నేటి కాలపు కవిత్వం/పులుముడుఘటనాధికరణం

వికీసోర్స్ నుండి

శ్రీ ర స్తు.

వాఙ్మయ పరిశిష్ట భాష్యం

పులుముడుఘటనాధికరణం.

పులమడం.

నేటి కాలపు కవిత్వంలో పులమడం విశేషంగా కనబడుతున్నది. పులమడమనేది గొప్ప కావ్యదోషం. దీన్ని ముందు వివరిస్తాను. తేలిక రంగులతో కొద్దిగీతలతో గొప్పభావాలను ప్రకటించే చిత్రకారుడివలె. కవి, చెప్పినమాటల అర్థంకంటె ఆమాటవల్ల స్ఫురించే భావ విశేష పరంపర అమేయమై వుండేటట్లు గోచరింపజేస్తాడు.

"ఏవంవాదిని దేవర్షౌ పార్శ్వే పితురధోముఖీ."
 లీలా కమలపత్రాణి గణయామాస పార్వతీ." (కుమా.)

(దేవర్షి నారదుడు పార్వతీపరమేశ్వరుల వివాహప్రశంసచేయగా తండ్రి పార్శ్వాన కూర్చున్న పార్వతి తలవంచి చేత్తో లీలారవిందపు రేకులు లెక్క పెట్టింది. ) అన్నప్పుడు పార్వతి లజ్జా, ఆమాటలు వినడం వల్ల ఆమెకు కలిగిన ఆనందం, ఆమె సౌశీల్యం, వినయసంపదా, ఆత్మనిగ్రహం, భవిష్యత్సంయోగదర్శనచిత్తప్లుతీ, యేతజ్జాతీయమనోవిభ్రమాలెన్నో గోచరిస్తున్నవి.

"అపూర్వకర్మచండాల మయి ముగ్ధే విముంచ మాం,
 శ్రితాసి చందన భ్రాంత్యా దుర్విపాకం విషద్రుమం" (ఉత్తర)

("ఓముగ్ధా! అపూర్వకర్మ చండాలుణ్నైన నన్నిఘవదలు. చందన మనుకొని దుర్విపాకమైన విషవృక్షాన్ని ఆశ్రయించావు" అని రాముడు తొడమీద నిద్రిస్తున్న సీతను జూచి అన్నప్పుడు రాముడి ధర్మపరత్వం సీతావియోగదుఃఖం, ధర్మంయొక్క నిష్ఠురత్వం, లౌకిక సుఖోపలబ్దికోరే వారు ధర్మారాధనలో పొందే ఆశాభంగం, విధియొక్క అజ్ఞాతపరిణామ వికల్పాలూ, ఇట్లా ఒక విశిష్టభావప్రపంచం శ్రోతయొక్క మనః పరిణతిననుసరించి సంకోచవికాసాలుపొందుతూ లీలామాత్రంగా గోచరిస్తుండడం సహృదయవేద్యం. ఇదే కావ్యసౌందర్య విభుత్వం. ఒక వస్తువు యొక్క సౌందర్యమహిమ లభ్యాలభ్యమై దృశ్యాదృశ్య దశయందులీలా మాత్రంగా గోచరిస్తున్నప్పుడు పరమోన్నతి పొందు తున్నది. దీన్నే --

"ప్రతీయమానం పునరన్యదేవ
 వస్త్వస్తి వాణీషు మహాకవీనాం". (ధ్వన్యా)

(మహాకవులవాక్కులలో ప్రతీయమానమయ్యేవస్తువు మళ్లీ వేరేవున్నది.)

"సర్వధా నాస్త్యేవ సహృదయహృదయహారిణః కావ్యస్య సప్ర కారో యత్ర నప్రతీయమానార్థసంస్పర్శేన సౌభాగ్యమ్" (ధ్వన్యా).

