పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/వామనుడు యఙ్ఞవాటిక చేరుట
వామనుడుయఙ్ఞవాటికచేరుట
←వామనునిబిక్షాగమనము | తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/) రచయిత: పోతన |
వామనునిబిక్షకోరుమనుట→ |
తెభా-8-532-వ.
కని దానవేంద్రుని హయమేధ వాటి దఱియం జొచ్చు నయ్యవసరంబున .
టీక:- కని = చూసి; దానవేంద్రుని = బలిచక్రవర్తి; హయమేధవాటిన్ = అశ్వమేధయాగశాలను; దఱియంజొచ్చు = చేరవచ్చెడి; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు;
భావము:- ఆ వైభోగం అంతా చూస్తూ, వామనుడు బలిచక్రవర్తి యజ్ఞవాటికను సమీపించాడు.
తెభా-8-533-శా.
”శంభుండో హరియో పయోజభవుఁడో చండాంశుఁడో వహ్నియో
దంభాకారత వచ్చెఁ గాక ధరణిన్ ధాత్రీసురుం డెవ్వడీ
శుంభద్యోతనుఁ డీ మనోజ్ఞ తనుఁ” డంచున్ విస్మయభ్రాంతులై
సంభాషించిరి బ్రహ్మచారిఁ గని తత్సభ్యుల్ రహస్యంబుగన్ .
టీక:- శంభుండో = పరమశివుడో; హరియో = విష్ణుమూర్తియో; పయోజభవుడో = బ్రహ్మదేవుడో {పయోజభవుడు - పయోజ (పద్మమున) భవుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; చండాంశుడో = సూర్యభగవానుడో {చండాంశుడు - చండ (తీవ్రమైన) అంశుడు (కిరణములు కలవాడు), సూర్యుడు}; వహ్నియో = అగ్నిదేవుడో; దంభ = కపట; ఆకారతన్ = వేషముతో; వచ్చెన్ = వచ్చెను; కాక = కాకపోయినచో; ధరణిన్ = భూమిపైన; ధాత్రీసురుండు = బ్రాహ్మణుడు {ధాత్రీసురుడు - ధాత్రీ (భూమిపైని) సురుడు (దేవత), విప్రుడు}; ఎవ్వడు = ఎవరు; ఈ = ఇంత; శుంభత్ = ప్రశస్తముగా; ద్యోతనుడు = ప్రకాశించువాడు; ఈ = ఇంత; మనోజ్ఞ = అందముగానున్న; తనుడు = దేహముగలవాడు; అంచున్ = అనుచు; విస్మయ = ఆశ్చర్యముతో; భ్రాంతులు = భ్రాంతిలోపడినవారు; ఐ = అయ్యి; సంభాషించిరి = మాట్లాడుకొనిరి; బ్రహ్మచారిన్ = వామనుని; కని = చూసి; తత్ = అక్కడి; సభ్యుల్ = సభలోనివారు; రహస్యంబుగన్ = రహస్యముగా.
భావము:- అలా వేంచేసిన వామనుని చూసి, సభలోనివారు “శివుడో, విష్ణువో, బ్రహ్మయో, సూర్యుడో, అగ్నియో ఇలా మారు వేషంతో వచ్చి ఉండవచ్చు. ప్రపంచంలో ఇంతటి కాంతి అందమూ ఉండే బ్రహ్మచారి ఎవరుంటారు.” అనుకుంటూ ఆశ్చర్యంతో చకితులై రహస్యంగా గుసగుసలాడారు.
తెభా-8-534-క.
గుజగుజలు పోవువారును
గజిబిజిఁ బడువారు చాలఁ గలకల పడుచున్
గజిబిజి యైరి సభాస్థలిఁ
బ్రజలెల్లను బొట్టివడుగు పాపని రాకన్ .
