నేటి కాలపు కవిత్వం/తత్త్వార్థాధికరణం

వికీసోర్స్ నుండి

వాఙ్మయపరిశిష్టభాష్యం

తత్త్వార్థాధికరణం

పూర్వపక్షం

అవునయ్యా; యెంకిజీవాత్మ, నాయుడు పరమాత్మ, యెంకయ్య పరమాత్మ, చంద్రమ్మ జీవాత్మ, ఇది వీటి తత్వార్థం. కనుక మీవిమర్శ అంగీకరించ వీలు లేదంటారా?

సమాధానం

చెప్పుతున్నాను;

"ఓరోరి బండోడ వొయ్యారిబండోడ
 ఆగూబండోడా నిల్వూబండోడ?
"లచ్చుమయ్యా నీమచ్చామాయో"
"యెట్లాపోనిస్తివోయి మట్లావోరి చిన్నదాన్ని"

అనే యిట్లాటి వాటికన్నిటికీ తత్త్వార్థం వున్నదనవచ్చును. అదంతా యెందుకు? లంజకొడకా అని తిట్టి దానికి తత్వార్థం వున్నదనవచ్చును. లంజ అంటే ప్రకృతి. కొడుకు అంటే పరిణామం. లంజకొడకా అంటే ప్రకృతిపరిణామమైన ఓమనిషీ అని అర్థం అనవచ్చును.

పరకీయను సాధ్విని నీవు నన్నంగీకరించమని కోరి నలుగురూ తన్నవచ్చినప్పుడు నన్నంటే నాలోవున్న పరమాత్మను. నీవంటే నీలోవున్న జీవాత్మ అని అర్థం చెప్పవచ్చునుగాని అవి తప్పించుకొనే భీరువచనాలని మరికొన్ని యెక్కువ తాడనాలు సంభవిస్తవి. ఇట్లాటి వెర్రివేదాంతాల పేరుతో దేశంలో అనేక దురాచారాలు ధర్మభ్రంశాలు జరుగుతున్నవి.

"అనాథబాలరండానాం కాగతిః పురుషోత్తమ
 అహం వేదాంతిరూపేణ.................

అని యిట్లాటి భ్రష్ట ప్రామాణికవచనాలు సయితం తలచూపుతున్నవి. అంతా ఒకటేనని నీకూ నాకు భేదంలేదని నీవొళ్లూ నావొళ్లూ కలిస్తే అద్వైతమవుతుందని దుష్టకార్యాలందు ప్రవృత్తిసయితం పైమాదిరి వేదాంత దుర్వినియోగంవల్ల తటస్థిస్తున్నది. శ్రీభాగవతంవంటి గ్రంథమే ఆ మార్గాలకు అనేకుల కాధారమైనప్పుడు తక్కిన క్షుద్రాలసంగతి చెప్పవలసినపనిలేదు కృతికర్త ప్రవృత్తినిబట్టి కృతితత్వం నిర్ణయించడం ఉచితం.

కృతికర్తలు ఆచరణచేత విరాగులుగా వానప్రస్ధులుగా తత్వజ్ఞానులుగా వుంటూ యేదైనా పాటపాడి దానికి వేదాంతార్థమంటే వొప్పుకొంటాము. యెందుకంటే వారిచిత్తవృత్తే తత్వజిజ్ఞాస కనుకనె

"సన్నంపుదిడ్డివాకిట పున్నమవెన్నెలబైటా
 కిన్నెరరవము వింటినీ"

అని బ్రహ్మగురుకోటిలో వారుపాడితే వ్యంగ్యం అయోమయంలో పడనంతవరకు యెట్లానో తత్వగ్రహణం అంగీకరిస్తాము. అవి ఒక కామి యొక్క సొంతమాటలైతే మన్మధాలాపా లాడుతున్నా డంటాము. విచార్యమాణమైన యీపాటలకర్తలకు వానప్రస్థత్వంగాని విరాగిత్వం గాని జనకాదులవంటి తత్వపరాయణమైన ప్రవృత్తిగాని ఉన్నట్లు ప్రసిద్ధి లేదు. కృతికర్తల ప్రవృత్తినిబట్టి యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మ పాట మొదలైనవి వేదాంతమన వీలులేదంటున్నాను. యెంకయ్య చంద్రమ్మపాట కర్తయెవ్వరో తెలియనే తెలియదు.

