Jump to content

పంచతంత్రము (బైచరాజు)/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

పంచతంత్రము

ద్వితీయాశ్వాసము


గౌరీవక్షస్తను
భాగాభిజ్ఞాననిశ్చపలచపలాసం
భాగభ్రరవ్యపత్యస
మాగమసురసింధురూపహరిహరనాథా.

1


వ.

దేవా సుహృల్లాభాభిధాన ద్వితీయతంత్ర మాకర్ణింపు మధీతనీతిశాస్ర్రమర్ముం
డవ్విష్ణుశర్ముండు సుదర్శనకుమారుల కిట్లనియె.

2


క.

సాధించెఁ గార్యముల ధన, సాధనములు లేక సారసౌహార్దసమా
రాధనమున ము న్నూర్జిత, మేధాకృతిఁ గాక కూర్మమృగమూషకముల్.

3


క.

నా విని రాజకుమారకు, లావిప్రునిఁ జూచి పలికి రదియెట్లు నయ
శ్రీవిభవ తెలుపు మన వి, ద్యావారిధి వారి కద్ధరామరుఁ డనియెన్.

4


క.

శతమఖవనసఖవిటప, స్థితిమహిళారోప్యనగరిచేరువఁ గల ద
ప్రతిమం బొకబూరుగు లఘు, పతనకుఁ డను కాకి దానిపై వర్తించున్.

5


సీ.

వసుధ నెవ్వనిసదన్వయకర్త జేజేలఱేనికిఁ గుల ముద్ధరించుకొడుకు
పితృకార్యములు సమర్పింతు రెవ్వానికి నాదిత్యరుద్రవస్వగ్రభుక్తి
బొదలు నెవ్వనిగృహంబున మనోహరభారతీభారవహముఖద్విజకులంబు
పథికసంతతి కేరుపఱుచు నెవ్వనికంఠమిశ్రితారావంబు మేలుగీళ్లు


తే.

ప్రజ్ఞ పెంపున నెవ్వానిబలమునకును, బ్రహ్మకొడుకైన లెక్కఁ జెప్పంగచాల
డతఁడు నగరోపకంఠచైత్రాగ్రవర్తి, పక్షిమాత్రుండె వాయసపరివృఢుండు.

6


క.

ఆకాకి నాకపథమున; నేకాకిత మేఁతలాడ నీరము గములం
గీకామండల మగుసర, యూకాననమునకుఁ బోవనున్నెఁడ నటకున్.

7


చ.

వెడవెడఁ జంకఁ జిక్కమున వ్రేలెడుచల్దియు సందిలోహపుం
గడియము క్రూరదృష్టిగలకన్నులు నల్లనిమేను మూఁపునం

బడిశము జుంజుఱుందల తపారము జేగురుబొట్టు మేఖలం
గొడవలి గల్గి వచ్చె నొకక్రూరకిరాతుఁ డమంధరత్వరన్.

8


క.

వచ్చిన వాయసపతి దన, యిచ్చ న్వెఱబొమ్మవంటియితఁ డెందులకై
యిచ్చటి కేతెంచెనొకో, యచ్చెరు వనుచుండ నద్దురాత్మం డచటన్.

9


క.

పులుగుడిసెఁ బన్ని వల శా, డ్వలధరణిం బాఁదుపఱిచి వ్రస్సినకన్ను
ల్గలపులుఁగుదీమ మిడి య, గ్గలపుఁదమి న్గాచియుండఁగా దైవగతిన్.

10


శా.

చిత్రగ్రీవుఁ డనంగ నొక్కవిహగశ్రేష్టుండు సత్కృత్యకృ
త్పత్రివ్రాతము వెంట గుంపుగొనిరాఁ బైఁబోవుచున్ శాడ్వల
క్షేత్రస్థేమము దీమము న్గని నభఃక్రీడాపరిత్యాగియై
ధాత్రి న్వ్రాలె ననాయమధ్యమునఁ బత్రధ్వానము ల్భోరనన్.

11


క.

పులుఁగులఁ బినుఁగు కిరాతుఁడు, వలఁ దవులఁగఁ దిగిచి తగ్గి వగ్గెరపగ్గం
బలఘుతరకీలమున సం, వలనముఁ గావింపుచుండె వలసినభంగిన్.

12


వ.

అంతఁ బతత్రిసుత్రాముం డనుజీవులఁ గేవలయత్నంబునం బిలిచి దుష్కర్మానుకూ
లంబున నిందఱ మిజ్జాలంబునం జిక్కితి మీయపాయంబున కొండొకయుపా
యం బూహించితి యౌగపద్యాభిమానంబున నిందఱ మిజ్జాలంబుం బతత్రజాలం
బునం బెట్టుకొని దూరం బరుగుద మప్పటికి నొకగతి లేకపోయెడునోటు నిర్విలం
బంబున లెం డని చెప్పిన నొప్పుకొని యప్పులుఁగు లొక్కయూఁకున దెప్పరం
బుగా నుప్పరంబున కెగసిన నున్మూలితేకీలంబై జాలంబు వెంటరాఁగొని యాయుర్బ
లంబున గగనమార్గంబునం బఱచుచుండె.

13


క.

ఆవిధి విధిమూఁడక వడిఁ, బోవఁగ నిది యననుభూతపూర్వం బనుచున్
ధావనమున వనమునఁ బడుఁ, బో విహగము లనుచు బోయ వోయె న్బిఱుఁదన్.

14


ఉ.

ఎప్పుడు నేల వ్రాలు శ్రమ మేర్పడ ఱెక్కలు నొచ్చి పెచ్చుగా
నప్పుడ చిక్కు నిప్పులుగు లన్నియు నా కని నిశ్చయించి వాఁ
డెప్పటిభంగి వెన్దగిలి యేఁగుచునుండ విహంగమంబు లా
చొప్పున జాల మెత్తుకొని చూడఁగఁజూడ నదృశ్యమౌటయున్.

15


క.

అతిలాఘవమున నల లఘు, పతనకుఁడు న్దత్కపోతపతివెంబడి న
భ్రతలంబునఁ బఱచెం బ, క్షతిఝంకృతు లఖిలదిశలఁ గ్రందుకొనంగన్.

16


క.

జాలగ్రాహివిహంగమ, జాలముఁ బరికింపలేక జాఱనిజాలిం
దూలుచుఁ గ్రూరకిరాతుఁడు, వ్రీలినచరణములతో నివృత్తుండయ్యెన్.

17


క.

ఆవడువున నలచిత్ర, గ్రీవుఁడు దూరంబు నరిగి భృత్యుల నటుసం

భావించి పలికె నోహో, ధావన మఱి యిచట వ్రాలుదమె యిందఱమున్.

18


చ.

సకలపధీనమానసుఁడు శాంతిసమగ్రుఁ డజాతశత్రుఁ డం
తకనిభసత్యుఁ డిష్టజనతాఘనతాపవిఘాతి సర్వమూ
షకములసార్వభౌముఁడు రసజ్ఞుఁడు ప్రాణముప్రాణ మాహిర
ణ్యకుఁ డిట నుండు నాయనదయామతి [1]నివ్వలవంతఁ బాడుదున్.

19


చ.

నిలువుఁడు నావిహంగములు నిల్చె బిలస్థలభూమి నంత న
క్కలకల మాలకించి పొడకట్టి యనాయగుణావృతాంగుఁ గే
వలసఖు జీవితప్రతిము వారితమత్సరు వీతరాగు ని
ర్మలుఁ బతగాగ్రణిం గని హిరణ్యకుఁ డశ్రువిమిశ్రితాక్షుఁడై.

20


చ.

పలికె సఖా యఖండనయపారగతుండవు దీర్ఘదర్శి వే
వలన విపత్తిఁ జేట్పడనివాఁడవు నిత్యసుఖానుయాయి వి
య్యలమట నీకు నె ట్లొదవెనయ్య విధాతకుఁ బాఁడిలేదుగా
నలయుఁ గదయ్య కర్మ మెటువంటిది చూడఁగదయ్య యక్కటా.

21


క.

అని వగచుహిరణ్యకుఁ గనుఁ, గొని చిత్రగ్రీవుఁ డనియె గూర్మిసఖా నా
యనుజీవు లలసి రేను, న్వనటం బెగ్గిలితి నఱుకు వలఁ గేవలమున్.

22


క.

ఏవాసరమున నెద్దెస, నేవయసున నెట్టికర్మ మేమఱఁ డెవ్వాఁ
డావాసరమున నద్దెస, నావయసున నట్టికర్మ మతఁడు భుజించున్.

23


క.

కలకాలము లే దలమట, కలకాలము లేదు సుఖము కాయము మోసం
గలిగిననటు గొన్నా ళ్ళీ, యిల నిటు గొన్నాళ్లు దీని కేలా వగవన్.

24


క.

దైవికము లైనపనులకు, వావిడువఁ డవార్యధైర్యవంతుఁడు నయరే
ఖావిభవ యెప్పు డటువలెఁ, గావలె నటు కాకపోదుగా యని తెలివిన్.

25


వ.

అనుచిత్రగ్రీవునకు హిరణ్యకుం డిట్లనియె.

26


క.

వేసట నొందక లఘువి, న్యాసంబున నూఱుయోజనము లరిగి సుఖ
గ్రాసమునఁ బొదలివత్తు వ, యో సఖ నీకెట్లు మోస మొదవెం జెపుమా.

27


క.

అక్కట యాపల్లతలం, జిక్కక నయసరణిఁ ద్రొక్కు చిత్రగ్రీవుం
డెక్కడ యీనిర్బంధన, మెక్కడఁ గాలముఁ దరింప నెవ్వరు నలఁతుల్.

28


క.

ఆపత్సంపద లలఁతులఁ, బ్రాపింపవు ఘనులగాని ప్రజ్ఞంబొడవై
చూపట్టుచంద్రుఁ [2]డారెం, డోపతగాధ్యక్ష కలవె యుడుసంహతికిన్.

29

చ.

ఉరి విహగవ్రజంబునకు [3]నోదము దంతికి ముందు చిల్వకుం
బరుషతమోగ్రహగ్రహణబాధ సుధాంశున కంశుమాలికిం
బరమదరిద్రతాప్తి మతిమంతులకుం గలగంగఁజేసె నె
వ్వరు సవ తిందు నందు బలవంతుఁడు పో విధి నాకుఁ జూడఁగాన్.

30


చ.

గగనమునం జరించుపతగంబు లగాధసముద్రవారిలోఁ
దగ విహరించుమీలు వలతండములం బడి చచ్చు నవ్విధిన్
దెగి చన స్థానశక్తి గలదే వల దేర్పడఁ జింత దీనికై
తెగు నెడ కెంతదవ్వయినఁ దెచ్చుగదా విధి దేహధారులన్.

