్టి; పురుష = మానవ; శ్రేష్ఠుల = ఉత్తముల; చేతన్ = చేత; హంసుండు = హంసుడు {హంసుడు - పరమాత్మ తానైనవాడు, విష్ణువు}; సువర్ణుండు = సువర్ణుడు; వైకుంఠుండు = వైకుంఠుడు {వైకుంఠుడు - చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమెకు జన్మించినవాడు, కుంఠనము (మొక్కపోవుట) లేని వాడు, విష్ణువు}; ధర్ముండు = ధర్ముడు {ధర్ముడు - ధర్మమే తానైనవాడు, విష్ణువు}; అమలుండు = అమలుడు {అమలుడు - పరిశుద్ధుడు, విష్ణువు}; యోగీశ్వరుండు = యోగీశ్వరుడు {యోగీశ్వరుడు - యోగులకు ప్రభువైన వాడు, విష్ణువు}; ఈశ్వరుండు = ఈశ్వరుడు {ఈశ్వరుడు - స్వభావము చేతనే ఈశత్వము కలవాడు, విష్ణువు}; పురుషుండు = పురుషుడు {పురుషుడు - పురములకు కారణభూతమైన వాడు, విష్ణువు}; అవ్యక్తుండు = అవ్యక్తుడు {అవ్యక్తుడు - వ్యక్తముకానివాడు, విష్ణువు}; పరమాత్ముండు = పరమాత్ముడు {పరమాత్ముడు - సర్వమునందు ఆత్మ యై ఉండి సర్వాత్మలు తానైన వాడు, విష్ణువు}; అను = అనెడి; దివ్య = మహిమాన్వితమైన; నామంబులన్ = పేర్లతో; ప్రసిద్ధి = ప్రసిద్ధి; వహించి = చెంది; గణుతింపంబడున్ = స్తుతింపబడును; త్రేతాయుగంబునన్ = త్రేతాయుగమునందు; రక్త = ఎఱ్ఱని; వర్ణుండు = రంగు కలవాడు; అయి = ఐ; బాహు = చేతులు; చతుష్క = నాలుగు (4); మేఖలాత్రయ = ముప్పేటల మొలతాళ్ళతో; విశిష్టుండు = మిక్కిలి శ్రేష్ఠమైనవాడు; అయి = ఐ; హిరణ్య = బంగారురంగు; కేశుండును = శిరోజములు కలవాడు; వేద = వేదములు; త్రయ = మూటి (3); స్వరూపుండును = ఆకృతి ధరించినవాడు; స్రుక్కు = స్రుక్కు; స్రువ = స్రువము; ఆది = మున్నగు; ఉపలక్షణ = ఉపలక్షణములతో; శోభితుండు = విలసిల్లువాడు; అయి = ఐ; విష్ణు = విష్ణువు {విష్ణువు - విశ్వమునందు వ్యాపించి ఉండువాడు, హరి}; యజ్ఞ = యజ్ఞుడు {యజ్ఞుడు - యజ్ఞకర్మ యజ్ఞకర్త యజ్ఞభోక్త తానైన వాడు, విష్ణువు}; పృశ్నిగర్భ = పృశ్నిగర్భుడు {పృశ్నిగర్భ - పృశ్ని (కిరణములకు) గర్భ (జన్మస్థానమైనవాడు) (మిక్కిలిగ ప్రకాశించువాడు), పృశ్ని (అదితి పూర్వజన్మ నామము) గర్భముననున్న వాడు, విష్ణువు}; సర్వదేవ = సర్వదేవుడు {సర్వదేవుడు - సమస్తమును (దివయింతి ఇతి దేవః) ప్రకాశింపజేయువాడు, విష్ణువు}; ఉరుక్రమ = ఉరుక్రముడు {ఉరుక్రముడు - పెద్ద అడుగులిడిన వాడు, వామనావతారుడు, విష్ణువు}; వృషాకపి = వృషాకపి {వృషాకపి - విష్ణువు, వ్యు. వృష+న+కంప+ఇన్, న లోపః, కృప్ర., ధర్మమునకు లోపము రానీయనివాడు, అధర్మముచే మునిగియున్న భూమిని వరహావతారమున ఉద్ధరించినవాడు, విష్ణుసహస్రనామములు శ్రీశంకర భాష్యం 101వ నామము}; జయంత = జయంతుడు {జయంతుడు - జయించు శీలము కల వాడు, విష్ణువు}; ఉరుగాయ = ఉరుగాయుడు {ఉరుగాయుడు - ఉరు (పెద్ద) కాయుడు (దేహము కలవాడు), ఉరుగాయుడు అను మహావిజ్ఞానిగా అవతరించినవాడు, విష్ణువు}; ఆఖ్యలన్ = పేర్లతో; బ్రహ్మవాదుల = బ్రహ్మవాదుల; చేతన్ = చేత; నుతియింపంబడున్ = స్తోత్రములు చేయబడును; ద్వాపరంబునన్ = ద్వాపరయుగమున; శ్యామల = నీలవర్ణము కలిగిన; దేహుండును = శరీరము కలవాడు; పీత = పసుపువర్ణము కలిగిన; అంబర = వస్త్రములు; ధరుండును = కట్టుకొన్నవాడును; బాహు = చేతులు; ద్వయ = రెండు (2); ఉపశోభితుండును = తో ప్రకాశించువాడును; దివ్య = మహిమాన్వితమైన; ఆయుధ = ఆయుధములను; ధరుండును = ధరించినవాడు; శ్రీవత్స = శ్రీవత్స చిహ్నము; కౌస్తుభ = కౌస్తుభ మణి; వనమాలికా = ఆకులుపూలుగలమాలికతో; విరాజమానుండును = విలసిల్లువాడును; మహారాజ = మహారాజు యొక్క; ఉపలక్షణుండున్ = లక్షణములు కలవాడు; ఐ = అయ్యి; జనార్దన = జనార్దనుడు {జనార్దనుడు - (సమస్త)జనులకును అర్దనుడు (గమ్యమైన వాడు), విష్ణువు}; వాసుదేవ = వాసుదేవుడు {వాసుదేవ - ఆత్మలందు వసించెడి దేవుడు, విష్ణువు}; సంకర్షణ = సంకర్షణుడు {సంకర్షుణుడు- చతుర్వూహములలోని (1వాసుదేవ 2ప్రద్యుమ్న 3అనిరుద్ధ 4సంకర్షణ) సంకర్షణమనబడెడి వ్యూహము}; ప్రద్యుమ్న = ప్రద్యుమ్నుడు {ప్రద్యుమ్నుడు - చతుర్వ్యూహములలోని ప్రద్యుమ్నుండు, అహంకారము సంజ్ఞగాకలవాడు, విష్ణువు}; అనిరుద్ధ = అనిరుద్ధుడు {అనిరుద్దుడు - అడ్డుకొనరానివాడు, చతుర్వ్యూహములలోని అనిరుద్ధుడు (చిత్తమునకు సంకేతము), విష్ణువు}; నారాయణ = నారాయణుడు {నారాయణ - శ్లో. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపోవై నరసూనవః, అయనంతస్యతా ప్రోక్తాః స్తేన నారాయణ స్మృత్యః. (విష్ణుపురాణము), నారాయణశబ్ద వాచ్యుడు, విష్ణువు}; విశ్వరూప = విశ్వరూపుడు {విశ్వరూపుడు - సమస్తమైన విశ్వము తన రూపమైన వాడు, విరాట్ పురుషుడు, విష్ణువు}; సర్వభూతాత్మక = సర్వభూతాత్మకుడు {సర్వభూతాత్మక - సమస్త జీవుల ఆత్మలందు నిండి ఉండువాడు, విష్ణువు}; ఆది = మున్నగు; నామంబులన్ = పేర్లతో; వెలసి = ప్రసిద్ధుడై; మూర్ధాభిషిక్తుల = చక్రవర్తులచేత; చేతన్ = చేత; సన్నుతింపంబడున్ = స్తుతింపబడును; కలియుగంబునన్ = కలియుగములో; కృష్ణ = నల్లని; వర్ణుండు = రంగు కలవాడు; కృష్ణ = కృష్ణుడు అను; నామకుండును = పేరు కలవాడు; ఐ = అయ్యి; భక్త = భక్తులను; రక్షణ = కాపాడుట; అర్థంబు = కోసము; పుండరీకాక్షుండు = కృష్ణుడు {పండరీకాక్షుడు - పుండరీకములు (పద్మములు) వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; యజ్ఞ = యజ్ఞములచేత; సంకీర్తనంబుల = సంకీర్తనల; చేతన్ = చేత; ప్రస్తుతింపబడున్ = స్తోత్రములు చేయబడును; హరి = హరి {హరి - భక్తులను ఆకర్షించువాడు, విష్ణువు}; రామ = రామ; నారాయణ = నారాయణ; నృసింహ = నృసింహ; కంసారి = కంసారి {కంసారి - కంసుని శత్రువు, కృష్ణుడు}; నలినోదర = నలినోదర {నలినోదరుడు - నలినము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; ఆది = మొదలైన; బహు = అనేక; విధ = రకముల; నామంబులు = పేర్ల; చేన్ = చేత; బ్రహ్మవాదులు = బ్రహ్మవాదులు; ఐన = అయినట్టి; ముని = మునులలో; ఇంద్రులు = ఉత్తములు; నుతియింపుదురు = స్తోత్రములు చేయబడును; మఱియును = ఇంకను.