(ధ్వనించే అర్ధసంస్పర్శచేత సౌందర్యం లేనటువంటి సహృద హృదయహారికావ్యప్రకారమే సర్వధాలేదు.)

అని సాహిత్యవేత్తలు స్తుతిస్తున్నారు.

ఇట్లా అమేయమై, అమితమై శ్రోతయొక్క పరిణతి ననుసరించి సంకోచవికాసాలు పొందుతూ దృశ్యాదృశ్యదశయందు లీలామాత్ర గోచరమై సౌందర్యపిపాసువుల చిత్తవృత్తికి విశాలావకాశాన్ని ప్రసాదించే కావ్యరచనను సాహిత్యవేత్త లారాధిస్తున్నారు. దీన్నే ధ్వని ఆని కావ్య వేత్తలు చెప్పుతున్నారు. దీని ప్రాధాన్య మిట్లాటిది గనుకనే

"ధ్వని సత్కావ్యముత్తమమ్." (సాహిత్య)

అని విశ్వనాథుడు వినిపిస్తున్నాడు.

ఇంత పరిపాకవంతమైనది గనుకనే దీన్ని భారతీయసాహిత్య వేత్తలు ఉత్తమమయినదంటున్నారు.

"ప్రాప్తపరిణతీనాం తు ధ్వనిరేవ ప్రాధాన్యేన కావ్యమితి స్థితం". (ధ్వన్యా) అని ఆనందవర్ధను డంటున్నాడు.

ఇట్లానే తక్కిన సాహిత్యవేత్త లందరు చెప్పుతున్నారు; కాళిదాసాదుల కావ్యాలీ ఉత్తమత్వాన్నే పొందివున్నవి. ఆకాలంనాటికి వికసితమైన సర్వవిజ్ఞానం బలప్రదమై వుండగా సర్వభావాలకు మొదట వశుడై పిమ్మట సర్వభావాలను వశంచేసుకొని సత్వతేజస్సుతో వెలసే దశయందే ఈఉత్తమకవితాసిద్ధి కలుగుతున్నది, ఇట్లాటి కవితాదశ సర్వ --లోనే కాళిదాసాదుల కేకొద్దిమందికో తప్ప మిక్కిలి అరుదుగా గోచరిస్తున్నది. కనుకనే--

"నరత్వం దుర్లభం లోకే విద్యా తత్ర సుదుర్లభా,
 కవిత్వం దుర్లభం తత్ర శక్తి స్తత్ర సుదుర్లభా." (అగ్నే.)

అని ఆగ్నేయపురాణకారు డన్నాడు.

"యేనాస్మిన్నతివిచిత్ర కవిపరంపరావాహిని సంసారేకాళిదాస
 ప్రభృతయోద్విత్రాః పంచషావామహాకవయ ఇతి గణ్యన్తే"
                                                              (ధ్వన్యా)

(ఈ అతివిచిత్ర కవిపరంపరా చక్రంలో కాళీదాస ప్రభృతులు ఇద్దరు ముగ్గురు లేదా అయిదారుగురు మాత్రమే మహాకవులని పరిగణితులవుతున్నా రు.)

అని అన్న ఆనందవర్ధనుడు ఈ అభిప్రాయాన్నే తెలుపుతున్నాడు.

"కవయః కాళిదాసాద్యాః కవయో వయమప్యమీ,
 పర్వతే పరమాణౌ చ పదార్థత్వం వ్యవస్థితం."

(కాళిదాసాదులూ కవులు, మేమూ కవులమే పర్వతమూ పదార్థమే, పరమాణువూ పదార్థమే.)

అని కవితాతత్వజ్ఞులంటున్నారు.

"పురా కవీనాం గణనాప్రసంగే కనిష్టికాధిష్ఠితకాళిదాసా.
 అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్థవతీ బభూవ."

