పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/బలిని బంధించుట

వికీసోర్స్ నుండి

బలినిబంధించుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-638-వ.
అట్లు గావున రణంబున శత్రుల కిప్పు డెదురు మోహరించుట కార్యంబుఁ గాదు; మనకుం దగు కాలంబున జయింతము; నలంగక తొలంగుం” డనిన దలంగి భాగవత భట భీతులై చిక్కి రక్కసులు రసాతలంబునకుం జని; రంత హరి హృదయం బెఱింగి తార్క్షనందనుండు యాగసుత్యాహంబున వారుణ పాశంబుల నసురవల్లభుని బంధించె; నంత .
టీక:- అట్లుగావున = అందుచేత; రణంబునన్ = యుద్ధమునందు; శత్రుల్ = శత్రువుల; కున్ = కు; ఇప్పుడు = ఇప్పుడు; ఎదురు = ఎదురునిల్చి; మోహరించుట = వ్యూహములు పన్నుట; కార్యంబు = తగినపని; కాదు = కాదు; మన = మన; కున్ = కు; తగు = తగినట్టి; కాలంబునన్ = కాలంకలిసివచ్చి నప్పుడు; జయింతము = గెలిచెదము; నలంగక = అనవసరశ్రమ పడక; తొలంగుడు = తప్పుకొనుడు; అనినన్ = అనగా; తలంగి = తప్పుకొని; భాగవత = భగవంతుని, విష్ణు; భట = భటుల యెడ; భీతులు = భయపడువారు; ఐ = అయ్యి; చిక్కి = తగ్గి; రక్కసులున్ = రాక్షసులు; రసాతలంబున్ = రసాతలమున; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; అంతన్ = అప్పుడు; హరి = విష్ణుని; హృదయంబున్ = మనసు; ఎఱింగి = తెలిసికొని; తార్క్షనందనుండు = గరుడుడు {తార్క్షనందనుడు - తార్క్షు ని (కశ్యపుని) కొడుకు, గరుడుడు}; యాగసుత్య = యాగముచివర సుత్య చేసెడి {సుత్య - స్నానము, సోమలతను కొట్టిపిడుచుట, సోమపానము}; అహంబునన్ = దినమున; వారుణపాశంబులన్ = వరుణపాశములతో; అసురవల్లభుని = బలిచక్రవర్తిని; బంధించెను = బంధించెను; అంత = అంతట.
భావము:- కనుక, ఇప్పుడు శత్రువులతో యుద్ధానికి పూనుకోవడం తగదు. మనకు అనుకూలమైన సమయంలో గెలువవచ్చు. అనవసరంగా శ్రమపడకుండా తొలగిపొండి.” అని బలిచక్రవర్తి చెప్పాడు. అప్పుడు విష్ణుభక్తులకు భయపడి రాక్షసులు రసాతలానికి వెళ్ళిపోయారు. అటుపిమ్మట యాగంలో సోమపానంచేసే చివరి దినాన విష్ణువు అభిప్రాయాన్ని తెలుసుకుని గరుడుడు బలిచక్రవర్తిని వరుణపాశాలతో బంధించాడు.

తెభా-8-639-క.
బాహులుఁ బదములుఁ గట్టిన
శ్రీరి కృపగాక యేమి జేయుదు నని సం
దేహింపక బలి నిలిచెను
హాహారవ మెసఁగె దశ దిగంతములందున్
.
టీక:- బాహులున్ = చేతులు; పదములున్ = కాళ్ళు; కట్టినన్ = కట్టివేసినను; శ్రీహరి = విష్ణునియొక్క; కృప = దయ; కాక = కాకుండగ; యేమి = ఏమి; చేయుదును = చేయగలను; అని = అని; సందేహింపకన్ = సంకోచములేకుండ; బలి = బలి; నిలిచెను = మౌనమువహించెను; హాహారవములు = హాహాకారములు; ఎసగెన్ = చెలరేగెను; దశదిగంతముల్ = అన్నివైపుల; అందున్ = లోను.
భావము:- చేతులూ కాళ్ళూ కట్టబడిన బలి చక్రవర్తి, ఇది విష్ణువు దయ దీనికి ఏమీ చేయలేను అనుకుంటూ, సంకోచం ఏమీ లేకుండా మౌనం వహించాడు. అన్నివైపులా హాహాకారాలు చెలరేగాయి.

