Jump to content

నేటి కాలపు కవిత్వం/శబ్దవాచ్యతాధికరణం

వికీసోర్స్ నుండి

శ్రీ ర స్తు.

వాఙ్మయ పరిశిష్ట భాష్యం

శబ్ద వాచ్యతాధికరణం

శబ్దవాచ్యత

ఈకాలపుకృతుల్లో శబ్దవాచ్యత అధికంగా, వెగటుగా, కనబడుతున్నది. శబ్దవాచ్యత అంటే యేమోవివరిస్తాను. ఒకడు తెలివిగలవాడు శక్తిమంతుడు అయితే అవి అతని కృత్యాలవల్ల, వివేకం తెలిపే మాటల వల్ల లోకానికి వ్యక్తమవుతుంది. కాని, నేను తెలివి గలవాడను. గొప్పవాడను అని చెప్పుకొన్నంతమాత్రాన గాడు.

"బ్రువతే హి ఫలేన సాధవో నతు వాక్యేన నిజోపయోగితాం". |(నైష)

అని శ్రీహర్షు డీసత్యాన్నే తెలుపుతున్నాడు చెప్పుకొన్న మాత్రాన అతడు గొప్పవాడూ, తెలివిగలవాడూ అని లోకం అనుకోకపోగా అతడు రోతమనిషి అని అసహ్యపడుతుంది. ఇట్లా చెప్పుకొనడమే శబ్దవాచ్యత. కవి సయితం సృష్టివల్ల ప్రకృతి చేష్టాసంభాషణాదులవల్ల వ్యక్తమయ్యే భావపరంపర చేత తన కావ్యమాధుర్యాన్ని ఆనందాన్ని లోకానికి ప్రసాదించవలెగాని ఊరికె మధురం, దివ్యం, మంజులం, కోమలం అని చెప్పడంవల్లగాదు అది శబ్దవాచ్యత అయి రోత పుట్టుతుంది. ఈ కాలపుకృతికర్తల్లో అనేకుల కివివేకం లేనట్లు కనబడుతున్నది. మాతృమందిరమనే నవలలోదివ్య మధుర ఆనంద అనే మాటలు పుస్తకమంతటా నిండివున్నవి.

యేకాంతసేవలో మటుకు ఇందాక నేను పులుముడుకు ఉదాహరించిన

"మధుర మోహనమూర్తి మందహాసమున
 నద్భుతంబుగ లీన మైనట్టులుండ

మధుర హాసంబులో మాధురీ ప్రకృతి
యానందముద్రితం బైనటులుండె
మధుర చంద్రికలో మధురామృతంబు
మధురామృతంబులో మధురరసంబు
మధుర రసంబులో మధుర రూపంబు
మధురభావంబులో మధుర రూపంబు
మధుర రూపంబులో మధుర తేజంబు
మధుర మోహనకళామహితమై వుండ
మధుర స్వరంబులో మధుర గీతములు
మధుర గానంబులో మదిమేళగించి" (యేకాంతసేవ)

అనే పఙ్త్కుల్లో ఒక్క చోట 18 మధురలు వ్రాశారు

"ఒక్కింత యానంద ముండునుగాక
 సుఖరం బగుగాక శుభమగుగాక
 ఆనంద మగుగాక యందమౌగాక"

అని మూడు పఙ్త్కుల్లో రెండానందులు వేసి తరువాత మూడు పఙ్త్కులుదాటి మళ్లీ

"నిరవధికానంద నిలయమైవున్న"

అని ఆనందను మళ్లీ వేశారు. ఈ కాలపుకృతుల్లో అధికంగా మంజుల మధుర నవ్య దివ్యమృదు, విశ్వమోహన, ఆనంద మనోజ్ఞ అని కుప్పలుగా కనబడుతున్నవి. ఇదంతా శబ్దవాచ్యతే అవుతున్నది.

పూర్వపక్షం

అవునుగాని కావ్యం మధురమైనదని మనోజ్ఞమైనదని చెప్పడానికి ఈ మధురలను బంధురలను ప్రయోగించలేదు. కవి ఈ పదాలను ప్రయోగించి మార్ధవం మీదా మాధుర్యం మీదా తనకుగల అభినివేశాన్ని తెలుపుతున్నాడు అంతేగాదు ఆ సందర్భాల్లో మాధుర్యం మార్ధవం వ్యక్తమవుతున్నవని చెప్పుతున్నాడు అట్లానే కఠోరత్వాన్ని తెలపడానికి క్రూర, కఠోర అని యిట్లాటి మాటలను ప్రయోగిస్తున్నాడు. దీంట్లో దోషం లెదంటారా?