(కవులసామర్థ్యం గణించేటప్పుడు మొట్టమొదట కాళిదాసు పేరుచెప్పి కనిష్ఠికను గణించారు. కాళిదాసు తరవాత అతనికి ద్వితీయుడుగా వుండదగ్గకవి కనబడలేదు. ఇప్పటివరకూ కనబడలేదు. గనుకనే కనిష్ఠికతరువాతి వేలు పేరులేకుండా అనామిక అని అర్థవతిఅయింది.) అని స్తుతిస్తున్నారు.

"నిర్గతాసు నవా కస్య కాళిదాసస్య సూక్తిషు,
 ప్రీతిర్మధురసార్దాసు మంజరీష్వివ జాయతే" (హర్ష)

మధురసార్ద్రలైన పూలగుత్తులయందువలె నిర్గతమైన కాళిదాససూక్తులయందు యెవరికి ప్రీతి జనించదు?)

అని బాణుడూ,

"కవికులగురుః కాళిదాసః" (ప్రస)
 (కవికులగురువైన కాళిదాసు)}}

అని జయదేవుడూ,

"దాసతాం కాళిదాసస్య కవయః కే న బిభ్రతి." (మధు )

(యేకవులు కాళిదాసుకు దాసులుకారు?) అని గంగాదేవీ ఆ ఉత్తమకవితాస్వరూపాన్ని ఆరాధిస్తున్నారు. అకవిత్వస్వరూపం గోచరించడానికి సయితం అంతటి సంస్కారం బుద్ధికి కావలసివున్నవి. కాని, కాళిదాసాదుల ఆ ఉత్తమ కావ్యాలను అపరిణతులైన బాలవిద్యార్థుల పాలుచేసి వారికి మొదటనే రఘువంశం ఆరంభంచేసి, తరతరాలుగా మనమీకవితా దేవిని నిరసించాము. విద్యార్థి లోకాన్ని వంచించి మనంవంచితులమైనాము.

"తస్మై నమః కర్మణే." (త్రిశం.)

అని భర్తృహరి అన్నట్లు కర్మఫలం మనకు అనుభూతమయింది. ఆ నిరాసానికి ఘోరశిక్షగా కవితాస్వాదనశక్తే జాతికి నశించింది. ఇది వేరేవిషయం. స్థలాంతరంలో దీన్ని పూర్తిగా మిమాంసచేశాను గనుక విస్తరభీతిచేత దీన్ని వదలుతున్నాను. లభ్యాలభ్యమై దృశ్యాదృశ్యదశలో లీలామాత్రంగా గోచరిస్తూ పిపాసువుల చిత్తవృత్తికి ప్రత్యక్షవాక్కులచేత గృహీతమైనప్పుడు మేయమై, మితమై, సౌందర్యతృష్ణను కుంఠితం చేస్తున్నది. కనుకనే "పరిమితస్వరూపాః" అని యిట్లాటి కావ్యబంధాలను గురించి ఆనందవర్థనుడన్నాడు. ఇట్లాభావాన్ని మితంజేసి భావ విభుత్వాన్నితగ్గించేది ఉత్తమత్వంనుండి తప్పక పతితమవుతున్నది. కనుకనే యిట్లాటిదాన్ని మధ్యరకంలో చేర్చారు.

"వ్యంగ్యస్య అప్రాధాన్యే మధ్యమం గుణీభూతవ్యంగ్యమితి గీయతే" (ప్రతాప.) |

(వ్యంగ్యార్థం అప్రధానమైనప్పుడు ఆకావ్యం గుణీభూత వ్యంగమవుతున్నది. అది మధ్యమకావ్యం) అని విద్యానాథు డంటున్నాడు.

భవభూతి

"రే హస్త దక్షిణ మృతస్య శిశోర్ద్విజస్య
 జీవాతవే విసృజ శూద్రమునే కృపాణం.
 రామస్య గాత్రమసి నిర్భరగర్భఖిన్న
 సీతావివాసనపటోః కరుణా కుతస్తే." (ఉత్తర.)}}

అని చెప్పినది గుణీభూతవ్యంగ్యమే అయివున్నది.

