Jump to content

నృసింహపురాణము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ప్రథమాశ్వాసము

కథాప్రారంభము

వ.

ఏను విన్నపంబుసేయంగల శ్రీనరసింహావతారం బనుపురాణకథకుఁ బ్రారంభం బెట్టి
దనిన నిఖిలభువనపావనం బైననైమిశారణ్యంబునఁ బుణ్యాత్ములగుమహర్షులు హర్షో
త్కర్షంబున రోమహర్షణుం డనుపౌరాణికునివలన నఖిలపురాణేతిహాసంబులు
పరిపాటి వినుచుండి బ్రహ్మాండపురాణంబునఁ దీర్థభాగశ్రవణంబుసేయుసమయంబున
నతికుతూహలోన్మీలితమానసు లై యతని కి ట్లనిరి.

1


క.

ఏతీర్థము కలియుగమున, భూతాభయదానచతురపుణ్యోన్నతి ను
ద్యోతించు మునులు దివిజులు, నేతీర్థమునంకుఁ బాయ రెన్నఁడు నెలమిన్.

2


శా.

ఏతీర్థంబున సర్వకాలమును సర్వేశుండు సర్వాగమా
మ్నాతస్ఫీతయశుండు శ్రీవిభుఁడు ప్రేమస్థేమమై దాను న
బ్జాతావాసయు నిత్యవాసరుచియై భాసిల్లు నొం డెచ్చటన్
జేతోవృత్తి గణింపనొల్లక జగజ్జేగీయమానస్థితిన్.

3


శా.

ఏతీర్థంబుఁ దలంచువారు వినువా రీక్షించువా రెప్పుడున్
బ్రీతిం గూడి భజించువారు దురితాపేతాత్ములై యెయ్యెడన్
వీతాతంకమతిం దనర్తురు జగద్విఖ్యాతకీర్త్యుజ్జ్వలం
బ్రేతీర్థంబు పురాణయోగివిదితం బేతీర్థ మూహింపఁగన్.

4


శా.

ఏతీర్థంబు సమస్తతీర్థతిలకం బిష్టార్థసిద్ధిప్రదం
బేతీర్థంబు సమగ్రవైభవశుభోపేతప్రభూతోదయం
బేతీర్థంబు విముక్తిసాధనగృహం బేతీర్థ మింపారఁగా
నాతీర్థం బెఱిఁగింపు మాకుఁ బరమోదాత్తప్రబంధోక్తులన్.

5


క.

అని ప్రార్థించిన మునులకు, వినయాననతాంగుఁ డగుచు విశ్రుతవాణీ
ఘనుఁ డధికబోధనుం డి, ట్లను బుధహర్షణుఁడు రోమహర్షణుఁ డెలమిన్.

6


ఉ.

ఈగుణకోటియంతయును నెక్కడ నెక్కడఁ గల్మిదుర్లభం
బాగనుసిద్ధమై మునిగణార్చిత మైనరహస్య మేను వి

ద్యాగురుఁ డైన మద్గురుముఖాంబురుహంబునఁ గంటి నిప్డు త
ద్వాగభిరూపితార్థము భవద్వచనంబుల కుత్తరం బగున్.

7


సీ.

ప్రోగులై యెందును బోఁ గేర్పడక యున్న శ్రుతు లన్నియును నోజ సూత్రపఱిచె
ముఖ్యశాస్త్రంబుల మునికోటిఁ జదివించి యెల్లచోటుల వెలయింపఁ బనిచె
నాదిపురాణంబు లయ్యైమతంబులపేళ్లు వెట్టియు నిరూపించి నిలిపెఁ
బంచమవేదమై పరఁగు మహాభారతముఁ జేసి పురుషార్థసమితిఁ బ్రోచెఁ


గీ.

బుట్టినప్పుడె సంసృతిపొలముఁ గప్పు, నట్టియెఱుకను బుట్టినపట్టిఁ గనియె
నెవ్వఁ డట్టిమద్గురు నుతియించి భక్తి, విష్ణుమాహాత్మ్యకథ లెల్ల విస్తరింతు.

8


వ.

సమాహితహృదయుల రై వినుండు.

9


ఉ.

సంతతపుణ్యవర్తనుఁడు సద్గుణసంవృతకీర్తనుండు ని
శ్చింతమనస్సరోరుహవశీకృతకృష్ణుఁడు వీతకృష్ణుఁ డా
క్రాంతనియత్యపేలవుఁడు గాలవుఁ డన్ముని తీర్థసేవనా
త్యంతికభక్తి మేదినిఁ బ్రదక్షిణవృత్తిఁ జరించె నెల్లెడన్.

10


సీ.

అర్థి గంగద్వార మాడెఁ బుష్కరములు గనియె హరిక్షేత్రమునఁ జరించె
గౌశికిఁ గొనియాడెఁ గాశి వసించెఁ బ్రయాగంబు సొచ్చె గయావటమున
నిలిచె గంగాపయోనిధిసంగమముఁ జూచె శ్రీపురుషోత్తమసేవఁ జేసె
సింహాచలం బుపాసించె గోదావరీకృతగాహనుం డయ్యెఁ గృష్ణవేణిఁ


గీ.

దఱిసె శ్రీవేంకటాచలస్థాయిఁ గొలిచె, సహ్యజావేణి ( దోఁగెఁ దత్సవిధసీమ
సస్తసాలాంతరశయాను సరసిజాక్షు, రంగనాథుని నెఱఁగె శుభాంగుఁ డగుచు.

11


వ.

ఇట్లు పరిపాటిం బ్రసిద్ధంబు లగు తీర్థంబు లాడుచు మఱియును.

12


క.

గోకర్ణము సహ్యగిరియు, శ్రీకుల్యముఁ బుష్పనగము సిద్ధాచలమున్
లోకనుతుఁడు చూచుచు ల, క్ష్మీకలిత మహోబలంబుఁ జేరెం బ్రీతిన్.

13


క.

అందు భవనాశనీనది, నందనదళితారవిందనవమకరంద
స్యందమదవదిందిందిరఁ, జందనచంద్రాంశువిశదసలిల భజించెన్.

14


వ.

తదనంతరంబ.

15


ఉ.

ఆమునినాయకుండు వినయానతుఁడై కొలిచెం జగత్త్రయ
స్వామిఁ బ్రసన్నభక్తినయవాఙ్మయుఁ గామితభక్తలోకర
క్షామణి సర్వదైవతశిఖామణి శ్రీనిధి సత్కృపానిధిన్
శ్రీమదహోబలేశ్వరుఁ బ్రసిద్ధమహత్త్వజితాఖిలేశ్వరున్.

16


వ.

ఇవ్విధంబున శ్రీనరసింహసందర్శనం బొనరించి కృతార్థుం డై యచట ననేకముని
మహర్షిమధ్యంబున మధ్యందినదినకరానుకారియై తేజరిల్లువాని శ్రీమన్నారాయణచ
రణైకభావు దేవశ్రవుం డనుమునిపుంగవుం గనుంగొని సమస్కరించి యతనిచేత

సంభావనంబు వడసి యాసీనుం డై గాలవుండు నమ్మహాత్ముండు వివరించునచ్యుతమ
హిమాత్మకంబు లగుపుణ్యకథనంబు లాకర్ణించుచుఁ గృతాంజలియై యి ట్లనియె.

