Jump to content

నృసింహపురాణము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

చతుర్థాశ్వాసము

శ్రీకాంతాపరిరంభా
లోకాతిక్రమవివేకలోలుపలభ్యా
శ్రీకరనామస్మరణో
త్సేకదళితవినమదంహ శ్రీనరసింహా.

1


వ.

దేవా రోమహర్షణుండు మహర్షుల కి ట్లనియె. ని వ్విధంబున నాశ్చర్యభావుం డైన
యమ్మహానుభావుచరితంబులు భాషితంబులు నంత యెఱుంగనిరాజసంబున నాదైత్య
రాజు కేవలవాత్సల్యపరవశుండై యబ్బాలు బాల్యోచితంబు లైనయుపలాలనంబుల
గారవింపుచుండె. తల్లియుం గొడుకుచందంబులు డెందంబున కానందంబు నొందిం
ప నిజస్వప్నదర్శనంబుతెఱుంగును గురువాక్యప్రకారంబుతెఱంగును దలఁచి వెక్క
సంబందుచు నెయ్యది గానున్నదో యని వెడ దలంకుచు పంకజోదరచరణస్మరణలా
లసంబగుమానసంబుతోడం బ్రవరిల్లెఁ. దదనంతరంబ.

2


సీ.

చౌలమౌంజీబంధసంస్కారములు యథాకాలకల్పితములుగా నొనర్చు
తేజోవిశేషసందీప్తుఁ డై యొప్పి యప్పాపఁడు జనకునిపంపువలన
విద్యాపరిగ్రహవినయదీక్షలకునై పూజితగురుగృహంబున వసించి
దైత్యదానవకులోత్తంసంబు లగుతనయీడుబాలురతోడఁ గూడి చదువుఁ


ఆ.

జదువుచుండఁ గొంత చనియె కాలం బంత, నొక్కనాఁడు దండ్రి యుల్ల మలరఁ
గొడుకుచదువు వినఁగఁ గోరి కుమారు నొ, జ్జలను గారవమునఁ బిలువఁ బంచె.

3


వ.

ఇట్లు రావించినం జనుదెంచి మదిరాపానగోష్ఠీసమయంబున ననేకవిలాసినీపరివృ
తుండై యున్నజనకునిం గని నమస్కరించి యుపాధ్యాయసహితంబుగా నంతంత
నాసీనుండై యున్నపుత్రునకు నసురేశ్వరుం డి ట్లనియె.

4


ఉ.

పాపఁడ యింతకాలమును బాయక యొజ్జలయొద్దనుండి ని
వేపగిదిన్ బఠించి తది యేర్పడం బ్రస్ఫురితార్థసార మై

తీపులు వీనులం గురియ దివ్యసుభాషితరత్న మొక్క టు
ద్దీపితధీవిజృంభణవిధేయత యొప్ప నుపన్యసింపుమా.

5


క.

అనుటయుఁ బ్రహ్లాదుం డి, ట్లనియెను నీయానతిచ్చినట్టిద యయ్యా
వినిపించెద నామది మె, చ్చినయర్థం బవధరింపు చిత్తప్రీతిన్.

6


సీ.

ఆదియు మధ్యంబు నంత్యంబు నెవ్వాని కరయ లే దని చెప్పు నాగమములు
పొడముటమును లేక పొదలుటయును లేక తఱుఁగుటయును లేక తనరు నెవ్వఁ
డెవ్వనివలనన యెంతయు సంభవస్థానసమాహారదశలుఁ జెందుఁ
గారణంబులకెల్ల కారణంబై యెవ్వఁ డపగతకారణుండై వెలుంగు


ఆ.

నమ్మహానుభావు నచ్యుతు నవికారు, నమితతేజు విష్ణు నాదిదేవు
నాశ్రయించినాఁడ నధిప యింతయ దక్క, యితరమైనయర్థ మెఱుఁగ నేను.

7


చ.

అన విని గుబ్బునం బొడమునల్కకు నెచ్చెలులై జనుంగవం
గనలెడుదంటకెంపున మొగంబునఁ బడ్మెడు ఘర్మజాలకం
బును నిటలంబునం దనరు భ్రూకుటియున్ భయముం దనర్ప ని
ట్లను నతఁ డొజ్జ గన్గొని నిరంతరవిస్ఫురితాధరోష్ఠుఁడై.

8


ఉ.

అక్కట బ్రహ్మబంధువ దురాత్మక నాపగవానికీర్తనం
బెక్కడనుండి యీశిశువు నెప్పగిదిం జదివించి తిజ్జగం
బెక్కటి యేలు నామహిమ యేమియుఁ గైకొన కివ్విధంబునం
దక్కువపా టొనర్చితి వృథాపరిజల్పనకల్పనంబునన్.

9


వ.

అనిన నసురేశ్వరునకు నుపాధ్యాయుం డిట్లనియె.

10


చ.

కినియకు దైత్యనాథ యొకకీడును నాదెస లేదు చెప్ప నీ
తనయుఁడు వక్రశీలుఁడు నితాంతనయోక్తుల యేను సెప్పఁగా
వినక నిజేచ్ఛమైఁ గడఁగి వేమఱు నిట్లని యుగ్గడించు నీ
యనువున నిట్టికోరడపుటాలరి శిక్షల కేల చేపడున్.

11


వ.

అనవుడు నతండు కుమారుం గనుంగొని.

12


క.

ఓవత్స నీవు చెప్పిన, యీవిధ మేఁ జెప్ప ననియె నిదె యొజ్జలు నీ
కేవాఁడు గఱపె నేర్పడఁ, గా వెఱవక చెప్పు మట్టిఖలు దండింతున్.

13


ఉ.

నావుడు దైత్యరాజకులనందనుఁ డిట్లను సర్వభూతస
ద్భావములందు నుండి పనుపం గఱపంగఁ బ్రభుం డొకండు మా
దేవుఁడు వాసుదేవుఁడు సుధీసువిధేయుఁడు చిత్సుఖోదయ
శ్రీవరుఁ డింతకంటె మఱి చెప్పఁగలండె ప్రశాస్త్రి యెవ్వఁడున్.

14


ఆ.

అనిన మండిపడి సురారి దురాత్మక, యేను జగములెల్ల నేలువాఁడ
విష్ణుఁ డనఁగఁ గలఁడు వేఱొకం డనియెద, వేల చెడితి రోరి యెవ్వఁ డతఁడు.

15

చ.

అనుటయు నల్ల నవ్వి కొడు కయ్యకు నిట్లను నెవ్వఁ డన్న నే
మని తెలుపంగనచ్చుఁ బరమాత్ముని నాతఁడ యీసమస్తమున్
వినుము తదేకహేతుకము విశ్వము శాశ్వత మైనతత్పదం
బనిశము పుణ్యశీలురు నిజానుభవంబునఁ గాంతు రేర్పడన్.

16


వ.

అప్పరమేశ్వరుండు శబ్దగోచరుండు గాఁ డనిన నతండేను సకలలోకపరమేశ్వరుండై
యుండ నాయెదురం బరమేశ్వరుండు పరమేశ్వరుఁ డని పరుని పలుమాఱు నుదా
హరించెద వోరి చావం దలంచితి వేల యనవుడు ప్రహ్లాదుండు.

17


గీ.

నాక కాదు లోకములకు నీకుఁ బ్రభుఁడు, వినుము పరమేశ్వరుం డనువిష్ణుఁ డొకఁడ
ధాతయును విధాతయును నతండయందు, నలుక విడుము శాంతుఁడ వగుమయ్య తండ్రి.

18


క.

నావుడు హిరణ్యకశిపుం, డీవెడగుదనంబు భూత మెయ్యదియో యి
ట్లావేశించెం గా కితఁ, డీపథమున నేల యఱచు నిటు ప్రల్లదముల్.

19


వ.

