పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18. మహిషాసురమర్దని:- దుర్గాదేవి మహిషాసురుని తల నరకగా, కారెనుము మొండెమునుంచి మానవాకారముతో రాక్షసుడు అంజలి ఘటించి వచ్చుచున్నాడు. విగ్రహము బాగాపాడైయున్నది. చాళుక్య శిల్పము: క్రీ. శ. 11 - 12 శతాబ్దము.

19. వీరకల్లు:- దీర్ఘచతురస్రాకారపు రాతిపలకమీద ఏనుగు నెక్కి పోవు వీరుని చెక్కియున్నారు. దీనికిరువైపుల రెండు స్తంభములు చెక్కబడియున్నవి. వాటి మీదనుంచి వచ్చియున్న తోరణము మధ్యలో శిల్పము నిక్షిప్తమై యున్నటు లున్నది. తోరణమువల్ల శిల్పమునకు ఒక వినూత్నశోభ కలిగియున్నది. ఏనుగు బాగా అలంకరింపబడియున్నది. వీరుని ముఖము, చేతులు రూపుచెడి యున్నవి. వీరుని చేతియందు ఖడ్గము కలదు. కేశములు శిఖగా నేర్పడియున్నవి. శిల్పము అడుగు పీఠముమీద క్రీ. శ. 13 లేక 14 శతాబ్దమునకు చెందిన శాసనము కలదు. అందులో "లెంక అన్నయ్య" అని మాత్రము చదువ వీలుగానున్నది. మిగిలిన అక్షరములు బాగా చెరిగి పోయియున్నవి. ఈ అన్నయ్య లెంక కాకతీయ ప్రతాపరుద్రుని సేనానులలో నొకడు. రాయగజ సాహిణి, మాదాయ రెడ్డికి తమ్ముడు గావచ్చును. ఇతడు ముసల్మానుదండు నెదుర్కొనుచు వీరమరణము నొందెను. క్రీ. శ. 14 శతాబ్దము.

20 సప్తమాతృకలు:- ఒకే భద్రపీఠముమీద సుఖాసీనులుగా మలచిన శిల్పమిది. పెద్దపరిమాణములో శిల్పలక్షణములతో నున్నదీ శిల్పము. ఇరుపార్శ్వములందు గణపతి వీరభద్రులు చెక్కబడి మధ్య సప్తమాతృకలు చెక్కబడియున్నది. అంధకాసురుడను రాక్షసుడు అవిక్ర పరాక్రమముతో, అజేయుడై ప్రపంచము నంతటి భయభ్రాంతులు గొల్పుచుండగా పరమశివుడు దేవతలందరి శక్తుల యొక్క అంశములతో సప్తమాతృకలను సృష్టించి, అతని పీడను ప్రపంచమునకు లేకుండ చేసినాడట. ఇందు బ్రాహ్మి, మహేశ్వరి,కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ; ఇవికాక యోగేశ్వరి కూడా కలదని ఒక వాదన కలదు. ఆమెతో కలిసి ఎనిమిదిమంది కాగలరు. కాని సప్తమాతృకలు ఏడుగురు మాత్రమే యుండవలయును, (సప్త = ఏడు). ఒక్క వరాహ పురాణము తప్ప మిగిలినవన్నీ ఏడుగురిని మాత్రమే తెలుపుచున్నవి.[1] సప్తమాతృకలు క్రింది విధముగా చూపబడినవి:

  1. వరాహ పురాణములో యోగేశ్వరి ఎనిమిదవ దేవి. ఈ పురాణమును బట్టి ఎనిమిది మాతృకలు, ఎనిమిది మానసికస్థితులను సూచించునని తెలుపుచున్నది. అందు యోగేశ్వరి కామము; మహేశ్వరి క్రోధము; వైష్ణవి లోభము, బ్రాహ్మి మదము; కౌమారి మోహము; ఇంద్రాణి మాత్సర్యము; యమి లేక చాముండ శూన్యము లేక అబద్దప్రచారము; వారాహి అసూయను సూచించును, ఇదిగాక అంధకాసురుడనగా అవిద్య, దీనిని శివునిచే అనగా ఆత్మవిద్యచే నిర్మూలించుట యని కూడా సూచనకలదు.