పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గణేశుడు:- గణపతి చతుర్‌భుజుడు. అంకుశము, మోదకములు, దంతము, తావలము ధరించియున్నాడు. కరండమకుటధారి. సర్పఉదర బంధము, మిగిలిన ఆభరణములు ధరించియున్నాడు.

సప్తమాతృకలు, గణపతి, వీరభద్రుడు అందరూ ఒకే భద్రపీఠము మీద కూర్చొనియున్నారు. అందరకూ అర్థచంద్రాకారపు ప్రభామండలములు కలవు. అందరికి కంకణకేయూరములు, మేఖలము, ఉరుమాల, కారండమకుటము కలవు. కాశె బిగించిన వస్త్రధారణ కలిగియున్నారు. "త్రివళి" బాగా కనిపించుచున్నది.[1] ఇది చాళుక్య శిల్పము. క్రీ. శ. 11 - 12 శతాబ్దము.

21. భద్రకాళి:- (మహాకాళి) అర్ధచంద్రాకారపు ఫలకమందు చెక్కిన శిల్పము. చతుర్‌భుజ. పైచేతులందు డమరుకము, త్రిశూలము, క్రింది ఎడమచేయియందు అభయముద్రకలదు. నాలుగవచేయి విరిగిపోయినది. విగ్రహపు ఎడమ భాగమున నందివాహనము చెక్కియున్నది. కుడిభాగమందు వినాయకుడు కలడు. కాశెబిగించిన వస్త్రము, పట్టుదట్టీ, దాని పటకము ముందువ్రేళ్ళాడుచూ కలదు.

22. నాగశిల్పము:- నాగునకు నడుము క్రిందిభాగము సర్పరూపము పైభాగము మానవరూపము రెండు చేతులందు కత్తి, డాలు ధరించియున్నాడు. మణిమయ కిరీటము, అనేక హారములు కలిగియున్నాడు. ఇరు వైపుల ఒక నాగు నిలిచి పడగతో గౌరవముగా నీడనిచ్చుచున్నది. క్రీ. శ. 12 శతాబ్దము.

23. వీరకల్లు:- దీర్ఘ చతురస్రాకారపు రాతిఫలకములో మలచిన శిల్పమిది. ఇది రెండుభాగములుగా ఉన్నది. మొదటి భాగములో ఒక గుఱ్ఱపు రౌతు ఈటెను ధరించియున్నటులున్నది. రెండవభాగములో ప్రేయసీ ప్రియులు గుఱ్ఱము మీద స్వారీ అయి పోవుచున్నారు. గొడుగులాంటిది ఒకటి వారికి ఆచ్ఛాదన కలదు. గుఱ్ఱము బాగుగా అలంకరించియున్నది. మొదటి రౌతు పార్శ్వాకారము (Profile) నందు కలదు. క్రీ. శ. 12 శతాబ్దము.

24. పార్వతి:- ఇది ఒక ఊర్ద్వాంగ ప్రతిమ (Bust). అనగా నడుముకు క్రింది భాగము విరిగియున్నది. చేతులు కూడా విరిగిపోయినవి. దేవి కరండ మకుటధారిణి. సర్వాభరణములు ధరించియున్నది. క్రీ. శ. 12 శతాబ్దము.

25. ఫలకము:- రాతిఫలకము కొంతమేర విరిగిపోయినది. సోమేశ్వరస్వామి మధ్యను కలడు. స్వామివారికి మూడు తలలు. నాలుగుచేతులు. అందు

  1. పశ్చిమ చాళుక్య సాంప్రదాయములో అన్ని జైనమూర్తులందు త్రివళి కనిపించును. ఇది క్రీ. శ. 11 - 13 శతాబ్దము వరకూ తరచు యుండెడిది. త్రివాళి యనగా, బొడ్డు పైభాగమున ఉండు మూడు ముడుతలను రేఖామాత్రముగా చూపుట.