నృసింహపురాణము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ద్వితీయాశ్వాసము

శ్రీమదహోబలతీర్థ
గ్రామణి శ్రుతికామినీశిఖాముణి కరుణా
ధామ జగదవనవిహిత
స్థేమ దురితకరటిసింహ శ్రీనరసింహా.

1


వ.

దేవా రోమహర్షణుండు మహర్షుల కిట్లనియె. అట్లు పుట్టి హిరణ్యకశిపుహిరణ్యాక్షు
లనుపేళ్లఁ బ్రసిద్ధివహించిన యయ్యిద్దఱు దైత్యులయందును నగ్రజుండు.

2


సీ.

కనుబింకపుఁగింకఁ గలుగువేఁడిమియెల్ల నొక్కటియై యొడ లొత్తె ననఁగఁ
కఱకుఁ బ్రల్లదమునఁ గల్గుపోఁడిమియెల్ల నచ్చ మై తెగఁబొడ వయ్యె ననఁగఁ
గటిక యై తనరారుగర్వంబునకుఁ గల చేగ యెల్లను రూపు చెందె ననఁగ
వెగ్గలంబై పేర్చు వీరంబునకుఁ గలపసిక యెల్లను మేను వడసె ననఁగఁ


గీ.

బ్రళయకాలదహనుఁ బాటించుదొర యనఁ, జండదండధరునిసఖుఁ డనంగఁ
దేజరిల్లె నైజతీవ్రమానమన హి, రణ్యకశిపుఁ డపశరణ్యరిపుఁడు.

3


మహాస్రగ్ధర.

తనదోర్దర్పంబు తెల్పం దలచి సరభసోత్పాతదిగ్దంతిదంత
ధ్వనితబ్రహ్మాండవాద్యోత్తరళితగతులం దారతారౌఘముక్తా
జనితప్రాలంబరాకాశశధరకలికచ్ఛత్రుఁ డై మేరుసింహా
సన మెక్కం జూచు దైత్యేశ్వరుఁ డతులనిజైశ్వర్యవిఖ్యాతి నొప్పన్.

4


ఆ.

అసురు లనినఁ జంప నలుగు నవ్యాహారు, లనిన నోరికళ్లు గొనఁగఁ దలఁచుఁ
ద్రిదివరాసు లనిన నదుమంగఁ జూచుఁ బా, తాళమునకు దేవతల నతండు.

5


క.

ద్వేషించు నాగమంబుల, రోషించున్ ధర్మపదనిరూఢస్థితికిన్
బోషించు మత్సరోద్ధతి, భూషించు మదాతిరేకమునఁ జరితంబున్.

6


వ.

ఇట్లు ప్రకృతిపారుష్యదూష్యప్రకారుం డగుచు నయ్యసురవకుండు సంతతెశ్వర్య
విహారంబుల వర్తిల్లుచుండి తనమనంబున నొక్కనాఁ డిట్లు వితర్కించు.

7


చ.

అమరులతల్లికంటెను మదంబ వరిష్ఠ త్రిలోకరాజ్యభో
గములును నాక యోగ్యములు గాని నిలింపుల కెట్లు గల్గు ను

ద్యమగరిమంబుమై సురల నందఱ మ్రుచ్చులఁ బోలెఁ దీవ్రదం
డమునను జంపి యెన్నఁ దగ దక్కఁగ నేలుదు లోక మంతయున్.

8


క.

కావునను గ్రపుఁదపమున్, గావించెదఁ దపముచేతఁ గానివి కలవే
యేవిధము పనులకైనను, గేవలబలమున నుపాయకృత్యము వెలిగన్.

9


సీ.

అమరపదంబును నమరేంద్రపదము తపంబనుభూజంబుపండ్లు గావె
సప్తర్షిపదము భాస్వద్ధృవపదమును దపమను పువ్వుగంధములు గావె
పద్మజుపదమును బద్మాక్షుపదము నున్నతతపశ్శక్తిరత్నములు గావె
సిద్ధపదంబును శ్రీకంఠుపదమును రూఢతపోభానురుచులు గావె


గీ.

తపములావునఁ గాదె యిద్ధరణివలయ, మఖిలమును దాల్చియున్నవాఁ డహి యొకండ
కాన ధర్మార్థకామమోక్షముల కెల్లఁ, దపము సాధన మగుట సిద్ధంబ కాదె.

10


క.

పోయెద నిప్పుడ యుద్యద, మేయతపోనిష్ఠ నజుని మెచ్చించెద మ
త్కాయక్లేశవ్రతవిధి, నేయుల్లములైనఁ గరఁగ కెమ్మెయి నుండున్.

11


వ.

అతి తలపోసి యప్పుడ కదలి మునిసిద్ధసేవితం బైనగంధమాదనంబునకుం జని యందు
జటావల్కలాజినప్రముఖతపోలక్షణలక్షణీయాకారుం డై యాధీరుండు.

12


క.

నాలుకలు గ్రోయువహ్నులు, నాలుగుదిక్కుల నమర్చి నడుము నిలిచి సూ
ర్యాలోకనపరుఁ డై మును, గా లొక్కటి మోసి నిలిచె ఘర్మపువేళన్.

13


సీ.

ఏపారుతుఱఁగలి నెఱమంట లొండొండ వ్రేసిన నేమియు వెగడుపడక
వడిగాలి సురిఁగిన మిడుఁగురు లందందఁ బొదివినఁ దాలిమిఁ బ్రిదులనీక
పొంగారి దట్టంపుఁబొగలు దూరుకొనంగఁ బర్విన నెంతయు బ్రమసిపడక
యఱిముఱి నల్గడ నడరి పెన్గొఱవులు పైఁబడ్డ గడలకుఁ బాసిచనక


గీ.

దిట్టతనము పేర్మి దేహాభిమానంబు, విడిచి నిష్ఠ యేడుగడయుఁ గాగఁ
బరమతప మొనర్చెఁ బంచతపస్సుల, కితఁడె యెక్కుఁ డనఁగ దితిసుతుండు.

14


శా.

విద్యుత్కేతువు లొప్ప శక్రధనురావిష్కారఘోరంబుగా
నుద్యద్గర్జితదుందుభిధ్వనులతో నుగ్రాంబుదవ్యూహముల్
మాద్యద్భాస్కరమండలాక్రమణసామగ్రిన్ దివిం బర్వె నే
కోద్యోగంబున గ్రీష్మశాత్రవునివీరోత్సాహమున్ దూలఁగన్.

15


క.

తొలువానలు గురియఁగఁ ద, జ్జలనివహము దైత్యవిభునిసంతప్తాంగం
బులయందుండి దినౌర్వ, జ్వలనశిఖల డిందు జలధిసలిలముపోలెన్.

16


తే.

బట్టబయటఁ బ్రౌఢపద్మాసనస్థుఁడై, యున్నయతనిమీఁద నొక్క పెట్టఁ,
గులనగంబుమీఁద గూల్చువిధంబునం, కూల్చె జలధరములు ఘోరవృష్టి.

17


స్రగ్ధర.

దీర్ఘస్ఫీతాంబుధారల్ దెరలఁ బొదువ నుద్వేగదూరుండు స్ఫూర్జ
న్నిర్ఘోషోత్తర్జగర్జానినదము లడరన్ నిశ్చలాంగుండు ప్రేంఖన్

నిర్ఘాతోత్పాతవిద్యున్నికరము లడగన్ నిర్వికారుండు ధైర్యం
బర్ఘాతీతంబుగా నయ్యసురవరుఁడు వర్షాగమం బట్లు పుచ్చెన్.

18


క.

పదపడి హేమంతునిసం, పద యొయ్యున శీతగిరి యుపాంతమువలనం
గదలి చనుదెంచుపయ్యన, నొదవి తనమయంబ యగుచు నొప్పుగఁ బర్వెన్.

19


ఉ.

ఒక్కట మైహికంబు లగు నుత్తరమారుతము ల్శరీరముల్
వ్రక్కలు సేయ నేతెఱఁగువారికి నోర్వఁగరానిరాత్రులన్
బుక్కిటిఁబంటినీటఁ బరిపూర్ణఘనస్థితి నిల్చి దానవుం
డక్కజ మైననిష్ఠఁ గొనియాడఁగఁ బట్టుగఁ బొల్చె నెంతయున్.

20


సీ.

