Jump to content

పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/వామను డవతరించుట

వికీసోర్స్ నుండి

వామనుడవతరించుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-506-మ.
విమధ్యాహ్నమునం జరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్
శ్రణద్వాదశినాఁడు శ్రోణ నభిజిత్సంజ్ఞాత లగ్నంబునన్
భునాధీశుఁడు పుట్టె వామనగతిం బుణ్యవ్రతోపేతకున్
దివిజాధీశ్వరు మాతకుం బరమపాతివ్రత్య విఖ్యాతకున్
.
టీక:- రవి = సూర్యుడు; మధ్యాహ్నము = మధ్యాహ్నము, సూర్యుడు ఆకాశము నట్ట నడుమ ఉండు సమయము; అందున్ = లో; చరింపన్ = తిరుగుచుండగ; గ్రహ = గ్రహములు; తార = నక్షత్రములు; చంద్ర = చంద్రుడు; భద్ర = ఉచ్ఛ; స్థితిన్ = దశలోనుండగ; శ్రవణద్వాదశి = శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద శుద్ధ ద్వాదశి (పారమార్థిక పదకోశం, పొత్తూరి వేంకటేశ్వరరావు); నాడు = దినమున; శ్రోణ = శ్రవణనక్షత్రయుక్తమైన; అభిజిత్ = అభిజిత్తు {అభిజిత్తు - మిట్టమధ్యాహ్నము 24 నిమిషముల ముందునుండి 24 నిమిషములవరకు గల కాలము, దినమునందు 8వ ముహూర్తము, అభిజిత్ లగ్నము లేదా ముహూర్తము}; సంజ్ఞాత = అనెడి పేరుగల; లగ్నంబునన్ = లగ్నమునందు; భువనాధీశుడు = విష్ణువు {భువనాధీశుడు - భువన (జగత్తునకు) అధీశుడు (ప్రభువు), విష్ణువు}; పుట్టెన్ = జన్మించెను; వామన = పొట్టివాని; గతిన్ = వలె; పుణ్య = పుణ్యవంతమైన; వ్రత = వ్రతనిష్ఠలు; ఉపేత = కలిగి యున్నామె; కున్ = కు; దివిజాధీశ్వరుమాత = అదితి {దివిజాధీశ్వరుమాత - దివిజాధీశ్వరుని (ఇంద్రుని) మాత, అదితి}; పరమ = అత్యుత్తమమైన; పాతివ్రత్య = పతివ్రతగా; విఖ్యాత = ప్రసిద్ధిపొందినామె; కున్ = కు.
భావము:- అలా బ్రహ్మదేవుడు స్తోత్రం చేసిన పిమ్మట, నిర్మలమైన నియమంతో గొప్ప పతివ్రతగా పేరు పొందిన దేవేంద్రుని తల్లి అయిన అదితి గర్భం నుండి వామన రూపంతో సకల లోకాధీశుడు అయిన మహావిష్ణువు జన్మించాడు. అది శ్రవణద్వాదశి అనగా శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద శుద్ధ ద్వాదశి తిథి; అభిజిత్తు అనబడే లగ్నం; పట్టపగలు సూర్యుడు ఆకాశం నట్టనడుమ ప్రకాశిస్తున్నాడు; గ్రహాలూ నక్షత్రాలూ చంద్రుడూ ఉచ్ఛదశలో ఉన్నాయి. అట్టి శుభకర సమయంలో వామనుడు అవతరించాడు.

