Jump to content

పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/బలి యఙ్ఞము విస్తరించుట

వికీసోర్స్ నుండి

బలియఙ్ఞమువిస్తరించుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-678-ఆ.
మిఁ గొఱత పడియె నీతని జన్నంబు
విస్తరింపు కడమ విప్రవర్య!
విషమ మయిన కర్మ విసరంబు బ్రాహ్మణ
నులు చూచినంత మతఁ బొందు.”

టీక:- ఏమిన్ = ఏదైతే; కొఱతపడియెన్ = ఇంకామిగిలి ఉన్నదో; ఈతని = ఇతని యొక్క; జన్నంబు = యజ్ఞము; విస్తరింపు = నెరవేర్చుము; కడమ = మిగిలినదంతా; విప్ర = బ్రాహ్మణులలో; వర్య = శ్రేష్ఠుడా; విషమము = సరిగా పూర్తికానిది; అయిన = ఐన; కర్మ = కార్యక్రమముల; విసరంబున్ = సమూహమును; బ్రాహ్మణ = బ్రాహ్మణులైన; జనులు = వారు; చూచిన = చూసిన; అంతన్ = అంతమాత్రముచేత; సమతన్ = సఫలతను; పొందున్ = పొందును.
భావము:- “శుక్రాచార్యా! విప్రోత్తమా! బలిచక్రవర్తి యజ్ఞంలో మిగిలిన కార్యాన్ని నెరవేర్చు లోపం ఏమాత్రం రాకూడదు. ఆగిపోయిన యజ్ఞకార్యాలు మీవంటి బ్రహ్మవేత్తలవల్ల సఫలమవుతాయి.”

తెభా-8-679-వ.
అనిన శుక్రుం డి ట్లనియె .
టీక:- అనిన = అనగా; శుక్రుండు = శుక్రుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- ఇలా యజ్ఞం సంపూర్తి చేయమనిన విష్ణువు తో శుక్రుడు ఇలా అన్నాడు.

తెభా-8-680-సీ.
ఖిల కర్మంబుల ధినాథుఁడవు నీవ-
జ్ఞేశుఁడవు నీవ జ్ఞపురుష!
ప్రత్యక్షమున నీవు రితుష్టి నొందినఁ-
డ మేలఁ కల్గు నే ర్మములకు?
నదేశకాలార్హతంత్రమంత్రంబులఁ-
గొఱఁతలు నిన్నుఁ బేర్కొనిన మాను;
యినఁ గావింతు నీ యానతి భవదాజ్ఞ-
మెలఁగుట జనులకు మేలుఁ గాదె?