అనినఁ బ్రహ్లాదుం డి ట్లనియె.

20


ఉ.

నామన మొక్కఁ డేల దితినందన సర్వము నావహింపఁ దే
జోమహిమన్ వెలుంగు హరి చోద్యపుభూత మతండు లీలమై
వేమఱు నిన్ను నన్నుఁ బెఱ విశ్వచరాచరభూతజాతమున్
భ్రామకుఁ డై నిజోచితవిభావితచేష్టలఁ గూర్చు నెప్పుడున్.

21


వ.

ఇది తదావేశవిశేషంబు గాని వికారకార్యంబు గా దనిన దనుజేశ్వరుండు పరిచరవర్తు
లం జూచి వీనిం గొనిపోయి గురుగృహంబున ద్రోచి రండు విపక్షసంస్తరాకారం
బయిన చేతోవికారంబు చక్కనగునంతదాఁకనుం దగినయుపాయంబుల శాసింపవ
లయు ననిన నయ్యసుర లయ్యసురరాజకుమారుం గొనిపోయి యుపాధ్యాయసదనం
బున నునిచి. రుపాధ్యాయుండును బ్రభుశాసనంబున నతని శిక్షించుచుండె. నంతఁ గొం
తకాలంబు సనినఁ గొడుకుం బిలిపించి తండ్రి యెప్పటియట్ల యొక్కసుభాషితంబుఁ
జదువు మని పంచిన నతండు.

22


క.

ప్రకృతిపురుషాత్మకంబును, సకలచరాచరవిశేషసర్గము నెవ్వా
నికిఁ గార్యం బవ్విష్ణుని, వికారవిరహితు సమస్తవిభుఁ బ్రణుతింతున్.

23


క.

అనినఁ గడుఁ గడిఁదియై మదిఁ, గనలు నిగుడంబు బుత్రభావకలితస్నేహం
బును గృపయుఁ బాయ సురరిపుఁ, డనుచరులం జూచి యిట్టు లను రభసమునన్.

24


క.

కులమునకు గొప్పగుద్దలి, ఖలుఁడు కులాంగారకంబు కష్టుఁడు వీనిం
బొలియింపుఁడు ఘనశస్త్రం, బుల వెస నొకగుడ్డుమునికి బోయేమి యగున్.

25


ఆ.

కొడుకు తండ్రిమాటఁ గొనక యీరసమున, నడచునేని వాడు కడిఁదిదాయ
గాన పగతుఁ జంపఁ గాఁ దగుఁ బగవాని, పక్షమైనవారు పగఱె కారె.

26

వ.

కావున నేను చూచుచుండ వీని నిప్పుడ యలుఁగులపాలు సేయుం డని పంచిన శతస
హస్రసంఖ్యు లంతకాకారు లగు క్రూరు లక్కుమారుం బొదివి కొదమసింగంబులకు
భంగంబుగాఁ గూడినసారమేయంబులచందంబునఁ బ్రచండశస్త్రంబుల నుగ్రక
ర్మంబులకు సమకట్టుసమయంబున.

27


సీ.

ఏల యొడ్డారించె నీపాపఁ డిటుపాప మడసెఁ గటా యని యడలువారు
తల్లి యైనను నాకుఁ దనయుతోడిద యని పూని యాడద యని పొక్కువారు
కావ్యుఁ డైనను వచ్చి కాదు కూడ దనంగ వలదె యిత్తఱి నని వనరువారు
హరి యైనఁ బొడసూపి కరుణమై బాలకు కిఱుకు మాన్పడ యని యొఱలువారు


ఆ.

నగుచు సాధుజనము లంతంతఁ జేష్టలు, దక్కి మ్రగ్గి కలఁగి తలఁగి యొదుగ
నమరవైరిబంధు లాదిదేవునిబంటుఁ, గదిసి పొడువ నడువఁ గడఁగి రపుడు.

28


గీ.

అక్కుమారుఁడు మహితసమాధినిష్ఠుఁ, డై మహోగ్రశస్త్రావలియందు నసుర
లందుఁ దనయందు వెలుఁగుసర్వాత్ము విష్ణుఁ, గనుచు నుండె నిశ్చలనిర్వికారలీల.

29


వ.

అంత.

30


చ.

అనుపమమేరుభూధరతటాదికనిష్ఠురవక్షు వజ్రసం
హననుఁ గుమారుఁ జెంది యసురాధమకింకరనిర్విశంకపా
తనరకదస్త్రశస్త్రములు దందడిఁ దుత్తుము రై మహీతలం
బున దొరఁగె న్నవోత్పలసముజ్జ్వలనూత్నదళంబులో యనన్.

31


క.

అది యట్ల కాదె నిప్పునఁ, జెదలంటునె దేవదేవు శ్రీరమణీశున్
మది నునిచిన యుత్తమమునిఁ, బొదవునె యాపదలు సూర్యుఁ బొందునె తమముల్.

32


వ.

ఇట్లు నిరపాయనిత్యోద్దీప్తప్రకాయుండును నతర్కితోపాయుండును సహజసము
జ్జ్వలోల్లాసుండును నగువిష్ణుదాసుం జూచి యాచపలుండు క్రోధవిరోధంబుఁ
బాపికొననేరక యిట్లనియె.

33


ఆ.

ఓరి పగఱఁ బొగడుపోరామి యేమిరా, యీతలంపు విడువు మింకనైనఁ
బ్రాణభయమువలనఁ బాపి ప్రోచెద నాదు, బుద్ధి వినర యవనిధిఁ బోవ నేల.

34


వ.

అనినఁ బ్రహ్లాదుండు మహాహ్లాదమధురోపన్యాసంబున నవ్వాసవారి కిట్లనియె.

35


చ.

భయముల నెల్లఁ బాపుటకుఁ బాల్పడినాఁడు పయోరుహాక్షుఁ డ
క్షయుఁ డచలుం డనంతుఁ డనిశంబును నామదిలోన నుండఁగా
భయ మొక టెందునుం గలదె పంకమహోదరపాదపంకజా
శ్రయులకుఁ దండ్రి పుట్టవు జరామరణాదిభయంబు లేమియున్.

36


ఆ.

అనిన నౌడుగఱచి యసురద్విషుం డోరి, పడుచ నాకుఁ బుట్టి చెడుగ వైతి
పేర్చి నోరుమూయు పెడతల వాపోయె, దిట్టి వదర గలఁడె యెచట నైన.

37

క.

సర్వంబును విష్ణుం డటె, సర్వము సృజియించినట్టిజగ మావిష్ణుం
డోర్వఁగ వచ్చునె విష్ణుఁడ, సర్వేశ్వరుఁ డంటి యీయసత్యోక్తులకున్.

38


క.

నోరెత్తి తేని యింకను, సైరింపఁ జుమీ దురాత్మ! చలమున నిదె నా
గోరంపుటుక్కుగదఁ గొని, బోరునఁ దల వ్రయ్య నడచి పొరిగొని విడుతున్.

39


వ.

అని పలికి తక్షణంబ తక్షకప్రభృతు లగుభీషణభుజంగంబులం బిలిచి విషతుల్యభాష
ణుండును విషమాచరుండును నగునక్కులదూషకుని దుర్విషానలజ్వాలాజాలంబులం
బ్రేలిపడఁ బొదువుం డని పనిచిన.

40


సీ.

కన్నులఁ జుఱజుఱ గ్రమ్ముమంటలతోడ మండెడుఘనఫణామణులతోడఁ
బొరల దేహమున నిబ్బరపుమ్రొంపులతోడ లోలత గ్రాలునాలుకలతోడఁ
బొదలెడు నాభీలఫూత్కారములతోడ నొదవునిన్కల బేర్చు నొడలితోడ
మెఱయు నోళ్లను వెలి కుఱుకుదౌడలతోడ భుగు లనునుగ్రంపుఁబొడలతోడఁ


ఆ.

