నేటి కాలపు కవిత్వం/క్షుద్రకావ్యాధికరణం

వికీసోర్స్ నుండి

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం

క్షుద్రకావ్యాధికరణం

చిల్లరకావ్యాలు, క్షుద్రకావ్యాలు

శృంగారం లోకశ్రేయస్సుకు సంబంధించిందని జగత్సంతతికి ఆధారమైన ప్రవృత్తిధర్మప్రతిష్ఠకు సాధనంగా శృంగారం ప్రవర్తిస్తున్నదని చిల్లరమనుషులు పాత్రలైతే యీఉదాత్తఫలాలుపోయి రసం పరిపోషం చెందక కావ్యం భ్రష్టమవుతున్న దని వ్యక్తంచేశాను. ఈ తీరుగా భ్రంశంపొందినవాటికి క్షుద్రకావ్యాలని చిల్లరకావ్యాలని వ్యపదేశం చేస్తున్నాను.

పూర్వపక్షం

వాచ్యం ప్రధానమైన కావ్యాన్ని క్షుద్రమని సాహిత్యవేత్తలన్నారు. మీరు చిల్లరపాత్రల శృంగారకావ్యాన్ని క్షుద్రమంటున్నారు ఇది సంప్రదాయ సమ్మతంగాదంటారా?

సిద్ధాంతం

చెపుతున్నాను నిజమే అర్ధవిచారాన్ని అనుసరించి అవ్యంగ్యమైన కావ్యాన్ని క్షుద్రమన్నారు. కావ్యంయొక్క క్షుద్రత్వం పాత్రలనుబట్టిగూడా నిర్ణయించవచ్చును. ఇట్లా అధమపాత్రనిష్ఠమైన శృంగారానికి రసాభాసమని సాహిత్యవేత్తలు పేరుపెట్టినారు. వారి సంజ్ఞప్రకారం యిది రసాభాసకావ్య మవుతుంది. రసాభాసకావ్యమనే పేరు ఈచిల్లర పాత్రల శృంగాం కావ్యాలకు మీకు సమ్మతమైతే దాన్నే స్వీకరించవచ్చును. నేను వీటిని క్షుద్రకావ్యాలంటున్నాను. అభిప్రాయం వొకటే గనుక పేరుబాబాధకం గాదంటున్నాను. ధర్మరక్షకత్వంగాని ధర్మప్రతిష్ఠగాని లేని చిల్లరమనుషుల శృంగారం క్షుద్రం గనుక ఆకావ్యం క్షుద్రమంటున్నాను.

క్షుద్రకావ్యాలు

యెంకిపాటలు మొదలైనవాట్లో చిల్లరపాత్రలశృంగారం గనుక అవి రసాభాసకావ్యాలంటున్నాను. చిల్లరకావ్యం శృంగారరసాభాష కావ్యం, క్షుద్రకావ్యం యీమూడు నేను సమానార్థంలో ప్రయోగిస్తున్నాను. రసాభాసకావ్యమన్న చోట శృంగార రసాభావమని సమన్వయం. ధుష్టుల శృంగారం అత్యంతం దూష్యం గనుక

"కావ్యాలాపాంశ్చ వర్జయేత్"

అనే వచనానికి గురి అవుతున్నది. నారాయణమ్మ నాయుడుబావ పాటలో నారాయణమ్మను లేవదీసిన జారుడైన నాయుడుబావకు పరకీయ మీది రతిని ఆపాట తెలుపుతున్నది. భారతిలో పకటితమైన శ్రీ ముక్కపాటి నరసింహశాస్త్రి కృతి లక్ష్మి అనే కథలో పరకాంత అయిన లక్ష్మిచేతిని ప్రకాశంపట్టుకొని యేమంటావంటే "కొన్నాళ్లకింద అయితే నీతోయెక్కడికైనా వచ్చేదాన్ని యిపుడు వయసుముదిరింది" అని అతడు పోయినతరువాత యేడుస్తుంది. యిట్లాటి తుచ్ఛస్త్రీల తుచ్ఛులశృంగారం

"సన్నాసన్నా గాజూలేవే నారాయణమ్మా నీ
 చిన్నాచిన్నా చేతులాకు నారాయణమ్మా".