తెభా-8-680.1-తే.
యింతకంటెను శుభము నా కెచటఁ గలుగు”
నుచు హరిపంపు శిరమున నావహించి
కావ్యుఁ డసురేంద్రు జన్నంబు డమఁ దీర్చె
మునులు విప్రులు సాహాయ్యమునఁ జరింప
.
టీక:- అఖిల = సమస్తమైన; కర్మంబుల్ = కర్మలకు; అధినాథుడవు = పైఅధికారివి; నీవ = నీవే; యజ్ఞేశుడవు = యజ్ఞపతివి; నీవ = నీవే; యజ్ఞపురుష = యజ్ఞస్వరూప; ప్రత్యక్షమునన్ = ఎదురుగా; నీవున్ = నీవే; పరితుష్టిన్ = సంతృప్తిని; ఒందినన్ = పొందగా; కడమ = కొరతలు; ఏలకల్గున్ = ఎలాకలుగును, కలుగదు; ఏ = ఏ; కర్మముల = కర్మకాండల; కున్ = కైనను; ధన = ధనము; దేశ = ప్రదేశము; కాల = సమయములకు; అర్హ = తగిన; తంత్ర = తంతులు; మంత్రంబులన్ = మంత్రములచేత; కొఱతలు = ప్రాప్తించినదోషములు; నిన్నున్ = నిన్ను; పేర్కొనినన్ = తలచినచో; మానున్ = తొలగిపోవును; అయినన్ = అయినప్పటికిని; కావింతున్ = నిర్వహించెదను; నీ = నీ యొక్క; ఆనతిన్ = ఆజ్ఞమేరకు; భవత్ = నీ యొక్క; అజ్ఞన్ = ఆనతిప్రకారము; మెలగుట = నడచుట; జనుల్ = మానవుల; కున్ = కు; మేలు = ఉత్తమము; కాదే = కదా.
ఇంత = దీని; కంటెను = కంటెను; శుభము = భాగ్యము; నా = నా; కున్ = కు; ఎచటన్ = ఎక్కడ; కలుగున్ = దొరకును; అనుచున్ = అనుచు; హరి = నారాయణుని; పంపు = ఆజ్ఞను; శిరముననావహించి = తలదాల్చి; కావ్యుడు = శుక్రుడు {కావ్యుడు - కవియొక్కపుత్రుడు, శుక్రుడు}; అసురేంద్రు = బలియొక్క; జన్నంబున్ = యాగమును; కడమదీర్చె = పూర్తిచేసెను; మునులు = ఋషులు; విప్రులు = బ్రాహ్మణులు; సాహాయ్యమునన్ = తోడ్పడుతూ; చరింప = మెలగగా.
భావము:- “నీవే అన్ని కార్యాలకూ అధినాదుడవు. నీవే యజ్ఞాలకు అధికారివి. నీవు సంతోషిస్తే ఏకార్యాలకూ లోపం కలుగదు. నిన్ను ధ్యానంచేస్తే ధనానికీ దేశానికి మంత్రతంత్రాలకూ ప్రాప్తించిన దోషాలు తొలగిపోతాయి. మంచిది. నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. నీ ఆజ్ఞకు లోబడి మెలగడము మానవులకు మేలు. ఇంతకంటే భాగ్యం ఏముంది.” ఇలా అనిన శుక్రుడు విష్ణువు ఆజ్ఞను తలదాల్చి బలిచక్రవర్తి యాగాన్ని పూర్తి చేసాడు. అతనికి బ్రాహ్మణులూ ఋషులూ తోడ్పడ్డారు.