భావము:- అని అడుగగా విని వారిలో కరభాజనుడనే ఋషి విదేహరాజుతో ఇలా అన్నాడు. ఎన్నో అవతారాలు; ఎన్నెన్నో రూపాలు; అనేక రకాల వర్ణాలు ధరించి రాక్షసులను సంహరించి; దుష్టశిక్షణం శిష్టరక్షణం కావించే శ్రీ మహవిష్ణువు…
కృతయుగంలో తెల్లని రంగుతో నాలుగుచేతులు కలిగి ఉంటాడు; జడలు నారచీరలు జింకచర్మం జపమాలిక దండం కమండలము దాల్చి నిర్మలమైన తపస్సు ధ్యానము అనుష్టానము గల మునిశ్రేష్ఠులచేత హంసుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే దివ్య నామాలతో ప్రశంసింపబడుతూ ప్రసిద్ధి చెందుతాడు.
త్రేతాయుగంలో ఎఱ్ఱనిరంగుతో, నాలుగుచేతులు బంగరురంగు జుట్టు కలిగి, మూడు పేటల మేఖలలు ధరించి, మూడువేదాల ఆకృతి ధరించి, స్రుక్కు స్రువము మొదలైన ఉపలక్షణాలతో శోభిల్లుతూ; విష్ణువు, యజ్ఞుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో బ్రహ్మవాదులచేత నుతింపబడతాడు.
ద్వాపరయుగంలో నీలవర్ణంతో, పసుపుపచ్చని బట్టలు కట్టుకుని, రెండు చేతులతో, దివ్యమైన ఆయుధాలు పట్టుకుని, శ్రీవత్సం కౌస్తుభం వనమాలికల ప్రకాశిస్తూ; మహారాజ లక్షణాలు కలిగి జనార్ధునుడు, వాసుదేవుడు, సంకర్షుణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు మున్నగు పేర్లతో వెలసి చక్రవర్తులచేత సన్నుతించబడతాడు.
కలియుగంలో నల్లనిరంగుతో కృష్ణుడు అనుపేరు కలిగి, భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞములందు కీర్తించబడతాడు. అప్పుడు ఆయనను హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నళినోదరుడు మున్నగు పేర్లతో బ్రహ్మవాదులైన మునీంద్రులు స్తుతిస్తూంటారు.

తెభా-11-78-తే.
ద్రవిడ దేశంబునందులఁ దామ్రపర్ణి
హ్యజా కృతమాలాది కలనదుల
కెవ్వఁ డేనిని భక్తితో నేఁగి యచటఁ
బొదలి తర్పణ మొగిఁ జేయఁ బుణ్య మొదవు.

