నేటి కాలపు కవిత్వం/వనకావ్యాధికరణం
శ్రీగణేశాయనమః,
వాఙ్మయపరిశిష్టభాష్యం.
వనకావ్యాధికరణం.
పూర్వపక్షం.
అవునయ్యా, పోనియ్యండి, క్షుద్రంగానియ్యండి, అనౌచిత్యం వుండనీయండి. ఇంగిలీషులో (Pastoral Poetry) పాస్టరల్ పోయట్రీ అని వున్నది . అది చాలాగొప్పది. గొల్లలు మొదలైన పాత్రలుంటారు. ఆవులు, లోయలు మొదలైనస్థలాలు అందులో వర్ణితమవుతవి. ఈయెంకిపాటలు మొదలైనవి అట్లాటివి. కనుక మంచివి. చేలు, కాపులు, కాపుకన్నెలు, మన ఆంధ్రదేశంలో, మనోహరమైన అమాయికజీవితాన్ని ప్రదర్శిస్తున్నారు. జొన్నచేలు, కంకులు, మంచెలు. కాపుకన్నెలవలపులు, విలాసాలు యెవరిని ఆకర్షించవు? ఇది {Pastoral Poetry}పాస్టరలు పొయట్రి కనుక మంచిదంటారా!
సిద్దాంతం.
అది అసంబద్ధం. అవి మంచివిగాదని చిల్లరశృంగారం ప్రధానంగా అనుపాదేయ మని తెలిపినాను. పాస్టరలు పొయట్రి అనే పేరు తిరిగి వినిపించినమాత్రాన వీటి క్షుద్రత్వం యెట్లాపోతుంది? అయినా దీన్ని గురించి వివరిస్తాను. అడవులు లోయలు మనోహరా లన్న మాట నేను తిరస్కరించను. మనుష్యులు రజస్తమస్సుల ప్రవృత్తిచే దూషితమై సంకీర్ణమైన పట్టణాలకంటె ప్రశాంత నిర్మలాలై ప్రకృతి రమణీయమైన అడవులు వాస్తవంగా కవికి ఆరాధ్యాలు. అందుకే వాల్మీకి కాళిదాసు భవభూతివంటి కవులు పట్టణాలను దూరాన వదలి అరణ్యసీమలనే తమ కవిత్వానికి ఆలవాలంచేశారు. తైత్తిరీయా రణ్యకం బృహదారణ్యకం అని ఈతీరున విజ్ఞానానికి సయితం అరణ్య సంబంధం బారతీయ సంప్రదాయం వినిపిస్తున్నది. భారతవర్షాన్ని పవిత్రం జేసిన నైమిశారణ్యం ప్రసిద్దమైనది. వాల్మీకి కవితకు మూడుపాళ్లు అరణ్యమే సీమ. కాళిదాసు కుమారసంభవాన్ని కొండలు, అడవులు వీటి వర్ణనతో ఆరంభిస్తాడు. మహోదాత్తనాయిక అయిన గౌరి కొండకన్నె ఆమెప్రేమ కొండల్లోనే పవిత్రమవుతుంది. శాకుంతలాన్ని కవి అరణ్యంతో ఆరంభించి అరణ్యంలోనే అంతం చేస్తాడు. రఘువంశంవంటి రాజుల చరిత్రలోగూడా కవి ఆదియందు కథ కల్పించి వనసీమలను వశిష్ఠాశ్రమాన్ని నిల్పుకొనితన కవితకు అమృతత్వం కలిగిస్తాడు. యక్షుడికథ కొండల్లో, ఛాయాతరువుల్లో ఆరంభమవుతుంది. విక్రమోర్వశీయ మాళవికాగ్ని మిత్రాలు. కాళిదాసుడి వనప్రకృతిప్రేమను స్ఫుటంగా వ్యక్తపరుస్తున్నవి. ఇంతకూ చెప్పదలచిందేమంటే అడవులను ప్రకృతిని ప్రేమించడానికి క్షుద్రపాత్రలకూసంబంధం