దనుజఘోరతపోగ్రతకుఁ దలంకినమాడ్కిఁ గమలిననెత్తమ్మి కన్నుమూయ
వ్రతమువేఁడిమినెమ్ము దితిజుమేనికి నోడు క్రమమునఁ గడలుఁ దీరమున కొదుఁగ
నసురవెచ్చనియూర్పు లడరెడునింకెడు నీటి మారసమంచు నీరు గురియ
జలదేవతలు చైత్యుకలితనం బగ్గించు సెలగున సారసోక్తులు చెలంగ


గీ.

దివిజవైరితమము తెఱఁగెల్లఁ గంటికి, నిదురలేక చూచునదియుఁబోలె
వికచకుముదనేత్రవిభవయై చె, న్నొందె దానవేంద్రుఁ డున్నసరసి.

21


వ.

మఱియు నమ్మహావ్రతుండు తపోవిశేషాభిలాషంబు దనకుం బరిపోషణం బొనరింప
నిర్దోషహృదయుండై కడంగి.

22


తే.

వేళ్లదిండ్ల గూరలఁ గొంత నీళ్లఁ గొంత, గారవమునఁ దపోయాత్రఁ గోరి నడపె
గాడ్పు గ్రోలుచు మఱికొంతకాల ముండె, వెండి యాచందమునన దా విస్మయముగ.

23


వ.

ఇవ్విధంబున ననేకసంవత్సరంబులు ధీరవ్రతాచారుండై యున్నయాదైతేయతా
పసుతపంబుపెంపునకుం దలంకి పురందరుండు దేవగురునాశ్రమంబునకుం జని నమ
స్కరించి యతనిచేత నాశీర్వచనంబుల నభినందితుం డై యి ట్లనియె.

24


మ.

జనకుం డొక్కఁడ వేఱుతల్లులు జగత్సామ్రాజ్యపూజ్యస్థితుల్
దనకుం బా లనుచున్ సమత్సరమతిన్ దైతేయుఁ డత్యుగ్రద
ర్శనదుర్వారతపస్కుఁ డయ్యెఁ గరుణాసంపన్నుఁడౌ దాతప
ట్టునఁ బ్రత్యక్షత నొంది మత్పదవి వేఁడున్ వాఁడు నెబ్భంగులన్.

25


క.

అసురతపంబు జగంబుల, కసహ్యమై యునికిఁజేసి యంబుజభవుఁడున్
వెసఁ దత్ప్రశమనమునకై, యసంశయము దివిజరాజ్య మతనికి నొసఁగున్.

26


క.

నిను నాశ్రయించియును నే, ననఘా కడలేనివనట యనువననిధిలో
మునుఁగుదునె ప్రతీకారం, బొనరింపఁగదయ్య దీని కూహించి కృపన్.

27


చ.

అనుటయు దేవమంత్రి దరహాసముతో దివిజేంద్రుఁ జూచి యి
ట్లను నిది యేమి భీతిలఁగ నంచితసత్యతపోనిరూఢి నీ

కనినపదంబు ద్రిప్పఁగ జగత్పతి పద్మజు కైనఁ బాడియే
విను దితిసూనుఁ డివ్విధము వేఁడెద నన్నను నాలు కాడునే.

28


వ.

అదియునుంగాక.

29


సీ.

ఏదేవుతుదమొద లెఱుఁగక నేఁడును శ్రుతిమార్గములు బహుగతులఁ దిరుగు
నేదేవు నాత్మలో నీక్షించు ధన్యులు ప్రార్థనీయులు పద్మభవుని కైన
నేదేవులీలలై యెసఁగు జగంబులు సృష్టిరక్షాసమాపేక్షఁ బరఁగు
నేదేవునకు సాటి యేదేవుఁడును గాఁడు నానాగమోక్తనిర్ణయము లొప్ప


గీ.

నట్టియాదిదేవు నంబుధిశయను ల, క్ష్మీకపోలముకురమితముఖాబ్దు
నాశ్రయించినాఁడ నతఁడు నీయెడఁ గృపఁ, గలఁడు నీకు నేల కలుగఁ డనఘ.

30


ఉ.

పొందవు దుఖముల్ భయము పొందదు పొందదు దైన్య మెమ్మెయిన్
బొందవు తీవ్రదుర్దశలు పొందుఁ బ్రియంబులు పొందు సంపదల్
పొందు సమగ్రసౌఖ్యములు పొందుఁ సమున్నతకీర్తు లెందు గో
విందపదారవిందపదవీపరిణదగరిష్ఠచిత్తులన్.

31


క.

తను నెబ్బంగిఁ దలంతురు, జను లాభంగిన తలంచు సరసీరుహలో
చనుఁడును వారలఁ గావున, ననిశంబు కృతార్థమతులు హరిజనభక్తుల్.

32


క.

హరిభక్తుతపము తపము, హరిభక్తుజపము జపము హరిభక్తులభా
సురజన్మము భవసారము, హరిభక్తులు భువనపావనైకవిహారుల్.

33


క.

హరి యను రెండక్కరములు, దొరకొనఁ దీపొసఁగు జిహ్వతుది నెవ్వని క
న్నరుఁ డొకఁ డభ్రుఁడు భవసా, గరనిస్తరణప్రకారకౌశలమునకున్.

34


సీ.

దారుణదురితాంధకారసూర్యోదయం బధికపాతకవిపినానలంబు
నిబిడకల్మషమేఘనిర్భరపవనంబు బాఢపాపాంబుధిబాడబంబు
క్రూరకిల్బిషశైలకులిశనిపాతంబు ఘనకలుషోరగగరుడమూర్తి
ఘోరదుష్కృతకాలకూటగంగామౌళి యతులాఘహరిణపంచాననంబు


గీ.

సకలకల్యాణమూలంబు సకలవేద, శాస్త్రపాఠంబు సకలార్థసంచయంబు
సకలమంత్రరహస్యంబు సాధుహృదయ, నర్తనము విష్ణునామసంకీర్తనంబు.

35


శా.

వేదాంభోధి మథించి వెండియు మహావిస్తీర్ణశాస్త్రార్థసం
వాదంబు ల్దలపోసి చూచి బలువై వర్తిల్లులోకోక్తియున్
గాదౌ నంచు గణించి యొక్కతలఁపై కాదే మునిశ్రేణి సం
పాదించెన్ హరిసేవనంబుఁ దగ సంభావ్యంబు సేవ్యంబుగన్.

36


ఉ.

శ్రీస్తనకుంకుమద్రవనిషిక్తభుజాంతరభాగవిస్ఫుర
త్కౌస్తుభరత్ననూత్నరుచిగర్వితనాభిసరోజసౌరభ

ప్రస్తుతమత్తభృంగరవరాగరసోల్బణభోగిభోగత
ల్పాస్తరణుం దలంచుసుకృతాత్తు లపాస్తసమస్తకల్మషుల్.

37


వ.

అని పలికి యాఖరదూషణశోషణపరాయణపదద్వయనిరాకరణకారణంబుగా నఖిల
దురితోత్తారణం బైననారాయణమంత్రంబు సవిశేషసంస్కారంబుగా నుపదేశించి
యిది పరమగోప్యం బైనజప్యంబు నీవు నియతమానసుండవై దీనిన సేవింపుము దుస్సి
తులెయ్యవియు నిన్నుం బొరయ లేకున్నట్టు నిమ్మహావాక్యప్రభావంబు భావింప నెవ్వ
రికి నశక్యంబు.

38


తే.

అంబుజాసనుఁ డాదిగా నాద్యు లెల్ల , నిమ్మహామంత్రపరమార్థ మెల్లనాఁడు
నాత్మఁ గన్గొని ముదమంది యాచరించి, యభినుతించి భజింతు రత్యంతనియతి.

39


వ.

హిరణ్యకశిపుతపోవిబృంభణంబునకు భయం బందవలదు, దైత్యులయైశ్వర్యం బయ్యు
ను దుదిముట్టనేరదు. నీరజోదరుతోడిమాత్సర్యంబు కార్యంబుగాఁ దలఁచువారికి
నేరూపంబున నిత్యోన్నతులు గలుగ నేర్చునె? విష్ణుద్వేషంబును నిరంతరదోషంబు
ను శ్రుతిధర్మవిరోధంబును సుజననిరోధంబును నసురస్వభావంబులు గావున.

40


క.