తెభా-8-507-వ.
మఱియు నద్దేవుండు శంఖచక్రగదా కమల కలిత చతుర్భుజుండునుఁ బిశంగవర్ణవస్త్రుండును. మకరకుండల మండిత గండభాగుండును, శ్రీవత్సవక్షుండును, నళినచక్షుండును, నిరంతర శ్రీవిరాజిత రోలంబ కదంబాలంబిత వనమాలికా పరిష్కృతుండును, మణికనకాంచిత కాంచీవలయాంగద కిరీటహార నూపురాలంకృతుండునుఁ, గమనీయ కంఠ కౌస్తుభాభరణుండును, నిఖిలజన మనోహరణుండునునై యవతరించిన సమయంబున .
టీక:- మఱియున్ = ఇంకను; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గద; కమల = పద్మము; కలిత = ధరించిన; చతుః = నాలుగు (4); భుజుండునున్ = చేతులు గలవాడు; పిశంగ = కపిల; వర్ణ = రంగుగల; వస్త్రుండును = బట్టలుధరించినవాడు; మకరకుండల = మకరకుండలములచే {మకరకుండలములు - కర్ణాభరణ విశేషములు}; మండిత = మెరిసెడి; గండభాగుండును = చెక్కిళ్ళు గలవాడు; శ్రీవత్స = శ్రీవత్సము యనెడి మచ్చ; వక్షుండును = వక్షస్థలమున కలవాడు; నళిన = పద్మముల వంటి; చక్షుండును = కన్నులు కలవాడు; నిరంతర = ఎల్లప్పుడును; శ్రీ = సౌభాగ్యముతో; విరాజిత = విరాజిల్లెడి; రోలంబ = తుమ్మెదల; కదంబ = సమూహములుతో కూడిన; ఆలంబిత = ధరింపబడిన; వనమాలికా = వనమాలచే {వనమాల - పువ్వులు ఆకులు కలిపికట్టిన దండ}; పరిష్కృతుండును = అలంకరింపబడినవాడు; మణి = రత్నములు; కనక = బంగారము; అంచిత = పొదగబడిన; కాంచీ = మొలనూలు; వలయ = కడియాలు; అంగద = బాహుపురులు; కిరీట = కిరీటము; హార = హారములు; నూపురా = కాలిఅందెలుచే; అలంకృతుండును = అలంకరింపబడినవాడు; కమనీయ = అందమైన; కంఠ = మెడలో; కౌస్తుభ = కౌస్తుభమణి; ఆభరణుండును = ఆభరణముగా గలవాడు; నిఖిల = సమస్తమైన; జన = వారి; మనస్ = మనసులను; హరణుండును = ఆకర్షించువాడు; ఐ = అయ్యి; అవతరించిన = పుట్టిన; సమయంబున = సమయమునందు.
భావము:- వామనుడు జన్మించినప్పుడు అతనికి నాలుగు చేతులు ఆ చేతులలో శంఖమూ, చక్రమూ, గదా, పద్మమూ; కపిల రంగు వస్త్రమూ, మకరకుండలాలతో మెరిసే చెక్కిళ్ళు; రొమ్ముపై శ్రీవత్సమూ; కమలాల వంటి కన్నులు కలిగి ఉన్నాడు. తుమ్మెదలు మూగిన అందమైన వనమాల (వైజయంతి మాల) మెడలో వేళ్ళాడుతున్నది. రత్నాలు కూర్చిన బంగారు వడ్డాణం బాహుపురులూ, కిరీటమూ, హారాలూ, కాలిఅందెలూ, కాంతులు వెదజల్లుతున్నాయి. కమనీయమైన మెడలో కౌస్తుభమణి మెరుస్తున్నది. అతని రూపం అఖిల జనుల మనస్సులను అకర్షిస్తున్నది.

తెభా-8-508-శా.
చింతంబాసిరి యక్ష తార్క్ష్య సుమనస్సిద్ధోరగాధీశ్వరుల్
సంతోషించిరి సాధ్య చారణ మునీబ్రహ్మ విద్యాధరుల్
గాంతింజెందిరి భానుచంద్రములు; రంద్గీత వాద్యంబులన్
గంతుల్ వైచిరి మింటఁ గింపురుషులున్ గంధర్వులుం గిన్నరుల్
.
టీక:- చింతన్ = శోకములను; పాసిరి = విడిచితిరి; యక్ష = యక్షులు; తార్క్ష్య = గరుడులు; సుమన = దేవతలు; సిద్ధ = సిద్ధులు; ఉరగ = నాగులు; అధీశ్వరులు = ప్రభువులు; సంతోషించిరి = సంతోషించిరి; సాధ్య = సాధ్యులు; చారణ = చారణులు; మునీశ = మునీశ్వరులు; బ్రహ్మ = ఋత్విజులు; విద్యాధరుల్ = విద్యాధరులు; కాంతిన్ = వికాశమును; చెందిరి = పొందిరి; భాను = సూర్యుడు; చంద్రములు = చంద్రుడు; రంగత్ = ఆనందపు; గీత = గీతములతోను; వాద్యంబులన్ = వాద్యములతోను; గంతుల్ = నాట్యములు; వైచిరి = చేసిరి; మింటన్ = ఆకాశమునందు; కింపురుషులున్ = కింపురుషులు; గంధర్వులున్ = గంధర్వులు; కిన్నరుల్ = కిన్నరలు.
భావము:- వామనుడు పుట్టటంతో యక్షులూ, గరుడులూ, దేవతలూ, సిద్ధులూ, నాగులూ తమ చింతలు అన్నీ విడిచిపెట్టారు. సాధ్యులూ, చారణులూ, ఋషులూ, ఋత్విజులూ, విద్యాధరులూ సంతోషించారు. సూర్య చంద్రులు మిక్కిలి ప్రకాశవంతులు అయ్యి కాంతులు విరజిమ్మారు. గంధర్వులూ, కిన్నరులూ, కింపురుషులూ వాద్యాలు మ్రోగిస్తూ ఆటపాటలతో ఆకాశంలో నాట్యాలు చేశారు.

