పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరభద్రుడు:- ఈఫలకమందు మొదట వీరభద్రుడుండును. ఇతనిని వీణాధరశివుడని పిలుచుట కూడా కలదు. ఇతను త్రిశూలము, రుద్రాక్షమాల ధరించి మరి రెండు చేతులతో వీణవాయించుచున్నాడు. దండకడియములు, మురుగులు, కర్ణాభరణములు, ముత్యాలహారములు, మేఖలము, ధరించియున్నాడు. కేశములు జటాజూటముగా నేర్పడియున్నవి.

ఎ. బ్రాహ్మి:- ఈ దేవి చతుర్‌భుజ. అందు కలశము, పండు, పాశము, అభయముద్ర కలవు. కంకణ కేయూరములు,మేఖలము ధరించియున్నది. కరండమకుట ధారిణి: దేవి పాదములవద్ద వాహనమైన హంస కలదు.
బి. మహేశ్వరి:- ఈమెకూడా చతుర్‌భుజ. త్రిశూలము, ఫలము, డమరుకము, అభయముద్ర కలిగియున్నది. పైన దేవికి చెప్పిన అన్ని ఆభరణములనూ ధరించి యున్నది. వాహనమైన నంది పీఠము మీద చెక్కియున్నది.
సి. కౌమారి:- ఈ దేవి చతుర్‌భుజ. అందుశక్తి, ఫలము, వజ్రము, అభయముద్ర కలిగియున్నది. ఈమె వాహనమైన నెమిలి పీఠము మీద చెక్కియున్నది. సర్వాభరణములను ధరించియున్నది.
డి. వైష్ణవి:- ఈమె చతుర్‌భుజ. అందు శంఖము, ఫలము, చక్రము, అభయముద్ర ధరించియున్నది. గరుత్మంతుడు అళితాసనాసీనుడై పీఠముమీద చూపబడెను.
ఇ. వారాహి:- చతుర్‌భుజ. అందు ఫలము, కలశము, అభయము కలిగి, నాలుగవ చేయియందలి రూపము బాగుగాలేదు. కరండమకుట ధారిణి, వరాహ (పంది) ముఖము కలది. మహిష వాహనము కలదు.
ఎఫ్. ఇంద్రాణి:- చతుర్‌భుజ. ఆమె అంకుశము, ఫలము, వజ్రము, అభయముద్ర చేతులందు కలిగియున్నది. ఐరావతము (ఏనుగు) వాహనము, పీఠముమీద చెక్కియున్నది.
జి. చాముండ:- ఈమె చతుర్‌భుజ. అందు త్రిశూలము, ఫలము, డమరుకము, అభయముద్ర ధరించియున్నది. కపాలములతో కూర్చిన ఉపవీతము (యజ్ఞోపవీతము) కలిగియున్నది. నక్క వాహనము పీఠము మీద చెక్కియున్నది.