Jump to content

నృసింహపురాణము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

తృతీయాశ్వాసము

శ్రీమద్గరుగరుడాచల
ధామ సుధాధామతీవ్రధానుసహస్రో
ద్దామద్యుతి తేజోనిధి
సీమ శ్రీమహితదేహ శ్రీనరసింహా.

1


వ.

దేవా రోమహర్షణుండు మహర్షుల కిట్లనియె. నంత బృహస్పతిమతంబు తమకు నభి
మతంబుగా నేకమతంబున నమృతాశనులు నముచితాశను మున్నిడుకొని యప్ప్రొద్దు
కదలి యుత్తరాభిముఖులై చని.

2


మహాస్రగ్ధర.

కని రుగ్రగ్రాహవక్రగ్రహణఘుమఘుమాకారకల్లోలడోలా
స్వసనప్రద్యోతకేళీసరభసఫణభృచ్చారుజూటాగ్రజాగ్ర
ద్ఘనరత్నోదంచితోద్యత్కటకుటిలమయూఖచ్ఛటాటోపమిథ్యా
జనితౌర్వారంభశుంభత్సలిలనివహనిస్తంద్రు రత్నాకరేంద్రున్.

3


వ.

కని తదీయమహామహిమకు నంతరంగంబులఁ గౌతూహలాద్భుతానందంబులు సంద
డింప నందఱుఁ దమలో నిట్లనిరి.

4


సీ.

కల్పాంతవేళ భీకరసూకరాకృతిఁ దనరి విచ్చలవిడిఁ దఱసియాడె
నఖిలంబు మ్రింగి మాయాశిశుమూర్తియై లీలమైఁ దనయిచ్చఁ దేలియాడె
శ్రుతిచోరుపైఁ గిన్క చూపి మీనాకార మింపారఁ దనివోవ నీదియాడె
నమృతంబునెపమున నచలంబు లో వైచి తనయోపుకొలఁదులఁ ద్రచ్చియాడె


గీ.

నెపుడు పాయ కున్నట్టివాఁ డిందు నిమ్ము, కుందుఁ డబ్ధీంద్రుపై నెంతకూర్మి గలదొ?
యఖిలజగదీశ్వరున కింత యనుగలముగ, నేమితప మొనరించెనో యిప్పయోధి.

5


చ.

ఇది యొకఁ డేల యీజగము లిన్నియుఁ జెన్నునఁ గన్నతల్లి బ
ల్లిదుఁ డగుశౌరిపేరురము లీలమెయిం దనయాటయిల్లుగా
ముదము దలిర్ప నొప్పెసఁగుముద్దియ యీతనికూఁతు రట్టె యీ
యుదధివరేణ్యుపుణ్యమున కొండొకఁ డెందును నీడు గల్గునే.

6

వ.

అని యనేకవిధంబులం గొనియాడుచుం జని వినువీథి నంబుధినిందఱియం జొచ్చి
దవ్వుదవ్వులయందు శ్వేతద్వీపంబును దన్మధ్యగోచరంబును నగువైకుంఠపురంబునుం
గని మ్రొక్కి యొండొరులకుం జూపుచు.

7


శా.

ఈవారాశికి దానభూషణముగా నీదేవి శుభ్రాంబుజ
శ్రీవిభ్రాజిత మయ్యె దీనినడుమన్ జెన్నొంది హేమోజ్వలం
బై వైకుంఠపురంబు కర్ణికతెఱం గారంగ నిందూర్జిత
శ్రీవత్సాంకునిఁ జూత మింక ప్రమదస్థేమున్ మహాళీంద్రుఁగాన్.

8


క.

అని పలుకుచుఁ జిత్తంబులు, ఘనతరభక్తిరసభరితకలితము లై పే
ర్చిన నమరవరులు నిజకర, వనరుహపుటఘటితనిటలవన్మస్తకు లై.

9


శ్లోకము.

శ్వేతద్వీపాయ సంసారతిమిరశ్వేతభానవే,
నమః కైవల్యకంఠాయ వైకుంఠనగరాయ చ.

10


వ.

ఇట్లు తొడంగి బహువిధస్తోత్రనాదంబులు రోదోంతరంబున మేదురంబులుగాఁ బు
రంబు సొత్తెంచి రాజమార్గంబున రాజమందిరాభిముఖులై వచ్చుదివిజులకలకలం బా
కర్ణించుచు వైకుంఠనాథుండు ననాథనాథుండును నగు శ్రీనాథుండు నాకౌకసులం
దడయక తోడ్కొని తేర వైనతేయు నానతిచ్చి పుచ్చిన.

11


సీ.

భాసురసౌవర్ణపక్షయుగ్మముకంటెఁ బ్రకటితం బగుబంధుపక్ష మమర
సంచితహరిచందనాంగరాగముకంటె రాజితం బగుముఖరాగ మెసఁగ
లాలితహారాద్యలంకారములకంటెఁ బూరుషాకారంబు భూషణముగ
నభిగమమృదుపదన్యాసంబుకంటెఁ బ్రియోక్తపదన్యాస ముల్లసిల్ల
గీ. విబుధకోటి నెదుర్కొని వినతపట్టి, యాదిదేవునియాదరం బపుడు చెప్పి
యందఱును సంతసిల్లంగ నంతిపురము, కొల్వుకూటంబునకు వారిఁ గొనుచుఁ జనియె.

12


చ.

అనుపమలీల నొప్పుపరమాత్మునిదివ్యసభానివాసమున్
గనుఁగొని యద్భుతప్రమదకౌతుకపూరములన్ మునింగి య
య్యనిమీషకోటిచి త్తము నిరంతరదైత్యవికారఘోరవే
దనఘనభార మెల్ల దిగద్రావి భజించె నవీనభావమున్.

13


అంగవర్ణవచనము

వ.

ఇట్లు సభామంటపప్రవేశం బొనరించి యనంతరంబ వా రగ్రభాగంబున నుదగ్రభో
గిభోగమహాశ్వేతశయనీయంబునఁ గమనీయహిమశైలశృంగసంగతంబగుసతోయతో
యదంబుచాయకు నుపమేయం బగుచుం బొలుపారుసోయగంబును, నవపారిజాతపల్ల
వంబులయుల్లాసంబు నుల్లసం బాడుచు శ్రుతిసీమంతసిందూరరంజనరంజితంబులైనవి
యివి యవి యనికొని యాటలకుం జాలరాలఁ జెన్నొందుచరణతలంబులును, వరణాం

గుష్ఠనిష్ఠ్యూతస్యూతం బగుమిన్నేటితెలివినీటికిఁ బ్రోది గావించునుజ్జ్వలనఖచంద్రి
కానిష్యందంబును, సువృత్తంబులు సుస్నిగ్ధంబులు నై నెఱసంగడీలకైపడి నెల్లవడ
వడికి మైవడియై నెఱయు నిరుదొడలును, దొల్లియు మధుకైటభాసురశిరోవిదళనం
బునకుం దగిన నెళ వయ్యు నింకను హిరణ్యకశిపునక్షోవిదారణంబునకుం గారణప్ర
దేశం బయ్యెడునని జతనంబునం బొదివి పాటించిన యనువునఁ గనకాంబరసంవృతం
బగుచు నొప్పారునూరుయుగళంబును, నాభికమలకందళితంబు లగుచు నెలందె
డుమొలకలపొలు నం గటితటఘటితరత్నశృంఖలోపలంబులముందటిదెసఁ దోఁచు
తఱుచు మెఱుంగులును, గల్పారంభకాలంబున నభ్యంతరంగితభువనప్రపంచంబు
వెలువరించుటవలనం గృశత నొంది స్రుక్కె౦గాక యనందగువృత్తసుందరం బై
లలితవళికలితంబు నగుమధ్యంబును, నేప్రొద్దునుం జేరువ యగుకౌస్తుభరత్నంబునం
దెలయు తననీడఁ జూచి యొక్కొకమాటుమఱపున నితరసుందరి యనుసందేహంబు
నొంది యాందోళించుడెందంబున నొక్కింతవడి యసూయాసౌందర్యంబునం
దిలకించు నిందిరకుం బ్రియమందిరం బై యనవరతసురభిసురుచిరతరుణతుల
సీదళదామంబునఁ బొదలురుచిసముదయంబుల సమధికశ్యామాయమానంబు లగు
భుజాంతరంబులును, సిరినెఱికౌఁగిటఁ గఱకుచనుముక్కు నొత్తునం గమలినచోటి
కందుచందంబున లలితాలంకారం బై కనుపట్టు శ్రీవత్సలాంఛనంబును, దేవాదిచతు
ర్విధభూతనిర్మాణంబునకుఁ జతురాగమధర్మప్రతిష్టాపనంబునకు లోకపాలచతుష్టై
శ్వర్యప్రదానంబునకుఁ జతుర్ముఖముఖకపోలస్పర్శనోపలాలనంబునకు నొక్కొక
వరుసన చాలి చరితార్థం బొంది మణివలయమండితంబులై యాఖండలీయంబగుమత్త
వేదండంబునకు నఖండదంతదంతంబులుంబోలెఁ ద్రిరేఖాలక్షితం బై తనకు నిఖిల
వ్యాపారంబులయందును ధురీణంబు లగుచుఁ బెనుపొందుచతుర్భుజంబులును, భావి
కాలంబున నసురేంద్రుపేరుళంబు చీరునెడం దొరుఁగురుధిరధారలచెలువంబు
సూచించుచాడ్పునఁ గెందామరరేకులం దెగడు కరశాఖలం గాంతితరంగితంబు లగునం
గుళీయమాణిక్యమయూఖరేఖానివహంబులును, జతురాననజనకం బగుజలరుహంబు
నకు నిమీలనోన్మీలనంబు లుత్పాదించుచు వినోదించుటకు సవరించినచంద్రసూర్య
బింబంబులపగిదిఁ గమనీయకాంతితేజోవిలసితంబులఁ బచరించుచుఁ గకద్వితయం
బున నమరుపాంచజన్యసుదర్శనంబులును, నపరహస్తయుగళంబున బరిగృహీతం
బులై మూర్తంబు లైనసంపద్విజయంబులకరణిఁ బ్రకాశితంబులగు కౌమోదకీనంద
కంబులును, గరకలితకంబురత్నంబు నిర్మించినయచ్చునుంబోలెఁ ద్రిరేఖాలక్షితంబై
లక్ష్మీభుజలతావేష్టనంబునఁ బునరుక్తసన్నివేశం బగురత్నగ్రైవేయకంబువలన విల
సనైకధురంధరయును, శ్రవణప్రవేశసమయంబునకు నవసరంబు వేచి కదిసి పొదిఁగి
యున్న మహామునీంద్రస్తుతిసూక్తంబులో యనుతలంపు లుత్పాదించు నవతంస