టీక:- ద్రవిడ = ద్రావిడ; దేశంబున్ = దేశము; అందులన్ = లో; తామ్రపర్ణి = తామ్రపర్ణి; సహ్యజ = కావేరి; కృతమాలా = కృతమాల; ఆది = మున్నగు; సకల = అన్ని; నదుల = నదుల; కిన్ = కు; ఎవ్వడు = ఎవరు; ఏనిని = అయినను; భక్తి = భక్తి; తోన్ = తోటి; ఏగి = వెళ్ళి; అచటన్ = అక్కడ; పొదిలి = అతిశయించి; తర్పణమున్ = తర్పణములను; ఒగిన్ = చక్కగా; చేయన్ = చేసినచో; పుణ్యము = పుణ్యము; ఒదవు = కలుగును.
భావము:- ద్రావిడదేశంలో తామ్రపర్ణి, కావేరి, కృతమాల మొదలైన నదులలో భక్తితో స్నానంచేసి తర్పణంచేస్తే మానవులకు పుణ్యం కలుగుతుంది.

తెభా-11-79-వ.
ఇవ్విధంబునఁ బ్రశంసింపఁదగిన కావేర్యాది మహానదీపావనజల స్నాన పాన దానంబులను, విష్ణుధ్యానకథాసుధార సానుభవంబుల నిరూఢులగు భాగవతోత్తములు గలిగిరేనిం జెడని పదంబునుం బొందుదు” రని ఋషభకుమారులు భగవత్ప్రతిబింబంబు లయిన పరమపురుషులుం బోలె విదేహజనపాలునకు నిశ్శ్రేయః పదప్రాప్తికరంబు లైన భగవద్భక్తి ధర్మంబు లుపదేశించి యంతర్ధానంబు నొందిరి; మిథిలేశ్వరుండును జ్ఞానయోగం బంగీకరించి నిర్వాణపదంబు నొందె; నీ యుపాఖ్యానంబు వ్రాసినఁ బఠించిన వినిన నాయురారోగ్యైశ్వర్యములు గలిగి పుత్త్ర పౌత్త్ర వంతులై సకల కలికల్మష రహితులై విష్ణులోక నివాసు లగుదు” రని నారదుండు వసుదేవునకుం జెప్పి మఱియును.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ; ప్రశంసించదగిన = పొగడ తగిన; కావేరి = కావేరి; ఆది = మున్నగు; మహా = గొప్ప; నదీ = నదుల; పావన = పవిత్రమైన; జల = నీటిలో; స్నాన = స్నానము చేయుట; పాన = తాగుట; దానంబులను = దానాలు చేయుటలను; విష్ణు = హరి; ధ్యాన = ధ్యానముచేయుట; కథా = వృత్తాంతములు అను; సుధారస = అమృతమును; అనుభవంబులన్ = ఆస్వాదించుటలను; నిరూఢులు = నిష్ణాతులు; అగు = ఐ; భాగవత = భాగవతులలో; ఉత్తములు = ఉత్తములు; కలిగిరి = పొందినట్లు; ఏనిన్ = అయినచో; చెడనిపదంబునున్ = పరమపదమును; పొందుదురు = పొందెదరు; అని = అని; ఋషభ = ఋషభుని; కుమారులు = పుత్రులు; భగవత్ = భగవంతుని; ప్రతిబింబంబులు = ప్రతిబింబములు; అయిన = ఐన; పరమపురుషులున్ = పరమపురుషులు; పోలెన్ = వలె; విదేహ = విదేహుడు అను; జనపాలున్ = రాజు; కున్ = కి; నిశ్శ్రేయః = మోక్ష; పద = పదమును; ప్రాప్తి = పొందుట; కరంబులు = కలిగించునవి; ఐన = అయిన; భగవద్భక్తి = భగవద్భక్తి; ధర్మంబులున్ = ధర్మములను; ఉపదేశించి = తెలియజెప్పి; అంతర్ధానంబునొందిరి = మాయమైరి; మిథిల = మిథిలానగర; ఈశ్వరుండును = ప్రభువు; జ్ఞానయోగంబున్ = జ్ఞానయోగమును; అంగీకరించి = స్వీకరించి; నిర్వాణపదంబున్ = పరమపదమును; ఒందెన్ = పొందెను; ఈ = ఈ; ఉపాఖ్యానంబున్ = కథనమును; వ్రాసినన్ = రాసినా; పఠించిన = చదివినా; వినినన్ = విన్నా; ఆయుః = ఆయుష్షు; ఆరోగ్య = ఆరోగ్యము; ఐశ్వర్యములు = ఐశ్వర్యములు; కలిగి = పొంది; పుత్ర = కొడుకులు; పౌత్రవంతులు = మనుమలు కలవారు; ఐ = అయ్యి; సకల = సర్వ; కలి = కలికాలప్రభావ; కల్మష = పాపములు; రహితులు = తొలగినవారు; ఐ = అయ్యి; విష్ణులోక = వైకుంఠమున; నివాసులు = వసించెడి వారు; అగుదురు = ఔతారు; అని = అని; నారదుండు = నారదుడు; వసుదేవున్ = వసుదేవుని; కున్ = కి; చెప్పి = చెప్పి; మఱియును = ఇంకను.