టీక:- గుజగుజలు = గుసగుసలు; పోవువారును = ఆడువారును; గజిబిజిన్ = తికమక; పడువారు = పడువారును; చాలన్ = మిక్కిలి; కలకల = కలకలము; పడుచున్ = పడుచు; గజిబిజిన్ = తికమకపడినవారు; ఐరి = అయిరి; సభాస్థలిన్ = సభాప్రాంగణములోని; ప్రజలు = జనులు; ఎల్లన్ = అందరు; పొట్టి = వామనరూపు; వడుగు = బ్రహ్మచారి; పాపని = పిల్లవాని; రాకన్ = వచ్చుటతో.
భావము:- పొట్టి బ్రహ్మచారి యైన వామనుడు రాగానే ఆ సభలోని కొందరు ప్రజలు గుసగుసలాడారు. కొందరు గజిబిజి పడ్డారు. కొందరు తికమక పడ్డారు. అలా ఆ సభలోని వారందరూ పెద్ద కలకలం చేసారు.
తెభా-8-535-వ.
ఆ సమయంబున బలిసభామండపంబుఁ దఱియం జొచ్చి .
టీక:- ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు; బలి = బలియొక్క; సభామండపంబున్ = సభాస్థలి; దఱియన్ = దగ్గరకు; చొచ్చి = చేరి, ప్రవేశించి.
భావము:- సభలో అలా కలకలం జరుగుతుండగా, ఆ పొట్టి బ్రహ్మచారి బలిచక్రవర్తి సభమంటపం దరిచేరాడు.
తెభా-8-536-సీ.
చవులుగాఁ జెవులకు సామగానంబులు-
చదువు నుద్గాతల చదువు వినుచు
మంత్ర తంత్రార్థ సంబంధభావములు పే-
ర్కొనెడి హోతలతోడఁ గూడికొనుచు
హోమకుండంబులం దున్న త్రేతాగ్నుల-
వెలిఁగించు యాజక వితతిఁ గనుచు
దక్షులై బహువిధాధ్వర విధానంబులు-
చెప్పెడు సభ్యులఁ జేరఁ జనుచుఁ
తెభా-8-536.1-తే.
బెట్టుగోరెడు వేడుక పట్టుపఱుచు
నదితి పుట్టువు లచ్చికి నాటపట్టు
కోరి చరియించె సభలోనఁ గొంతఁదడవు
పుట్టు వెన్నఁడు నెఱుగని పొట్టివడుఁగు .
టీక:- చవులుగాన్ = ఇంపుగా; చెవుల = చెవుల; కున్ = కు; సామగానంబులు = సామగానములు {సామగానములు - సామవేద మంత్రములు}; చదువు = పఠించెడి; ఉద్గాతల = ఉద్గాతలయొక్క {ఉద్గాత - యజ్ఞములందు సామవేదగానములను నడపువాడు}; చదువు = పఠనములను; వినుచున్ = వినుచు; మంత్రతంత్ర = మంత్రతంత్రముల; అర్థ = అర్థమునకు; సంబంధ = సంబంధించిన; భావములు = టీకలను; పేర్కొనెడి = వివరించెడి; హోతల = హోతల {హోతలు - ఋగ్వేదము తెలిసిన ఋత్విక్కులు}; తోడన్ = తోటి; కూడికొనుచు = కలియుచు; హోమకుండంబుల్ = హోమకుండములు; అందు = లో; ఉన్న = ఉన్నట్టి; త్రేతాగ్నులన్ = మూడుఅగ్నులను {త్రేతాగ్నులు - 1ఆహవనీయము 2గార్హపత్యము 3దక్షిణాగ్ని యనెడి మూడగ్నులు}; వెలిగించు = వెలిగించెడి; యాజక = ఋత్విక్కుల; వితతిన్ = సమూహమును; కనుచు = చూచుచు; దక్షులు = సమర్థులు; ఐ = అయ్యి; బహువిధ = పలురకములైన; అధ్వర = యజ్ఞ; విధానంబులు = విధులను; చెప్పెడు = పేర్కొనెడి; సభ్యులన్ = సభాపతుల; చేరన్ = దగ్గరకు; చనుచున్ = వెళుతు.