తెభా-8-509-క.
దిక్కులకావిరి వాసెను
నెక్కువ నిర్మలత నొందె నేఁడు పయోధుల్
నిక్కమెయి నిలిచె ధరణియుఁ
జుక్కల త్రోవయును విప్రసుర సేవ్యములై
.
టీక:- దిక్కుల = దిక్కులందలి; కావిరి = నలుపు, మాపు; పాసెను = పోయెను; ఎక్కువ = చాలా; నిర్మలతన్ = నిర్మలముగ నుండుటను; ఒందె = పొందినవి; ఏడు = ఏడు; పయోధుల్ = సముద్రములు; నిక్కమెయి = ధృడమా; నిలిచె = అలరారెను; ధరణియున్ = భూమండలము; చుక్కలత్రోవయును = ఆకాశము {చుక్కలత్రోవ - చుక్కలు (నక్షత్రములు) త్రోవ (తిరుగు స్థలము), ఆకాశము}; విప్ర = బ్రాహ్మణలు; సుర = దేవతలు చేత; సేవ్యములు = కొలువబడినవి; ఐ = అయ్యి.
భావము:- వామనుడు అవతరించడంతో, బ్రాహ్మణులతో దేవతలతో సేవింపడుతూ, సకల దిక్కులు అందలి కావిరిరంగు కరగిపోయింది; సప్తసముద్రాలు నిర్మలం అయ్యాయి; భూమి, ఆకాశం ధృడంగా అలరారెను.

తెభా-8-510-క.
ముంపుఁగొని విరుల వానల
జొంపంబులుఁ గురియు సురలు, సుమనోమధువుల్
తుంర లెగయఁ బరాగపు
రొంపుల భూభాగమతి నిరూషిత మయ్యెన్
.
టీక:- ముంపుగొని = గుంపులుగూడి; విరుల = పూల; వానలన్ = వానలను; జొంపంబులన్ = పొదరిండ్లు; కురియు = వర్షించెను; సురలు = దేవతలు; సుమనస్ = పూల; మధువుల్ = మకరందము; తుంపరలు = బిందువులు; ఎగయన్ = ఎగురుతుండగ; పరాగపు = పుప్పొటి; రొంపులన్ = గుట్టలతో, బురదలతో; భూభాగము = భూమండలము; అతి = మిక్కిలి; నిరూషితము = నిండిపోయినది; అయ్యెన్ = అయినది.
భావము:- వామనుడు జన్మించడంతో, పొదరిండ్లు విశేషంగా పూలజల్లులు విరజల్లాయి. దేవతలు కురిపించిన పూలవానల మకరంద బిందువులు అంతటా వ్యాపించాయి. పుప్పొడుల కుప్పలతో భూభాగం నిండిపోయింది.

తెభా-8-511-వ.
తదనంతరంబ .
టీక:- తత్ = ఆ; అనంతరంబ = తరువాత.
భావము:- అలా వామనుడు అవతరించిన పిమ్మట. . .

తెభా-8-512-ఆ.
" మహానుభావుఁ డెట్లింత కాలంబు
నుదర మందు నిలిచి యుండె"ననుచు
దితి వెఱఁగుపడియె నానంద జయశబ్ద
ములను గశ్యపుండు మొగి నుతించె
.
టీక:- ఈ = ఈ యొక్క; మహానుభావుడు = గొప్పవాడు; ఎట్లు = ఎలా; ఇంత = ఇన్ని; కాలంబు = రోజులు; ఉదరము = గర్భము; అందున్ = లో; నిలిచి = స్థిరముగ; ఉండెన్ = ఉన్నాడు; అనుచున్ = అనుచు; అదితి = అదితి; వెఱగు = ఆశ్చర్య; పడియెన్ = పోయెను; ఆనంద = సంతోషపు; ఆనంద = ఆనందపు; జయశబ్దములనున్ = జయజయధ్వానములను; కశ్యపుండు = కశ్యపుడు; మొగిన్ = పూని; నుతించెన్ = స్తుతించెను.
భావము:- “ఇంతటి మహానుభావుడు ఇంతకాలమూ నా కడుపులో ఎలా ఉన్నాడా” అని వామనుడిని చూసి అదితి ఆశ్చర్యపడింది. ఆనందంతో కూడిన జయజయ శబ్దాలతో కశ్యపుడు స్వామిని పూని సంస్తుతించాడు.