31


క.

అని [4]యాఖులేఖపతి నె, మ్మనమున నస్తోకశోకమగ్నుండై వ
చ్చిన యచ్చెలికానిఁ దగు, ల్కొనినయనాయాంశ మెచ్చి కొఱుకుచునుండెన్.

32


వ.

అప్పు డవార్యధుర్యతుహినగ్రావుండగు చిత్రగ్రీవుండు సుహృల్లోకశరణ్యుండగు
హిరణ్యకున కిట్లనియె.

33


క.

పరహితచరితా యస్మ, త్పరివృతబంధములఁబోలెఁ బరిచరబంధో
త్కర మేల నఱుక విప్పుడు, పరివారములేనిభూమిపతి పూజ్యుండే.

34


క.

సిరి గూడదు కూడినఁ బదు, గురుగలవాఁ డడఁచి పుచ్చుకొనుఁ బరవీరుల్
సరకుగొనరు సిరి దక్కదు, పరివారము లేనిరాజు బ్రతుకునె పొడవై.

35


వ.

అరునప్పలుకుల కలరి హిరణ్యకుండు.

36


క.

హితభృత్యులతో నేభూ, పతి కలఘుస్నేహసంవిభాగము లమరున్
బ్రతివాసర మతఁడు బలో, ద్ధతుఁడై పాలించుఁ జువ్వె త్రైలోక్యంబున్.

37


క.

పరివారముపట్టున నా, దరలేశము లేని భూమిధవుఁ డభివృద్ధిం
బొరయఁడు సంతతి కెడసిన, పురుషునివంశంబు నష్టిఁ బొందినభంగిన్.

38


చ.

అదననుజీవితం బిడమి యారజమాడుట లేనినేరము
ల్వెదకుట నిచ్చ న్పరిభవించుట కింకరసంకులంబు నె
మ్మదికి నసహ్య మౌట దయ మానుట [5]పిమ్మటనాడికో ల్మహీ
పదవికిఁ బాసి యొంటిపడు బాటులఁ బొందు నృపాలుచిహ్నముల్.

39


ఆ.

సైన్యధాన్యబంధుసమ్మర్ధముల నెవ్వఁ, డోర్సు గలిగి పుడమి నుల్లసిల్లు
నతఁడు సూవె నీడజాధీశ వసుమతీ, హిమమయూఖవదన కింటిమగఁడు.

40


క.

అని బలికి జాలగుణము, ల్దునియలుగాఁ జేసి ఖగపతుల వెడలించెన్

జనితాదృతి మూషకపతి, ఘను లాప్తులసేగి కోర్వఁగాలేరుగదా.

41


శా.

చిత్రగ్రీవునిఁ గౌఁగిలించుకొని తత్సేనం దురంతాదృతి
ఛ్ఛత్రచ్ఛాయఁ బ్రహృష్టుఁ జేసి యభివృద్ధి న్విందుఁ గావించి యో
పత్రిగ్రామణి పోయిరమ్మనిన బాష్పచ్ఛన్నవక్త్రంబుతో
నత్త్రాతం దనుఁదాన వీడుకొనిపోయెం బక్షి యాలోపన్.

42


క.

జాలము నఱికి విహంగమ, జాలము బ్రతికించి కొలముసాముల హేలా
లీలం గలపుటఁ గనుఁగొని, యాలఘుపతనకుఁడు మూషకాగ్రణి కనియెన్.

43


సీ.

పదధరాధిపభేదకరము నీకరము నీవివరంబు బహుమార్గవిశ్రుతంబు
రాజశేఖరకుమారికమనోహరము నీచర్య నీసన్మానసం బుదాత్త
మవిరళసుగతిహేతువు నీవినీతత్త్వ మలర నీగుణము ధర్మానుకూల
మతివృద్ధిమహిమఁ జెన్నారు నీయాకార మిష్టకార్యముల నీయీగి వెరుగు


తే.

నీకరుణ లక్ష్మి వాటిల్లు నీరసజ్ఞ, సత్యభారతి నిలుచు నీసన్నిధాన
మభిమతార్థంబు లొసఁగు ని న్నభినుతింప, శక్యమే నాకు మూషకక్ష్మాకళత్ర.

44


క.

ప్రతిలేనికరుణ నీడజ, పతిమృతికిం బాపి సుగతిఁ బడసితి నీసం
గతి గాదే యీయాప, ల్లత లంటిన మమ్ముబోటులకుఁ గృతకృత్యా.

45


క.

భవదీయస్నేహము నా, కవిరళతేజోవిధాయి యగు నెయ్యుఁడవై
ఠవఠవలేక మనీషి, ప్రవరా వర్తింపు మన హిరణ్యకుఁ డనియెన్.

46


క.

కయ్యమునకు నెయ్యమునకు, వియ్యమునకు సమత వలయు వేఱొకఁడైనన్
గయ్యము గెలువదు నిలువదు, నెయ్యము వియ్యంబు పొసఁగనేరదు మొదలన్.

47


క.

బలహీనుఁడ నేను మహా, బలుఁడవు నీ వధముఁ డెట్లు బలవంతునితోఁ
జెలిమి యొనరించు జెపుమా, తల ద్రివ్వక మ్రింగఁజూచెదవు వెలువడినన్.

48


క.

అమరదు నీపొత్తు వృథా, శ్రమఁ బెట్టకు భోక్త నీవు భక్ష్యమ నే నం
చు మొగంబోడక పలికినఁ, దమకింపక మఱియు లఘుపతనకుఁ డనియెన్.

49


క.

బలవంతము కాకము నే, బలహీనుఁడ ననుచు విడిచి పలుకకు ప్రజ్ఞా
బలమున నధికుఁడ వదివో, బలము శరీరస్థమైనబలము న్బలమే.

50


క.

తల ద్రివ్వక మింగెద వని, పలికెద వే నట్టిదుస్స్వభావుఁడనే నీ
కలిమిపరాపత్తిదవ, జ్వలనఘనాఘనము గాదె సాధుచరిత్రా.

51


క.

నీవంటియుత్తముఁడు సుఖ, జీవితుఁడై యున్న నేను జిరజీవిఁ జుమీ
నీ విందుఁ గలుగఁ జిత్ర, గ్రీవుఁడు విపదంబునిధిఁ దరించెనొ లేదో.

52


చ.

పరుషవిశృంఖలాలపనపంక్తుల సాధుమనంబు లీక్రియం
బొరయఁగఁజేయ నెవ్వరికిఁ బోల దహో ఖచరాపగాపయో

ధరపరిరంభసంభ్రమణతత్పరతుంగతరంగహస్తదు
స్తరశరధిం దృణాగ్రశిఖితప్తముగా నొనరింప వేర్చునే.

53


క.

అనులఘుపతనకుపలుకులు, విని మూషకరాజు పలికె వెఱ్ఱీ నీతో
ననుబోటి యలఁతినెయ్యం, బొనరించినఁ దగునె లేరొకో బలవంతుల్.

54


క.

తనగుణముఁ బూనియున్నాఁ, డని పగతుని నమ్మబోల దనిశము మదిలో
ననలశిఖాతప్తోదక, మనలునిపైఁ జింది చల్లనార్చునొ లేదో.

55


క.

పోలినది పోలు నెచ్చోఁ, బోలనియది పోల దంబుపూరంబునఁ బోఁ
జాలునె శకటము లీల, న్నేలం బోతములు నేర్చునే యేఁగంగన్.

56


క.

మోసం బూరక తలఁచుం, జేసినమే ల్మఱచు విశ్వసించినఁ జెఱుచున్
నాసత్యము దుష్పురుషుం, డోసుగుణా వినుము చూడ ముత్తము నొకనిన్.

57


వ.

సుజనశబ్దంబు పురాణోక్తంబుగా విచారించెద నిష్టుం డయ్యును బహుసుకృతోపలా
లితుం డయ్యును దుర్జనుం డంకగతక్రూరోరగంబుచందంబున భయంబు సంపాదించు
చుండునని వెండియు.

58


క.

పరపురుషచింత యంతః, కరణంబునఁ గలిగి మగనిఁ గరఁగించుతలో
దరికరణి హృదయకలుషము, మఱుఁగిడి ఖలుఁ డాడు మధురమధురతరోక్తుల్.

59


క.

నేరము లొనరించిన నుప, కారము సేయుదుము నొవ్వఁగాఁ బల్కినఁ గై
వారము మఱవము మే మను, వారలకున్ ఖలు లకాండవైరులు గారే.

60


ఉ.

కావున నిన్నువంటి బలగర్వసమగ్రులతోడిమైత్రి దుః
ఖావహ మేఁగుచున్నఁ గరటాగ్రణి వహ్నిశిఖానురూపకో
పావిలచిత్తుఁడై పలికె నద్దిర మాటలజోలిఁ బన్న నేలా
విను లక్ష్మయైన వదల న్నిను మూషకలోకవల్లభా.

61


క.

చెలిమికి దూరస్థుఁడవై, తొలఁగి చన న్మదిఁ దలంచెదో యది నాతో
గొలుపదు త్రవ్వెద ధరణీ, తలవివరముఁ ద్రవ్వినల్లఁ ద్రావెద పిదపన్.

62


క.

అనలమునఁ గాఁచి లోహము, నెనయించినకరణి వేఁడినేనియుఁ బ్రజ్ఞా
ధనులఁ దనుఁ గూర్చికొమ్మను, మనువచనము వినవె యదియ మత మెవ్వరికిన్.

63


క.

ఖలుఁడు సుఖభేద్యుఁ డతిమృ, త్కలశగతి న్సజ్జనుండు గాఢాగ్నిశిఖా
కులతప్తకనకఘటముం, బలె దుర్భేద్యుండు చక్కఁబడఁడు మృదూక్తిన్.

64


తే.

అట్లు గావున నినువంటి యనఘచరితు, వెఱపుపనినైన సఖునిఁ గావించుకొనఁగ
వలయు మేల్గోరునావంటివాని కనిన, సమ్మదం బంది మూషకస్వామి పలికె.

65

క.

అరివలె నుండుట క్రియలం, బరమాప్తస్ఫూర్తిఁ దేటపఱుచుట యదివో
యరయ సుహృల్లక్షణమో, కరటా నీయందుఁ దోఁచెఁ గద యీసరణుల్.

66


క.

మతిశంక లేక మూషక, పతి వివరము వెడలి కరటకపరివృఢుతో న
ప్రతిమగుణరత్నఖనితో, గతకల్మషుతోడఁ జెలిమికాఁడై యుండెన్.