భావము:- ఈవిధంగా ప్రశంసించదగిన కావేరి మున్నగు మహనదుల పావనజలాలలో స్నానం చేయటంలోను, దానాలు చేయటంలోను, విష్ణుధ్యానంలోను, హరికథామృత రసానుభవంలోను నిష్ణాతులైన భాగవతోత్తములు చెడని పరమపదాన్ని పొందుతారు” అని చెప్పారు. భగవంతుని ప్రతిబింబాలయిన పరమపురుషుల వంటి వారైన ఋషభకుమారులు, విదేహమహారాజుకి మోక్షపదంపొందే భగవద్భక్తి ధర్మాలను ఉపదేశించి అంతర్ధానమైపోయారు. మిథిలాపతి విదేహుడు జ్ఞానయోగాన్ని అంగీకరించి నిర్వాణపదాన్నిపొందాడు. ఈ విదేహ ఋషభ ఉపాఖ్యానాన్ని వ్రాసినా చదివినా విన్నా ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యమూ కలిగి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సమస్తమైన కలికల్మషాలు నశించి విష్ణులోకంలో నివసిస్తారు.” అని నారదుడు వసుదేవుడికి చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

తెభా-11-80-సీ.
మలాక్షపదభక్తి థనముల్‌ వసుదేవ!-
విని యఘంబులఁ బాసి వెలసి తీవు
భువనప్రసిద్ధిగాఁ బొలుపొందు సత్కీర్తి-
కైవల్యలక్ష్మియుఁ లుగు మీఁద
నారాయణుండు నీ నందనుం డను మోహ-
మెడలించి విష్ణుగాఁనెఱిఁగి కొలువు
తఁడు నీ తనయుఁడై వతరించుటఁజేసి-
సిద్ధించె దేహసంశుద్ధి నీకు

తెభా-11-80.1-తే.
రససల్లాప సౌహార్ధ సౌష్ఠవమునఁ
బావనంబైతి; శిశుపాల, పౌండ్ర, నరక,
ముర, జరాసంధ, యవనులు, ముదముతోడ
వాసుదేవునిఁ జెందిరి వైరు లయ్యి.

టీక:- కమలాక్ష = హరి; పద = పాదములందలి; భక్తిన్ = భక్తి వివరించు; కథనముల్ = వృత్తాంతములు; వసుదేవ = వసుదేవుడా; విని = ఆలకించి; అఘంబులన్ = పాపములను; పాసి = తొలగి; వెలసితివి = విలసిల్లితివి; ఈవు = నీవు; భువన = లోకమంతటను; ప్రసిద్ధి = ప్రఖ్యాతి; కాన్ = కలుగునట్లు; పొలుపొందు = ఒప్పారు; సత్ = గొప్ప; కీర్తిన్ = యశస్సు; కైవల్య = కైవల్యము చెందుట అను; లక్ష్మియున్ = సంపద; కలుగున్ = సిద్ధించును; మీదన్ = భవిష్యత్తులో; నారాయణుండు = కృష్ణుడు; నీ = నీ యొక్క; నందనుండు = కుమారుడు; అను = అనెడి; మోహమున్ = మోహమును; ఎడలించి = తొలగించి; విష్ణున్ = విష్ణుమూర్తి; కాన్ = ఐనట్లు; ఎఱిగి = తెలిసికొని; కొలువుము = సేవించుము; అతడు = అతను; నీ = నీ యొక్క; తనయుడు = కుమారుడు; ఐ = అయ్యి; అవతరించుటన్ = పుట్టుట; చేసి = వలన; సిద్ధించెన్ = కలిగెను; దేహ = శరీరమునకు; సంశుద్ధి = పరిశుద్ధి; నీ = నీ; కున్ = కు.