అని యీఫక్కి మాటలకూర్పు కొంతసొంపుగావున్నా హేయకోటిలో చేరుతున్నవి. ఇట్లాటిశృంగారానికిదివరకు పేరు పెట్టకవిడిచినా యిక్కడ దుష్టశృంగారమని దీన్ని వ్యవహరిస్తున్నారు. తారాశశాంకవిజయం, నారాయణమ్మ నాయుడుబావపాట ముక్కపాటి నరసింహశాస్త్రి లక్ష్మి, యివన్నీ ఒకటేరకం. చివరనాలుగు నీతిమాటలున్నా వీటికి గ్రాహ్యత్వం సమకూర్చవు. విషంమీద నాలుగు తేనెబొట్లు వేసినంతమాత్రాన విషానికి విషత్వంబోదు. పైగాతేనెగూడా విషసంపర్కంచేత కలుషితమవుతున్నది. కనకనే యివి హేయకోటిలో చేరుతున్నవంటున్నాను.

ఇక తక్కినవి చిల్లరపాత్రలశృంగారం గలవి యెంకిపాటలు మొదలైనవి క్షుద్రకావ్యాలన్నాను. వెంకయ్య చంద్రమ్మపాట, ఓరోరి బండోడిపాట మొదలైనవి యెంకిపాటల కోటిలోనివి. ఇవన్నీ ఈచిల్లర కావ్యాలే అయువున్నవి. ఈక్షుద్రకావ్యాలను యెంకిపాటలు మొదలైనవి మచ్చుగా విమర్శించాను ధర్మసంబంధం యెంకికి నాయుడుబావకు యెంకయ్యకు చంద్రమ్మకు వ్రాయక పోయినా ఉన్నదనుకోగూడదా అంటే అది అసంబద్ధం. వ్రాయకపోతే ఉన్నదని యెట్లా అనుకొనడం? అట్లయితే అసలు కావ్యం వ్రాయకుండానే వ్రాశాడను కోవచ్చు. కనుక అవి అసంబద్దపుమాట లంటున్నాను. యెంకినాయుడూ సంస్కారంలేని చిల్లరమనుషులని యింకా ముందు నిర్ణయించబోతున్నాను. యెంకమ్మ చంద్రమ్మపాట మొదలైనవి యెంకిపాటలు యిట్లానే సాధారణనాయకుల శృంగారంగల "చెన్నపట్టణంలో" వంటినవలలు, భారతి పత్రికలో ఆకోటిలోని "పరీక్ష" వంటి కథలు చిల్లరకావ్యాలని వ్యక్తపరచాను. భగవంతుడిమీద రతి శిశుప్రేమ ముగ్ధప్రకృతిప్రేమ, ఉత్తమూలభావ దశాశృంగారం వీటికన్నిటికీ భావధ్వని అని సాహిత్య సంప్రదాయంలో పేరు. భావకావ్యమని కూడా అనవచ్చును. ఈ భావకావ్యాలు ఖండాఖండభేదంతో (మహాకావ్యమని ఖండకావ్యమని భేదంతో) ఉదాత్తకావ్యకోటిలోనే భారతీయసంప్రదాయాన్ని అనుసరించి చేరుతున్నవి.

భారతిలోని వెంకటేశవచనాలు, కృష్ణకర్ణామృతం, సౌందర్యలహరి, ఋతుసంహారం, సూర్యశతకం మూకవిరచితమైన మూకపంచాశతి, ధూర్జటి కాళహస్తిశతకం. ఇవన్నీ భావకావ్యకోటిలోవి. నేటికాలపు కావ్యాల్లో కొమాండూరి కృష్ణమాచార్యకృతి పాదుకాస్తవం భారతిలోని గౌతమీస్రవంతి, వడ్డాది సుబ్బారాయకృతి భక్తచింతామణి, యివన్నీ భావకావ్యాలే అయివున్నవి. పరకీయారతిగల రసాభావం వర్జ్యమని అదే అనుచిత శృంగారమని దుష్టమని యిట్లాటి దోషంలేని చిల్లరజానపదులశృంగారం జింకలు పక్షులు తుమ్మెదలు మొదలైన వాటి శృంగారం కొంతవరకు ఆస్వాద్యమే నని యిదివరకు వ్యక్తపరచాను. కనుకనే

"రసభావౌ తదాభాసౌ
 భావస్య ప్రశమోదయౌ
 సంధిశ్శబలతా చేతి
 సర్వేపి రసనాద్రసాః (సాహి)

అని అన్నారు ఇట్లా చిల్లరజానపదుల శృంగారం జింకలు మొదలైన వాటి శృంగారం కొంతవరకు ఆస్వాద్యం గనుకనే కావ్యంలో అంగంగా స్వీకరించా రని అదే ప్రధానమైతే ఆకావ్యం ఉదాత్తభావోన్మీలనాన్ని ఆనుషంగిక ఫలప్రాప్తిని కోల్పోయి క్షుద్రమవుతుందని యిదే చిల్లరశృంగారమని విశదంచేశాను.

అని శ్రీ ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర పరిశిష్టంలో

క్షుద్రకావ్యాధికరణం సమాప్తం.