Jump to content

నేటి కాలపు కవిత్వం/అనౌచిత్యాధికరణం

వికీసోర్స్ నుండి

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం

అనౌచిత్యాధికరణం

అనౌచిత్యం

ఈకాలపు శృంగారం యీతీరుగా ప్రాయికంగా చిల్లరశృంగారమని అది ప్రతిపాదితమైన కావ్యం చిల్లరకావ్యం క్షుద్రకావ్య మని నిరూపించాను. ఇదిగాక అనౌచిత్యమనే దోషం కూడా యీకాలపు కృతుల్లో కనబడుతున్నది ప్రకృతిభేదాన్ని అనుసరించి చేష్టాసంభాషణాదులను ప్రతిపాదించడం ఔచిత్యం. ఇది చెడినా రసభంగమవుతున్నది. యీసంగతినే

"అనౌచిత్యాదృతే నాన్యత్ రసభంగస్య కారణం"

(అనౌచిత్యంకంటె రసభంగానికి వేరే కారణంలేదు) అని ఆనందవర్ధనుడు చెపుతున్నాడు. ఔచిత్యం చెడితే వైరస్యం కలుగుతుంది. అనౌచిత్యం అందుకే రసభంగ హేతువని సాయిత్యవేత్త లంటున్నారు.

"ఓహో! శ్రీరాముడిహస్తాలకు ఉపచరిస్తున్న యీ
 గోపీధమ్మిల్ల కుసుమమాలలనురచించే ఆఅయోధ్యా
 నగరపు పుష్పలావికలభాగ్య మేమనవచ్చును."
    
"ఆ అయోద్యలో శ్రీరాముడి పదస్పర్శ ప్రతిదినమూ
 అనుభవించే ఆకృష్ణవేణి పుణ్యపరిపాకమహో!
 అలోకసామాన్యంగదా మనోహరమైన రాముడి

      
వేణునాదం చెవులబడగానే పరవశలై పరుగెత్తివచ్చి
ఆయన హృదయాన హృదయం జేర్చి సొక్కే
అయోధ్యాభామిను లెంత తపస్సుజేశారో"

అని వర్ణించేటప్పుడు కృష్ణవేణి మీదిశ్లేష, పుష్పలావికలకృతార్ధత గోపీధమ్మిల్లమనోజ్ఞత్వం, వేణుగానమహిమ, భామినుల పారవశ్యం, ఇవన్నీ యెక్కడికక్కడికి ఆహ్లాదకరంగానే వున్నా కొంచెమాలోచిస్తే యిదంతా అసంబద్ధ ప్రలాపమని తేలుతుంది. కృష్ణానది అయోధ్యలో వుండడమేమిటి? ఉన్నా

"న రామః పరదారాంశ్చ చక్షుర్భ్యామపి పశ్యతి" (వా. రా)

(రాముడు పరదారలను కండ్లతోగూడా జూడడు.)

అని వాల్మీకీ అమృతుణ్ణి చేసిన రాముడికి పరకాంతాస్పర్శమనే వ్యంగార్థమేమిటి? అయోధ్యలో గోపికలేంది? ఉన్నా ఆగోపీధమ్మిల్లాలతో శ్రీరాముడి కేమి పని? రాముడు వేణుగానానికి ప్రసిద్దుడా? అయినా ఆయనమీద భామినులుపడి పరవశలు కావడం మెంత అసత్యం? అని ఆమాటల్లో వుండే అసంబద్ధతలు స్పుటపడతవి. రాముడికి పరకాంతాస్పర్శ అనుచితం. అయోధ్యలో కృష్ణానదివున్నదనడం అనుచితం. ఇట్లానే తక్కినవన్నీ అనుచితాలు. దేశానికి, కాలానికి పాత్రకు, ఉచితంగాని పై అసంబద్ధతలు కొంచెమైనా వివేకం వున్నవాండ్లకు రోతపుట్టించక మానవు. అందుకే అసంబద్ధతతొ నిండిన పైమాటలవంటి మాటలు రసవంతంగావున్నట్లు స్థిరపడడానికి స్థిరమైన బుద్ధిహీనత్వం వుండవలెను. కనుక అనౌచిత్యంవున్నా అది తెలియకుండా ఉండడానికి బుద్ధిహీనత్వం అవసరం. వివేకవంతులకు అనౌచిత్య రోతపుట్టిస్తుంది. దేశభేదం, కాలభేదం, పాత్రభేదం, అవస్థాభేదం వీటి నన్నిటిని వివేకంతోపాలించినప్పుడే కావ్యం ఔచిత్యవంతమవుతుంది. లేదా అనౌచిత్యం పాలై భ్రష్టం కాగలదు. ఈకాలపుకావ్యాల్లో యీ అనౌచిత్యం తరుచుగా కనబడుతునే వున్నది. వనకుమారి అనే ఖండకావ్యంలో ఒకక్షత్రియుడు రాజ్యం గోలుపోయి అడవిలో తనకూతురితో నివసిస్తుంటాడు. తండ్రిని తప్ప ఆపిల్ల మరి యేపురుషుణ్ని యౌవనం వచ్చేదాకా యెరగదు. ఆపిల్ల గొర్రెలుకాస్తూ కొండలోయల్లో తిరుగుతుంటే ఒకక్షత్రియకుమారుడు కనబడతాడు తరువాత కొన్నాళ్లకు యిద్దరూ పెండ్లాడతారు. వనకుమారి తండ్రి చచ్చి పడివున్నసమయాన వనకుమారి ఒకపక్కన నిద్రిస్తుంటే యీక్షత్రియుడు