సమాధానం

చెప్పుతున్నాను; వాస్తవంగా మాధుర్యం మీదా మార్ధవం మీదా అభినివేశం వుంటే కథాసృష్టిలో ఆబావాలను గర్భితం జేసి ప్రకృతి చేష్టాదులవల్ల వాటిని తెలుపవలెనుగాని ఊరికె మధురం, మంజులం, బంధురం అని చెప్పడం చేతగాదు. చెప్పినంతమాత్రాన లోకం అనుకోజాలదని పైగా వెగటుపడుతుందని తెలిపినాను. ఈ ఔచిత్యం యెరిగిన వాడు గనుకనే కవికాళిదాసు తపోవనాల శాంతిని మాధుర్యాన్ని తేజస్సును అత్యంతం అరాధించేవాడే అయినా రాముడడిగినప్పుడు

"అదష్టనీవారబలీని హిం స్రైః సంబద్దవైఖానసకన్యకాని,
 ఇయేష భూయః కుశవంతి గంతుం భాగీరరథీతీరతపోవనాని"

(రఘు)

(క్రూరమృగాలు తినని నీవారబలులు గలిగి మునికన్యలకు ప్రీతిజనకమై. దర్భలతో కూడివున్న భాగీరథీతీర తపోవనాలకు పోవలెనని ఆమె కోరింది) అని అన్నాడు "దివ్యమై పవిత్రమై శాంతినిలయమై" అని యీతీరున శబ్దవాచ్యత పాలుగా లేదు.

పూర్వపక్షం

అవునుసరే; ఊరికే నేను తెలివిగలవాడను గొప్పవాడను అని చెప్పుకుంటే రోత అన్నారు. ఒప్పుకుంటాము. నిజంగా తెలివిగల పనులు చేస్తూ గొప్పకార్యాలు సాధిస్తూ నేను గొప్పవాణ్ని నేను తెలివిగలవాణ్ని అని చెప్పుకుంటేయేమి? అది సత్యమే గదా. శ్రీనాథుడు కాశీఖండంలో మేమారెడ్ది తన్ను గురించి

"ఈక్షోణిన్ నినుబోలు సత్కవులు లేరీనేటి కాలంబులో
 ద్రాక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరోభామినీ
 వక్షోజద్వయ గంధసారఘుసృణ ద్వైరాజ్యభారంబున
 ధ్యక్షించున్ గవిసార్వభౌమభవదీయ ప్రౌఢ సాహిత్యముల్" (కాశీ.)

అని చెప్పినట్లు వ్రాశాడు.

భవభూతి

   "చేతస్తోషకరీ శిరోనతకరీ విద్యానవద్యాస్తి నః"

అని అన్నాడు అట్లానే మృదుత్వాన్ని మాధుర్యాన్ని వ్యక్తపరుస్తూ మధురం దివ్యం మంజులం అంటే మంచిదేను; అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను: శక్తిమంతుడేదో సందర్భం వచ్చినప్పుడు ఇతరులు తూలనాడినప్పుడు, భవభూతివలె జగన్నాథుడివలె ఒకసారి రెండుసార్లు చెప్పుకుంటే రోతలేదు. కాని నిజంగా శక్తిమంతుడైనా మాటి మాటికి పుటపుటకూ నేను గొప్పవాణ్ని అని వాపోతుంటే రోతగానే వుంటుంది అసలింతకూ బూతవర్తమానాల్లో అద్వితీయుడైన కాళిదాసు

"మందః కవియశఃప్రార్ధీ గమిష్యామ్యపహాస్యతామ్"

అని వినతుడైనాడు ఒకరకపు మనుషులు జగన్నాథుడివంటివాండ్లు బయటపడి వెళ్లబెట్టుకుంటే ఒకటి రెండుసార్లకు రోతగా వుండదు. కాని పుటపుటకూ వాపోతే రోత అని సహృదయుల కందరికీ తెలిసిన సంగతే ఇట్లానే కవి తన మాధుర్య ప్రేమను మంజులత్వ ప్రేమను త్రెలియబరచడానికి ఆసందర్భాలు మధురమైనవని వ్యక్తం జేయడానికీ కొన్ని మధురలు, కొన్ని దివ్యలు వేస్తే రోత పుట్టదు. కాళిదాసు తపోవనాల పావనత్వం మీది అభినివేశం ఆపలేక

"పునానం పచనోద్ధూతైః" (రఘు)

అని పావనత్వాన్ని శబ్దంతో చెప్పినాడు. ఇట్లానే "పుంస్కోకిలోయ మ్మధురం చుకూజ" (కుమార) అని అన్నాడు.