అవినాభావరూపమైనదిగాదని. ఉదాత్తనాయకులతోనే భారతీయులు వనప్రకృతిని ఆరధించారు. అదిగాక పరిణతచిత్తులైన ఉదాత్తనాయకులు వనప్రకృతిశోభను ఆస్వాదించే విధం చిల్లరమనుషుల విదానానికంటే భిన్నమైనది. వనప్రకృతిశొభను ఆస్వాదించే విధం చిల్లరమనుషుల విధానానికంటె భిన్నమైనది. వనప్రకృతిశోభలు హృదయాన్ని అధిష్ఠించిన ఉత్తమ నాయకులు కావ్యాన్ని పావనంచేయ బట్టే సీతను ఆడవికిపంపిన పిమ్మట రాముడు దండకలో ప్రవేశించిన సందర్భంలో
"దండకారణ్యమా? ఇది" "ఒకచోట స్నిగ్ధశ్యామా
లై ఒక చోట భీషణాభోగరూక్షాలై ప్రతిస్థలంలో
ఝూత్కృతులచేత ఘోషిల్లేదిక్కులు గలిగి అగస్త్యా
శ్రమ పరిద్గర్తకాంతారమిశ్రాలై పరిచితభూములైన
దండకారణ్యభాగా లివిగో కనబడుతున్నవి"
"అరణ్యకులకు గృహులము స్వధర్మరతులము అయి
జన్మఫలభూతవిషయాల్లో రసజ్ఞులమైన మేము వెనక
నివసిస్తుండిన యీవనమహో! యీనా డెట్లాదృష్టమైనది!"
"అవే యీవిరువన్మయూరాలైన గిరులు, అవే యీ
మత్తహరిణాలైన వనస్థలాలు, అవే యీ ఆమంజు
వంజుళలతలై నీరంధ్రనీపనిచుళాలైన సరిత్తటాలు"
"ఆపర్ణశాలలవద్ద గోదావరీపయస్సులో వితతమైన
శ్యామలతరులక్ష్మితో వానాంతం రమ్యంగావున్నది"
"ఇక్కడనే ఆపంచవటి అయ్యో; వదలిపెట్టి పోతున్నా
పంచ వటీస్నేహం బలవంతానవలె లాగుతున్నది" (ఉ.రా)
అన్న విశిష్ఠభావాల ఉన్మీలనానికి అవకాశం కలిగింది. ఇక కాపు కన్నెలు ఆవులమందలు జొన్నకంకులు మనోహరంగానా అంటే చెప్పుతున్నాను; బ్రాహ్మణుల యజ్ఞశాల లెందుకు మనోహరంగావు? వివిధమైన చిత్రపదార్థాలతో వుంటే కోమటిదుకాణా లెందుకు వర్ణించరాదు. కాపుకావ్యం, గొల్లకావ్యం, బ్రాహ్మణకావ్యం, కోమటికా,వ్యం యెందు కుండరాదు? పోనీయండి? జొన్నచేలు కంకులు స్వభావసిద్ధమైనవి గనుక అన్నిటికంటె మనోహరమైనవంటే ఒప్పుకొంటాను. చాకళ్లు, మంగళ్లు, బోయలు, అన్ని తెగలవారూ వ్యవసాయం చేసుకొని జీవించేవా రెందరో వున్నారు. కాపులు రెడ్లు వ్యవసాయంమాని రాజసేవచేసేవాం డ్లెందరో వున్నారు. అదిగాక తెనాలితాలూకాలొ యెందరో కమ్మవారు పౌరోహిత్యంగూడా చేస్తున్నారని విన్నాను. ఇట్లాటి సందర్భంలో చేలసౌందర్యంతో కాపుకన్నెలను కాపుబావలనే కలవడం అర్థంలేనిపని. బ్రాహ్మణకన్యలు మంగలికన్యలు, కోమటికన్యలు చాకలికన్యలు రెడ్దికన్యలు అందరూ చేనితో సంబంధించివున్నారు. సంబంధించకవున్నారు. కనుక ఒక కాపుకన్నెలు చేలూ అంటే ఆమాట తోసివేస్తున్నాను.