మౌక్తికంబులుం దమయందుఁ బ్రతిబింబితంబు లగుటవలన మధురస్మితలతాభిజగర్భం
బులయోజ రాజిల్లు కమ్రకపోలతలంబులును, సుప్రసాదాలాపసమయంబుల నధ
రబింబప్రభాపటలపాటలంబగుటవలన లోకరంజితంబుల నర్థంబుల నతిసమర్థంబులగు
విమలవాక్యస్వరూపంబులరూపున దీపించుసితిదంతకరకలాపంబులును, గొలందివడని
నిడుదతనంబున నిగుడువెడఁదకన్నుఁగవకు నిరుదెసల కర్ణోపాంతంబులు విశ్రాంతసీమ
లగుటకుం దగి నడుమం దాన నిలిచిన ననాయతం బై సుగంధఘ్రాణపపనపరిమిళితపు
రోభాగం బగుచుఁ దనరారుఘనతరఘ్రాణంబును, దెలిమోముచందురుం గొలువఁ
జేరినకుముదవదనవికాసంబుల మాసరంబులమాడ్కి నలుదిక్కులం బిక్కటిల్ల నుత్ఫు
ల్లలోచనరుచినిచయంబులు సకలసురాసురస్థితివిలయంబులు నిజకటాక్షవిక్షేపవిభ
వంబులకు నధీనంబులుగాఁ బెంపారు తొంగలిఱెప్పలయొప్పిదంబుమీఁదఁ బ్రతి
బింబించె ననఁ బూర్వవిలసితంబు గలిగెంచు భ్రూయుగంబును, శిరోభూషణపద్మ
రాగరత్నంబునఁ బరఁగురాగంబు గలయఁ బర్వికెంబట్టు తలసుట్టిన యట్టియిట్టలం
పుఁబొలుపు పుట్టింపఁ బెంపారువిశాలమౌళిసన్నాహంబును నగుచు నఖిలముని
జనధ్యేయప్రకారం బైనయాకారంబు నిర్వికారసంస్కారంబుల నుదారంబు
లగుచునుండ, నిబిడాంజనశ్యామం బగునిజదేహధామంబున బహులస్తోమంబున
దత్ప్రదేశంబంతయుఁ గోమలతమాలపల్లవోపహారంబుల విస్ఫారంబు లైనమాడ్కిం
జూడ్కులకు వేడ్కలు నిండింపఁ, బ్రౌఢపర్యంకభుజంగఫణామణీమరీచులు మేనం
గలయబెరసి జలనిధివీచికాస్ఫాలనలగ్నంబు లగుప్రవాళాంకురంబు లనుశంక నంకు
రింపఁజేయు మహారత్నరచితంబు లైనసభాస్తంభతోరణకనాటకుట్టిమకుడ్యవేదీవి
తానాదులను దేజోమహనీయంబు లగునభ్యంజనశరీరంబులను బ్రతిఫలి యైననిజ
మూర్తి దా నఖిలచరాచరాంతర్గతుం డగుట ప్రత్యక్షంబుగాఁ దెలుపంబూనినతెఱం
గునఁ దేజరిల్లు సాగరకన్యకాకరసరోరుహసౌరభసంభావితంబు లై మొరయు మధు
కరంబులు సాకారంబులై కొలుచుసకలశబ్దమంత్రాక్షరజాలంబులకు ననుగలంబులై కలసి
మెలఁగ మూర్తంబులై సర్వాగమంబులు నేమేమి యని యుత్తమాంగంబులు మంగళ
చరణపీఠంబులుగా నమర్ప నొగ్గి డగ్గఱికొలువ, సురుచిరప్రతిష్ఠాలాపంబులు గోరి
యశేషధర్మవిశేషంబులు నంగీకృతాకృతులై చేరి కృపాకటాక్షంబు లపేక్షింప,
సర్వలోకశరణ్యుండును, సర్వదేవతావరేణ్యుండును, సర్వయోగాగ్రగణ్యుండును
నగుచు శ్రీదేవీవిలోచనచకోరంబులు నిజవదనేందుచంద్రికాప్రవాహంబుల నోలలా
డుచుండ, నాత్మీయమనోరథమధుపంబులు తదీయలావణ్యమధురసంబులఁ దనివిలేని
యనువునం గ్రోలి క్రాలుచుండ, నమ్మహాదేవి నెమ్మేనుదీఁగ దనబాహుశాఖలం దగిలి
ధన్యవిలాసంబుల భాసిల్లుచుండఁ, బుండరీకాక్షుం డయ్యును ననురక్తావలోకనుం
డును, నీలవర్ణుం డయ్యును దరహాసధవళితకపోలుండును, గమలాకళత్రుం డయ్యును

వివాహకౌతూహలియును, నిరంతరవనవాసి యయ్యును ననంతభోగేశ్వరుండును,
గుణరహితుం డయ్యును సాధుజనపూజనీయుండును, జనవిముఖుం డయ్యును
భవప్రియుండును, గోత్రోద్ధరణసమర్థుం డయ్యును సమస్తలోకబాహ్యుండును,
విగతబంధుండయ్యను సతతసన్నిహితపితామహుండును నగుచు పుణ్యంబు
లకు నాధారంబును, నాపదలకుఁ బ్రతీకారంబును, నధర్మంబునకు నవమానంబును,
మంగళంబులకు నాస్థానంబును, సత్వంబునకుఁ బరమమిత్రంబును, నాగమార్థంబులకు
నాదిసూత్రంబును, రక్షకు మూలంబును, మోక్షంబునకు నాలవాలంబును, విజ్ఞానం
బునకు నిర్దేశంబును, బూజాస్తోత్రంబులకు నభిగమ్యప్రదేశంబును నగుచు నొప్పు
చున్న దేవాదిదేవుఁ, బురాణపురుషుఁ, బురుషోత్తముఁ, బ్రకృతిపురుషుఁ, బురుషా
ధీశ్వరుఁ, బరమేశ్వరు నంత నాలోకించి.

14


క.

అందంద చాగి మ్రొక్కుచు, బృందారకు లధికభక్తి భీతవికాసా
నందంబులు డెందంబుల, సందడి గొన మస్తకప్రశస్తాంజలులై.

15


క.

ఆవిశ్వరూపరూపము, భావించుచుఁ దత్ప్రభావభంగుల మది సం
భావించుచుఁ దత్పరమతు, లై వినుతింపంగఁ దొడఁగి నప్పరమాత్మున్.

16


ఉ.

శ్రీవసుధాకళత్ర యతసీసుమనోతిమనోజ్ఞగాత్ర మా
యావిహితత్రిలోక నిగమార్థవివేక విపాకభవ్యసం
సేవక సౌమ్యమానసవశీకృతరూప భవాంధకారని
ర్ధాననదీప దీప్తనవతామరసేక్షణ విశ్వరక్షణా.

17


చ.

భవదురునాభిరంధ్రభవపద్మరజఃపరిమాణపాకసం
భవుఁడు విధాత తద్విమలభావకళాకణమాత్రవైభవో
ద్భవము జగంబు తద్వివిధభంగికసర్గములోన నొక్కరుం
డివి యని నిశ్చయింపఁగలఁడే భవదీయగుణంబు లచ్యుతా.

18


ఉ.

ఎందును నిన్నుఁ గన్న జను లెందును గల్గరు వెండి యెద్దెసం
జెందవు నిన్ను నెద్దెసలఁ జెందనిక్రించులభక్తి నొక్కటన్
బొందు గొనంగఁ జాలు కృతపుణ్యులు గల్గినఁ జాలువారికిన్
బొందగు నీలసత్కరుణ పుణ్యయశోమహనీయ మాధవా.

19


శా.

విన్నంజాలు భవన్మహత్త్వము భవద్విజ్ఞానసద్గోష్ఠియం
దున్నంజాలు భవత్పదాంబురుహసేవోత్సాహసంపన్నులం
గన్నంజాలు భవత్సమంచితజగత్కల్యాణనామంబుఁ బే
ర్కొన్నంజాలు నరుండు శాశ్వతశుభారూఢుండు లక్ష్మీశ్వరా.