తెభా-8-640-క.
సంద చెడియును దైన్యము
గంపంబును లేక తొంటికంటెను బెంపుం
దెంపును నెఱుకయు ధైర్యము
వంని సురవైరిఁ జూచి టుఁ డిట్లనియెన్
.
టీక:- సంపద = ఐశ్వర్యము; చెడియును = నశించినను; దైన్యము = దీనత్వము; కంపంబునున్ = బెదురులు; లేక = లేకుండ; తొంటి = ఇంతకుముందు; కంటెను = కంటె; పెంపున్ = అతిశయము; తెంపు = తెగువ; ఎఱుకయున్ = జ్ఞానము; ధైర్యము = ధైర్యము; వంపని = తగ్గని; సురవైరిన్ = బలిచక్రవర్తిని; చూచి = చూసి; వటుడు = బ్రహ్మచారి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఐశ్వర్యం నశించినా బలిచక్రవర్తి లో దీనత్వమూ కంపమూ కలుగలేదు. అంతే కాదు వెనుకటికంటే ఔన్నత్యమూ. తెగువా, జ్ఞానమూ, ధైర్యమూ అధికం అయ్యాయి. అప్పుడు బలిచక్రవర్తిని చూచి వామనుడు ఇలా అన్నాడు.

తెభా-8-641-సీ.
దానవ! త్రిపదభూల మిత్తు నంటివి-
రణిఁ జంద్రార్కు లెందాఁక నుందు
రంత భూమియు నొక్క డుగయ్యె నాకును-
స్వర్లోకమును నొక్క రణమయ్యె;
నీ సొమ్ము సకలంబు నేఁడు రెండడుగులు-
డమ పాదమునకుఁ లదె భూమి?
యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు-
నిరయంబు బొందుట నిజముగాదె?

తెభా-8-641.1-తే.
కాన దుర్గతికినిఁ గొంత కాల మరుగు
కాక యిచ్చెదవేని వేగంబ నాకు
నిపుడ మూఁడవ పదమున కిమ్ముఁ జూపు
బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమె?”

టీక:- దానవ = రాక్షసుడా; త్రిపద = మూడడుగుల; భూతలమున్ = భూభాగమును; ఇత్తున్ = ఇచ్చెదను; అంటివి = అన్నావు; ధరణిన్ = భూమిని; చంద్ర = చంద్రుడు; అర్కులు = సూర్యుడు; ఎందాక = ఎక్కడిదాక; ఉందురు = కనబడెదరో; అంత = అక్కడివరకు; భూమియున్ = భూమిని; ఒక్క = ఒకేఒక; అడుగు = అడుగు; అయ్యెన్ = అయినది; నా = నా; కునున్ = కు; స్వర్లోకమును = స్వర్గలోకము; ఒక్క = ఒకేఒక; చరణము = అడుగు; అయ్యెన్ = అయినది; నీ = నీ యొక్క; సొమ్ము = సంపద; సకలంబు = అంతా; రెండు = రెండు (2); అడుగులు = అడుగులు; కడమ = మిగిలిన; పాదమున్ = అడుగున; కున్ = కు; కలదె = ఉన్నదా; భూమి = నేల; ఇచ్చెదన్ = దానమిచ్చెదను; అన్న = అనిన; అర్థమున్ = సొమ్ము; ఈని = ఇయ్యనట్టి; దురాత్ముండు = దుష్టుడు; నిరయంబున్ = నరకమును; పొందుట = పొందుట; నిజము = సత్యము; కాదె = కాదా ఏమి.
కాన = కనుక; దుర్గతి = నరకమునకుపోవుట; కినిన్ = కి; కొంత = కొంత; కాలము = సమయము; అరుగున్ = పట్టును; కాక = అలాకాకుండగ; ఇచ్చెదవు = ఇచ్చెడివాడవు; ఏని = ఐతే; వేగంబ = శీఘ్రమే; నా = నా; కున్ = కు; ఇపుడ = ఇప్పుడే; మూడవ = మూడవ (3); పదమున్ = అడుగున; కున్ = కు; ఇమ్ము = చోటు; చూపు = చూపుము; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; అధీనములున్ = ఆధీనము కావలసిన వానిని; త్రోవన్ = కాదనుటకు; బ్రహ్మ = బ్రహ్మదేవునకైన; వశమె = సాధ్యమా, కాదు.
భావము:- “ఓ దనుజేంద్రా! బలీ! మూడడుగుల నేల ఇస్తాను అన్నావు కదా. భూలోకమూ, సూర్య చంద్రుల దాకా ఉండే స్థలము నాకు ఒక అడుగుకి సరిపోయింది. స్వర్గలోకం ఒక అడుగుకి సరిపోయింది. నీ సంపద అంతా ఈనాడు రెండు అడుగులైంది. ఇక మూడవ అడుగుకు చోటెక్కడుంది. ఇస్తానన్న అర్థాన్ని ఇవ్వనివాడు నరకాన్ని పొందడం నిజమే కదా! అందువల్ల, నీకు కొంచెంసేపటిలో నరకం ప్రాప్తిస్తుంది. సందేహం లేదు. అలాకాకుండా మూడవ అడుగు ఇవ్వదలుచుకుంటే ఆచోటు నాకు చూపించు. బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిన దానిని కాదనడానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు.”