తెభా-8-681-వ.
ఇ వ్విధంబున వామనుం డయి హరి బలి నడిగి, మహిం బరిగ్రహించి, తనకు నగ్రజుండగు నమరేంద్రునకుం ద్రిదివంబు సదయుం డయి యొసంగె; న త్తరి దక్ష భృగు ప్రముఖ ప్రజాపతులును, భవుండును, గుమారుండును, దేవర్షి, పితృగణంబులును, రాజులును, దానును గూడికొని చతురాననుండు గశ్యపునకు నదితికి సంతోషంబుగా లోకంబులకు లోకపాలురకు "వామనుండు వల్లభుం"డని నియమించి యంత ధర్మంబునకు యశంబునకు లక్ష్మికి శుభంబులకు దేవతలకు వేదంబులకు వ్రతంబులకు స్వర్గాపవర్గంబులకు "నుపేంద్రుండు ప్రధానుం"డని సంకల్పించె నా సమయంబున .
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ; వామనుండు = పొట్టివాడుగ; అయి = అవతరించి; హరి = విష్ణువు; బలిన్ = బలిని; అడిగి = కోరి; మహిన్ = భూమిని; పరిగ్రహించి = తీసుకొని; తన = తన; కున్ = కు; అగ్రజుడు = అన్న {అగ్రజుడు - అగ్ర (ముందుగా) జుడు (పుట్టినవాడు), అన్న}; అగు = అయిన; అమరేంద్రున్ = దేవేంద్రుని; కున్ = కి; త్రిదివంబున్ = స్వర్గమును {త్రిదివము - ముల్లోకములు భూఃభువస్సువః లో మూడవది, స్వర్గము}; సదయుండు = దయ కలవాడు; అయి = ఐ; ఒసంగెన్ = ఇచ్చెను; ఆ = ఆ; తరిన్ = సమయమునందు; దక్ష = దక్షుడు; భృగు = భృగువు; ప్రముఖ = మున్నగు; ప్రజాపతులును = ప్రజాపతులు {ప్రజాపతి - ప్రజ (సంతానసృష్టికి) పతి, బ్రహ్మ, వీరు 9మంది, నవబ్రహ్మలు}; భవుండును = పరమశివుడు {భవుడు - భవముతానైన వాడు, శివుడు}; కుమారుండును = కుమారస్వామి; దేవర్షి = దేవఋషులు; పితృగణంబులును = పితృగణములు; రాజులును = రాజులు; తానును = తను; కూడికొని = కలిసి; చతురాననుండు = బ్రహ్మదేవుడు; కశ్యపున్ = కశ్యపున; కును = కు; అదితి = అదితి; కిన్ = కి; సంతోషంబు = సంతోషము; కాన్ = అగునట్లు; లోకంబుల్ = సర్వలోకముల; కున్ = కు; లోకపాలుర = సమస్తలోకపాలకుల; కున్ = కు; వామనుండు = వామనుడు; వల్లభుండు = ప్రభువు; అని = అని; నియమించి = నిర్ణయించెను; అంత = అంతట; ధర్మంబున్ = ధర్మమున; కున్ = కు; యశంబున్ = యశస్సున; కున్ = కు; లక్ష్మి = సంపదల; కిన్ = కు; శుభంబుల్ = శుభముల; కున్ = కు; దేవతల్ = దేవతల; కున్ = కు; వేదంబుల్ = వేదముల; కున్ = కు; వ్రతంబుల్ = వ్రతముల; కున్ = కు; స్వర్గ = స్వర్గము; అపవర్గంబుల్ = మోక్షముల; కును = కు; ఉపేంద్రుండు = వామనుడే {ఉపేంద్రుడు - ఇంద్రుని తమ్ముడు, వామనుడు}; ప్రధానుండు = అధికారి; అని = అని; సంకల్పించెను = నిర్ణయించెను; ఆ = ఆ; సమయంబున = సమయమునందు.
భావము:- ఈ విధంగా విష్ణువు వామనావతారం ఎత్తి, బలిచక్రవర్తి వద్ద భూదానం తీసుకున్నాడు. తన అన్న అయిన ఇంద్రుడికి దయతో స్వర్గలోకాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో దక్షుడు, భృగువు మొదలైన ప్రజాపతులు; శివుడు; కుమారస్వామి; నారదుడు మున్నగు దేవర్షులు; పితృదేవతలు; రాజులుతో పాటు కలిసి బ్రహ్మదేవుడు “లోకాలకూ దిక్పాలకులకూ వామనుడు ప్రభువు” అని శాసనం చేసాడు. ఈ విషయం కశ్యపుడికి అదితికి సంతోషం కలిగించింది. పిమ్మట, “ధర్మానికి కీర్తికీ సంపదలకూ శుభాలకూ దేవతలకూ వేదాలకు స్వర్గానికి మోక్షానికి ఉపేంద్రుడైన వామనుడే అధికారి” అని నిర్ణయించాడు.

తెభా-8-682-క.
లజుఁడు లోకపాలురు
రేంద్రునిఁగూడి దేవయానంబున న
య్యరావతికిని వామను
రం గొనిపోయి రంత ట మీఁద నృపా!

టీక:- కమలజుడు = బ్రహ్మదేవుడు {కమలజుడు - కమలమున పుట్టినవాడు, బ్రహ్మ}; లోకపాలురున్ = లోకపాలకులును; అమరేంద్రుని = దేవేంద్రునితో; కూడి = కలిసి; దేవయానంబునన్ = ఆకాశగమనమున; ఆ = ఆ; అమరావతి = అమరావతి; కిని = కి; వామనున్ = వామనుని; అమరన్ = ఆదరముతో; కొనిపోయిరి = తీసుకుని వెళ్ళిరి; అంతనటమీద = అటుతరువాత; నృపా = రాజా {నృపుడు - నరులను పాలించువాడు, రాజు}.
భావము:- పరీక్షన్మహారాజా! అటుపిమ్మట బ్రహ్మదేవుడూ దిక్పాలకులూ దేవేంద్రుడితో కలిసి ఎంతో ఆదరంతో వామనుణ్ణి విమానంపై కూర్చోపెట్టుకుని అమరావతికి తీసుకుని వెళ్లారు.