పెట్టు = దానమును; కోరెడు = కోరవలెననెడి; వేడుకన్ = కుతూహలమును; పట్టుపఱుచు = విదితముచేయుచు; అదితి = అదితి; పుట్టువు = కుమారుడు; లచ్చి = లక్ష్మీదేవి; కిన్ = కి; ఆటపట్టు = నివాసమైనవాడు; కోరి = కోరి; చరియించెన్ = తిరిగెను; సభ = సభ; లోనన్ = అందు; కొంత = కొంత; తడువు = సేవు; పుట్టువు = జన్మించుట; ఎన్నడున్ = ఎప్పుడు; ఎఱుగని = తెలియని; పొట్టి = వామనుడైన; వడుగు = బ్రహ్మచారి.
భావము:- పుట్టుకన్నదే లేని వాడూ, అదితి సుతుడూ, లక్ష్మీదేవి పతీ అయిన ఆ వామనుడు, చెవులకు ఇంపుగా సామవేదం పఠించే ఉద్గాతల గానాలు విన్నాడు. మంత్రతంత్రాలను వివరిస్తూ హోమం చేసే హోతలను కలుసుకున్నాడు. హోమకుండంలో ఆహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే మూడగ్నులను వెలిగించే ఋత్విజులను చూసాడు. యాగవిధులను నేర్పరితనంతో పేర్కొంటున్న సభాపతులను సమీపించాడు. ఆ సభను బాగా ఆకర్షించాలని అనుకొని కొంతసేపు ఆ సభలో తిరుగాడాడు.
తెభా-8-537-వ.
మఱియును .
టీక:- మఱియును = అంతేకాక.
భావము:- అంతే కాక.
తెభా-8-538-క.
వెఱచుచు వంగుచు వ్రాలుచు
నఱిముఱిఁ గబురులకుఁ జనుచు హరిహరి యనుచున్
మఱుఁగుచు నులుకుచు దిఱదిఱఁ
గుఱుమట్టపుఁ బడుచు వడుగుఁ గొంత నటించెన్ .
టీక:- వెఱచుచున్ = బెదురుతూ; వంగుచున్ = ఒరుగుచు; వ్రాలుచున్ = తగ్గుచు; అఱిముఱిన్ = సంభ్రమముతో; కబురులకు = సంభాషణములకు; చనుచున్ = దిగుచు; హరిహరి = అయ్యయ్యో; అనుచున్ = అనుచు; మఱుగుచు = చాటుమాటులకు వెళుచు; ఉలుకుచున్ = ఉలికిపడుచు; దిఱదిఱన్ = దిరదిరకు రూపాంతరం, తిరుగుటయందలి అనుకరణము; కుఱు = చిన్ని, కుది; మట్టపు = పొట్టి; పడుచు = బాల; వడుగు = బ్రహ్మచారి; కొంత = కొంచెముసేపు; నటించెన్ = నటించెను.
భావము:- ఆ పొట్టి బ్రహ్మచారి వెరపు చూపుతూ, ఒయ్యారంగా వంగుతూ, జనంలోకి దూరుతూ, “హరి హరి” అంటూ, చాటుకు వెడుతూ, ఉలికిపడుతూ కొంతసేపు చుట్టూతిరుగుతూ కొంతసేపు నటించాడు.
తెభా-8-539-క.
కొందఱతోఁజర్చించును
గొందఱతో జటలు చెప్పు గోష్ఠిం జేయుం
గొందఱతోఁ దర్కించును
గొందఱతో ముచ్చటాడుఁ; గొందఱ నవ్వున్ .
టీక:- కొందఱ = కొంతమంది; తోన్ = తోటి; చర్చించును = చర్చలుచేయును; జటలు = వేదపాఠములను {జట - వేదము చెప్పుటలో విశేషము - జట, ఘన}; చెప్పున్ = చదువును; గోష్ఠిన్ = సల్లాపములు; చేయున్ = ఆడును; కొందఱ = కొంతమంది; తోన్ = తోటి; తర్కించును = వాదించును; కొందఱ = కొంతమంది; తోన్ = తోటి; ముచ్చటలాడును = ముచ్చటించును; కొందఱన్ = కొందరితో; నవ్వున్ = నవ్వుతుండును.