తెభా-8-642-వ.
అని యిట్లు వామనుండు పలుక సత్యభంగ సందేహ విషదిగ్ధ శల్య నికృత్త హృదయుం డయ్యును విషణ్ణుండుఁ గాక వైరోచని ప్రసన్న వదనంబుతోడఁ జిన్ని ప్రోడ వడుగున కి ట్లనియె .
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; వామనుండు = వామనుడు; పలుకన్ = అనగా; సత్యభంగ = ఆడినమాట బోటగు ననెడి; సందేహ = అనుమానము యనెడి; విషత్ = విషము; దిగ్ధ = పూయబడిన; శల్య = బాణము; నికృత్త = గుచ్చుకొన్న; హృదయుండు = హృదయము కలవాడు; అయ్యును = అయినప్పటికిని; విషణ్ణుండు = దిగులుపడ్డవాడు; కాక = కాకుండ; వైరోచని = బలిచక్రవర్తి; ప్రసన్న = నిర్మలమైన; వదనంబు = ముఖము; తోడన్ = తోటి; చిన్ని = వామనుడు; ప్రోడ = బుద్ధిశాలియైన; వడుగున్ = బ్రహ్మచారి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా పలికిన వామనుడి మాటలు వినిన బలిచక్రవర్తికి సత్యభంగం అవుతుంది ఏమో అనే సందేహం కలిగింది. అది విషబాణంలా మనసును గాయపరచింది. అయినా అతడు దిగులుచెందకుండా ప్రసన్నమైన ముఖంతో బుద్ధిశాలి అయిన వామనుడితో ఇలా అన్నాడు.

తెభా-8-643-ఆ.
సూనృతంబుఁ గాని సుడియదు నా జిహ్వ
బొంకఁజాల; నాకు బొంకు లేదు;
నీ తృతీయపదము నిజము నా శిరమున
నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!

