పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/లక్ష్మీ నారాయణ సంభాషణ

వికీసోర్స్ నుండి

లక్ష్మీనారాయణసంభాషణ

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-128-వ.
అప్పుడు జగజ్జనకుండగు న ప్పరమేశ్వరుండు దరహసిత ముఖకమల యగు నక్కమల కిట్లనియె.
టీక:- అప్పుడు = ఆ సమయములో; జగత్ = భువనములకు; జనకుండు = సృష్టించినవాడు; అగు = అయిన; ఆ = ఆ; పరమేశ్వరుండు = విష్ణుమూర్తి; దరహసిత = చిరునవ్వు గల; ముఖ = ముఖము యనెడి; కమల = పద్మము గలది; అగు = ఐన; ఆ = ఆ; కమల = లక్ష్మీదేవి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- గజేంద్రుని రక్షించాక లోకాలకు తండ్రి ఐన విష్ణుమూర్తి చిరునవ్వుతో ఉన్నట్టి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు

తెభా-8-129-క.
“బాలా! నా వెనువెంటను
హేలన్ వినువీథినుండి యేతెంచుచు నీ
చేలాంచలంబుఁ బట్టుట
కాలో నేమంటి నన్ను నంభోజముఖీ!

టీక:- బాలా = చిన్నదానా; నా = నా; వెనువెంటను = కూడా; హేలన్ = విలాసముగా; వినువీథిన్ = ఆకాశమార్గమున; నుండి = నుండి; ఏతెంచుచున్ = వచ్చుచు; నీ = నీ యొక్క; చేలాంచలమున్ = పమిటకొంగును; పట్టుట = పట్టుకొనుట; కున్ = కు; ఆలోన్ = దాని విషయమై; ఏమి = ఏమి; అంటి = అనుకొంటివి; నన్నున్ = నన్ను; అంభోజముఖీ = లక్ష్మీదేవి.
భావము:- “చిన్నదానా! పద్మముఖీ! ఆకాశమార్గంలో నా వెనకాతలే విలాసంగా వస్తూ, నేను నీ పైటకొంగు విడువకుండా పట్టుకొని ఉన్నందుకు నన్ను గురించి ఏమనుకొన్నావో ఏమిటో?

తెభా-8-130-క.
ఱుఁగుదు తెఱవా! యెప్పుడు
వను సకలంబు నన్ను ఱచిన యెడలన్
తు నని యెఱిఁగి మొఱఁగక
వక మొఱ యిడిర యేని ఱి యన్యములన్.”

టీక:- ఎఱుగుదు = తెలియుదు; తెఱవా = మగువా; ఎప్పుడున్ = ఎప్పుడును; మఱవను = మరచిపోను; సకలంబు = సమస్తమును; నన్నున్ = నన్ను; మఱచిన = మరచిపోయిన; ఎడలన్ = సమయములలో; మఱతున్ = మరచిపోదును; అని = అని; ఎఱిగి = తెలిసి; మొఱగక = వంచించకుండా; మఱవక = మరచిపోకుండగ; మొఱ = మొరపెట్టుకొనుట; ఇడిరి = చేసినట్లు; ఏని = అయితే; మఱి = మరి; అన్యములన్ = ఇతరములను.
భావము:- ఓ వనితా! ఇది నీకు తెలుసు కదా! తెలిసి ఇతరులకు మొరపెట్టకుండ గుర్తుపెట్టుకొని నన్ను వేడుకొన్న వారిని ఎవరిని ఎప్పుడు నేను విడువను. నన్ను విడిచిపెట్టిన వారిని నేను విడిచిపెడతాను.”

తెభా-8-131-వ.
అని పలికిన నరవిందమందిర యగు నయ్యిందిరాదేవి మందస్మితచంద్రికా సుందరవదనారవింద యగుచు ముకుందున కిట్లనియె.
టీక:- అని = అని; పలికిన = అనిన; అరవింద = పద్మము లందు; మందిర = నివాసము గలది; అగు = అయిన; ఆ = ఆ; ఇందిరాదేవి = లక్ష్మీదేవి; మందస్మిత = చిరునవ్వు యనెడి; చంద్రికా = వెన్నెలచే; సుందర = అందమైన; వదన = ముఖము యనెడి; అరవింద = పద్మము గలది; అగుచున్ = అగుచు; ముకుందున్ = నారాయణుని {ముకుందుడు - మోక్షమును ఇచ్ఛువాడు, విష్ణువు}; కున్ = కి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- శ్రీహరి మాటలు విని పద్మాలలో నివసించెడి ఆమె అయిన లక్ష్మీదేవి చిరునవ్వు చిందే ముఖపద్మంతో గోవిందుడితో ఇలా అంది.

తెభా-8-132-క.
”దేవా! దేవర యడుగులు
భావంబున నిలిపి కొలచు ని నా పని గా
కో ల్లభ! యే మనియెద
నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతీ!