తెభా-8-683-ఆ.
ల్లిదంపుదోడు ప్రాపున నింద్రుని
కింద్రపదము చేరు టిట్లు గలిగెఁ;
నకు నాఢ్యుఁడైన మ్ముఁడుఁ గలిగినఁ
గోర్కులన్న కేల కొఱఁత నొందు?

టీక:- బల్లిదంపు = బలవంతుడైన; తోడు = తోడబుట్టువు; ప్రాపునన్ = దన్నువలన; ఇంద్రుని = ఇంద్రుని; కిన్ = కి; ఇంద్రపదవి = ఇంద్రత్వము; చేరుట = సమకూరుట; ఇట్లు = ఈ విధముగ; కలిగెన్ = కలిగినది; తన = తన; కున్ = కు; ఆఢ్యుడు = శ్రేష్ఠుడు; ఐన = అయినట్టి; తమ్ముడు = తమ్ముడు; కలిగినన్ = ఉన్నట్లయితే; కోర్కులు = కోరికలు; అన్న = అన్నయ్య; కిన్ = కి; ఏల = ఎందుకు; కొఱతన్ = నెరవేరకపోవుట; ఒందున్ = పొందును.
భావము:- ఈ విధంగా బలవంతుడైన తమ్ముడి ప్రాపువల్ల, ఇంద్రుడికి ఇంద్రపదవి తిరిగి లభించింది. శ్రేష్ఠుడైన తమ్ముడుంటే అన్నగారి కోరికలు నెరవేరకుండా ఉంటాయా.

తెభా-8-684-క.
పా డుగఁడు మే లడుగం
డేలఁడు భిక్షించి యన్నకిచ్చెఁ ద్రిజగమున్
వేలుపులతల్లి కడపటి
చూలుంబోలంగఁ గలరె సొలయని తమ్ముల్
.
టీక:- పాలు = వంతు, భాగము; అడుగడు = కావాలనడు; మేలు = లాభమును; అడుగండు = కావాలనడు; ఏలడు = పెత్తనము చెలాయించడు; భిక్షించి = యాచనచేసి; అన్న = అన్న; కిన్ = కి; ఇచ్చెన్ = ఇచ్చెను; త్రిజగమున్ = ముల్లోకములను; వేలుపులతల్లి = అదితి {వేలుపులతల్లి - దేవతల అమ్మ, అదితి}; కడపటి = ఆఖరి, కడగొట్టు; చూలున్ = సంతానమును; పోలంగగలరె = సాటిరాగలరా లేరు; సొలయని = వెనుదీయని; తమ్ముల్ = తమ్ముళ్ళు.
భావము:- దేవతలతల్లి అదితికి కడపటివాడైన కొడుకు వామనుడు భిక్షం అడిగి సంపాదించిన ముల్లోకాలూ తన అన్నకే ఇచ్చేసాడు. అందులో భాగాన్ని అడగలేదు. లాభాన్ని అడగలేదు. ఆవిధంగా అన్నల కోసం ఎంత శ్రమపడే తమ్ముళ్ళు అయినా వామనునితో సరిపోలగలరా?

తెభా-8-685-ఆ.
డుపు బదరగాఁగ గొడుకులఁ గనుకంటె
ల్లి కొకఁడె చాలు ల్లిదుండు;
త్రిశగణముఁ గన్న దితి గానుపు దీఱఁ
జిన్ని మేటివడుగుఁ న్న యట్లు
.
టీక:- కడుపు = కడుపు; బదరగాగ = బద్ధలయ్యేలా; కొడుకులన్ = కొడుకులను; కను = కనుట; కంటెన్ = కంటె; తల్లి = ఏతల్లి; కిన్ = కైనను; ఒకడె = ఒక్కడైనను; చాలు = సరిపోవును; బల్లిదుండు = సమర్థుడు; త్రిదశ = దేవతల {త్రిదశులు - ఎప్పుడును 30 ఏండ్లవయసువారివలె (యౌవనమున) ఉండువారు, దేవతలు}; గణమున్ = సమూహమును; కన్న = కనినట్టి; అదితి = అదితి; కానుపుతీఱన్ = కడుపుపండినట్లు; చిన్ని = వామనుడు; మేటి = ఉత్తముడుయైన; వడుగున్ = బ్రహ్మచారిని; కన్నట్లు = కనినట్లుగ.
భావము:- దేవతల సమూహాన్ని కన్న అదితి చివరకి అదృష్టం పండేటట్లు వామనుడిని కన్నది. కడుపు పగిలేలా పదిమందిని కనేకన్నా, ఏ తల్లికైనా అలాంటి కొడుకు ఒక్కడు చాలు.