67


వ.

అట్లు కృతసఖ్యుండగు నయ్యుందురుముఖ్యుండు విందుఁ బెట్టి వీడ్కొలిపిన దరి
ద్రునకు నిధానంబునుంబోలె సుహృల్లాభంబుఁ గనుట కలరుచు సింహవ్యాఘ్ర
గజగవయగండభేరుండప్రముఖజంతువహనంబులగు గహనంబుల విశ్రమించి
సారంబులగు సస్యాహారంబులఁ దెచ్చి యిచ్చుచు నచ్చిక బుచ్చిక లడరఁ గొంతకాలం
బుఁ గడపి యొక్కనాఁ డావాయసపరివృఢుండు హిరణ్యకు డాయంబోయి
యిట్లనియె.

68


ఉ.

పోయెద నిప్పు డన్యవనభూమికిఁ బ్రాణసఖా ప్రమోదసం
ఛాయక నన్నుఁ బంపు మనిన న్విని ధైర్యము వ్రస్సి వెల్వెలం
బోయినమోముతోడ బలిధుక్ప్రవరుఁ బురుషార్థసంగ్రహో
పాయు సుహృద్విధేయుఁ గని పల్కె హిరణ్యకుఁ డార్తచిత్తుఁడై.

69


చ.

ఇట నను డించి యేమికత మేఁగెదు చెప్పఁగదన్న యెట్టు లె
క్కటిని జరింతు నన్న తృటికాలము ని న్నెడఁబాసియున్కి దు
ర్ఘటము గదన్న నాకడను గల్గినయీధృతి యెందుఁ బోయె ని
ప్పటికి విచిత్ర మన్న విధి భద్రవిరోధి గదన్న యెన్నఁగాన్.

70


చ.

అని కనుదోయి చెమ్మగిల నాకృతి విస్మృతి నొంద మూర్ఛవో
యినబలిభుగ్విభుండు చలియించి గరుద్యద్యజనానిలంబునన్
దనువిడిఁదేర్చి యోపరమధార్మిక ని న్నెడఁబాసిపోవ నే
ర్తునె సకలార్థసిద్ధఫలదుండని చూతుఁ గదయ్య ని న్నిటన్.

71


ఉ.

నాపయనంబు విన్ము కరుణావరుణాలయ వృత్రశాత్రవా
సాపురకాననోర్వి నొకసారసరోవర మొప్పు నందు వి
ద్యాపరమేష్ఠి మంధరకుఁ డన్కమఠాగ్రణి మత్సఖుండు సౌ
ఖ్యాపవహుఁ డుండు నప్పరహితార్ధిఁ గనుంగొని సాదరంబునన్.

72


ఉ.

అతఁడు నాకుఁ బ్రీతివశుఁడై యొనరించు ననూనమీనమాం
సాతిభుజక్రియ న్బలసమగ్రుఁడనై చనుదెంతుఁ గ్రమ్మఱన్
నీతిధురీణ న న్పనుపు నీ వనఁ గన్నుల శోకబాష్పధా
రాతతు లుప్పతిల్లఁగ హిరణ్యకుఁ డాతనిఁ జూచి యిట్లనున్.

73

చ.

ఉడుగనివంత నింతతడ వూఱట లేక పరాకువోలె మే
నడిచిపడంగ నున్కి గహనాంతరచింత జనించె నంఘ్రు ల
వ్వఁడకున నూదసైపవు కృపానిధి మందరకాంకు డుండు న
క్కడ కరుదెంతు నిం పడరఁగా ననుఁ దోడ్కొనిపొమ్ము నావుడున్.

74


వ.

లఘుపతనకుం డిట్లనియె.

75


ఉ.

కాదన నేల వచ్చెదవుగాక సఖా వెఱఁ గావహిల్లె ని
ర్వేదము నీకు నెట్టు లొదవె న్వివరింపుము నావు డాత్మసం
పాది హిరణ్యకుం డనియె బల్కుల కిం దెడలేదు నెవ్వడిం
బోదము పోయి యవ్విపినభూమి సమస్తముఁ దెల్పి చెప్పెదన్.

76


క.

నావుడు దత్తప్రతిభా, షావర్గుం డగుచు వాయసస్వామి నయ
శ్రీవిభవు మూషకాగ్రణి, వే వాత న్గఱుచుకొని దివిజమార్గమునన్.

77


వ.

పఱచి యగాధకరంబగు తత్సరోవరంబున కరిగి తీరంబున హిరణ్యకు నునిచి లఘుపతన
కుం డుదారస్వరంబునం బిలుచుటయు సందర్శనకుతూహలంబున మందరకుం డచ్చెం
దమ్మికొలఁకు వెలువడి ప్రత్యుత్థానం బాచరించి వారిచరతరసాహారంబున విముక్త
మార్గశ్రములం గావించి స్వాగతాదికార్యంబులు వేఱవేఱ నడిగిన లఘుపతనకుండు కమఠ
పరివృఢు నాలోకించి.

78


చ.

అనుదినదూరితాఖిలశఠా కమఠా యితఁ డాఖుఁలేఖరా
జనుఁగుసఖుం డుపాయసఖుఁ డార్తశరణ్యుఁడు పుణ్యుఁ డిట్టియి
మ్మనుపథవర్తి వంత నడుమంబొడమం బొడవేఁది యిల్లు వీ
డ్కొని యిట కేగుదెంచె నినుఁ గూర్చి సుఖస్థితి నుండునాతఁడై.

79


క.

క్షణభంగురములు కపట, ప్రణయంబులు ప్రాణపతనపర్యంతంబున్
గుణవికలత శశశృంగము, ప్రణుతమతీ యిట్టిసాధుపథగాములకున్.

80


క.

చావునకుఁ బాపెఁ జిత్ర, గ్రీవుని నిటువంటిపుణ్యకృత్యము లాహా
యేవేళ నెన్ని సేసెనొ, కో వేడుక నీహిరణ్యకుఁడు మందరకా.

81


వ.

అని లఘుపతనకుం డుత్కర్షించిన నాశ్చర్యధుర్యండై కమఠవర్యుండు హిరణ్యకున
కిట్లనియె.

82


ఉ.

వీనుల నీచరిత్రములు వింటిఁ గృతార్థుఁడనైతి సత్యభా
షానిధి యోగిమానసముచాడ్పున నిర్మలమైననీమహా
మానస మెట్లు దుఃఖగరిమ న్భజియించె విచిత్ర మివ్విధం
బే నిట విందుఁ జెప్పఁగదవే యన నాయన కాతఁ డిట్లనున్.

83

ఆ.

అనఘ సఖ సఖుండ వగునీకు మామక, వ్యథనకథన మభినయం బొనర్చి
సరసతావకాశ్వసనభాషితంబుల, గాఢసమ్మదంబుఁ గాంతు నేను.

84


సీ.

విను మహిళారోప్యమనుపట్టణము సర్వసౌభాగ్యవిలసనాస్పదము గలదు
దానిచెంగట వసుంధర బొక్క యొనరించుకొని యేను గౌరవంబున సుఖింతు
నటకుఁ జూడాకర్ణుఁ తనుతుచ్ఛసన్యాసి చనుదెంచి యేనుండుమనికిలోను
గాఁ గట్టిమఠము భిక్ష మనుదినము ధరాత్రిదశు లవ్వీటఁ బెట్టుదురు గాన


తే.

పెట్టుకొని పెద్దగాలంబు నిలువవలసి, స్నాన మొనరింపఁ డోంకారజపముఁ దడవఁ
డాంతముగఁ జూడఁ డంత వేదాంతవిద్య, కడుపు కైలాస మరయ నక్కష్టయతికి.

85


క.

కుక్షింభరుఁ డగునలయా, భిక్షుఁడు వేసరక తిరిగి భిక్షించిన యా
భిక్షము భక్షింపుదు ర, క్తాక్షుండై కేలఁ గోల నదలింపంగన్.

86


క.

ఆయతికూరిమిసఖుఁడు క, థాయతశతపారగుఁడు బృహస్వీకనువాఁ
డాయెడ కేతెంచె నుతా, మ్నాయా యొకనాటిమిట్టమధ్యాహ్నమునన్.

87


క.

వచ్చి పురాణోక్తకథల్, నెచ్చెలి వినుమనుచు నాతనికి రసధారల్
పిచ్చిల వినిపింపఁగ విన, కచ్చెనఁటి పరాకుఁబోలె నటుమొగ మయ్యెన్.

88


క.

అగుటయుఁ గథకుం డాయతి, మొగ మారసి పలికె మాఱుమొగ మైతి వయో
తగు నే నీతో రసపు, ష్టిగ నేరుపు మెఱసి కథలఁ జెప్పుచునుండన్.

89


శా.

నా కీచందముఁ దెల్పి చెప్పు మన విన్నంబోయినం బల్కెఁ జూ
డాకర్ణుండు సభాసుఖం బెఱుఁగ కిండ్లం భిక్ష భిక్షించి యం
టాకుంబొత్తికఁ బెట్టి తెచ్చి మఠమధ్యం జేర్చితిం జూడు నేఁ
డీకొండాటపుటెల్క యుల్కెఱుఁగ కి ట్లేపార భక్షించెడున్.

90


క.

నా కెక్కడిది పరా క, స్తోకంబగు నలుక నెలుకఁ జూచెద నని చూ
డాకర్ణుఁడు వల్క బృహ, స్వీ కాకర్ణించి యుల్లసిల్లుచుఁ బలికెన్.

91


క.

ఇక్కలుఁగున నిమ్మూషక, మెక్కటి మెలఁగుటకు వలయు హేతువు గలఁగన్
బొక్కల గములై యుండుట, నిక్కవ మిట్లొంటి నుండునే యుందురువుల్.

92


క.

ఒలువనితిలలకు నొలిచిన, తిల లీ నఱ్రాడువసుమతీసురభార్యా
తిలకమునం దొకకార్యము, తిలఘాతిని యూహసేయదే పూర్వమునన్.

93


క.

ఆకరిణి జాంగలంబున, నేకాకితఁ దిరుగునెలుకయెడ నూహింతుం
గాక యెుకకార్య మనఁ జూ, డాకర్ణుం డనియె నాదృఢప్రజ్ఞునకున్.

94


క.

ఒలువనితిలలకు నొలిచిన, తిల లీ నఱ్రాడువసుమతీసురభార్యా
తిలకమునం దేకార్యముఁ, దిలఘాతిని నిశ్చయించెఁ దెలుపవె యనుడున్.

95

వ.

బృహస్వి కిట్లనియె.

96


క.

