పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హస్తమునందుండి మణికట్టుదగ్గర సర్పవలయములు కలవు. కుడివైపునుండి వర్తులాకారముగా త్రిశూలము, పాశము, డమరుకము, ఖడ్గము (పరశు), డాలు, చక్రము, సర్పము చేతులందు ధరించియున్నాడు. కేశములు జటామకుటముగా ముడిచి దుర్దర పుష్పాలంకృతమై యున్నవి. యజ్ఞోపవీతము, ఉరుసూత్రము కూడకలవు. చేతి వ్రేళ్ళకు ఉంగరములు, కాలి వ్రేళ్ళకు మట్టెలు ధరించియున్నాడు. చాళుక్య శైలిలో సర్వాభరణాలంకృతుడై యున్నాడు. ఇది ఉబ్బెత్తు విగ్రహము (Bass Relief). తెల్లబండరాయి యందు చెక్కబడినది. బహుశ: క్రీ. శ. 11 శతాబ్దమునకు చెంది యుండును. (చిత్రము - 3)

9. మహిష మర్దని:- అమ్మవారు నాలుగు చేతులు కలిగి ఎడమచేతులందు శంఖము, మహిషముయొక్క తోక, కుడిచేతులందు ఖడ్గము, చక్రము ధరించియున్నది. శిల్పచాతుర్యమంత పురాతనముగా కనుపించదు. దేవి కంకణ కేయూరములు, మేఖలము, వదులుగా యున్న మొలనూలు, అనేక హారములు, కుండలములు ధరించియున్నది. అమ్మవారి తలదగ్గరి ప్రభామండలము అండాకారముగా కలదు. ఈమె కరండ మకుటధారిణి. కాని ఈ మకుటము హ్రస్వముగా కనిపించుచున్నది. అమ్మవారు కాశె బిగించి వస్త్రము ధరించియున్నది. క్రీ. శ. 12 శతాబ్దము.

10. వీరకలు:- ఒక శిలాఫలకములో కల విగ్రహమిది. కాని ఫలకము ఎక్కువభాగము విరిగిపోయినందున ప్రస్తుతము బాగా అలంకరించిన ఏనుగు మాత్రము కలదు. దానిమీద యుండిన వీరుడు, మిగతా వివరణ విరిగిపోయినది.

11. యాళి విగ్రహము:- ఈ జంతువు అతిభయంకరముగా కనుపట్టుచున్నది. కళ్లు మిడిగుడ్లు; గాండ్రింపునోరు; చిన్నవైన చెవులు; నిక్క బొడిచి వంచినతోక; ఈ మృగము మీదికి దూకగలదన్న భ్రాంతిని కలిగించుచున్నది.

12. దంపతులు:- రాతిఫలకము మీద మలచిన ఉబ్బెత్తు విగ్రహము: ఒక దంపతుల జంట బాగా అలంకరించిన ఒక ఏనుగు మీద ఎక్కిపోవుట సూచించినది. గొడుగువంటి ఆచ్ఛాదన వారి శిరస్సునకు కలదు. మగవాని చేతియందు ఖడ్గము కలదు. ఇరువురి వదనములు రూపుచెడియున్నవి. అతని శిరస్సున శిఖ, ఆమెకు ధమ్మిల్లము కలవు. (చిత్రము - 4)

13. చామర గ్రాహిణి:- ఈ స్త్రీమూర్తి చాలా సొగసైన త్రిభంగిమ రీతిలో నిల్చొనియున్నది. ఈమె ముఖలక్షణములు, నిలుచున్న భంగిమ అజంతా చిత్తరువులందలి స్త్రీ మూర్తులను పోలియున్నది. క్రీ. శ. 10 - 11 శతాబ్దము.