20


ఉ.

అక్షరయోగయుక్తులు సమంచితసత్యదయానురక్తు లా
లక్షితసత్యధర్ములు విలంఘితకర్ములు బుద్ధికల్పితా

పాక్షరవాక్యరూపులు నిరాకృతకోపులు సంయమక్షమా
శిక్షితు లక్షయుల్ నినుభజించుమహాత్ములు నీరజోదరా.

21


చ.

తమతమపూర్వవాసనలఁ దత్పరు లై వివిధాగమోక్తకృ
త్యములు వహించె భవ్యపరతత్వము నయ్యయిసంజ్ఞలం బ్రయ
త్నమునఁ దలంచుసంయతమనస్కుల కెల్లను జేరుచోటు శ్రీ
రమణ భవాత్సదంబు సుచిరస్థితి నేఱుల కబ్ధిచాడ్పునన్.

22


ఉ.

విద్యల కెల్ల నాద్యుఁడును వేద్యుఁడు నై తనరారునిన్ను న
భ్యుద్యతకర్మరూపముగ నుల్లమునం దలపోసి యెంతయుం
జోద్యపుభక్తి యజ్ఞపురుషుం డని పూని భజింతు రెందుఁ ద్రై
విద్యలు నాకలోకపదవీపదవిప్ర త్రిలోకనాయకా.

23


శా.

దృష్టాదృష్టఫలస్పృహావిముఖు లై దిక్పూర్వతత్త్వక్రియా
సృష్టిం బ్రస్ఫుటతీవ్రబోధమున నుత్సేకించి యవ్యక్తసం
సృష్టిన్ బాసి నిరస్తవైకృతనిదాసీవాత్ము షడ్వింశు వి
స్పష్టైశ్వర్యుని నిన్ను సాంఖ్యు లెలమిన్ భావింతు రాత్మేశ్వరా.

24


చ.

యమనియమాభివర్ధితము లై మగుడంగ మనశ్శరీరముల్
శమితముగా మరుచ్చయము సంతతజీవపరాత్మతత్వరూ
పములు విభేద మై మఱపు పాటిలి కాలము మ్రింగి యోగివ
ర్గము గను చిత్సుఖానుభవగర్వము సర్వము నీవ కేశవా.

25


చ.

పరఁగుపదార్థపంచకము పాశము లై తనుఁ జుట్టఁ దూలుచున్
దిరిగెడుజీవుఁడున్ బశువు దేశికపుణ్యకటాక్షవీథిఁ ద
త్పరమతిఁ జేరఁగా నపరబాధవిముక్తి శుభంబు నిచ్చునీ
శ్వరుఁడుగ ని న్నెఱుంగురురు శైవులు శాశ్వతచిన్మయాత్మకా.

26


ఉ.

దాస్య మొకండునుం బరమధర్మముగాఁ గొని యన్యధర్మ మా
శాస్యముగా గణింపక యసంశయనిశ్చలభక్తిసంతతో
పాస్యు నశేషభవ్యపురుషార్థభవైకవిధాయి ని న్ననా
లస్యతఁ బంచరాత్రులు దలంచి భజింతురు భక్తవత్సలా.

27


శా.

ద్వైతభ్రాంతివికల్పితం బఖిలమున్ స్వప్నేంద్రజాలో మం
బై తూలన్ పృథురజ్ఞుసర్పసదృశవ్యామోహివిచ్ఛేదనం
బై తత్త్వజ్ఞత యావహిల్లి యపరోక్షాభేదవిత్సౌఖ్యవి
ఖ్యాతుం గాంతురు నిన్ను నౌపనిషధుల్ కళ్యాణనారాయణా.

28


శా.

ధ్వస్తాశేషమతాఖిలాత్మతనుచేతశ్శుద్ధు లుక్తాంగవి
న్యస్తప్రస్తుతమంత్రవర్ణులు నిరస్తాలస్యు లంతశ్శమా

భ్యస్తోద్యద్భవదీయమూర్తివిభవుల్ ప్రాజ్ఞుల్ మహామాంత్రికుల్
హస్తోత్ప్రేయసురాంఘ్రిపం బయినని న్నర్థించుదాసుల్ హరీ.

29


క.

వేదము లాదిగఁ గలయ, ష్టాదశవిద్యలకు నీవ స్రష్టవు దత్త
ద్బోదకులును భవదాజ్ఞా, పాదకులు సమస్తధర్మపాలనచతురా.

30


సీ.

జలములు సృజియించి జలములయందు నీయంచితబీజంబు నావహించి
యది యప్రమేయమహాద్భుతాండస్వరూపంబునఁ బెంపారఁ బద్మభవుఁడు
జనియించె నందుఁ దజ్జాతులు భృగుమరీచ్యాదులచేత సురాసురారి
వివిధభూతోద్భవవిస్తార మేపారి త్రిభువనవ్యాప్తి నుద్దీప్త మయ్యె


గీ.

నింతయును జూపు వడువంగ నెంతయును బ్ర, వీణయై దేవ నీమాయ వినుతి కెక్కె
విమలకమలాక్ష సదవనక్షమకటాక్ష, విగతపరితాపహృద్దీప విశ్వరూప.

31


క.

కేవలకరుణామూర్తివి, గావున భక్తాభయత్వకరణము పని నీ
విశ్వము గాఁచుటకై , శ్రీవల్లభ యపుడు నవసరింతు నిజేచ్ఛన్.

32


చ.

కడఁక దలిర్ప నీవు మధుకైటభదైత్యులఁ జక్రధారచే
మెడలు దెగంగ వేయునెడ మిక్కుటమైనతదీయరక్తముల్
వడిసినయోడికల్ నెరయ వ్రాసినలత్తుకభంగిఁ జోద్యపుం
దొడవుగ నొప్పు నీతొడపు తోరపుటొప్పు దలంతు మీశ్వరా.

33


చ.

చదువులు గోలుపోయి యొకజాడయుఁ గానక బమ్మరించు న
మ్ముదుసలివేల్పు చేర్చి వెస మ్రుచ్చుబడిం బ్రళయాబ్ధినీట గ్ర
క్కదలఁగ దాడివెట్టిన నఖర్వభవత్తిమిరూప మిప్పుడున్
మదరుని గ్రోలుచుండు మునిమానసపూరములం జగన్నిధీ.

34


చ.

కమఠతనూవిలాసమున గర్వపుఁగొండ ధరించుఠేవ నీ
యమృతము దెచ్చి యాశ్రితజనావలి కిచ్చితి నేఁడు నమ్మహా
కమఠతనూవిలాసము దగన్ దలఁపన్ గొనియాడఁ గన్నవా
రమృతముఁ గాంచి నిర్మలసుఖాంబుధిఁ దేలుదు రార్తరక్షకా.

35


చ.

గొరిజలత్రొక్కునం బ్రిదిలి కుండలిభర్త యొదుంగ నూర్పులం
దెరలి మహార్ణవోదకము త్రిప్పుకొనం బటురోషతాడనన్
జిరిఁగి యజాండకర్పరము చిల్లులువోవఁగ యజ్ఞపోత్రివై
ధర పదిలంబుగా నిడిన తావకలీలఁ దలంతు మవ్యయా.

36


ఉ.

భేదములేక యజ్జమయకేసరముల్ గదలంగ విస్ఫుర
న్మేదురఘోషితధ్వను లమేయములై ప్రణవస్వరూపతన్
రోదసి నిండఁగా హయశిరోవపు వొప్ప యుగాంతసంహృతిన్
వేదము లుధ్ధరించిన పవిత్రయశుండవు నీవు శ్రీనిధీ.

37

మ.

స్ఫురదాతామ్రజటాకలాపములతోఁ బూర్ణేందుసౌందర్యసుం
దరవక్త్రంబులతో మహోగ్రఘనకోదండేషువిస్ఫారభా
సురపూర్వాపరభాగవైభవముతో సొంపారునీరూపముల్
నరనారాయణనామధేయములు వర్ణంబుల్ జగన్మంగళా.

38


ఉ.

భూతభవద్భవిష్యదురుభూతసమృద్ధుల నొప్పునీసమ
గ్రాతతదివ్యరూపముల నన్నిఁటి నిట్టిది నా నెఱుంగ సం
ప్రీతి నుతింప శక్తుఁడె విరించియుఁ గేవలభక్తియుక్తులన్
గాతరులన్ గృపాగరిమఁ గావుము మమ్మఖిలాండనాయకా.

39


క.

గోవింద కృష్ణ కేశవ శ్రీవల్లభ పద్మనాభ శ్రీకర సితరా
జీవాక్ష చక్రధర నీ, సేవకుల ననుగ్రహింపు శీతలదృష్టిన్.

40


క.

పరమవనమాలికాధర, గరుడధ్వజ శార్ఙ్గధన్వ కాంచనవర్ణాం
బరధర కౌస్తుభరత్నా, భరణ ప్రసన్నుఁడవు గమ్ము పాలింపు దయన్.

41


క.

వైకుంఠనాథ దయితక, థాకుంఠితకరణచతురధర్మావన దీ
నాకల్ప భవచ్చరణా, బ్జైకాయనతత్వ మాకు నభయ మొసఁగవే.

42


ఆ.

అమృత యభవ యలయ యక్షయ యవికార, యప్రతర్క్య యనఘ యజిత యచల
యప్రమేయ యమల యాద్య యనాద్యంత, యార్తమతుల మమ్ము నవధరింపు.