రాముడిగాత్రమగు నీకు కరుణయెక్కడిది అంటే, రాముడు నిష్ఠురత్వం, సీతావివాసనపటుత్వం, ధర్మం కొరకు అవలంబించే కాఠిన్యం ఈతీరున శ్రోతృపరిణతి ననుసరించి ఒక భావపరంపర గోచరిస్తుంది. కాని "నిర్బగర్భఖిన్న సీతావివాసనపటోః" అని ఆభావాన్ని సాక్షాత్తుగా విప్పిచెప్పి మితంమేయంజేశాడు.

అయితే ఆమాటలయినా మితంగా సహృదయులకు ఆస్వాద్యంగా చెప్పబట్టి మనోజ్ఞత్వాన్ని సంపూర్ణంగా కోల్పోలేదు గనుక యివికూడా రెండవరకంగా, ఆనందజనకమయ్యే వున్నవి. అందుకే

"రమణీయాస్సనో వివేకినాం సుఖావహాః" (ధ్వన్యా.)}} అని ఆనందవర్ధనుడు గుణీభూతవ్యంగ్యాన్ని గురించి ప్రస్తావించిన సందర్భంలో అన్నాడు. అదిగాక రసాది తాత్పర్యానుసంధానంచేత గుణీభూతవ్యంగ్యంగూడా ధ్వనిరూపం పొందుతున్న దని

"ప్రకారోయంగుణీభూతవ్యంగ్యోపి ధ్వనిరూపతాం,
 ధత్తే రసాదితాత్పర్య పర్యాలోచనయా పునః (ధ్వన్యా)}]

(రసాదితాత్పర్యపర్యాలోచనచేత గుణీతవ్యంగ్యంగూడా ధ్వని రూపాన్ని వహిస్తున్నది.)

అనే పఙ్త్కులవల్ల ధ్వనికారుడు వినిపిస్తున్నాడు.

ఆకాలానికి వికసితమైన విజ్ఞానపరిపాకం బలప్రదమవుతూ, సత్వప్రాధాన్యం కొంత అణగి రజఃప్రాబల్యంతో భావం నడిచేదశలో గుణిభూతవ్యంగ్యరూపమైన ఈమధ్యమకవిత ఉత్పన్నం కాగలదు.

ఈ కాలపుకృతుల్లో ఈ గుణీభూతవ్యంగ్యకోటిలో చేరేవి. కొమాండూరి కృష్ణమాచార్యుల పాదుకాస్తవంవంటివి కొన్ని మాత్రమే కనబడుతున్నవి. వీట్లో సయితం విస్తరం, వికారాలు, అయోమయత్వం, వక్ష్యమాణశబ్దవాచ్యతా, వుంటే దోషసహిత మే అవుతున్న వి. కృష్ణపక్షం, యేకాంతసేవ ఇట్లాటివి గుణీభూతవ్యంగ్యత్వంవద్దగూడా ఆగక ఇంకా దిగిపోయినవి. ఆసంగతి ముందు తెలుపుతాను.

ఈ కాలపు కవిత్వంలో పులుముడుదోషం విస్తరించి వున్నదన్నాను. దాన్ని క విశదీకరిస్తాను.

పులుముడు.