బాపపదుప లడరి పట్టి బాలకుఁ జుట్టి, నెఱకులెల్ల బిట్టు గఱచి కఱచి
విసము చల్లి చల్లి మిసిమింతుఁడును గాక, యున్నయతనిఁ జూచి యుక్కు దక్కి.

41


వ.

దైత్యేశ్వరున కి ట్లనిరి.

42


చ.

కఱిచితి మెయ్యెడన్ విసముఁ గ్రక్కితి మీతనియందు నెట్టిమా
కఱచినకాట్లకున్ శిశువుకాయముతోలును స్రుక్కదయ్య మా
కఱిముఱి నూడిపోయె మణులౌదలలుం దుము రయ్యె దంష్ట్రికల్
పఱిపఱి యయ్యె నోరు లధిపా నవియంగఁ దొణంగె నంగముల్.

43


క.

హరిహరి యంచు నితం డిదె, గిరివోలెం దెరలఁ డితనికిని బరిపీడా
కరు లగునన్యులు గలిగిన, నడసి పనుపు దేవ! యరిగె నస్తద్బలమున్.

44


వ.

అనుచున్న పన్నగనివహంబులవివశత్వం బుపలక్షించి యక్షతుం డైనయమ్మోక్షశీలు
నీక్షించి సంక్షుభితహృదయుం డగుచు నయ్యదయుండు బృందారకద్వారబృందం
బులం బిలిచి వీఁడు మదీయపక్షంబువాఁడై మాకులంబునకు నపకారంబుఁ గావింపం
గడంగె. నాపుత్త్రుండని విచారింపవలదు. తరువునం దోఁచికాదె దహనుండు తరుస
ముదయంబులం బొగ నణంచుం గావున వీని మీరు తీవ్రదంతాభిఘాతంబులం
జించి వెంబడి నాకుం బ్రియంబు సేయుం డని నియోగించిన.

45


సీ.

తరఁగలై తొరఁగెడుదానధారలచేత నురునిర్ఝరస్ఫారగిరులు వోలె
దారుణోత్కటశాతదంతకాండములచే ఘనదండతరుచెలికాండ్రు వోలె
నెఱమంట లుమియుచు నెసఁగుచూడ్కులచేతఁ బ్రళయాగ్నిమూర్త్యంతరములువోలె
వలఁతులై నిగిడెడివలుదతుండములచే నొదరి చేచాచుమృత్యువులు వోలె


ఆ.

కింక లంకురింప జంకెలు నర్తింప, బింకె బొసఁగ నిర్విశంకసరణి
నడరి దిగ్గజంబు లమ్మహాభాగునిఁ, బొదివి పొడువ నడువ నదుమఁ దొడఁగె.

46

వ.

ఇవ్విధంబున నవ్వేదండంబు లొండొండ చండక్రీడన్ గోడాడుచుండం బుండరీ
కాక్షుసాక్షాత్కారంబున సొంపారుడెందంబున నానందనిశ్చలుండై యచలం
బునుం బోలెఁ బొలుచుబాలునిదృఢదేహంబు సోఁకె.

47


క.

సురకుంజరములకొమ్ములు, మురిసెన్ దొండములు విరిసె మోములు విరిసెన్
బొరిఁబొరి నఖిలాంగంబులు, నెరసెన్ జిత్తంబు లురిసె నిరిసె జగంబుల్.

48


వ.

అప్పుడు ప్రహ్లాదుండు తండ్రిం జూచి యయ్యా! యిది మదీయహృదయస్థుండైన
యచ్యుతుమాహాత్మ్యంబు గాని నాలావు గాదు కాని నాకుఁ గులిశకఠోరంబులగు దిగ్వా
రణదంతప్రహారంబులు సైరించుశరీరంబు లెక్కడివి యని యూరకుండె. నంత.

49


ఉ.

ఆవిధ మంతయుం గని సురాహితుఁ డంతటనైనఁ దెల్వికిం
దా వలమానరోషమునఁ దద్దయు మేను వడంక నింక నొం
డేనియుఁ గావు తీవ్రబహుళేంధనదీప్తకృశానుకీలలన్
ద్రోవుడు వీని నంచుఁ గడుదుష్టమనస్కులఁ బంచెఁ బల్వురన్.

50


వ.

పనుచుటయు వా రవారితరభసంబున భూరితరదారుసంచయం బొనరించి యనలంబు
దరికొల్పుటయు ననిలుం డసురపతిపనుపున నయ్యగ్నిఁ బ్రజ్వరిల్లంజేసె. నప్పాపనిం
బాపాత్ము లాదీపితదహనంబునం ద్రోచినం బడి ప్రహ్లాదుండు మేదురజ్వలనజ్వా
లాకలాపదందహ్యమానుం డగుచు నుండియు నఖండజలధరధారాసిచ్యమానాంగుండు
గావున వేఁడిమిం గందక మందస్మితాననుం డై దానవేశ్వరున కిట్లనియె.

51


ఉ.

శౌరిపదాంబుజస్మృతిరసంబునఁ దేలెడు నామనంబు తం
డ్రీ రుచియింప దన్యముఁ గడిందిగ నీ వొనరించినట్టి యి
ద్దారుణహ్నియున్ వినుము తామరసాకర మయ్యె నాకుఁ బ్ర
స్ఫారితవీచు లీశిఖలు చల్లనితుప్పర విస్ఫులింగముల్.

52


వ.

అనియె నప్పు డద్భుతరోషమాత్సర్యవిహ్వలుం డగుచున్న యాహిరణ్యకశిపుం గదసి
భార్గవనందనులు కొందఱు తదీయపురోహితులు గావున హితంబుఁ జెప్పవలయువారై
సామవచనంబుల నతని కిట్లనిరి.

53


చ.

మునుమునఁ బుట్ట నీ కకట ముద్దులపట్టి గదయ్య వీఁడు మె
త్తనియొడ లింత యోర్చునె కృతంబుల సైఁచునె మాను మింతతోఁ
గినుకలు నీవు గట్టులుక కీ డొనరింపఁగఁ బొందఁజాలువా
రనిమిషసిద్ధయక్షఖచరాదులు గాక తనూజుఁడే నృపా!

54


క.

బాలత్వ మెల్లకీళ్లకు, నాలయ మట్లగుట వినియు నజ్ఞానము గ
ప్పై లొచ్చువడఁగఁ గోపం, బేలా నీయంతవారి కిప్పడుచుపయిన్.

55


గీ.

అవధరింపుము మాపంత మధిప యేము, వదల కీబాలు శిక్షించువార మింక
నొయ్యనొయ్యనఁ దెలివికి నోజపఱిచి, వెఱ్ఱి దీర్తుము మాటలు వేయు నేల.

56

క.

ఈతనికి విష్ణుదెసఁగల, ప్రీతి విడువఁ దెలుపు టెంత పెద్ద యధికరో
షాతురుఁ డై యితఁ డతని వి, ఘాతింపను గడఁగు బుద్ధి గఱపెద మోలిన్.

57


ఉ.

మావచనంబుల న్వినక మాధవుపైఁ గలపక్షపాతమున్
బ్రోవఁగఁ ద్రోవ కిట్ల యయి పోయిన నీ వటు చూచి మెచ్చఁ గ్రో
ధావలి యైనకృత్యఁ గడు నద్భుతభంగి సృజించి పంతు మీ
కావలమంతతోడగనుఁ గష్టపుఁబాట్లను దైత్యపుంగవా.

58


వ.

