పుట:హరవిలాసము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



పంచమాశ్వాసము

శ్రీమత్కుమారశైల
స్వామికృపాలధనిత్యశాశ్వతవిభవా!
హేమాచలధీర! ధరి
త్రీమండనచరిత! యవచిదేవయతిప్పా! 1

వ. ఆకర్ణింపుము. 2

ఉ. గౌరివివాహమై కుసుముకార్ముకుఁ గ్రమ్మఱిలంగఁ జేసి బృం
దారకవర్గము న్నిజపదంబున కన్పి హిమాచలంబుపైఁ
బారిషదవ్రజంబు దను భక్తి భజింపఁగ నాదరించె సం
సారసుఖంబు శంకరుఁడు సంభృతనవ్యకుటుంబభారుఁ డై. 3

తే. ప్రమథగణములతో మాతృసమితితోడ, నందికేశ్వరుతోడ నానందలీల
నార్యపైఁ బేర్మి యెట్టిదో యద్రియింట, నిల్లటంబుండెఁ ద్రిభువనాధీశ్వరుండు. 4

సీ. జమిలిపాములతోడిసాకతం బొల్లక సవరించు బంగారుజన్నిదములు
పచ్చయేనికతోలుపచ్చడంబుఁ దృజించి గడితంపుఁబట్టుఁబచ్చడముఁ గట్టు
భస్మాంగరాగంబు పనికట్టువడఁజేసి కస్తూరితోడ శ్రీగంధ మలఁదు
నస్థిమాల్యములపై ననురక్తి వర్జించి రమణీయతారహారములు దాల్చు
తే. జడలు బాగడ జొళ్ళెంబు సంతరించి, లేఁతరిక్కలరాయుఁ గీలించు నందు
మంచుగుబ్బలియింట సమ్మదము మీఱ, మనువుఁ గుడువంగ నున్నప్డు మదనవైరి. 5

తే. ఓషధిప్రస్థపురమున నుబ్బియుబ్బి, హేమపుంజప్పరంబుల నెక్కియాడు
గణము లిరువంకఁ గొలిచిరాఁ గాలగళుఁడు, వృషభపుంగవువాహ్యాళి వెడలునపుడు. 6

ఉ. ఆరభటీకఠోరతరహాసు లుదంచితచంద్రహాసు లం
గారనిభారుణాక్షులు ప్రకారవిశాలమనోజ్ఞపక్షు లా
కారధురంధరుల్ ప్రకటకంబుమనోహరకంధరుల్ జటా
ధారులు మేరుధీరులు సదాశివుసన్నిధి పారిపార్శ్వకుల్.