43


వ.

అని యనేకప్రకారంబులఁ బ్రస్తుతించుచు సభక్తికచిత్తులై యున్నయన్నాకౌకసులఁ
గరుణావలోకనంబునం గైకొని యాలోకేశ్వరుండు మీదెసఁ బ్రసన్నుండ నైతి
నెయ్యది యిష్టం బేమి కారణంబునం జనుదెంచితి రింతదైన్యం బేల వచ్చె మీయాపద
యపనయించెద నెఱింగించునది యనిన డెందంబులం గొందలంబులు డిందుపడ
బృందారకు లందఱు నందంద సాష్టాంగదండప్రణామంబు చేసి యిట్లని విన్న
వించిరి.

44


గీ.

దేవ దేవేశ దేవర దివ్యచిత్త, మునకు గమ్యంబు గానిది భువనకోటి
యెందునుం గల్గునే యైన యేము విన్న, పంబు చేయఁగ వినుఁ డభిప్రాయము మెయి.

45


వ.

చిత్తగింపుము దితిసూనుం డైనహిరణ్యకశిపునకు హిరణ్యగర్భుండు వరంబిచ్చి యధి
గుంజేసిన నయ్యసురాధముండు క్రోధమాత్సర్యంబులు దన్నుం జుట్టుకొనఁ బెరిఁగి
యదితిసంతతిం బరిభవించి త్రైలోక్యదుర్జయుం డైయున్నవాఁడు.

46


గీ.

బలియునింట బానిస నైనఁ బఱప వెఱచు, నొరులు నీయింటిదాసుల నోటలేక
మము నసుర భంజించుట మాకుఁ జెప్ప, సిగ్గు లయ్యెడు నిందు వచ్చియును దేవ.

47


చ.

అలఘుసరోషదృప్యదసురాధిపతీవ్రగదాహతిన్ గడున్
గలఁగినమస్తకంబు లివె కల్పితదానవతర్జనంబుల
న్వెలవెలఁబాఱు మోము లివె నిష్ఠురదైత్యనితాంతసేవమై
నలజడిఁబడ్డమోము లివె యయ్య కృపం బరిగించి కానవే.

48

ఆ.

ఆహిరణ్యకశిపుఁ డడరి సమస్తసం, పదలు గొనిన దివ్యపదముఁ బాసి
యిప్పు డున్నవార మిల హిరణ్యకశిపు, హీను లైన నరులలోనఁ గలసి.

49


ఉ.

దానవుచేతఁ గప్పుబడి దైన్యము నొందుట కోర్వలేక నీ
దైనపదాంబుజంబు లభయం బని చేరితి మెవ్విధంబునం
దైనఁ బ్రసన్నమానసుఁడ వై మముఁ జేకొనవయ్య మాకు ది
క్కైనను గాక యున్న నసురాంతక! నీవె కదయ్య యెయ్యడన్.

50


వ.

అని కృప పుట్టం బలికిన దివిజులపల్కులు మనస్కరించి మధుమథనుండు కొండొక
యూహించి యనంతరంబు వారల కిట్లనియె.

51


చ.

ఎఱుఁగుదు నేను దైత్యునియుదీర్ణమదోద్ధతచేష్టితంబు మి
మ్ముఱక పరాభవించుటయు నుల్లమునం దలపోసి వానికిన్
గొఱఁతలు నిండునంతకును గ్రూరతఁ గైకొనకున్నవాఁడ ను
క్కఱఁ దిమిరం బడంపఁ దిమిరారియుఁ బూనునె వేగకుండినన్.

52


వ.

అమ్మహాసురుండు సరసీరుహసంభవుం బ్రసన్నుఁ గావించినయప్పుడుం దనకుం జావు
లేకుండ ననేకప్రకారంబులు యోజించుకొని వేడినవాఁడు గావున వాఁ డడిగినచం
దంబు లెయ్యవియుం గాకుండ నొక్కటి తత్ప్రశమనోపాయంబు నిరపాయంబు
గాఁ బ్రయోగించుటకు నూహించినవాఁడ నది యెట్లనిన.

53


సీ.

ఆననభంగి పంచాననసమరేఖ యఖిలాంగములు పురుషానుకారి
తీవ్రనఖంబులు తీవ్రశస్త్రంబులు సంధ్యాముఖము ఘనశౌర్యవేళ
విపులాంకపీఠంబు రిపునకు వథశిల తద్భుజామధ్యభేదనము గదన
మమరభుజంగమర్త్యావాసనిగ్రహనోదన విజయప్రమోదలీల


గీ.

యిట్లు ఘోరాద్భుతస్ఫూర్తి నెసకమెసఁగ, నతులనరసింహభవ్యదివ్యావతార
మేను ధరియింతుఁ దడవులే దింక నాత్మఁ, గలఁక విడువుఁడు దేవతాగణములార!

54


క.

వినుఁ డాశ్రితరక్షణ మే, యనువునఁ గావింతునొక్కొ యని యనిశము నే
మనమునఁ దలపోయుదు మఱ, తునె శరణాగతుల మిమ్ము దురితరహితులన్.

55


చ.

ఒకమఱి నన్నుఁ బేర్కొనిన నుల్లమునం దొకమాఱు నన్ సభ
క్తికమతియై తలంచినను దెల్లము భక్తుఁడు వాఁడు నాకు వా
నికిఁ గలనేను వేఱొకటి నేరక నన్నుఁ దలంచుపుణ్యులన్
బ్రకటదయానురక్తిఁ బరిపాలన చేయుట చెప్పనేటికిన్.

56


ఉ.

చెప్పితి సర్వవేదములఁ జెప్పితి శాస్త్రవిచారపద్ధతిన్
జెప్పితి సత్పురాణములఁ జింతితకల్పమహీరుహం బనా
నొప్పుమదీయకీర్తనమ యుగ్రతపంబులఁ జెందు పుణ్యమున్
జొప్పడ నస్మదీయగుణశోభనముం గొనియాడ నేర్చినన్.

57

క.

ఏనాఁడు నన్ను నెఱుఁగడు, గావున ద్రైలోక్యహితముఁ గావింపంగన్
భావము దెలుపుచు నుండుదు, నీవిశ్వంబునకు నేన యెప్పుడు కరుణన్.

58


తే.

సకలభూతజాతములకు సముఁడ నేను, వినరె యట్లయ్యు ధర్మవిద్వేషు లైన
తామసాత్ముల సైరింప ధర్మబుద్ధిఁ, బొగడఁ గనినసాత్వికతిఁ బ్రోతుఁ గరుణ.

59


వ.

మీరు సాత్వికచిత్తులరు గావున నాకు నవశ్యరక్షణీయులు. తామసమర్దనంబు గార్యం
బుగా నాకు మీరెవ్వరుం జెప్పవలదు. మీపదంబులు మీకు సుస్థిరంబులైనవిగాఁ దలం
చి నిరాతంకహృదయులరై యుండుఁడు. పొండని యానతిచ్చిన నాజగన్నాథువచనం
బులు మహాప్రసాదం బని యంజలిరచనారమణీయంబు లగు మౌళిభాగంబులన్ బరి
గ్రహించి పురందరాదిబృందారకు లానందంబున నానందకహస్తుచేత నామంత్రితు
లై మరలి భావినరసింహరూపప్రకారం బూహించి యాశాకుతూహలప్రమోదభక్తి
పరవశమానసు లగుచుఁ దత్కార్యోద్యోగప్రవర్తకుం డగు వాచస్పతిఁ బ్రస్తుతించు
చుఁ బరమేశ్వరువాక్యంబుల నానావిధంబులం భావించి సంతసిల్లుచు నిజస్థానంబు
లకుఁ జని. రక్కాలంబున నచ్చట.

60


చ.

జగములు మూఁడు గెల్చి యొకశంకయుఁ గింకయు లేక దైత్యుఁ డ
త్యగణితవైభవంబున నిరంతరభోగపరంపరారతిన్
దగిలి మనంబుగోరినవిధంబుల వేడ్క, లఁ దేలుచుండు సొం
పుగఁ దనధర్మపత్ని యగుపొల్తియుఁ దాను మదాత్తలీలలన్.

61


చ.

ఉదధిపునొద్ద నర్థపతియొద్ద నిలింపకులేంద్రునొద్ద ను
న్మదకలలీలఁ గ్రాలు నెలనాఁగలు నాగరికంపుఁజందముల్
పొదల విలాసహాసము లపూర్వపుగర్వములం దలిర్ప న
య్యదితిసుతాహితుం గొలుతు రమ్ముడువోయినయ ట్లజస్రమున్.

62


క.

విశ్వావసుతుంబురులును, నశ్వముఖులు నరుగుదెంచి యందఱు నాదై
త్యేశ్వరు నారాధింతురు, శశ్వత్సంగీతకప్రసంగప్రౌఢిన్.

63


శా.

వీణావేణుమృదంగసంగతకళావిన్యాసమున్ బంధుర
శ్రేణీరమ్యఘనస్తనీనటనచారుప్రేక్షయున్ సంతత
ప్రాణప్రీణనగంధబంధవిలసత్కాదంబరీకేలియున్
ప్రాణంబు ల్దలకొం డెఱుంగఁ డతఁ డెబ్బంగిన్ సమస్తక్రియన్.

64


సీ.

