నేటి కాలపు కవిత్వం/దృష్టివిచారాధికరణం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

దృష్టివిచారాధికరణం.

సంకుచితత్వం

లోకం వివిధప్రకృతులతో విచిత్రమైన వున్నది., కవి తనమనో విభుత్వం వల్ల ఉన్నతాలు ఉత్తమాలు అయిన ప్రకృతుల్లో ప్రవేశించి అంతరవీక్షణం చేసి ఈ ప్రకృతుల ప్రవృత్తులను లోకానికి ప్రసాదిస్తున్నాడు. అందుకే ఉత్తమపాత్రలను లోకానికి ప్రసాదిస్తున్నాడు. అందుకే ఉత్తమపాత్రలను కల్పించి మధ్యమాధమ పాత్రలవికృతత్వాన్ని ఉత్తమత్వస్ఫుటత్వానికి అంగంజేసి వారి రీతులను లోకాభ్యుదయదృష్టితో తెలుపుతున్నాడు. ఈతీరుగా కవి సంసృతిమిక్కిలి విశాలమై ఉన్నతమై వున్నది. ఇప్పటి కృతికర్త లనేకులు "చిన్ననాపొట్టకు శ్రీరామ రక్ష" అని శృంగారం మొదలైనవి యితరుల కెందుకు పోనియ్యవలెనని నాజానకి అని, నాప్రియురాలు అని, నా ప్రేమ అని నన్ను చిటికేసి సావిట్లోకి రమ్మన్నదని తమనే నాయకులను జేసుకుంటున్నారు.

"త్రోవలో దాని (ప్రియురాలి)రసన కంటకొనిపోదు"

(నాయని సుబ్బారావు, భారతి. 1-7)"ప్రియతమావేరు చింతల విడిచి తడవు
 సేయ కిక నన్ను నక్కునజేర్చుకొనుము"

జంధ్యాల శివన్న శాస్త్రి"కన్నులరవిప్పి నే నిన్ను గాంచినపుడె
 ఆర్ద్రహృదయంబుచలియించి యవశమాయె"

(పాపినేని వెంకటేశ్వరరావు)

"నడికిరేయిని కలలోన నాకు నీవు
 కానిపింపంగ మేల్కొంటికలతచెంది" (భారతి 2-7)

"నాదు ప్రేయసిం గూడి నేనడువ"

(పయిడిపాటి చలపతిరావు. భారతి2-11)"భయము నాకేల యింత విశ్వమ్ములోన"

(భ.రామసోమయాజులు ఆంధ్ర హూల్డు 1-2)"ఏల నాహృదయంబు ప్రేమించు నిన్ను" (కృష్ణపక్షం)

"విబుధులెల్లరు నన్ను విడిచిపోయినను
 హితు లందరునునన్ను వేసగించినను
 నాప్రేమభాగ్యంపు నవ్వువెన్నెలలు
 నాపైన ప్రసరింప నాకేమిభయము"

(గ. రామమూర్తి, భారతి 2-11)

ఈతీరుగా వీరి దృష్టి సంకుచితమై వీరికి ఉండదగిన భావాలే మవుతున్నవి. నాజీవితం నాప్రేమ నాజానకి మనమిద్దరమైక్యమౌదామె అని వీరి స్త్రీ తప్ప వీరికి మరివిశాలదృష్టే కనబడదు. లోకం వీరికి అవిదితమై కూపస్థమండూక సాదృశ్యం పొందినారు.

ఆక్షేపం

అవునయ్యా. అని వారిని గురించిగాదు మరి యొకరినిమనసులొ పెట్టుకొని ఆరు అన్నట్లు వ్రాస్తున్నారంటారా?