టీక:- సూనృతంబు = సత్యమైనదానిని; కాని = తప్పించి; సుడియదు = పొడచూపదు; నా = నా యొక్క; జిహ్వన్ = నాలుక యందు; బొంకజాల = అబద్ధము చెప్పలేను; నా = నా; కున్ = అందు; బొంకు = అసత్యము; లేదు = లేదు; నీ = నీ యొక్క; తృతీయ = మూడవ (3); పదమున్ = అడుగును; నిజమున్ = తథ్యముగా; నా = నా యొక్క; శిరమునన్ = తలపైన; నెలవు = వసించునట్లు; చేసి = చేసి; పెట్టు = పెట్టుము; నిర్మల = స్వచ్ఛమైన; ఆత్మ = మనసు కలవాడా.
భావము:- ఓ పుణ్యాత్ముడా! సత్యం కానిది నా నాలుకమీద పుట్టనే పుట్టదు. అబద్ధమన్నది చెప్పనే చెప్పలేను. నాలో అసత్య మన్నది లేదు. నీ మూడవ అడుగు శాశ్వతంగా నా తలమీద పెట్టు మహాత్మా!
మూడడుగులు దానంగా గ్రహించిన, వామనుడు త్రివిక్రమావతారం ధరించి రెండు అడుగులలో మొత్తం ముల్లోకాలు ఆక్రమించాడు. మూడో అడుగు ఎక్కడ పెట్టమన్నావు చూపించమన్నాడు. పరమ దానశీలుడు, సత్యసంధుడు అయిన బలిచక్రవర్తి ‘నీ పాదం నా తలమీద పెట్టు పరమేశా!’ అని ఇలా సమాధానం చెప్తున్నాడు.

తెభా-8-644-ఆ.
నిరయమునకుఁ బ్రాప్త నిగ్రహంబునకును
దవిహీనతకును బంధనమున
ర్థ భంగమునకు ఖిల దుఃఖమునకు
వెఱవ దేవ! బొంక వెఱచినట్లు
.
టీక:- నిరయమున్ = నరకమున; కునున్ = కు; ప్రాప్త = కలిగిన; నిగ్రహంబున్ = చెఱపట్టబడుటకు; కునున్ = కు; పద = పదవి; విహీనత = పోవుట; కునున్ = కు; బంధనమున్ = బంధింపబడుట; కున్ = కు; అర్థ = సంపదల; భంగమున్ = నశించినందుల; కునున్ = కు; అఖిల = సమస్తమైన; దుఃఖమున్ = దుఃఖముల; కున్ = కు; వెఱవన్ = బెదరను; దేవ = భగవంతుడా; బొంక = అబద్ధమాడుటకు; వెఱచిన్ = బెదరెడి; అట్లు = విధముగా.
భావము:- భగవాన్! నరకానికి పోడం కన్నా, శిక్షింపపడటం కన్నా, ఉన్నతమైన పదవి పోడం కన్నా, బంధింపబడటం కన్నా, సర్వ సంపదలు నశించటం కన్నా, కష్టాలు అన్నీ రావడం కన్నా కూడ అసత్యం చెప్పడానికే ఎక్కువ భయపడతాను సుమా.

తెభా-8-645-వ.
అదియునుం గాక .
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతే కాకుండా . . . .

తెభా-8-646-సీ.
ల్లిదండ్రులు నన్నమ్ములు చెలికాండ్రు-
గురువులు శిక్షింపఁ గొఱతపడునె?
పిదప మేలగుఁ గాక; పృథుమదాంధులకును-
దానవులకు మాకుఁ ఱియెఱింగి
విభ్రంశచక్షువు వెలయ నిచ్చుటఁ జేసి-
గురువులలోనాదిగురువ వీవ;
నీవు బంధించిన నిగ్రహమో లజ్జ-
యో నష్టియో బాధయో తలంప

తెభా-8-646.1-తే.
నిన్నునెదిరించి పోరాడి నిర్జరాదు
లాదియోగీంద్రు లందెడు ట్టి టెంకి
నందరే తొల్లి పెక్కండ్రు? ర్షమూర్తి!
యీశ! నీ యెడ దుర్లభ మేమి కలదు?