టీక:- దేవా = ప్రభూ; దేవర = ప్రభవు యొక్క; అడుగులు = పాదములను; భావంబునన్ = చిత్తము నందు; నిలిపి = ఉంచుకొని; కొలచు = సేవించెడి; పని = పని; నా = నా యొక్క; పని = బాధ్యత; కాకన్ = అయ్యుండగా; ఓ = ఓ; వల్లభ = స్వామీ; ఏమి = ఏమి; అనియెద = చెప్పను; నీ = నీ; వెంటన్ = కూడా; వచ్చుచున్ = వస్తూ; ఉంటి = ఉంటిని; నిఖిలాధిపతీ = హరీ {నిఖిలాధిపతి - నిఖిల (సమస్తమునకు) అధిపతి (ప్రభువు), విష్ణువు}.
భావము:- “ఓ దేవదేవా! సమస్తానికి ప్రభువా! ఓ నా స్వామీ! నీ పాదాలను మనస్సులో పెట్టుకొని పూజించడమే నా పని కదా. కనుక ఏమి అనుకోకుండానే నిన్ను అనుసరించి వస్తున్నాను.

తెభా-8-133-క.
దీనుల కుయ్యాలింపను
దీనుల రక్షింప మేలు దీవనఁ బొందన్
దీనావన! నీ కొప్పును.
దీపరాధీన! దేవదేవ! మహేశా!"

టీక:- దీనుల = దీనుల; కుయ్యి = మొర; ఆలింపను = వినుటకు; దీనులన్ = దీనులను; రక్షింపన్ = కాపాడుటకు; మేలు = మంచి; దీవెనన్ = దీవనలను; పొందన్ = అందుకొనుటకు; దీన = దీనులను; అవన = కాపాడువాడ; నీ = నీ; కున్ = కు; ఒప్పున్ = తగి యున్నవి; దీన = దీనులకు; పరాధీన = వశమైనవాడ; దేవదేవ = హరి; మహేశ = హరి.
భావము:- ఓ దేవాధిదేవ! ఓ మహాప్రభూ! దీనుల మొరలను దయతో వినటానికైనా, వారిని కాపాడటానికైనా, మంచి మంచి దీవెనకోలు అందుకోటానికైనా, దీనబంధు! దీనరక్షక! నీకే తగు నయ్యా.”

తెభా-8-134-వ.
అని మఱియును సముచిత సంభాషణంబుల నంకించుచున్న యప్పరమ వైష్ణవీరత్నంబును సాదర సరససల్లాప మందహాస పూర్వకంబుగా నాలింగనంబు గావించి సపరివారుండై గరుడ గంధర్వ సిద్ధ విబుధగణ జేగీయమానుండై గరుడారూఢుం డగుచు హరి నిజసదనంబునకుం జనియె"నని చెప్పి శుకయోగీంద్రుం డిట్లనియె.
టీక:- అని = అని; మఱియును = ఇంకను; సమ = చక్కగా; ఉచిత = తగిన; సంభాషణంబులన్ = పలుకులతో; అంకించుకొన్న = స్తుతించుతున్న; ఆ = ఆ; పరమ = అత్యుత్తమ; వైష్ణవీ = విష్ణుభక్తులలో; రత్నంబును = రత్నమువంటి యామెను; సాదర = ఆదరపూర్వకముగా; సరస = ఇంపైన; సల్లాప = మంచిమాటలతో; మందహాస = చిరునవ్వుతో; పూర్వకంబుగాన్ = కూడినదిగా; ఆలింగనంబు = కౌగలించుకొనుట; కావించి = చేసి; సపరివారుండు = సేవకులతో కూడినవాడు; ఐ = అయ్యి; గరుడ = గరుడులు; గంధర్వ = గంధర్వులు; సిద్ధ = సిద్ధులు; విబుధ = దేవతా; గణ = సమూహములచే; జేగీయమానుండు = స్తుతింపబడుతున్నవాడు; ఐ = అయ్యి; గరుడ = గరుత్మంతుని; ఆరూఢుండు = ఎక్కినవాడు; అగుచున్ = అగుచు; హరి = నారాయణుడు; నిజ = తన యొక్క; సదనంబు = నివాసమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అని = అని; చెప్పి = చెప్పి; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రుండు = ఇంద్రుని వంటివాడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- ఇలా చెప్పిన పిమ్మట లక్ష్మీదేవి తగిన పలుకులతో శ్రీహరిని స్తుతించింది. ఆయన ఆ పరమ భక్తురాలైన లక్ష్మిని చక్కటి మాటలు చిరునవ్వులతో కౌగలించుకొన్నాడు. గరుడులు గంధర్వులు, సిద్ధులు, దేవతలు జయజయధ్వానాలు చేసారు. గరుడవాహనం అధిరోహించాడు. పరివారసమేతంగా వైకుంఠానికి తరలి వెళ్ళాడు.” అని చెప్పి శుకమహర్షి ఇలా చెప్పాడు.