తెభా-8-513-వ.
అంత నవ్విభుండు సాయుధసాలంకారంబగు తన దివ్యరూపంబు నుజ్జగించి రూపాంతరం బంగీకరించి కపటవటు చందంబున నుపనయనవయస్కుండైన వామన బాలకుండై తల్లి ముంగటఁ గుమార సముచితాలాపంబు లాడుఁచు గ్రీడించు సమయంబున నదితియుం దనయ విలోకన పరిణామ పారవశ్యంబున.
టీక:- అంతన్ = అంతట; ఆ = ఆ; విభుండు = భగవంతుడు; సాయుధ = ఆయుధములుగల; సాలంకారంబు = అలంకారములుగలది; అగు = అయిన; తన = తన యొక్క; దివ్య = దివ్యమైన; రూపంబున్ = స్వరూపమును; ఉజ్జగించి = ఉపసంహరించి; రూప = స్వరూపమునందు; అంతరంబున్ = మార్పును; అంగీకరించి = స్వీకరించి; కపట = మాయా; వటు = బ్రహ్మచారి; చందంబునన్ = వలె; ఉపనయన = వడుగు చేయదగిన; వయస్కుండు = వయసు గలవానిగ; ఐన = అయినట్టి; వామన = పొట్టి; బాలకుండు = చిన్నబాలుడు; ఐ = అయ్యి; తల్లి = అమ్మకు; ముంగటన్ = ఎదురుగ; కుమార = పుత్రునికి; సముచిత = తగిన; ఆలాపంబులు = పలుకులు; ఆడుచున్ = పలుకుచు; క్రీడించు = విహరించెడి; సమయంబునన్ = సమయమునందు; అదితియున్ = అదితి; తనయ = పుత్రుని; విలోకన = చూచుటవలన; పరిణామ = కలిగిన; పారవశ్యంబునన్ = మైమరపుతో.
భావము:- అటుపిమ్మట వామనుడు ఆయుధాలూ అలంకారాలు కలిగిన తన దివ్య రూపాన్ని వదిలిపెట్టి, కపట బ్రహ్మచారిగా మారురూపాన్ని పొందాడు. పొట్టి బాలుడుగా, వడుగు చేయదగిన వయస్సు కలవాడుగా అయ్యాడు. ఆ కొడుకుని చూచి అదితి ఆనందంతో మైమరచి, పారవశ్యమున. . .

తెభా-8-514-క.
"న్నుఁ గన్న తండ్రి! నా పాలి దైవమ!
నా తపఃఫలంబ! నా కుమార!
నాదు చిన్ని వడుగ! నా కులదీపిక!
రాఁగదయ్య; భాగ్య రాశి వగుచు
.
టీక:- నన్నున్ = నన్ను; కన్నతండ్రి = కన్నతండ్రి; నా = నా; పాలి = పాలిటి; దైవమా = దేవుడా; నా = నా యొక్క; తపః = తపస్సుయొక్క; ఫలంబ = ఫలితముగ కలిగినవాడ; నా = నా యొక్క; కుమార = పుత్రుడ; నాదు = నా యొక్క; చిన్ని = చిన్న; వడుగ = బాలుడ; నా = నా యొక్క; కుల = వంశమును; దీపిక = ప్రకాశింపజేయువాడ; రాగదు = రమ్ము; అయ్య = తండ్రి; భాగ్యరాశివి = పెన్నిధివి; అగుచున్ = అగుచు.
భావము:- కన్నబిడ్డ యైన వామనుని “నా కన్నతండ్రీ! నా పాలి దేవుడా! నా నోములపంటా! నా ముద్దుల కన్నా! నాచిన్నవడుగా! నా వంశాలంకారమా! నా పెన్నిధీ! . రావయ్యా.

తెభా-8-515-క.
న్నా! ర"మ్మని డగ్గఱి
న్నుల పాలేఱువాఱ సంశ్లేషిణి యై
చిన్నారి మొగము నివురుచుఁ
న్నారం జూచెఁ గన్నడుపై యుంటన్.