అనిన నట్లు చేయుం డనుదైత్యపతిపనుపున నతనిబంట్లు మంటలో నున్నపిన్నాతని వెడ
లందిగిచి భార్గవాత్మజుల కొప్పించిన వారునుం గొనిపోయి తమయింటం బెట్టుకొని
బాలురం గొందఱ సంగడంబు గూర్చి చదివించుచు బుద్ధులు సెప్పుచుఁ జలుపుచు
బుజ్జగించుచుం దట్టించుచు ననేకప్రకారంబుల శిక్షించుచుండ నక్షోభ్యస్వభావుం
డగునప్వుణ్యభావుం డొక్కొక్కతఱి నెడగొని తనతోడం జదువు దానవదైత్యకు
మారుల కి ట్లని యుపదేశించు.

59


క.

వినరయ్య యేను జెప్పెద, ననుపమతత్వార్థ మైన యాత్మహితంబున్
మనమున మాకొక్కో యి, ట్లని చెప్పెడు నిప్పు డీతఁ డని చూడకుఁడీ.

60


ఆ.

పుట్టుఁ బెరుఁగుఁ బ్రాయములఁ జాలఁజెన్నొందు, ముదిమిచేతఁ జిక్కు బిదపఁ జచ్చు
బురుషుఁ డట్టిదెసలఁ బొందు టదృష్టంబ, యిందు లేదు గాదె సందియంబు.

61


క.

చచ్చినజీవుఁడు గ్రమ్మఱ, వచ్చున్ బుట్టువున కను టపాయము గా దీ
యచ్చుమునులు శ్రుతజలములఁ, ద్రచ్చికనినతెలివి గాన తప్పున దదియున్.

62


ఆ.

కారణంబు లేక గలుగదు జన్మంబు, కారణం బపూర్వకర్మఫలము
కాన యుక్తియుక్తమైనది యిదియుఁ బ్ర, త్యక్ష మెట్ల యట్ల యనఘులార.

63


క.

తలపోయఁ దల్లికడుపున, నొలసి చనరు గొంతకాల మునికియు లోకం
బుల కెల్ల దృష్ట మత్తఱిఁ, గలగు విరోధంబు శాంతిఁ గైకొన బొసఁగున్.

64


వ.

అది యెట్టిదనిన.

65


గీ.

ఆఁకలియు నీరుపట్టు నయ్యైవెరవుల, నడచు దాఁక సౌఖ్యముఁ జూతు రల్పబుద్ధు
లెపుడు నాఱనిచిచ్చుతో నిడుమఁబడుట, గరము దుఃఖంబు గాక సుఖంబె చెపుఁడ.

66


క.

పెల్లగు నాఁకట నన్నము, చల్లనినీ రగ్నివెన్న సౌఖ్యదములు నాఁ
జెల్లునవి కాకయుండిన, నెల్లపగిది నివియ దుఃఖహేతువులు దగన్.

67


క.

మదురువుగొని యొడ లెఱుఁగక, మదాకులమనస్కుఁ డయిన మానవునకు నిం
పొదవియుఁ బిడికిళ్లం గొని, చదియఁ బొడుచునేని యదియు సౌఖ్యం బగునే.

68


క.

కావునఁ గేవలసుఖదం, బేవస్తువు లేదు వినరె యివి సంస్మృతి నై
యేవిధి సుఖదము దుఃఖద, మై వెస దుఃఖమును సుఖద మై తిరుగఁబడున్.

69

చ.

మృగమదచందనాద్యమపమేయసుఖోచితసారవస్తువుల్
దగఁ గఫవాతపైత్యకలితం బగుకీడులప్రోక యైన యా
యగుణశరీరముం గదిసినంతన దుష్టతఁ బొందు మేలుఁ గీ
డుగ నొనరించు నీముఱకిడొక్క మనంబున నమ్మఁ బాడియే.

70


క.

ఎంత ప్రియవస్తువులపై, నంతఃకరణంబు గలుగు నది మీఁదట న
త్యంతం బగు సంతోషం, బంతయుఁ గూర్పఁగ నిమిత్త మగుఁ బురుషునకున్.

71


ఆ.

ఆలు బిడ్డ లిండ్లు నర్థంబుఁ జెలులును, బ్రోపు గూడఁ బెట్టి పొదలుకుమతి
యవియ పిదపఁ జెడఁగ నన్నింటిఁ దగిలిన, మనసు నుడుపలేక మడిసిపోవు.

72


ఉ.

ఏపున నెమ్మియుం బొదలు నీభవవారిధి నిస్తరింపఁగాఁ
దేపరయంగ వేఱొకటి దెల్లము చెప్పఁగ లేఁడు చెప్పెదన్
నాపలు కాత్మ నిక్కముగ నమ్ముఁడు విష్ణు ననంతు నాద్యు ల
క్ష్మీపతిఁ గొల్వుఁ డవ్విభుఁడు చేకొని కాచు నిజైకచిత్తులన్.

73


క.

చెడిపోకుఁడు సంసారముఁ, గడతేర్పుఁడు శౌరిచరణకమలము నెడఁదన్
ఇడికొనుఁ డూరక కాలము, కడపకుఁడి వివేకవీథిఁ గడఁగుఁడు నడవన్.

74


సీ.

బాలుఁడ నే నిప్డు బాలోచితక్రీడ లనుభవించెద మఱి యౌవనమున
నెఱవాది నై ధర్మ మెఱిఁగి చేసెదఁ గాక యని పోవు నటపోయి యౌవనమున
సుఖములచవి చొక్కుఁ జొక్కి యున్నదిగదా ముదిమి ధర్మము నెల్లనొదువఁ జేయ
నని చనుఁ జని వృద్ధుఁ డై యౌవనమునంద జెన్నొంద ధర్మంబు చేయనైతి


గీ.

నేమి సేయుదుఁ గాలుచే యించుకయును, వశము గాదు చిత్తంబు తామసము గప్పె
ననుచు నట తాను బొలియు న ట్లాత్మహితము, సేయనబ్బ దెప్పుడు మూఢచేతసునకు.

75


ఉ.

కావున శైశవంబునన కష్టతరం బగుమోహ మింతయున్
బోవఁగ ద్రోచి విష్ణుమయపుణ్యసమానతతత్త్వచింతకున్
దేవలయున్ మనంబు సుగతిప్రద మివ్వెర విట్లు సేయుఁ డా
భావన నన్య ముల్లముసఁ బట్టఁగ నీకుఁడు భక్తియుక్తులై.

76


చ.

అలజడి లేదు చిత్తమున కంగములందుఁ బ్రయత్న మేమియున్
వెలవదు నిర్మలత్వము నవారితబోధము లోనుగా శుభం
బులు సమకూరఁ జేయలఁతి పుణ్యపదంబు ముకుందసంస్మృతిన్
గలది యొకింత యేనియును గానితెఱం గటు సూడుఁడా మదిన్.

77


వ.

మరియు నొక్కటి చెప్పెద.

78


చ.

జలరుహలోచనుం డరయ సర్వశరీరములందు నాత్మయై
యొలసినవాఁడు గావునఁ దదూర్జితభక్తి రమించువారి క

గ్గలముగ సర్వభూతదయ గాదిలి గావలయు జుఁడీ విని
శ్చలసమబుద్ధి యి ట్లొదవ సర్వవిపద్దళనంబు దా నగున్.

79


గీ.

అరయఁ దాపత్రయీహితం బఖిలజగము, నిట్లు పుట్టినఁ గొదవల నెరియుచున్న
జీవులకు నొక్కకీడును సేయఁదగునె, చనదె దుఃఖశీలురదెసఁ గనికరంబు.

80


చ.

తన కరయంగ వేఱొకటి తక్కువజంతువు గల్గె నేనిఁ ద
త్తనువున కెగ్గు సేయమి గదా తగు నన్యశరర మెక్కు డై
యనయము దానహీనుఁ డగునట్టిద యైనను మేలె వైర మే
యనుపున భూతమైత్రియ యపాయము లేనియుపాయ మాత్మకున్.

81


క.