ఇట్లా యెక్కణ్నైనా యీ మాటలు వుంటే రోతలేదు. కాని యిప్పటికృతులనేకాల్లో మధురలు, కోమలలు, దివ్యలు, ఆనందలు, మంజులలు. ముసిరి మూగి వెగటు పుట్టిస్తున్నవి ఈ కాలపు కృతికర్తలనేకుల కీ జౌచిత్యజ్ఞానం కనబడదు. పద్యం మొదలు పెట్టితే దివ్యలు, మధురలు, ఆనందులు మంజులలు ప్రణయలు, కోమలాలు వేస్తున్నారు.

"నీవు తరుణ మాధవుడవు నేను కోకిలను"

అని అన్నప్పుడు మధుమాసంలో కోకిల పంచమస్వరవిరావి అవుతుందని ప్రసిద్ధమే గనుక చక్కగా పాడుతాననే అర్ధం విదితమవుతుంది. తరుణమాధవుడవు అనడంతోనే మధుమాసశోభపూర్ణంగా గోచరిస్తున్నది. కాని కృష్ణపక్షకర్త యీ అభిప్రాయం తెలపడానికే

"తరుణ శృంగార మధురమాధవుడ నీవు
 కలికిపాటల కోయిలకులము మాది"

అని ఆరంభంలో శబ్దవాచ్యత పాలైనాడు.

ఇతడు మధురంగా పాడేదీ, పాడనిది యితడిపద్యాలే చెప్పవలసి వున్నవి. శృంగార, మధుర కలికిపాటలు, అని శబ్దవాచ్యతే గాకుండా పులుముడు దోషం గూడా చేశడు. ఇట్లాటివి కృష్ణపక్షం నిండా వున్నవి. ఈ కాలపుకృతులనేకాల్లో యీదోషం అధికంగా వున్నది.

"విశ్వమోహన రసపుంజ మృదులగీతి
 చారుసిత శీతచంద్రికాపూరమైన
 శారద మనోజ్ఞ యామినీ సమయమందు"

(భారతి సం.2. సం.2 పేజీ 108)

"సొగసైన పూవులు
 సొంపైన పూలు
 అందమైన మంచి చందనపూలు"

(భారతి సం.2. పుట 1-85)



"ప్రవిమలానంద మందానిల ప్రాశాంత
 ........ ........ ....... ........ ....... .......
 మధుర హేమంత చంద్రికామౌనగీతి
 ........ ........ ........ ........ ........ .......
 చల్లనై కన్నులరమోడ్చి శాంత దివ్య
 ప్రకృతి మంజులగాన స్రవంతిలొన
 .......... ........ ........ ....... ....... ........
 మృదుల నీరేజదళముల మేనుమరిచి"

భ.రామసోమయాజులు ప్లీడషిప్పుక్లాసు


(ఆంధ్ర హెరాల్డు వా.న 2-42)



"నవవసంతంపు లేమావి చిగురుటాకు
 నీడలనుహాయి గొంతెత్తిపాడుకొనెడు
 ......... .......... ........ ........ ....... .......
మధుర మోహనమూర్తిని మదిలిఖించు"

తె. కృష్ణమూర్తి యం. యేక్లాసు.(ఆంధ్రహెరాల్డు)

"ప్రణయవేణు వనములోన భ్రమరతతులు
 ....... ....... ...... ...... ....... .......
 మాధురీరస ముద్భవింపంగజాలు
 ........ ....... ....... ....... ....... ......
 యుష్మదానంద ధర్మనజ్యోత్స్న గాని"

యామర్తి సూర్యప్రకాశరావు. ఆంధ్రహెరాల్డు



"ఇంపుదళ్కొత్త నాటల సొంపుమీరె
 కమ్రపల్లవ కోమల కరములెత్తి
 ...... ...... ...... ....... ....... .......
 పిల్లలానంద చంద్రికల్ వెల్లివిరియ
 ..... ..... ....... ....... ...... ..... ......
 మంజులాలాపనవసుధా మధురమూర్తి
 ...... ....... ...... ...... ...... ..... .....
 నిల్చె నామది నానంద నిధి విధాన"

(పెద్దిబొట్ల రాచంద్రరావు బి.యల్. క్లాసు.