నారాయణవిద్విషులకు, గ్రూరుల కాయువును శ్రీయుఁ గులము బలంబున్
బేరును బెంపును బొలయును, ఘోరనరకకూపములను గూలుగురు తుదిన్.

41


తే.

విష్ణుఁ డిహపరదైవంబు విష్ణుదేవు, నొల్లమియ యిహపరముల నొల్లకునికి
విష్ణుపదభక్తిభావపవిత్రుఁ డగుట, యైహికాముష్మికప్రీతి నందఁ గనుట.

42


మ.

అనువాచస్పతిభాషణంబులకు నాహ్లాదంబు సంధిల్ల న
య్యనఘుం డచ్యుతపాదసంస్మృతిరసైకాయత్తచేతస్కుఁడై
మునివంశోత్తమునంఘ్రిపదము శిరంబుం జేర్చి వీడ్కోలతం
డొనరింపన్ జనియెన్ పురంబునకు నిత్యోద్భాసితైశ్వర్యుఁడై.

43


వ.

చని వెండియు వివిధవితర్కజనితపరిస్పందం బగుడెందంబు డిందుపఱుపనేరక సుర
విభుం డసురతపంబునకు నపాయం బాపాదించునుపాయంబు ప్రయోగంబు చేయుట
మేలుకాక యని తలంపు పుట్టిన నప్పుడ రంభా ప్రభృతు లగునప్సరోవనితలం బిలి
చి గౌరవంబుగా నేకాంతంబ యక్కాంతల కిట్లనియె.

44


శా.

లావణ్యోదయముల్ ప్రియంబు లుచితాలాపమ్ము లాటోపముల్
భావంబుల్ చతురస్వభావములు చెప్పం బెద్ద మీయందు మీ
కీవిశ్వంబున గెల్వఁగూడనివిభుం డేవాఁడు లేఁ డిప్పుడున్
దేవేంద్రస్థితి మీరు కల్గుటఁ గదా దీపించె రూపింపఁగన్.

45


ఉ.

మించినపేర్మి నేయెడల మిన్నులు ముట్టి వెలుంగునట్టి నూ

ఱంచుల కై దువుల్ తృణకణాకృతియై వెడబాయఁ బేర్చి ద
ర్పించిన ధీరచిత్తములఁ బెల్కుఱనాటికలంక నాకు మీ
యంచితచారుచంచలకటాక్షము నమ్మినయస్త్ర మిమ్మెయిన్.

46


సీ.

ఉల్లంబు మీచూడ్కు లుచ్చిపోకకుఁగదా వాలమ్ములకు నోర్చు వారికోర్కి
మీక్రొవ్వుఁజన్నులమీఁదియున్కి, యగదా వ్రతముల నరిగెడువారియాస
లీల మోకెమ్మోవి గ్రోలుటకైకదా వడిసోమరసమాను వారితకృష్ణ
మీయింపుఁగూటమి మెఱయుటకైకదా వనితలఁ దొరఁగెడు వారితివుట


గీ.

పుణ్యసస్యంపుఁబంటలు భూరినియమ, తరుఫలంబులు సౌఖ్యాధిదైవతములు
నిఖిలసంసారసారంబు లఖిలలోక, రత్నములు మీర లప్సరోరమణులార!

47


ఉ.

మానము ప్రోదినై నియతమాత్రముగాఁ బొడవై ధరిత్రి నె
వ్వానికి వ్రాలకున్న గరువంపుశరంబును నంచఁ జూచుచు
న్మానమహత్త్వధన్యుఁ డగుమానిసి యైనను రోషవిభ్రమ
భ్రూనటనాభిరామ లగుపొల్తులపాదతలంబుచేరువన్.

48


చ.

వ్రతములఁ గొల్చి శీలముల వ్రచ్చి జపంబులఁ గ్రోలి యుత్తమ
క్రతువులఁ దోలి యోగములు గ్రాఁచి తపంబుల వేచి యందు న
ప్రతిహతలీలమై మదనుబాణచయంబులతోడునీడలై
ధృతులు తలంచుచుండు సుదతీమదతీక్ష్ణకటాక్షకోణముల్.

49


సీ.

చామలనగుమోముఁ జందురుపొడవున రాగాంబుధులు నిట్ట గ్రమ్ము ననుట
పొలఁతులనునుదీపుపలుకులయింపున నుల్లంబు నోలంబు నొందు ననుట
మెలఁతలతఱచురెప్పలవలిగప్పులు జవనంపుఁజీఁకటి గవియు ననుట
చెలువలనిద్దంపుఁజెక్కులచాయలభావము ల్వెలవెలఁ బాఱు ననుట


గీ.

యద్భుతంబు లై విపులభవాబ్ధిఁ దిరుగు, జనులహృదయంబు లనియెడుజలచరములు
లీలఁ దిగువంగ వలరాజుకేల నున్న, బలువలలు గావె కాంతలచెలువు లెల్ల.

50


క.

కావున మీతెఱఁ గంతయు, భావించి జగద్ధిత మగుపని యొక్కటి సం
భావముతో మిముఁ బనిచెద, నేవిధమున నైన నిర్వహింపఁగవలయున్.

51


క.

దితిజుఁడు హిరణ్యకశిపుఁడు, వ్రతచర్యానిష్ఠ నున్నవాఁ డాతని ధీ
కత గంభీరతయును విక, లత నొందింపుఁడు భవిద్విలాసప్రౌఢిన్.

52


ఉ.

మీ రిటుపూని యీక్రమము మేకొని చేసిన దివ్యరాజ్యల
క్ష్మీరమణీయవైభవము చిందిలిమందిలిగాక దక్కుఁ బెం
పారఁగ నాకు నాకులజరామరతాగరిమం బొకింతయున్
బేరు నొదంగనీ కడరుఁ బ్రీతి భుజింతు నభీష్టబోగముల్.

53

వ.

చనుఁ డసురేంద్రుఁ డున్న వికచద్దృమపుష్పసుగంధిగంధమా
దనవనభూమికిన్ భవదుదంచితయోగ్యసహాయలీ కై
పనిచెద నీక్షణంబ మధుపవ్రజకోకిలకీరమీనకే
తనమధుమానసాస్పదసుధాకరదక్షిణమారుతంబులన్.

54


వ.

అనిన నయ్యింతు లందఱు నట్లకాక యియ్యకొని రప్పుడు తిలోత్తమ యయ్య
మరోత్తమున కి ట్లనియె.

55


సీ.

ఏను గ్రీఁగంట నొక్కించుక చూచిన ఖలుడెంద మైనను గరఁగు ననిన
నాయింపుఁబలుకు కర్ణములు సోఁకినఁ బితామహుఁ డైన జదువులు మఱచు ననిన
నేను దియ్యమున నటించిన హరుఁ డైన మరునికన్నులసన్న దఱుగు ననిన
నారూపు చూచిన శౌరియు నహితల్ప ముడిఁగి పల్లవశయ్యఁ బొరలు ననిన


గీ.

నరతి యైనఁ దాల్మి యను కైన నుల్లంబు, చులక నైనఁ దసము లులక నైన
నేమములతపంబు నిల్చునె నాయెదు, రెదుర నధిప మాట లేల యింక.

56


క.

చూచెదవు గాక యే నిటు, చూచిన నయ్యసురతపము సొంపఱి వ్రతిని
ష్ఠాచరణము తూపర మగు, గోచరమై మనసు త్రిప్పుకొని సోలంగన్.

57


వ.

అని పంతంబులు పలికిన యమ్మగువమాటకు మరున్నాయకుండు మనంబునం బ్రమ
దంబు నొందె. నయ్యిందువదన లందఱు పురందరు వీడ్కొని చని గంధమాదనంబుఁ
జొచ్చిరంత.

58


క.

వారలతోడనె యాత్మ, స్ఫారవిభవ మెల్లఁ గొని వసంతుడు దనయా
కారంబుఁ జూపె నక్కాం, తారంబున శిశిరసమయదర్పావహుఁ డై.

59


చ.

ఇదె చనుదెంచెఁ జైత్రుఁ డని యెల్లవనంబులకుం బ్రమోదముల్
పొదలఁగ మేనివార్త గొని బోరున వచ్చిన దాడికాఁ డన
న్మృదువనదేవతాముఖసమీర మెదుర్కొన నుల్లసిల్లె నిం
పొదవఁగ దక్షిణానిల మనూనమనోహరఖేలనంబునన్.

60


ఉ.