అమృతశీకరసేకహరితవనావలి సుందరమందిరకందరములు
రత్నపుష్పామోదరమ్యకాంచనలతాకోమలమేరునికుంజములును
గనకాంబుజక్షోదపునరుక్తవాలుకాలలితమందాకినీపులినములును
హంసకుటుంబనిత్యావాసహేమాబ్జచారుమానససరిత్తీరములును

తే.

నాదిగాఁగల్గు దివిజవిహారభూము, లన్నియును దానయై వేడ్క లగ్గలింప
ననుదినంబును నచ్చరు ల్వెనుకఁ దిరుగఁ, దానుఁ బ్రియయును విహరించె దైత్యవిభుఁడు.

65


వ.

ఇట్లు సంతతప్రమోదంబు లగు వినోదంబులం గాలంబు చనుచుండ నొక్కతఱి
వసంతసమయావసానం బగుటయు.

66


ఉ.

ఒయ్యన మాధవీలతల నుండుట లుజ్జనఁ జేసెఁ దుమ్మెదల్
గ్రుయ్యఁగ బాఱి పాటలతరుప్రకరంబుల మూఁగె నుక్కునన్
దియ్యనివింటికి న్మరుఁడు దీసినయమ్ములు గావ మెచ్చెఁ దా
నెయ్యెడ మల్లెక్రొమ్మొగడ లేపునఁ బాంథులవేఁటలాటకున్.

67


చ.

మలయజవారిసేకములు మౌక్తికనూతనహారలీలలన్
వలిపపుసన్నకావులను వారిరుహాక్షులనీఁగుఁజన్నులన్
గలిగినచల్మిరిం బ్రదికెఁ గాక జనావలి యిట్టివేసవిన్
గలదె శరణ్య మన్య మనఁగాఁ గడుఁ బేర్చె నిదాఘదాహముల్.

68


తే.

అదరిపాటున వేసవి పొదివికొనినఁ, గలఁగి తలఁగి పోనేఁక మలయపవనుఁ
డిందుఁ దలదూర్చికొనియె నా నింపొనర్చె, నమరుతాలవృంతముల మందానిలంబు.

69


మ.

తమచుట్టం బయలైన నూత్నశశికాంతస్ఫారవేదు ల్మహో
ద్యమచంద్రోదయలీల రేలు గరఁగం దత్తోయసంసేవనల్
గమియం దన్పొసఁగంగ నొప్పెసఁగె రంగత్కేళికాంతారభూ
జము లొప్పేమియుఁ గోలుఫోక కడునిస్సారంపుఁ బెన్వేసవిన్.

70


చ.

రమణభుజానిపీడనఁ గరంగినకాంతలవిస్ఫురన్నితం
బములఁ దలిర్చు సన్నవలిపంబులు వీడియుఁ జాఱవయ్యెఁ జె
న్నమరువినూతవక్షతనఖాంకము లింపెసలారఁ గ్రమ్మునుం
జెమటలఁ జాలఁ బచ్చులయి చిక్కఁగ నంటికొనంగఁ జేసినన్.

71


చ.

పరిమెయి మెట్టి తొల్త బహుభంగులఁ గ్రాలెడుమిత్రుఁ జైత్రునిం
బొరిగొన వచ్చె గ్రీష్మ మనుపొచ్చెపుఁబేరఁ బురారిఫాలభా
సురపటువహ్ని యంచు వెఱఁ జొచ్చినమన్మథుఁ గాచె నత్తఱిన్
సరసశిరీషకేసరలసన్మహిళామృదులాలకాగ్రముల్.

72


తే.

పగళు లెలతోఁటనీఁడలు బ్రాఁతి యయ్యెఁ, బగళులును రేలు దనుగాలిఁ బ్రాఁతి యయ్యె
రేలు వెన్నెలబయళులు ప్రియము లయ్యె, రేలుఁ బగళులు నిద్రలు ప్రియము లయ్యె.

73


వ.

ఇట్టి ఘర్మసమయంబున నసురవల్లభుండు వల్లభాజనసహితంబుగ నొక్కనాఁడు
నిజమందిరాభ్యంతరకేలీకాంతారంబునందు.

74


సీ.

ఎండక న్నెన్నడు నెఱుఁగని క్రొమ్మావినీఁడలఁ దనుపారునెలవులందుఁ
గలిగొట్టుఁ బువ్వులందలితేనియలవానఁ దడిసిన పొదరిండ్లయెడములందు

విరియనూఁకించు క్రొవ్విదపుమల్లియమొగ్గ లెలదావిఁ జొక్కించు నిక్కలందు
రాయంచయెఱకలరాయిడిఁ దుప్పర చల్లెడు కొలఁకులచలువలందుఁ
ఆ. దిరిగితిరిగి పెక్కుదెఱఁగులయాటల, మెఱసిమెఱసి చెన్ను మిగిలిమిగిలి
క్రాలఁ బ్రొద్దుమాపకడ యయ్యెఁ గలువల, మ్రొక్కు దైవమునకు నెక్కె ననఁగ.

75


తే.

ఇట్టివేసవితఱిఁ బగ లిట్టినిడివి, యైన సయిరించునే దివిజారి యనుచు
వెఱచి తొలఁగెడుతెఱఁగున వేఁడివెలుఁగు, వరుణుఁడేలెడుదెస నొక్కవలన నొదిఁగె.

76


చ.

ఇను నసమానతేజు దివసేంద్రుఁ గనుంగొనుమాడ్కిఁ జూడఁగాఁ
జన దొరు నల్పతేజు ననుచాడ్పునఁ జంచలభృంగతారకా
ఘనవనజాతలోచనము గ్రక్కున మీలన మొందఁ జేసెఁ బ
ద్మిని పతిభక్తిసత్త్వమున మేలిమికిం గుఱి దాన సొ మ్మనన్.

77


చ.

సురుచిరతారకాకుసుమశోభినభోంగణభూమిఁ గాలమన్
గరువపుసూత్రధారి జతనంబున దిక్పతికోటిముందటన్
సరసముగా నటింపఁగ నిశాస్వతి కెత్తినక్రొత్తతోఁపుఁబెం
దెర యన నొప్పుసాంధ్యవనదీధితి పశ్చిమదిక్తటంబునన్.

78


క.

నలుదెసలయందుఁ దొలితొలి, తలసూపుఁ దమఃప్రరోహతతులు వియోగా
కులచక్రవాకమిథునం, బుల వగ యనుచిచ్చురాజుపొగల నడఁగియున్.

79


తే.

పొదివి యొండొండ దివియు భువియు దిశలుఁ, బొదివికొనియుండుచీఁకటిప్రోవునలన
మిక్కుటంబుగఁ గాటుక గ్రుక్కినట్టి, కరపటంబున జగదండఖండ మమరె.

80


ఉ.

రాజితతేజుఁ డైనదినరాజు తిరోహితుఁడైన పిమ్మటన్
రా జుదయాద్రిపీఠము తిరంబుగ నెక్కెడుసందికట్టునన్
భ్రాజితసత్పదంబునకు బాధ యొనర్చుచు జారచోరసం
పూజితమై తపంబు గడుఁ బొంగె నధర్మముతోడిచోటయై.

81


క.

పదపడి పూర్వదిశాసతి, వదనంబునఁ దెల్పుమిగిలె వనజాహితుచూ
లుదరంబున ధరియించినఁ, గదిరినపాండురకపోలకాంతివిధమునన్.

82


వ.

అంత.

83


సీ.

తిమిరభూతముసోఁకుఁ దెలియ జగత్త్రయీ, లలన దాల్చినరక్తతిలక మనఁగ
సఖ్యంబునకు నిశాసతి యొసంగినఁ బ్రాచి ప్రాపించుగురివిందబంతి యనఁగఁ
దోయధి వెడగ్రుంకి తోఁచుపురందరకుంభిసింధూరితకుంభ మనఁగఁ
గులిశాయుధుని పెద్దకొలువున నెత్తిన దీపించుమాణిక్యదీప మనఁగఁ
తే. గుముదినీరాగరసబద్ధగుళిక యనఁగఁ, గామినీరంజనౌషధకబళ మనఁగఁ
బొడవుపెంపున బింబంబుపొలుపు మిగుల, జంద్రుఁ డుదయించెఁ గాంతినిస్తంద్రుఁ డగుచు.

84

వ.

ఇ ట్లుదయించి.

85


చ.

దిసలనుగొమ్మ లొయ్య నతిదీర్ఘములైనకరంబులన్ బ్రియం
బెసఁగఁగ నూది నిక్కి రజనీశ్వరుఁ డున్నతలీలఁ దేర్చునా
కసమనుపేరిభూరుహము కాంతనిరంతరతారకాలస
త్కుసుమచయంబు గోయుటకొకో యనఁ బ్రాఁకె సముత్సుకాకృతిన్.

86


ఉ.

వెన్నెలవెల్లిపాల్కడలి వ్రేఁకదనంబునఁ జేర్చి దిక్కులున్
మిన్నును ముంచి ముందు రజనీకరబింబము కుండలీభవ
త్పన్నగతల్పకల్పనముభంగిఁ దనర్చెఁ దదంతరంబునన్
వెన్నునిభంగిఁ జూడ్కులకు వేడ్క యొనర్చెఁ గలంక మత్తఱిన్.

87


చ.