తొలుత నొకానొకభూసుర, నిలయము కడువసతి యగుట నివసించితి న
న్నిలయపతి ప్రొద్దుపొడుపునఁ, గులభామం బ్రీతిఁ బిలిచికొని యిట్లనియెన్.

97


క.

బాలా బుధసంతర్పణ, కాలం బిది యదనుగూడఁ గావింపు శుచి
త్వాలంకృతవైచరువన, లీలావతి పతికిఁ గొలుచులే దని చెప్పెన్.

98


క.

చెప్పిన యజమానుఁడు సతిఁ, దప్పక వీక్షించి పలికెఁ దన్వీ గృహమం
దెప్పుడుఁ దఱుగదు కొలు చి, ట్లొప్పునె లేదని విలాసయుక్తులు నెరపన్.

99


క.

సంచయ ముచితంబగు నతి, సంచయ మనుచితము సర్వజనులకు నెందున్
సంచయలోభంబున నొక, వంచక మారూఢచాపవశమునఁ దెగదే.

100


క.

నావిని వాతెరపై నొఱ, పై విన్నాణంపునగవు లత్తమిల న్ల
జ్జావతి పతిఁ గనుఁగొని తవ, కావిధ మెఱిఁగింపు మనిన నతఁ డిట్లనియెన్.

101


చ.

అవిహితబుద్ధి విను మధురాధర యామిషగంధధిక్కణం
బవునొకపక్కణంబున మృగాహృతిలిప్సుడు క్రూరపుల్కస
ప్రవరుఁడు గ్రాలు నాతఁడు ప్రభారమున న్మృగఘోషభీషణా
టవి చొరఁబాఱి చేరి యచటం గిరిమేషము నేసె నెక్కటిన్.

102


క.

వాలికతూపుల వేటం, గూలిన యలకొండగొఱియఁ గొని తనియక నా
శాలంపటుఁ డొక్కఁడ యా, లీలాటవిలోన నిర్లపితుఁడై తిరుగన్.

103


వ.

ముందఱ నొకశాడ్వలంబున.

104


ఉ.

క్రమ్మి చతుష్ఖురిం జమురు కాలువలై ప్రవహింప రోమపుం
గుమ్మెలఁ బార్శ్వభూజములు గూకలు వ్రత్తులుగా ముఖంబునం
దుమ్ములు రేఁగ మైమఱచి దున్నుచు ముస్తలఁ దెల్చి కుంజముల్
గొమ్ములఁ జిమ్ముదాని నొకఘోరవరాహముఁ గాంచియాత్మలోన్.

105


క.

కలముం బోలినయీయే, కలము మదాహారమునకుఁగా దైవం బీ
పొలము తలఁ జూపెఁ బొమ్మని, యలరుచు వాఁ డప్పు డమ్మహాకిటి నేసెన్.

106


ఉ.

ఏసిన బద్ధరోషమున నేకల మేడ్తెఱఁ దూఱి పుల్కసా
గ్రేసరు మోర నెత్తి తలక్రిందుగఁ ద్రెళ్ళగవైచి వజ్రధా
రాసునిశాతదంష్ట్రికల వ్రచ్చి యచేతనుఁ జేసి నొప్పిచే
గాసిలి ప్రాణము ల్విడిచెఁ గ న్నరమూసి ధరిత్రి నత్తఱిన్.

107


వ.

ఇట్లున్న మృగనరశవంబుల గాలివాఱఁ గాలప్రేరితంబై దహ్యకనామధేయం
బొక్కజంబుకంబు వచ్చి కొండగొఱియ రెండుదినంబులకు నేకలంబు పదినాళ్ళకు

నరుఁడు నాల్గువారంబులకుం జాలుఁ గృతసుకృతవిశేషంబునం గాక యీబహు
సంచయం బెవ్వరెకినని తలంచి హాలాహలాభంబగు లోభంబునఁ గొంచెపడునని
యెంచి యందేమిటిని గంటి పెట్టంజాలక పండ్లయూటలు ద్రావుచుఁ గొండొకతడ
వుండి మండుదండియాఁకటిచిచ్చునకుం గాక యబ్బక్కనక్క యెక్కిడిన శరాస
నంబుం గదిసి నేఁ డీధనుఃప్రతిబంధంబునఁ బ్రొద్దుఁబుచ్చెదం గాక యని నిశ్చయించి.

108


క.

ఆపిసినినక్క చాపము, కోఁపంగిట నిఱికి నరముఁ గొఱికిన రభసం
బేవార మిడిసి మర్మని, రూపణ మొనరింప నక్క రోజుచుఁ గూలెన్.

109


క.

అతిసంచయపల మిది పో, రతిబోటీ వలదు దాఁపురంబన నగుచుం
బతికి సతి పలికె దాఁప, న్గత మేమీ ధాన్య మొదుఁగు గాలే దింటన్.

110


గీ.

ఱోలఁ దిలలు గ్రమ్మి తైలంబుఁ దివిచి ధూ, తాఘవిసరకృసర మాచరింతుఁ
బుడమివేలుపులకు నిడుమన్న నవ్వి ప్ర, సింహుఁ డబల నట్ల చేయు మనియె.

111


క.

నూనియఁ దివియుటకై తిల, లానీరజనయన దెచ్చునపు డొకకాల
జ్ఞాని హలికాలయాగ్ర, స్థానంబుననుండి చేట జడియ న్వ్రాలెన్.

112


క.

జనఁ జెల్లాచెదరై, నేలం దిల లొలికె నంత నివ్వెఱఁగున న
న్నీలాలక చూచునెడన్, నాలింపక సతికిఁ బ్రాణవల్లభుఁ డనియెన్.

113


క.

కలికి యున్నట్టె యీక్రియ, నొలికినతిల లెత్తి దంపు మోర్పున నన న
క్కలకంఠి యట్ల చేసె, న్లలి భీతిప్రీతు లగ్గలములై పెరుఁగన్.

114


క.

ఆమహిసురశరణమునకుఁ, గామందకి యనఁగ నొక్కగానులది సుతుల్
నేమింపఁ బేపగంపం, గోమలగతి నువ్వు లమ్ముకొన నేతెంచెన్.

115


క.

ఏతెంచినఁ బలుకుల సరి, నాతీ ముడినువ్వు లిత్తె నా కని విప్ర
స్త్రీతిలకము ముదలించిన, నాతిల లది యంటువడియె నని యూహించెన్.

116


వ.

అట్లు బుద్ధికౌశలంబున నేను నియ్యుఱియ యెలుకచోట నిక్షేపంబు గలదని నిశ్చ
యించితినని చెప్సి ఫాలకుద్దాలంబుల నామెలంగు కలుఁగుఁ ద్రవ్వి నాచేతఁ జిరస్థా
పితంబగు ధనంబుఁ బుచ్చుకొనియె నది మొదలు పొదలుటలే కచ్చోట నాహారో
పపాదనంబునకుం గాక వితాకుండనై మండు నాకఁటికి మిడికినడిఁకి యునికి పొసం
గక మఱియుమఱియు భిక్షాపాత్రంబులు గొనుచుండితి నట్టి నన్నుం గనుంగొని
చూడాకర్ణుం డుపాలంభగంభీరభాషితంబుల నిట్లనియె.

117


క.

అతిరక్షితార్ధమంతయు, నితరులపా లయ్యెఁ జెడుగు టెలుకా నీయు
ద్ధతి మాన విఁక నిదేమీ, గతవిభవులు సాధుతరులు గారా పుడమిన్.

118


క.

ధన ముడిగిన నుడుగదు నీ, తనుజనితం బైనదుర్మదము నేఁ డనుచున్

గన లునికిఁ గనికరం బఱి, తనపదిలినకోలచే నతఁడు నను వ్రేసెన్.

119


క.

వ్రేసినవ్రేటు దురంత, త్రాసంబున నోహటించి తప్పించుకొనన్
కోపంబున న న్నాస, న్యాసి నిరీక్షించి మఱియు నపు డిట్లనియెన్.

120


క.

అర్థమునఁ బండితుండగు, నర్ధమునం బలసమగ్రుఁడగు నర్థమునన్
బార్డ్థివుఁడగుఁ బుణ్యుండగు, నర్థమునను భువనపూజ్యుఁడగు నరుఁ డెందున్.

121


గీ.

అన్వవాయవృద్ధు లాచారవృద్ధులు, శౌర్యవృద్ధు లిద్ధసత్యవృద్ధు
లాగమార్థవృద్ధు లఖిలార్థవృద్ధులు, కొలుతు రర్ధవృద్ధుఁ గోరి వేడి.

122


చ.

వినఁ డని రోయ కంధుఁడని వీఁగరు తుందిలుడంచు గేలిఁ గాఁ
గొనరు వికర్ణుడంచుఁ దగఁ గూయరు వామనుఁ డంచుఁబోరు దు
ర్మనుఁడని పాయ రజ్ఞుఁడని మానరు నిష్ఠురరోగపీడితుం
డనరు కునిష్ఠుడంచుఁ జెడనాడరు భోగిను లర్థవంతునిన్.

123


చ.

కనకముఁగూర్చి యెన్నఁబడుఁ గాదె సమస్తగుణంబు లర్థ మె
వ్వనికి వసుంధరం గలదు వాఁడె కులీనుఁడు వాఁడె పండితుం
డనఘుఁడు వాఁడె వాఁడ సకలార్థవిధిజ్ఞుఁడు వాఁడ వక్త వాఁ
డ నయపరుండు వాఁడ ప్రకటప్రియభాషణుఁడుం బ్రసిద్ధుఁడున్.

124


క.

కలవానికిఁ జుట్టంబులు, గలరు హితు ల్గలరు భటులు గల రఖిలంబున్
గలదు మఱి లేనియట్టిది, కలవానికి నీడుజోడు గలదా జగతిన్.

125


క.

చిట్టడుగు లేనియిల్లును, జుట్టంబులు లేనిచోటు మాన్యము శూన్యం
బెట్టును దుర్జనహృదయము, కట్టా మది సర్వశూన్యకము లేమి సుమీ.

126


క.

ధనహీనుఁ డధముఁ డల్పుఁడు, ధనహీనుఁడ మూఢుఁ డప్రధానుఁడు ధర న
ద్ధనహీనుఁడు తల పెట్టిన, పని గ్రీష్మసరిజ్జలంబు పగిది నడంగున్.

127


వ.

అని భిక్షుకుఁడు న న్నధిక్షేపించిన రోసి నివాసత్యాగంబు చేసి వచ్చితి నిన్నుం
డాసితి.

128


క.

త్రిదశవిమానారోహణ, మొదవిన నవమానధరణి నుండుట కష్టం
బది యెఱిఁగి నీతివిద్యా, విదుఁ డభిమాసస్థలంబె వెదకుం బుద్ధిన్.