17


క.

చూచితి ననేకతీర్థము, లీచందముపుణ్యతీర్థ మే నెఱుఁగ మునీం
ద్రా! చిత్తము తెలివొందెను, గోచరమె యహోబలంబు కొనియాడంగన్.

18


క.

ఇచ్చట దొల్లి జనార్దనుఁ, డచ్చపువాలారుగోళ్ల నసురవరేణ్యున్
వ్రచ్చె నన నతనిసూనుని, మెచ్చె ననఁగ నేను విందు మితకథనములన్.

19


సీ.

అఖిలలోకేశ్వరుం డగురమాధిపుతోడ విడువనివైరంబు దొడరునట్టి
మోఱక మేటికో మొలచె దైత్యునిబుద్ధి నెబ్బంగి నిష్ఠ దైత్యేంద్రసుతుఁడు
శ్రీవత్సవక్షు మెచ్చించె శ్రీనరసింహమూర్తి యేకారణమున జనించె
విభుఁ డహోబలనాథవిఖ్యాతి నెట్లొందె నీతీర్థవరమున నిందుఁ గలుగు


గీ.

పుణ్యతీర్థంబు లెయ్యవి భూరిపుణ్య!, యింతయు సవిస్తరంబుగా నింపు మిగుల
నానతిచ్చి కృతార్థుఁ జేయంగవలయు, నన్ను నిమ్మును లెల్ల నానందమొంద.

20


క.

అని పలికిన గాలవుపలు, కనుమోదించుచు మునీంద్రు లందఱుఁ దమ నె
మ్మనములు చెవులకు సొమ్ముగ, నొనరించి కుతూహలాధికోల్లాసితులై.

21


క.

తనవదనమునన చూడ్కులు, నినుపఁగ దేవశ్రవుండు నిరుపమవిద్యా
ఘనుఁ డి ట్లనియెను గాలవుఁ, గనుఁగొని గంభీరవాక్ప్రకారప్రౌఢిన్.

22


క.

నీ వడిగిన యర్థము ముని, సేవితము సమగ్రబోధసిద్ధిప్రద మి
ష్టావాప్తికరము శ్రుతిసం, భావితము ప్రశస్తనిత్యపాండిత్యనిధీ!

23


క.

ఏనును బెద్దలచే మును, వీను లలరఁ దనతరంబ విన్నవిధంబున్
మానసమున నున్నతెఱఁగుఁ, గానుపునం గన్నక్రమముఁ గథన మొనర్తున్.

24


వ.

అని పలికి దేవశ్రవుం డిట్లని చెప్పం దొడంగె.

25


సీ.

అఖిలలోకానందుఁ డగుచంద్రుఁ డెందేని గలిగె నుజ్జ్వలఫేనకణముమాడ్కి
నైరావణాదిమహాకరు లెందేని ప్రభవించె మకరశాబములపగిదిఁ
గమనీయసురతరుసముదయం బెందేని జవియించె శైనాలచయము భంగి
భుజవైకమాత మాధవుపత్ని యెందేని పొడమె మాణిక్యంపుబొమ్మపోల్కి


గీ.

నాదిమత్స్యకూర్మములవిహారలీలఁ, దనరు నెందేని ప్రకృతి సత్యములకరణి
నట్టి యంభోధి యొప్పారు నద్భుతైక, సారమహనీయమహిను కాధారమగుచు.

26


క.

తాన లవణాబ్ధి యనినను, దాన మధురజలధి యనిన దాన యమృతపా
థోనిధి యనినను సకలా, నూనగుణస్తుతికి నాత్మ యొకఁడ యుదధికిన్.

27


క.

కావున దుగ్ధాంభోనిధి, శ్రీవిభవము వర్ణనంబు చేసెద సాక్షా
చ్ఛ్రీవల్లభమూర్తి యగుటఁ, భావనములు తద్గుణానుభావస్తవముల్.

28

ఉ.

ఒక్కొకవేళ శీతకిరణోదయవేళలఁ బొంగి నింగికిన్
నిక్కి మహాబ్ధివీచికలు నిర్మలదివ్యవిమానపంక్తిపైఁ
బిక్కటిలంగఁ గొన్నురువు వెట్టినయంతయుఁ జూడనొప్పు న
ల్దిక్కుల శారదాభ్రలవదీప్తివిభాగత నొందుచాడ్పునన్.

29


ఉ.

ఎక్కుడువేడ్కఁ గ్రోలికొని యెండక యున్నపయోధీ పల్మఱున్
గ్రక్కెడునో సుధాకిరణకాంతిచయంబు లనంగ నెంతయున్
మిక్కిలి యుల్లసిల్లు నునుమించులు దేరెడుముత్తియంబు లిం
పెక్కినమ్రోఁతలన్ దరఁగ లెందుఁ దలంబులఁ బ్రోవువెట్టఁగన్.

30


సీ.

బిగి యుల్లసిల్లెడుపగడంపుఁగెమ్మోవి చెలువంపుబింకంబు చిగురులొత్తఁ
దనరారుపులిననితంబబింబమున నాకులిత మై ఫేనదుకూల మమరఁ
గ్రమ్ముముక్తాఫలఘర్మాంబుకణములు చెదరి యెంతయు సౌఖ్యపదవి నొసఁగ
నెసఁగునుద్వృత్తమీనేక్షణరోచులపొలపంబు లొయ్యారములు దలిర్ప


తే.

లలితభంగుల నొప్పునేలావధూటి, కమ్రభంగభుజంబులఁ గౌఁగిలించి
ఘనరసోల్లాసలీలలఁ గ్రాలి క్రాలి, యుదధి తోతెంచుఁ జంద్రోదయోత్సవమున.

31


ఉ.

ప్రేపులు రేలుఁ బెద్దయును బేర్చి సమీపనగేంద్రచంద్రకాం
తోపలతోయదంబు నద లొక్కమొగిం జనుదెంచి యాదటన్
బైపడఁ దాను నుల్లసితభాతిఁ దదీయవదాభిసారమున్
దీపెసలారఁ గైకొని మదించు నదీపతికోర్కి వింతగన్.

32


చ.

తటరుహవిద్రుమద్రుమవితానము లొప్పుఁ బయోధి కింక ను
త్కటచటులోర్మిహస్తముల గర్వమున న్వెడలంగ ద్రోచినం
బటుతరభావ మేది బహుభంగి వికీర్ణత నొంది క్రింద న
చ్చట నచటన్ బొనుంగువడి స్రగ్గినబాడబకీలలో యనన్.

33


తే.

కడలిచేతు లార్చుచు ఫేనఘనతరాట్ట, హాసరుచితోఁ బ్రవాళజటాలి విద్రిచి
యౌర్వశిఖిఫాలలోచనం బనఁగ సింధు, వమరతాండవ మాడెడుహరునిఁ బోలి.

34


చ.

పొలుపుగ నెల్లనాఁడు నుడివోవక పెల్లుగఁ బూఁచు తీఁగెలం
దెలుపులు మీఱి తోయనిధితీరవనంబులు జూడ్కి కెప్పుడున్
ఎలమి యొనర్చు వేల్పు లచలేంద్రునిఁ గవ్వముఁ జేసి తెచ్చుచోఁ
జిలికిననాఁటి యయ్యమృతశీకరసేకము పాయదో యనన్.