ఇదే నేటికాలపుకృతుల్లో విశేషంగా కనబడుతున్నది. పులమడ మంట యేమో చెప్పుతాను. నిపుణుడైన చిత్రకారుడు సాధ్యమైనంతవరకు రంగులు తక్కువగా ఉపయోగించి అఖండమైన భావాన్ని ప్రకటిస్తాడు. ఆప్రౌఢిమలేని గుజీలిమనిషి పటంనిండా గాఢంగారంగులు వులుముతాడు. గాఢంగా రంగులు పులమడంవల్ల చిత్రసౌందర్యవివేచనం లేనివాండ్లకు ఆపటాలు రంజకంగా వుండవచ్చునుగాని మనం సౌందర్య జిజ్ఞాసువులమైతే పులుముడు రంగులపటాన్ని అధమమని నిరాకరిస్తాము. కృతుల్లోగూడా ఉత్తమకవులు కాళిదాసాదులు కొద్దిమాటల్లో అమేయార్ధాన్ని స్ఫురింపజేస్తారు. చెప్పినమాటల అర్థంకంటె ఆమాటలవల్ల స్ఫురించే భావవిశేషపరంపర అమేయమై గోచరిస్తూ వుంటుంది. తనమాటలను తాము నిల్పుకొన్నా నిల్పుకోకపోయినా

"అల్పాక్షరముల ననల్పార్ధరచన" (బసవ)

అని పాల్కురికి సోమన్న ఉత్తమకవిత్వాన్ని కీర్తించాడు

"యావదర్ధపదాం వాచమేవమాదాయ మాధవః
 విరరామ మహీయాంసః ప్రకృత్యా మితభాషిణః" (మాఘ)

(మాధవుడు కావలసినంతవరకే మాట్లాడి చాలించాడు గొప్పవారు ప్రకృతిచేతనే మితభాషులు ) అని ..

"నైతల్లఘ్వపి భూయస్యా వచో వాచాతిశియ్యతే
 ఇంధనౌఘధగప్యగ్నిః త్విషా నాత్యేతి పూషణం" (మాఘ)

(ఆసంభాషణ కొద్దిదైనప్పటికి విస్తరించివుండేమాటలు దాన్ని అతిశయించలేదు కట్టెలను మండించేదైనప్పటికీ కాంతిచేత అగ్ని సూర్యుణ్ణిమించదు). అని మాఘుడు రెండవసర్గలో మితోక్తుల మహిమను కొనియాడుతాడు.

లోకంలో సయితం సాధ్యమనంత కొద్దిశ్రమతో సాధ్యమైనంత గొప్పపనులు నిర్వహించడం ఉత్తమమార్గమనీ వృథాగా ధనం శక్తి వ్యయంచేయడం అధమమార్గమని ప్రసిద్ధంగానే వున్నది. విశిష్ట భావప్రపంచాన్ని గోచరింపజేసేది ఉత్తమకవిత్వమన్న సంగతి యిదివరకే నిరూపించాను. ఉత్తమమార్గానికి దూరులై గాఢంగా రంగులు పులిమే గుజిలీబ్నొమ్మల కర్తలవలె ఒక్క భావాని కెన్నోమాటలు గుప్పించి అర్థవిభుత్వాన్ని అంతంజేసి మాటలు దండగజేయడం పులమడం. దీన్నే వాచ్య మని అధమ మని భారతీయసాహిత్య వేత్తలు నిరసించారు.

    "వ్యంగ్యస్య అస్ఫుటత్వే అధమం కావ్యం (ప్రతాప)

అని విద్యానాథుడన్నాడు.

"ప్రాథమికానాం అబ్యాసార్ధినాం యది పరం చిత్రేణ వ్యవహారః
 ప్రాప్తాపరిణతీనాం తుధ్వనిరేవ ప్రాధాన్యేన కావ్యమితి స్థితం"

అని ఆనందవర్ధను డంటున్నాడు.

'అధమం యథా" అని

స్వచ్చందోచ్చలదచ్చకచ్చకుహరచ్ఛాతేతరాంబుచ్చటా
మూర్చన్మోహమహర్షిహర్షవిహితస్నానాహ్నికాహ్నాయ నః
భిద్యా దుద్యదుదారదర్దురదరీదీర్ఘా దరిద్రద్రుమ
ద్రోహోద్రేకమహోర్మిమేదురమదా మందాకినీ మందతాం (కావ్య)