129


క.

యమయాతన యవమాన, క్షమబాధ యిఁకెద్ది దానిఁ గడచినవిద్యా
గమసౌఖ్యాగమవిత్తా, గమశూన్యంబైనచోటఁ గాదు వసింపన్.

130


క.

పరదేశం బెఱుఁగక తగు, గరగరిక న్విడువముడువఁ గలిగి నడుమఁ బే
దరికము వాటిలి తిరియ, న్దిరిగిన ననుబోఁటి కమరునే యింతైనన్.

131


ఆ.

వెల్లివిరిసెఁ బెంటివిద్యలు మగవిద్య, లడుగువెట్టె గ్రిందు వడిరి బుధులు

హీనజాతిపురుషు లెచ్చిరి యాచింపఁ, బోవు టెట్లు నేఁటిభూమిపతుల.

132


శా.

ఏల ల్తందనతాన లేమయినలేవే యంచు బోధించునే
నూలంబెట్టఁగఁజాల మూఢనృపుఁ డోహో నామహాసాహితీ
శూలంబు ల్సెవులాడ సొమ్మసిలు నొచ్చుం జచ్చుఁ దత్కల్మషం
బేలా యంజలి చేసి మ్రొక్కెదఁ పదార్థేచ్ఛానిశాచారికిన్.

133


క.

అనుచితభాషణముఖరా, ననులమొ విటగాయకులమొ నటులమొ గాఢ
స్తనసంభరనమ్రవధూ, జనులమొ మ మ్మేల రాజు సంభావించున్.

134


ఉ.

కోరినగద్యపద్యముల గూరిచి యిచ్చెద వంటినేని ని
స్సారము లంచు విత్త మిడఁజాలక కేరడమాడులోభి యా
నేరుపు నేర్పు కాదు తను నిందలఁ బెట్టు రసజ్ఞుఁడైనయు
ర్వీరమణుండు గల్గినఁ గవిత్వము సర్వఫలంబు లీదొకో.

135


చ.

పలుకులశబ్దసర్గశతపత్రభవంబులు జాతవర్ణముల్
బలుకడుపుల్ నిరుక్తికలు ప్రజ్ఞ లనర్థకము ల్విచారముల్
వలవనిఠీవినవ్వుఁ బెఱవారి నెఱుంగక తిట్టి కూళ లే
పొలుపునఁ దప్పులొప్పు లనఁబోదురొకో సుకవిప్రబంధముల్.

136


చ.

మెఱసి బహుప్రబంధతను మెచ్చుట మెచ్చుట యొచ్చమంటి పా
డఱిముఱి నెన్ను టెన్నుట నిరక్షరకుక్షు లధీరశిక్షితుల్
కఱటులు భూరుహాశ్మపశుకల్పులు మత్కృతిఁ బ్రస్తుతించినం
గఱగఱఁ బోవనాడినను గల్గవు నామది మోదఖేదముల్.

137


క.

పరిహాసకులకు నటులకుఁ, దరుణులకును లంజెదారితమ్ములకుం గా
పురుషులకు గాయకులకం, బొరయింతురు రాజు లీరు పో సరసులకున్.

138


ఉ.

ఏపున సంచితార్ధము పరేంగితభావ మెఱింగి యీఁగి మే
లై పొగడొందనిచ్చి నెఱయ న్మఱచు న్నెఱదాత యిట్టిచో
దాపయితృప్రభోధవశతం బొరయించి యనంతరంబు సం
తాపము నొందువాఁ వధమదాత వృథా లపితంబు లేటికిన్.

139


ఉ.

దాతలు దాత లం డ్రదియ తథ్యము లోకమునందు లేఁడుపో
దాత యతండు గల్గినను దాతృత దాసకలార్లందు నే
లా తులతూఁగకుండు నచలస్థితి నింత యెఱింగి యే నహో
దాత ఋణానుబంధము గదా యని చిత్తమునం దలంచెదన్.

140


క.

తలలెత్తి చూడవెఱతురు, వెలవెలనై మాఱు పలుక వెఱతురు నెఱయం

జలియించిపఱతు రిస్సీ, కొలకపగతులు గారె యాచకులు లోభులకున్.

141


క.

చరణములు వడఁకు భీతిం, బరవశమౌ నొడలు రాలుపడు నెలుఁ గాహా
మరణమున నెట్టి చిన్హము, లరయ న్యాచకుఁడు దాల్చు నచ్చిన్హములన్.

142


వ.

అట్లగుటఁ జింతించి యాచకత్వంబునఁ జిత్తం బొడఁబాటుగాదు దారిద్ర్యం
బునం బ్రజ్ఞాహైన్యంబు వాటిల్లు బ్రజ్ఞరాహిత్యంబున సత్వక్షీణంబగు సత్వభ్రం
శనంబునఁ దిరస్కృతి వొడముఁ దిరస్కరణంబున నఖర్వనిర్వేదనం బావహిల్లు
నిర్వేదనంబు శోకంబు దెచ్చు శోకంబు బుద్ధిబాధకంబగు బుద్ధినాశకారి కావున నిర్ధ
నం బఖిలవిపదాస్పదంబని పలికి మఱియును.

143


చ.

సముచితభాషణంబులకుఁ జాతురి సాలక యున్న మౌన ము
త్తమము పరాంగనాగమనతత్పరుడయ్యెడుదానికంటె షం
డమతము మేలు చాడికి నొడంబడియుండెడివృత్తికన్నఁ జా
వు మిగులలెస్స యన్యవసువు ల్గొనుకంటెను భిక్ష మొప్పగున్.

144


క.

దీపమునఁ దమము రోగ, వ్యాపృతిఁ జెలువంబు హరిహరాఖ్యానముచేఁ
బాపమువలె యాచ్నావిధి, వేపాయు గురుత్వ మతులవిజ్ఞాననిధీ.

145


చ.

అలఘులఘుత్వమూలమగునర్థిత కంజలిఁ జేసి మ్రొక్కి వీ
డ్కొలిపి నృపాలురం గొలిచి కూర్చెద భూరితరార్థ మంచు నేఁ
దలఁచితినేని వట్టియలతం బడు టొక్కటి నిర్దయు ల్ఖలు
ల్దులువలు హీనమర్త్యఫలదు ల్నరవల్లభు లీరు విత్తముల్.

146


క.

తా నీఁగొఱమాలి మహా, హీననరాధిపుఁడు భాగ్యహీనుఁడను న్స
న్మానార్హుల సుభటుల వి, ద్యానిధులన్ హలహలాభ మగు లోభమునన్.

147


వ.

అట్లగుట రాజసంశ్రయంబును గూడదు ప్రేక్ష్యభావంబు మృత్యుద్వారంబు రోగి
యుఁ జిరప్రవాసియుఁ బరాన్నభోక్తయుఁ బరగృహశాయియు జీవన్మృతులని
చెప్పి హిరణ్యకుండు వెండియు.

148


క.

సంతుష్టివర్మసంగు, ప్తాంతఃకరణునకు వెఱచు నతిశయతృష్ణా
కుంతములు భీతిచింతా, సంతాపక్లేశరుజల సంపాదింపన్.

149


ఉ.

వీతఖలీనమై యతులవేగమున న్మొనగాలు ద్రొక్కు తృ
ష్ణాతురగంబు నెక్కి యలసస్థితిఁ జేట్పడకుండువానికిం
జేతెడునేల మేరుగిరి సింధువు వత్సపదంబు దూరతృ
ష్ణాతనుఁడైనవానికి నిజాంకగతార్థము దవ్వు పెద్దయున్.

150


క.

ఆశాశృంఖలఁ బడి నా, నాశాభూములఁ జరించునదిపో యసుఖ

శ్రీశోభితుఁడై నిలుచును, ధీశరధీ మనుజుఁ డొక్కదెస యరుదేరన్.

151


క.

పొట్టకుఁగా బట్టకుగాఁ, జెట్టాడుం దెలివిలేనిజీవి నిజంబౌ
నొట్టపుశపథం బవుఁ దనుఁ, బుట్టించినదేవుఁ డిచ్చుఁబో కర్మగతిన్.

152


క.

కూరలు నారలు చాలవె, పూరింప న్మృష్టమేల పొట్టకు మఱి యే
నీరైనఁ జాలదే ప, న్నీ రేటికి నింగిఁ గీల్కొనినచి చ్చార్పన్.

153


ఉ.

ఊయెలమంచము ల్పసిఁడియుప్పరగ ల్గపురంపువీడెము
ల్మాయనిపుట్టము ల్రుచిరమండనము ల్గడలేని క్రొవ్విరు
ల్గాయనగాయనీమధురగానసుఖంబులు గన్న గాని సీ
పాయదె యన్నమాత్రమునఁ బ స్తనుజీవికిఁ జక్రవర్తికిన్.

154


చ.

ఒకరుని కిచ్చు నిచ్చి తిరియు న్మఱియొక్కతఱి న్మహోగ్రుఁడై
యొకరునిఁ జంపుఁ జంపి పొలియ న్మఱియొక్కనిచే బలాఢ్యుఁడై
యొకరునిఁ ద్రోయుఁ ద్రోచిన మఱియొక్కనిచేఁ బడు నేలు నొడ్ల నొం
డొకరునిఁ గొల్చు మానవుఁ డొహో సుఖవృత్తి విపత్తివృత్తులన్.

155


వ.

అట్లగుట మేలుగీళ్ళు దేహధారులకుకు భోగ్యంబులు గదా యని తెలిసి మదిం బదిలంబు
సేసికొని యిచ్చటికి వచ్చితి నని హిరణ్యకుండు చెప్పిన మందరకుం డతని నాలోకించి.

156


క.

నెలవునఁ బూజ్యంబులు నఖ, ములు దంతంబులు శిరోజములు గాలగతిన్
నెల వెడలియుఁ బూజ్యంబులు, పులిగోళ్లును దంతిదంతములు చామరముల్.

157


క.

హరి పెంపువడయుఁ గరి, పెద్దరికముఁ గను సజ్జనుండు తగఁ బూజ్యుండౌ
నిరవెడలియు నిరవెడలినఁ, గరటము దెగుఁ గుజనుఁ డీల్గుఁ గడ చను మృగముల్.

158


క.

అరివిదళన పరుషుండగు, పురుషుం డెచ్చోటనయినఁ బూజ్యుఁడు గాఁడే
ఖరనఖరవిజికకరిహరి, తిరముగ మృగరాజ్య మేలదే పెఱయడవిన్.

159


క.