సమాధానం

అది అసంబద్ధం వారెవరో యెందుకు చెప్పగూడదు? యెందుకు వ్యంగ్యంగానైనా తెల్పగూడదు? ఆమనస్సులో పెట్టుకొన్నది రావణుడూ ఉద్దిష్టనాయిక సీతా గావచ్చునుగదా. అట్టాటి తుచ్ఛరతి సహృదయులకు అనంగీకార్య మని నేను చెప్పవలసినపనిలేదు. కనుకనే కాళిదాసు "కశ్చిత్ కాంతా" అని ఉద్దిష్టనాయకుణ్ణినాయికను తెలిపినాడు. అసలు ఈరత్యాదిభావాలన్నీ అలంబనాన్ని అంటే నాయికను నాయకుణ్ణిబట్టే వుంటవని ముందు నిరూపించబోతున్నాను.

పూర్వపక్షం

అవునుగాని, దోషంకనబడేదాకా గుణి అనే అనుకోవలెను అనే న్యాయమున్నది. కనుక దుష్టనాయకుడని తేలేదాకా ఉత్తమ నాయకుడనే అనుకోవలెను. కనుక "నేను" అని వున్నప్పుడు అతడెవ్వరో ఉత్తమనాయకుడే నని యేల అనుకోరాదు? అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను. అది అసంగతం తెలిసేదాకా గుణి అనుకొంటూవుండడం అనుచితం యేదైనా పదార్ధం విషమని తేలేదాకా అది అవిషమనే అనుకొనడం మూర్ఖత్వమే అవుతున్నది. యెందుకంటే అట్లా అనుకొనితింటే అది నిజంగా విషమైనప్పుడు అనర్థ ప్రాప్తికలుగుతున్నది. కనుక యేమీ తెలియనప్పుడు అది విషమనిగాని అనుకొనకతటస్థంగావుండడమే తెలివిగలపని. అట్లానే మనిషి దోషి అనిగాని గుణి అనిగాని తెలియనప్పుడు గుణి అనిగాని దోషి అనిగాని అనుకొనకతటస్థంగా వుండడం వివేకం అట్లానే "నేను" అన్నప్పుడు ఉత్తముడని గాని మధ్యముడనిగాని అధముడనిగాని అనుకోకుండా వుంటాము కనుకనే ఉత్తమత్వం మధ్యమత్వం అధమత్వం, అనేభావన లేమీలేకుండా, అన్యయానికి సరిపొయ్యే కృతికర్తే నాయకుడని అర్ధం చేసుకొంటాము. పద్యం అనర్థంగా వుండగూడదుగదా. ఆలంబనంలేని రసభావాలు స్థితిహీనమై అనన్విత మవుతున్నవి. యెవరైనా కృతికర్త ఆ "నేను" కు అర్థంతానుగాదంటే యెవరోచెప్పమంటాను. అప్పుడాలంబనం యొక్క మంచిచెడ్డలు విచారిస్తాను.

పూర్వపక్షం

అవునయ్యా ఇదే ఇప్పటివారిస్వేచ్ఛ. పాత్రలను సృష్టించకతమను గురించే వ్రాసుకుంటారు ఇట్లా పాశ్చాత్యులు వ్రాస్తారు; అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను పాశ్చాత్యులు అనేకు లిట్లా ఆత్మ నాయకత్వంతో చాటుపద్యాలవంటివి చిన్నవి పెద్దవి కృతులు వ్రాస్తున్నారని నే నెరుగుదును యెవరువ్రాసినా సత్యాన్ని తిప్పజాలవు. ఇట్లాటివి ఒక తీరుకవిత్వం అంటే నాకు విప్రతిపత్తి లేదు. అనుభవకవిత్వం ఆత్మనాయకకవిత్వం అని యేదో దానికి పేరుపెడతాము. కాని యిదివర కెవరూదీన్ని యెరగరని ఇది కొత్త అని, ఇది స్వేచ్చ అని స్వేఛ్ఛాకుమారుడని ఇది మహాకవిత్వమని అంటే అది కాదని దృష్టిసంకోచమని చెప్పుతున్నాను.

