నేటి కాలపు కవిత్వం/చిహ్నాధికరణం
శ్రీగణేశాయనమః.
వాఙ్మయపరిశిష్టభాష్యం
చిహ్నాధికరణం
పూర్వపక్షం.
అవునయ్యా. నేడు రవీంద్రుడు, మహాత్ముడు, ఇట్లాటి గొప్పవారు ఉద్భవించారు. ఉచ్చదశ మళ్లీవచ్చేటట్లుకనబడుతున్నది. అట్లానే ఆంధ్రదేశంలోగూడా ఈకొత్త పద్యకర్తలు, శుభచిహ్మమని యెందుకనుకోగూడదు అని అంటారా?
సమాధానం
చెప్పుతున్నాను ఆదేశాలమాట నేను చెప్పను. అక్కడి విశ్వవిద్యాలయాల విధానంలో భారతీయసంస్కారం ఇట్లా హీనంగా లేదు. ఆంధ్రదేశంలో అట్లాటి శుభచిహ్నాలకు అవకాశం లేదు. ఇక ముందు కలుగుతుందేమో చెప్పలేను. ఆంధ్రదేశంలో చిరకాలం కిందటనే భారతీయసంస్కారం క్షీణించింది. నన్నయాదులు మనకు ఇచ్చిన భారతాదులు సయితం స్వరూపం గోల్పోయిన వికారాలు నన్నయాదుల భారతం, భాస్కరాదుల రామాయణం భారతరామాయణాల శుష్కాకృతులుగాని భారతరామాయణాలు గావు. ప్రాచీన గ్రంథాల్లో యేపురాణమూ మనకు యథార్థస్వరూపంతో లభించలేదు. నన్నయ తిక్కన యెఱ్ఱాప్రగడ రచించిన భారతకథల సంగ్రహం మూల మహాభారతంయెదుట "అనంతరత్నప్రభవమైన" హిమాలయం ముందు చిల్లరరాళ్ల గుట్టవలె వున్నది.
శ్రీ ఆనందముద్రాలయంవారు ప్రకటించిన శ్రీతేవపెరుమాళ్లయ్య కృతి రామాయణం ఆమూలవాక్యాలతో అక్కడక్కడ కూడివున్నా మూలంయొక్క యథార్థస్వరూపాన్ని చాలామట్టుకు చూపుతున్నది. ఇట్లాటివి స్వల్పసంఖ్యాకాలు మాత్రమే మూలంయొక్క యథార్థ స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నవి. గ్రంథాల యథార్థస్వరూపం దర్శించినప్పుడే వాటిని మనము చదివినవారు మవుతున్నాము. నన్నయాదులు భారతం చదివినామంటామా? మనము భారతం చదవనివారమే అవుతున్నాము. భాస్కరరాదుల రామాయణం చదివెనామంటామా? మనకురామాయణ స్వరూపం గోచరించనిదే అవుతున్నది. ఇక భారతీయ కావ్యకోటిలో అధమాలనదగిన మనువసుచరిత్రాదులచేత కావ్యవిషయాన ఆంధ్రదేశం వంచితమై నేటికి ఆంధ్రదేశం కథాసంగ్రహాల అధమ కావ్యాలదశను దాటలేదు. ఇక ప్రసిద్ధభారతీయ విద్యాస్థానాలు చిరకాలం కిందటనే నశించినవి. మద్రాసు విశ్వవిద్యాలయం వచ్చినప్పటి నుండి పాఠశాలల్లో మనకిజీవం గోల్పోయిన పురాణకథలే యీఅధమ కావ్యాలే సర్వభారతీయ వాఙ్మయం సర్వభారతీయ సంస్కారం అయినవి. సంస్కృతంద్వారా యెవరోకొందరు శిక్షితులైనా అప్రశస్తమైన అభ్యాసమార్గాలవల్ల విద్యాలయాల్లో అనుచితవిద్యాసరణుల వల్ల ఆశిక్షసయితం దేశంయొక్క సాధారణదశను దాటజాలలేదు. విశ్వవిద్యాలయపు అంధతవల్ల భారతీయసంస్కారం సంపూర్ణంగా విద్యాశాలల్లో కుంఠితమయింది. ఆత్మీయసంస్కారం వున్నప్పుడే పరసంస్కారసమ్మేళనం నూతనదృష్టివికాసాన్ని పరసంస్కారాన్ని ఆత్మీయంచేసుకొనగలశక్తిని సమకూరుస్తుంది. లేదా స్వత్వమేనశించి పరసంస్కారదాస్యం సంభవించి జాతికి మూలక్షయమే ఫలమవుతున్నది. మన ఆంధ్రదేశంలో విద్యాస్థానాల్లో భారతీయసంస్కారం నశించిన యీదశలో మనము గర్వించ దగ్గది యేమీ లేదంటున్నాను. ప్రకృతిని గుడ్డిగాను పురుషుణ్ణికుంటి గాను చిత్రించిన ఒకపటాన్ని బందరులో ఆంధ్రులకళాశాలలో వున్న ఒక బంగాళీ గీశాడని అది కొత్తపద్ధతిగా బాగావున్నదని ఒకమిత్రుడు నాతో అన్నాడు. అది సాంఖ్యదర్శనంలో ప్రసిద్ధవిషయమని