టీక:- తల్లిదండ్రులున్ = అమ్మనాన్నలు; అన్నదమ్ములున్ = సోదరులు; చెలికాండ్రు = స్నేహితులు; గురువులు = గురువులు; శిక్షింపన్ = దండించినచో; కొఱతపడునె = నష్టంకలుగునా, కలుగదు; పిదపన్ = ఆ తరువాత; మేలు = మంచి; అగుగాక = అయితీరును; పృథు = అతిమిక్కిలి; మద = గర్వముచేత; అంధులు = గుడ్డియైనవారల; కునున్ = కు; దానవుల్ = రాక్షసుల; కున్ = కు; మా = మా; కున్ = కు; తఱి = తగినసమయము; ఎఱింగి = తెలిసికొని; విభ్రంశచక్షువున్ = కనిపించనికళ్ళకు; వెలయన్ = వెలుగెడిచూపును; ఇచ్చుటన్ = ఇచ్చుట; చేసి = వలన; గురువుల = గురువుల; లోన్ = అందు; ఆదిగురువవు = ఆదిగురువైనవాడవు; ఈవ = నీవే; నీవు = నీవు; బంధించినన్ = బంధించినచో; నిగ్రహమో = శిక్ష యనికాని; లజ్జయో = సిగ్గు యనికాని; నష్టియో = నష్టము యనికాని; బాధయో = బాధ యనికాని; తలంపన్ = అనుకొనను.
నిన్నున్ = నిన్ను; ఎదిరించి = ఎదిరించి; పోరాడి = యుద్ధములుచేసి; నిర్జరులు = దేవతలు {నిర్జరులు - జర (ముసలితనము) లేనివారు, వేల్పులు}; ఆదులు = మున్నగువారు; యోగీంద్రులున్ = యోగీశ్వరులు; అందెడు = చెందెడిది; అట్టి = అటువంటి; టెంకిన్ = స్థానమును; అందరే = అందుకొలేదా; తొల్లి = ఇంతకుముందు; పెక్కండ్రు = అనేకులు; హర్షమూర్తి = ఆనందస్వరూపి; ఈశ = భగవంతుడ; నీ = నీ; ఎడన్ = అందు; దుర్లభము = సాధ్యముకానిది; ఏమికలదు = ఏముంది, ఏమీలేదు.
భావము:- ఓ పరమేశ్వరా! ఆనందస్వరూపా! తల్లితండ్రులూ, అన్నదమ్ములూ, మిత్రులూ, గురువులూ, బుద్ధిచెప్పడంతో ఏమీ నష్టం కలుగదు. దానివల్ల తరువాత మేలే కలుగుతుంది. మదంతో కన్నులు కనిపించని మావంటి రాక్షసులకు నీవు సకాలంలో చెదరిపోకుండా వెలిగే చూపును ఇచ్చావు. అందువల్ల నీవు గరువులలో మొదటిగురువు అయ్యావు. నీవు నన్ను బంధించడం శిక్షగాగాని సిగ్గుగా కానీ లోటుగా కానీ బాధగా కానీ నేను భావించను. ఇదివరలో చాలామంది రాక్షసులు నిన్నుఎదిరించి పోరాడి యోగీశ్వరులు పొందే స్థానాన్ని పొందారుకదా స్వామీ! నీ దగ్గర అసాధ్యం అన్నది ఏముంది?

తెభా-8-647-మ.
చెలియే మృత్యువు? చుట్టమే యముఁడు? సంసేవార్థులే కింకరుల్?
శిలం జేసెనె బ్రహ్మదన్ను? దృఢమే జీవంబు? నో చెల్లరే;
లితం బౌట యెఱుంగ కీ కపట సంసారంబు నిక్కంబుగాఁ
లఁచున్ మూఢుఁడు సత్యదాన కరుణార్మాదినిర్ముక్తుఁడై
.
టీక:- చెలియె = స్నేహితుడా ఏమి; మృత్యువు = మరణము; చుట్టమే = బంధువా ఏమిటి; యముడు = యమధర్మరాజు; సంసేవార్థులే = చక్కగాసేవించెడివారా ఏమి; కింకరులు = యమకింకరులు; శిలలంజేసెనె = బండరాళ్లతోచేసెనా ఏమి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; తన్ను = తనను; దృఢమే = నాశము లేనిదా ఏమి; జీవనంబున్ = బ్రతుకు; ఓ = ఓహో; చెల్లరే = అయ్యో; చలితంబు = చలించిపోవునది; ఔటన్ = అగుట; ఎఱుంగక = తెలియక; ఈ = ఈ; కపట = మాయా; సంసారంబున్ = సంసారమును; నిక్కంబు = సత్యమైనది; కాన్ = అయినట్లు; తలచున్ = భావించును; మూఢుడు = మూర్ఖుడు; సత్య = సత్యము; దాన = దానము; కరుణ = దయా; ధర్మ = ధర్మము; ఆది = మున్నగువానినుండి; నిర్ముక్తుండు = వదలినవాడు; ఐ = అయ్యి.
భావము:- అయ్యయ్యో! మృత్యువు ఏమైనా ఆప్తమిత్రమా ఏమిటి? లేక యముడు దగ్గర చుట్టమా? యముని సేవకులు భక్తితో సేవించాలి అనేటంత బుద్ధిమంతులా ఏమిటి? పోనీ ప్రాణం ఏమైనా శాశ్వతమా? లేక ఈ శరీరాన్ని బ్రహ్మ రాళ్ళతో కానీ మలచాడా? సత్యం ఇలా ఉండగా, మూర్ఖుడు సత్యమూ దానమూ దయా ధర్మమూ మొదలైనవాటిని వదలివేస్తున్నాడు. ఈ మాయాసంసారాన్ని సత్యమని భావిస్తున్నాడు.