భావము:- ఆ సభలో వామనుడు కొందరితో వాదోపవాదాలు చేసాడు. కొందరితో కలిసి వేదాన్ని చదివాడు. కొందరితో చక్కగా సల్లాపాలు సాగించాడు. కొందరితో వాదించాడు. కొందరితో చక్కగా మాట్లాడాడు.
తెభా-8-540-వ.
మఱియు ననేక విధంబుల నందఱకు నన్ని రూపులై వినోదించుచు .
టీక:- మఱియున్ = అంతేకాక; అనేక = పలు; విధంబులన్ = విధములుగా; అందఱ = అందరి; కున్ = కి; అన్ని = అన్ని; రూపులు = రకములుగా; ఐ = కనబడుచు; వినోదించెను = క్రీడించెను.
భావము:- అంతేకాకుండా అందరితోనూ అనేకవిధాలుగా వ్యవహరిస్తూ విహరించసాగాడు.
తెభా-8-541-క.
వెడవెడ నడకలు నడచుచు
నెడనెడ నడు గిడక నడరి యిల దిగఁబడగా
బుడిబుడి నొడువులు నొడువుచుఁ
జిడిముడి తడఁబడగ వడుగు చేరెన్ రాజున్ .
టీక:- వెడవెడన్ = మెల్లిమెల్లి; నడకలు = అడుగులుతో; నడచుచున్ = తిరుగుతు; ఎడనెడ = మధ్యమధ్యలో; అడుగు = అడుగులు; ఇడక = వేయకుండ; అడరి = బెదరి; ఇల = భూమి; దిగబడగా = కుంగిపోతుండగ; బుడిబుడి = చిన్నచిన్న; నొడువులున్ = మాటలు; నొడువుచున్ = పలుకుచు; చిడిముడిన్ = కలవరపాటుతో; తడబడగ = తడబడుతుండగ; వడుగు = బ్రహ్మచారి; చేరెన్ = సమీపించెను; రాజున్ = చక్రవర్తిని.
భావము:- వామనుడు మెల్లమెల్లగా అడుగులువేస్తూ నడిచాడు. అక్కడక్కడ నేల దిగబడుతుంటే అడుగులు తడబడుతు నడిచాడు. మధ్యలో కొద్దిగా మాట్లాడుతు, తడబడుతు, కలవరబడుతు బలిచక్రవర్తిని సమీపించాడు.
(బలిచక్రవర్తి యాగశాలలోనికి వామనరూపంతో మయావటువుగా అవతరించిన విష్ణువు ప్రవేశించే ఘట్టం. పద్యం నడక వామనుని నడకతో పోటీపడుతోందా అన్నట్టు అద్భుతంగా ఉంది.)
తెభా-8-542-వ.
ఇట్లు డగ్గఱి మాయాభిక్షుకుండు రక్షోవల్లభుం జూచి యిట్లనియె .
టీక:- ఇట్లు = ఇలా; డగ్గఱి = దగ్గరకుచేరి; మాయా = కపట; భిక్షకుండు = యాచకుడు; రక్షస్ = రాక్షసుల; వల్లభున్ = ప్రభువును; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా మాయాభిక్షుక రూపంలో ఉన్న వామనుడు ఆ దానవచక్రవర్తి అయిన బలిని చూసి ఇలా అన్నాడు.
తెభా-8-543-మ.
”ఇతఁడే దానవచక్రవర్తి సురలోకేంద్రాగ్నికాలాది ది
క్పతిగర్వాపనయప్రవర్తి, గతలోభస్ఫూర్తి, నానా మఖ
వ్రతదానప్రవణానువర్తి, సుమనోరామామనోభేదనో
ద్ధతచంద్రాతపకీర్తి, సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తి దాన్.”