కదలనినీటికి మీనము, లెదురెక్కునె యుఱిదిఁ బాఱు నేటికిఁ బోలెం
బదవి నిరుద్యోగులఁ బొం, దదు సోద్యోగులనకాని ధార్మికముఖ్యా.

160


క.

తనపుణ్యపాపవశమునఁ, దనివిసన న్వచ్చు సంపదలు నాపదలున్
ఘనతకు నుబ్బక హీనత, కనుతాపం బందకుండునది సుజనునకున్.

161


క.

శకటగతచక్రభంగి, న్సుకరములై తిరుగుచుండు సుఖదుఃఖము లిం
తకు ఖేద మంద నేటికి, నకటా సంతోషయుక్తుఁ డగు టొప్పుఁ గదా.

162


మ.

సతతోత్సాహపరుం గ్రియానిపుణు భాస్వద్దీర్ఘసూత్రుం గృత
జ్ఞతము న్సత్యదురంధరు న్మధురభాషావేది సౌహార్దభా
సితు నారంభవిజృంభమాణుఁ గరుణాసింధు న్శుచి న్శాంతు ని

ర్జితకాముం దనుఁ దా వరించు సిరి నిర్ణిద్రానురాగంబునన్.

163


క.

అవివేకి నలసు విగత, వ్యవసాయున్ హీనుఁ గుటిలవర్తను నధముం
గువిచారుఁ జేర దిందిర, యువతీమణి వృద్ధుఁ గవయనొల్లనిభంగిన్.

164


క.

సరసప్రజ్ఞోత్సాహ, స్ఫురితుఁడ వీ వెచట నున్నఁ బూజ్యుఁడవు గుణా
కర మూషకకులశేఖర, యురగేంద్రుఁడఁ గాను నిన్ను నుత్కర్షింపన్.

165


చ.

అడఁగని లేమిఁ బొట్టుపొఱ లయ్యును ధీరుఁ డొకానొకప్పుడున్
విడిచి చరింపఁ డగ్రపదవిం గృపణుం డసమానసంపదం
బొడవయి యుండియుం దడయఁబోఁ డది యెవ్వరి కేది మార్గ మా
నడవడి వా రొకింత విడనాడరుగా గడతేరునంతకున్.

166


క.

ధనవంతుఁడనని మదమున్, ధనహీనుఁడ నని విషణ్ణతం బొందవు హ
స్తనిహతహేలాకందుక, మనఁ బాతోత్పాతములు జనావళి కగుటన్.

167


సీ.

జలధరచ్ఛాయయు ఖలమైత్రియును నవసస్యంబు యువతియు జవ్వనంబు
సంచితార్థంబు నీషత్కాలభోగ్యము కావున వలవింత గా దొకింత
తెలు పంచగమికి నెమ్ములకుఁ జిత్రతి కీరములకుఁ బచ్చదనంబు గలిగె మొదల
నేవేల్పువలన నద్దేవదేవుఁడు పోషకుఁడు సువ్వె మది నేల కుతిలపడఁగ


తే.

జనుఁడు బ్రతుకు నూఱుసంవత్సరము లంత, కాల మెవ్వడుండు మేలుతోడఁ
గౌతుకమునఁ గొంతకాలము చను మహా, కష్టవిష్టిఁ గొంతగాల మరుగు.

168


వ.

దానతుల్య యగువిధియును సంతోషసమం బగుసుఖంబును శీలసదృశం బగుభూ
షణంబును నారోగ్యసదృక్షం బగుభారంబును లేదుగదా! యిమ్మాట లటుండె
మదీయస్నేహంబునఁ గాలం బపనయింతురుగాక యని మందరకుండు హిరణ్యకు
నాశ్వాసింపుచుండె నప్పుడు లఘుపతనకుండు.

169


క.

శమితశఠాకమఠాని, ర్గమనప్రమదంబు హృదయగతచింతాశ
ల్యముఁ బెఱికివైవ నీమై, త్రి మనోజ్ఞవిశల్యకరణి ధృతి నూహింపన్.

170


క.

ధరలో సత్పురుషులు సత్పురుషాపద్ధరణహేతుభూతులు గారే
కరు లుబ్బలిలోఁ జిక్కినఁ, గరు లెత్తఁగఁ జాలియుండుఁ గాదే పుడమిన్.

171


క.

నిధిసాధకుఁడు ఘనాంజన, విధినిక్షేపంబుఁ జూపువిధమున సుజనుం
డధికాపదార్తులకు హిత, మధురోక్తి నఖండసౌఖ్యమహిమ ఘటించున్.

172


మ.

కరనీరేరుహ మర్థి పాపఁ బ్రతిపక్షత్రస్తుఁడై వచ్చి కా
తరబుద్ధి న్మనుజుండు మాటు సొర నాస్థ న్నిస్తులార్థాభయా
చరణప్రక్రియలం గృపామతిఁ దదాశాభంగవైముఖ్యముం

బొరయం గోరనివాఁడువో పురుషుఁ డొప్పు న్వానిఁ కీర్తింపగాన్.

173


చ.

విటపసమృద్ధిభూజముల వీవలుల న్విరుల న్మరందలి
ట్పలివియత్ప్రదేశమునఁ బక్షులు వారిమరాళమండలం
బెటువలె నాశ్రయంచి బల మెవ్విధిఁ గైకొను నేము నిట్టిచో
నటువలె నిన్నుఁ జేరి ముద మందెద మోకమఠాన్వయాగ్రణీ.

174


వ.

అని లఘుపతనకుం డనేకప్రకారంబుల మందరకు నుత్కర్షింపుచుండె నాసమయంబున.

175


మ.

చకితస్వాంతముతో మహామహిరజశ్ఛన్నప్రతీకంబుతో
వికసద్వక్త్రముతో బృహద్గతిజనిర్వేదైకనిశ్వాసవీ
చికతో బమ్మెరపోకతో నటకుఁ గశ్చిల్లుబ్ధకక్షోభ మొం
డొకకాంతారమృగంబు భిన్నఖురటంకోదగ్ర మేతెంచినన్.

176


క.

మ్రానికిఁ బొఱియకు సలిల, స్థానమునకుఁ గాక వివరసజ్జలచరముల్
లోసెరసినభీతిఁ బసిం, దానిఁ గనుంగొని యథాయథముగాఁ బఱచెన్.

177


క.

క్షితిజాతాగ్రస్థితలఘు, పతనకుఁ డద్దిక్కులెల్లఁ బరికించి యుప
స్థితమైనది కించిద్భయ, మతిభయ మిచ్చోటఁ గలుగదని తెలుపుటయున్.

178


వ.

హిరణ్యకమందరకులు బహిర్నిర్గమనం బొనర్చి వెగడుపడియున్నమృగంబు నూఱ
డించి యాతిథ్యం బొనరించి చిత్రాంగదుం డనునామం బిడి ముఖ్యసఖ్యంబున నల
రించి భీతికి హేతు వెద్ది చెప్పమని యడిగిన నది మృగయుత్రస్తం బని చెప్పె నమ్ము
వ్వురు నతం డొక్కరుండునుం గూడ నలువురై యన్యోన్యస్నేహవ్యామోహంబునఁ
గొంతకాలంబు గడిపి రట నొక్కనాఁడు.

179


సీ.

ఆహారవాంఛఁ జిత్రాంగదుఁ డడవికి బఱచి యొండొకకుంటఁబడియచోట
నలఘుసధీవరయంత్రవాగురఁ దగుల్కొని భీతి నంగము ల్వడఁక గోడు
గుడుచుచుఁ దోనీడ్చుకొనుచు శుష్యద్గ్రీవమై వచ్చుచుండ వృక్షాగ్రవర్తి
యగుచు దూరమున వాయసనాథుఁ డచ్చెట్టఁ గని స్రుక్కి యెటువంటికష్ట మొదవె


తే.

నేమి సేయుదు ననుచు నహీనవేగ, కలన ఱెక్కల పటపటాత్కార మెసఁగ
నరిగి బాష్పనిరుద్ధాక్షుఁ డగుచు సఖునిఁ, గదిసి యిట్లనుఁ గంఠగాద్గద్య మడర.

180


మ.

చెలికాఁడా పదబంధ మేవలన వచ్చెం జెప్పుమా నివ్వెఱం
గలఁగె న్మానస మన్న నాతఁ డను బల్కం దాల్మి లే దెంతయుం
దెలియం జెప్పెదఁ బిమ్మటం బ్రతుకుఁ గంటేఁ గ్రమ్మఱం బోయి ని
రృహృద్దాము హిరణ్యకుం బిలిచి తెమ్మా బంధవిచ్ఛిత్తికిన్.

181

చ.

మనుపఁ బ్రియంబయేనిఁ జనుమా యన నాయన నిర్భరత్వరం
జని నిరవద్యహృద్యగుణసారు హిరణ్యకుఁ జేరి చూచితే
చెనఁటివిధాతచేత మునుఁ జిత్రమృగాగ్రణి కృత్తివాగురా
భిని హతపాదుఁ డయ్యె నినుఁ బిల్వఁగవచ్చితిఁ దత్ప్రశాంతికిన్.

182


క.

నావిని మూషకపతి దుః, ఖావేశితహృదయుఁడై సఖా పోవలయుం
బోవలయు జాగు సేయక, వేవేగ నన్నుఁ జేర్పవే నీ వచటన్.

183


వ.

అని పలికిన నతని మృదురీతిం గఱుచుకొని చని వాయసకులవల్లభుండు నికటం
బున నిలిచిన రుగ్ణునకు నౌషధంబును దృషితున కుదకంబును క్షుధార్తునకు మృష్టా
న్నంబును నగాధజలపతితునకు నోడయు దరిద్రునకు నిధానంబునుంబోలె నుప
స్థితుం డైన హిరణ్యకుం జూచి చిత్రాంగదుం డిట్లనియె.

184


క.

మృగయుభయంబునఁ జీకా, కగుచున్నది మది భుజంగమాకృతిఁ గాలం
దగిలినయురి గొఱికి భయా, ధ్వగచిత్రగ్రీవుఁబోలెఁ దగు ననుఁ బ్రోవన్.

185


క.

మందరకుండును గరటపు, రందరుఁడును నేను నీపరామర్శ న్మే
లందెదమని తలపోయుదు, మం దెక్కడిశంక నీదయకుఁ బాత్రంబున్.

186


క.

విచ్చలవిడి వాగురికుఁడు, వచ్చినఁ బ్రాణములమీఁద వచ్చును గృప నేఁ
డిచ్చెట్ట మాన్పు మనవుడు, నచ్చకితునిఁ జూచి మూషకాగ్రణి పలికెన్.

187


కె.

