నేటి కాలపు కవిత్వం/ఉపోద్ఘాతాధికరణం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీగణేశాయనమః.

వాఙ్మయ పరిశిష్టభాష్యం

ఉపోద్ఘాతాధికరణం

పూర్వపక్షం

అవునయ్యా. యెంకిపాటలను కృష్ణపక్షాన్ని, యేకాంతసేవ మొదలైనవాటిని వాటి ఉపోద్ఘాతకర్తలు ప్రశంసించారు. కనుక అవి ప్రశస్తమైనవి అని అంటారా?

తటస్థాక్షేపం

ఈ తీరుగా విదితమవుతున్నది. ఈ ఉపోద్ఘాతాలే అప్రశస్తాలు. విషయ విమర్శం చేసే ఉపోద్ఘాతాలు కూడవని కాదు. కాని యివి వేరు మార్గపువి అయివున్నవి. కనుక అప్రశస్తాలన్నాను. ఆ సంగతి వివరిస్తాను. పూర్వ కాలంలో కొందరు కృతివ్రాస్తే రాజులను ఆశ్రయించి ధనం సంపాదించే వాండ్లు. ఈ కాలపు కృతికర్తలు ఉపోద్ఘాత కర్తలను ఆశ్రయించి కీర్తి సంపాదించ యత్నిస్తున్నారు. దీంట్లో ఒక రిజుట్లోగుండా ఒకరు వెళ్ళిపోతున్నారు. ఒకరు రామలింగారెడ్ది వారిచేత వ్రాయిస్తే మరియొకరు నల్లవాండ్ల కంటే తెల్లవాండ్లైతే బాగుంటుందని పెద్ద యెత్తెత్తి అడివి బాపిరాజు ప్రభృతులవలె తెల్లవారిచేత వ్రాయిస్తున్నారు. కృతికర్తలు పొగడడం నిర్వివాదం యెంకి పాటల కర్తమటుకు యెంకిపాటల కర్త వరుసగా తన పాటలు మొదలు విన్నవారిని, బుజాలు తట్టిన వారిని, తనను పొగడిన అనసూయ, సుజనరంజని, జ్యోతి, సాహితి యీ పత్రికల ప్రవర్తకులను శారదను వరసగా నమస్కారాల పాటతో కీర్తించాడు. పాటలు విన్న శ్రీ శ్రీ శ్రీ రాజా వెంకటాద్రి అప్పారావు బహద్దరు గారి వంశం ఆ చంద్ర తారార్కం నిలవవలెనని ప్రార్థించాడు. అభినవాంధ్ర కవి మండలికి తనను గౌరవించినందుకు ఆంధ్ర పండిత మండలికి యొక్కువేశాడు. ఇక ఉపోద్ఘాత రచయితకు నమస్కారాలు ఆగవలసినది లేదుగదా. అన్నిటికంటే చిత్రం తపాలా పెట్టె 110 నెంబరు గల జి.యన్. శాస్త్రి అండు కంపెని అనే కంపెని యజమానులను శ్రీ గంటి సూర్యనారాయణ శాస్త్రివారిని "తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలగు బ్రహ్మశ్రీ గంటి సూర్యనారాయణ శాస్త్రులు గారు తమకు తామై కోరి" అని వ్రాసి చివరన కృతజ్ఞతా సమర్పణం చేశాడు. వీరు తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలౌనా కాదా? అని నా విచారణగాదు. అట్లాటి శాస్త్రవేత్తలైతే సంతోషమే. మన దేశంలో యెందరు తర్క వ్యాకరణ వేత్తలుంటే అంత శ్రేయస్సుగదా. కాని యీ పాటలు అచ్చు వేయించడానికీ తర్క వ్యాకరణ శాస్త్రాలకూ యేమీ సంబంధం లేదు. తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలు గూడా ఈ పాటలను మెచ్చుకొన్నారు అని తనను తాను పొగడు కొనడం ఉద్దేశంగా కనబడుతున్నది. అదే నిజమయితే ఆ వుద్దేశ్యం వ్యర్ధం. యెందుకంటే కావ్య సౌందర్యం తర్కానికి గాని వ్యాకరణానికి గాని సంబంధించింది గాదు అందుకే

"నైనం వ్యాకరణజ్ఞమేతి పితరం న భ్రాతరం తార్కికం."

(కావ్యకన్య తండ్రి అని వైయాకరణుడ్నీ అన్నయ్య అని తార్కికుణ్నీ సమీపించదు)అని బిల్హణుడన్నాడు.