కృతికర్తల ప్రవృత్తితో మనకేమిపని? చంద్రమ్మపాట కర్తయెవ్వరో తెలియదని మీరే అంటున్నారు. కృతిలో తత్త్వార్థముంటే చాలు. అని అంటారా? అది వేదాంతమైతే మాతమ్ముణ్ణి మాకియ్య రయ్యోయేమిటి? నీవు నావల్ల కొడుకునుకంటావు. నా కినాములియ్య మనడమేమిటి? కోడిగూసేసరికి కొంపకెల్లాలి యేమిటి? తోటకునీళ్లు చల్లడమేంది? కులకడమేంది? దీపమార్పడమేందీ? మంచెకింద గొంగడి వేసుకొని తిప్పలుపడడమేంది? వూచబియ్యం బెడతరారో రెంకయ్య యేమిటి? అంటింతచెట్లతో తంటాలుపడలేమేమిటి? తోలుచెప్పులు కుట్టినానే చంద్రమ్మ యేమిటి? ఆకుమళ్లకు నీవు రావేచంద్రమ్మ యేమిటి? కొడుకుకోసం మొక్కుకోవే చంద్రమ్మ యేమిటి? వొంటాముదము దెచ్చి వుడికించి నీకాలు సరిచేసి దరిమేనురారోరెంకయ్య యేమిటి? అప్పు డీపాటలన్నీ అర్ధహినాలై అయోమయంలో బడతవి. చిల్లర శృంగారం తప్పించబోతే అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు అయోమయత్వం అపతితమవుతుంది. అయోమయత్వాదికరణంలో ఈదోషాన్ని వివరించాను. పాటలకర్తల వేదాంతప్రవృత్తి యెట్లావున్నా యిట్లాటిపాటలు పాడేవారు తమపశుకామప్రవృత్తులకు అనుకూలంగా వీటిని పాడడం విశదమైన సంగతి కాదు కూడదు. వీట్లో వున్నది వేదాంతమేనంటే చెప్పుతున్నాను. వేదాంతమని గట్టిగా చెప్పితే నాకిప్పుడు విచారణే లేదంటాను. కావ్యమని శృంగారమని కవిత్వమని అన్నప్పుడే నాకు కావ్యవిచారణ యిక్కడ ప్రసక్తిస్తుంది. అప్పు డిది చిల్లరశృంగారమని క్షుద్రశృంగారమని నిర్ణయించాను. వేదాంత మంటారా? అసంబద్ధపుమాట లాడి యివి వేదాంతమనడం తప్పించుకునే తేలికవుపాయమంటాను. లేదా మరియొక సందర్భంలో వేదాంతవిమర్శ చేసేటప్పుడు దీంట్లో వేదాంతమేమిటి ? ఈవేదాంతం కొత్తదంటారా? కొత్తదయితే యెంతవరకు అసంబద్దత లేకుండావున్నది? భక్తిమతంలో జీవేశ్వరుల రమణీవల్లభ సంబంధం యెంతవరకు ఉచితం? అది యిక్కడయెట్లా విని యుక్తమైనది? దానివల్ల సంభవించే శ్రేయోనర్ధాలేవి? ఈపాటల మతం కొత్తదైతే యెంతవర కంగీకార్యం? అని వేరే విచారణచేస్తాను. ఇది కావ్యమని, కవిత్వమని, శృంగారమని అన్నప్పుడే నాయీవిచారణ ప్రస్తక్తం చేస్తున్నాను. కావ్యవిచారణ చేసి యివి చిల్లరశృంగార మని క్షుద్రశృంగారమని స్పష్టపరచాను.

అని శ్రీ ఉమాకాన్త విద్యా శేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో తత్త్వార్ధాధికరణం సమాప్తం