సరస = సరసమైన; సల్లాప = సంభాషణలు; సౌహార్ద = సుహృద్భావ; సౌష్ఠవమునన్ = చక్కదనముచేత; పావనంబు = పవిత్రము; ఐతి = అయినావు; శిశుపాల = శిశుపాలుడు; పౌండ్ర = పౌండ్రకుడు; నరక = నరకాసురుడు; ముర = మురాసురుడు; జరాసంధ = జరాసంధుడు; యవనులు = కాలయవనుడులు; ముదము = హర్షము; తోడన్ = తోటి; వాసుదేవునిన్ = విష్ణునియందైక్యమగుట; చెందిరి = పొందిరి; వైరులు = శత్రుభావము కలవారు; అయ్యున్ = అయినప్పటికి.
భావము:- “వసుదేవా! కమలలోచనుని కథలు విన్నావు కనుక, నీ పాపాలు తొలగిపోయాయి. లోకంలో నీ యశస్సు ప్రఖ్యాత మౌతుంది. అనంతరం నీకు కైవల్యం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడు నీ కుమారుడనే మోహాన్ని విడిచిపెట్టి విష్ణువుగా తెలిసి సేవించు. అతడు నీ కొడుకై అవతరించటం వలన నీవు పరిశుద్ధుడవు అయ్యావు. అతనితో సరససల్లాపాలు జరుపుతూ చక్కని అనురాగం పెంచుకోవటంవలన నీవు పవిత్రుడవు అయ్యావు. శిశుపాలుడు, పౌండ్రకుడు, నరకుడు, మురాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు వాసుదేవునితో వైరం పెట్టుకుని కూడ ముక్తిని పొందారు.

తెభా-11-81-క.
దుష్టజన నిగ్రహంబును
శిష్టప్రతిపాలనంబు సేయన్‌ హరి దా
సృష్టి నవతార మొందెను
స్రష్టృముఖానేక దివిజసంఘము వొగడన్‌.

టీక:- దుష్టజన = చెడ్డవారి; నిగ్రహంబును = శిక్షించుట; శిష్ట = సజ్జనులను; ప్రతిపాలనంబు = రక్షించుట; చేయన్ = చేయుటకు; హరి = విష్ణువు; తాన్ = తాను; సృష్టిన్ = లోకమునందు; అవతారమున్ = పుట్టుట; ఒందెన్ = పొందెను; స్రష్టృ = బ్రహ్మదేవుడు {స్రష్ట - సమస్తమును సృజించువాడు, బ్రహ్మ}; ముఖ = మొదలైన; దివిజ = దేవతల; సంఘము = సమూహము; పొగడన్ = స్తుతించగా.
భావము:- బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు ప్రార్థించగా, దుష్టజనులను శిక్షించడానికి; శిష్టజనులను రక్షించడానికి; శ్రీహరి భూమిమీద అవతరించాడు.

తెభా-11-82-వ.
అట్లుగావున లోకరక్షణార్థంబు గృష్ణుండవతారంబునొందె” నని హరి భక్తిపరంబు లగు నుపాఖ్యానంబులు నారదుం డుపన్యసించిన విని విస్మితచిత్తులై దేవకీవసుదేవులుగృష్ణుని పరమాత్మునిగా విచారించి” రని శుకుండు రాజునకుం జెప్పిన నతండు “మునీంద్రా! యదువుల నే ప్రకారంబున హరి హరియించె? సపరివారు లగు బ్రహ్మరుద్రేంద్రదిక్పాలకమునీంద్రులు ద్వారకానగర ప్రవేశం బెట్లు సేసిరి? యేమయ్యె? మఱియుఁ బరమేశ్వర కథామృతంబు వీనులలరం జవిగొనియు, నింకం దనివి సనదు; భక్తరక్షకుండగు హరి చారిత్రం బేరీతిఁ జాగెఁ? దర్వాతి వృత్తాంతం బంతయు నెఱింగింపు" మనిన శుకుం డిట్లనియె.