పండినమ్రాకు డుల్లి నవపల్లవముల్ తిలకింపఁ బూఁబొదల్
నిండఁగఁబర్వె లేఁగొనలు నిద్దములై నిగుడంగ మ్రాకు లొం
డొండఁ దలిర్చె నామని సముజ్జ్వలయోగరసాదనక్రియన్
గొండికపాయముల్ మగుడఁ గోరి భజించినసిద్ధులో యనన్.

60


ఉ.

ఎందును బుష్పసౌరభమ యెందును మందమదాలిఝంకృతుల్
ఎందును సాంద్రపల్లవము లెందును గోకిలకంఠకూజితం
బెందును విస్ఫురత్ఫలము లెందును గోమలకీరభాషితం
బందము లయ్యె మందమరుదంచితచారువనాంతరంబులన్.

61


తే.

సరసకింశుకకోరకసంచయంబు, చెలువు తిలకించె భావినృసింహదేవు

దీప్తినఖపంక్తి ప్రకటదైతేయరుధిర, సేకరుచి నొప్పు తెఱఁగు సూచించినట్లు.

63


ఉ.

కాముఁడు లోక మంతయును గైకొని పట్టము గట్టికొన్నఁ బే
రామని చేయుపండువులయం దొడఁగూడినదివ్యగంధముల్
నామెఱుఁగారుక్రొవ్విరు లెలర్చినసంపెఁగ లొప్పెఁ గామసం
భ్రామితకామిచిత్తశలభంబులు గ్రందుగఁ జెందు మ్రందఁగన్.

64


చ.

అవిరళచారుకోరకచయంబుల లోకములంద చూడ్కులం
దవులఁగఁ జేసె నెల్లెడలఁ దద్వనభూములగాఢరాగముల్
యువతులచిత్తవృత్తముల నూన్ప ననంగుఁడు సంగ్రహించె నాఁ
బ్రవితతలీల బెల్లెసఁగెఁ బల్లవసంతతి గుత్తులో యనన్.

65


చ.

తనియక కమ్ము లిచ్చి చవి దాఁకినచొక్కునఁ గన్ను వ్రాలఁ జం
చునఁ జవికాటుగాఁ గఱచుచు న్నవచూతజపల్లవంబు గై
కొని విహరించుకోకిలము కొమ్మల తియ్యని మోవి మోవిమో
హనరుచిఁ బాసి పందుపథికావలికిం కటఁజేసె నామనిన్.

66


సీ.

అంచబోదలమోద మారంగఁ జెక్కిళ్లు గొట్టుచు నెలదోడుకొనలు నలుప
నలిబాలికల ముదం బెలరారఁ పింపిళ్లు గూయుచు మధువులు గ్రోలి సోల
జక్కవడో లక్కజపువేడుకల దిమ్మదివురన కరువలి దిగిచికొనఁగ
మలయానిలుఁడు గర్వ మలరంగ గుఱువులు వాఱుచు నెత్తావిచూఱలాడఁ


గీ.

బసిఁడిగద్దియగా గ్రుద్దపైకరంబు, ప్రీతి నెలకొన సిరి పేరుఁ బెంపుఁబడయఁ
గామినులచూడ్కి రేకులకాంతి వడసి, దర్పమునఁ గ్రాల నొప్పారెఁ దమ్మివిరులు.

67


చ.

వలివిరవాదిక్రొవ్విరులవాతుల మూఁతులు వెట్టి తేనియల్
కొలఁదికి మీఁరఁ గ్రోలికొని కొవ్వున జివ్వల నీన నొక్కమై
దలముగ దీటు గట్టుకొని దాఁటెడుతేఁటులచైద మెల్లెడన్
గలయఁగ వృక్షవాటికలఁ గ్రమ్మై నకాలతమోనికాయముల్.

68


తే.

పొగడమ్రాకులమొదలను బుష్పరసము, దొరఁగి నెత్తావియందును నెరయ నొప్పెఁ
బూచుకొఱకు నైయున్న యింపులు దలిర్ప, గడఁగి వనలక్ష్మి యుమిసినకళ్ళ యనఁగ.

69


క.

పూచినయశోకములయం, దేచినతుమ్మెదలరవము లింపెసఁగెఁ బొరిం
దాఁచువనదేవతలచర, ణాచలితము లైనయందియలమ్రోత యనన్.

70


చ.

విలసితచంద్రకాంతమణివేదులపై మృదుమారుతాహతిన్
దలముగఁ వ్రాలి తా నవిగఁ దాఱనిపువ్వు లయత్నశయ్య లై
పొలుపుగ మాధవీవలయముల్ తరుణీతరుణవ్రజంబులన్
బిలిచె మనోజలీలలకు బేర్చు మహాకులభృంగగీతులన్.

71

చ.

చిలుకలపిండు నొప్పిదము చిత్రసురాయుధలీలయేపునం
జెలఁగుమధువ్రతావళుల చిక్కనిమ్రోఁతను గర్జ లుల్లస
త్ఫలరసపూరముం దెరలఁ బర్వుట సౌదులు గాక మేఘపం
క్తులక్రియ నొప్పుభూరుహతతుల్ మధువేళఁ బయోదవేళలన్.

72


చ.

మనసిజమంత్రఘోషములు మన్మథునానతిమాట లిందిరా
తనయవిలాసహాసములు దర్సకునార్పుటెలుంగు బంగజ
న్మునిచదువుల్ మనోభవునిమోహనగీతు లనంగఁ జారుఖే
లనములు నెల్లదిక్కులఁ జెలంగె మదోత్కటకోకిలధ్వనుల్.

73


చ.

అరుగుగఁ దేఁటితీఁగె గొనయం బెసకం బగుపచ్చవింట ని
బ్బరముగ మోపి కెందలిరుబత్తిడికం బరువలపుమావిక్రొ
వ్విరిబలుగాఁడితూఁపు లిడి వీరపుగర్వము నెమ్మనంబులోఁ
బిరిగొని తోలి తొప్పరలఁ బెట్టె ననంగుఁడు పాంథలోకమున్.

74


సీ.

వెలయు నీవెన్నెలవెల్లికాంతులసిరి పిఱుఁదుదీవులు చేరి మెఱయ కున్న
వెలయు నీవెన్నెలతెలుపునఁ బామల చూపు చీఁకటిఁ జొచ్చి సొరగ కున్న
వెలయు నీవెన్నెలతనువున నింతుల ఘనకుచంబులయుమ్ము గదియ కున్న
నొదవు నీవెన్నెలయురవడిఁ బొలఁతుల తమకంపుఁజెయ్వులఁ దగల కున్న


గీ.

మునిఁగి పోరె మన్మథున కగ్గమై పోరె, చాలఁ గొంకువోర తూలిపోరి
యనఁగ నుల్లసిల్లె నామనిరే లతి, స్ఫారసారసారసాంద్రరుచులు.

75


వ.

ఇట్టివసంతసమయంబునందుఁ బురందరాదేశంబు నెఱపం బూని చనుదెంచినవనజలో
చన లద్దనుజతాపసునివాసంబును మునిసిద్ధగంధర్వసేవితం బైన యావనంబున.

76


సీ.

కమనీయకరపద్మకాంతిపల్లవములు కోమలస్మితదీప్తికుసునుములును
జారుపయోధరస్ఫారగుచ్ఛములును లలితబింబాధరోజ్జ్వలఫలములు
సురభినిశ్వాసభాసురగంధపవనులు నుచితసల్లాపకీరోత్తములును
గలమధురోద్గీతకలకంఠరవములు కాంచీనినాదభృంగస్వనములు


గీ.

నతిశయిల్లంగ మధుసమయాధిదేవ, తమ శుభాకారలీలలు దాల్చి రనఁగ
నెమ్మి పుష్పాపచయకేలినెపముఁ బెట్టి, యందుఁ జరియించి రింపార నిందుముఖులు.

77


క.

క్రమమున నాటలపైఁబడి, నమరాంగన లమరవైరి కంతను వింతన్
సమదగతిఁ జేరి తమయిం, పమరెడుచెలువున నటించి రభినవభంగిన్.

78


చ.

కదలుకుచద్వయంబు వడఁక న్దనుమధ్యము కక్షదీధితుల్
చెదరఁగ మోములేఁజెమట చెన్నొదవన్ బొలపంబు గన్గవం

బొదలఁగఁ గంకణస్వనము పొల్పెసలార సుమాస్త్రుదర్పముల్
ముదరఁగ నుల్లసిల్లె నొకముద్దియ కందుకఖేలనంబునన్.