పూర్వపక్షం

అవునయ్యా. వీరు తమతమ అనుభవాలను వ్రాసి పెట్టుతున్నారు. వీరిచరిత్రలు శాశ్వతంగా లోకంలో వుంటవి వెనకటివాండ్ల చరిత్రలు తెలియక చిక్కుపడుతున్నాము గదా. వీరా చిక్కు తొలగిస్తున్నారు. వీరి చిత్తవృత్తి యిట్లాటిదని లోకానికి తెలుస్తుంది అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను మంచిది. చరిత్రలుంటే వుండవచ్చు ఇవి చరిత్రలంటే నాకు విచారణేలేదు. కవిత్వమన్నప్పుడే విచారణ. దేశాన్ని తమఃకూపంలో బడవేసే అవివేకాన్ని నిరోధించి స్వకాలమందలి ప్రజాప్రవృత్తిమీద ఆచరణరూపాన ప్రతిక్రియసాగించే వ్యక్తులు తమఖేదాన్ని తమ అనుభవాలను నిర్వేషంగా భర్తృహరివలె చెప్పవలసిన సమయాలు తటస్థించగలవు వాటికి లోకం అంధం కాజాలదు కాని, రసభావాల పరిపోషం, శిల్పం, వికసితలోకవృత్తప్రదర్శనం, మొదలైన వాటితో విశిష్టమైన కవితా సర్గానికి భర్తృహరివలె లోకప్రవృత్తి విషయమయి ఖేద మోదానుభవం చెప్పడం సంబంధించిందిగాదు. కవితా లోకంలో కాళిదాసు స్థానం భర్తృహరికిలేదు. శక్తిమంతులు అదీయిదీ రెండూ నిర్వహించవచ్చును. లేదా మహాకవులు కాళిదాసాదుల వలె తము సృజించినకవితా లోకంలోనే తమసందేశాలను స్ఫుటంగా వ్యంగ్యంగా పాత్రలద్వారా మధ్యమధ్య స్వీయవాక్యాలద్వారాప్రతి పాదించవచ్చును. భవభూతివలె కవితాభావనలలోనె నూతనత్వాన్ని "ఏకోరస।" అన్నట్లు తెలుపవచ్చుని కాని "నాకు" అని "నేను" అనిమాత్రం తమనే కవులు శృంగారాదులకు నాయకులను జేసుకున్నప్పుడు దృష్టి తప్పక సంకుచితం కాగలదు. ఇవి సొంత చరిత్రలంటే నాకు విచారణేలేదు. యెవరిచరిత్రలు వారు వ్రాసుకొనడానికి యేమీ ఆక్షేపంలేదు. కాని యిదంతా నూతనకవిత్వం ఉత్తమకవిత్వం అంటే, కాదు దృష్టిసంకోచ మంటున్నాను.

నేటి కృతికర్తలపద్యాల్లో ఈసంకుచితదృష్టే అధికంగా కంబడుతున్నది. పోతన, భర్తృహరులవలె తెలిపే ఆత్మదృష్టసత్యాలు లోకశ్రేయస్సుకు కారణమైనవి ఉన్నవేమో నని పరిశీలించాను గాని నాకు కనబడలేదు. ఆవిధపు సత్యాలెక్కడైనా ప్రకటితమైనవేమోనని చూస్తున్నాను అట్లాటి సత్య ప్రకటనానికి ధ్యానాచరణాలు ప్రధాన మవుతున్నవని యిదివరకే తెలిపినాను. ఆసమయంలోనే సత్యస్వరూపం సాక్షాత్కరిస్తున్నది.