"శబ్దార్థ శాసనజ్ఞాన మత్రేణైవ న వేద్యతే
 వేద్యతే సహి కావ్యార్థతత్వజ్ఞై రేవ కేవలం"

(వ్యాకరణం, తర్కం, చదివితే కావ్య జీవిత స్వరూపం తెలియదు. అయితే కావ్యార్థ తత్వజ్ఞులే దాన్ని కనుగోగలరు) అని ఆనంద వర్ధనుడు చెప్పుతున్నాడు. కాని యీ ఔచిత్య జ్ఞానమంతా కోల్పోయి తన సంతోషాన్ని పట్టలేక తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలు అని పొగడినారు. ఈ తీరుగా యిస్తివాయినం పుచ్చుకొంటి వాయినం అని కృతికర్తలు పొగిడి కొన్ని స్థలాల్లో ఆశ్రయించి తమను పొగిడించుకుంటున్నారు. ఆశ్రయించిన కృతికర్తలను ఉపోద్ఘాతకర్తలు శ్లాఘిస్తున్నారు. లేదా ఆశ్రయించిన దోషానికి వారికండ్ల నీళ్ళు తుడవవలెనని వారిని కొనియాడుతున్నారు. ఈ ఉపోద్ఘాతకర్తలు కృతికర్తల పేరుతో పాటు మా పేరు గూడా కష్టం లేకుండా వ్యాప్తిలోకి వస్తుందని ఉపోద్ఘాతం వ్రాయడమే గొప్ప అనుకొని భువన మోహనలు విశ్వమోహనలు వేసి వ్రాస్తున్నారు. వీరు పొగడడంలో ఒక రిజుట్లో నుంచి ఒకరు వెళ్ళిపోతున్నారు. యెంకి పాటలు ఉపోద్ఘాతకర్త

"కవితా కల్ప ప్రసూనమునందలి"
"కవితాకల్ప ప్రసూన విషయము"
"తేనె వాకలనూరించు"
"దివ్య ప్రసూన రాజములుగాని"
"అమృత ఘటికలు"
"పుష్పరాజములు"
"దివ్య సౌరభ సురభితములై"
"లాలిత్య సౌకుమార్య సౌరభ్యములను వెదజల్లుమంజరులను"
"దివ్య మహిమా విలసితములు. పరిణతీ విలసితములు"

అని శబ్దవాచ్యతాదోషానికి పాలై

"దివ్యమహిమా విలసితములు. పరిణతీ విలసితములు"

అని తప్పులు కూడా వ్రాసి పుష్పాలను వెదజల్లడమే కాకుండా

"ఈ విధములగు దివ్య ప్రసూనముల నర్పించి మనల నానందసాగరమున నోలలాడించుటయును చూడగలిగిన ననుబోటుల జీవితములు ధన్యములు ధన్యములు" అని పొగడ్తలో చివరి మెట్టెక్కినాడు. కావ్యకుసుమావళి ముఖబంధ కర్తయిన్ని మాటలెందుకు "This is the age of Venkataparvatheeswara Kavulu" ఇది వేంకట పార్వతీశ్వర కవుల సమయం అని యీ కాలాన్నే వేంకటపార్వతీశ్వర కవుల వశంచేశాడు. ఇక యేకాంతసేవ ఉపోద్ఘాతకర్త

"నూతనాంధ్ర సారస్వతములో నిట్టి కావ్యము వేఱొక్కటి లేదని నానమ్మకం" అని అన్నాడు.

"శ్రీనాథుని యఖండ చమత్కృతియే యీ కవి కూడా కలిగి యుండెనని తలచెద."

అని బాపిరాజు తొలకరి పీఠిక వ్రాసిన కూల్ట్రేవారు అన్నారు.

"గుణముననింతకంటే శ్రేష్ఠమైన కృతులు మన భాషలో పెక్కులు లేవు. ఈ మహనీయసృష్టిప్రభావమునకును ప్రకాశమునకును జేరినవారిలో నీ కవులు ముఖ్యముగా గణనీయులు.

ఆర్యాంగ్లేయాది వాఙ్మయముల సారములబీల్చి" అని లక్ష్మీకాంత తొలకరి ఉపొద్ఘాతకర్త రామలింగారెడ్డి వారు పొగడుతున్నారు. కనుక ఇట్లా ఆశ్రయించి పొగిడించుకొన్న పీఠికలు, పీఠికలు వ్రాయుడమనే గొప్పపదవి దొరికింది యింతే చాలునని పీఠికాకర్తలు వ్రాసే పొగడ్తలు విచారించదగ్గవి కావు. గనుక ఈ పీఠికలు అవిచార్యమంటున్నాను. మమ్మిక పొగడుతారు గదా అని కృతికర్తలు పీఠిక వ్రాయడమనే అపూర్వ గౌరవం యిచ్చినందుకు ప్రత్యుపకారంగా స్తుతి చేయవలెనని పీఠికాకర్తలు మీరు పెద్దలంటే మీరు పెద్దలని అన్యోన్యగౌరవము ప్రకటించుకున్న యీ ప్రశంసలు విచార్యం గావు.