 8-515/1-వ. 
అంత.

- తంజనగరము తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి



టీక:- అన్నా = అబ్బాయి; రమ్ము = రా; అని = అని; డగ్గఱి = దగ్గరకుతీసుకొని; చన్నులన్ = స్తనములందు; పాలు = పాలు; ఏఱువాఱ = జాలువారగా; సంశ్లేషిణి = కౌగలించుకొన్నది; ఐ = అయ్యి; చిన్నారి = బుల్లి; మొగమున్ = ముఖమును; నివురుచున్ = దువ్వుచు; కన్నారన్ = కంటినిండుగా; చూచెన్ = చూసెను; కన్నకడుపు = తన కడుపున పుట్టినవాడు; ఐ = అయ్యి; ఉంటన్ = ఉండుటచేత.
భావము:- నా కన్నా! రావయ్యా” అంటూ అదితి దగ్గరకు పిలిచింది, అక్కున చేర్చుకుంది, మొహాన్ని దువ్వింది. తను కడుపారా కన్న ఆ చిన్నారి బాలుని కన్నుల నిండుగా చూచింది.

తెభా-8-516-క.
"పురుడీ బోటికి నిందిర
పురుడంబిక గాక యొరులు పురుడే?" యనుచున్
బురుటాలికిఁ బది దినములు
పురుడు ప్రవర్తించి రెలమిఁ బుణ్యపు గరితల్
.
టీక:- పురుడు = సమానురాలు, సాటి; ఈ = ఈ; బోటి = ఇల్లాలు; కిన్ = కి; ఇందిర = లక్ష్మీదేవి; పురుడు = సమానురాలు, సాటి; అంబిక = పార్వతీదేవి; కాక = అంతే తప్పించి; ఒరులు = ఇతరులు; పురుడే = సమానులా, సాటికాగలరా; అనుచున్ = అనుచు; పురుటాలి = బాలంతరాలి; కిన్ = కి; పది = పది (10); దినములు = రోజులు; పురుడు = పురుటిశుద్ధి; ప్రవర్తించిరి = నడిపించిరి; ఎలమిన్ = అతిశయించి; పుణ్యపుగరితల్ = ముత్తైదువలు.
భావము:- “ఈ ఇల్లాలికి లక్ష్మి పార్వతులే సరిజోడియైన వారు. ఇతరులు సరిజోడి కాదు.” అంటూ పెద్ద ముత్తైదువలు బాలెంతరాలైన అదితికి పది రోజులు పురుడు నడిపినారు.

తెభా-8-517-వ.
అంత నబ్బాలునకు సంతసంబున మహర్షులు కశ్యపప్రజాపతిం బురస్కరించుకొని సముచితోపనయనకర్మ కలాపంబులు చేయించిరి; సవిత సావిత్రి నుపదేశించె, బృహస్పతి యజ్ఞోపవీతధారణంబునుఁ, గశ్యపుండు ముంజియుఁ, గౌపీనం బదితియు, ధరణి కృష్ణాజినంబును, దండంబు వనస్పతి యగు సోముండును, గగనాధిష్ఠానదేవత ఛత్రంబునుఁ, గమండలువు బ్రహ్మయు, సరస్వతి యక్షమాలికయు, సప్తర్షులు కుశపవిత్రంబులు నిచ్చిరి; మఱియును .
టీక:- అంతన్ = అంతట; ఆ = ఆ; బాలున్ = పిల్లవాని; కున్ = కి; సంతసంబునన్ = సంతోషముతో; మహర్షులు = మునీంద్రులు; కశ్యప = కశ్యపుడు యనెడి; ప్రజాపతిన్ = బ్రహ్మను; పురస్కరించుకొని = ముందుంచుకొని; సముచిత = తగినవిధముగ; ఉపనయన = వడుగు; కర్మకలాపంబులు = కార్యక్రమములు; చేయించిరి = జరిపించిరి; సవిత = సూర్యుడు; సావిత్రిన్ = గాయత్రీమంత్రమును; ఉపదేశించెన్ = ఉపదేశించెను {ఉపదేశము - అధికారదత్తపూర్వకముగ నేర్పుట}; బృహస్పతి = బృహస్పతి; యజ్ఞోపవీత = జంధ్యమును; ధారణంబును = ధరింపజేయుట; కశ్యపుండు = కశ్యపుడు; ముంజియున్ = ముంజిదర్భలు; కౌపీనంబున్ = గోచీని; అదితి = అదితి; ధరణి = భూదేవి; కృష్ణాజినంబును = నల్లజింకచర్మమును; దండంబు = దండమును; వనస్పతి = అడవికి అధిష్ఠానదేవత; అగు = అయిన; సోముండును = సోముడు; గగన = ఆకాశమునకు; అధిష్ఠానదేవత = అధికారి; ఛత్రంబును = గొడుగు; కమండలువున్ = కమండలమును; బ్రహ్మయున్ = బ్రహ్మదేవుడు; సరస్వతి = సరస్వతీదేవి; అక్షమాలిక = జపమాల; సప్తర్షులు = సప్తర్షులు; కుశపవిత్రంబులు = పవిత్రమైనదర్భలు; ఇచ్చిరి = ఇచ్చిరి; మఱియున్ = ఇంకను.
భావము:- అటు పిమ్మట, వామనుడికి వడుగు చేయడంకోసం కశ్యప ప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు తగిన సకల ఉపనయన కార్యకలాపాలు జరిపించారు. వామనుడికి సూర్యుడు గాయత్రి మంత్రాన్ని బోధించాడు. బృహస్పతి జంధ్యాన్నీ; కశ్యపుడు ముంజ (దర్భల మొలత్రాడునూ); అదితి కౌపీనాన్నీ (గోచీని); భూదేవి నల్లని జింకచర్మాన్నీ; చంద్రుడు దండాన్నీ; ఆకాశం గొడుగునూ; బ్రహ్మ కమండలాన్ని; సరస్వతీదేవి జపమాలనూ; సప్తఋషులు పవిత్రమైన దర్భలనూ ఇచ్చారు.