వడిగొని ఱేకులుప్పతిల వాలినకేసరమున్ దలిర్పఁ బు
ప్పొడిదలమెక్కి తేనియలు పొంగి తరంగలుఁగాఁ జెలంగి పైఁ
బడునెలదేఁటిదాటులకుఁ బండువలై నవసౌరభంబు లు
గ్గడువుగ నుల్లసిల్లె ఘనకైరవషండము నిండువెన్నెలన్.

88


ఉ.

వెన్నెలవెల్లపచ్చడము విచ్చిన యంబరశయ్యమీఁదఁ బే
రన్నున నుండి దిగ్వనిత లాదటఁ జుట్టును గొల్వ రాత్రియన్
కన్నియకూర్మి చిక్క దనకౌఁగిటఁ జేర్చి సుఖించినాఁడనన్
జెన్ను వహించెఁ జందురుఁడు శ్రీకమనీయకళంకరేఖతోన్.

89


సీ.

కరఁగెడువనచంద్రకాంతోపలంబులఁ దఱచుసోనలఁ గడుఁ దలముకొనుచుఁ
జటులచకోరసంచయములయెఱకల గర్వంపుదాటులఁ గడలుకొనుచు
విరియుకైరవములవిపులరంధ్రములపైఁ దీవ్రంబుగాఁ గ్రమ్మి త్రిప్పుకొనుచుఁ
గామినీజనములకమనీయవిభ్రమస్మితకాంతిలహరుల మెండుకొనుచుఁ
ఆ. బొదలిపొదలి చదలఁ బొంగారిపొంగారి, మించిమించి దిశలు ముంచిముంచి
యభిమంతేంద్రుచంద్రికాంభోధి యఖిలంబు, నీటనిట్టలముగ నిట్టఁబొడిచె.

90


వ.

ఇ ట్లతిమనోహరగంభీరధీరం బైనసుధాకరకాంతిపూరంబు రాత్రి యనుతలంపుఁ దోఁ
పనీక తమం బనునామంబును విననీక యవ్యక్త యనుశంక నంకురింపనీక లోచనం
బులకు నమృతసేవనంబును, శరీరంబునకుఁ జందనాసారంబును, నంతరంగంబునకు
నానందతరంగంబును నగుచు విజృంభించినసమయంబున.

91


క.

తనదేవియుఁ దానును న, ద్దనుజవిభుఁడు విమలసౌధతలమునఁ గాంతా
జనపరివృతుఁడై సురతరు, జనితములగు మధురమధురసంబులు వేడ్కన్.

92


క.

తెప్పించి సహజసౌరభ, మొప్పార దివ్యరుచిసమున్నుతసములై
యుప్పొంగువానిఁ గనకపుఁ, జిప్పల నిండించె మదము చిప్పిలుచుండన్.

93

ఉ.

అందఱఁ గైకొనం బనిచి యాదటఁ గాంతయుఁ దాను నొక్కకో
రం దనుపార దివ్యమదిరామధురామృతపానకేలి యం
దంద యొనర్పఁగాఁ దొడఁగె నంబురుహాక్షుల విభ్రమక్రియా
కందళితంబులైన సవికారవిహారము లింపుఁ బెంపుగన్.

94


క.

ఆరమణులమదిరారస, పూరితచషకములఁ దోఁచు పూర్ణేందుఁడు పొ
ల్పారెను వాసనకై క, ర్పూరంపుంబల్కలిడినపోలిక యమరన్.

95


చ.

నెలఁత యొకర్తు చేతిహరినీలశిలామయపాత్రఁ బూర్ణసం
చలితతరంగయై పొదలు వారుణిఁ దోఁచుసుధాంశుమండలం
బలము కరాళరాహువదనాహళి స్రుక్కి కరంబుఁ బిమ్మటం
గలఁగి పొరింబొరిన్ వడఁకుకైవడిఁ గానఁగనయ్యె నయ్యెడన్.

96


చ.

సుచిరపానపాత్రమున సుందరి యొక్కతె కేల నిండుచం
దురుఁడు ప్రకంపితాంగములతోఁ దిలకించెఁ దదాననాంబుజ
స్ఫురితవికాసవైభవము సొంపు లడంకువ మ్రుచ్చితించి చె
చ్చెరఁ జనుదెంచి పట్టువడి చేడ్పడి భీతి వడంకుచాడ్పునన్.

97


చ.

పొలఁతుక యోర్తె యొప్పు మధుపూరితిపాత్రికఁ గానవచ్చు ను
జ్జ్వలహిమధాముచేతఁ దనవక్త్రముకాంతికిఁ గాంతిపూరముల్
గలయఁగఁ చేర్చి త్రచ్చి యొడికంబుగఁ బుచ్చిన వెన్నకల్లుతోఁ
గలసి కరంచి క్రోలుటకుఁగా నిడికొన్న తెఱంగునం దగన్.

98


ఉ.

ఈరమణీలలామవదనేందునిఁ జెంది పవిత్ర యైన యి
వ్వారుణిఁ గాని పాయదు ధృవంబుగ నాత్మకలంక మంచు నిం
పార మునింగెఁ గాక యమృతాంశుఁ డనన్ బ్రతిబింబచంద్రుఁ డొ
ప్పార నొకర్తు చేతిసముదంచితకాంచనపానపాత్రికన్.

98


తే.

చషకమునఁ గామినిముఖచంద్రుఁడును సు, ధాంశుఁడును బింబితాంగులై యలరుటొప్పె
నర్థిఁ దమలోనఁ జెలిమిచేయంగ శపథ, మునకు వరుణతనూజలో మునిఁగినట్లు.

100


వ.

ఆసమయంబున.

101


చ.

ఎనసినరోగబీజమున నీరిక లెత్తిన దర్పహాసముల్
ఘనతరశాఖలై యలమొగంబులఁ గెంపులు పల్లవిచ్ఛవిన్
బనుపడ వాలుకన్గొనలఁ బర్వుమెఱుంగులు పుష్సలీలగాఁ
దనరె నితంబినీజనమదద్ఘుషరూఢి సురాంబుసేచనన్.

102


వ.

ఇట్లు మదిరాపానమత్త లైనమత్తకాశినుల యుద్వృత్తవిహారంబులు నుత్తమలావణ్య
సంస్కారంబులు నృత్తగీతవాద్యకళావిలాసంబులు గారవించుచు సాంద్రానందహృ
దయుండై పెద్దయుం బ్రొద్దు వినోదించి యందఱం బోవంబనిచి.

103

క.

లలితోత్తరచ్ఛదంబగు, తలిమంబునఁ దాను హృదయదయితయు రాగా
కులసుప్తిఁ బొందె గంగా, పులినగతాభ్రము మహేంద్రపురదంతిక్రియన్.

104


వ.

అంత.

105


క.

కలఁ గాంచి యసురవల్లభు, కులభామిని మేలుకాంచి కుతుకాద్భుతసం
చలతాపరవశయై యా, కులభావము నొందె వెండి కొండొకవడికిన్.

106


తే.

పూర్వదేవవిభుండు ప్రబోధుఁడయ్యె, సతి నిజస్వప్నవృత్తంబు పతికిఁ జెప్ప
వెఱచి మతి నున్చికొనియుండె విచలమధుప, కేలి సుప్తపంకజయగునలినిపోలె.

107


ఉ.

రాతిరియెల్ల జాఱి ననురాగముతోడఁ గుముద్వతీరతిన్
బ్రీతి భజించి ఖేదమునఁ బ్రేయసియున్ సొగియంగ దాన ను
ద్భూతపరిశ్రమార్తుఁడగుపోలికఁ జంధ్రుఁడు పశ్చిమాబ్ధి శ
య్యాతలసుప్తికై డిగి యనల్పవిభావికళాంగరాగుఁడై.

108


ఉ.

చల్లనివాఁడు గావున నిశాకరుప్రాపున దీప్తిలీలమై
నెల్లజగంబులు న్మిగిలి యిమ్ముల నుండితి మింత నెంతయున్
దెల్లము తీవ్రమూర్తి యొరుతేజము పైఁపడుభానుఁ గూడి వ
ర్తిల్లఁగవచ్చునే యనుగతిన్ దివి చుక్క లడంగెఁ దోడుతోన్.

109


తే.

అంచితోద్యానవాటిలనందునవలి, భాతి విదళితకుసుమవిభాతి యమరె
నప్పు డరయంగఁ చంద్రవరాబ్ధివెల్లి, డొంకి చనఁ దోఁచునురువుతెట్టువ లనంగ.

110


సీ.

వెడవెడ మూతులు విచ్చుతామరలపై సుడిసి నెత్తావులు సూఱలాడి
యనుఁగుఁదోఁటలు చొచ్చి యలరుతేనియఁ జేసి యెలదేఁటిపదుపులఁ జెలఁగి నడచి
రాయంచకవలనిద్రలు దెల్పి కొలఁకులఁ దరఁగ యుయ్యలయాట దగులుపఱిచి
సోర్ణగండులు చొచ్చి సురతభేదమునందుఁ జెలువలఁ జెలువుర సేదదేర్చి


తే.

యడరి గృహపతాకికలకు నాటగఱపి, ప్రోది నెమళులయెఱకలపొదులు విచ్చి
మందసంచారముగ సుకుమార మగుచు, మెఱసె బ్రత్యూషసమయసమీరణంబు.

111


క.

రవిరాఁకకుఁ బూర్వదిశా, యువతి గృహాంగణము కుంకుమోదకసేక
ప్రవిభాతమయ్యె ననఁగా, నవారుణోదయవిజృంభణము విలసిల్లెన్.

112


మ.

