పుట:హరవిలాసము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70 హరవిలాసము



తే. వీటఁ దమ కెవ్వ రెదురని వెఱపు లేక, చెల్లుబడిఁ బ్రల్లదంబులు సేయఁదొడఁగి
రభవులెంకలు జమునిమారంకకార్లు, వేశవాటికుటీమధ్యవీథులందు. 8

క. కుంభోద్భవుపాళెమున ని, కుంభుదివాణమున భృంగి కులపతి గాఁగాఁ
గుంభోద్భవువగఁ దిరిగిరి, శంభునికింకరులు గర్వసంరంభమునన్. 9

సీ. పులికళాసంబు గప్పుదురు పాఱఁగ మీఁద విద్యాధరాంగనావిటగణంబు
గంధర్వకామినీకాముకవ్రాతంబు లాతాలఁ గొని మోఁది లజ్జగొండ్రు
కకపాలవెలిబూదిఁ గన్నులలోఁ బ్రామి బాధింతు రప్పరఃపల్లవకుల
గరుడభామాభుజంగప్రతానముఁ బట్టి బాధింతు రురుయోగపట్టకముల
తే. నాగడీలు మహాధూర్తు లగడుఁగాకు, లుధ్ధతులు గొంట్లు పలుగాకు లుదురుమిడుకు
లాకతాయలు శకులు గయ్యాళు లగుచు, నోషధిప్రస్థ మిల్లిల్లు నుడుకుచుండ. 10

వ. మఱియు నానాప్రకారంబులం బ్రమభ్రజటాధారులు యథేచ్ఛాచారులై యోషధిప్రస్థపురంబునం క్షుద్రోపద్రవంబులు సేయుచుండ హిమవంతుం డంతయు నెఱింగి మేనకాదేవియుం దాను మంతనం బుండి యీశ్వరునితోడిపొ త్తింతియ చాలునని యాప్రొద్దు కూఁతు రావించి యి ట్లనియె. ll

క. కమలాక్షీ యసంఖ్యాత, ప్రమథగణంబులును భూతపరిషత్తుఁ బిశా
చములున్ మొదలగు ధూర్తుల, సమూహమును నీమగండు సంభావించున్. 12

క. భూతప్రేతపిశాచ, వ్రాతంబులు తోడుగాఁగఁ బ్రమథులు పగలున్
రాతిరియును నష్టాదశ, జాతిప్రజలకును దుర్దశలు సంధింతుర్. 13

ఉ. వేమఱు రాత్రియుంబగలు వీథులఁ గల్పలతాప్రసూనమా
ధ్వీమదమత్తచిత్తు లయి వేలుపులేమలఁ బట్టుకొంద్రు నీ
స్వామికి నిష్టభృత్యు లగుజంగమ ముండ కపాలపాణి కా
ళాముఖవీరపాశుపతలాంఛనధారులు ధూర్తవర్తనుల్. 14

క. ఈవీట నసంఖ్యావలి, ద్యావాపృథివీమహామహత్తులకుం ద
ర్పావేశంబున ధౌర్త్యము, గావింపఁగ మాన్పఁదగదె కఱకంఠునకున్. 15

సీ. తలమీఁదిచదలేటిదరిమీలఁ దినఁ జేరు కొంగలు చెలఁగి కొంగొంగు రనఁగ
మెడదన్నుపునుకలనిడుపేరు లొండొంటిఁ బొరిఁబొరిఁదాఁకి బొణ్బొణుగు రనఁగఁ
గట్టినపులితోలుకడకొంగు సోఁకి యాఁబోతుతత్తడి చిఱ్ఱుబుఱ్ఱు మనఁగఁ
గడియంపుఁబాములు కకపాలలో నున్న భూతి మైఁ జిలికిన బుస్సు రనఁగ
తే. దమ్మిపూఁజూలిపునుకకంచమ్ము సాఁచి, దిట్టతనమున బిచ్చము దేహి యనుచు
వాడవాడల భిక్షించుకూడుగాని, యిట్టిదివ్యాన్నములు మెచ్చునే శివుండు. 16

తే. అఖిలలోకేశ్వరుఁడు మామయాత్మలోని, విసువుఁ జారజనంబులవేసటయును