"సరసీలోలతరంగడోలల శరచ్చంద్రాంశు పూరంబురౌ
 ప్యరమం జిల్కగ బాలశైవలపుదీవల్ గ్రాలు నున్బాన్పునన్
 నెరయందూగు మరాళబాలికవలెన్ నిర్మాయికాస్యంబుతో
 హరిణీలోచన నిద్రవోయెడిని"

అని

"మంజిమజిల్కు కపోలపాళుల జికురములాక్రమించ సరసీరుహలోచన"

అని ప్రియురాలిని వర్ణిస్తాడు వర్ణించి

"ఈ రాజమనోహరాస్యకరిరాజసమంచితయానప్రేమకున్
 భాజనమైధరాభరణ భవ్యసుఖంబుల నెల్ల నేడే సం
 యోజనముం బొనర్తు"

అని అంటాడు.

ఈచావుదశలో ఈతడి మన్నథవికారం మిక్కిలి రోతగదా అందులో "ఆలు గొర్రెలు గాస్తురున్నారడం అవివేకం. రాజ్యమంతా పోయి అడవికి వస్తూ గొర్రెలునెత్తిన పెట్టుకొని రాజువస్తాడనడం అంతకంటె అవివేకం. ఇట్లాటి అప్రశస్తాలు దేశాన్ని పాత్రాన్ని దశను తెలిసికొన్నవివేకంతో వ్రాసిన అంశాలుగావు. ఇట్లానే షేక్స్పియరునాటకాల్లో తండ్రినితప్ప పరపురుషుణ్ని యెరగకుండా వున్న ఒక కన్య కథ వున్నది. అనుకరించవలననే వుత్సాహంలో వనకుమారికర్తకు వివేకంపోయింది. ఇట్లానే మరికొందరు పాశ్చాత్యులను మొదలైనవారికని అనుకరించబోయి పులుముడు అయోమయం చిల్లరశృంగారం వీటితొ కూడిన క్షుద్రకృతులు రచించారు. వనకుమారికర్త యింకా భారతవర్షానికి పాత్రలకు తగని వ్యవస్తా చేష్టలు తగిలించి కావ్యాన్ని అనౌచిత్యంపాలుచేశాడు. దీంట్లో పాత్రలు ఒకరితోనొకరు మాట్లాడేటప్పుడు యేకాంతంగా మాట్లాడేటప్పుడు ఆఅవస్థకు ఆప్రకృతికి తగని అనౌచిత్యాలింకావున్నా గ్రంథవిస్తరభీతిచే చర్చించక వదులుతున్నాను. కూచినరసింహకృతి వనవాసిలో పావకుడు బాల్యంగడవగానే వనంలోకి పోయి సన్యాసిఅవుతాడు. ఇతడికి చిదానందుడు గురువు. వనంలో తిరుగుతుంటే ఒకదేవదూత కనబడతాడు. మర్రిచెట్టుకు చిన్న కాయలుంటే ఆసంగతినిగురించి జిజ్ఞాస ఆరంభిస్తాడు. చిరకాలంనుండి ఉపనిషత్కర్తలు బాదరాయణుడు, బోధాయనుడు, బారతవర్షారణ్యాలను బ్రహ్మతేజస్సుతో నింపిన యెందరో మహాతపశ్శాలులు, తెలిపిన కర్మతత్వం బ్రహ్మతత్వం, జీవాత్మ పరమాత్మల భేదాభేదం, శమదమాది వైరాగ్య సాధనసంపత్తీ యివన్నీ జగద్విదితమై వుండగా యీసన్యాసి అవన్నీ తెలియక లావుకాయ యెందుకు పుట్టలేదనే వేదాంతవిచారణం చేస్తున్నాడు. ఇట్లాటిదాన్నే చొప్పదంటు శంక అని మన ఆంధ్రదేశపువిజ్ఞులు అంటారు. గురువు శిష్యుడికి ఉపదేశిస్తుంటే అదంతావినక బర్రెదూడ చొప్పదంటుతినడంచూచి యింతపొడగుదంటు ఆ కాస్త దూడకడుపులొ యెట్లాపడుతుందని శంకించాడట. ఈమర్రికాయశంక ఆరకంలోనే చేరుతున్నది. ఈసన్యాసి లావుకాయలేకాస్తే మనుషుల మీదపడి చావరా అని మర్రికాయశంకకు దేవదాత సమాధానం చెప్పుతాడుకాని లావాటికాయలుకాసే పెద్దచెట్లెన్నో వున్నవి. బెజవాడలో గవర్నరుపేట రోడ్దుమీద వీటిని చూడవచ్చును. కొబ్బరిచేలకు లావాటికాయలున్నవి ఈ సన్యాసి యెంతటివాడో ఆదేవదూత అంతటివాడు. భారతవర్షకథలో ఇట్లాటి అవివేకి సన్యాసులను చెప్పడం అవివేకం. ఇంతకూ విచారిస్తే వీరు బారతవర్షీయులు కారని తెలిసింది. ఆంగ్లభాషలో హర్మిటును జూచి వ్రాశానని కృతికర్త వ్రాశాడు. పాశ్చాత్యసన్యాసులకు పాశ్చాత్యనామాలేవుంచి వారిని ఆదేశస్థులుగానే చెప్పితే ఉచితంగా వుండేది ఇట్లాటి సన్యాసులవర్ణించిన ఆదేశపు పార్నెలుకవి అనౌచిత్యానికి పాలుగాలేదు. కాని వనవాసికర్త బ్రహ్మ విజ్ఞానంతో విలసిల్లిన నైమిశారణ్యాలవంటి భారతవర్షపు అరణ్యాలను భారతవర్షపు నామాలను ఆయూరోప్పాత్రలకు తగిలించి కావ్యాన్ని అనౌచిత్యం పాలుకావించాడు. ఈదేవదూతా పావకుడా తుషాదుడి యింటికి ఆతిధ్యానికిపొతే వీండ్లిద్దరినీ వంట యింట్లోకిబంపి మెతుకులు మీ అంతట మీరు గీరుకొని తిని నీళ్లుదాగిపోండి అని సేవకుణ్ని వారికి కావలిపంపుతాడు. పదినిమిషాలే తిననియ్యవలెను. పదకొండవనిమిషాన వాండ్లను బైటికి సాగనంపవలెను అని అంటాడు. భోజనంచేసేటప్పుడు కొంద రాలస్యంగా తింటారు. కొందరు తొందరగా తింటారు. నెయ్యి యెక్కడవున్నదో మజ్జిగ యెక్కుడవున్నవో యెట్లా తెలుస్తుంది. ఇట్లాటి ఆతిథ్యం భారతీయులకు అత్యంతం అనుచితం. పాశ్చాతుల్లో రొట్టె ముక్కలు మొదలైనవి అబల్లమీదనె పడివుంటవి ఆబల్లమీదనే గ్లాసుల్లో నీళ్ళుంటవి గనుక యిది సరిపోతుంది కాని దీన్ని బారతీయపాత్రలకు తగిలించడం ఉచితంగాదు. కథలు తర్జుమా చేయవచ్చును. కాని యీతీరుగా గాడిదెకు యెద్దుతోక తగిలించి నట్లు పాశ్చాత్యజీవితానికి భారతవర్షనామాలను స్థలాలను తగిలించి కావ్యాన్ని అనౌచిత్యం పాలుచేయడం వివేకంమాలినపని.