వెఱవకు వాగుర దునియం, గొఱుకుట యన నెంత నీతికోవిద నీ కే
తెఱఁగున నీదుర్దశ దెప్పరమై చనుదెంచెఁ దేటపడఁ జెప్పవనా.

188


క.

అనిన నిది నేఁడ కా దట, మును గలదన నతనిఁ జూచి మూషకరా జో
యనఘా నీతొలుతటికథ, విన నిష్టంబయ్యెఁ తెలుపవే నా కనుడున్.

189


ఉ.

రంగదుపాయపారగు హిరణ్యకుఁ గన్గొని యొప్పఁ బల్కెఁ జి
త్రాంగదుఁ డిత్తెఱంగుఁ దెలియ న్విను మాఱవమాస మేగుచుం
డంగ సుగందనై జననిడాఁపునఁ బర్వి యఖర్వపర్వత
ప్రాంగణశాడ్వలస్థటలఁ బచ్చిక మచ్చిక మేయ నాయెడన్.

190


చ.

నరనుతకీర్తియౌత్కలమునాఁ గటకంబునఁ బుష్కరుండు భా
స్కరకులుఁ డొక్కనాఁడు తెలిగన్నులయన్ను లొయారమొప్పఁ జా
మరము లిడంగ దివ్యమణిమంటపమధ్యమృగేంద్రపీఠి నం
బురుహవిరోధి పూర్వగిరిఁబోలె రహిం గొలువుండె నుండఁగన్.

191


మ.

తుటుమై యొక్కటఁ గూడి గూడెపుఁగిరాతు ల్నేను వీక్షింపఁగా
నటకాలోన హుటాహుటిం బఱచి పచ్చాకుల్ దృషత్పూనము

ల్గిటిదంష్ట్ర ల్గరిదంతము ల్సవరము ల్డేగ ల్శివాశృంగముల్
చిటుక ల్వైచిన మ్రోగువారువములుం జేకానుక ల్సేయుచున్.

192


గీ.

మ్రొక్కి చేమోడ్చిమాయున్నచక్కిఁ జెప్పి, యెన్నిహరు లెన్నియేనుగు లెన్నిపందు
లెన్నిపులు లెన్నిమనుబిళ్లు లెన్నిలేళ్లు, చెప్పఁ జిత్రంబు వేఁట విచ్చేయు మటకు.

193


సీ.

కొసవెంట్రుకల బట్టి కూపెట్ట సింగంబుఁ బట్టి తేకున్న నీబంటఁ గాను
నెల వారసి సొమ్మసిలవైచి శరభంబుఁ బరిమార్పకున్న నీబంటఁ గాను
గండ్రగొడ్డటన వక్త్రంబుఁ జించి గజంబుఁ బడఁద్రొక్కకున్న నీబంటఁ గాను
గండభేరుండపక్షముల నెత్తుట భూతబలిఁ జల్లకున్న నీబంటఁ గాను


తే.

గబ్బిబెబ్బులి డాకాల ద్రొబ్బి విరియఁ బ్రామి రూపార్పకున్న నీబంట గాను
లాచిగవిఁ జొచ్చి యచ్చభల్లముల గముల, బడలువాపకయున్న నీబంటఁ గాను.

194


వ.

అని మృగారాతు లక్కిరాతులు పంతంబులు పలికి మృగయావినోదంబునకు
మోదం బాపాదించినం బుష్కరుం డలరి వేటసన్నాహంబు వీటఁ జాఁటించిన.

195


సీ.

అడంగించుఁబో యిమ్మహాసారమేయంబు జముఁ డెక్కు కాసరస్వామినైనఁ
గూల్చుఁబో యిమ్మహాకుర్కురం బబ్ధీశుముద్దులాయము కాఱుమొసలినైనఁ
గఱుచుఁబో యిమ్మహాకౌలేయకము విషగ్రీవు పేరెకిరింతగిత్తనైనఁ
బట్టుఁబో యిమ్మహాభషకంబు తొలుసంజ గన్నమానిసి వాల్మెకంబునైన


తే.

ననఁగఁ బులిగాఁడు చిలుకుట మ్మచ్చపచ్చి, మిరియ మురిద్రాడు కాట్రేఁడు మెఱుపుదీగ
పిడుగు కలగూరగం పనుపేళ్ళ నలరు, నిడుదకుక్కల పట్టుపట్టెడలఁ బట్టి.

196


గీ.

పరుసుకరసానఁ దీఱినపందిపోట్లు, భూరిభుజపీఠములయందుఁ బొందుపఱిచి
పరికరంబులఁ గొనుచు భూపాలునగరి, యేలుబడి వేఁటకాండ్రు ము న్నేచినడవ.

197


క.

ఏలలఁ బాడుచుఁ దగ విలు, గోలలఁ గొని నల్లప్రజలు గుములై నడవ
న్నీలాంబరుఁడై విభుఁ డు, ద్వేలాశుకళావిరాజి తేజీ నెక్కెన్.

198


క.

ఎక్కినఁ ద్రొక్కనిచోటులఁ, ద్రొక్కుచు గుఱ్ఱంబు నడవ దూరము లగుమా
యిక్కలకు వచ్చె నరపతి, పక్కణవాస్తవ్యసమితిపథ మెరిఁగింపన్.

199


తే.

వచ్చి మాయున్నపొలమెల్ల వల్లెవైచు, చందమునఁ జుట్టుకొనినఁ బోసందు లేక
చలితచరణంబులును బరాసన్నదృష్టి, గలిగియుండితి మచటఁ గాకవులకరిణి.

200


వ.

అంత.

201


క.

పవికల్పప్రదరంబున, నవనీపతి దుప్పిదుప్పురనఁ బడనేసెన్
నవలాఘవ మేర్పడ రౌ, రవబాధకు మొదలుగారె రాజులు దలఁపన్.

202


క.

శిఖిధూమశ్యామలములు, ప్రకరగరుద్విసరభాసురము లుద్యజ్జ్యా

ముఖరితములు రాజశిలీ, ముఖములు బహుపుండరీకముఖముల వ్రాలెన్.

203


క.

తారలు చెడ నుడ్డీనో, దారగతు ల్నెఱపి గగనతలమున జవవ
ద్భేరుండము లాస్యముల న, పారముగాఁ గొనియె రాజబాణఫలంబుల్.

204


క.

తులలేని శైత్యములుఁ జిఱు, బిలముల బురుడించుదొనలఁ బెరిగినశరముల్
పొలములు లాయంబులగళ, ములు మోపగఁ దుండషండములఁ బూరించెన్.

205


క.

నిరవధికదానవిద్యా, పరఘనుఁ డాఘనుఁడు దాత ప్రజ్ఞాని వనే
చరమృగచరజాంగకములు, శరధిపృషత్కముల సరభసంబునఁ గప్పెన్.

206


క.

సమయించె ఖడ్గముల ఖ, డ్గములం గ్రూరాచ్ఛభిల్లగణముల జగతీ
రమణుఁడు దుర్గాహవన, క్షమఁ గ్రూకతరాచ్ఛభల్లగణములు గప్పెన్.

207


వ.

అయ్యాఖేటనంబు శాసితపశుప్రకరంబు గావున యజనవాటంబును ధ్వనిప్రధా
నంబు గావున సుప్రబంధంబును భంగదుర్నీరీక్ష్యంబు గావున బయోనిధానంబును
నఖండధర్మమసంపన్నంబు గావున గృతయుగంబును నిరూఢఋశ్యశృంగంబు గావున
విభాండకాశ్రమంబును శిధిలీకృతాచ్ఛభల్లంబు గావునఁ బ్రభగ్నసంగ్రామంబును
గుంతీష్టవిహారయోగ్యంబు గావునఁ బాండురాజార్జనంబును నష్టసింహబలంబు
కావున భీమసేనోత్సాహంబును నపాస్తసింధురాజంబు గావున ఫలితార్జునప్రతి
జ్ఞయు నికుంచితవంచకంబు గావున రాజనగరంబును నిశ్చేష్టితగవయంబు గావునఁ
గుంభకర్ణసంరంభంబును సప్రకాశితపుండరీకంబు గావున శిశిరకాలంబును ననుకరించె
నప్పుడు.

208


క.

పోలములు వెదకి పక్కణ, పాలురు తఱుముటయుఁ దల్లి ప్రజ లుద్ధురజం
ఘాలురు గావునఁ బరచిరి, పోలేకం దగులుపడితిఁబో వారలకున్.

209


క.

నను నంతఁ జిత్రవర్ణుఁడు, గనిఁ జంపక తెచ్చి పతికిఁ గైకానుకగా
నొనరించిరి శబరసుతు, ల్విను రా జవ్వేటమీఁద విరిగె న్దిరిగెన్.

210


వ.

తిరిగి మహిమహిళాకటకం బగుకటకంబునకు వచ్చి రాజు యువరాజునకు న న్నిచ్చె
నిచ్చిన నచ్చెలువుండు నన్నుఁ గన్ననందనుకంటె నగణ్యకారుణ్యంబున రక్షించె
నట్లు కుక్షిద్రక్షితుండనై యుండి యంతఃపురంబున వాసగృహంబున యువరా
జొక్కరుండు పవ్వళించియుండ నేనును దత్సమీపంబున నుండితి నయ్యర్ధరా
త్రంబున.

211


క.

ప్రతిగర్జత్కేసరియై, యతికంపజ్జంతుహృదయమై నిర్భన్న
శ్రుతిహృత్పుటమై విద్యు, ద్ద్యుతివాంతధ్వాంత మగుచు నొకయుఱు ముఱిమెన్.

212


మ.

తనకర్ణంబుల కెంతయాఘననినాదం బూర్జితామోదకం
బొనరింప న్ముఖమెత్తి వానతఱి యయ్యోపర్వతాధిత్యకా

వనుల న్సద్వనులం గులప్రభులతో వర్తింతుఁగా యంచు బా
ష్పనిరుద్ధాక్షుఁడనై సఖా మనుజభాషం బల్కితిం బల్కినన్.

213


చ.

విని యువరాజు ద్రాపరసవిహ్వలుఁడై సదనంబు నల్దెస
ల్గనుఁగొని యేను నీమృగమకాని యొరు ల్విహరింప రిందుఁ జె
ప్పను వినఁగూడునే మనుజభాషల నిప్పశు నద్భుతధ్వనిం
బనివడి మ్రోసె వేగి తెలుపందగు నీతెఱఁ గెల్లవారికిన్.

214


క.

అని తనువు వేఁగ వేగినఁ దన కాపుష్కకనరేశుతమ్ముఁడు నెమ్మిం
గనుగూర్క వేఱచి యొకలా, గున నంతయా దైవచింతకుల కెఱిఁగించెన్.