"పురుషస్య ధర్శనార్ధం కైవల్యార్ధం తథా ప్రధానస్య
పంగ్వంధవదుభయోరపి సంయోగః తత్‌కృతః సర్గః" (సా. కా)
"అంధేన పంగుః స్కంధమారోపితః ఏవం శరీరారూఢ
పఙ్గుదర్శితేన మార్గేణ అంధో యాతి పంగుశ్చ అంధ
స్కంధారూఢః ఏవం పురుషే దర్శనశక్తిరస్తి పంగు
వన్న క్రియా ప్రధానే క్రియాశక్తిరస్తి అంధవన్న దర్శనశక్తిః"
(గౌ. పా)
(పురుషుడు దర్శనార్థం, ప్రధానం కైవల్యార్థం, పరస్పరం కూడుతున్నారు. వీరిద్దరికి కుంటికి గుడ్డికి కలిగినట్లు సంయోగం కలుగుతున్నది. ఈసంయోగంవల్ల యేర్పడ్డది సృష్టి)అని
(అంధుడు కుంటిని బుజమెక్కించుకొన్నాడు. కుంటివాడు చాపిన మార్గాన అంధుడు నడుస్తాడు. అంధుడి బుజమెక్కిన కుంటిగూడా నడిచినవా డవుతున్నాడు. ఇట్లా కుంటికివలె పురుషుడికి దర్శనశక్తివున్నది గాని క్రియాశక్తిలేదు. అంధుడికివలె ప్రధానానికి క్రియాశక్తివున్నది గాని దర్శనశక్తి లేదు.) అని.
ఈశ్వర కృష్ణసాంఖ్య కారికలోను గౌడపాదభాష్యంలోను వున్న సంగతిని తెలిపి భారతీయసంస్కారం ఆంధ్రులకువుంటే యిట్లాటి నూతన చిత్రాలు బంగాళీలకంటె యెక్కువవా చిత్రించగలరన్నాను.
ఇప్పుడు బారతీయవిజ్ఞానం సంస్కృతభాషలోగుప్తమైవున్నది ప్రస్తుతం భారతీయసంస్కారంతో అంటే సంస్కృతంతో యేమత్రమైనా పాఠశాలల్లో కళాశాలల్లో బహువిద్యార్థులకు పరిచయం కలిగించే విద్యాక్రమం అత్యంతం ఆవశ్యకం. ఉదాత్తవాఙ్మయంగల ప్రసిద్ధప్రాచీన బాషల్లో దేనినైనాపాఠశాలలో గాని కళాశాలలోగాని విద్యార్థి చదివి తీరవలెననే యేర్పాటుంటేనేగాని ఆదశ సిద్ధించదు. మనదేశంలో అట్లాటి శుభచిహ్నాలుగాని సంస్కారోదయ మవుతున్నదనే ఆశగాని లేదంటున్నాను. ఇకముం దేర్పడుతుందేమో చెప్పలేను. బొంబాయి కలకత్తా విశ్వవిద్యాలయాలతో అక్కడి విజ్ఞానోన్మేషంతో ఇక్కడి ఆంధ్రమద్రాసు విశ్వవిద్యాలయాలకు ఇక్కడి సంస్కారదారిద్ర్యానికి సాదృశ్యంలేదు. కనుక మనము మురిసి చంకలు కొట్టుకొనడం అవివేకం, పులుముడు, అయోమయం, చిల్లరశృంగారం, శబ్దవాచ్యత దృష్తిసంకోచం, హీనదశను తెలుపుతున్నవంటున్నాను. ఇట్లాటి క్షుద్రకృతులు బంగాళీలలోవున్నా మరాటీలలో వున్నా హెందీలోవున్నా యెక్కడవున్నా సత్యసిద్ధాంతాలను అతిక్రమించజాలవు. దోషం యెక్కడవున్నా దోషమేగాని గుణంకాదు. పాశ్చాత్యులకు పైనచెప్పినవి గుణమేమోగాని కావ్యప్రస్థానం మహోచ్చదశనందిన భారతీయులకు మాత్రం అవన్నీ దోషాలేనని స్పష్టపరచాను.
అని శ్రీ.. ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర
పరిశిష్టంలో చిహ్నాధికరణం సమాప్తం.