వేంకటపార్వతీశ్వరుల మాతృమందిరం, శ్రీరాం రామబ్రహ్మకృతి వాసంతిక యిట్లానే దేశకాలాలతో సంబంధం లేకుండా అనౌచిత్యం పాలౌ వైరస్యాన్ని కలిగిస్తున్నవి. వైరస్యానికి హేతువులు తెలిపినాను. నేటికాలపుకావ్యాల్లో అందులో ఇంగిలీషుసంపర్కం తగిలినకావ్యాల్లో యీ అనౌచిత్య దోషం హెచ్చుగా కనబడుతున్నది. యెంకిపాటలు మొదలైనవాట్లో అనౌచిత్యం కనబడుతున్నది. అనౌచిత్యం వివరిస్తాను. యెంకయ్య చంద్రమ్మ పాట మొదలైనవాటికి యీవిచారణను అన్వయించుకోవలెను. నాయుడుబావ తోట వ్యవసాయం మొదలైనవి చేసుకునే ఒకజానపదుడు. గురుజనసేవ, విద్యాగోష్ఠి యిట్లాటివల్ల కలిగిన సంస్కారంలేనివాడు.

"రామకుష్టా యని
 సీకటై పోవాలి"
"గోవుమా లచ్చిమి"
"జాము రాతిరియేళ
 సెందురుణ్ణీ తిట్టు
 సూరి యుణ్ణీ తిట్టు
 కూకుండనీదు"

అని నాయుడు మాట్లాడుతాడు సంస్కారంగలవాం డ్లెవ్వరూ ఇట్లా మాట్లాడరు. రామకృష్ణా అని, చీకటై, మహాలక్ష్మీ,మాలక్ష్మీ, జామురాత్రివేళ, చందురిణ్ణి, సూర్యుణ్ణి కూచోనియ్యదు అని యీతీరున అంటారు. చదువుకోని కమ్మకుమ్మరి మొదలైన తెగలవారు పైవిధంగా మాట్లాడుతారు. ఆకోటిలోనివా డితడని కృతి తెలుపుతున్నది. పైమాటలవల్ల చదువు మొదలైనవాటివల్ల కలిగె సంస్కారంలేని మనిషి అని స్పష్టమవుతున్నది.

"తోటకాడేవుండు తొరగొస్త
 నీకోసరమె సెవుతాను.
 వొంకపోగానె మావోడొస్తడమ్మా
 అద్దములో సూత్తుంటె
 సెందురూడా

మద్దెసెంద్రుడెమనకు పెద్దమనిసి
సుక్కెక్కడున్నాదొ."