చేలతో కాపుకన్నెలను కాపుబావలను మాత్రమే కలపడం అక్రమం. కులవాచిత్వం లేకుండా పాశ్చాత్యదేశాల్లో చేలపనిచేసేవాండ్ల కందరికీ అన్వయించే Peasant వంటిదిగాదు. కాపుశబ్దం. Peasants (కృషీవలులు) ప్రతిపాదితులు కావడానికి యిక్కడ మనం ఒక్కకులానికి మాత్రం సంబంధించిన కాపుకన్నెలను స్వీకరించడం అనుచితం. ఇది పాశ్చాత్యసరణుల బాహ్యకారాన్ని చూచి చేసే తెలివి తక్కువ పని అంటున్నాను. అవునయ్యా కాపుకన్నెలు పరంపరంగాచేలతో సంబంధించి వున్నారు. ఇప్పటికీ చేలతో సంబంధించిన వారిలో వారిసంఖ్యే యెక్కువ గనుక కాపుకన్నెలనే తీసుకొంటున్నామంటారా? అంటే అనండి.
కాపుకన్నెలను కాపుబావలను గాని అట్లాటి బ్రాహ్మణ్యకన్యలను బ్రాహ్మణబావలనుగాని చిరకాలంనుండి పశువులమందలకు సంబంధించిన గొల్లకన్యలను గొల్లబావలను గాని నాయకులను జేసి యెంకిపాటలవలె కావ్యం వ్రాస్తే ఉదాత్తభావోన్మీలనానికి అవకాశం వుండదని ఇది వరకే విశదంచేశాను. పాశ్చాత్యులు సయితం ఈపాస్టరులు కావ్యాల అప్రధానత్వాన్ని గ్రహించారు.
"Pastoral relying for its distinctive features upon the accidents rather than the essentials of life failed to justify its pretensions as a serious and independent from of art. The trivialtoy of a courtly coterie, it attempted arrogate to itself the position of a Philosophy and in so doing exposed itself to the ridicule of the succeeding ages"
(తన విశిష్టలక్షణాలకు జీవితంయొక్క ప్రధానతత్వంమీద కాకయాదృచ్ఛికమైన అంశాలమీద ఆధారపడే పాస్టరులు కవిత కళయొక్క ఉత్కృష్ఠ స్వరూపంగా స్వతంత్రస్వరూపంగా, ఉండజాలకపోయింది. రాజమందిరమందలి భోగిగణంయొక్క చిల్లరబొమ్మ అయిన యీకవిత తత్వజిజ్ఞాసాగౌరవాన్ని అహంకృతితో పొందగోరి పిమ్మటి తరాలవారి యెకతాళికి గురిఅయింది) అని పాస్టరల్ పొయట్రీ & పాస్టరల్ డ్రామా (Pastoral Poetry and Pastoral Drama) అనే గ్రంథంలో వాల్డర్ డబ్లియు గ్రెగ్(Walter W.Gregg)తెలుపుతున్నాడు. యాథార్థ్య మెరగక (Pastoral) పాస్టరల్ అని యేమేమో అకాండతాండవంచేసి కావ్యక్షుద్రత్వానికి అంధులుకావడం ఆంధ్రులసంస్కార దారిద్ర్యాన్నే తెలుపుతున్నది.
ఇట్లా క్షుద్రపాత్రలశృంగారం ప్రతిపదితమాయెనా అది చిల్లర శృంగారకావ్యమౌతుందని నిరూపించాను. అదిగాక అడవులు కొండలు మొదలైన ప్రకృతిశోభలు క్షుద్రలోకంతో సంబద్ధం కా నక్కరలేదని భారతీయులు కవితకు విజ్ఞానానికి ఆరణ్యసీమలే ఆకరంచేసి ఆరాధించారని తెలిపినాను. కనుక యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మపాటలు ఇట్లాటివి చిల్లరశృంగారపు క్షుద్రకావ్యాలని తిరిగి చెప్పుతున్నాను.
అని శ్రీ. ఉమాకాన్తవిద్యా శేఖరకృతిలో వాఙ్మయసూత్ర
పరిశిష్టంలో వనకావ్యాధికరణం సమాప్తం