టీక:- అట్లు = అలా; కావునన్ = అగుటచేత; లోక = జగత్తును; రక్షణ = కాపాడుట; అర్థంబున్ = కోసము; కృష్ణుండు = కృష్ణుడు; అవతారంబున్ = అవతరించుటను; ఒందెను = పొందెను; అని = అని; హరి = విష్ణు; భక్తి = భక్తికి; పరంబులు = చెందినవి; అగున్ = ఐన; ఉపాఖ్యానంబులున్ = ఇతిహాసములను; నారదుండు = నారదుడు; ఉపన్యసించినన్ = చెప్పగా; విని = ఆలకించి; విస్మిత = ఆశ్చర్యచకిత; చిత్తులు = మానసులు; ఐ = అయ్యి; దేవకీ = దేవకీదేవి; వసుదేవులు = వసుదేవుడులు; కృష్ణుని = కృష్ణుని; పరమాత్ముని = భగవంతుని; కాన్ = ఐనట్లు; విచారించిరి = భావించిరి; అని = అని; శుకుండు = శుకుడు; రాజున్ = రాజున; కున్ = కు; చెప్పిన = తెలిపిన; అతండు = అతను; ముని = మునులలో; ఇంద్ర = ఉత్తముడా; యదువులన్ = యాదవులను; ఏ = ఏ; ప్రకారంబునన్ = విధముగ; హరి = కృష్ణుడు; హరియించెన్ = నశింపజేసెను; సపరివారులు = పరివారాలతోనున్నవారు; అగు = ఐన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = శివుడు; ఇంద్ర = ఇంద్రుడు; దిక్పాలక = దిక్పాలకులు; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; ద్వారకానగర = ద్వారకానగరమును; ప్రవేశంబున్ = ప్రవేశించుటను; ఎట్లు = ఎలా; చేసిరి = చేసారు; ఏమయ్యెన్ = తరవాతేమైంది; మఱియును = ఇంకను; పరమేశ్వర = హరి; కథా = వృత్తాంతములు అను; అమృతంబున్ = అమృతమును; వీనులు = చెవులు; అలరన్ = తృప్తిచెందునట్లు; చవిగొనియున్ = ఆస్వాదించినను; ఇంకన్ = ఇంకా; తనివి = తృప్తి; చనదు = చెందలేదు; భక్త = భక్తులను; రక్షకుండు = కాపాడువాడు; అగు = ఐన; హరి = శ్రీహరి; చారిత్రంబు = చరిత్ర; ఏ = ఏ; రీతిన్ = విధముగ; సాగెన్ = కొనసాగింది; తర్వాతి = పిమ్మటజరిగిన; వృత్తాంతంబున్ = వృత్తాంతము; అంతయున్ = ఎల్ల; ఎఱిగింపు = తెలుపుము; అనిన = అని అడుగగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా జగత్తును రక్షించటం కోసమే భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు.” అని హరిభక్తి పరాలైన ఉపాఖ్యానాలను నారదుడు చెప్పగా విని దేవకీ వసుదేవులు విస్మయం చెందారు. శ్రీకృష్ణుని పరమాత్మగా భావించారు.” అని శుకముని మహారాజు పరీక్షిత్తుతో చెప్పగా అతడు “మునీంద్రా! భూభారాన్ని తగ్గించటం కోసం ఏ విధంగా కృష్ణుడు యాదవులను తుదముట్టించాడు? బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు; ఋషీశ్వరులు తమ పరివారాలతో ద్వారకానగరాన్ని ఎలా ప్రవేశించారు? అటు పిమ్మట ఏమయింది? వివరంగా చెప్పండి. విష్ణు కథామృతం చెవులారా ఎంత విన్నా, తృప్తికలగటం లేదు. భక్తరక్షకుడైన శ్రీహరిచరిత్ర ఏ రీతిగా కొనసాగింది? ఈ వృత్తాంతమంతా తెలియజెప్ప” మని అడుగగా శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు.