నేటి కాలపు కవిత్వం/దోషసామ్యాధికరణం

వికీసోర్స్ నుండి

శ్రీగణేశాయనమః.

వాఙ్మయ పరిశిష్ట భాష్యం

దోషసామ్యాధికరణం

అవునయ్యా. బంగాళీల్లో, పాశ్చాత్యుల్లో ఇట్లాటివి వున్నవి. వాటిని చూసి మీరు వ్రాశారేమో బంగాళీలో ఇంగిలీషులో వుంటే అవి మంచివి కదా వాటిని చూసి వ్రాసినవి గూడామంచివే కావలెను అని అంటారా! చెప్పుతున్నాను అవును వాటిని చూచి మీరు కొన్ని వ్రాసి వుండవచ్చును.

మనదేశంలో పేరు చెప్పకుండా యితరుల అభిప్రాయాలను వాక్యసంచయాలను రచనలను తాము వ్రాసినట్లు వ్రాసి ఆత్మవంచనా లోకవంచనా చేయడం తరుచుగా కనబడుతున్నది. దానికి ఉదాహరణ చూపుతాను. గొల్లపూడి శ్రీరామశాస్త్రిగారు రసవిచారమని భారతి సంచిక 3 సం 1 లో ఒక వ్యాసం వ్రాస్తూ

ఇక నాట్యమునందు శాంతమునకు స్థానము లేదనువారి మతమును గురించి చర్చించెదము గాక. భారతాదులు శాంతమునకు స్థాయి భావనిరూపణ మొనరింపలేదు. కనుక శాంతమును రసములలో పరిగణించుటకు వీలులేదని కారణము చెప్పుటకు వలను పడదు. ఆయన నిర్వేదము శాంతమునకు స్థాయియని నుడివియున్నాడు. నాట్యమునందెనిమిదిరసములని చెప్పిన మమ్మటాచార్యుడును

"నిర్వేదస్యామంగళప్రాయస్య ప్రథమమనుపాదేయ
 త్వే౭పి ఉపాదానం వ్యభిచారిత్వే౭పి స్థాయిత్వాఃభిధా
 నార్థంతేన నిర్వేదస్థాయిభావః శాంతోపి నవమోస్తి రసః

అని వచించియున్నాడు. పోనీ శాంతమునకు విభావాది సామగ్రి గలదా అని యందురా? కలదు. వైరాగ్యపరమేశ్వరాను గ్రహసత్పురుష సేవాదులు విభావములు యమనియమాదులను భావములు. మతిస్మృతి చింతాధృతి వితర్కాదులు సంచారి భావములు అయినను సర్వజనా దరణీయము కాకపోవుటచే నశ్లాఘ్యమందురా? రాగద్వేష కలుషితాంతః కరణులగు వారికి రుచింపకపోయినను వీతరాగులకు ప్రేమాస్పదమే గదా. రాగద్వేష కలుషితులకు రుచింపమి హేతువు నంగీకరించెదమేని శృంగారము వీతరాగులకు రుచింపక పోవుటచే నద్దానికిని ఆంక్ష అనివార్యమే అగును. కనుక రసములు తొమ్మిదని స్పష్టపడుతున్నది. ఈ శాంతరసము శ్రవ్యమునందు అంగీకరింపబడినను అభినేయమగు నాట్యమున నిషిద్దమే కదా అను నాక్షేపమునకు సమాధానము మిగిలివున్నది. ఇద్దానికి జగన్నాధపండితులు చెప్పిన జబాబెంతయు శ్లాఘాపాత్రమగుట దాని నిట వివరించెదగాక"

అని వ్రాశారు. "తొమ్మిదని స్పష్టపడుచున్నది" అనే వరకు వీరు ఆ క్షేపాలకన్నిటికి స్వయంగా సమాధానాలు చెప్పినట్లు, చివరదానికి జగన్నాధుడి జవాబును చెప్పబోతున్నట్లు. ఇదంతా ఈ వ్యాసకర్తే వ్రాసినట్లు మనకు ఈమాటల వలన బోధపడుతున్నది. కాని సత్యం విచారించగా పై ఆక్షేపాలు వికల్పించుకొన్నది గాని వాటికి సమాధానం చెప్పింది గాని, వీరు గాదని స్పష్టపడుచున్నది. రత్నాపణంలో కుమారస్వామి సోమయాజి ఆ ఆక్షేపాలను వికల్పించుకొని సమాధానం చెప్పినాడు.

"నాద్యః నిర్వేద ఏవ" శాంతస్యస్థాయి భావ ఇతి మునినాంగీ
 కృతత్వాత్, తచ్చానేక రససాధారణస్య వ్యభిచారిణః సహతోపి
 అమంగళ ప్రాయత్వేపి సజాతీయాగ్రగణ్యత్వం ప్రాధాన్యేన
 కంచి ద్రసవిశేషం ప్రతి అసాధారణస్థాయిత్వం బోధయితు
 మితి ప్రతిపాదనాత్ తదుక్తం కావ్యప్రకాశే నిర్వేదస్యా

మంగళ ప్రాయస్య ప్రథమ మనుపాదేయత్వే ప్యుపాదానం

                                                

వ్యభిచారి


త్వేపి స్థాయిత్వాభిధానార్థం తేనానిర్వేద స్థాయిభావః శాంతోపి నవమోస్తి రస ఇతి. సద్వితీయః వైరాగ్యాదిసామగ్ర్యాః సులభత్వాత్. తథాహి. వైరాగ్య పరమేశ్వరానుగ్రహ ప్రాచీన కుశల పరిపాకసత్పురుష సేవా వేదాంత విచారాదయో విభావాః యమ నియమాదయోనుభావాః మతిస్మృతి చింతా ధృతివితర్కాదయో వ్యభిచారిణః సతృతీయః రాగద్వేషకలుషితాంతఃకరణా నామచర్వణీయత్వేన అశ్లాఘ్యత్వేపి వీతరాగాణాం తదభావాత్ యది కతిపయాశ్లఘ్యత్వమాత్రేణ రసత్వాత్ ప్రచ్యవేత్త ర్హి వీతారాగాణామశ్లాఘ్య ఇతి శృంగారోపి ప్రచ్యవతా తస్మాన్నవైవ రసా ఇతి సిద్ధం (రత్నా)

అని కుమారస్వామి సోమయాజి రత్నాపణంలో వివరించాడు.

ఈ పంక్తులనే శ్రీ రామశాస్త్రివారు తనవిగా భారతిలో వ్రాశారు. ఇక వీరు ఈ కాలపు వారి రచనలను దొంగిలించి ఈ వ్యాసాన చేర్చిన అంశాలు తెలపడం అనవసరం గనుక ఇంతటితో వదలుతున్నాను.

చివరకు పత్రికల్లో వేసే హస్యాలు కూడా పేరు చెప్పకుండా ఇతరులవి స్వీకరించి తమవిగా వంచన చేస్తున్నారు. "ఆంధ్రపత్రికకు ప్రత్యేకం" అనే శీర్షిక కింద మూడు తమాషాలు కనబడినవని ఆనాడే వెలువడిన తెలగ పత్రికలో యీ తమాషాలే కనబడ్డవి. తమాషాకర్తలు తమాషాల మాతృకలను పేర్కొందురుగాక అని శ్రీ మల్లాది వేంకటకృష్ణశర్మ వారు కలిశకం 5028 మార్గశీర్ష శుద్ధ సప్తమి గురువారం (క్రీ.శ. 1927 డిసెంబరు 1-వ తేది) త్రిలింగ పత్రికలో వ్రాసినదాన్ని చదివినాను. ఇట్లా చిల్లర వ్యాసాలు వద్ద నుండి విషయ ప్రధానమై విచారణల దాకా అనేకులు ఇతరుల వాటిని దొంగిలించి పేర్లు చెప్పకుండా తమదైనట్లు ప్రకటించుకొంటున్నారు. పత్రిక వ్యాసాల్లోనే గాక సాధారణ పద్య కృతుల్లోను, గద్యకృతుల్లోను ఇతిహాసాల్లోను ఈ పని విపులంగా కనబడుతున్నది.

"దుష్టకీర్తనకాంతార దూరగమన
 పాంసుల యగువాక్కు పరిశుభ్రపఱతు నిక
 హరి కథాలాపగంగ రంగమ్మతల్లి
 హేమకల్పకవల్లి సాధ్విమతల్లి"

అని జీవయాత్రలో శ్రీ కంచనపల్లి కనకమ్మవారు తన పద్యంగా వ్రాశారు.

"అసత్కీర్తనకాంతార పరివర్తనపాంసులాం
 వాచం శౌరి కథాలాపగంగయైవ పునీమహే."

అని శ్రీ భాగవతకర్త వ్రాసిన దాన్నే యీమె తనదిగా వ్రాసుకొన్నది. ఆంధ్రుల్లో చాలాకాలం నుండి వున్న యీ పేరు చెప్పకుండా యెత్తి వ్రాసుకొనే పాడు ఆచారం నేటి కాలానా విస్తరించింది. తక్కినవాటిని విస్తర భీతి చేత యిక్కడ ఉదాహరించక వదలుతున్నాను.

సంప్రదాయావిచ్ఛేదానికి విద్యానాథాదుల వంటివారు స్వీకరించిన ప్రసిద్ధ శాస్త్రపంక్తుల విచారణ యిక్కడ ప్రసక్తించదు. ఆ శాస్త్ర గ్రంథాల్లో సయితం సాధారణంగా "ఇతి భాష్యకారః, ఇతివృత్తికార, లోచనకారైరుక్తం తదుక్తందండినా" అని యిట్లా తాము స్వీకరించిన వాటి కర్తలను తెలుపుతూనే వచ్చారు. సూత్రకర్తలు సయితం ఇతరుల అభిప్రాయాలను తెలిపినప్పుడు వారి పేర్లు ఉదాహరిస్తూ వచ్చారు. రఘువంశానికి అన్వయబోధిని వ్రాసిన శారదారంజన రాయలవారు.

"ఇంద్రో వహ్నిః పితృపతి ర్నైఋతిర్వరుణోనిలః
 ధనదః శంకరశ్చైవ లోకపాలాః పురాతనాః"

అనే అగ్ని పురాణశ్లోకాన్ని "అథనయనసముత్థం" అనే శ్లోకం కింద ఉదాహరిస్తూ రాధాకాంతులవారు కల్పద్రుమంలో ఉదాహరించినదాన్ని స్వీకరించానని తెలిపినారు. అగ్నిపురాణంలో దీన్ని శారదారంజనుడు తానే చూసినట్లు ఉదాహరించలేక కాదు. రాధాకాంతు డుదాహరించినది చూసి ఉదాహరించాడు గనుక అట్లా తెలిపి విద్యాకృషి గౌరవం కనబరచాడు. ఇక ప్రకృతానికి వస్తాను.

ఉక్తవిధాన ఇతరుల నుండి రచనలను గ్రహించి వారి పేరు చెప్పకుండా తాము వ్రాసినట్లు ప్రకటించి ఆత్మవంచన లోకవంచన చేయడం మనదేశంలో చిరకాలం కిందనే ఆరబ్దమయి యిప్పుడు మితిమీరి పోయించి. ఇట్లా యిప్పుడు దొంగిలించి అసలు వారిపేరు చెప్పకుండా వ్రాసిన రచనలను రచనైక దేశ-----, తెలియక పోవడం చేత పత్రికల ప్రవర్తకులు కృతిపతులు ఆ వ్రాతలను అట్లానే ప్రకటిస్తున్నారు. అవి కృతికర్తలవనుకొంటున్నారు. ఆర్జవం, సత్య పరాయణత వదలి పరిణతి లేని రచయితల భారతీయ సాహిత్యతత్వానికి అంధులైన పద్యకర్తలు స్వకీయ విచారణలేని వ్యాఖ్యాతలు అనేకులు ఈ తీరుగా బయలుదేరి దేశాన్ని దేశం యొక్క విజ్ఞాన వికాసాన్ని వంచిస్తున్నారు. కొందరు హీందీలో యేదో చూసి ఇది వకకొత్తగా వుంటుందని దీనితో మనం కొంత పేరు సంపాదించవచ్చునని దాన్ని పత్రికలో వేసి సంతొషిస్తున్నారు. బంగాళీలో యేదో చూసి దీనితో కొంతపేరు పొందవచ్చునని దాన్ని పత్రికల్లో పడుతున్నదని నాకు కీర్తి వస్తున్నదని యెవరి బులుపు వారు తీర్చుకొంటున్నారు. గాని అందువల్ల దేశానికి దేశీయులకు దేశ విజ్ఞానానికి జరిగే వంచన తెలిసికొనడం లేదు.

పూర్వపక్షం

అవునయ్యా ,ఇతరులవి యెత్తి వ్రాసుకొంటే యెవరికేమీ హానీ లేదు అది నింద్యంగాదంటే.

సమాధానం

చెప్పుతున్నాను స్వకీయపరిపాక బలం చేత, కృషివశాన, కొన్ని భావాలు, అంశాలు కొందరు పరిణతచిత్తులు ప్రకటిస్తారు. వాటినితరులు యెత్తి వ్రాసుకొనేటప్పుడు వారి పేరు చెప్పడం, చిత్తపరిపాకాన్ని కృషిని గౌరవించడమే కాక విజ్ఞాన ప్రవృద్ధికి హేతువు కూడా అవుతున్నది. అవి వీరిభావాలు, ఇవి వీరు కనుగొన్న అంశాలు, లోకకల్యాణానికి విద్యా వర్థనానికి అనుకూలమైన భావాలను, అంశాలను నేను కొన్నిటిని ప్రకటింతును గాక! అని చోదన కలగగలదు. ఇట్లాటి నూతనాంశాలను కనుగొనడం, భావాలను ప్రసాదించడం విద్వద్గోష్టులో విద్యాభ్యాసం చేసి ధ్యానబలం సమకూర్చుకొన్న పిమ్మటగాని జరగదు. ఈ తీరుగా ఉత్తమ విద్యావ్యాప్తి, నూతనాంశాలు, భావాల ఉపలబ్ది మనకు ప్రాప్తించగలవు. యేమీ లేక పేరు చెప్పకుండా యెత్తి వ్రాసుకోవడం వల్ల చిత్త పరిపాకాన్ని, కృషిని అగౌరవించడమే కాకుండా, నూతనాంశాలు, బావాలు ప్రసాదించే శక్తి జాతికి నశించి విజ్ఞానకృషికుంఠితమై యెత్తి వ్రాసుకొనే దశతోనే అది సమాప్త మవుతున్నది. పేరు చెప్పకుండా యెత్తివ్రాసుకొనడమే విద్య అనుకొనడం వల్ల విద్యావంచన సంభవిస్తున్నది. ఈ తీరుగా విద్యాజాడ్యం తనది కానిది అనడం వల్ల లోక వంచన ఆత్మవంచన ఆపతితమవుతున్నవి.

అంతేకాక భారతీయులము ఆర్యులమైన మనము ఆంధ్రులము స్వకీయమైన భారతీయ సంస్కారం యొక్క మహిమను యెంతవరకు దర్శించాము? ఈ తీరుగా హిందీ, బంగాళీ మరాటీ మనకెన్నాళ్లు శరణ్యం? ఇట్లా అక్కడా యిక్కడా యేదో అపహరించి విద్యాజాడ్యంతో యెన్నాళ్ళు సంచరిస్తాము? భారతీయ విజ్ఞానోన్మేషోద్యమంలో ఇతరుల అంటే బంగాళీలు మరాటీలు మొదలైనవరి యొక్క కృషి ఫలాన్ని పిరికిగా సంగ్రహిస్తుండడం తప్ప ఆ ఉద్యమంలో మనము కార్యకర్తలుగా నిల్వవలసిన యోగ్యత మనకు అవసరం గాదా? అని మనను మనము పరిశోధించుకొనడం ఆవశ్యకమని మనవి చేస్తున్నాను. ఇతర భాషల్లో ఉపాదేయ గ్రంథాలుంటే తర్జుమా చేసి వాఙ్మయాన్ని సంపన్నం చేయవచ్చును. కాని ఆ గ్రంథ కర్తల పేరు చెప్పుకుండా, వాటిని యెత్తి వ్రాసి ప్రకటించడం, అదేవిద్య అనుకొనడం ఆత్మవంచన, విజ్ఞానవంచన, లోకశ్రేయోవంచన అవుతున్నవి.

ఇంతకూ చెప్పదలచిందేమంటే యితరుల రచనలను చూసి పేరు చెప్పకుండా యెత్తి వ్రాసుకొన్నవి అనేకం వున్నవి. నేనిప్పుడు విచారిస్తున్న వనకుమారి, యేకాంతసేవ, యెంకిపాటలు మొదలైనవి పాశ్చాత్యులనుండి బంగాళీల నుండి పేరు చెప్పకుండా యెత్తి వ్రాసుకొన్నవాట్లో అనుకరించినవాట్లో చేరినా చేరకున్నా వాటి అనౌచిత్యాలు, అనౌచిత్యాలు కాకపోవు. పులుముడు, శబ్దవాచ్యత, అయోమయత్వం, అసంబద్ధత, అనుచిత చ్చందస్సు, వికృతభాష, పాత్ర సృష్ట్య భావం చేత ఆత్మ నాయకత్వం చేత కలిగే దృష్టి సంకోచం. చిల్లర శృంగార, క్షుద్రత్వం యివి యెక్కడవున్నా పాశ్చత్యుల్లో వున్నా బంగాళీలలో వున్నా దోషాలేనంటున్నాను. దొషసామ్యమే నంటున్నాను. ఇవి పాశ్చాత్యులకృతుల్లోగాని బంగాళీ కృతుల్లోగాని మరెక్కడనైనా గాని వున్నట్లు మీకు కనబడితే అక్కడక్కడల్లా నా విచారణలు వినిపించవలెనని ప్రార్థిస్తున్నాను. దోషాలెక్కడ వున్నా అవి సిద్ధాంతాలసత్యాన్ని బాధించవు.

అని శ్రీ. ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో దోష సామ్యాధికరణం సమాప్తం.