35


ఉ.

ఱిక్కలతోడ కొండల నెఱిం దనలోన నడంచికొన్న నీ
సెక్కి బలారి వంచె నొకొ యీజలపూరముపేర్మి యంతయుం
దక్కువ సేయ నన్నక్రియ దందడి నొందును బేర్చి పెల్లుగా
నొక్కట నీరుగ్రోలెడుఁ బయోదసముచ్చయముల్ పయోనిధిన్.

36

సీ.

సిరిపుట్టినిల్లు రాజీవలోచనుసెజ్జపట్టు మహీకాంతకట్టుఁజీర
గిరులు డాఁగెడుగొంది గిరిభేదిపగఱకు బలుకోట బడబాగ్ని బ్రతుకుచోటు
పటుపయోధరములపాలిప్రపాసీమ యమృతాంశుపొడవున కనుగలంబు
మర్యాదలకు గుఱి మహిమలకందువ యఖిలరత్నములకు నాకరంబు


గీ.

సురతభవనంబు వాహీనీసుందరులకుఁ, గూర్మి నిల్కడ గంభీరగుణము నెలవు
తనరునొప్పిదముల కెల్లఁ దానకంబు, వనధిఁ గొనియాడఁ జతురాననునకు వశమె.

37


వ.

ఇ ట్లపారవిభవోదారం బగుదుగ్ధసారావారంబునకు నలంకారం బగుచుఁ దదీయ
మధ్యప్రదేశంబున ననేకశతసహస్రకోటియోజనవిస్తారవిపులరూపం బై శ్వేతద్వీ
పంబు దీపించుచుండు.

38


క.

అదియు మహిమయు నేర్పడ, నాదిపురుషుఁ డొకఁడ యెఱుఁగు నన్యులకెఱుఁగం
గాఁ దరము గాదు కమలభ, వాదిదివిజవంద్య మది మహాద్భుతము మహిన్.

39


సీ.

క్షీరాబ్ధితరఁగలపేరణిఁ గూడిన సేనసంహతి చిక్కఁ బేరె నొక్కొ,
రాకాసుధాకరప్రభలు ప్రోవిడి బ్రహ్మ వెరవున గట్టి గావించె నొక్కొ
హరిపురాంతకుతోడిపురుడున రజతాద్రి కెనగాఁగ నిది సృజియించె నొక్కొ
దనుజారిపాన్పయ్యుఁ దనియక వెంకయు నురగేంద్రుఁ డీమూర్తి నొందె నొక్కొ


గీ.

యుదరమున ముత్తియంబు లొయ్యయ్యమూగి, తెట్టువలు సేరి పెనుమిఱ్ఱు గట్టెనొక్కొ
యనఁగఁ జందనకుందేందుహారరుచిర, దీప్తివితతులు నచట సంధిల్లు దీవి.

40


శా.

శ్వేతద్వీపనివాసు లందఱు శరజ్జీమూతరేఖాసిత
స్ఫీతాకారులు ఘోరదుర్భరజరాపేతు ల్హరిధ్యానసం
జాతానందనికూఢు లూర్జితయశస్సంభావ్యు లంభోజసం
భూతేంద్రాదిసమస్తదేవపరిషత్పూజాసమస్యోచితుల్.

41


క.

హరిభక్తి తేపగా దు, స్తరసంసారాబ్ధిఁ గడచుసాధుజనులకుం
గరయై దివిజగణనిరం, తరనిత్యానందమయపదస్థితి నెసఁగున్.

42


వ.

అమ్మహాద్వీపంబునడుమఁ బ్రచండమార్తండమండలసహస్రదుర్నిరీక్ష్యసహజతేజోవి
రాజితంబును, వివిధమణికిరణపటలజటిలఘనకనకప్రాకారప్రకరపరిక్షిప్తంబును, దరళ
పతాకాపల్లవితకేతువనవిలసితంబును, సముత్తుంగమంగళమణిభర్మనిర్మితనిర్మలహర్మ్య
శిఖరవిలిఖితగగనభాగంబును, బహుయోజనసహస్రదుర్నిరీక్షాత్యాయతవిశాలసన్ని
వేశంబును, రమణీయరమ్యసహస్రప్రముఖసంచారచతురప్రాకారంబును, సంభృతాఖిల
దిఙ్ముఖద్వారతోరణస్ఫురణాభూషితంబును నయి వైకుంఠనామధేయం బగుమహాపు
రంబు భూరిమహిమాభిరామం బగుచుండు.

43


క.

నాలుగునోళులవానికి, నాలుక లిరువేలు గల ఘనస్థిరమతికిన్
బోలునె వినుతింపఁగ ననఁ, బోలికలకు మిగిలి యొప్పుఁ బురియొప్పిదముల్.

44

సీ.

నారాయణునిదివ్యనామసంకీర్తనం బనిశంబుఁ జేయుమహాత్ములకును
బద్మాక్షుశ్రీపాదపద్మంబు లత్యంతభక్తిమైఁ బూజించుప్రాజ్ఞులకును
విశ్వరూపునిమూర్తివిభవంబు నేకాగ్రబుద్ధి భావించుసత్పురుషులకును
లక్ష్మీశ్వరునిసముల్లాసహేతువు లగువ్రతములు సల్పుసద్వర్తనులకు


గీ.

భవము దీఱినతుది సచ్చి భవ్యసుఖము, లనుభవింపంగఁ దగునెల వగుటఁ జేసి
యఖిలవస్తుసంపదలకు నాకరంబు, గుణవిధావిభాసురము వైకుంఠపురము.

45


చ.

శ్రుతిమతధర్మయోగములు చోద్యపుమూల్యము లప్పురంబునం
జతురతఁ బుణ్యవస్తువులు సారవిముక్తిపదమ్ము లమ్మువా
రతులితవిష్ణుశాసనసమాహితు లైనమహాత్ము లంచితో
ద్ధతిఁ గొనువారు భూరివిహితవ్రతపారగు లైనబోధనుల్.

46


సీ.

తమవాఁడిచూడ్కి కందర్పున కేపని యైన సాధించుదివ్యాస్త్ర మనఁగఁ
దగుతియ్యపలుకులు ప్రమదరాగాంబుధిఁ దనరారుమవ్వంపుదరఁగ లనఁగఁ
దమవింతచెయ్వులు కమనీయకోమలశృంగారతనువులేఁజిగురు లనఁగఁ
దమముద్దునవ్వులు తమకంపుఁజీఁకటి నిగిడించుసరిదివెన్నెల లనంగఁ


ఆ.

జొక్కుమందు లనఁగ సోయగంబులగను, లనఁగ సుఖమునిక్క లనఁగఁ జాలి
యనుపమానమూర్తులై యుల్లసిల్లుదు, రంబుజాయతాక్షు లప్పురమున.

47


ఉ.

మారుని గన్నతండ్రి, సిరిమానసము న్గబళించునేర్పుసొం
పారఁగ నైజమై చను మహారసికుండు సమగ్రసారశృం
గారరసాధిదేవత జగద్రమణుండు మురారి యట్టిశృం
గారరసైకపాత్ర మనఁ గాఁ దగదే పురరత్న మెమ్మెయిన్.