79


ఆ.

పిఱిఁదిపెంపు వ్రేగుపఱుప నందంద ప, య్యెద దొలంగఁ జన్ను లదర నంది
యలు సెలంగ నలసయాన మెలర్ప రా, యంచఁ బట్టఁ దిరిగె నబల యోర్తుఁ.

80


సీ.

మునికాళ్లు మోపి నిక్కినఁ బదచ్ఛవి నేలయును బల్లవించిన యొప్పు మెఱయ
వలలేది నతనాభి బెలసి యొక్కింత సాగినమధ్య మెంతయు ఘనత దీయ
మొగ మెత్తి మీఁదికి నిగిడించుచూడ్కులఁ గన్నులవిప్పెల్లఁ గానఁబడఁగఁ
గడలొత్తుకరమూలఘనకాంతి చూపఱడెందంబుతో నిక్కి డెక్కొనంగ


గీ.

నొయ్య డానేల దవ్వుల నున్నతీఁగఁ, దిగిచి నఖదీప్తు లంతంత దీటుకొనఁగ
లీలఁ బెఱకేల నచ్చరలేమ యోర్తు, గోసెఁ బువ్వులు ప్రమదవికాస మెసఁగ.

81


తే.

ఓర్తు కరతాళ మొనరింప నోర్తు సమద, గీతి పచరింప సరితాళగింప నోర్తు
మధురమదిరారసోల్లసమత్త యగుచు, నాడె నొక్కతె లలితాంగి హారగతుల.

82


సీ.

అమృతంపుసోన పైనడరినట్లే పాట చెన్నున మోకళ్ళఁ జివుళు లొత్తె
మారుతాహతిపేర మ్రాకులు దల యూఁపఁ దొడఁగె మరందమాధుర్యమునకు
నింపులగమి యైన యీరాగరసము దీఁగలకుఁ గోరకపులకముల నొసఁగె
సెలయేరులకు నశ్రుజలములు దొరఁగించె గిరులును మంజులరీతిఁ గరఁగె


గీ.

ననినఁ బోలుఁ బొసగు నగుఁ దగు ననఁగ స, చేతనంబు లెల్ల జిత్రరూపు
నట్లు సోగి నిలువ నంగన యొక్కతె, పాడఁగల మనోజభంగు లలర.

83


క.

జంకెలు బుజ్జనములునుం, గింకలు దళుకొత్త నోర్తు గీరంబులకున్
వంకలు జదుళ్లు కరములు, నంకణముల జదువు గరపె హసితోక్తులచేన్.

84


సీ.

కెమ్మోవుతావికే గ్రమ్ముతుమ్మెదగమి తూలెడుకురులలోఁ దొడిబడంగఁ
జలితకర్ణోత్పలదలములకాంతి న, పాంగదీప్తులు రెంటఁ బరపు గాఁగ
సీమంతమునఁ బొల్చుసేసముత్తియములుఁ బెరయుగ్రుమ్మడికమ్మవిరులు దొరుఁగ
నాందోళనశ్రాంతి నమరుపాలిండ్లపైఁ జెమటబొట్టులు హారసమితిఁ బ్రోవ


గీ.

వళులలావున నలికౌను బలిసి నిలువఁ, జూచువారిచూడ్కికి నొప్పుచూఱ లిడుచు
లీలఁ బాడుచుఁ దీఁగయుయ్యాల నెక్కి, పోయి యూపఁగ నొప్పారెఁ బొలఁతి యోర్తు.

85


చ.

వలపల డాపలన్ వరుస వాలు గనుంగొనఁ జూపు లార్చుచున్
దిలకము దీర్చుచున్ గురులు దీటుచు వీనులమానికంపుటా
కులపారి ద్రిప్పుచున్ దశనకోరకము ల్వెలయంగ మోవి మె
ప్పలరఁగ మోము లిచ్చుచును నద్దముఁ జూచె నొకర్తు వేడుకన్.

86

వ.

ఇవ్విధంబున మదనవికారకారణంబు లగువిభ్రమవ్యాపారంబులఁ బ్రవర్తిల్లునయ్యం
గనలతెఱంగునకుఁ గరంగనియంతరంగంబు నిస్తరంగంబురాశియుంబోలెఁ బొలుపు
మిగుల నా దైత్యతపోధనుండు.

87


మ.

పురుషాకారముతోడ నున్నసిరియో పుంస్త్వంబు లేదో యటే
తరువో పుత్తడిరూపొ చిత్తమును జైతన్యంబు శూన్యంబోకో
విరసత్వంబులప్రోవొ నిర్భరకళావిజ్ఞానసర్వస్వమో
యగు దీచంద మనంగ నిల్చె ధృతియం దస్పందమందస్థితిన్.

88


వ.

అంత.

89


సీ.

కలయంగ నడవిలోఁ గాచినవెన్నెల లై చారుహాసంబు లనధిఁ బోవఁ
బ్రతికూలవిధికిఁ జేపడినయత్నంబు లై చూచినంతటఁబోక చూపు లొరుఁగఁ
బాట లన్నియు నాటపాటలై చెవిటికూదినసంకువిధమునఁ దేరఁజనఁగ
నాటలు పసిబిడ్డయాట లై పెంపఱి యొరులయాటలఁ బడ నోగితముగ


గీ.

గర్వములు బెండువడఁ గౌతుకములు ముడుఁగ, నదటు లాఱడిపోవఁ బ్రల్లదము లడఁగ
నసురచిత్తంబు గానఁగ నలవి గాక , సిగ్గువోయిరి యచ్చరచెలువ లెల్ల.

90


ఉ.

అతనినిష్ఠయున్ ఘననిరాకులధైర్యము దన్ను నెంతయుం
బ్రీతుని గా నొనర్పఁ గృపపెంపు దలిర్ప సరోజసంభవుం
డాతతసిద్ధసంయమిగణావృతుఁ డై మహనీయహంసవి
ఖ్యాతమనోజ్ఞయానమున నచ్చటికిం జనుదెంచె నత్తఱిన్.

91


ఉ.

చాలుఁ దపంబు చాలఁగఁ బ్రసన్నుఁడ నైతి వరంబు లిత్తు వీ
లోలత యేర్పడంగ నతిలోకనుతవ్రత వేఁడు మన్న వా
చాలవరేణ్యుఁ డంబురుహసంభవుమాటలు వీనులందు ధా
రాళసుధారసప్లవనరమ్యము లై ప్రమదం బొనర్పఁగన్.

92


తే.

చక్క జాగిలి మ్రొక్కి యంజలిపుటంబు, మౌళిఁ గదియించి నిలిచి సమంచితార్థ
మధురబహువిధస్తోత్రసమ్మర్దరచన, మున్ను గా నతఁ డిట్లని విన్నవించె.

93


క.

దేవర ప్రసన్నుఁ డగునటె?, సేవకులకుఁ బడయరానిసిద్ధియుఁ గలదే?
భావితవివిధైశ్వర్యశు, భావహము గదా భవత్కటాక్షం బెందున్.

94


వ.

కావున నసురేంద్రత్వంబు నాకు గృపసేయవలయు నిదియ మదీయాభిలాషంబనినఁ
బితామహుం డసురేంద్రున కిట్లనియె.

95


చ.

సమధికపూర్వదేవకులసంజనితుండవు నీవు నీకు న
య్యమరపదంబు దక్కు నసురాధిపతిత్వము నీక యంత య

య్యమరవరేణ్యసంపదకు నగ్గలమై పెనుపొందువైభవం
బమరుట యేమిటం గలుగు నట్టివరంబుఁ దలంపు మింపుగన్.

96


క.

అనినఁ దగువరముఁ దననె, మ్మనమున నూహించి యసుర మఱి యిట్లనియెన్
వనజభవుఁ డింక వీఁ డే, మని వేఁడునొ యనుచు నాకులాత్మత నొందున్.

97


సీ.

దేవకులంబుచే దేవయోనులచేతఁ బికృకోటిచే దైత్యవితతిచేత
గ్రహములచేఁ దారకములచే మునులచే ననలసమీరతోయములచేత
నరులచే గిరులచేఁ దరులచేఁ బశుమృగపక్షిదంశకకీటపంక్తిచేత
నసికుంతశరపరిఘాద్యాయుధములచేఁ గాష్ఠపాషాణసంఘములచేత


గీ.