ఆంధ్రహెరాల్డు వాల్యు 1.నె 8 రు.38)



"మధురమాధుర్య రవమున మనముగరుగ
 పాడరావమ్మకోయిలా ప్రమదగీతి" (వాసంత)

"నీమనోహర రూపరామణీయకము
 నవనవానంద సౌందర్య లాలనము"

       

    

పెనుమర్తి వెంకటరత్నం (భారతి 2-7-156)


"నవ్యశరన్మనోజ్ఞసుందర సువిశాలమిద్ది
        ప్రణయ రాధిక -శేషాద్రి రమణ కవులు (భ్సారతి 3-5)

"నవవిక స్వరదివ్య సౌందర్యమూర్తి
 విశ్వసుందరి పరమపవిత్రమూర్తి" (కృష్ణపక్షం)

"నవ్యమోహన కోకిలానందగీతి
 దరివికస్వరసుమనోహరసుగంధ" (కృష్ణపక్షం)

"అమృతగాన మధుర మందాకినీ భంగమాలికాంబ
 శీకరవితాన మోహన చిత్రనటన
 పూర్ణవికసితజీవితపుష్పకమ్ర
 సౌరభమ్ముల జిమ్ముచున్నారొ యెల్ల
 దెసల భవదీయసుందర దివ్యరూప" (కృష్ణపక్షం)

"లలితసుకుమార మధుర బాలస్వరంబు
 లలిత మనోజ్ఞ కావ్యమంజులలతాంత
 మాలికాభరణా వినిర్మలవిశేష
 సుగుణ మాణిక్య దివ్యతేజోవిరాజ"

"ఎన్నడో మీరు పాడినదీ వసంత
 మధురజీవనగీతి హేమంతదీర్ఘ
 యామినీమధ్యవేళ యేమైననేడు
 నవ్యభాగీరథీ దివ్యనది విధాన" (కృష్ణపక్షం)

అని యీతీరున శబ్దవాచ్యత మిక్కిలి మెండుగా కనబడుతున్నది. తాటక ఘోరంగా రామలక్ష్మణుల యెదుట నిల్చున్నస్థితిని

"జ్యానినాదమధ గృహ్నతీతయోః
 ప్రాదురాస బహుళక్షపాచ్ఛవిః
 తాటకా చలకపాలకుండలా కాలికేవ నిబిడాబలాకినీ"

(వారి, జ్యానివాదం గ్రహించి, బహుళపక్షపు రాత్రిని బోలి, కపాలాలు కుండలాలుగా వేలాడుతుండగా కొంగలగుంపుతో గూడిన సాంద్రమేఘం వలె అది (తాటక) ప్రాదుర్భవించింది.

"ఉద్యతైకభుజయష్టిమాయతీం
 శ్రోణిలంబి పురుషాంతమేఖలాం
 తాం విలోక్య వనితావధే ఘృణాం
 పత్రిణా సహా ముమోచ రాఘవః"

(ఆయతమైన భుజదండాన్నియెత్తి పురుషుల పేగులు మొలలో వేలాడుతుండేదాన్ని చూసి బాణంతో గూడా స్త్రీవధలో దయను సయితం విడిచాడు) అని కాళిదాసు రఘువంశంలో ఘోర కుటిల నిష్ఠుర అని శబ్దవాచ్యతపాలుగాకుండా చిత్రించాడు కాని, కోపసందర్భ క్రౌర్య సందర్భం వస్తే ఘోరలు కుటిలలు క్రూరలు, దురంతలు నిష్ఠురలు ఈ కాలపుకృతి కర్తలనేకులు పులుముతారు.