48


ఉ.

శ్రీసతికి న్మురారికిని సేసలు పెట్టినపెండ్లిపెద్ద ల
బ్జాసనుఁ డంబుజోదరమునం దుదయించిననాఁడు చేరి యు
ల్లాసము పల్లవింప నుపలాలనఁ జేసినయమ్మ లెల్ల సం
తోసమున న్ముకుందుసయిదోడులు తత్పురపుణ్యభామినుల్.

49


సీ.

హరిదాసులను హత్తి కరులు శ్రీకరు లెల్లఁ గల్క్యవతారసంకల్పలీల
శ్రీనాయకుఁడు సవరించిన బలుమావుబడిపుట్టినవి హయప్రతతు లెల్లఁ
బుట్టువుఁ జావును బోనంగఁ దట్టిన గరువంపుదిట్టలు పురుషు లెల్ల
దివ్యవిమానమాత్రికము గేహము లెల్లఁ గౌస్తుభజ్ఞాతులు కమ్రరత్న


గీ.

జాతు లెల్ల విరించి హంసవ్రజంబు, బలఁగ మింపార రాయంచపదవు లెల్ల
విమలకమలాక్షునాభిపద్మమునఁ గన్న, తమ్ము లెప్పుడు కొలఁకులతమ్ము లెల్ల.

50


ఆ.

సకలకాలకుసుమసంపద సొంపారి, నిఖిలసుఖవిహారనిర్మితులకు
గారణంబులై యుదారమందారంబు, లగుచుఁ బురవనంబు లలరు నెపుడు.

51

సీ.

హరిభూతభావధన్యావతారంబులఁ గీర్తనం బొనరించుఁ గీరసమితి
సప్తసామములు సుస్వరముగ మునికోటిసదివించుఁ గోకిలసముదయంబు
శ్రీకాంతుకమనీయశృంగారలావణ్యకథలు పేర్కొనుశారికాగణంబు
ప్రణవమంత్రోన్మాదపరిపాక మింపార నభ్యాస మొనరించు నలికులంబు


గీ.

ఘోరసంసారతాపనివారణంబుఁ, జేయునున్నతభూరుహచ్ఛాయచయము
సరసగీర్వాణగ్రంధంబు చల్లుఁబుష్ప, జాతి యప్పురియుపవనస్థలులయందు.

52


చ.

ఉరుతరశంఖచక్రరుచి నొప్పులగద్విమలోదరస్థితాం
బురుహవిభూతిఁ బేర్చి పరిపూర్ణజలాశయశాశ్వతోన్నతిన్
బరఁగి నవోత్పలాంచితవిభాగరిమ న్సిరిఁ జెంది యొప్పు న
ప్పురికమలాకరంబులు విభుం డగువిష్ణునిమూర్తులో యనన్.

53


సీ.

తరితాల్పు పొక్కిటితమ్మికమ్మనితావి యెల్ల నల్దెసలను జల్లి చెల్లి
పరమాత్ముపదములఁ దొరఁగి పారెడు నేటితరఁగలపై లీల దాఁటిదాఁటి
శౌరికౌగిటఁ జొక్కుచపలాక్షిపులకలచెలువంబునకుఁ బ్రోదిఁ జేసి చేసి
హరిమ్రోల వినతాంగుఁడై యున్నయురగారియెఱకలు పలుమాఱు గిఱిపి గిఱిపి


గీ.

కొలువు తఱిఁగోరి సంభ్రమాకులతఁ బారు, చెంచువేల్పులమూకల సేదచేర్చి
వెన్నునగరిలోపల నెల్ల వెంటలకును, దానయై యొప్పుఁ బురముమందానిలంబు.

54


వ.

మఱియు నప్పురంబు పురుషోత్తముమహిమయుంబోలెఁ వర్ణనాతీతవైభవంబును, లక్ష్మీ
హృదయంబునుంబోలె నారాయణనివాసయోగ్యంబును, వేదాంతసారంబునుంబోలె
మహాయోగిదర్శనోపలాలితంబును, భాగవతపురాణంబునుంబోలె నచ్యుతావతార
కథాబహుళంబును, నరసింహుదివ్యరూపంబునుంబోలెఁ బ్రహ్లాదవరదగౌరవకారణం
బును, మహాగిరికంధరంబునుంబోలె హరినిద్రాసుఖోచితస్థానంబును, బుండరీకాక్షు
వక్షంబునుంబోలెఁ గమలాకరకమలరజోనురంజితంబును, శంకరువామభాగంబునుం
బోలె సర్వమంగళాలంకృతంబును, నహోబలతీర్థంబునుంబోలె భవనాశినీరాగాగత
సాధుజనానుష్టితహరిదర్శనోత్సవంబును, నిధిలోకంబునుఁబోలె సతతసన్నిహితము
కుందశంఖపద్మకాంతికమనీయంబును, సముద్రమథనావసానంబునుంబోలె దామో
దరదయాలబ్ధామృతముదితసుమనస్సముదయంబును, బాతాళంబునుంబోలె విశ్వంభ
రోద్వహనసమస్తభోగీంద్రభోగాస్పదంబును, జ్యోతిశ్చక్రంబునుంబోలె విష్ణుపదా
శ్రితనిరతమునిమండలానుగతధ్రువస్థానరమణీయంబును నగుచు ననేకనీలమణిప్ర
భానివహాంధకారితగగనభాగం బయ్యును పీతాంబరవిలసితంబును, శేషభోగాస్ప
దంబయ్యును నశేషభోగనివాసంబును, బహుసంయమిజనాధిష్ఠితంబయ్యును పరమ
ముక్తిపదంబును, సముత్తుంగగాంగేయభవభాసురంబయ్యును శిఖండివిహారహృద్యం
బును, వివిధవిలాసినీవిలసనోల్లసితంబయ్యును జితేంద్రియగమ్యంబును, సముద్రో

దరస్థితంబయ్యును సుకవిముఖవిరాజమానంబును విలయక్లేశంబునకు నగమ్య
ప్రదేశంబును, భయంబులకు ననాశ్రయంబును, ధర్మంబులకుఁ బరమధర్మంబును,
మోక్షంబులకు నపరోక్షంబును, మాంగల్యంబునకు నౌజ్వల్యంబును, నానందంబునకు
నిష్యందంబును, సౌభాగ్యంబునకు నిత్యయోగ్యంబును, నాశ్చర్యంబులకు ననేకధు
ర్యంబును, సకలభువనపోపణంబును, సకలదురితనిస్తారకంబును, సకలశ్రుతిపురాణవర్ణ
నీయంబును, సకలసాధుజనాకర్ణనీయంబును నైయుల్లసిల్లునట్టి వైకుంఠపురంబునందు.

55


శా.

రాకాచంద్రసహస్రకోటితులనారమ్యోల్లసత్కాంతియుం
బ్రాకారప్రతిహారతోరణసభాప్రాసాదవేదీవితా
నాకీర్ణంబును దీర్ఘకేతురతసౌధాగ్రంబు నై యొప్పు లో
కైకశ్రీకర మంబుజాక్షునగ రత్యాశ్చర్యధుర్యస్థితిన్.

56


ఉ.