తెభా-8-686-వ.
ఇట్లు దేవేంద్రుండు వామన భుజపాలితం బగు త్రిభువనసామ్రాజ్య విభవంబు మరల నంగీకరించె; నప్పుడు బ్రహ్మయు, శర్వుండునుఁ, గుమారుండును, భృగు ప్రముఖులయిన మునులునుఁ, బితృదేవతలును, దక్షాది ప్రజాపతులును, సిద్ధులును, వైమానికులును మఱియుం దక్కిన వారలును బరమాద్భుతంబైన విష్ణుని సుమహాకర్మంబులకు నాశ్చర్యంబు నొందుచుఁ, బ్రశంసించుచు, నాడుచుం, బాడుచు, తమతమ నివాసంబులకుం జని;"రని చెప్పి శుకుం డి ట్లనియె .
టీక:- ఇట్లు = ఈ విధముగ; దేవేంద్రుండు = దేవేంద్రుడు; వామన = వామనునిచే; భుజపాలితంబు = సంపాదించబడినది; అగు = అయిన; త్రిభువన = ముల్లోకముల; సామ్రాజ్య = సామ్రాజ్యముయొక్క; విభవంబున్ = వైభవమును; మరలన్ = మళ్ళీ; అంగీకరించెన్ = స్వీకరించెను; అప్పుడు = అప్పుడు; బ్రహ్మయున్ = బ్రహ్మదేవుడు; శర్వుండును = శంకరుడు; కుమారుండును = కుమారస్వామి; భృగు = భృగువు; ప్రముఖులు = ముఖ్యమైనవారు; అయిన = ఐన; మునులు = ఋషులు; పితృదేవతలును = పితృదేవతలు; దక్ష = దక్షుడు; ఆది = మున్నగు; ప్రజాపతులును = ప్రజాపతులు; సిద్ధులును = సిద్ధులు; వైమానికులును = దేవతలు {వైమానికులు – విమానమున చరించువారు, దేవతలు}; మఱియున్ = ఇంకను; తక్కిన = మిగిలిన; వారలునున్ = వారు; పరమ = అత్యంత; అద్భుతంబు = అచ్చెరువుగొల్పెడిది; ఐన = అయిన; విష్ణుని = నారాయణుని; సు = మంచి; మహా = గొప్ప; కర్మంబుల్ = పనుల; కున్ = కి; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యమును; ఒందుచున్ = పొందుతు; ప్రశసించుచు = కీర్తించుచు; ఆడుచున్ = ఆడుతూ; పాడుచున్ = పాడుతూ; తమతమ = వారివారి; నివాసంబుల్ = స్వస్థానముల; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; అని = అని; చెప్పి = చెప్పి; శుకుండు = శుకుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- అలా వామనుడు సంపాదించి ఇచ్చిన మూడులోకాల సామ్రాజ్య సంపదనూ దేవేంద్రుడు తిరిగి పొందాడు. అటుపిమ్మట బ్రహ్మదేవుడూ, శివుడూ, కుమారస్వామి, భృగువూ మొదలైన మునులూ, పితృదేవతలూ, దక్షుడూ మొదలైన ప్రజాపతులూ, సిద్ధులూ, దేవతలూ ఇంకా తక్కినవారు అందరూ విష్ణుదేవుని లీలావిలాసాలకు ముచ్చట పడుతూ పొగుడుతూ ఆటపాటలతో తమతమ నివాసాలకు వెళ్ళిపోయారు.” అనిచెప్పి శుకుడు ఇలా అన్నాడు.