వైరంబున భూతంబులఁ, గారించుదురాత్ము మాఱు గావించుఁ గడున్
వైరంబున భూతంబులు, ధీరుల కిది తెలియుఁ గుమతి తెలియం డెపుడున్.

82


గీ.

మనమునను దుస్స్వభావసంజనిత యైన, ఖేదబుద్ధి దొఱంగి యఖిన్నుఁ డైన
విష్ణు నఖిలభావములందు వెదకి కాంచి, యనఘులార పొందుద మనయము సుఖంబు.

83


సీ.

అనలునిచేఁ గాల దర్కునిచేఁ గ్రాఁగద మృతాంశుచేత శైత్యమునఁ బడదు
పపనుచే నివురదు పర్జన్యవరుణులచే వృద్ధి పొందదు సిద్ధయక్ష
గరుడోరగామరగంధర్వకిన్నరనరమృగాదులచేత నాశవృద్ధు
లొందదు గుల్మమహోదరాదికరోగతతిచేత సుడియదు దంభలోభ


గీ.

మత్సరాదుల నలయదు మహిమమహిత, మేపదంబు మహాయోగిహృదయగమ్య
మట్టియానందతత్త్వంబు ననుభవించు, హరసమర్పితమానసుం డగుబుధుండు.

84


వ.

అని యనేకప్రకారంబుల వివరింపుచుండ విని తమమనంబులం దలంచి దైత్యబా
లురు దైత్యుపాలికిం జని యవ్విధం బంతయుఁ జెప్పిన నలిగి యతండు.

85


ఆ.

తాను చెడుట గాక తక్కినవారిని, జెఱుపఁ జూచె నౌర గొఱకుఁ బడుచు
వీని నెట్ల యైన విసువక పొలియింప, వలయు నేమి వెరవు గలదొ యింక.

86


వ.

అని తలంచి వంటలవారిం బిలిచి దుర్మార్గదర్శనుండును దురాత్ముండును నగుప్రహ్లాదుం
డు మత్పుత్రుం డని యనుమానింపక మీరు రహస్యయత్నంబున వీనికి భక్ష్యభో
జ్యాదుల ముందు హాలాహాలాభిధానం బగుమహావిషంబుఁ బ్రయోగింపుఁ డని పనిచి
నం జని వారును బ్రభుశాసనంబుఁ జేసిన.

87


చ.

అమృతు ననంతు నచ్యుతుని నాత్మఁ దిరంబుగ నున్చి నిత్యబో
ధమునఁ గరంగునప్పరమధార్మికుఁ డింపుగ నారగించు న
య్యమితహలాహలాద్భుతవిషానలసంచయభక్షణంబునం
దమృతముకంటెఁ బ్రీతికర మయ్యెఁ దదంతరబాహ్యచేష్టలన్.

88


క.

విషమచరితుండు బాలుఁడు, విషాహరణమునను జాల వెలుఁ గొందె మహా
విషనిధిజనితవిశృంఖల, విషానలము మ్రింగి పొంగు విషమాక్షుక్రియన్.

89

వ.

ఇట్లు విషాన్నంబుఁ బ్రయోగించి నిర్వికారుం డైయున్న యక్కుమారునిం జూచి
సూపకారులు లోకాపకారియగుదివిజవైరిపాలికిం బోయి తమచేసినపనియు వమ్మగు
టయుం జెప్పిన యప్పు డమ్మోఱకుండు పురోహితులం బిలిపించి మీరు మునుపు ప్రతిజ్ఞ
చేసినవారు కారె? ఈ ప్రహ్లాదుం డనుదురాత్ముం బొరిగొనుకృత్య నుత్పాదించునది
యనిన నియ్యకొని పోయి వారు ప్రహ్లాదునకుం దొలుత నామపూర్వకంబుగా నిట్లనిరి.

90


ఉ.

అన్న! త్రిలోకపూజ్యుఁ డగునంబుజగర్భునియన్వయంబునం
దున్నతిఁ బుట్టి తా కొలఁదియో యిట యెక్కుడు చూడు తండ్రి పెం
పెన్నితెఱంగులం జలము నేటికిఁ బెద్దలపంపుఁ జేయుమా
నిన్ను నుతించు లోకములు నీకు నపాయము లేక యుండినన్.

91


క.

హరి గోవిందుఁ డనంతుఁడు, పురుషోత్తముఁ డనుచు నేల పొగిడెదు చెపుమా
యరుల నుతించిన సైఁతురె, నరపతు లిది మానవే జనస్తుత! యింకన్.

92


గీ.

ఇట్టితండ్రికడుపునను బుట్టి నీకు, నొరులఁ జేర నేల యితనియుల్లమునకు
వచ్చుతెఱగున మెలఁగెడువాఁడ వైన, నితనిరాజ్యంబు నీద కా కెవ్వరి దగు.

93


క.

గురుఁ డనఁగఁ దండ్రికంటెను, నరసి యొకనిఁ జదివి చెప్పుమా శ్రుతిధర్మం
బురులన్ ద్రోవఁగ నగు విన, గురుశాసన ముజ్జగించి కుటిలపుఁదెలివిన్.

94


క.

దేవుండు వాసుదేవుఁడు, దేవోత్తముఁ డంచు నేల దేకువ సెడితో
దేవుఁడు గీవుఁడు దక్కిన, దేవతలును నెంతవారు దితిసూనునకున్.

95


వ.

ఇంతకు మిక్కిలి చెప్పనేర మిటమీఁద నీవ యెఱుంగురు వనినఁ బ్రహ్లాదుం డమ్మ
హీసురుల కి ట్లనియె.

96


సీ.

మీరు చెప్పినయట్ల మేదినీసురకులంబునఁ బుట్టెఁ దండ్రిపంపున ఘసంబు
జనకుఁ డెక్కుడు గురుజనముల కెల్లను నతనిశాసనము సేయంగవలయు
నీతగ వింతయు నెఱుఁగనివాఁడఁ గా నదియు నట్లుండె మీ రరయ మాకు
నాచార్యులరు మిము నతకరించుట దోసమైనను నొకమాట యాడవలసె


గీ.

వాసుదేవసంస్తుతి సేయవలవ దనిన, కుత్సతోక్తి మీ కిట్లు వాక్రువ్వఁ దగునె
చదువరే యెఱుఁగరే మీరు చదివి యెఱిఁగి, వినినయాఢ్యులనడవడి వినరె తలఁగి.

97


వ.

ఇట్టిమాటలు మీకే యొప్పునని చిఱునవ్వు నవ్వి యబ్బాలుం డావృద్ధులం గనుఁగొని
వెండియు.

98


క.

కినగినబడి యించుక మీ, తనయునివిన్నపము వినఁగఁ దగదని బాల్యం
బునఁ గదిరినచాపలమున, మనమునఁ దోఁచినటు లాడుమాటలు సుండీ.

99


సీ.

మనకంటెఁ బెద్దలు ఘనబోధనీయులు దక్షాదులును వసిష్ఠాదు లవల
నత్రిపులస్త్యాదు లట మఱి వ్యాసులు వెఱ్ఱులై కొలిచిరె విష్ణుదేవుఁ

గొందఱు ధర్మంబుఁ గోరి భజింపంగఁ గొంద ఱర్థము మదిఁ గోరి కొలువఁ
గొందఱు కామంబుఁ గోరి సేవింపంగఁ గొందఱు మోక్షంబుఁ గోరి తెలుప


ఆ.

నిందఱకును సేవ్యుఁ డే వేలు పొక్కప, ద్మాక్షుఁ డజుఁ డనంతుఁ డప్రమేయుఁ
డచ్యుతుఁడు పురాణుఁ డనునొక్కరుఁడు గాక, వెండి దైవ మనఁగ నొండు గలఁడె.

100


క.