సరసస్నేహఘనంబు లాయతదిశాసంసక్తముల్ కజ్జల
స్ఫురితోపాంతము లిష్టభూరివిషయంబుల్ కామినీనేత్రభా
సురరోచుల్ దము నేఁడు చెంచుకరణిన్ సుస్నిగ్ధరాగంబులై
పరఁగంగా వెలవెల్లనయ్యె గృహదీపవ్రాతముల్ వేకువన్.

113


మ.

అలిమంజులగీతులం బటుతరంగాలోలనాదంబులుం
విలసత్కీరలతాదికీర్ణసుమనోవృష్టిప్రచారంబులుం

గలహంసీహసితానులాపములు నై గంభీరపద్మాకరం
బుల కోకద్వయసంగమోత్సవములం బొల్పారెఁ గాల్యంబులై.

114


వ.

అంత.

115


మ.

అనితరకాంతిఁ బద్మినిఁబ్రియాతిలకంబు మొఱంగిపోయి రే
యెనసినవేడ్క నొండు దనయిచ్చమెయి న్విహరించి మేనజం
టిననవరాగలీల జిగిదేరఁగ నోడి యొదింగి యొయ్యనొ
య్యనఁ బొడచూపేనా నుదయమయ్యెఁ బతంగుఁడు బ్రాఙ్ముఖంబునన్.

116


సీ.

కమనీయదిగ్వధూకర్ణపల్లవము లాకాశకింశుకకోరకప్రతతులు
వాసరహరణవదనసింధూరముల్ వనరుహకుంకుమోద్వర్తనములు
కుముదినీనవతపరిక్రమవల్కలంబులు తిమిరాపహరణప్రదీపశిఖులు
త్రైలోక్యమందిరరత్నతోరణములు ప్రత్యూషవటరక్తపత్రకంబు


ఆ.

లనఁగ నూతనంబులై కెంపులై సొంపు, లలర మణిమరీచు లతిశయిల్ల
నఖిలభువనమంజులాంజలిపుటపూజ్య, మానుఁ డగుచు బాలభానుఁ డొప్పె.

117


వ.

ఆసమయంబున నసురేశ్వరుండు విహితదినముఖవ్యాపారుండై యంతఃపురంబు వెలు
వడి యాస్థానభవనంబునకు వచ్చి సకలసురరిపుప్రకరంబులు పరివేష్టింప నభీష్టచేష్టి
తంబులన్ వర్తిల్లుచున్నయెడ భృగువంశవరుండును, దైత్యవంశగురుండును, నిజమం
త్రమహిమావధీరితశక్రుండును నగు శుక్రుండును జనుదెంచి హిరణ్యకశిపుం గాంచి
యతనిచేత నభినందితుండై వివిధాశీర్వాదంబుల నమ్మహావీరు నభినందితుం జేసి తదను
మతిం దదీయజీవితేశ్వరిని దీవింప నభ్యంతరమందిరంబునకుం జనిన.

118


మ.

గురురా కప్పుడు గాంచి సంభ్రమముఁ జక్షుఃప్రీతియుం భక్తిత
త్పరభావంబును నొప్పు నప్పుడు వెసం బద్మాక్షి ప్రత్యుద్గమా
దరసంసక్తి నమస్కరించె మహితోద్యత్పీఠవిన్యాససు
స్థిరసంపూజ లొనర్చి తత్కృతశుభాశీరుక్తకల్యాణియై.

119


వ.

తత్సమీపంబున సముచితాసనంబున నుండఁ గరకమలంబులు మొగిడ్చి యమ్మహాత్మున
కిట్లనియె.

120


క.

రే యొకకలఁ గాంచితి ముని, నాయక యే నది మదీయనాయకుమది యె
ట్లై యుండఁజేయునో యని, యాయన కెఱిఁగింపనైతి నాత్మ నునిచితిన్.

121


క.

దైవము గురుఁడును బంధుఁడు, నేవిధమున మాకు మీర లీప్సితశుభస
ద్భావంబులుసతతంబును, గావింపఁగఁ గర్తలౌటఁ గవిజనవినుతా!

122


సీ.

అవధరింపుము జలదాసితవర్ణుఁడు ఘనశంఖచక్రలాంఛనభుజుండు
మహితకోమలవనమాలాసలక్షణవక్షుఁడు వికసితవారిజాక్షుఁ

డభినవపీతాంబరావృతదేహుండు భూదేవుఁ డొక్కఁ డపూర్వలీలఁ
జనుదెంచి ననుఁ జూచి సస్మితనదనుఁడై తనచేత నొప్పుసంతానఫలము


ఆ.

నాకు నిచ్చి మున్ను నా మెడనున్నహా, రంబు నిజనఖాంకురములఁ దిగిచి
కొనుచు వేగ చనియె నని రాత్రి నేఁ గల,గంటి నపుడు మేలుకొంటి ననఘ.

123


వ.

వీనిఫలం బెయ్యది యానతీయవలయు ననినఁ గావ్యుఁడు కొండొక దలపోసి నిశ్చ
యించి యద్దైత్యరాజమహిషి కి ట్లనియె.

124


ఉ.

ఆధరణీసురోత్తముఁ డనాది యనంతుఁ డనంగ నొప్పుల
క్ష్మీధవుఁ డచ్యుతుం డతఁడు మేకొని నీకును బుత్రు నిచ్చె స
ద్బోధసమగ్రుఁడై పరఁగుఫుణ్యుని నింతట సంతసిల్లు మే
లాధృతిదూలఁ బో మదిఁ దలంపఁగ మీఁదిశుభాశుభస్థితుల్.

125


ఉ.

చీరికిఁ గైకొనం డసురసింహుఁడు దుర్వహగర్వబుద్ధి నె
వ్వారిని వారిజోదరు నవార్యభుజు న్మధుకైటభారిజం
భారిపురస్సరామరగణైకశరణ్యు వరేణ్యభక్తిని
స్తారకుఁ బేరుకొన్న మది సైపఁడు మేలిట యెట్లు గల్లెడున్.

126


క.

నీమగనితేజమున ను, ద్దామశమసమగ్రుఁ డనఁగఁ దగి కుంపటిలోఁ
దామర మొలచినక్రియఁ ద, న్వీ మునివిభుఁ డైనసుతుఁడు నీ కుదయించున్.

127


క.

నీ వైనను మనమున జగ, దావాసుని వాసుదేవు నవ్యయు నెపుడున్
భావింపుము దుర్గతులం, బోవరు తద్భక్తజనులు పుణ్యవిచారా.

128


వ.

అట్లైనఁ బురంధ్రరత్నంబనైన నీకతంబున నసురవంశంబు విధ్వంసంబు నొందక
నిర్వహణంబు పడయునని భార్గవుఁడు చెప్పి యప్పొలంతి వీడ్కొని నిజగృహంబు
నకుం జనియె. నంత.

129


క.

కలఁగన్నయది యిత ననఁగ, నెలఁతకు నెల మసలె జగము నిఖిలంబును బే
రెలమిం బొందఁగఁ దగియెడు, నెల మసలం దెఱవచూలు నెలకొని బెలసెన్.

130


సీ.

ఉదరస్థుఁ డగుబాలునుజ్వలకాంతినా వెలిఁ బేర్చె నన మేను వెలరువాఱెఁ
గడుపులో నొప్పారు కొడుకునిర్మలబుద్ధి తెలుపనాఁ గనుఁగవ తెలుపువాఱె
గర్భశోభితుఁ డగునర్భకుసహజవిరక్తినాఁ జవులయాసక్తి దొరఁగె
లోనున్నసుతునివిలోకవిజ్ఞానంబు క్రమమనా నాభి వికాసమొందెఁ


గీ.

గుక్షిసంగతుఁ డగుపుత్రకునిగుణాలి, వొదలుతెఱఁగున మధ్యంబు పూర్ణమయ్యె
బూర్వజన్మసంచితతపఃపుణ్యఫలమ,హోదయంబునఁ జారుపయోజముఖికి.

131


క.

చాలఁగ నమృతము బాలుఁడు, గ్రోలుటకై నిలిచి కనకకుంభంబులపై
నీలపుఁగుప్పెను నిలిపిన, పోలికఁ జనుమొనలకప్పు పొలఁతికి నొప్పెన్.

132

గీ.

అఖిలగుణరత్నములకు నాయతన మనఁగ, భువనభూషణంబననొప్పు పుత్రుఁ దాల్చి
యున్ననాకేల తొడవులొండన్నకరణి, నబల గై సేయు పనులయం దలసయయ్యె.

133


చ.

అనుపమయోగలీల నమృతాంబుధియందు శయించుదేవు నె
మ్మనమున నావహించి యసమానసమంచితయోగసుప్తిమై
నెనసినబాలుఁ జూలున వహించిన సంతతసద్గుణైకవా
సననొ నిరంతరంబు గడుఁ జామకు జాడ్యము దోఁచుఁ జెయ్వులన్.

134


సీ.

హరినామకీర్తన పరమోత్సవంబులఁ గావింప ననిశంబు కాంక్ష సేయు
విష్ణుదాసులఁ గని వేడ్క నంజలి చేసి కొనియాడి భక్తిమైఁ గొలువఁ గోరం
బరమాత్ముమహిమలు భావించి భావించి యానందజలధి నోలాడఁ దివురు
నారాయణునియవతారకథాసుధాలీలలు వీనులఁ గ్రోలఁ దలఁచుఁ


గీ.