టీక:- ఇతడే = ఇతనేనా; దానవ = రాక్షస; చక్రవర్తి = చక్రవర్తి; సురలోకేంద్ర = దేవేంద్రుడు; అగ్ని = అగ్నిదేవుడు; కాల = యముడు; ఆది = మున్నగు; దిక్పతి = దికపాలకుల; గర్వ = గర్వమును; అపనయ = తొలగించిన; ప్రవర్తి = మొనగాడు; గత = నశించిన; లోభ = లోభము; స్ఫూర్తిన్ = ప్రకాశించగా; నానా = పలు; మఖ = యాగములు; వ్రత = వ్రతములు; దాన = దానముచేసెడి; ప్రవణ = సమర్థతతో; అనువర్తి = నడచెడివాడు; సుమనస్ = దేవతా; రామా = స్త్రీల; మనస్ = మనస్సులను; భేదన = కలవరపాటును; ఉద్ధత = పెంచెడి; చంద్ర = చంద్రుని; ఆతప = వెన్నెలవంటి; కీర్తిన్ = కీర్తి కలవాడు; సత్య = సత్యసంధత; కరుణా = దయాహృదయము; ధర్మ = ధర్మబుద్ధులతో; ఉల్లసత్ = ఉల్లాసవంతమైన; మూర్తి = వ్యక్తి; తాన్ = అతను.
భావము:- “ఇతడేనా రాక్షసచక్రవర్తి! ఇతడేనా దేవేంద్రుడు, అగ్ని, యముడూ మొదలైన దిక్పాలకుల గర్వాన్ని తొలగించిన మొనగాడు! ఇతడేనా అత్యాశలేని నిండైన హృదయం కలవాడు! ఇతడేనా పెక్కు యజ్ఞాల పుణ్యకార్యాలలో ప్రీతితో దానమిచ్చేవాడు! ఇతడేనా దేవతాస్త్రీల మనస్సులను కలవరపెట్టే వెన్నెలవంటి కీర్తికలవాడు! ఇతడేనా సత్యంతో ధర్మంతో ప్రకాశించే స్వరూపం కలవాడు!”.
తెభా-8-544-వ.
అని కుశ పవిత్రాక్షత సంయుతం బయిన దక్షిణహస్తంబు సాఁచి యిట్లనియె .
టీక:- అని = అని పలికి; కుశ = దర్భలు; పవిత్ర = పవిత్రమైన; అక్షత = అక్షతలు; సంయుతంబు = కలిగినది; అయిన = ఐన; దక్షిణ = కుడి; హస్తంబున్ = చేతిని; సాచి = చాచి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా పలికి, పవిత్రమైన దర్భలూ అక్షతలూ పట్టుకున్న తన కుడిచెయ్యి సాచి వామనుడు ఇలాఅన్నాడు.
తెభా-8-545-ఉ.
”స్వస్తిజగత్త్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర వి
ధ్వస్తనిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ
న్యస్తసువర్ణసూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్.”
టీక:- స్వస్తి = శుభమగుగాక; జగత్రయీ = ముల్లోకములలోని; భువన = ప్రపంచములను; శాసన = పరిపాలించెడి; కర్త = అధికారి; కున్ = కి; హాసమాత్ర = అవలీలగా {హాసమాత్రము - నవ్వుఒక్కదానితో, అవలీలగా}; విధ్వస్త = నాశనమొందించబడిన; నిలింపభర్త = దేవేంద్రుడుకలవాని; కున్ = కి; ఉదార = ఉన్నతమైన; పద = పదవులలో; వ్యవహర్త = మెలగెడువాని; కున్ = కి; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠులచే; స్తుత = కీర్తింపబడిన; మంగళ = శుభకరమైన; అధ్వర = యజ్ఞముల; విధాన = కార్యక్రమములలో; విహర్త = మెలగునాని; కున్ = కి; నిర్జర = దేవతల; గళ = మెడలో; న్యస్త = ఉన్నట్టి; సువర్ణ = బంగారు; సూత్ర = మంగళసూత్రముల; పరిహర్త = తొలగించెడివాని; కున్ = కి; దానవ = రాక్షసులు; లోక = అందరికి; భర్త = రాజు; కున్ = కి.