తెభా-8-687-తే.
నుజనాథ! త్రివిక్రము హిమ కొలఁది
యెఱుఁగఁ దర్కింప లెక్కింప నెవ్వఁడోపుఁ?
గుంభినీ రేణుకణములు గుఱుతు పెట్టు
వాఁడు నేరఁడు; తక్కిన వారి వశమె?

టీక:- మనుజనాథ = రాజ {మనుజనాథుడు - మనుజులకు నాథుడు (ప్రభువు), రాజు}; త్రివిక్రమున్ = త్రివిక్రముని; మహిమన్ = గొప్పదనముయొక్క; కొలది = మేర; ఎఱుగన్ = తెలియుటకు; తర్కింపన్ = ఊహించుటకు; లెక్కింపన్ = ఎంచిచూచుటకు; ఎవ్వడు = ఎవడు; ఓపున్ = సరిపోవును; కుంభినీ = భూమిలోని; రేణు = ధూళి; కణములున్ = కణములను; గుఱుతుపెట్టు = లెక్కపెట్టగల; వాడున్ = వాడుకూడ; నేరడు = సమర్థుడుకాడు; తక్కిన = ఇంకమిగిలిన; వారి = వారికి; వశమె = వీలగునా కాదు.
భావము:- “రాజా! పరీక్షిత్తూ! త్రివిక్రమావతారుడైన వామనుడి గొప్ప గుణాలను పూర్తిగా తెలుసుకోడం కానీ లెక్కించడం కానీ ఎవరికీ సాధ్యంకాదు. భూమిలోని ధూళి కణాలను లెక్కపెట్టగలిగిన వాడికైనా, ఇది సాధ్యం కాదు. ఇంక వేరేవారి సంగతి చెప్పేదేముంది.

తెభా-8-688-క.
ద్భుత వర్తనుఁడగు హరి
ద్భావితమైన విమలరితము వినువాఁ
డుద్భట విక్రముఁడై తుది
నుద్భాసితలీలఁ బొందు నుత్తమ గతులన్
.
టీక:- అద్భుత = అద్భుతమైన; వర్తనుడు = నడవడిక కలవాడు; అగు = అయిన; హరి = విష్ణుని; సద్భావితము = చక్కగాతెలిపెడిది; అయిన = ఐన; విమల = నిర్మలమైన; చరితము = చరిత్ర; విను = వినెడి; వాడు = వాడు; ఉద్భట = అధికమైన; విక్రముడు = పరాక్రమము కలవాడు; ఐ = అయ్యి; తుదిన్ = చివరికి; ఉద్భాసిత = మిక్కిలి ప్రకాశించెడి; లీలన్ = విధముగా; పొందున్ = పొందును; ఉత్తమ = దివ్య; గతులన్ = పదములను.
భావము:- అత్యద్భుత మైన లీలలతోకూడిన విష్ణుమూర్తి నిర్మల వర్తనములను గురించి తెలిపే ఈపుణ్య చరిత్రను వినేవాడు గొప్ప భాగ్యవంతుడు అవుతాడు. చివరకి ప్రకాశించే ప్రభావంతో దివ్యలోకాలను పొందుతాడు.

తెభా-8-689-తే.
గిలి మానుష పైతృక దైవ కర్మ
వేళలందుఁ ద్రివిక్రమ విక్రమంబు
లెక్కడెక్కడఁ గీర్తింతు రెవ్వరేనిఁ
బొందుదురు నిత్య సౌఖ్యంబు భూవరేంద్ర!