అని యీతీరున నాయుడిమాటల రకపుమాటలే మాట్లాడే ఈయెంకికూడా చదువు మొదలైనవాటివల్ల కలిగే సంస్కారంలేని మనిషి అని స్పష్టమవుతున్నది ఇట్లాటి అపరిణతుడికీ

"ఒక్క నేనే నీకు నాయెంకీ
 పెక్కు నీవులు నాకు నాయెంకీ.
 ఇన్నిపొంకాలున్న యెంకివే నీవు
 ఇంత నాగుండెలో యిమిడిపో లేదా
 మాటలో మనసులో మంచిలో యెంకి
 సొగసు నీదోసారె అగపడవనాకు"

అనేమాటలు అనుచితం అని ఆపాత్రలదశకు తగనివి. దేశకాలవస్థాప్రకృతులకు విరుద్ధంగావున్నవి. కనుకనె అనౌచిత్యమంటున్నాను. ఇట్లానే నాయుడికోటిలోనే చేరి పరిపాకం లేని నాయికకు

"గాలికైనా తాను కౌగిలీనన్నాడు"
"వోసూపె వోరూపె వోనవ్వెరాజా
 యిన్నింట పోవాలె యెటుసెదిరినాదొ
 అద్దములో నారాజ అంతనీరూపు
 ఇంత ముత్తెములోన ఇరికె నేలాగు"

అనేవి అనుచితాలు. ఈ విషయంలో సహృదయుల అంతఃకరణమే ప్రమాణం. ప్రాకృతులకు పరిణతులకు స్ధూలరూపంలో భేదం యెట్లావున్నా మనః పరిణతిలో మటుకు ప్రస్పుటభేధం వ్యక్తమవుతున్నది. జలం యొక్క ద్రవశిలావాతావస్థలు మెరుపులు మొదలైన భౌతికపరిణామాలు, వాక్కు, వాగ్విశేషాలు అంతఃకరణవృత్తిలీలలు ఇవన్నీ ప్రాకృతులకు అజ్ఞాతంగా గోచరిస్తున్నా స్థూలదృష్టితో ప్రవర్తిస్తుంటారు. కాని పరిణతుల కవి వొక్కొక్కటే అనేకవిధమైన విచారణలకు విషయాలై సత్యాలుతిరిగి ఆభిన్నత్వాలఐక్యం వాయువుయొక్క విభుత్వం, ఆశ్లేషాయోగ్యత్వం ఇవన్నీ పరిణతబుద్ధుల మనో వ్యాపారాల విషయాలు కనుకనే ఇవి ఈయెంకిపాటలనాయకులకు అనుచితమని ఈ అనౌచిత్యం గోరుచుట్టుమీద రోకటిపోటువలె క్షుద్రత్వానికి తోడయిందని చెపుతున్నాను.

పూర్వాపక్షం

అవునయ్యా ,కావ్యంలో

"భటవృత్తివాడవై పల్కితి విట్లు
 కామభూపతిపాద కమలంబులాన
 కరిచేత త్రొక్కింతు గట్టిగా నిన్ను
 భట్టువాడవుగాన బ్రతుక నిచ్చితిని.

  ...... ........ ........ ......... .........
 మశకాళితేనెలో మడిసినరీతి
 మిడుతలు చిచ్చులో మిడిసిపడ్డట్లు
 మాచేత చచ్చును మన్నీలుబలము" (పల్నాటివీరచరిత్రం)

అని నాయకురా లన్నట్లు శ్రీనాథుడువ్రాశాడు. అయితే నాయకురాలు ఆభాష మాట్లాడిందని యెవరనగలరు? కవి అట్లా వ్రాస్తాడు. కవిశిల్పి. అతనికిష్టమైన భాషలో వ్రాస్తాడు. అది ఆపాత్రలభాష అని అనుకోగూడదు. కనుక రామకృష్టాయనీ "సీకటై లచ్చిమి సెందురుణ్ణి, సూరెయుణ్ణి" అని యీతీరున కవి వ్రాశాడని అవే నాయకుడిమాట లని అనుకోగూడదు. కనుక ఆమాటలు ఆధారంగా నాయకుడు సంస్కారంలేని మోటువాడని నిశ్చయించలేము అని అంటారా?

సిద్ధాంతం

వ్రాస్తున్నాను; ఈఅనౌచిత్యాని కెట్లావున్నా యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మపాటలు ఇట్లాటివాటి క్షుద్రత్వానికిగూడా వీటినాయకులు సంస్కారహీనులని చిల్లరమనుషులని విశదపడడం అవసరం గనుక యెంకిపాటలు ఉదాహరణంగా ఈవిషయం వివరిస్తాను. శ్రీనాథుడు "కవిసార్వభౌముడ ఘనతగన్నట్టి, శ్రీనాథుడునువాడ శివభక్తిపరుడ" అని తన భాషను అంతటా ప్రదర్శిస్తాడు. ఈ భాషనే పాత్రలకుగూడా వాడుతాడు అప్పుడది కవిభాషగాని పాత్ర భాషగాదని స్పష్టంగా తెలిపిన వాడవుతున్నాడు. అదిగాక కవిభాష

"ప్రభువులలో మాప్రభువులును కవులూ రసికులూ
 అయిన శ్రీ శ్రీ శ్రీ రాజా వెంకటాద్రి అప్పారావు
 బహద్దరుగారు యీపాటలు విని ఆనందించేవారు.
 వారి వంశ మాచంద్రార్కము నిలుచుగాత మని పరమేశ్వ
 రుని ప్రార్ధిస్తున్నాను. మా ప్రెసిడెంటుగారు శ్రీయుత
 కోలవెన్ను రామకోటీశ్వరరావుగారి ద్వారా వారి
 దయకు బదులు నావందనము లర్పిస్తున్నాను"

అని కవి తన భాషను ఉపోద్ఘాతంలో వ్రాశాడు.

"వస్తుండగా". (ఉపోద్ఘాతం.)

"నీటుగొస్తావుంటె". (యెంకిపాట.)

అని యిట్లా కవిభాషా పాత్రభాషా భిన్నంగావున్నవి. ఇంతకూ యెంకిపాటల్లో పాత్రలే మాట్లాడుతారు. కనుక యీపాటల్లో వున్నది పాత్రభాషే నంటున్నాను.