(స్వచ్చందంగా పైకిలేస్తూ నిర్మలతీరనిమ్న ప్రదేశాల్లో అచ్చిన్న మైన నీటిసమూహంవల్ల పోతూవున్న మోహంగల మహర్షులచేత సంతొషంతో విహితమైన స్నానాహ్నికాలు గలదీ యెగిరే అద్బుతమైన కప్పలుగల తటాకందరాల్లో విజృంభిస్తున్న గొప్పఅలలచే సాంధ్రమైన మదంగలదీ అయిన మందాకిని మామాంద్యాన్ని పోగొట్టుగాక) దీన్ని యీఅధమకవిత్వానికి ఉదాహరణంగా కావ్యప్రకాశకారుడు మమ్మటుడు కనబరచాడు.

"అపూర్వకర్మచండాలం అయి ముగ్దే విముంచ మాం
 శ్రితాసి చందనభ్రాంత్యా దుర్విపాకం విషద్రుమం" (ఉత్తర)

అని భవభూతి తెలిపిన భావాన్ని

"ఓ మౌగ్ధ్యగుణవిలసిత అయినా సీతా! నేను చండాలుడు సైతం చేయలేని నిష్ఠురకార్యాలు ధర్మంకొరకు ఆచరిస్తున్నాను. అట్లాటి నన్ను లౌకికసుఖోపలబ్దికొరకు ఆశ్రయించి తప్పక వ్యర్ధమనోరధ వయినావు చీ! నేను మహాఘోరపాపిని. అవ్యాజప్ర్రేమతో దుర్గమకాంతారాల్లో నాపాదాలను ఆరాధించిన సీతను విడుస్తున్నాను అహో! సీతా! ధర్మనిష్ఠురతచేత కిరాతుడనైన నన్ను నీవు భ్రాంతివశాన వరించావు" అని యీతీరున వాచ్యంజేసి మాటలు కుక్కడం పులమడం. ఇది కావ్యంలో అధమమార్గం.

"లీలాకమలపత్రాణి గణయామాస పార్వతీ" (కుమా)

అని కాళిదాసు తెలిపిన భావాన్ని "మనోహరలజ్జాలావణ్యసూచకంగా మధుర ప్రణయమనోజ్ఞమైన హృదయంతో దివ్యసౌందర్యవిలిసిత పార్వతి మధురహస్తాబ్జాలతో మధురకమలపత్రాలను మధురంగా గణనచేసింది" అని మాటలు పులమడం అధమకవిత్వం. చిత్తం తమోగుణ బహుళమై పరిణతి హీనమైనప్పుడు ఈఅధమకవిత్వం వెడలుతున్నది. మనజాతికి ఇప్పుడీస్థితే బహుళంగా నాకు కనబడుతున్నది.

ఈకాలపు కృతులనేకాలు ఈఅధమకోటిలోనే చేరుచున్నవి

"మధురమోహనమూర్తి మందహాసమున
 నద్భుతంబుగ లీన మైనట్టులుండ
 మధురహాసంబులో మాధురీప్రకృతి
 యానంద ముద్రిత మైనట్టులుండె
 మధురచంద్రికలలో మధురామృతంబు
 మధురామృతంబులో మధురరసంబు
 మధురరసంబులో మధురబావంబు
 మధురబావంబులో మధురరూపంబు
 మధురరూపంబులో మధురతేజంబు
 మధురమోహనకళా మహితమైవుండ
 మధురస్వరంబులో మధురగీతములు
 మధురగానంబులో మదిమేళగించి" (యేకాంతసేవ)

అని యీతీరున అయోమయపు పులుముడు యేకాంతసేవనిండా కనబడుచున్నది. ఈతీరుగా యేకాంతసేవలోనే కాకుండా ఈకృతికర్తల రచనలన్నీ యిట్లాటిపులుముడుతోనే విస్తారంగా నిండివున్నవి. యేకాంత సేవలో మొదటనుండి చివరవరకూ అంతా పులుముడు పేరివున్నది వాటిని ఉదాహరించడమంటే పుస్తకమంతా ఉదాహరించడమే గనుక వదలుతున్నాను. ఆనందంతో పాడుతా ననడానికి

"చిత్త మానంద మయమరీచికలసోల
 హృదయ మానంద భంగమాలికలదేల
 కనుల నానంద జనితాశ్రుకణములూర
 జగము నిండ స్వేచ్ఛాగాన ఝురులనింతు"

అని కృష్ణపక్షకర్త యిరవై రెండుమాటలను పులిమినాడు.