ఆనగరంబురాజు వివిధాద్భుతరత్నమరీచిమండలో
త్తానలసద్విమానరచితం బగుభూరిభుజంగపుంగవో
న్మానమనోజ్ఞభోగగరిమంబున నుత్కటభవ్యయోగలీ
లానుభవంబునం బొలుచు నచ్యుతుఁ డాత్మవివేకయుక్తుఁడై.

57


శా.

హేమస్తంభమణిప్రదీపమణు లింపేసారుకర్పూరసా
రామోదం బెలరారు మేటితెర వొప్పారున్ లసన్మౌక్తిక
స్తోమప్రస్ఫురితోపహారవితతు ల్సొంపారు మాంగల్యర
క్షాముద్ర ల్దవరారుఁ జక్రధరుశ్రీశయ్యానివాసంబునన్.

58


ఉ.

చుట్టును గల్పవృక్షములు చుట్టును బుష్పలతావితానముల్
చుట్టును గేలిశైలములు చుట్టును సిద్ధరసాంబువాహినుల్
చుట్టును బూర్ణదీర్ఘికలు చుట్టును గోకిలకీరనాదముల్
చుట్టును హంసికాగతులు సొం పెసఁగున్ హరిమందిరంబునన్.

59


మ.

మును లేతెంచి నుతించుచుండుదురు సమ్మోదంబుతో నమ్రు లై
పను లాజ్ఞాపన సేయువేళలఁ దగం బాత్రు ల్నిలింపోత్తముల్
పెను పై కొల్తురు మూఁడులోకములు తృప్తిం బిన్న పెద్ద ల్మహా
ఘనతేజోనిధి యైనశ్రీవిభుశుభాగారాంగణక్షోణులన్.

60


ఉ.

ఆడుదు రెల్లప్రొద్దు లలితాభినయంబున దేవకామినుల్
పాడుదు రింపు వీనులకుఁ బండువ సేయఁగ వేడ్కఁ గిన్నరుల్
గూడి సమగ్రతత్త్వరసగోష్ఠి సుఖింతురు యోగిబృందముల్
క్రీడ యొనర్తు రష్టరసకీర్తితభంగిఁ బ్రసన్ను లయ్యెడన్.

61


వ.

ఆదివ్యమందిరంబునకు రక్షకులై యష్టదంష్ట్రులు చతుష్షష్టిదంతులు మహామస్తకవక్షస్థల
బాహుచరణదారుణాభిరామశరీరులు విచిత్రభూషణాంబరగంధమాల్యాంగరాగులు

నాయతశక్తియుక్తులును నానావిధాయుధహస్తులును నసమానసత్త్వసంరంభగంభీరు
లును నిరుపమావిధైశ్వర్యధుర్యులును నగువా రనేకశతసహస్రలక్షకోటిపద్మసం
ఖ్యల మొత్తంబు లై విష్ణుకింకరులు చండప్రదండాదులు పూర్వద్వారంబున గణపతి
యమప్రభృతులు దక్షిణద్వారంబునను గుధరకోరకముఖ్యులు పశ్చిమద్వారంబు
నను పద్మాక్షపద్మదుర్గేందుప్రముఖు లుత్తరద్వారంబునను నిరంతరంబు నుందురు మఱి
యుఁ జతుర్భుజులును శంఖచక్రధరులును బీతాంబరులును నీలాంబుదవర్ణులు నగ
ణ్యసంఖ్య లన్నగరికి నెల్లెడలనుం గావలియై చరియింతురు ఇట్టి గణకోటికి నెల్లమే
టియు నారాయణప్రసాదభాజనుండును నగువిష్వక్సేనుం డనుమహాపురుషుండు గణ
విమానసహస్రంబులు పరివేష్టింప నద్భుతవిమానారూఢుం డగుచు శ్రీమహాలక్ష్మిఁ
గూడుకొని తిరుగుచుండు నట్టియసమసామ్రాజ్యంబు జగదేకపూజ్యం బై తనకు
ననురూపం బగుచు నుండ నుద్దీపితుం డై.

62


సీ.

పద్మనివాసిని పట్టపుదేవియు నలినాసనుఁడు ప్రియనందనుండు
విహగాధినాథుండు మహనీయవాహనం బహికులాధీశుఁ డింపారుశయన
మతిలోకనందకం బద్భుతోజ్జ్వలహేతి ఘనపాంచజన్య ముత్కటపుఁ జింద
మింద్రాదిసురలు సమిధ్ధసేవకకోటి సిద్ధమునీంద్రు లాశ్రితగణంబు


తే.

ధర్మసంస్థాపనలు వినోదంపుఁబనులు, శ్రుతులు నుతు లిట్టి యతులితోన్నతులఁ జేర్చి
లీల బ్రహ్మాండకోటిఁ బాలించుచుండు, నార్తరక్షాపరుండు నారాయణుండు.

63


క.

ఆదేవుదివ్యమహిమం, బాదేవుఁడు తానె యెఱుఁగు నన్యుల కెఱుఁగం
గాఁ దరమె విధిపురందరు, లాది యయినదివిజులకును నందునె యెందున్.

64


సీ.

భూరిరజోగుణస్ఫురణపద్మజుఁ డనా భువనప్రపంచంబు పొడవుఁ జేయు
మహనీయసత్త్వసమాధివిష్టుం డనాఁ బొదలించు జగములఁ బొలుపు దెలుప
గాఢతమోగుణాకలన నీశుం డనా నొక్కట నిఖిలంబు నుడిచి యడఁచుఁ
గలితగుణత్రయోజ్జ్వలపరాత్ముం డనా నెగడి విశ్వమునకు మిగిలి వెలుఁగుఁ


ఆ.

గేవలుండె నిఖిలదేవచూడామణి, యఖిలదేవతామయైకమూర్తి
సకలదేవశరణచరణాంబురుహుఁడు ల, క్ష్మీశ్వరుండు జగదధీశ్వరుండు.

65


చ.

సిరి గరుడుండు చారుతులసీదళదామము కౌస్తుభంబు ప్ర
స్ఫురదురుశంఖచక్రములుఁ బొక్కిటితమ్మియుఁ బచ్చపుట్ట మిం
పురిలెడుచూడ్కియు నరుణ నూనినయుల్లము నైనమూర్తియే
నరహరి గ్రాలు వాఁ డొకఁ డనాథుఁ డశాశ్వతసౌఖ్యసిద్ధికిన్.

66


చ.

తపములఁ బోనిపాపములు దానగుణంబులఁ బోనిదోషముల్
జపముల నారిపోనికలుషంబులు దుప్పరఁ దూలిపోవు న

చ్చఁపుఁదలఁపొప్ప నొక్క మరి సర్వము నైన రమేశుపేరు తీ
యఁపుఁబలు కింపుమీఱ ననయం దొడగూర్పఁగ నేర్పుగల్గినన్.

67


క.

కరుణయుఁ దనకుఁ దొడవు త, త్పరచిత్తులదెసయ తనకు భాగ్యము భక్తో
ద్ధరణంబు తనకు భృతి శ్రీ, వరుఁబోలం గలుగు నొరుఁ డెవఁడు జగమందున్.

68


సీ.