పూర్వపక్షం.

అవునయ్యా; నాటకాల్లో రాజుకు సంస్కృతంవాడుతారు. అయితే ఆరాజు సంస్కృతం మాట్లాడుతాడని అర్థమా? నాటకంలో కవిచెప్పేది వుండదుగదా. అంతా పాత్రసంభాషణమేగదా అయినప్పటికీ ఆసంభాషణలవల్ల అది ఆపాత్ర నిత్యవ్యవహారంలో వాడేభాష అని నిశ్చయించలేకున్నాము. అది కేవలం కవిసమయాన్ని అనుసరించి యేర్పడ్డభాష కనుక పాత్రలసంభాషణం అన్నమాత్రాన అది వారినిత్య వ్యవహారభాష అని చెప్పలేము గనుక

"కూకుండనీదు"

"సెందురుణ్ణి"

ఇవి నాయకుడి నిత్యవ్యవహారభాష అని నిర్ణయింపలేము. ఆమాటలవల్ల అతడు చదువురాని మోటువాడనడం సాధ్యసమమనే హెత్వాభాసం. నీడద్రవ్యం, చలనమున్నదిగనుక; అనే ఉదాహరణంలో వలె ఋజువుచేయవలసిన ఒక అంశానికి అట్లానే యింకా ఋజువుచేయవలసిన మరియొకఅంశాన్ని హేతువుగా చెప్పడం సాధ్యసమం ఇట్లాటిదాన్నే Fallacy of Undue Assumption అని పాశ్చాత్యతార్కికులంటారు. ఇక్కడ నాయుడు చదువురానివాడనడం ఋజువు చేయవలెను. "కూకుండనీదు" "సెందురుణ్నీ" ఇవి ఆతని నిత్యవ్యవహారభాష గనక అనడం హేతువు. ఇవి అతడినిత్యవ్యవహారభాష అనడం కూడా ఋజువు కావలసిన అంశమే. అది ఇంకా ఋజువుకాలేదు. కనుక ఇట్లాటిదాన్ని సాధ్యసమమనే హేతువుగా హేత్వాభాసమని వైయాయికులు నిరూపించారు. ఈ తీరుగా హేత్వాభాసాన్ని స్వీకరించి నాయకుడు చదువురాని మోటువాడంటే మేమొప్పుకోము అని అంటారా?

సిద్ధాంతం

చెప్పుతున్నాను; నాటకంలో పాత్రలసంభాషణం పాత్రల నిత్య వ్యవహారసంభాషణం కాదనడం అసంబద్ధం. పాత్రలకు ఉచితమైన భాష వుండవలెననే వుద్దేశంతోనే రాజు మొదలైనవారికి సంస్కృతం నీచులు మొదలైనవారికి ప్రాకృతభేదాలను తత్తద్దేశాల ననుసరించి చెప్పవలె నని భారతీయసాహిత్యవేత్త లంటున్నారు.

"దేశభాషాక్రియావేష లక్షణ్యాః స్యుః ప్రవృత్తయః"
 లోకాదేవావగంతవ్యా యథౌచిత్యం ప్రయోజయేత్"
"పిశాచాత్యంతనీచాదౌ పైశాచం మాగధం తథా
 యద్దేశ్యం నీచపాత్రంతు తద్దేశ్యం తస్యభాషితమ్. (సాహి)

(దేశభేదంచేత భిన్నమైనభాష చేష్ట వేషం ఇట్లాటి నాయక వ్యాపారాలు ప్రవృత్తులు. వీటిని లోకంవల్లగ్రహించి ఔచిత్యాన్ని అనుసరించి కూర్చవలసింది. పిశాచాలకు అత్యంతనీచులకు పైశాచం మాగధం, ఉపయోగించవలెను. నీచపాత్రం యేదేశానికి సంబంధించివుంటే ఆదేశభాష ఆపాత్రానికి వాడవలెను) అని అన్నారు. ఈతీరున ఆ ఆ దేశాల పాత్రలభాష తత్తద్దేశాల నిత్యవ్యవహారంలోనిదిగాదనే అభిప్రాయం అవివేకమూలమని స్పష్టపరచాను. యెంకిపాటల్లోది నాయుడిబావభాషే ననడానికి నాటకప్పాత్రలబాష నిత్యవ్యవహారభాష కాదనే అడ్డుకారణాన్ని తోసివేస్తున్నాను. రాజులు మొదలైనవారు సంస్కృతం నిత్యవ్యవహారంలో వాడుతారా అంటే సంస్కృతం ఒకవేళ వాడితే అట్లానేవాడుతారని సమాధానం. ఛందస్సు వల్ల యేర్పడే క్రమం, అడావుడి, వ్యత్యాసం మొదలైనవితీసివేస్తే సంస్కృతం మాట్లాడేటప్పుడు ఆభాషే మాట్లాడుతారంటున్నాను. అంటే నోరు తిరక్కపోవడం మొదలైన దోషాలు లేనిదశలో ఆసంస్కృతమే మాట్లాడుతారని అభిప్రాయం. ఈనాయుడు తెలుగుదేశస్ధుడే గనుక అతడు తెలుగుమాట్లాడుతాడా మాట్లాడడా అనే విచారణే లేదు. ఛందస్సు అడావుడీ వ్యత్యాసం మొదలైనవి తీసివేస్తే అతడికి అతడిదేశభాగంలో అతడిదశకు సిద్ధమైన భాషనే మాట్లాడినా డని అనుకొనడం కంటె, వేరే మార్గం లేదు. "రామకృష్ణా! చందురుణ్ణి" అని అనవలసివుండగా రామకుష్ట, సెందురుణ్ణి అని యిట్లా అనడం ఛందస్సు కక్కురితిగాదు ఛందస్సు అడావుడీగాదు. అది అతడిభాష కాదనడానికి మరేహేతువులు లేవు కనుక అవి నాయకుడి భాషే అని నిర్ణయిస్తున్నాము.