"కౌర్య కౌటిల్య కలుష పంకంబువలన" (కృష్ణపక్షం)
 క్రౌర్య కౌటిల్యకల్పితకఠినదాస్య" (కృష్ణపక్షం)
"ఘోర దుఃఖతమంబున గుందునపుడు" (కృష్ణపక్షం)
"హృదయ దళనదారున మహోగ్రకార్యంబు దలచినావు" (కృష్ణపక్షం)

"ప్రళయ కాలమహోగ్ర భయదజీమూతోరు
 గళఘోరగంభీర ఫెళ ఫెళార్భటులతో
 ప్రబలనీరంధ్రాభ్రజనితగాఢధ్వాంత
 నిబిడ హేమంత రాత్రీకుంతలములలో
 వికృత క్రూర క్షు భితమృత్యుకఠోర
 వికటపాండుర శుష్కవదన దంష్ట్రాగ్నిలో|| (కృష్ణపక్షం)

"నైదాఘతీక్ష్ణ భ్ణానుభీకరకరానలచ్చట"
"అనంతశోక భీకర తిమిర లోకైకపతిని"
"వెక్కి వెక్కి రోదింతును"
"ఏడ్చివైతు ఎలుగెత్తి ఏడ్చివైతు"

ఈ తీరుగా యేడవకుండానే యేడుస్తానన్నట్లు శబ్ధవాచ్యత అనే దోషానికి కృష్ణపక్షకర్త తనకృతులను గురి చేశాడు.

"ప్రణయమేలోకమై పరగిన చోట
 ప్రణయ శకుంత దంపతులమై మనము
 ప్రణయలీలామృత రసతరంగముల
 ప్రణయడోలా పరంపరల మధ్యమున
 ప్రణయాన దోగుచు ప్రణయగీతములు
 ప్రణయంబు పల్లవింపఁగఁ బాడుకొనుచు
 ప్రణయ రూపానంద భాగ్యంబు గాంచి
 ప్రణయ శాసనమున ప్రణయ రాజ్యమ్ము
 పాలింతమికరమ్ము ప్రణయాధినాథ" (యేకాంతసేవ)

అని శబ్దవాచ్యతతో పులిమినారు ఇందులో 7 ప్రణయలు వదిలిపెట్టి తక్కినవి వ్రాశాను. అయోమయం, పులుముడు, శబ్దవాచ్యతచేరి కవిత్వం పోగలిగినంత అధమదశకు ఈ పంక్తులు పోయినవి. ఈ తీరును యీపని యీ కాలపుకృతుల్లో మిక్కుటంగా కనబడుతున్నదని. యిది వివేకం మాలిన పని అని చెప్పి యీ ప్రస్తావన చాలిస్తున్నాను.

"బహుళ పక్షపు రాత్రినిబోలి చెవులకు పుర్రెలు వేలాడుతుండగా పురుషుల పేగులు మొలతాడుగా తాటకి నిల్చున్నది" అన్నప్పుడు యెవరెంత వద్దని చెప్పినా అది భయంకరంగా వున్నదను కొంటాము. కాని కృష్ణపక్షకర్త

"శోకభీకరతిమిర లోకైకపతిని"
"ప్రళయ ఝుంఝూ ప్రభంజనం స్వామిని"

అని అంటే యెవరెంత చెప్పినా, ఆయన ఆస్వామి అనిలభీకరపతి అని అనుకోలేకుండా వున్నాను. యెందుకంటే ఆయన యెందుకు ప్రభంజనస్వామో యెట్లా భీకరపతో తెలియదు. కనుక వీటిని దండగ మాటల శబ్దవాచ్యత అంటున్నాను. ఇక మధురత్వం మంజులత్వం వున్నచోట్ల మధురం, మంజులం దివ్యం అని మధురపైన మంజుల, మంజులపైన కోమల, కోమలపైన కమ్రవేస్తుంటే నేను తెలివిగలవాడను నేను మేధావంతుడను నేను గొప్పవాణ్ని అని చెప్పుకొన్నప్పటివంటి వెగటుపని గనుక అది వెగటు శబ్దవాచ్యత అంటున్నాను. ఈ ఉభయ విధ శబ్దేవాచ్యతలు ఈకాలపు కృతుల్లో వున్నవి. ఇంకొక మాట చెప్పి యీ విషయం ముగిస్తున్నాను. ప్రణయమనేది కేవలం స్త్రీ పురుషుల అన్యోన్యాభిలాషకు వాచకమని నేటి కృతికర్తలనేకులు అనుకొంటున్నట్లు కనబడుతున్నది. ప్రణయమంటే ప్రీతిపూర్వకమైన ప్రార్దన. సాధారణంగా ప్రేమ, స్నేహం అని అర్ధం అంతేగాని స్త్రీపురుషులకు ప్రత్యేకించి వుంటే స్నేహం మాత్రమేగాదు. సాధారణస్నేహం ఇది సాధారనంగా అనేక స్థలాల్లో నాయక వ్యవహారంలో కోపంతో అనుబద్ధమై వుంటుంది. "మానోపిప్రణయేర్ష్యయోః" అని దశరూపకారుడు ప్రణయమానమని ఈర్ష్యామానమని మానం రెండు విధాలని అభిప్రాయం కోపపరతంత్రులైన నాయకులబెట్టు ప్రణయయమానం