జ్ఞానము సిరు లున్నతి సం, తానం బైశ్వర్య మధికధనము మఱియు నే
మేనియు వలసిన బెఱవెర, వైనఁ గలదె హరిపదాంబుజార్చనదక్కన్.

101


ఉ.

మాటలు వేయు నేమిటికి మాధవుఁ డొక్కఁడ దైవ మేను ము
మ్మాటికిఁ జాటితిన్ గుటిలమత్సరభావము లుజ్జగించి య
మ్మేటి భజింపుఁ డీతెరువు మేలుగఁ గైకొనుఁ డాత్మలోన మో
మోట యొకింత లేదు హరినొల్లమి యొప్పదు చెప్పితిం జుఁడీ.

102


గీ.

హరియొకండ జగత్కర్త యఖిలభర్త, విశ్వసంహర్త భోక్త వివేకయోక్త
తలఁపు బలుపును గొలుపును దెలుపు నతని, దెసన కావింపనగు నొండుదిక్కు వోక.

103


వ.

అని చెప్పి ప్రహ్లాదుండు.

104


క.

ఇది యగునొ కాదొ చెపుఁడా, తుదిఁ బడుచులమాట లంత దూన్పంగలదే
మది సైఁపవలదు మిక్కిలి, చదివినయెఱుకలకు సరియె చదువనియెఱుకల్.

105


వ.

అనినఁ గోపించి భార్గవాత్మజు లతని కిట్లనిరి.

106


ఉ.

పట్టి కరంబు కిన్క పలుపావకకీలల ద్రోఁచి యెంతయుం
గట్టిఁడి తండ్రి నిన్ను నిటు గాల్పఁగ నడ్డము సొచ్చి వానితోఁ
బెట్టిద మాడ ని న్వెడలఁ బెట్టినచుట్టలతోడిసాగతం
బిట్టిద యయ్యె నౌర ఖలుఁ డేమి యెఱుంగు మహోపకారముల్.

107


క.

ఇంక నిటమీఁద మాతో, వంకలపదురులును నాడువాఁడవ యగుమీ
జంకెషనిలే దిదె నిను, గొంకర వోనడుచుకృత్యఁ గొల్పెదము వెసన్.

108


క.

రక్షించువారిపలుకు ల, పేక్షించినవానిపక్ష మేటికి నిన్నున్
భక్షించు కృత్య నీప, ద్మాక్షుఁడు రక్షించుఁగాక యప్పుడ కడఁకన్.

109


వ.

అనిన నమ్మహానుభావుండు.

110


గీ.

ఒకఁడు వధియించువాఁ డగు నొకఁ డవధ్యుఁ, డొకఁడు రక్షించువాఁ డగు నొకఁడు రక్ష్యుఁ
డనఁగ నిది యంతయును భ్రాంతి యాత్మరూపు, లిన్నితెఱఁగులవాఁడు సర్వేశ్వరుండు.

111


వ.

అని యిట్లు పలికిన విని యధికరోషదందహ్యమానమానసు లగునసురపతిపురోహితులు
సులక్షణంబ యజ్ఞముఖంబుఁ జేసి వ్రేల్చి కృత్య నుత్పాదించి ప్రహ్లాదుపయిం బనిచిన.

112


ఉ.

ఆఁక యొకింతలేక వివృతాస్యరటత్స్ఫుటవహ్నికీలముల్
దాఁక దిగంతముల్ గమియ దౌడలు దీటుచు వాఁడికిన్కఁ బే

రాఁకలి నీజగత్త్రయము నాహుతి చేయఁదలంచెనో యనన్
వీఁకఁ గడంగి కృత్య యొకవ్రేఁవిశూలముఁ గేలఁ దాల్చుచున్.

113


చ.

కడఁగి కుమారుపేరురము గబ్బున నుబ్బును దొంగలింపఁగాఁ
బొడిచె నభేద్య మాద్య మనఁ బూహము మోహము విష్ణుతత్వ ముం
డెడుదెస నమ్మహాపురుషుడెందము గావున నం దొకింతయున్
దొడరదు నొప్పిగంటియును దోపదు తోలును స్రగ్గ దేమియున్.

114


చ.

ఘనకులిశోల్లసత్కఠినగాఢశరీరుఁ గుమారుఁ జెంది యా
బినుఁగుపిశాచికైదు వొకబెండునుబోలె నిమేషమాత్రలో
దునిసి తొలంగి నేలఁబడి తుత్తుమురై పెనుభృంగి బ్రుంగె బ్రుం
గినఁ గని భీతిమై మఱలెఁ గృత్య యకృత్యనికృంతగర్వయై.

115


క.

నిక్కము హరిదాసులకును, మొక్కలమునఁ గీడుచేయ మొనసినయేనిన్
స్రుక్కదె వాసవుఁబట్టిన, చొక్కపుబలుకైనఁ బెద్దశూలం బైనన్.

116


వ.

అని యివ్విధంబున మరలి యాకృత్య దైత్యపతిపురోహితులన పొదవి ఘోరానల
జ్వాలారూపంబునం దాపం బొనరించి ప్రాణంబులు పెఱుకదొడంగిన నమ్మహీసురు
లాక్రోశింప ననుకంపానుకంపమానసుం డగుచు నమ్మహానుభావుం డసమానధ్యానము
కుళితలోచనుండై.

117


గీ.

కృష్ణ కృష్ణ యనంత యేకీడు లేదు, వీరిదెస వెఱ్ఱులై వీరు తారు తమకుఁ
దీర్పరానియీపెనుచిచ్చుఁ దెచ్చుకొనిరి, కరుణ నీవిప్రవర్యులఁ గావవలయు.

118


వ.

అని యాత్మస్థితుఁ డైనపరమేశ్వరుఁ బ్రార్థించి.

119


చ.

సకలజగన్నియామకుఁడు సర్వచరాచరకర్త విశ్వవ
ర్తకుఁ డఖిలేశ్వరుండు నవతామరసాక్షుఁ డనంతుఁ డాద్యుఁ డీ
ప్రకటితభూతజాతమునఁ బ్రబ్బి యొకండ వెలుంగుచున్కి యే
నొకటన మోసపోక కని యుండుదు నొం డెఱుఁగం దలంపునన్.

120


సీ.

క్రొవ్వాఁడి యలుఁగులఁ గొని తూరఁబొడుచుచో ఘనవిషదంష్ట్రలఁ గఱచుచోటఁ
దోరంపుఁగొమ్ములఁ గోరిచెండాడుచోఁ గడిఁదిచిచ్చునఁ ద్రోచి కాల్చుచోట
నక్కజం బైనవిషాన్నంబు పెట్టుచోఁ బటుకృత్య జముదూతఁ బనుచుచోట
నట్టి క్రూరమునకు నట్టిఘోరమునకు నట్టియుక్కిసమున కట్టి తెగువ


ఆ.

కట్టి బెట్టిదమున కట్టి శంకల మది, నే నసూయసేయ నింత నింక
నీనిజంబువలన నీవిప్రు లరిచొర, వహ్ని బడక బ్రతుకువారు గాత.

121


వ.

అని పలికి నిరంతరనిజకారుణ్యసుధాసారసేకంబున నమ్మహాద్విజుల నుజ్జ్వలితులఁ జేసిన
వారును నిరామయదేహులును విగతసమ్మోహులును నై యమ్మహనుభావుఁ జేరం జను

దెంచి వేనవేలు దీవన లిచ్చి చని హిరణ్యకశిపునకుఁ దద్వృత్తాంతం బంతయు
నెఱింగించిన వెఱగుపడి కొడుకు రావించి యతం డతని కిట్లనియె.

122


క.

మంత్రబలమొ మాయయొ యీ, తంత్రము సహజంబొ నీకుఁ దనయా! విన నీ
జంత్రమునకు విస్మయపర, తంత్రంబైనది మనంబు తథ్యము చెపుమా.