"శోకభీకరతిమిర లోకైకపతిని
 కంటకకిరీటధారినై కాళరాత్రి
 మధ్యవేళల జీమూత మందిరంపుఁ
 గొలువుకూటాల నేకాంతగోష్ఠితీర్చి
 దారుణ దివాంధరోదన ధ్వనులశ్రుతుల
 పొంగి పొంగియు నుప్పొంగి పొరలిపోవు
 నావిలాపనిబిడగీతికావళీవి
 రావముల నర్థరాత్రగర్భమ్ము మఱియు
 మఱియు భీషణకాళిమోన్మత్తగాగ"

అని కృష్ణపక్షంలో అయోమయానికి ఉదాహరించిన పద్యాలు"

"కన్నీటి కెరటాల వెన్నెలేలా
 నిట్టూర్పు గాడ్పులో నెత్తావియేలా
 ప్రళయకాలమహోగ్ర భయదజీమూతోరు
 గళఘోరగంభీర ఫెళ ఫెళార్బటులలో మెరపేలా?
 అశనిపాతమ్ములో నంబువేలా
 హాలాహలమ్ములో నమృతమేలా
 ప్రబలనీరంధ్రాభ్రజనితగాఢధ్వాంత
 నిబిడహేమంతరాత్రీకుంతలములలో జుక్కేలా?
 శిథిలశిశిరమ్ములో జివురేలా
 పాషాణపాళిపై ప్రసవమేలా

వికృతక్రూరక్షుధాక్షుభిత మృత్యుకఠోర
వికటపాండురశుష్కవదనదంష్ట్రాగ్నిలో నవ్వేలా?

అని నిదర్శనపరంపరకు ఉదాహరించిన పఙ్త్కులూ పులుమడే అయివున్నవి. ఇదివరకు చూపిన "ఐక్యమౌదామె" "వియోగరాగం" "కవితాంశ" పులుముడు దోషంతో కూడివున్నవి.

"ప్రాజ్యపీఠపురీమహారాజ్యబాగ్య
 లక్ష్మి కొలువుదీర్చు చిరత్న రత్న ఖచిత
 భాసమానకల్యాణ సింహాసనంబు
 అది వెలమ శౌర్యమూర్తిరణావనీవి
 హారవిక్రమ కేళికానంతరమ్ము
 శాంతినుండు విలాసవిశ్రామవేది
 అది సభాసీనసకలబుధావతంస
 ఘనకవీశానవిజ్ఞానకాంతిమత్ప్ర
 సన్నవీక్షణ స్నాపిత స్వర్ణపీఠి
 అది మహీపతిఆమరాయావనీంద్ర
 కరకమల వీజ్యమాన చామరసమీర
 పులకిత భవన్మృదుభూషితంబు"

అని ప్రాజ్య బాగ్య భాసమాన, కల్యాణ, శాంతినుండు, మహీపతి అని ఇట్లా యెన్నో అనావశ్యకశబ్దాల గుప్పించిన పులుముడు కృష్ఠపక్షంనిండా వున్నది.