"ప్రేమపూర్వకవశీకారః ప్రణయః" అనిధనికుడు ప్రణయాన్ని భంగం చేసేమానం ప్రణయమానం. ఇదే ప్రణయకోపం

"త్వామాలిఖ్య ప్రణయకుపితాం" (మేఘ) అని కాళిదాసు

"ప్రణయ కుపితాం దృష్ట్యా. అని వాక్పతిరాజు (దశరూపక వ్యాక్యలో ఉదాహృత్రం)

"ప్రణయకుపితయోర్ద్వయోః" (సంస్కృతచ్ఛాయ)

అని దశరూపక వ్యాఖ్యలో ఉదాహృతం

ప్రణయమనేది కేవలం స్త్రీ పురుషుల స్నేహమే గాదు. సాధారణస్నేహం. స్త్రీ పురుషుల ప్రీతిమాత్రం గాదు. సాధారణ ప్రీతి అయితే యెక్కువైన ప్రేమను ప్రణయమంటారు. 'ప్రేమనీతం ప్రకర్షం చేత్ తదా ప్రణయ ఉచ్యతే" అని అభియుక్తోక్తి. ఇది స్త్రీ పురుషుల ప్రేమకు మాత్రం సంబందించింది గాదని యిదివరకే తెలిపినాను. కాని యిది తక్కిన ప్రేమలనువలె స్త్రీపురుషులకు సంబందించిన ప్రీతిని సయుతం తెలుపుతుంది. గనుక ఆ అర్ధంలో సయితం పీతిప్రభృతి శబ్ధాలనువలె విజ్ఞులు వాడినారు.

"మునిసుతాప్రణయస్మృతిరోధినా
 మమచ ముక్తమిదం తమసా మనః" (శా-6)

(శకుంతలా ప్రణయాన్ని ప్రీతిని స్మరించకుండా చేసే తమస్సు నుండి నా మనస్సు విడుదల పొందింది) అని

"మయ్యేవ విస్మరణదారుణచిత్తవృత్తౌ
 వృత్తం రహః ప్రణయమప్రతి పద్యమానే" (శా-5.)

(రహస్యంగా జరిగిన ప్రణయాన్ని (స్నేహాన్ని) తెలుసుకోలేని విస్మరణదారుణచిత్తవృత్తుడనైన నాయందే) "భర్తృభిః ప్రణయసంభ్రమదత్తాం" (కిరా)

(భర్తలు ప్రేమాదరాలతో యిచ్చిన) యిట్లా ఔచిత్యవేత్తలక్కడక్కడ వచించడం కనబడుతున్నది. కాని యిది స్త్రీ పురుషులకు సంబందించిన ప్రేమనుమాత్రం తెలిపే శబ్దంగాదని చెప్పుతున్నాను అందుకే

"అపి ప్రసన్నం హరిణేషు తే మనః
 కరస్థదర్భప్రణయాపహారిషు" (కుమా)

(చేతిలోని దర్భలను స్నేహంతో అపహరించే జింకల మీద నీ మనస్సు ప్రసన్నంగా వుంటుందా?)

"కంఠాశ్లేషప్రణయిని జనే" (మేఘ)
 (కంఠాశ్లేషం కోరేమనిషి)

"సత్ర్కియాం విహితాం తావద్గృహాణ త్వం మయోద్యతాం
 ప్రణయాద్బహుమానాచ్చ సౌహృదేన చ రాఘవ" (రాయు)

(ప్రీతితో బహుమానంతో స్నేహంతో చేసే యీ సత్కారాన్ని స్వీకరించు విభీషణవచనం)

"తద్భూతనాధానుగ నార్హసి త్వం
 సంబంధినో మే ప్రణయం విహంతుమ్ . (రఘు.2)

(కనుక ఓ సింహమా! బంధువుడనైన నా ప్రణయం (యాచన) నీవు భంగం జేయదగదు)

"సాహి ప్రణయవత్యాసిత్ సపత్న్యోరుభయోరపి" (రఘు 10)
     (సుమిత్ర సవతులిద్దరి మీదా ప్రేమవతిగా వున్నది)