తెభా-8-518-క.
భిక్షాపాత్రిక నిచ్చెను
క్షేశుఁడు వామనునకు; క్షయ మనుచున్
సాక్షాత్కరించి పెట్టెను
భిక్షునకు భవాని పూర్ణభిక్ష నరేంద్రా!

టీక:- భిక్షాపాత్రికన్ = చిన్నభిక్షాపాత్రను; ఇచ్చెను = ఇచ్చెను; యక్షేశుడు = కుబేరుడు; వామనున్ = వామనుని; కున్ = కి; అక్షయము = అక్షయము; అనుచున్ = అనుచు; సాక్షాత్కరించి = ప్రత్యక్షమై; పెట్టెను = పెట్టెను; భిక్షున్ = బ్రహ్మచారి; కున్ = కి; భవాని = అన్నపూర్ణాదేవి; పూర్ణ = పూర్తి; భిక్షన్ = భిక్షను; నరేంద్రా = రాజా.
భావము:- పరీక్షన్మహారాజా! యక్షుల ప్రభువు అయిన కుబేరుడు వామనుడికి భిక్షాపాత్ర ఇచ్చాడు. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయం అంటూ ఆ బ్రహ్మచారికి పూర్ణభిక్ష పెట్టింది.

తెభా-8-519-క.
శుద్ధబ్రహ్మర్షి సమా
రాద్ధుండై విహితమంత్రరాజిఁ జదువుచుం
బ్రోద్ధంబగు ననలంబున
వృద్ధాచారమున వటుఁడు వేల్చెన్ గడకన్!

టీక:- శుద్ధ = పరిశుద్ధమైన; బ్రహ్మర్షి = మునీశ్వరులుచే; సమారాద్ధుండు = చక్కగా సిద్ధము చేయబడినవాడు; ఐ = అయ్యి; విహిత = శాస్త్రానుసారము; మంత్రరాజిన్ = వేదమంత్రములను; చదువుచున్ = చదువుతూ; ప్రోద్ధంబు = వెలుగుతున్నది; అగు = అయిన; అనలంబునన్ = అగ్నియందు; వృద్ధాచారమునన్ = సంప్రదాయబద్ధముగా; వటుడు = బ్రహ్మచారి; వ్రేల్చెను = హోమముచేసెను; కడకన్ = నిష్ఠతో.
భావము:- ఆ పరిశుద్ధులైన బ్రహ్మఋషులు వామనుని ఆదరంగా హోమానికి సిద్ధంచేసారు. తరువాత, ఆ బ్రహ్మచారి సంప్రదాయం ప్రకారం వేదమంత్రాలు చదువుతూ, వెలిగే అగ్నిహోత్రంలో ఉత్సాహంతో హోమం చేసాడు.