పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అభయముద్ర, సర్పము, కమండలము (?) త్రిశూలము కలవు. సోమేశ్వరుని కుడి పార్శ్వమందు విష్ణుమూర్తికలడు. ఆయన మొదటి రెండు చేతుల అంజలి మోడ్చియున్నారు. పైరెండు చేతులందు శంఖము, చక్రము, ధరించియున్నాడు. మణిమయ కిరీట ధారి. ఇది పార్శ్వాకారమునకలదు (In Profile). విష్ణుమూర్తి వాహనము గరుడుడు. అళిదాసనమందు పీఠముమీద చెక్కబడియున్నాడు. ఇదిబాగా పురాతనమైనదిగా కనిపించుచున్నది. క్రీ. శ. 8 శతాబ్దమునకు చెందియుండవచ్చును.

26. ఫలకము:- ఈ ఫలకమందు చెక్కిన శిల్పమును నిర్ణయించుట కొంచెము కష్టము. ఇతను దండమును ధరించినను, దాని చివర పానవట్టపు ఆకారము కలదు. మిగిలినచేతులందు కలశము, పాశము, అభయముద్ర కలదు. గడ్డము, జటామకుటము కలవు. కీర్తిముఖపతకము కలిగినమేఖలము ధరించి యున్నాడు. ముత్యాలహారములు, కంకణములు, మొదలుగాగల ఆభరణములను ధరించియున్నాడు. బహుశ: ఈ ప్రతిమను బ్రహ్మగా గుర్తించవచ్చును. క్రీ. శ. 13 శతాబ్దము.

27. కోష్ఠపంజరము:- ఇది మూడు అంతస్థుల శిఖరముకలది. మొదటి అంతస్థునందు ఉమామహేశ్వర విగ్రహము చెక్కబడియున్నది. ఉమామహేశ్వరుడు చతుర్‌భుజుడు. అందమైన రూపుకలవాడు. రజోగుణమూర్తి. ఇతను భద్రపీఠము మీద ఆసీనుడై ఎడమకాలు మడిచిపీఠముమీద పెట్టి కుడికాలు క్రిందకు వ్రేళ్లాడు చుండునట్లుండును. జటామకుటధారి. కంకణ కేయూరములు, యజ్ఞోపవీతము కలిగి యుండును. శివుని వామపార్శ్వమున పార్వతీదేవి (ఉమ) యుండును. ఈమె కరండమకుట ధారిణి. ఎడమచేతియందు ఉత్పలమును ధరించి యుండును. (శివుడు నాలుగు చేతులందు అభయ, సింహకర్ణము,మృగము, పరశువు, గలిగి యుండును) ఇది క్రీ. శ. 11 - 12 శతాబ్దము నాటిది. చిత్రము - 6)

28. సూర్యుడు:- ఇది మొండి విగ్రహము (తలవిరిగి పోయినది). సమపదస్థానక మందు కలదు. రెండుచేతులందు సగము వికసించిన పద్మములను భుజముల వరకూ వచ్చువిధముగా ధరించియున్నాడు. ధోవతి, దానికి కటి బంధముకలవు. ఉదరబంధము కలదు. దాక్షిణాత్య సాంప్రదాయము ప్రకారము కాళ్ళకు మొనతేలిన పాదరక్షలు (Boots) లేవు.[1] క్రీ. శ. 12 - 13. శతాబ్దము.

29. నాగిని:- సగము మానవరూపము, సగము సర్పరూపము కలదు. కత్తి, డాలు ధరించియున్నది. ఒకేసరముగల హారముధరించి, కంకణ కేయూరములు

  1. దాక్షిణాత్య శిల్పములందు తప్ప మిగతా భారత దేశమందలి సూర్యుని శిల్పములన్నీ మొనదేలిన పాదరక్షలను ధరించియుండును. పద్మములు గూడా చాలా మటుకు బాగా వికసించినవిగా చేతులందు ధరించినటులుండును.