భావము:- “ముల్లోకాలనూ శాశించే అధికారం కలవాడా నీకు స్వస్తి! అవలీలగా దేవేంద్రుడంత వానిని వెలవెల పోయేలా చేసినవాడా! ఉన్నత పదవిలో మెలిగేవాడా! మునీంద్రుల పొగడ్తలందుకున్న శుభకరమైన యాగకార్యాలతో విహరించేవాడా! దేవతాస్త్రీల మెడలలోని బంగారు మంగళసూత్రాలను తొలగించేవాడా! సమస్త రాక్షసలోక సార్వభౌముడా! నీకు శుభ మగుగాక.”
తెభా-8-546-వ.
అని దీవించి కరచరణాద్యవయవంబులు ధరించిన వేదరాశియుం బోలె ముందట నకుటిలుండును, జటిలుండును, సదండఛత్రుండునుఁ, గక్షలంబిత భిక్షాపాత్రుండునుఁ, గరకలిత జల కమండలుండును, మనోహరవదన చంద్రమండలుండును, మాయావాదన నటుండును నగు వటునిం గని దినకర కిరణ పిహితంబులైన గ్రహంబుల చందంబునఁ దిరోహితులై భృగువులుఁ గూర్చున్న యెడల లేచి క్షేమం బడిగి తియ్యని మాటల నాదరించిరి; బలియును నమస్కరించి తగిన గద్దియ నునిచి, పాదంబులుఁ దుడిచి తన ప్రాణవల్లభ పసిండి గిండియల నుదకంబు పోయ వడుగు కొమరుని చరణంబులఁ గడిగి తడి యొత్తి తత్సమయంబున .
టీక:- అని = అని; దీవించి = దీవించి; కర = చేతులు; చరణ = కాళ్ళు; ఆది = మున్నగు; అవయవంబులున్ = అవయవములను; ధరించిన = స్వీకరించిన; వేద = వేదముల; రాశియున్ = సమూహము; పోలెన్ = సరిపోలి; ముందటన్ = ఎదురుగ; అకుటిలుండును = అమాయకుడు; జటిలుండును = జటలుకట్టినజుట్టు కలవాడు; సదండఛత్రుండునున్ = దండము గొడుగు గలవాడు; కక్షన్ = చంకలో; లంబిత = వేల్లాడుచున్న; భిక్షాపాత్రుండును = భిక్షాపాత్ర కలవాడు; కర = చేతిలో; కలిత = ఉన్నట్టి; జల = నీరుగల; కమండులుడును = కమండలము కలవాడు; మనోహర = అందమైన; వదన = మోము యనెడి; చంద్రమండలుండును = చంద్రమండలమువాడు; మాయావాదన = చతురోక్తులతో; నటుండును = వర్తించువాడు; అగు = అయిన; వటునిన్ = బ్రహ్మచారిని; కని = చూసి; దినకర = సూర్య {దినకరుడు - దినము (పగలును) కరుడు (కలిగించెడివాడు), సూర్యుడు}; కిరణ = కిరణములచే; పిహితంబులు = కప్పబడినవి; ఐన = అయిన; గ్రహంబుల = గ్రహముల; చందంబునన్ = వలె; తిరోహితులు = మరుగుపడినవారు; ఐ = అయ్యి; భృగువులున్ = భృగువంశపు బ్రాహ్మణులు; కూర్చున్న = కూర్చొనియున్న; ఎడలన్ = చోటులందు; లేచి = లేచినిలబడి; క్షేమంబున్ = కుశలప్రశ్నలు; అడిగి = అడిగి; తియ్యని = మృదువైన; మాటలన్ = మాటలతో; ఆదరించిరి = ఆదరముగ పలకరించిరి; బలియును = బలికూడ; నమస్కరించి = నమస్కారముచేసి; తగిన = యుక్తమైన; గద్దియను = ఆసనమున; ఉనిచి = కూర్చొనబెట్టి; పాదంబులున్ = పాదములను; తుడిచి = తుడిచి; తన = తనయొక్క; ప్రాణవల్లభ = ఇల్లాలు {ప్రాణవల్లభ - ప్రాణములతో సమానమైన వల్లభ (ప్రియురాలు), భార్య}; పసిండి = బంగారు; గిండియలన్ = చెంబులతో; ఉదకంబు = నీరు; పోయ = పోయగా; వడుగు = బ్రహ్మచారి; కొమరుని = పిల్లవాని; చరణంబులు = కాళ్ళు, పాదములు; కడిగి = కడిగి; తడి = తడిని; ఒత్తి = పొడిబట్టతోతుడిచి; తత్ = ఆ; సమయంబునన్ = సమయమునందు.