నాలుగుమొగములబాలుఁ బొక్కిటితమ్మి సృజియించి జగములు సేయఁ బనిచె
నింపారుతెలినీటియే రంఘ్రితలమునఁ గలిగించి దురితము ల్గడుగఁ బనిచెఁ
దుదలు గానఁగరాని చదువులు మనసునఁ బొడమించి తగవులు నడుపఁ బనిచె
గర్వంపుఁగెంపులు కడకంటిచాయల బుట్టించి దివిజులఁ బ్రోవఁ బనిచెఁ


గీ.

దలఁపులకుఁ జేరుగడ తాన తెలువులకును
నిక్క దాన పలుకులకు నెడము దాన
యజరుఁ డమరుఁ డనంతుఁ డవ్యయుఁ డచింత్యుఁ
డనఘుఁ డజుఁ డంచితశ్లోకుఁ డచ్యుతుండు.

69


వ.

ఇట్టిపరమేశ్వరుండు పరమప్రభావభరణుం డగుచు భువనహితచరితంబులం బాపుచు
శుభంబులం జూపుచు భక్తజనపారిజాతంబనఁ బ్రఖ్యాతియుం గరుణారసప్రీతియుం
దనకు సహజంబు లై వెలయ వైకుంఠపురంబున విహరించుచుండఁ గ్రమంబునఁ దిమి
కమఠవరహాతారంబు లుదారంబులై ప్రవర్తిల్లిన యనంతరంబ యొక్కకాలంబున
నీలమణిసుందరం బగునింరాసుందరీదివ్యదేహంబునం బొదలుకాంతిప్రవాహంబుగ
సిగ్గున వెలుకఁబాఱినపోలికం జులుక నై వెలిమొగులు మొత్తంబులుం దెసలుకడ న్గడ
లుపడి తూలం బ్రకటయోగనిద్రావసానంబున నానందంబునొందుగోవిందులోచనా
రవిందంబులచందంబు ననుకరించుటకు నాయితం బయినకరణిం గమలంబులు కమనీ
యరుచినిచయంబులం బచరింపఁ బరమపురుషుపాణితలంబునఁ బ్రద్యోతమానంబగు
పాంచజన్యంబునకు నన్వితంబుగాఁ దశపూర్ణేందుబింబంబుగా నిబిడచంద్రికానిష్యం
దంబు నిగిడింప నీరజోదరుపోరురంబునఁ బొలుచువలుదమానికంబునకుఁ జేరువచుట్టం
బనాఁదగి యరుణకిరణుండు నిరావరణంబు లగుకిరణంబులవేఁడిమి మూఁడుజగంబుల
నిగిడింప సజ్జనచిత్తంబులం గేలివృత్తంబులు సల్పుజలశయనునిరతిశయగుణంబుల
కనుగుణంబు లైనయోజ రాజమరాళంబులు విమలకమలాకరంబుల విహరణకళాకౌ
శలంబులు సొగియింప జగదేకాశ్రయం బగు శ్రీవత్సలాంఛను నాశ్రితజనంబుల మ
నోరథంబులచాడ్పున సస్యసముదయంబులు సమగ్రఫలంబులం బొలుపార ననక్ర
విక్రమోదగ్రుం డగుచక్రధరుభావినరసింహావతారంబున విదారణీయుం డగు దైతే
యురుధిరబిందుసందోహంబుతోడిబాంధపంబు ననుసంధిపందివురుపగిదిబంధురబంధూ
కంబు లవంధ్యసహస్రదీప్తిం దిలకింప నకుంఠితకైవల్యకళ్యాణకారణం బగునపార

నారాయణమహిమాకారపారావారంబులం జేరుప్రబుద్ధజనంబులబుధ్ధులతెఱంగునం
గలంకదేరి యెరువుటెఱలి విలసిల్ల నుత్ఫుల్లహల్లకోల్లాసియుఁ గుముదామోదముదిత
మధుకరనికరంబును గువలయచ్ఛాయానుబంధాంధకారితకువలయంబును గాశప్రకా
శితాశావివరంబును నై శరత్సమయంబు సకలలోకాలంకారం బగుచున్నయెడ.

70


చ.

నిరుపమభోగితల్పమున నిర్మలయోగవిశేషలీలమై
శరనిధికన్యకామణీకుచద్వయకీలితవక్షుఁ డై మనో
హరసుఖనిద్ర నున్నకమలాక్షుఁడు మేల్కొనియె న్బయోధిపెం
దరఁగలమ్రోఁత మంగళమృదంగమృదుధ్వని యై చెలంగన్.

71


సీ.

నెరసినచిక్కని యిరుచన్నుగవచెన్ను పరిపూర్ణకుంభవిభాతి యనఁగఁ
జెలి గ్రాలుకన్నులఁ బొలయుమెఱుంగులు కోలునీరాజనలీల లనఁగ
జిగిమీఱుపలుచనిచెక్కులచెలువంబు రమణీయదర్పణరచన యనఁగఁ
దళుకొత్తుచిఱునవ్వుతెలుపులసొంపులు పుష్పోపహారవిస్ఫూర్తి యనఁగఁ


గీ.

దనమనోహరభావంబు దనవిభునకు, నుచితమంగళవిధముల నుల్లసిల్ల
మున్న మేల్కని మున్నీటిముద్దుకూఁతు, రమరె నీలాబ్జమధుపగానములు చెలఁగ.

72


చ.

ఉరుతరకల్పపన్నగఫణోజ్జ్వలరత్నసహస్రదీప్తి మైఁ
బరఁగఁ గరంబు పొల్పెసఁగెఁ బద్మదళాక్షునిమేను నూతన
స్ఫురదరుణాంశురాగరుచి సూరెలఁ బర్వఁగ నుల్లసిల్లు సుం
దరమహనీయనీలవసుధాధరశృంగము పాల్పుఁ బట్టఁగన్.

73


వ.

అంత.

74


సీ.

అంబుధినాదంబు నతకరించుచుఁ బర్వె నభమునఁ బాంచజన్యస్వనంబు
జయజయశబ్దవాచాలితం బయ్యె సుదర్శనలీల సుదర్శనంబు
ముదమలరారఁ గౌమోదకి బహువిధభ్రమణవేగమున నర్తన మొనర్చె
నఖిలైకనందకం బగునందకము మ్రోల దీప్తిపరంపర దీటుకొలిపె


గీ.

పసిఁడినీరుమీఁదఁ బడఁగినక్రియ నిజపక్షకాంతి దిశలఁ బ్రజ్వరిల్ల
నాదిదేవుమ్రోలఁ బ్రాంజలియై పొడ, చూపి నిలిచె భుజగసూదనుండు.

75


వ.

ఇట్లు బోధంబు నొంది కొండొకసేపు గోవిందుండు మందస్మితసుందరవదనారవిం
దుండగుచు నిందిరతోడ సరససల్లాపసౌహార్ద్రంబునం దగిలి కొండొకసేపు.

76


ఉ.

ఆనలినాయతాక్షినయనాంచలచంచలతాసవిభ్రమ
భ్రూనటనంబు నాతరుణిపూర్ణముఖేందువిలాసహాస మ
మ్మానినిముగ్దభాషణసమంచితమంజులలీల యెంతయున్
మానసమున్ బ్రమోదరసమగ్నముగా నొనరింప నున్నెడన్.

77

క.

