పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14. నాగిని:- దీర్ఘచతురస్రాకారపు ఫలకముపై ఒక నాగినిమూర్తి నిక్షిప్తమైయున్నది. అనేక ఆభరణములు ధరించిన నాగినికి ఒక పొడవాటి హారము స్తనముల మధ్యనుంచి వ్రేలాడుచున్నది. ఆమె కత్తి, డాలు ధరించియున్నది. మూడు తలల నాగేంద్రుడు ఆమె శిఅరస్సున కాచ్ఛాదన కలిగించుచున్నారు. దీని వల్లనే ఈమూర్తి నాగినియని మనము గ్రహించవలయును.

15. భైరవుడు:- భైరవుడు దిగంబరుడు.[1] చతుర్‌భుజుడు. అందు ఖడ్గము - త్రిశూలము ----(పాశము?) కపాలము కలిగియున్నాడు. కపాలమాల, రెండు కోరలతో భయానకముగా ఉన్నాడు. ఇది క్రీ. శ. 12 శతాబ్దమునకు చెందినది.

16. మహిషమర్దని:- మహిషాసురుని కాలితో త్రొక్కిపెట్టినట్లు త్రిభంగ మందు మలచిన పవిత్ర మూర్తి అతి సుందరముగానున్నది మౌక్తికధారిణి. సన్నగా, తీర్చిదిద్ది నటుల కనిపించుచున్న ఈమూర్తికి, ఆభరణ సంపద కొంత ఎక్కువగా ఉన్నటుల కనిపించుచున్నది. ఈ శిల్పము బాగుగా నునుపుచేయబడి యున్నది. కాని కొన్ని పెచ్చులు లేచిపోయెను. ఈమెకు ఎనిమిది చేతులు. అందు కుడిచేతులందు బాణము, డాలు మూడవచేయి విరిగియున్నది. ఎడమ చేతులందు కత్తి, విల్లు, త్రిశూలము ధరించి, మిగిలిన రెండు చేతులందు మహిషుని పట్టుకొనియున్నది. మహిషము తల తెగిపోగా, రాక్షసుడు మానవాకారముతో బయటికి వచ్చుచూ అంజలి ఘటించుచున్నాడు. సుకుమారముగా కనుపించు అమ్మవారి తనూలత మీద, బరువైన కరండమకుటము ఆకర్షణీయముగా నుండక, అసహజముగా నున్నట్లు కనుపించును. వనమాల, మణిమయ మేఖలము, కంఠహారము, వివిధహారములు, కంకణములు, కేయూరములు,కుండలములు ధరించి దుర్గాదేవి నిండుగా కనిపించుచున్నది. చాళుక్య శిల్పము. క్రీ. శ. 12 శతాబ్దము (చిత్రము - 5)

17. చాముండ:- చాముండ సప్త మాతృకలలో ఒకటి. ఇది ఒకింత పెద్ద విగ్రహము. చతుర్‌భుజ. నాలుగు చేతులందు ఖడ్గము, త్రిశూలము, డమరుకము, కపాలము, ధరించియున్నది. పద్మాసనాసీనమైయున్న ఈమె ఎముకల గూడుగా నుండును. పొట్ట వెన్నుకతుక్కొని, పళ్ళికిలించి, వ్రేళ్ళాడు స్తనములతో నిడువైన చెవులు, పెద్ద చెవితొఱ్ఱలు, చింకిరిజుట్టు, కపాల ముఖపట్ట ధరించి భయము గొల్పుచున్నది. వెడల్పైన కంఠహారము, నాగ కేయూరములు, సర్ప కుండలములు, నాగ కుచబంధము ఆభరణములుగా కలిగి విలక్షణముగా ఉన్నది. క్రీ. శ. 10 శతాబ్దము.

  1. ఈ రూపమును చేయుటయందు ఉత్తర దక్షిణభారత దేశములకు వ్యత్యాసము కలదు. ఉత్తరభారతమునందు పాదరక్షులు (పాదుకలు) చూపుదురు. దాక్షిణాత్యశిల్పములందు అవి సామాన్యముగా ఉండవు.