నవని నంతరిక్షంబున దినమునందు, వాసరంబులయందు శర్వరులయందు
నా కపాయంబు లేకుండ లోకవంద్య, యిచ్చు మఱి యెవ్వియును నొల్ల నింతనిజము.

98


గీ.

అనిన నిచ్చితి ననియెఁ బద్మాసనుండు, దైత్యపతియు మహాప్రసాదంబు దేవ
యనుచు నౌఁదల మోడ్పుకే లమర నొప్పి, హర్షపులకాంకురాలంకృతాంగుఁ డగుచు.

99


వ.

వనరుహసంభవుండు దితిసంభవుని ప్రభూత వరదానసంభావితుం జేసి నిజనివాసంబు
నకుం జనియె. నసురేశ్వరుండును నమందానందమందస్మితసుందరుం డగుచు నాత్మగృ
హంబునకుం జని జననికి నమస్కరించి తద్వృత్తాంతంబంతయు నెఱింగించి తదభినంది
తుం డై ప్రియానుజుం డైన హిరణ్యాక్షు ననుమోదింపఁ బెంపారుచున్న సమయం
బున నమ్మహావీరుల తపోలాభంబునకు నభినవోల్లాసంబునం బొంగునంతరంగంబులతోడ
నముచిపులోమబలరామశంఖకర్ణవిప్రజిత్తుహయగ్రీవప్రముఖు లైనదానవులనేకులు
చనుదెంచి యతనిం గని సముచితసల్లాపసంస్కారంబులు వడసి యతని కిట్లనిరి.

100


మ.

దితిసంతానము దానవాన్వయము నీతేజంబు నిత్యోర్జిత
స్థితి నేపారుటఁ జేసి నేఁడు దల యెత్తెన్ బేర్చి యీదైత్యసం
తతి యంతంతకు నీసుమైఁ బరప దోర్దర్పంబు సొంపొందఁగా
ధృతిదూలంబడుపాట దప్పి విసరన్ దేవాహితశ్రేణికిన్.

101


ఉ.

జన్నములుం బరాన్నములుఁ జాలఁగ మ్రింగి కరంబుఁ గ్రొవ్వి పే
రన్నునఁ గ్రాలునచ్చరలయాటలు చిత్తములన్ గరంపఁగాఁ
గిన్నరవల్లకీమధురగీతులు వీనుల కింపుఁ బెంపఁగాఁ
జెన్నుగ నుండి మమ్ము నొకచీరికిఁ గైకొన రాదివౌకసుల్.

102


చ.

హరి తనకు న్గలండని పురాంతకుఁ డామురవైరిసేఁత లె
వ్వరుసన మాన్చ నొల్లఁ డని పద్మభవుండును నాత్మలోన ని

ర్జరులకు మేలు గోరునని సంయమకోటితలంపుల న్నిజ
స్ఫురణమ యావహించు నని పొంగుచు నుండు మహేంద్రుఁ డెప్పుడున్.

103


ఉ.

అట్టి సురాధినాథువద టంతయుఁ బాపి నిలింపనిర్గమున్
దట్టము లొగ్గి తాపసులదైన్యము పాల్పడఁ జేసి లోకముల్
గట్టిగ నీవ యేలుము ప్రకాశితదైత్యకులాభివృద్ధికై
పట్టము గట్టి మమ్ముఁ దగఁ బంచి పను ల్గొను మీశ్వరుండ వై.

104


వ.

అని పల్క యసుర తక్షణంబ భృగువంశభవ్యుం డగుకావ్యు నచ్చటికి రావించి తదుప
దిష్టప్రకారంబునం దొడంగి మయనిర్మితమాణిక్యమయమహితసింహపీఠంబున నమ్మ
హానుభావు నునిచి భార్గవపురస్సరంబుగా నఖిలతీర్థోదకంబుల నభిషేకంబు గావిం
చి దైత్యదానవరాక్షసాన్వయంబునకుం బతివి గమ్మని పట్టంబు గట్టి వివిధాశీర్వాదం
బుల నతనిం బ్రస్తుతించిన నసురులయార్పులు నిస్సహణపణవకాంస్యకాహళాదితూ
కంబులయులివులు దిక్కులు పగిలించె. సంతం బోవక దిక్పతుల డెందంబుల గారించె.
నంత.

105


ఉ.

దానవనాథునౌదల నుదగ్రత నొప్పునవాతపత్ర మా
మ్లానసుధాంశుబింబగరిమంబునఁ బెంపెసలారి యింద్రలో
కీనయనోత్పలావళులు భేదము నొందఁగఁ జేసె ఘోరఘ
ర్మానుగతప్రచండకిరణాకులభాస్కరమండలాకృతిన్.

106


సీ.

అసురవల్లభుప్రతాపాగ్ని పర్వెడులీల దిశల నుల్కాపాతదీప్తి పొదివె
దైతేయనాథునుద్ధతికి నుల్కినభంగి ధాత్రి సముత్కంపతరళ యయ్యె
దనుజతేజముఁ గని దైన్య మొందినమాడ్కి మార్తాండుఁ డెంతయు మాఁగువాఱె
విబుధారికినుకకు వెగడొందుతెఱఁగున వనరాశి కరము ఘూర్ణనము నొందె


ఆ.

గిరులు వడఁకె నధికపరుషంబు లై పవ, నములు చెలఁగె నిబిడతిమిర మడరె
వహ్ను లగ్రధూమవారితజ్వాలంబు, లగుచుఁ బొనుఁగుపడియె నద్భుతముగ.

107


క.

అవి యెల్లఁ జూచి దైత్యులు, దివిజకులాపాయభంగి దెలిపెడునవె యీ
వివిధోత్పాతము లని ప్రమ, దవికాసితు లైరి దుష్టతామసబుద్ధిన్.

108


వ.

ఇ ట్లభిషిక్తుం డై యపూర్వగీర్వాణపుంగవుండు గర్వగరిమాకాంతస్వాంతుండును
నగుచు మయదత్తంబును మణిమయూఖమంజీరమంజులంబును మనోరథానురూపగ
మనంబును నగుమహారథం బెక్కి హిరణ్యాక్షప్రముఖు లగు నాప్తజనంబులు పరివే
ష్ఠింప ననేకదానవసేనాసమేతుండై చని మహాశైలదుర్గగోచరయుఁ బ్రాంశుప్రాకారప
రివృతయు నుత్తాలవిశాలాట్టాలకవిలసితయు నుదగ్రగోపురాగ్రగృహీతగ్రహమార్గ
యు సమధికోత్సేధసౌధదీధితిధవళాయమానదశదిశాభాగయు సకలసమయసముదితసు

మనోవికాసభాసమానోద్యానద్యోతితరోధోంతరయు సమస్తభోగభూమియు రత్న
వతీనామధేయయు నగుమహాపురి భార్గవోపదిష్టసుముహూర్తంబునం బ్రవేశించి.

109


క.

అం దుండి సకలసంపద, లుం దనుఁ జేరంగ నఖిలలోకంబులు న
స్పందితనిజాజ్ఞ నౌఁదల, లం దాల్పఁగఁ దాల్చె రాజ్యలీలోత్సవముల్.

110


క.

దైతేయులు దానవులును, భూతనిశాచరపిశాచములు తద్దయు సం
ప్రీతిం బొదలఁగ నాతని, యాతతసామ్రాజ్య మంతకంతకుఁ బేర్చెన్.

111


ఆ.

ఆహిరణ్యకశిపు నైశ్వర్య మెంత వ, ర్ధిల్లదొడఁగె నంత దివిజకులము
పేర్మి పరఁగఁ జొచ్చెఁ బేర్చు వేసవియెండ, నెడలి యివురుచిఱుఁతమడువుపోలె.

112


క.

వైరము గొని దైత్యుఁడు దు, ర్వారభుజారంభరోషరభసాకులుఁ డై
కారింపఁ దొడఁగె నమరులఁ, బోరులు శనకు న్వినోదములుగాఁ గడిమిన్.

113


స్రగ్ధర.

వేదండోద్దండహేలావితతరథపదావిష్కృతాస్వీయభాస్వ
త్పాకాతానేకసేనాప్రకరపరికరప్రాభవాభీలలీలా
వైదగ్ధిం బేర్చి దైత్యేశ్వరుఁడు రణధురావాంఛ పైకొన్నమారై
భేదింపం ద్రుంప నొంపన్ బిఱుసనక విజృభింప నోర్వ న్నిలింఫుల్.