టీక:- తగిలి = పూని; మానుష = మానవసంబంధమైన; పైతృక = పితృసంబంధమైన; దైవ = దైవసంబంధమైన; కర్మ = కార్యములను చేసెడి; వేళలు = సమయములందు; త్రివిక్రమ = త్రివిక్రముని; విక్రమంబుల్ = వర్తనలను; ఎక్కడెక్కడన్ = ఎక్కడైనను; కీర్తింతురు = కీర్తించెదరో; ఎవ్వరేనిన్ = ఎవరైతేవారు; పొందుదురు = పొందెదరు; నిత్య = ఎల్లప్పుడును; సౌఖ్యంబు = సుఖములను; భూవరేంద్ర = మహారాజ {భూవరేంద్ర - భూవరు (రాజుల)లో ఇంద్రుడు, మహారాజు}.
భావము:- పరీక్షిన్మహారాజా! మానవులకూ పితృదేవతలకూ దేవతలకూ సంబంధించిన పుణ్యకార్యాలు చేసే సమయాలలో ఎవరైతే త్రివిక్రముని చరిత్రను కీర్తిస్తుంటారో, వారు ఎప్పుడూ సర్వ సుఖాలూ పొందుతూ ఉంటారు.

తెభా-8-690-మ.
డులై నాకముఁ గోలుపోవు సురలం జంభారినిం బ్రోవఁగా
డుగై భూమి బదత్రయం బిడుటకై వైరోచనిన్ వేఁడి రెం
డుగుల్ సాఁచి త్రివిక్రమస్ఫురణ బ్రహ్మాండంబుఁ దా నిండుచుం
డుమోదంబున నుండు వామనున కెక్కాలంబునన్ మ్రొక్కెదన్.”

టీక:- జడులు = తెలివిలేనివారు; ఐ = అయ్యి; నాకమున్ = స్వర్గమును; కోలుపోవు = నష్టపోయిన; సురలన్ = దేవతలను; జంభారినిన్ = ఇంద్రుని {జంభారి - జంభాసురును సంహరించినవాడు, ఇంద్రుడు}; ప్రోవగా = కాపాడుటకై; వడుగు = బ్రహ్మచారి; ఐ = అవతారమెత్తి; భూమిన్ = స్థలమును; పదత్రయమున్ = మూడడుగులను; ఇడుట = దానమిచ్చుట; కై = కోసమై; వైరోచనిన్ = బలిని; వేడి = అడిగి; రెండు = రెండు (2); అడుగుల్ = అడుగులు; సాచి = చాచి; త్రివిక్రమ = త్రివిక్రమ; స్ఫురణన్ = అవతారముతో; బ్రహ్మాండంబున్ = బ్రహ్మాండమంత; తాన్ = తానే యై; నిండుచున్ = నిండిపోతూ; కడు = మిక్కిలి; మోదంబునన్ = సంతోషముతో; ఉండు = ఉండెడి; వామనున్ = వామనుని; ఏకాలంబునన్ = అన్నికాలములందు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను.
భావము:- జంభాసురుని సంహరించిన ఇంద్రుడు, దేవతలు, అశక్తులై స్వర్గాన్ని ఓడిపోయారు. విష్ణుమూర్తి వారిని కాపాడటానికి వామనావతారం ఎత్తి, విరోచనుని కొడుకు బలిచక్రవర్తిని మూడు అడుగుల నేల దానం ఇమ్మని అడిగి పుచ్చుకున్నాడు. త్రివిక్రమావతారం ఎత్తి రెండు అడుగులు వేయడంతోనే బ్రహ్మాండం అంతా నిండిపోయి ఆనందంగా ఉండే ఆ వామనుడికి ఎప్పుడూ మ్రొక్కుతూ ఉంటాను.”

తెభా-8-691-వ.
అని యిట్లు శుకుండు రాజునకు వామనావతారచరితంబు చెప్పె”నని సూతుండు మునులకుం జెప్పిన విని, వార లతని కిట్లనిరి .
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; శుకుండు = శుకుడు; రాజున్ = రాజున; కున్ = కు; వామనావతార = వామనావతారముయొక్క; చరితంబున్ = చరిత్రను; చెప్పెను = చెప్పెను; అని = అని; సూతుండు = సూతుడ; మునుల్ = మునుల; కున్ = కు; చెప్పిన = చెప్పగా; విని = విని; వారల్ = వారు; అతని = అతని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- అని ఈ విధంగా శుకబ్రహ్మ పరీక్షిత్తు మహారాజునకు వామనావతార చరిత్రను చెప్పెను” అని సూతమహర్షి శౌనకాది మహర్షులకు చెప్పాగా వినిన వారు సూతునితో ఇలా అన్నారు.