ఆక్షేపం

అవునయ్యా: యెంకయ్య చంద్రమ్మపాటలోవలె కవిదే ఆభాష అంటాము అప్పుడు పాత్రల నిత్యవ్యవహార భాష అనేవాదం పోతుంది గదా. పాత్రలది ఆభాష కాకపోవచ్చును. కవి తనభాషను పాత్రలకు ఆరోపిస్తున్నాడు. కనుక పాత్రలు అపరిణతు లనడం నిల్వదు అని అంటారా?

సమాధానం

చెబుతున్నాను. కవిది ఆబాషఅయితే అది అతడి నిత్య వ్యవహారభాష అంటారా? అప్పు డతడు అది నిత్యవ్యవహారభాష అయిన అపరిణతవలయంలో చేరుతున్నాడు. ప్రకృతివైపరీత్యంవల్ల అనుచితమైన భావాలు ప్రక్షిస్తా లనవలసివస్తుంది. ఇక అపరిణతుడైన కవికి పరిణతనాయకసృష్టి అసంభవం గనుక నాకు విప్రపత్తి లేదంటున్నాను. అతడు అసాధారణుడు, కనుక ఆభాషలోనే పరిణతభావాలు అతిడికి ఉత్పన్నమైనదంటారా? దేశకాలప్రకృతులతో సంబద్ధంకాని అసాధారణత్వం ఔచిత్యవిచారణనుండే దూరమవుతున్నదని చెప్పుతున్నాను. కనుక యిక్కడ అట్లాటి దాని విచారణేలేదు. అవునయ్యా ప్రకృతిచేత ఉచితుడు అయినా అతడు ఆభాషను కావ్యంలో వాడవలెనని సమయమేర్పరుచుకొన్నాడు. అది అతడి సామయికభాష దాంట్లోనే రామాయణాదులుకూడా వ్రాస్తాడు. అని అంటారా? అది ప్రత్యక్షవిరోధం గనుక అనౌచిత్యమంటున్నాను. అపరిణతనాయకులకు పరిణత శబ్దార్ధాలు ప్రవృత్తి తగిలించడంవలె పరిణత నాయకులకు అపరిణతుల శబ్దార్థాలు ప్రవృత్తి తగిలించడం ప్రత్యక్షవిరోధం గనుక ఘట్టకుటీప్రభాతన్యాయంచేత అనౌచిత్యమే యెదుర్కొంటున్నది. పరిపాకవత్ప్రభవత్వరూపమైన శబ్దార్థపరిణతి నెవరు వారించగలరు? పాత్రలకు తగిలించకుండా కవే ఆబాషలో సామయికంగా పరిణత భావాలు ప్రదర్శించినప్పుడే మంటారంటే కవియొక్క ఆసమయమే అనౌచిత్యం పాలైందంటున్నాను. కనుక అనౌచిత్యం తప్పని దువుతున్నదని చెప్పుతున్నాను.

పూర్వపక్షం

అవునయ్యా; కవివిషయం మాకావశ్యకంగాదు. ప్రకృతి వైపరీత్యం గాని, విరోధంగాని యిక్కడలేదు. కవి ఔచిత్యాన్ని ప్రదర్శించాడు దాన్ని తెలుపుతున్నాము. నాయుడు సంస్కారవంతుడే అయినా యెంకిచదువువల్ల కలిగే సంస్కారంలేని మోటుమనిషి. యెంకితో కలుస్తున్నాడు గనుక యెంకిబాష మాట్లాడుతున్నాడు. ఇందులో యెంకే ప్రధానం. అందుకే యెంకిపాటలని దీనికి పేరు పెట్టినారు. దీంట్లోది యెంకిభాషగాని నాయుడిభాషగాదు. హనుమంతు డిట్లానే రామలక్ష్మణులతో సంస్కృతం మాట్లాడుతాడు. కాని హనుమంతుడిభాష సంస్కృతం గాదుగదా నాటకాల్లో సయితం కార్యసందర్భాన్ని అనుసరించి యీతీరున భాషావ్యతిక్రమం జరగడం కద్దు అందుకే

'కార్యతశ్చోత్తమాదీనాం కార్యో భాషావ్యతిక్రమః"

(కార్యసందర్భాన్ని అనుసరించి ఉత్తమాదులకు సయితం భాషా వ్యతిక్రమం చేయవలసివుంటుంది) అని దశరూపకకర్త అంటున్నాడు. దీన్నే సాహిత్య దర్పణకర్త ఉదాహరించిన ఘట్టంలో వ్యాఖ్యాత

"ఉత్తమస్య రాజాంతఃపురచారిత్వే మాగధీ"

అని ఉత్తములకు కొన్నిచోట్ల ప్రాకృతభాషను వాడవలెనని అభిప్రాయం తెలిపినాడు. యెంకితొకూడేసందర్భం గనుక నాయుడు యెంకిభాష మాట్లాడినాడు. కనుక అది నాయుడిభాషగాదు. అందువల్ల

"సెందురుణ్ణి కూకుండనీదు రామకుష్ట"

అని యిట్లాటి మాటలు మాటలాడినాడన్న మాత్రాన అతడు చదువురాని సంస్కారహీను డనడానికి వీలులేదు. అని అంటారా?