తెభా-8-648-సీ.
చుట్టాలు దొంగలు సుతులు ఋణస్థులు;-
కాంతలు సంసార కారణములు;
నము లస్థిరములు; ను వతి చంచల-
గార్యార్థు లన్యులు; డచుఁగాల
మాయువు; సత్వర మైశ్వర్య మతి శీఘ్ర-
ని కాదె తమ తండ్రి తకరించి
మా తాత సాధుసమ్మతుఁడు ప్రహ్లాదుండు-
నీ పాదకమలంబు నియతిఁ జేరె

తెభా-8-648.1-తే.
ద్రుఁ డతనికి మృతి లేని బ్రతుకుఁ గలిగె
వైరులై కాని తొల్లి మా వారుఁ గాన
ర్థివై వచ్చి నీవు న న్నడుగు టెల్ల
ద్మలోచన! నా పుణ్య లము గాదె?”

టీక:- చుట్టాలు = బంధువులు; దొంగలు = చోరులు; సుతులు = పుత్రులు; ఋణస్థులు = అప్పులవాళ్ళు; కాంతలు = భార్యలు; సంసార = భవబంధములకు; కారణములు = హేతువులు; ధనములు = సంపదలు; అస్థిరములు = నిలకడలేనివి; తనువు = దేహము; అతి = మిక్కిలి; చంచల = చంచలమైనది; కార్యార్థులు = ప్రయోజనముకోరువారు; అన్యులు = శత్రువులు; గడచు = గడిచిపోవునది; కాలము = కాలము; ఆయువు = ఆయుష్షు; సత్వరము = త్వరగ తరగిపోవునది; ఐశ్వర్యమున్ = ఆశ్వర్యము; అతి = మిక్కిలి; శీఘ్రము = తొందరగాపోవునది; అని = అని; కాదె = కాదా కనుకనే; తమ = అతని యొక్క; తండ్రిన్ = తండ్రిని; అతకరించి = అతిక్రమించి; మా = మా యొక్క; తాత = పితామహుడు; సాధు = మంచివారిచే; సమ్మతుండు = అంగీకరింపబడినవాడు; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; నీ = నీ యొక్క; పాద = పాదములు యనెడి; కమలంబున్ = పద్మములను; నియతిన్ = నిష్ఠగా; చేరెన్ = చేరెను.
భద్రుడు = అదృష్టవంతుడు; అతని = అతని; కిన్ = కి; మృతి = మరణము; లేని = లేనట్టి; బ్రతుకున్ = జీవితము; కలిగెన్ = లభించెను; వైరులు = శత్రువులు; ఐ = అయ్యి; కాని = తప్పించి; తొల్లి = ఇంతకుముందు; మా = మాకుచెందిన; వారు = వారు; కానరు = దర్శించలేకపోయిరి; అర్థివి = యాచకునివి; ఐ = అయ్యి; వచ్చి = వచ్చి; నీవున్ = నీవు; నన్నున్ = నన్ను; అడుగుట = దానమడుగుట; ఎల్లన్ = అంతయు; పద్మలోచన = నారాయణ; నా = నా యొక్క; పుణ్య = పుణ్యమునకు; ఫలము = ప్రతిఫలము; కాదె = కాదా ఏమి.
భావము:- పురాణపురుషా! “చుట్టాలు దొంగలు కొడుకులు అప్పులవాళ్ళు. భార్యలు ముక్తిని దూరంచేసేవారు. సంపదలు నిలకడ లేనివి. శరీరం స్థిరం కాదు. ఇతరులు తమప్రయోజనాన్నే కోరుతారు. కాలం నిలువదు. ఆయుస్సు త్వరగా గడుస్తుంది. ఐశ్వర్యం తొందరగా వెళ్ళిపోతుంది” అనుకున్నాడు పుణ్యాత్ముడైన మా తాత ప్రహ్లాదుడు. ఆయన తన తండ్రిని విడనాడి నీపాదాలను సేవించాడు. అదృష్టవంతుడైన అతనికి మరణంలేని మనుగడ దొరికింది. పూర్వం మావారు శత్రువులుగా మారితే తప్ప నిన్ను దర్శించలేకపోయారు. నీవు అర్థివై వచ్చి నన్ను దేహి అనడం మా పూర్వ పుణ్య ఫలమే కదా స్వామీ!”.