దనువు ప్రాణంబు నచ్యుతార్థంబుగా న, మర్పఁగా నెంచు జగములు మహితకరుణ
నెపుడు రక్షింపఁగా నుత్సహించుచెలువ, బుద్ధి యంతర్గతుం డగుపుత్రువలన.

135


వ.

ఇట్లు ప్రతిదినప్రవర్ధమానగర్భలావణ్యలలితయైన హృదయేశ్వరిం గనుంగొని యసు
రేశ్వరుండు హర్షవికాసవిలసితాంతరంగుం డగుచుఁ బరమోత్సవంబున భార్గవనిరూ
పితప్రకారంబున గారవంబు మిగులఁ బుంసవనసీమంతాదికలాపంబులు నిర్వర్తించి
యనంతరంబ సముచితసమయంబునందు.

136


సీ.

అమృతాంబునిధిసముదంచితవీచిక కుదయించుతుహినమయూఖుఁ డనఁగఁ
జారుపురందరాశానితంబిని కుద్భవించుసరోజినీవిభుఁ డనంగ
విలసితరోహణాచలఖనిభూమికిఁ బ్రభవించుమహనీయరత్న మనఁగ
సుందరనూతనమందారలతికకు జనియించుసురుచిరస్తబక మనఁగఁ


గీ.

గాంతియును తేజమును మహార్ఘతయు సౌకు, మార్యమును నభిరామసామగ్రి బొదలఁ
బుత్త్రుఁ డుదయించెఁ ద్రైలోక్యభూతికరుఁడు, రాజబింబాస్య యగుదైత్యరాజసతికి.

137


క.

పుత్త్రోదయమున నిర్జర, జైత్రుఁడు మునుకొన్న యధికసమ్మదమున లో
కత్రయరాజ్యము మును నిర, మిత్రముగా గనినకంటె మిక్కిలి పొంగెన్.

138


సీ.

పుప్పోపహారము ల్పొలుపారఁ బురమునఁ గావింపుఁ డనుమాటకంటె మొదల
మంగళవాదిత్రసాంగత్యభంగులు గలిగింపుఁ డనుమాట కంటె మొదల
భాసురవైజయంతీసహస్రంబులు గలిగింపుఁ డనుమాటకంటె మొదల
నిపుణవిలాసినీనివహసంచారంబు ఘటియింపుఁ డనుమాటకంటె మొదల


గీ.

దివ్యకుసుమవర్షంబులు దేవదుందు, భిస్వనంబును నప్సరోభినయగతులు
కల్పభూరుహాంబరపతాకలు దనర్చె, భువనహితజన్ముఁ డగుఁబోలు భూరిమహిమ.

139


క.

అవి యెల్లఁ గని సురద్విషుఁ, డవివేకమనస్కుఁ డగుచు నౌర మదీయో
త్సవమునకుఁ దగ నొనర్చిరి, దివిజులు పను లనుచుఁ దనమదిన్ ప్రియ మందెన్.

140

మ.

ధరణీమండలి నెందునుం బరఁగి పాతాళంబునం బర్వి ని
ర్జరనాథప్రముఖామరాఖిలనివాసశ్రేణులం దోలిమై
నెరసెన్ బంకజసంభవాలయమునన్ నిండారె నవ్వేళ శ్రీ
కరదైతేయతనూభవోద్భవకథాకల్యాణ ముద్ఘోషమై.

141


క.

శ్రీకాంతునగరులోనగు, వైకుంఠపురంబు నిత్యవైభవములతో
నేకోత్సవ మయ్యె శుభ, శ్లోకుం డగుదైత్యరాజసుతుజన్మమునన్.

142


మ.

స్వరసౌందర్య మెలర్ప మెల్లన శ్రుతుల్ సారించి యొయ్యొయ్య సు
స్థిరహర్షంబున యజ్ఞకోటి తలయెత్తెన్ బూజ్యధర్మార్థమో
క్షరహస్యావలి యల్లనల్ల మెలఁగంగా నుత్సహించె న్నిరం
తరదైతేయభయం బొకించుక ప్రశాంతంబై వణంకెన్ దగన్.

143


చ.

దినకరుఁ డుల్లసిల్లెఁ బటుదీప్తిఁ బ్రదక్షిణభాసురార్చియై
యనలము దేజరల్లె మహిమాంచితసౌరభరమ్యలీలతో
ననిలుఁడు సంచరించె విమలాకృతి నంతయు నొప్పె దిక్కు లెం
దును భువనైకమంగళము దోఁచువిధంబు దలిర్ప నత్తఱిన్.

144


వ.

దైత్యపతియును బుత్రోత్సవప్రమోదమానసుం డగుచుఁ గవిప్రముఖభూసురలోకంబు
నతిలోకధననివహదానంబుల నానందహృదయులై యానందంబు నొందించి బంధుజ
నంబులు ప్రమోదంబు నొందం గుమారునకు జాతికర్మాదిసంస్కారంబులు గురునిర్ది
ష్టప్రకారంబున నిర్వర్తించిన నిజజన్మంబున నఖిలలోకప్రహ్లాదం బొనరించుటం జేసి
బాలునకుఁ బ్రహ్లాదుం డనునామధేయం బొనరించె. నంత.

145


గీ.

అంబగర్భంబు వెడలినయది మొదలుగ, విష్ణుపదకమలధ్యానవివశుఁ డగుచు
నసురరాజతనూభవుఁ డమృతవృష్టిఁ, దడుపఁబడువాఁడపోలె వర్ధనము నొందె.

146


సీ.

పసిపాపఁడై తాను బవడించుకాలంబు వటపత్రశయనుభావంబు దలచుఁ
జెలువొందఁగా బోరగిల శయ్య దడవెడుతఱి కూర్మమూర్తిఁ జిత్తమున నిలుపు
రెండుమూఁ డడుగు లొండొండ తట్టాడునప్పుడు త్రివిక్రమలీలఁ బట్టి చూచు
లోలత వెన్నలు బాలు గ్రోలెడునాఁడు గోపాలసంస్కృతిఁ గూర్చు నాత్మ


ఆ.

బరమపురుషభూతభావికభవ్యావ, తారబోధమహిమఁ దగ నెఱింగి
యొం డెఱుంగఁ డంబుజోదరధ్యానత, త్పరత యొకటి కాని బాలకుండు.

147


చ.

తొలితొలి యెల్లపాపములు దొక్కుచుఁ బల్కెడునట్టితియ్యపుం
బలుకుల నచ్యుతాహ్వయముఁ బల్మరుఁ బేర్కొను వెండి పల్కు నిం
పెలయఁగ నంబ లక్ష్మీజగదేకజనేశ ముకుంద యంచు న
త్యలఘుతరప్రబోధమధురాక్షరవాక్యవివేకదక్షుఁడై.

148

ఉ.

ఆడఁగఁ బోయినప్పు డసురాత్మజుఁ డంబుజనాభు నవ్యయుం
బాడుద మాదిదేవుపదపంకజపూజలు సేసి భక్తిమై
నాడుద మచ్యుతైకశరణాగతులం గని కర్మబంధమున్
వీడుద మంచుఁ బల్కుఁ గడువిస్మయ మందఁగ దోడిబాలకుల్.

149


ఆ.

కుడిచినపుడు నిద్రగూరినయప్పుడు, మేలుకొనినయపుడు మెలఁగినపుడు
విష్ణుకీర్తనంబు విష్ణుచింతయు కాని, పలుకఁ డొండు బుద్ధిఁ దలఁపఁ డొండు.

150


గీ.

తొలుత మూఁడేండ్లలేని సద్బుద్ధి ముప్ప, దేండ్ల లే దనునానుడి యిట్టి దనఁగఁ
దనరెఁ బ్రహ్లాదునకుఁ బ్రౌఢమునులు గోరు, హితవివేకపాకంబు మూఁడేండ్లనాఁడె.

151


వ.

అని యిట్లు ప్రహ్లాదుజన్మప్రకారంబు దేవశ్రవుచేత గాలవుం డెఱింగినతెఱంగున
చతురమధురోపన్యాసంబుగాఁ బ్రకటించి వెండియు.

152


ఆశ్వాసాంతము

క.

ప్రకృతిపురుషాపవర్తీ, వికృతికరణహరణనిపుణవిశదస్ఫూర్తీ
సుకృతసదయానుపూర్తీ, నికృతినరధరానునిత్యనిరుపమమూర్తీ.

153


పృథ్వి.

సమస్తమహిమాశ్రయా జనితసారలోకత్రయా
రమాకుచపరిష్క్రియా ప్రణతదాననిత్యోదయా
సమాహితమహోదయా సకలకల్మషవ్యత్యయా
సమగ్రనిసరద్దయా జనసుసేవ్యరాగప్రియా.

151


మాలిని.

చరణజనితగంగా సత్యనిత్యప్రసంగా
జలదవిలసదంగా సౌమ్యచిత్తాబ్జభృంగా
విరచితభవభంగా వేదవేదాంతరంగా
పరమగరిమశృంగా బ్రహ్మనాడీతురంగా.

155


గద్యము.

ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్యధుర్య
శ్రీసూర్యకవిమిత్రసంభవశంభుదాసలక్షణాభిధేయ ఎఱ్ఱయనామధేయ ప్రణీతం
బైన శ్రీలక్ష్మీనృసింహావతారం బనుపురాణకథయందుఁ దృతీయాశ్వాసము.