సిద్ధాంతం

వివరిస్తున్నాను; యెంకితోమాట్లాడే సందర్భం గనుక యెంకిభాష మాట్లాడినాడని నాయుడు సంస్కారవంతుడే నని అంటే ఒప్పుకోము. యెంకితో మాట్లాడని యేకాంతసందర్భాల్లోగూడ అత డీభాషనే మాట్లాడినాడు. అక్కడిమాటల రూపమేగాక అభిప్రాయం గూడా సంస్కారహీనులైన మోటువాండ్ల అభిప్రాయదశను దాటజాల లేదు.

"యాడుంటివే యాడుంటివే
 పూతోరిపందిట్లో సీతాయియెల్తుంటె
 నీతళుకుగేపకాన నాతలతిరిగిందోలె
 మెళ్లోపూసలపేరు తల్లోపూవులపేరు
 కళ్లెత్తితేసాలు కనకాబిసేకాలు"

అని మొదలయిన మామూలు ప్రాకృతశబ్దాలు వ్యక్తమవుతవి. ఇట్లా అంతటా యేకాంతంగా మాట్లాడేటప్పుడు చదువురాని శబ్దార్ధాలనే వెలువరిస్తాడు.

"నీవెల్లి పోయినావంటే పచ్చినై"

అని యీతీరున చదువుకోనివాండ్ల శబ్దార్థాలనే వ్యక్తపరుస్తాడు గనుక చదువురాని మోటువాడంటున్నాను.

పూర్వపక్షం

అవునయ్యా. అట్లా మాట్లాడవలె నని మాట్లాడినాడు అంతే గాని అతడు పరిణతుడేనంటారా?

సిద్ధాంతం

చెప్పుతున్నాను; అతడు ఆతీరున కృత్రిమంగామాట్లాడినాడని కవి యెక్కడాతెలుపలేదు. అయినా నాయకుడు కావ్యంలో ఉపనిబద్ధుడైనంతమటుకే మనకు విచార్యంగాని తక్కిన అతనిఒడ్డు పొడుగు, అతిడిచుట్టలపొగ, అతడిచెప్పుల కిర్రు, అతడిజిత్తులు మాట్లాడవలె నని మాట్లాడడం ఇవన్నీ విచారించడం అప్రమత్తం. అయినా మీరన్నట్లు అతడు సంస్కారవంతుడైనా, ప్రాకృతుడివలె నటించాడని ఒప్పుకొని విచారించినా నాకు విప్రపత్తిలేదు. నాకు కావలసినది కావ్యంలో వున్నమటుకే గనుకను, నేను కావ్యవిచారణమటుకే చేస్తున్నాను గనుకను, కావ్యంలోమటుకు అతడు సంస్కారంలేని మోటువాడనే స్పష్టం గనుకను అతడు అపరిణతుడనే అంటున్నాను. కావ్యానికి ఔచిత్యం ఆయువుపట్టు వంటిదని అదిలేకుంటే అనౌచిత్యం సంభవించి రసభంగహెతువవుతుందని వివరించాను. యేతర్కంచేతనైనా అతడు పరిణతుడనే ఒప్పుకొంటే కావ్యమంతా అనౌచిత్యం పాలౌతుంది సర్వానౌచిత్యంకంటే యేకదేశానౌచిత్యమేకావ్యకర్తలకు అనుకూలంగదా. అస లింతకు ప్రాకృతుడని నిరూపించాను. సాధారణంగా అంతటా అపరిణతమైన శబ్దార్థాలు వెలువరించిన కృతిలో

"పెక్కునీవులునాకు,
 మాటలో మనసులో మంచిలో యెంకి
 సొగసునీవోసారె అగపడవనాకూ"

అనే యిట్లాటివి అనౌచిత్యాన్ని ఆపాదిస్తున్నదని తెలుపుతున్నాను.

"ఏకోహిదోషో గుణసన్నిపాతే
 నిమజ్జతీందోః కిరణేష్వివాంకః" (కుమార)

అని కాళిదా సన్నట్లు ఈఅనౌచిత్యదోషం ఉపేక్షించవచ్చునంటే వీలులేదు. కావ్యమంతా చిల్లరశృంగారంతో క్షుద్రంగా వున్నపుడు గుణసన్నిపాత మెక్కడిది? ఆక్షుద్రత్వానికి ఈఅనౌచిత్యం తోడ్పడుతున్నది చిల్లరశృంగారంవల్ల ఆపతితమయ్యే క్షుద్రత్వ మిదివరకే నిరూపించాను. కావ్యానికి ఔచిత్యం ఆయువుపట్టని అదిలేకుంటే అనౌచిత్యం సంభవించి రసభంగ హేతువౌతుం దని తెలిపినాను. యెంకిపాటల్లో ఔచిత్యం ఇట్లా భంగమయి గోరుచుట్టుమీద రోకటిపో టన్నట్లు క్షుద్రత్వానికి అనౌచిత్యం చేరిందని విశదీకరించాను. ఇట్లానే వెంకయ్య చంద్రమ్మ పాటలోను