114


వ.

అమ్మహావీరుండు.

115


సీ.

పేర్చుచుఁ బఱదెంచుభిదురంబు ననిమొనఁ బెడచేతఁ బెడమోము వడఁగ నడచి
భీతిఁ బాఱెడిపురుహూతు వెన్కొని బాడు దలవెట్టి దర్పంబు దలకు మీర
నమరావతీపురం బంతయుఁ జూఱాడి చెలఁగి సురస్త్రీల చెరలుబట్టి
వెల్లయేనుంగును వెలిమావుఁ గైకొని మందారమును హరిచందనంబు


గీ.

పారిజాతసంతానకల్పకతరువులఁ, గొని సుమేరువిచితరత్నకోటికొండ
లర్థి ద్రవ్వి తండము గొని యమరవిభుని, కరుణ ముందల విడిచి విక్రమము మెఱసి.

116


వ.

మఱియును.

117


ఆ.

శిఖలు చూపకుండ శిక్షించి హతికి నై, నోరు దెఱవకుండ మేరవెట్టి
వేఁడియెల్ల నుడిపి విబుధారి కినుకమై, భీతిపాత్రుఁ జేసె వీతిహోత్రు.

118


సీ.

మెచ్చక యెదురైనమృత్యువుమెడఁ ద్రొక్కి క్రొవ్వాడికోఱలు ద్రెవ్వరాచి
కిన్కతో జంకించి కింకరకోటులఁ బొంకంబు చెడఁ గొంకువోవ నడిచి
మదురువుఁ గొని మాఱుమలయుకారెనుబోతు నొడిసి కొమ్ములు పట్టి ముడుఁగఁద్రోచి
మండెడుపటుకాలదండంబు చేతుల, బిసికి వేఁడిమి యార్చి బెండు చేసి


గీ.

పేదప్రాణులఁ బొరిగొనుబిరుదుమగఁడ, నగుదు వీ వని యందంద మొగముమీఁదఁ
జప్పటలు వెట్టి దైత్యుఁడు జమునిలావు, జేవయునుఁ బొల్లుగాఁ గాకుచేసి విడిచె.

119


క.

రక్కసుఁడ వయ్యు నమరుల, ది క్కొరిగితి దాయ నీవిధిం బొమ్మనుచున్

స్రుక్కఁగ నడిచె నిశాచరు, నక్కజముగ నసురపతి గదాహతి నాజిన్.

120


సీ.

లీలమైఁ బాతాళమూలంబుదాఁకను సలిలధిసలిలంబుఁ గలఁచి సొచ్చె
జలములు ద్రిక్కఁగ సకలరత్నంబులు వెఱచి సాగరపతి వీడుకొలిపి
మకరకర్కటకూర్మమత్స్యమహానాగబలముల బలువిడి బారిసమరి
క్రూరదుర్వారదారుణపాశవిసరంబు దోరంపుఁగడఁకఁ దుత్తుమురు చేసి


గీ.

పశ్చిమాశాధినాథు విపశ్చదర్శ, నీయగాంభీర్యు దైతేయనాయకుండు
సమరతలమున భంగించె సకలదైత్య, సముదయంబును నానందజలధిఁ దేల.

121


క.

జపమును బలమును బొలుపఱి, భువనంబుల నెందుఁ దిరుగుపోఁడిమి యెడలన్
బవమానుం డవమాన, ప్రవిహతమతి యయ్యె నసురపతి కోపమునన్.

122


క.

నవనిధులు పుచ్చుకొని భవ్యవిమానము నాచికొని సురారి కడిమిమై
భవసఖుఁ డితఁ డట్టిదకా, నవు నని భిక్షేశుఁ జేసె నయ్యక్షేశున్.

123


ఉ.

ఎక్కుడు దెద్దు భూతియును నెమ్ములు సొమ్ములు భిక్ష జీవనం
బొక్కటి కట్టఁజీరయును నుండఁగ నిల్లును లేదు నిక్కునం
బిక్కఱకు న్దపస్వినులు నేచిన నయ్యెడు నేమి యంచుఁ దా
నొక్కని శర్వునిం బఱుప నొల్లఁడు దైత్యుఁ డనాదరంబునన్.

124


వ.

ఇవ్విధంబున సకలదిక్పతుల న్బరిభవించి తదీయపదంబులుఁ దాన కైకొని మాఱులేక
మలయుచును సర్వదేవైకభీరుం డై విజృంభించి.

125


సీ.

వనరాశిజలములు వడిఁ ద్రిప్పుకొనులీలఁ గలఁగించు మందరనగముకరణి
నంబుజప్రియకుముదాప్తులఁ బొరిఁ బట్టి బాధించు సింహికాప్రభవుభంగి
ఘనగోత్రగోత్రశృంగంబులు వెసఁ దాఁకి పొడి చేయుఁ దీవ్రదంభోళిపగిదిఁ
బ్రబలబలాహకప్రకరంబు వ్రచ్చి వందఱలాడుఁ బటుమారుతంబుమాడ్కి


గీ.

దిగ్గజంబులగుండెలు దిగులుకొల్పు, హోరరవమునఁ గ్రూరమృగారిపోల్కిఁ
బ్రకటభుజదర్పమునఁ దన్నుఁ బట్టలేక, దుర్విషహుఁడై హిరణ్యాక్షపూర్వజుండు.

126


సీ.

తపములఁ గ్రుస్సినతపసులఁ బట్టి తెప్పించి యచ్చరలతోఁ బెండ్లిసేయు
మోదంబుతో నశ్వముఖుల లాయంబులఁ గట్టి బొక్కవియలఁ గవణమెత్తు
భుజగేశ్వరులశిరంబుననున్నమణు లూడ్చి కొమరార వట్రువగుండు లెత్తుఁ
జెలఁగి గంధర్వులచేతివీణెలు పిశాచుల కిచ్చి పాడించి చూచి నవ్వు


గీ.

ఖడ్గములు బాదుకలు ఘుటికములు నపహ, రించి సిద్ధపుంగవుల గారించుచుండు
భువనబాధలు దన కిట్లు ప్రొద్దువోక, లుగ సురారాతి పేర్చె నుల్లోకుఁ డగుచు.

127


క.

సదభిమతము లగుదుఃఖము, విదితముగ హిరణ్యకశిపవే స్వాహా య
న్నదిదక్క మంత్ర మొండె, య్యది చొరకుండఁగ సురారి యాజ్ఞాపించెన్.

128

చ.

సరసిజసంభవుండు హరి శర్వుఁ డనంగఁ గలారె వేట యొ
క్కరుఁడు జగత్త్రయంబునకుఁ గర్తయు భర్తయు సంగ్రహర్తయున్
దిరముగ సేవ కాక యని దేవకులద్విషుఁ డాగమక్రియా
కరులకు దన్నుఁ గొల్వుఁ డని గర్వమున న్నియమించె నెల్లచోన్.

129


సీ.

భానుఁ బిల్పించి నాపంపునఁ బాయనితెరువరివై మీఁదఁ దిరుగు మనియె
జంద్రునిఁ బిలిచి నాశాసనంబున జగంబున నెల్లయోషధుల్ ప్రోవు మనియె
ననిలునిఁ బిలిచి నాయాజ్ఞఁ బ్రాణులకెల్ల వలయుప్రాణంబవై మెలఁగు మనియె
ననలునిఁ బిలిచి నాయానతియందున బాచకాదికమోజపఱుపు మనియెఁ


గీ.

దనచరిత్రంబె వర్ణింపఁ బనిచె బహువి, ధేతిహాసపురాణార్థజాతి నెల్లఁ
దన్ను వినుతింపఁ బనిచె వేదముల నెల్ల, దైత్యనాయకుఁ డఖిలవిధాయకుండు.

130


మ.

జముఁడై తాన సమస్తకర్మగతులున్ శాసించు శీతంబు నూ
ష్మము వర్షంబును దాన యయ్యయితఱిన్ సంధిల్లఁగాఁ జేయు న
ర్థముఁ గామంబును దాన కైకొని ప్రమోదం బందు ధర్మంబు మో
క్షము నాత్మీయకటాక్షలక్ష్యము లనన్ గర్వోత్కటస్వాంతుఁ డై.

131


ఉ.