భావము:- అలా బలిని దీవించిన వామనుడు కరచరణాలతో మానవాకారం ధరించిన వేదరాశివలె అతని ముందు నిలబడ్డాడు. జడలుకట్టిన జుట్టు, దండమూ, గొడుగు, కమండలం ధరించి ఉన్నాడు. అతని చంకలో భిక్షాపాత్ర వ్రేలాడుతున్నది. అతని ముఖం చంద్రబింబంవలె అందంగా వుంది. మాయా వాదనల చతురోక్తులు పలుకుటలో అతడు నేర్పరి. సూర్యుని కిరణాలతో కప్పబడి వెలవెల పోయిన ఇతర గ్రహాలమాదిరిగా ఆ బ్రహ్మచారి ముందు భృగువంశపు బ్రాహ్మణులు మరుగుపడిపోయారు. వారు కూర్చున్న చోటు నుండి లేచి నిలబడి వామనుని క్షేమాన్ని అడిగి తియ్యని మాటలతో అతణ్ని గౌరవించారు. బలిచక్రవర్తి అతనికి మ్రొక్కి ఆసనంపై కూర్చోపెట్టాడు. అతని అడుగులను తుడిచాడు. తన ఇల్లాలు బంగారు కలశంతో నీళ్ళు పోయగా, రాక్షస చక్రవర్తి ఆ వడుగు అడుగులు కడిగి తడి తుడిచాడు. ఆ సమయంలో. . .
తెభా-8-547-ఆ.
వటుని పాద శౌచవారి శిరంబునఁ
బరమ భద్ర మనుచు బలి వహించె
నే జలము గిరీశుఁ డిందుజూటుఁడు దేవ
దేవుఁ డుద్వహించె ధృతి శిరమున .
టీక:- వటుని = బ్రహ్మచారి; పాద = పాదములు; శౌచ = కడిగిన; వారిన్ = నీటిని; శిరంబునన్ = తలపైన; పరమ = మిక్కిలి; భద్రము = శుభకరము; అనుచు = అనుచు; బలి = బలి; వహించెన్ = ధరించెను; ఏ = ఎట్టి; జలమున్ = నీటిని; గిరీశుండు = పరమశివుడు {గిరీశుడు - గిరి (కైలాసగిరిపైనున్న) ఈశుడు (ప్రభువు), శంకరుడు}; ఇందుజూటుండు = పరమశివుడు {ఇందుజూటుండు - ఇందు (చంద్రుని) జూటుండు (జటాజూటమున కలవాడు), శంకరుడు}; దేవదేవుడు = పరమశివుడు {దేవదేవుడు - మహాదేవుడు, శంకరుడు}; ఉద్వహించెన్ = చక్కగాధరించెను; ధృతిన్ = పూని; శిరమునన్ = తలపైన.
భావము:- జటాజూటంలో చంద్రుని ధరించిన మహాదేవుడైన శివుడు ఎల్లప్పుడూ ఏనీళ్ళను తలపై ధరిస్తాడో, అటువంటి వామనుని కాళ్లు కడిగిన నీళ్ళను బలిచక్రవర్తి మేలుకలిగించేవిగా తలచి తలపై చల్లుకున్నాడు.