123


క.

అని యడిగినఁ బ్రహ్లాదుఁడు, జనకుని చరణద్వయంబు సంప్రీతిమెయిన్
దనశిరము సోఁక నెఱఁగి స, వినయంబుగ నిట్టు లనియె విహితాంజలి యై.

124


గీ.

అయ్య! యిది మంత్రబలముగా దరయ మాయ, గాదు నాదగునైజంబు గాదు వినవె
యెవ్వరికి నైనఁ జొప్పడు నిట్టి పేర్మి, యుల్లమున విష్ణుఁ దిరముగా నునిచి రేని.

125


వ.

విష్ణుపరాయణత్వం బెట్టిదనిన.

126


క.

ఒరులకుఁ గీడు తలంపమి, హరిభక్తికి రూప మొరుల నాత్మసమమకాఁ
బరికించువారి నాపద, బొరయునె కారణము లేక పొందునె భయముల్.

127


గీ.

మనసుఁ బలుకును జేఁతయు ననఁగ నిట్టి, మూఁడుదెఱఁగులపాపంబు ముదిరెనేని
నదియ సంసారవారధి నదిమియుండు, మనుజుఁ డెన్నఁడుఁ దలయెత్తికొనఁగలేఁడు.

128


ఉ.

ఇంతయుఁ జూచి నిక్కముగ నేను నచింత్యు ననంతు నచ్యుతుం
జింతన సేయుదున్ సకలజీవులయందును గాంతు నవ్విభున్
భ్రాంతి యొకింత లేదు మదిఁ బండినభక్తియు నొండు దిక్కు వో
దెంతటిపేర్మి యైన నగు నిట్టితెఱంగున దైత్యపుంగవా!

129


గీ.

అనినఁ బులిఁగోల వ్రేసినయట్లు రేఁగి, కాఁగి హుమ్మని యసురయంగంబు వడఁకఁ
బేర్చు కినుకఁ గింకరకోటిఁ బిల్చిపిల్చి, నెలుఁగు నింగిఁ బొంగారంగ నిట్టు లనియె.

130


చ.

ఇది శతయోజనోన్నతము హేమగిరిప్రతిమంబు హర్మ్య మీ
తుది నిలువెక్కి వీని దిగఁద్రోపుఁడు క్రిందట నున్నచట్టుపైఁ
జదియఁగఁ గూలి మేనఁ గలచర్మము నెమ్ములు కండలున్ వెసన్
జిదురుపలై చనం బొలియఁ జింతయు వంతయు మాను నంతలోన్.

131


వ.

అనినం గ్రందుకొన నమ్ముకుందదాసుం బ్రాసాదశిఖరంబునకుం గొనిపోయి పట్టి
దిగఁద్రోచిన.

132


చ.

కుడువఁగ నొల్ల కెంతయును గ్రవ్వునఁ గూలఁగఁ ద్రోచుఁడున్ దిగం
బడియెడుదానవప్రభునిపాలిటిభాగ్యమువోలె మేడమీఁ
డెడలెడుబాలు విష్ణుమయహృ త్కుధరించె ధరిత్రి దూదిప్రో
విడె మునుమున్న యాతనికి నింపుగఁ జేసిన సెజ్జయో యనన్.

133


మ.

కని దైత్యేంద్రుఁడు గాఢమోహబలవద్గ్రాహంబు పెన్వాతఁ జి
క్కినచేతోగతిఁ ద్రిప్పలేక మఱియున్ గిన్నెక్కఁగా శంబరుం

డనుపేరుంగలదానవుం బిలిచి మాయల్ పెక్కు గావించుఁ జి
క్కొనరింపంగలవిద్య నీపొలుపు నేఁ డుల్లాసముం జూపుమా.

134


చ.

కఱతలు పెద్ద వీని కిటుకాఱియఁ బెట్టెడుమాన కేమిటన్
నెఱఁకులు మీటుచుండుఁ దననీచపుమాటలు వీనిఁబట్టి క్ర
చ్చఱఁ బరిమార్పఁజేసిన యుపాయము లన్నియు గొడ్డువోయె నీ
వుఱక వధింపఁగావలయు నుగ్రపుమాయల నిద్దురాత్మునిన్.

135


వ.

అనినఁ బొంగి యఖర్వగర్వాడంబరుం డగుచు శంబరుం డతని కిట్లనియె.

136


గీ.

కలవు నూఱులు వేలు లక్షలును గోటు, లప్రమేయలు ఘనమాయ లధిప నాకు
వానిఁ దగులకపోరాదు వనజభవున, కైన నభవునకైనను నన్యు లెంత.

137


వ.

అనిన దుర్బుద్ధి యగునయ్యసంబంధుండు బంధమత్సరుండై కడంగిన.

138


క.

కులశైలంబులు వడఁకెను, గలఁగెఁ బయోధులు పయోజగర్భుఁడు సురలున్
దలఁకిరి మునులమనంబులు, గళవళ మయ్యెన్ దదీయగర్వోద్ధతికిన్.

139


వ.

అంత.

140


ఉ.

మాయలు డాయనీక యసమానత నత్యుపమానమై ముని
ధ్యేయతభక్తితిత్పరవిధేయ మనందగువిష్ణుతత్వమున్
బాయనిచూడ్కి సర్వసమభావన గ్రాలెడుబాలు బాలిశుం
జేయ నతండు సూపెఁ దన చెన్నఁటిమాయలదొంతు లన్నియున్.

141


గీ.

వీడు మాయలఁ దను నేచువాఁడు డాయ, వీఁడు నాకు నెగ్గొనరించువాఁడు కుమతి
యనఁగ శంబరునందును నమ్మహాత్ముఁ, డప్పు డనసూయుఁడై యుండె నల్లనగుచు.

142


వ.

అట్టిసమయంబున భక్తపరాధీనుండును బరాపరేశ్వరుండును నగుపరమపురుషుం
డప్పుణ్యపురుషునకుఁ బరిరక్షణార్థంబుగా సకలదురితాపకర్శనం బగుసుదర్శ
నంబు నాజ్ఞాపించిన.

143


ఉ.

ఘోరము గాంతకాలకృతకోపఖరాంశుకకోరదారుణా
కారముతోడఁ జక్ర మతిఖండితచండసమిద్ధమండల
స్ఫారత నేగుదేర సురశత్రుఁ డొనర్చినమాయ వోయి నీ
హారమపోలె మాయమయి యచ్చట నచ్చటఁ గ్రాఁగె వ్రేల్మిడిన్.

144


వ.

తదనంతరంబ యమ్మహాస్త్రం బంతర్హితం బయ్యె. నట్లు శంబరనిర్మితమాయాసహస్రం
బులు సమసిన తమిస్రంబులం బాసినసహస్రకరుండునుంబోలె వెలుంగుబాలు నా
లోకించి వెండియు.

145


క.

తన్నుఁ బొలియింపఁ బుట్టిన, చెన్నఁటిచల మపుడు వెఱ్ఱిచేయు నలుకతో
నన్నీచుఁ డచటఁ జేరువ, నున్నపవనుఁ జూచి పలికె నుగ్రాకృతియై.

146

ఉ.

ఓయి సమీర! యీఖలు దురుక్తిధురంధరు శత్రుపక్షసం
ధాయకు మాయలాని సముదగ్రజవంబునఁ దాఁకి వీనిదు
ష్కాయముఁ జొచ్చి ధాతువుల గ్రాఁచి వెసం బెనుపట్టుకట్టఁగాఁ
జేయుము నీదుశోషణవిశేషణనైపుణికల్మి యేర్పడన్.

147


వ.

అని పనిచినం బనిఫూని సంశోషణాభిధానుం డగునప్పవమానుం డాదైత్యరాజసూను
శరీరంబుఁ బ్రవేశించి నిజవ్యాపారవికారంబులు గావింపందొడంగిన.