"శారదశర్వరీమధురచంద్రికసూర్యసుతాస్రవంతికా
 చారు వినీల వీచిక ప్రశాంతనిశాపవనోర్మి మాలికా
 చారితనీపశాఖికకృశాంగిని గోపిక నేను" (కృష్ణపక్షం)

అని యీమాదిరి వున్నవన్నీ పులుముడే అయివున్నవి. సాధారణంగా ప్రాకృతస్త్రీలూ హీనులు పోట్లాడేటప్పుడేమీతోచక పొతే నోరువిప్పి పుట్టేదాకా అడ్డగోలుగా తిట్టుమీద తిట్టు పదితిట్లు తిట్టి వూరుకుంటారు. ఈధొరణే యేకాంతసేవలోను ఇంకా ఈకాలపు అనేకకృతుల్లోను కనబడుతున్నది.

"ప్రేమాలయంబులో ప్రియు డాడువేళ
 ప్రేమడోలికలలో ప్రియు డూగువేళ
 ప్రేమామృతాబ్ధిలో ప్రియుడీదువేళ (యేకాంతసేవ)

యేమితోచకపోతే 'పాడిందేపాటరా' అనికొంతసేపు మాటలు దండగబెట్టే పద్యకర్తల ధోరని యిది. కృష్ణక్షంలోని

"చిత్తమానంద మయ మరీచికలసోల
 హృదయ మానంద భంగమాలికలదేల
 కనుల నానందజనితాశ్రుకణములూర".

అనే పంక్తుల ధోరణిగూడా అదే

విస్తరదోషంకింద నేను ప్రస్తావించిన కూచి నరసింహకృత వనవాసిలోని పాత్రల ఉపన్యాసాలు. రామరాజులోని పటాను అంత్యోపన్యాసం బళ్ళారి కృష్ణమాచార్యుల సారంగధరాదుల్లో అదికప్రసంగాలు అన్నీ పులుముడే అయివున్నవి.

ఉత్తమకావ్యాలు సయితం నన్నయ ఆరంభించిన పద్యాల్లోకి దిగేటప్పటికి పులుముడు పాలై చెడిపోయినవి. ఈ సంగతి ప్రథమఖండంలో మీమాంసచేశాను. గనుక యిక్కడ వదలుతున్నాను అమేయమై. అమితమై శ్రోతయొక్క పరిణతి ననుసరించి సంకోచవికాసాలు పొందుతూ దృశ్యాదృశ్యదశయందు గోచరమై సౌందర్యపిపాసువుల చిత్తవృత్తికి విశాలావకాశం కల్పిస్తూ భావప్రపంచాన్ని ప్రసాదించే ఉత్తమకావ్యరచన అనేక కారణాలచేత లుప్తమయిపోయి వాచ్యరచనమాత్రం మనకు నేటికాలాన మిగిలింది.

ఈవాచ్యదశను దాటిని కృతు లీకాలపువి మిక్కిలి అరుదుగా నాకు కనబడుతున్నవి పులమడానికి ఉదాహరణాలు చూపడమంటే కృతులను సంపూర్ణంగా ఉదాహరించడమే అవుతుంది గనుక ఆపని యిక మానుతున్నాను అసలు గుంపుగణం ప్రకాశగణం, దండగ్గణం మొదలైన వన్నీ వికృతం చేస్తుండగా నన్నయతో ఆరంభమైన ఆంధ్ర పద్యాలే ఆదినుండి పులుముడు దశతో అధమంగా వస్తున్నవి. అయితే ఆగణాలు మాత్రం శ్రీనాథకృతుల్లోవలె కృష్ణకర్ణామృతాదుల్లోవలె కొంత తగ్గి నేటికీ ఆ పులుముడుమాత్రం స్థిరంగా వున్నది. గుంపుగణం మొదలైనవాటిని ప్రథమఖండంలో వివరించాను గనుక యిక్కడ తెలపక వదలుతున్నాను. ఉత్తమత్వ మట్లావుంచినా, ఈఅధమమైన వాచ్యత్వదశను దాటి మధ్యదశకువచ్చిన కావ్యాలే తెలుగులో అరుదని నే ననుకొంటున్నాను.

అని శ్రీ ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో పులుముడుఘటనాధి కరణం సమాప్తం