యెంకిపాటలు, సుమబాలవంటివి కొన్నిమాత్రమే ఆత్మ నాయకత్వం చేత వచ్చిన సంకుచితదృష్టిలేనివి కనబడుతున్నవి. భక్తివంటి భావనను సయితం శ్రీభాగవతకర్త ప్రహ్లాదాదులకు సమర్పించి లోకానికి ప్రసాదించాడు. ఆలంబనంయొక్క ఉత్తమత్వాదులు శృంగారాదులకువలె కరుణానికీ, భక్తికీ, జడ,శిశు ప్రకృతులమీదిప్రేమ మొదలైన భావాలకు అంతగా ప్రధానంగావు. గనుకనే దాశరథీశతకప్రభృతులు మనకు ఉపాదేయంగా వున్నవి. అదీగాక భక్తికి ఆధారమైన భగవంతుడు సకలకల్యాణగుణసంపన్నుడు శిశుజడప్రకృతులమీది ప్రేమకు ఆధారమైన శిశుజడప్రకృతుల వినిర్మలత్వం ముగ్దసౌందర్యం మొదలైనవి అకలుషితధర్మాలు., కనుకనే వీటికి ఆలంబనంయొక్క ఉత్తమత్వాది విచారణ అంతగా ప్రధానం గాదంటున్నాను. శృంగారాదులకు ఆలంబనమైన నాయకులు నాయికలు కామపశుత్వం లోక నిశ్రేయసవిరోధి అయిన అధర్మపరత్వం మొదలైనవాటికి ఆకరులు తరుచుగా అవుతూవుండడం మనకు విదితమయ్యేవున్నది. కనుకనే భక్తిమొదలైనవి తప్ప శృంగారాదులు ఆలంబన ప్రధానంగా వుంటవంటున్నాను. అందువల్ల లోకంలో యేకదేశంలో వుండే భక్తిమొదలైన వాటివలెగాక సాధారణంగా సర్వమానవప్రకృతిని వశంజేసుకొని అభ్యుదయవినాశాలకు రెంటికి హేతువుకాగల శృంగారాదుల భావాల ప్రతిపాదనంలో కృతికర్త యెంతోవివేకాన్ని బుద్దిపరిణతిని ఔచిత్యాన్ని వినియోగించ వలసివుంటున్నది. అందుకే ఆలంబనవైవిద్య వికాసాలను గోల్పోయి ఉత్తమత్వాదులను ప్రతిపాదించకుండా శృంగారాదులకు తమనే నాయకులను జేసుకొన్న కృతికర్తలు సంకుచిత దృష్టులైరంటున్నాను.

ఆక్షేపం

అవునయ్యా యిట్లాటిదోషాలెన్ని వున్నా ఇప్పటి కాలపుకవిత్వం విలక్షణమైనది. వెనుకటికవులు ఆశ్వాసాలని సర్గలని కావ్యవస్తువును విభజించి పెద్ద పెద్ద కవ్యాలువ్రాసేవారు. ఇప్పటికవులు భావమే ప్రధానంగా చిన్న చిన్న కవ్యాలు వ్రాస్తున్నారు. ఇవి యింగిలీషు లిరిక్సు (Lyrics) నుబట్టి వ్రాసినవి. వీటిలో భావోద్రేకం ప్రభావం ఇవి వెనక మనకు లేవు. ఇప్పటికవుల చినకవ్యా లీలిరిక్కులకు చేరినవి. ఇదే భావకవిత్వం. ఇది కొత్త ఈకొత్తయే ఒకగొప్పగుణం. దోషాలన్నీ దీంట్లో అణగిపోతవి అని అంటారా?

సమాధానం.

చెప్పుతున్నాను, అది అసంభద్ధపుమాట భావకావ్యాలు మనకు చిరకాలంనుండివున్నవి. యెకభావాన్ని ప్రధానంగా ప్రతిపాదించే చిన్న కావ్యాలు మన వాఙ్మయంలో చిరకాలంనుండి వున్నవి. ఈ సంగతి విశదపరచడానికి ముందు ఈ కాలపు కావ్యాల్లో వున్న భాషావ్యతికంచ్చందో వ్యతిక్రమాలను గురించి కొంతవిశదం చేస్తాను.

అని శ్రీ ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో దృష్టివిచారాధికరణం సమాప్తం.