"యెందులో జూచినా యెలుతురుండాదంట
 యెరిగితేసూపించిపోరో రెంకయ్య
 లేకుంటె నిన్నిడువలేరా యెంకయ్య||
 సప్తసముద్రాల్లో సారముంటాదంట
 తెచ్చి పెడుతువుగానిరారో రెంకయ్య
 లేకుంటె నిన్నుడువలేరా వెంకయ్య||
 తెలిసందమామలో తియ్యపానకముంది
 తెచ్చిపెడుదువుగాని రారో రెంకయ్య
 లేకుంటె నిన్నిడువలేరా యెంకయ్య॥

అనేవి అనౌచిత్య ప్రతిపాదకాలని తెలుసుకోవలెను. ఇక

"శిరసునామీదేసి సిరునవ్వునవ్వితే
 సింతలన్నీ మరిసినావే చంద్రమ్మ"
                                     (యెంకయ్య చంద్రమ్మపాట)
"యెంకిగాలొక సారి యిసిరినాసాలు
 తోటంతరాజల్లె తొవ్విపోసెను." (యెంకిపాటలు)
"నీనీడలోపలా దేవుడుండాడంట
      నానీడలోగలిసిపోరా వెంకయ్య" (యెంకయ్య చంద్రమ్మ)
"నీనీడలోనే మేడకడత నాయుడుబావా" (యెంకిపాట)
 నీవొళ్లు నావొళ్లు నిజముగావొకటైతె
 పైనసుక్కలు నవ్వినాయే చంద్రమ్మ
 పాపచంద్రుడు నవ్వినాడే చంద్రమ్మ
                                    (యెంకయ్య చంద్రమ్మపాట)
"సెంద్ర వొంకలొ యేమి సిత్రమున్నాదే
 వొంకపోగానె మావోడొస్తడమ్మా (యెంకిపాట)

మావోడి మనసట్టె మరుగుతాదమ్మా
పండు యెన్నెల్లోన పక్కకేసినసాప
పందిరీమంచమైనాదే చంద్రమ్మ (యెంకయ్యపాట)
పచ్చన్ని సేలోకి పండు యెన్నెల్లోన
నీలిసీరాగట్టినీటుగొస్తావుంటె (యెంకిపాట)
"మల్లీ యెప్పటల్లె తెల్లారబోతుంటె
సందురుణ్నీ తిట్టునాయెంకి
సూరియుణ్ణీ తిట్టునాయెంకి"
"బద్రాసెలంనేను బయలెల్లిపొతాను
నువ్వుగూడా యెంటరారో రెంకయ్య"
                                         (యెంకయ్య చంద్రమ్మ)
"పడవెక్కి బద్రాద్రిపోదామా
బద్రాద్రి రాముణ్ని సూదామా" (యెంకిపాటలు)
"సిమ్మాచలపుసామి సేవించుకొత్తాము
కొంపగోడూయిడిసిరారో రెంకయ్య
అంపకాలేసెప్పిరారో రెంకయ్య"
                                  (యెంకయ్య చంద్రమ్మపాట)
"ఆవుల్ని దూడల్ని అత్తోరికాడుంచి
మూటాముల్లీగట్టి ముసిలోళ్లతో సెప్పి
యెంకీ నాతోటిరాయే మన యెంకటేశ్వరుణ్ని
యెల్లి సూసొద్దాము" (యెంకిపాట)

అని యిట్లా తిరణాలవేడుకలు కొన్ని యింపైనమాటలు తీర్థయాత్రా ప్రశంసలూ వున్నా అసలీకృతులే క్షుద్రశృంగారం గనుక

"వపుష్యలలితే స్త్రీణాం హారోభారాయతే పరం"

అన్నట్లు ఇవి కృతులకు ఉపాదేయత్వం తేజాలవు.

"కమ్మవారి చిన్నదాని నయ్యానేను
 జొన్నకోత కోస్తావ పిల్లానీవు"
 సన్నాసన్నాగాజులేవే నారాయణమ్మా
 నీచిన్నాచిన్నా చేతులాకు నారాయణమ్మా"

అని నారాయణమ్మ నాయుడుబావపాటలోను లక్ష్మి అనేకథలోను వుండే మంచిమాటలు జారకాంత సౌశీల్యంవంటివి గనుక విచార్యం గావని చెప్పి యీచర్చ ముగిస్తున్నాను.

"మా అభినవాంధ్ర కవిమిత్రమండలి వారందరు నాప్రాణ మిత్రులు" అని యెంకి పాటలకర్త తెలిపిన అభినవాంధ్రకవిత్వ మిదే అయితే దీంట్లో వున్నది ఆధునికత్వంగాని అభినవత్వం గాదని దీన్ని అభినవమన్నా ఆధునికమన్నా యిట్లాటివి చిరకాలంనుండీ వున్నవని ఇవే ఉత్తమ కవిత్వమనుకొనడం అజ్ఞానమని ఈ ఆధునిక కవిత్వం చాలవరకు దుష్టమని ఈకృతుల్లో చాలామట్టుకు శృంగారం చిల్లరశృంగారమై క్షుద్రమైనదని ఈరకపు క్షుద్రకవిత్వానికి చేరినయిట్లాటి మండల్లు అంతగా శ్లాఘ్యమైనవి గావని ఇది కవిమిత్రమండలి అయినప్పుడు ఈకవులను ఉత్తమ మార్గాలకు ప్రేరించడం ఈ మిత్రుల ధర్మమై వుండగలదని చెప్పుతున్నాను.

అని శ్రీ- ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్రపరిశిష్టంలో

అనౌచిత్యాధికరణం - సమాప్తం