తెభా-8-649-వ.
అని యిట్లు పలుకుచున్న యవసరంబున .
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలుకుచున్న = అనుచున్నట్టి; అవసరంబునన్ = సమయమునందు.
భావము:- ఇలా బలిచక్రవర్తి పలుకుతున్న సమయంలో. . .

తెభా-8-650-శా.
దైత్యేంద్రుఁడు పీనవక్షు, నవపద్మాక్షుం, బిశంగాంబరా
చ్ఛాదున్నిర్మలసాధువాదు. ఘనసంసారాదివిచ్ఛేదు. సం
శ్రీదున్,భక్తిలతాధిరోహిత హరిశ్రీపాదు, నిఃఖేదుఁ, బ్ర
హ్లాదున్బోధకళావినోదుఁ గనియెన్ ర్షంబుతో ముందటన్
.
టీక:- ఆ = ఆ; దైత్యేంద్రుడు = బలిచక్రవర్తి; పీనవక్షున్ = విశాలమైన వక్షము కలవానిని; నవ = విరిసిన; పద్మా = పద్మములవంటి; అక్షున్ = కన్నులు కలవానిని; పిశంగ = పచ్చని; అంబర = పట్టుబట్టలు; ఆచ్ఛాదున్ = కట్టుకొన్నవానిని; నిర్మల = స్వచ్ఛముగా; సాధు = మంచిగా; వాదును = మాట్లాడువానిని; ఘన = గట్టిదైన; సంసార = భవబంధములను; విచ్ఛేదున్ = తెంచుకొనినివానిని; సంశ్రీదున్ = సుగుణసంపన్నుని; భక్తి = భక్తి యనెడి; లతా = లతలతో; తిరోహిత = లొంగదీసుకొన్న; హరి = విష్ణుమూర్తి యొక్క; శ్రీ = మంగళకరములైన; పాదున్ = పాదములు కలవానిని; నిఃఖేదున్ = దుఃఖములేనివానిని; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; బోధకళా = జ్ఞానవిద్యలతో; వినోదున్ = ఆనందించెడివానిని; కనియెన్ = సందర్శించెను; హర్షంబు = సంతోషము; తోన్ = తోటి; ముందటన్ = ఎదురుగా.
భావము:- ఇంతలో అక్కడకి ప్రహ్లాదుడు వచ్చాడు. అతడు విశాలమైన వక్షస్థలమూ, తాజా పద్మాలవంటి కన్నులూ కలవాడు; పచ్చని పట్టువస్త్రాన్నికట్టుకున్నవాడు; చక్కగా మాట్లాడడంలో నిపుణుడు; సంసారపు బంధాలను తెగత్రెంచుకున్న సుగుణసంపన్నుడు; భక్తితో భగవంతుని పాదాలను లోబరచుకున్నవాడు; దుఃఖాన్ని పారద్రోలి జ్ఞానవిద్యతో ఆనందించేవాడు; అటువంటి ప్రహ్లాదుణ్ణి బలిచక్రవర్తి సంతోషంగా దర్శించాడు.