"అప్యనుప్రణయినాం రఘోఃకులే నవ్యహన్యత కదాచిదర్ధితా"

రఘు. 11)



(ప్రాణాలు యాచించేవారికోరిక గూడా రఘుకులంలో ఒకప్పుడూ సఫలీకృతంగా లేదు)

"తథేతి తస్యాః ప్రణయం ప్రతీతః
 ప్రత్యగ్రహీత్ ప్రాగ్రహరో రఘూణామ్. (రఘు 16)

(రఘువుల్లో శ్రేష్ఠుడైన కుశుడు అపురాధి దేవత యొక్క యాచనను అట్లానేనని సంతుష్టుడై స్వీకరించాడు)

"స్రోత్రోనహం పది నికామజలామతీత్య
 జాతః సఖే ప్రణయవాన్ మృగతృష్టికాయామ్. (శా 6)

(దోవలో బాగా జలం వున్న యేటిని దాటివచ్చి ఓ మిత్రుడా యెండమావి మీద ప్రీతిగలవాణ్ని అయినాను)

"సకల ప్రణయమనోరథసిద్ది శ్రీపర్వతో హర్షః" (హర్ష)

(సకలార్ధుల మనోరధసిద్దికి (మల్లికార్జునని వాసమగు) శ్రీశైలమైన హర్షుడు) అని యిట్లా యెన్నో వున్నవిగాని విస్తరభీతిచేత వదలుతున్నాను. పైన చూపిన తీరును అర్ధవిధులైన కాళిదాసాదులు విశదంజేశారు. కాని యిప్పటివారు ఔచిత్యజ్ఞానం కోల్పోయి ప్రణయమంటే స్త్రీ పురుషులకు సంబంధించిన ప్రేమేనని అనుకొంటున్నట్లు కనబడుతున్నది.

ప్రణయసౌధము (భా--3-3) కాంతనీకంటిరెప్ప లొక్కింతవిచ్చి

అని యిట్లా స్త్రీపురుషుల అన్యోన్యాభిలాషే ప్రణయమనుకొన్నట్లు ఇప్పటివారు ప్రణయాలతో నింపుతున్నారు. వీరిట్లా అనుకొన్నమాటే నిజమైతే అది అజ్ఞానం. అది ప్రీతిపూర్వకప్రార్ధనా వాచకమని సాధారణ స్నేహవాచకమని శృంగారంలో సాధారణంగా మానంతో అనుబద్ధమై వుంటుందని విశదపరచాను. ఇట్లా ప్రణయగీతమని ప్రణయినీగీతమని ప్రణయసౌధమని ప్రణయజానికి అని పేరుపెట్టడమే వెగటు పని. ఇది కేవలం వ్యంగ్యంగావలసిన కావ్యంలో సయితం పుస్తకం నిండా

"ప్రణయశకుంత దంపతులమై మనము
 ప్రణయ లీలామృత పసతరంగముల
 ప్రణయడోలాపరంపరల మధ్యమున

ప్రణయాన దోగుచు ప్రణయగీతముల
ప్రణయంబు పల్లవింపగ బాడుకొనుచు
ప్రణయ రూపానంద భాగ్యంబుగాంచి
ప్రణయ శాసనమున ప్రణయరాజ్యంబు
పాలింత మిక రమ్ము ప్రణయాధినాథ" (యేకాంతసేవ)

అని ప్రణయంప్రణయం ప్రణయమని పులుముతున్నారు
     
"ఏకోపి, జేయతే హంత కాళిదాసో న కేన చిత్
 శృంగారే లలితోద్గారే కాళిదాసత్రయీ కిము"

అని ప్రసిద్ధిజెందిన కాళిదాసు తనకావ్యాన్ని శృంగారకుమారసంభవమని గాని శృంగార మేఘదూతమనిగాని శృంగారశాకుంతలమనిగాని చెప్పలేదు. కాని యిప్పటి కృతికర్తలు కొన్ని పద్యాలువ్రాసి కక్కురితిపడి ప్రణయగీతమని ప్రణయసౌధమని ప్రణయజానకి అని శబ్దవాచ్యతపాలు చేస్తున్నారు. శృంగారశ్రీనాథమని శృంగారకాదంబరి అని అచ్చువేయడం ఔచిత్యరాహిత్యాన్నే విశదంజేస్తున్నవి. శృంగారనైషధమని వుండడమే చింత్యమైవుండగా శృంగారం ప్రధానంగా లేకున్నా శ్రీనాథచరిత్రను శృంగారశ్రీనాథమనడం బాణుడు కాదంబరి అన్న దాన్ని శృంగారకాదంబరి అనడం యీదోషంలోనే చేరుతున్నవి. ఇవన్నీ శబ్దవాచ్యతను ఆపాదించి వెగటూ రోత పుట్టిస్తున్నవి. భవభూతి "కరుణో రసంః"అని "అద్భుతరస:" అని యీతీరున రసాలను శబ్దవాచ్యత పాలుచేసినందుకు సయితం సమకాలపు అనాదరన కొంత యేర్పడివుంటుంది.