డెందమునఁ గొలుపువేడ్కలు, సందడిగొన నేగుదెంచి సంయమివరులున్
బృందారకులు న్నిల్చిరి, క్రందుగ జగదీశమందిరద్వారమునన్.

78


వ.

అప్పుడు.

79


సీ.

అవసరం బిప్పుడ యగునంతదాఁకను బగళమై నిలుఁడు దిక్పాలవరులు
సందడిసేయక యందఱు నించుక సేపు కూర్చుండుఁడు సిద్ధమునులు
దండియలును మీరు దడియంగఁబడక యంతకమటుపొండు గంధర్వముఖ్యు
లిందాకఁ బొగడితి రించుకవడి యింక జగడంబు మానుఁడు చారణేంద్రు


గీ.

లనుచు నుద్ధతవేత్రదండాభిరామ, హస్తు లై మణిహారు లందంద నిలువ
నధికమై యొప్పె సమ్మర్ద మాదిదేవు, భూరిమందిరతోరణభూమియందు.

80


వ.

అట్టిసంకులసమయంబునందు.

81


క.

సనకుఁడు సనందనుండును, సనత్కుమారుఁడు సనత్సుజాతుం డనఁగా
మునివరులు వనజభవునం, దను లేతెంచిరి ముకుందదర్శనవాంఛన్.

82


వ.

ఇట్లు చొచ్చి యనివార్యగమనంబున నరుగుదెంచువారికి నడ్డపడి విష్ణుసారూప్యదే
దీప్యమానకాయులును దత్ప్రతిహారపాలనపదవీనిత్యనిరపాయులును జయవిజయ
నామధేయులును నగువా రిద్ద ఱమ్మునీంద్రుల కిట్లనిరి.

83


ఉ.

ఇప్పుడ మేలుకాంచెఁ బరమేశుఁడు సాగరకన్యకాంతతో
దెప్పలఁ దేలుచున్నతనతీయపుఁజూపులనేని యొండు మైఁ
ద్రిప్పఁడు పాఁపపాన్పుపయి దివ్యపదంబు పసిండిపాప యం
దొప్పఁగనేని మోపఁ డట నొండ్లును జేరరు పూని యెవ్వరున్.

84


క.

ఈసిద్ధు లీసురప్రభు, లీసంయమివరులు జగదధీశ్వరుఁ గొలువం
గా సమయము గాచి తదే, కాసక్తత నున్నచంద మటు గనుఁగొనుఁడా.

85


క.

మీరును నొక్కింతదడవు, సైరణతో నిలిచి సమయసముచితముగ ల
క్ష్మీరమణుఁ గని కృతార్థస, మారంభుల రగుఁడు తద్దయాలాపములన్.

86


చ.

అనుటయు నాదిదేవుఁ బరమాత్ముఁ గనుంగొన నెమ్మనంబులన్
మొనయుకుతూహలాంకురము మోడ్పడఁ గోపముచిచ్చుతాఁకునన్
ఘనతరబోధపల్లవము గందఁగ సైరణ యన్మహావ్రతం
బునకు విఘాత మొంద మునిపుంగవు లొక్కట నుగ్రమూర్తు లై.

87


ఆ.

అఖిలలోకగమ్యుఁ డగుపరమేశ్వరుఁ, జూడఁ గొల్వ నబ్బుసుకృతమునకు
నంతరాయ మైతి రట్టియద్దురితంబు, ఫలము ననుభవింపవలయు మీరు.

88


ఉ.

కావున ధర్మవిద్విషులు కల్మషకారు లనంగ దుష్టమో
హానిలబుద్ధితో నసురలై జనియింపుఁడు సంతతంబు ల

క్ష్మీవిభుమీఁదిమచ్చరము కిన్కయుఁ గాఱియఁ బెట్టుఁగాత మీ
భావము లిప్పు డేపగిది బాములు పెక్కగు నిక్క మెంతయున్.

89


వ.

అని వారు ఘోరంబుగా శపించిన.

90


క.

వెఱగుపడి హర్షరాగము, దఱకిన వదనములు వెల్లఁదనము గదుర బి
ట్టఱమూర్ఛ మునిఁగి యయ్యి, ద్దఱు నిలిచిన వేత్రదండతాడితతనులై.

91


వ.

ఆసమయంబున.

92


సీ.

ఇమ్మహాపురుముల కెంతమాత్రకుఁ గాఁగ నేలకో యీకోప మిట్లు పుట్టె
నమృతాంశదీధితు లగ్గి సల్లుట గాదె యీమూర్తులకుఁ గన నిట్లు కలిమి
యూహింపఁగాఁ గార్య మొకటి యేమేనియుఁ కలుగునూరక వీర లలుగువారె
సాత్వికు లై యిట్లు సైచిరిగాక యాయిద్దఱు నల్పులే యిద్ధమహిమ


గీ.

ననుచు మునులును సిద్ధులు నమరవరులు, నాదిగా నెల్లవారలు నచట నచటఁ
గూడి పెక్కుభంగుల మాట లాడుచుండ, దుముల మంబునిధిధ్వానసమతఁ బేర్చె.

93


వ.

ఆవృత్తాంతం బంతయుఁ దనదివ్యచిత్తంబున నవధరించి సకలజగన్నివాసుం డగువా
సుదేవుండు లక్ష్మీసహితంబుగా ససంభ్రమంబున నచ్చోటికి విజయము చేసి సనకాదు
లం జూచి మీరు సకలలోకద్వారంబుల ననివారితసంచారులకు వీరు చేసినతప్పు
నాయది యుపశమంబు నొందుండని యనునయించిన నయ్యోగీశ్వరులు మహాయో
గీశ్వరేశ్వరుండైన లక్ష్మీశ్వరుసందర్శనంబును సంభాషణంబునుం గని కృతార్థులై పర
మానందంబునఁ దదామంత్రణంబు వడసి నిజేచ్ఛం జనిరి. మధుమథనుండును మగిడి
యభ్యంతరమందిరంబునగుం జని వైనతేయుం బనిచి ప్రతీహారపాలురం దనపాలికి
రావించిన నయ్యిరువురుం బురాణపురుషునకుఁ బరమభక్తిప్రకారంబు లగు సాష్టాం
గదండప్రణామంబు లాచరించి కృతాంజలు లై యొక్కదెస నొదిఁగి నిలిచిన నప్పర
మాత్ముండు బహుళకారుణ్యపుణ్యావలోకనసాధాసారంబు వారలపైఁ బరపి దరహాస
ప్రసాదసాదరవదనుండగుచు నిట్లనియె.

94


క.

మీఱినమౌనులకినుకకు, మా ఱలుగక యున్న మీసమగ్రక్షమ వే
మాఱుఁ గొనియాడఁగాఁ దగు, గీఱునె సాత్వికులబుద్ధి కిల్బిషచయముల్.

95


ఉ.

ఎంతఁ గొఱంతఁ జేసియు మహీసురముఖ్యులు నాకుఁ జూడఁగా
నెంతటివారి కైనను సహింపఁగఁ బాత్రకు లమ్మహాత్ములం
దెంతటిపూజ్యు లైనఁ దగు నెంతటినున్నననైన నొప్పుఁ దా
రెంతలుగా మదిం దలఁతురేనియు నంతయుఁ దత్ప్రభావముల్.