కృతికర్తలు ఉపోద్ఘాతకర్తలను ఆశ్రయించి స్తుతిస్తే కృతికర్తల కంటే యెక్కువగా ఉపోద్ఘాతకర్తలు దివ్యలు మధురలు ఆనందలు వేసి పొగడుతున్నారు. ఇవి పాటించదగ్గవి కావంటే

సమాధానం

తెలుపుతున్నాను; పూర్వపక్షానికి తటస్థాక్షేపానికి కలిపి ప్రతివచనం చెప్పుతాను. కృతికర్తలందరు ఉపోద్ఘాతకర్తలను ఆశ్రయించారో లేదో పొగిడినారో లేదో చెప్పలేదు. చాలామంది కృతికర్తలు ఉపోద్ఘాతకర్తలను ఆశ్రయించడం నేనెరుగుదును. కొన్ని సంవత్సరాల క్రిందట ఒక కృతికర్త పీఠిక వ్రాయమని నన్ను ప్రార్థించి చాలా పర్యాయాలు నన్ను కలుసుకొని నాకు పుస్తకం యిచ్చాడు. నేను మీకు పనికి వచ్చే పీఠిక వ్రాయలేనని ఆ పుస్తకం చదివి చెప్పినాను. తరువాత కొన్నాళ్లకు ఆ పుస్తకం ఒక ప్రసిద్ధుడి ఉపోద్ఘాతంతో ప్రశంసలతో బయటికి వచ్చింది. ఒక పెద్ద పద్య గ్రంథాన్ని ఆంధ్రీకరించిన పండితుడు ఉపోద్ఘాతం వ్రాయమని నన్ను కోరినాడు. నేను గుణదోష విచారణలు రెండూ చేస్తాను మీ పుస్తకం పంపండి అన్నాను. నాకా పుస్తకం ఆయన పంపలేదు.

నాతో అదివరకు పరిచయం లేని మరివొకరు మా యింటికి వచ్చి అచ్చుపడని తన పుస్తకాన్ని గురించి కొన్ని పంక్తులు వ్రాసియియ్యమని కోరినాడు. తన పుస్తకంలో కొంత వినిపించాడు. ఆ పుస్తకం యొక్క అనావశ్యకత, అనౌచిత్యం, తెలపగా ఆయన ఉపోద్ఘాత విషయకమైన తన కోరికను ఉపసంహరించుకొని పోయినాడు.

ఈ మధ్య కొందరు కృతికర్తలు తన పుస్తకాలను అట్టలు కట్టని వాటిని పంపి ముద్రాలయంలో నుండి యింకా బైటికి రాలేదు. మీ పీఠిక వచ్చేదాకా అట్టకట్టించకుండా వుంటాము. కనుక సాధ్యమైనంత త్వరలో వ్రాసి పంపవలెనని కోరినారు.

"నాపీఠిక మీ ఉద్దేశాలను అనుసరించి వుడవను కొంటాను. కావలెనంటే వ్రాసి పంపుతాను. నాకు వ్యవధి కావలెను." అని ప్రతివచనం వ్రాశాను. వారు మళ్ళీ ఉపోద్ఘాత ప్రస్తావనతో ఉత్తరం వ్రాయలేదు; ఈ తీరుగా పీఠికల కోసం కృతికర్తలు ఆశ్రయించడం సాధారణమైన పనిగా వున్నది. అయితే యెంకిపాటలు యేకాంత సేవ మొదలైన వాటికి ఉపోద్ఘాతాలు ఆశ్రయించి స్తుతించి వ్రాయించినవో కావో నాకు తెలియదు. వారే కారణం చేత వ్రాసినా వారు వ్రాసిన వ్రాతలకు నేను బాధ్యుణ్ణి గాను. సర్వాదేశాలకు సర్వకాలాలకు అన్వయించే సత్యాలతో గర్భితమైన భారతీయ సాహిత్య విచారణలను విశదపరచి నా నిర్ణయాలను తెలిపినాను. అవి అసత్యమని యెవరైనా వాదిస్తే వాటికి సమాధానం వుంటే చెప్పుతాను; లేదా నా మాటలు అసత్యమని ఒప్పుకొని వారి వాక్యాలను వినయంతో శిరసావహిస్తాను. అని మాత్రం మనవి చేస్తున్నాను.

అని శ్రీ.. ఉమాకాన్త విద్యాశేఖర కృతిలో వాఙ్మయ సూత్ర

పరిశిష్టంలో ఉపోద్ఘాతాధికరణం సమాప్తం.