215


క.

ఎఱిఁగించి మృగము లెక్కడ, తరి నేతన్మనుజభాషితము లెక్కడ నే
తెఱఁగో యేయుత్పాతమొ, వెఱఁగయ్యెడు ననిన నవ్వి విద్వత్సింహుల్.

216


క.

యువరాజుఁ జూచి ధరణీ, ధవనందన యేల వెఱచెదవు మృగజాతుల్
పవ లూరకుండి నిశ నవ, నవభంగి న్మనుజభాషణంబులఁ బలుకున్.

217


క.

నరసంచారవిహీనో, ర్వర వని చెప్పుటయు భయము వదలి నృపాలా
వరజుఁడు నను విడిపించెను, గరుణాపరుఁడై దురంతకాంతారములన్.

218


క.

ఇది నాకు నేఁడ కా ద, మ్మొదలం గల దనుచుఁ దెల్లముగ మృగము జగ
ద్విదితుఁ డగు నెయ్యునకు నా, ర్తదశం దడిలేనినోరఁ దనకథఁ జెప్పెన్.

219


క.

అతివేలచింత నంతట, వెత మదిలో నెరపి సరసి వెలుబడి మంద
స్థితి చాయఁ జూచుకొని య, ప్రతిమదయాశరధి మందరకుఁ డేతెంచెన్.

220


క.

ఏతెంచిన భీతి విని, ర్ఘాతహతిం ధృతినగంబు వ్రయ్యలుగా జిం
తాతంతుబద్ధమానసుఁ, డై తత్తర మెసఁగ మూషకాగ్రణి పలికెన్.

221


చ.

అరయ నుపాయపారగుఁడ వయ్యు నయోదధివయ్యు సంతత
స్థిరమతివయ్యు గానిపనిఁ జేసితి నర్మసఖా మృగంబు ని
క్కరటము నేను నెప్పటికీఁ గాల్గలవారము చిక్క మేరికి
ట్లురుగతి నీకు లే దిచటి కుద్ధురుఁ డామృగయుండు వచ్చినన్.

222


చ.

అతివిమలాత్ముఁ డైనసఖువందును బెంపొనరించుధారుణీ
పతివరునందు భూరిగుణబంధుర మైనకళత్రమందు ను
న్నతనయతత్వశాలి యగునందనునందు మనంబు సొన్పి యా
గతబహుదుఃఖము ల్డొఱఁగుఁ గాదె విచారధురీణుఁ డుర్వరన్.

223


చ.

అనునెడ వేఁటకాఁ డదయుఁ డప్ప డుపస్థితుఁ డైన దైన్య మా
ననమున మోసులెత్త మృగనాథుఁడు బెగ్గిలినన్ హిరణ్యకుం

డనునయవాక్యము ల్మెఱయ నాక్షణ మంఘ్రిపరీతవాగురం
దునియలు సేసి మందరకు దూఱి యథాయథలయ్యె నయ్యెడన్.

224


క.

జలచరుఁడు గనవరత్వర, నిలబోవం జేవలేక యెప్పటిచో ని
ర్గళితగమనేచ్ఛఁ గచ్ఛప, కులనాధుఁడు శిరము ముడుచుకొని యుండుటయున్.

225


క.

సరినురికిఁ బాసి గాఢ, త్వరఁబఱచినమృగముఁ జూచి దారుణచింతా
పరితప్తుఁ డగుచు మృతయుఁడు, మరుగుచు నచ్చో ముహూర్తమాత్రము నిలిచెన్.

226


వ.

అట్లుండి ముందర మందరకుం గాంచి పట్టుకొని త్రాటం గట్టుకొని వింటికోపునం
బెట్టుకొని విన్ననైన మొగంబునం దిరిగి యరుగుచుండె నప్పుడు హిరణ్యకలఘుప
తనకచిత్రాంగదు లంతంత ననుసరించి చనుచుండి రందుందురు పురందరుండు
తనలోన.

227


ఆ.

అంబురాశిపార మైనను గనవచ్చు, నిశ్చయింపవచ్చు నింగిపొడవు
బ్రహ్మ మిట్టి దనుచుఁ బలువంగనగు సుహృ, ద్విరహ మింత యనుచుఁ దెలియరాదు.

228


తే.

అదియ సువ్యక్త మది నిజప్రాణతుల్య, మదియ నిర్వాచ్య మట్లు గాదయ్యెనేని
జననిపై భార్యపైఁ దనూజన్ములపయిఁ, గలిమిపై మైత్రిపైఁ బోలెఁ గలదె మమత.

229


సీ.

కర్మచేష్టితములు గాలాంతరావర్తితము లగుమేలుగీ ళ్శమరు నైనఁ
గనుఁగొంటి మరి సమాగమవియోగము లేల చెనఁటివిధాత సృజించె మొదలఁ
బృథులశోకారాతిభీతిఘాతిప్రమోదసంపాదిప్రీతివిస్రంభభాజ
నము మఱి రెండక్షరములఁ బూర్ణంబైనమిత్రశబ్దముమేర మెఱసి విడిసి


తే.

యెట్లు నిలువఁగూడు నెబ్భంగి రుచియించుఁ, గూడు కంటి కెట్లు గూర్కు వచ్చు
నని హిరణ్యకుండు దనలోన దుఃఖించి, యపుడు పలికె వాయసాధిపతికి.

230


క.

ఈయధముఁ డెంతదూరము పోయెడునో యెంతదవ్వు పోదము సర్వో
పాయములఁ గానలోపల, నీయెడ విడిపించుకొంద మిమ్మందరకున్.

231


క.

నావిని లఘుపతనకుఁడును, లావుపసం బోర నలఁతులము మందరకుం
డేవడువున విడివడు నీ, చే వీనికి దిక్కు చెప్పవే వెర వనినన్.

232


సీ.

అశ్రుమిశ్రితనేత్రుఁ డైనహిరణ్యకుఁ డనియె నిప్పాపాత్ముుఁ డరుగుత్రోవ
గలగు చెందామరకొలను దత్తటమున మృగముఖ్య చచ్చినపగిది నుండు
నేమించి యౌదల నిలిచి లోఁజెవులను ముకుగోళ్ళఁ బొడుచున ట్లొకట గన్నుఁ
గ్రుడ్లూడ్చి మెసవులాగున నుండు ముండిన నాపూఁట కచ్ఛపనాథుఁ బ్రోవ


తే.

వేగఁ గేడించి యన్నీచు వెనుకఁ జేసి, యరుగు మచ్చక్కి కనికూర్చి యనుచుటయును
ఖగమృగాధ్యక్షు లరిగి రాఘనులపజ్జ, నంత నంతట దానును నరుగుచుండె.

233


సీ.

చిత్రాంగదుండు చచ్చినవానిగతిఁ బుతస్సరణసరస్తీరధరణి నుండె

వానిమస్తకమున వ్రాలి వాయసకులాగ్రణి కనుగ్రుడ్డులు గఱిచి పెఱికి
కొని తినువానిలాగునఁ గావుకావున నఱచుచు ముఱియించునంతలోన
నరుగుచున్నకిరాతుఁ డగ్రభాగమునఁ జిత్రాంగదుఁ గని మేనుపొంగ నురక


తే.

కలిగెఁ దెక తేర నేతన్మృగం బనుచును, మందరకు డించి కాకి బల్మఱు నదల్చి
కొనుచుఁ జనుచోట మూషకకులవిభుండు, కూర్మవల్లభుబంధము ల్కొరికివైచె.

234


క.

కొరికిన మందరకుఁడు దె, ప్పరపువడిం బఱచి సరసిఁ బడె మూషకరా
జురికె మృగవాయసంబులు, తెరఁగొప్పగ లేచి రెండుదిక్కుల కరిగెన్.

235


తే.

అట్లు విఫలప్రయత్నుఁడై యడవిఁ బాసి, విన్నబాటునఁ జనియెను వేఁటకాఁడు
కమఠమూషకమృగమహాకరటవిభులు, గాఢతరమైత్రిఁ బొదలి రుత్కంఠ నందు.

236


వ.

సుహృల్లాభంబున సాధింపరానికార్యంబులు గలవే యని సుదర్శనకుమారులకు విష్ణు
శర్ముం డెరింగించె నెరింగించిన.

237


క.

విని రాజకుమారకు లన, ఘు నయాంశవిలాసదివిజగురు నిజగురునిన్
గని మూఁడవతంత్ర ముపా, యనిధీ మాతోడఁ జెప్పుమని యడుగుటయున్.

238


మ.

అతికారుణ్యకటాక్షసర్వభువనైకాధ్యక్షరాధాసుత
ప్రతిపక్షప్రియచర్యకల్పకనిశారాడ్ఢుర్యచక్రత్రిశూ
లతిరోభూతరవిప్రభూతశుభలీలాపూతరూఢాంధకా
హితతేజోవిభవప్రచారణదయాహృష్టస్ఫురద్వారణా.

239


క.

మాయాతీతమహాసిత, కాయభటీకృతమరున్నికాయతపస్వి
ధ్యేయ నిజభక్తరక్షో, పాయ విభూతిప్రధానపాండిత్యనిధీ.

240


మాలిని.

నిరనుమితమహత్త్వానిశ్చలానందతత్త్వా, నిరతసుఖితలోకానిత్యపుణ్యావలోకా
గరుడవృషపతాకా ఖండితానన్యశోకా, మరణజననదూరా మౌనిచేతోవిహారా.

241


గద్యము.

ఇది శ్రీవేంకటనాథకరుణాలబ్ధసరససాహిత్యనిత్యకవితావిలాస సకలసు
కవిప్రశంసాభాషణోల్లాస రాజకులపారావారపర్వశర్వరీరమణ నీతిశాస్త్రమార్గప
రిశ్రమణధైర్యపర్యాయధిక్కృతనీహారపర్వత పర్వతరాజకుమారనిస్సహాయ
ప్రబంధనిర్మాణభోజభూదార సుధామధుర భారతీసనాథ వేంకటనాథప్రణీతం
బైన పంచతంత్రంబునందు సుహృల్లాభం బన్నది ద్వితీయాశ్వాసము సంపూర్ణము.

  1. వలవంత = వలవలని బాధ
  2. ఆరెండు = ఆపత్సంపదలు రెండు
  3. ఓదము = ఏన్గులు కూలుటకై మఱుఁగుపుచ్చినగొయ్యి
  4. ఆఖులేఖపతి = మూషకేంద్రుఁడు
  5. పిమ్మటనాడికోలు = నున్నమొగము చా టైనతర్వాత దూషించుట