96


సీ.

అజ్ఞానరోగంబు లలఁతబెట్టెడుచోట దివ్యౌషధంబు భూదేవసేవ
పురుషార్థసిద్ధులఁ బొందెడుచోటను, నమరభూరుహము విప్రార్చనంబు

దురితాంధకారంబు పరఁగిక్రమ్మినచోటఁ బటుభానురుచి బ్రహ్మభాషితంబు
దుఃఖభయంబులు దొడరి సోఁకినచోట నభయమంత్రము బ్రాహ్మణాశ్రయంబు


గీ.

సారభద్ర ముత్తమవర్ణచరణరజము, భవ్యతీర్థంబు బాడబపాదజలము
సకలజన్మంబులకు నగ్రజన్మకులము, చేరుచో టిది సిద్ధాంతసిద్ధమతము.

97


శా.

నారూపంబులు మేదినీసురలు నానారూపదీప్యత్తప
స్సారోదారులు భూరితేజులు జగత్సంభావ్యకోటిప్రసా
దారంభప్రతిభావిభాసితులు విశ్వాధారు లామ్నాయసం
స్కారాకారులు లోకసమ్మతయశోగంభీరతాజృంభితుల్.

98


క.

దైవాధీనము త్రిజగము, దైవము తన్మంత్రవశము తన్మంత్రము భూ
దేవతలచేతి దగుటను, దైవములకు దైవతములు ధరణీదివిజుల్.

99


ఆ.

బ్రాహ్మణావమానపరు లైనవారలు, నన్ను నాత్మనొల్లకున్నవారు
విప్రవరులఁ గరము వేడుఁ బాటించు, వార లెల్ల నన్ను వలచువారు.

100


వ.

కావున బ్రాహ్మణవచనాతిక్రమణం బొనరించిక జన్మాంతరంబులు గైకొనవలము, నతి
మాత్రశత్రుత్వంబునకు ననుమానింపవల దదియు నుదాత్తప్రదంబ, యట్లని శత్రుం
డు నిరంతరంబు మద్గతం బైనహృదయంబునం దస్మదీయసాదృశ్యంబు తనకు గావల
యుటం దలంచుటఁ దత్ప్రకారంబు సాయుజ్యసంపత్కారంబు మీరు చిరకాలంబు
నన్ను భజియించినదాసు లగుటంజేసి పరమైశ్వర్యభాజనంబులగుజన్మంబులఁ దేజో
విభవంబు లనుభవించి తుది నస్మదైక్యంబు నొందంగలవార లిదియంతయు నేను
మాయాబలంబున మీకు శ్రేయఃకారణంబులుగా నుత్సాదించిన యుపాయంబు సన
కాదులకాదు శర్వుం డైనమద్భక్తజనంబుల ధిక్కరింప శక్తుం డగునె? యిత్తెఱంగు
మాంగళ్యంబుగా నంగీకరించునది, యంతరంగంబుల కలంకదొలంగుఁ డని యానతిచ్చి
వెండియు ని ట్లనియె.

101


మ.

పగవాఁ డైనను మూర్ఖచిత్తుఁ డయినన్ బాపాత్ముఁ డైనన్ మదీ
యగుణధ్యానవిధేయధీపరిణతుం డై యున్న నే నాతనిన్
సుగుణుంగా నతిధన్యుఁగా సుజనుఁగా శుద్ధాత్ముఁగా నిత్యుఁగా
జగదేశప్రభుఁగాఁ బ్రభూతవిభవస్ఫారాత్ముఁగాఁ జేయుదున్.

102


శా.

ఏ నెవ్వాఁడనొ నాచరిత్రముతెఱం గెబ్బంగియో మన్మయ
ధ్యానం బెట్టిదియో యెఱుంగని విమూఢాత్ముండు మన్నామ మె
ట్లైనం బేర్కొనఁ గాంచునేని దురితోదగ్రాంధకారచ్ఛటా
భానుం డీతఁ డనంగ భవ్యపదముం బ్రాపించువాఁడునా మదిన్.

103


క.

నారాయణాఖ్యుఁ డగుసుతుఁ, బేరుకొనినబోయ కెట్టిపెం పొదవెను వాఁ

డేరూపువాఁడొ ముందఱ, మీరటు దలపోయుఁ డాసమీహితబుద్ధిన్.

104


వ.

మదీయశరణాగతుల రగుటంజేసి మీకు నెందును శుభంబ సకలచరాచరజనకుం డైన
కశ్యపుమహామునాంద్రుండును దక్షకన్యావరేణ్య యగుదితియునుం దొలుత భవిదుద్భ
వకారణం బయ్యెదరు ప్రహ్లాదవిరోచనబలిప్రముఖు లగుభాగవతోత్తములు భవ
దీయవంశంబునం బరమపావనులై యుదయించెదరు అని యిట్లునిర్దేశించినదేవదేవు
నానతి నానందంబు నొంది యయ్యిద్దఱు ముకుందుసకు నందంద మ్రొక్కుచు బహు
విధంబులఁ బ్రస్తుతించిరి. హరియుం బేరోలగం బిచ్చి నిజదర్శనార్థు లగు సురముని
ప్రముఖులఁ గృతర్థులం జేసి నిఖిలజగంబుల రక్షించుచుండె నంత.

105


క.

ఆజయవిజయులు పుట్టిరి తేజంబునఁ గశ్యపునకు దితికిని సుతులై
రాజితదైతేయకుల, భ్రాజిష్ణసుఖైకయోగ్యభాగ్యస్ఫురణన్.

106


క.

అని గాలవమునివరునకు, ననఘుఁడు దేవశ్రవుండు హర్షముతోఁ జె
ప్పిన పుణ్యకథన మంతయు, వినుతోక్తుల విస్తరించి వెండియుఁ బ్రీతిన్.

107


ఆశ్వాసాంతము

క.

సౌభాగ్యభాగ్యలక్ష్మీ, లాభోన్నతవక్ష భువనలాలితరక్షా
లోభాదిహితసంప, ద్వైభవభవ్యాత్మలక్ష్య ధర్మాధ్యక్షా.

108


మానిని.

భూరికృపారసపోషణ కౌస్తుభభూషణ దుస్తరభూమభవో
త్తారణ దైత్యవిదారణ విశ్వవిధాయక మంగళదాయక నా
బీరుహపంకజపీఠచతుర్ముఖప్రేషితదుర్ముఖ పేశలధా
రారుచిరాసిధరా దురితాగ్నిశరా నృహరీ గుణరత్నగిరీ.

109


క.

వినతవిశారదనారద, మునిమధురోద్గీతనినదమోదభ్యస్తా
దనుసుఖఖండనమండన, సునిశితనిర్వక్రచక్రశోభితహస్తా.

110


వనమయూరము.

స్ఫారగుణహార శ్రుతిసార జగదేకా, ధార విదుదార నగధార ననమేఘా
కార యవికార యనికార కరుణాలం, కార భవభావశుభకారణవిహారా.

111


గద్యము.

ఇది శంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్యధుర్య
శ్రీసూర్యసుకవిమిత్రసంభవ శంభుదాసరక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయప్రణీ
తంబైన లక్ష్మీనరసింహావతారం బనుపురాణకథయందుఁ బ్రథమాశ్వాసము.