కావ్యజిజ్ఞాసలు వెలయించిన కాలంలో రసాదులకు శభ్దవాచ్యత దోషమని భవభూత్యాదులదోషాలవంటివే దోవజూపివుంటవి "రసగంగాధరం, రసార్ణవసుధాకరం" అని యిట్లా సాహిత్యగ్రంథాల్లోను, తక్కినస్థలాల్లో విచారసమయాల్లోను, కావ్యాల్లోను స్థాయి సంచారిభావాలను ప్రదర్శించేటప్పుడు కవులు శృంగారమని వీరమని అద్భుతమని కరుణమని, రోమాంచమని, నిర్వేదమని యెక్కడనో స్ఫుటప్రతీతికి ఆవశ్యమైతే తప్ప ఊరక మాటిమాటికి కక్కుర్తిపడి వెళ్లపెట్టితే శబ్దవాచ్యత అని అసహ్యపడ్డ భారతీయసాహిత్య వేత్తల భావమనోజ్ఞత వాస్తవంగా ఆరాధ్యమై వున్నది.

"రసస్యోక్తిః స్వశబ్దేన స్థాయిసంచారిణోరపి" అని విశ్వనాథుడు ఇట్లానే తక్కినసాహిత్యవేత్త లన్నారు. అందుకే లజ్జను ఎలపడానికి

"జాతా లజ్జావతీ ముగ్ధా ప్రియస్య పరిచుంబనే"

(ప్రియుడు ముద్దుపెట్టుకొనగానే ముగ్ద లజ్జావతి అయింది) అనడం కంటె

"ఆసీన్ముకుళితాక్షీ సా ప్రియస్య పరిచుంబనే" ఇతి లజ్జాయా అనుభావముఖేన కథనే యుక్తః పాఠః

(ప్రియుడు ముద్దుపెట్తుకొనగా ముకిళితాక్షి అయింది అని అనుభావముఖానచెప్పడం యుక్తం) అని సాహిత్యదర్పణకారుడు చెప్పుతున్నాడు. శబ్దవాచ్యతవల్ల వెగటు. భావానికమితత్వం, ఆపతితమై ఆ స్వాదానికి క్షతికలుగుతున్నది. అందుకే

"స్వశబ్దవాచ్యత్వం రసాదిప్రకర్షబోధప్రతిబంధకం"

అని సాహిత్యదర్పణవ్యాఖ్యాత రామచంద్ర తర్కవాగీశభట్టాచార్యుడు తెలిపినాడు.

కావ్యప్రదీపంలో "హా!మాతః" అని కరుణానికి ఉదాహరించిన శ్లోకానికి వ్యాఖ్యవ్రాస్తూ దాంట్లో "ఘర్ఘరమద్యరుద్ధకరుణాః" అనేభాగంలో వున్న "కరుణాః" అనేదానికి "సస్నేహాః" అని అర్ధం వ్రాసి "నాతో రసస్య శబ్దవాచ్యతాదోషః (కా. ప్ర. వ్యా) (అందువల్ల రసానికి శబ్దవాచ్యతాదోషం లేకుండాపోయింది) అని వైద్యనాథుడు వ్రాస్తున్నాడు.

ఇట్లా శబ్దవాచ్యతవున్న సందర్భాల్లో
"............ఆస్వాదానుత్పత్తిర్దోషత్వ బీజమితి సంప్రదాయ"
(ఆస్వాదానుత్పత్తి దోషత్వ బీజమని సంప్రదాయం)

అనికావ్యప్రదీపకారుడు వ్యక్తపరచాడు.

అనుచితమైన శబ్దవాచ్యత రోత అని చెప్పియీవిచారణ ముగిస్తున్నాను.

అనిశ్రీ - ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో శబ్దవాచ్యతాధికరణం సమాప్తం