నేలయుఁ గొండలుం దిశలు నింగియు దీవులు నంబురాసులున్
గాలములున్ గ్రియావళులు గాడ్పులు వహ్నులు నాకమర్త్యపా
తాళములు న్నిజాకృతులు దాల్చి సరోరుహసూతిఁ గొల్చున
ట్లాలఘుశీలుఁ గొల్చు సదయాత్మత యేర్పడ వచ్చు నిచ్చలున్.

132


వ.

ఇట్లు లోకపరమేశ్వరుం డగునసురేశ్వరుండు నిరంతరైశ్వర్యుండును, గురుభుజ
వీర్యుండును, దివిజమర్దనకార్యంబులు నవార్యంబులై చెల్లుచుండఁ జండప్రకోపదీ
పితత్రిలోకుం డగుచు ననేకసంవత్సరసహస్రంబులు సామ్రాజ్యంబు సేయుచుండ
నాఖండలప్రముఖబృందారకు లందఱు రహస్యంబునఁ గూడఁబడి గురునితోఁ గ
ర్తవ్యంబడిగిన నమ్మహామతి మరుత్పతి కిట్లనియె.

133


క.

నీతులచేఁ ద్రోవఁడు దు, ర్ణీతునియుద్రేక మెసఁగి నిగిడినయెడ లో
కాతిక్రమహేతు వగు న, హేతుకళానాశనంబు నెమ్మెయిన నగున్.

134


చ.

కడిఁదివరంబు వారిరుహగర్భునిచేఁ గొనినాఁడు వాఁడు మీ
యెడ ననిశంబుఁ బెన్బగయు నీసును రోషము నెమ్మనంబులో
జడిగొని యుండుఁ గావున నసాధ్యుఁ డవధ్యుఁడు దైత్యనాథుఁ డే
వడువునఁ బౌరుషంబుఁ గొని వాని జయించుట వ్రేఁగుఁచూడఁగన్.

135


సీ.

సామంబుచే శత్రు సాధింత మంటిమా సామంబు ఖలునందు సేమమగునె
భృత్యులతో దాయ భేదింత మంటిమా యసహాయసాహసుం డసురవరుఁడు

దానంబు వశ్యవిధాయక మంటిమా మెల్లమెల్లను వాఁడు కొల్లగొనియె
దండితనంబున దండింత మంటిమా చెనసి యజేయు నిర్జింపరాదు


గీ.

కానఁ జతురుపాంబులు కార్యసిద్ధి, జనకములు గావు మఱి చూడ సంధివిగ్ర
హాదు లైనషడ్గుణములు నప్రయోజ, నములు పగతుఁడు ఘనుఁడు దుర్దముడుఁగాన.

136


క.

స్థానంబును వృద్ధియు న, ద్దానవపతియందు నంచితములైనవి దే
వానీకము సంక్షయగత, మైన యది త్రివర్గతత్వ మారసిచూడన్.

137


వ.

స్వామ్యమాత్యసుహృత్కోశరాష్ట్రదుర్గబలంబు లనుసప్తాంగంబులు సుసంపన్నంబులై
తదీయసామ్రాజ్యంబు రిపులకు నభియోగ్యంబు గాకుండుటయు నాకౌకసులకు
నమ్మహిమ విగతం బగుటయుఁ బరమేష్ఠిదత్తవరలాభంబున నుదయోన్ముఖుం డైనవాఁ
డునుం గావున నసురకుం గాలబలంబు సమధికం బగుటయుఁ ద్రిలోకంబులును
దనయధీనంబులుగాఁ గైకొని యున్నవాఁ డగుటంజేసి దేవబలంబు సిద్ధం బగుట
యవలంబింపవలయుట నాకుం దోఁచినకర్జం బది యట్లుండె వెండియు నొక్కతె
ఱంగు చెప్పెద.

138


శా.

కామక్రోధమదాద్యమై నయసుహృద్గర్వంబులన్ గెల్వ నే
ధీమంతుండు సమర్థుఁ డాతఁడు విరోధివ్రాతముం గెల్చు నీ
కామక్రోధమదాదినిర్జితుఁడు దుష్కర్ముండు నై యుండువాఁ
డీమై నెవ్వరిచేత నేనియు రమాహీనుం డగున్ వ్రేల్మిడిన్.

139


క.

అజితాత్ము డైనయాతని, విజయంబును సిరియు విరియు వేగంబ శర
త్ప్రజనితజలధరములు గడు, నిజము లగునె నంబరముగ నిముసం బైనన్.

140


మ.

దితిజుం డిప్పుడు కామరోషముల నుద్రేకించి లోకంబు దు
స్థితి నొందించుచు నున్నవాఁడు విభవాంధీభూతచేతస్కుఁడై
మతిహీనుండునుబోలె సౌఖ్యనిరతిన్ మత్తిల్లి యున్నాఁడు ని
ర్జితుఁ గావింపఁగ వచ్చు దైవపరతన్ జేపట్టి యీపాతకున్.

141


క.

విజయాభిమానతృప్తు బ, హుజనద్విషుఁ గామసంవృతోన్మాదు వినో
దజితుని వెసఁ దొడరంగా, విజయం బగు ననిరి నీతివిస్తరవేదుల్.

142


క.

తనుఁ దా నెఱుఁగనివానికిఁ, దనుఁ దా దండించుకొనిన తామసునకు నెం
దును దైవబలము లే దిం, త నిరూఢతఁ గనిన సిరియుఁ దవ్వుగ దోఁచున్.

143


వ.

మనకు దైవంబు దాతయు వాసుదేవుండ మనకె యననేల యనేకబ్రహ్మాండకోటిజా
తంబు లైనచరాచరభూతంబులకుఁ బరాయణంబు నారాయణాభిధానం బగుతే
జంబ. ఈ జగంబుల సంకటం బుడుప నాదేవునకు నపహార్యంబు. మన మిమ్మహాత్ముశ్రీ

పాదపద్మంబులు చేరి మనతెఱఁ గంతయు విన్నవింతము. మున్ను చెప్పితి. హరి
శరణాగతుల యాపదలఁ బాపనోపు. నాపురుషుండు మనకు నెయ్యదికర్తవ్యంబు
గా నానతిచ్చెఁ దత్ప్రకారంబున నపకారులకుఁ బ్రతికారంబు చేయుద మిదియ
నిశ్చయంబు గావున.

144


మత్తకోకిల.

రండు పోదము లెండు వేగమ ప్రస్ఫురత్కులిశాయుధా
ఖండఖేలనహేతిభీతనగవ్రజాభయదాయితా
చండచండతరంగసంభ్రమసంప్రవర్ధకి వార్థికిన్
బుండరీకదళాక్షమందిరభూమికిన్ మహినేమికిన్.

145


వ.

అని సురలకు గురుండు వితథం బగునీతిపథంబున బరమహితం బుపదేశించె నని
దేవశ్రవునివలన గాలవుండు వినినపథంబు విశదవిస్తారంబుగా నుపన్యసించె.

146


ఆశ్వాసాంతము

క.

శ్రీతులసీదళదామ, ద్యోతారుణహారికిరణయుతకౌస్తుభర
త్నాతపరచితేంద్రధను, స్ఫీతనవినాంబుధరగభీరశుభాంగా.

147


భుజంగప్రయాతము.

మహాంభోధికల్లోలమాలావిలోల, న్మహాభోగిశయ్యాసనాక్రాంతకేళీ
మహాశక్తిముక్తోపమానాత్మమాయా, మహాయంత్రకభ్రామ్యమాణత్రిలోకా.

148


క.

వైకుంఠనాథ సమద, శ్రీకంఠగ్రహణనిపుణశీల విరించి
శ్రీకంఠాదికమూర్తిమ, యాకుంఠనిజైకచిన్మయాకార హరీ.

149


స్రగ్విణి.

సత్యసత్యాకుచోత్సంగసంగప్రియా, మత్యమత్యంతరోన్ముక్తముక్తస్తుతా
నిత్యనిత్యోదితోన్నిద్రనిద్రావతా, దిత్యదిత్యాత్మజోద్రేకరేకాపహా.

150


గద్య.

ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్యధుర్య
శ్రీసూర్యకవిమిత్రసంభవ శంభుదాసలక్షణాభిధేయ ఎఱ్ఱయనామధేయప్రణీతంబైన
శ్రీలక్ష్మీనరసింహావతారం బనుపురాణకధయందు ద్వితీయాశ్వాసము.