148


ఉ.

హానియు వృద్ధియున్ బొరయ కస్తసమస్తవికారుఁ డైనల
క్ష్మీనిధిమేదినీధరునిఁ జిత్తమునందు ధరించియున్న మే
ధానిధి యయ్యశోనిధి కృతస్మితచారుముఖారవిందుఁ డై
తా నొకయీసులేక ప్రమదంబున నుండె నకంపితస్థితిన్.

149


ఉ.

అంతఁ దదీయహృద్గతుఁ డనంతుఁ డనంతదయాంతరంగుఁ డ
త్యంతవిభూతి నప్పవనమంతయుఁ గ్రోలిన గృత్తిమూలమై
యంతటఁ బే రడంగె నది యాత్మఁ బ్రమోదము పొందె లోక మే
కాంతవివేకులమ్ వికృతులందునె యెందును నెవ్విధంబునన్.

150


వ.

అసురేశ్వరుండును నసమానలజ్జాకందళితాంతరంగుఁ డగుచు నభ్యంతరంబునకుం జని
యె. నంత ప్రహ్లాదుండునుం గురుగృహంబునకుం జని పూర్వప్రకారంబునం జదువు
చుండె. నాచార్యుం డతనికిం గ్రమంబున భార్గవప్రణీతం బైననీతితంత్రంబు సకలం
బును నపగతంబు గావించి యతనిశాస్త్రపారీణత్వంబు దృఢంబుగా నెఱింగి
యొక్కనాఁడు హిరణ్యకశిపుపాలికిం జని యిట్లనియె.

151


చ.

పవలును రేలు దు:ఖపడి బాలుని నొయ్యన బుజ్జగించి దా
నవకులనాథ! యేను జతనంబునఁ జెప్పితి రాజనీతివై
భవపరిబోధకారి యగుభార్గవసూక్తమహార్థతంత్రమం
త్రవికలబుద్ధి నీకొడుకు దాఁ దుదముట్టె నుదాత్తవిద్యలన్.

152


వ.

అనిన సంతసిల్లి తండ్రి కొడుకు నాప్రొద్దు రావించి చేరువ నునుచుకొని యన్నా! నిన్ను
మీయొజ్జ నయకళాపారంగతుంగా నుదాహరించినది మాకుం దెల్లంబుగా నెఱుంగవల
యు, రాజులకు మిత్రు లమిత్రులు నుదాసీనులను మూఁడుదెఱంగులవారలు గలరు, వా
రలయందు భూపతి యెట్టియెడల బ్రవర్తిల్లు, నభ్యంతరులు బాహ్యులు నగునమా
త్యులయెడ నెవ్విధంబులవాఁడు గాఁదగుఁ, జారసంచారంబును బౌరజానపదజనాను
లాపనంబు నేలాగునం జెల్లించు, విశ్వాసుల నవిశ్వాసుల నెట్లు గనుఁగొనుఁ, గార్యం
బు నకార్యంబు నేవెరవున నిర్ణయించు, దుర్గంబు లేమియయి సవరించు, నరణ్యశోధ
నులగుదక్షకిరాతాదుల నేమాడ్కి నియమించు, గంటకుల నేభంగి భంగించు నివియు

మఱియు వలయువిషయంబుల వివరించి చెప్పుమా యనఁ బ్రహ్లాదుం డాదైతేయప్రభు
వునకు నభివందనంబుఁ జేసి చేతులు మొగిడ్చి వినయవినమితమస్తకుం డగుచు నిట్లనియె.

153


చ.

ఒకటఁ గొఱంత లేదు గురునొద్ద నృపాలనయోపచారముల్
సకలము నభ్యసించితి నిజం బదిమంచివిగావు దేవ యే
నొకగతి విన్నవింతుఁ బుయిలోడక యిప్పుడు దాని నీ వొకిం
చుకపడి చిత్తగింపు మనసూయుఁడపై మదిఁ గింక వాయఁగన్.

154


ఉ.

సామము తొల్త దాన ముపజాపము దండము వెండియేలుకో
లేమఱు నీయుపాయములు విద్విషుఁ డాదిగ మువ్వురందు నె
ట్లేమెయి నెట్లు పొందుపడు నెవ్వనియం దది య ట్లొనర్పఁగా
సేమము గల్గు రాజునకు సిద్ధపదం బెద్ది నీతిపద్ధతిన్.

155


చ.

విను మిదియెల్ల నామది వివేకముచొప్పునఁ జెప్ప నప్రయో
జనములు తండ్రి మిత్రుఁ డన శత్రుఁ డనంగ సముం డనంగ వీఁ
డని యెఱుఁగం ద్రికాలములయందును సాధ్యము తొల్తఁ గల్గ సా
ధన మట తోఁచుఁగాత వితథంబుగ సాధన మూర కేటికిన్.

156


క.

మేనుల కెల్లను జీవుఁడు, తానే గోవిందుఁ డొకఁడు తండ్రీ! యున్నాఁ
డానిక్కము తన కబ్బెను, గానుపురిపుమిత్రమధ్యగణనకుఁ బొలమై.

157


చ.

నిఖిలజగన్మయుండు హరి నీకును నాత్ముఁడ యెంచి చూడఁగా
నఖిలశరీరధారులకు నాత్ముఁడు దీని నిజం బెఱుంగు చి
త్సుఖభరితుండు మాయలకుఁ జొప్పడఁ డప్పని గాన ముక్తి కు
న్ముఖత వహింపఁగావలయు మోహముఁ బాయఁగఁ ద్రోచి భక్తిమైన్.

158


క.

మిడుఁగు ఱనితలచుబాలుఁడు, మిడుగురుఁబుర్వుఁ గని మేనమిడికెడుజనుఁడున్
బొడుగున దగుప్రోలింతయు, జడనిధిగాఁ జూచు నవల జారనితెలివిన్.

159


వ.

అ ట్లగుటం జేసి.

160


క.

పెడవిద్య లెవ్వియును భవ, ముడుపఁగలే వాత్మబంధ ముడుపునదియ యె
క్కుడువిద్య యెట్టివిద్యలు, దొడఁగుపనియ మంచిపని విధూతకలంకా.

161


క.

ఇదియంతయుఁ దగఁ గనుఁగొని, మది నిస్సారంపువిద్య మరుఁగక బంధ
చ్ఛిదఁ జేయు నాత్మవిద్యకు, నొదవఁ దొడఁగినాఁడ నుడుగ నుద్యమ మెట్లున్.

162


సీ.

ఉద్యోగముల కెల్ల నొదవునె ఫలసిద్ధి యెవ్వాఁడు దొలుమేన నెంతఁ జేసె
నంతియ వానికి నబ్బునిబ్బామున శ్రీలు విద్యలు నెల్లమేలు నాత్మఁ
గోరనివాఁడును గోరి యోపినయంత నుత్సహింపనివాఁడు నొకఁడు గలఁడె
శూరత లేక యుదారత లేక యేతెలివియు లేక యేతెఱఁగు లేక

గీ.

యూరకుండెడునీచుల కొదవు గరిమ, వానివెరవున నెయ్యది వచ్చుఁ జెపుమ
యయిన నుద్యోగి గావలె నండ్రు బుధులు, భాగ్య మిట్టిది యని కానఁబడదు గాన.

163


క.

కావున ముక్తికి యత్నము, గావింపఁగవలయు సమత గల్గుటఁ గోరం
గావలయు నెప్పుడును స, ద్భావంబున సమత యవ్విధం బండ్రేనిన్.

164


క.

చెప్పినమాటలె పలుమఱుఁ, జెప్పంగా వలసె నీదుచిత్తము చొరమిన్
దప్పకయ విన్నవించెద, నొప్పుగఁ గృప నవధరింపు మూర్జితచరితా!

165


ఉ.

దైవతదైత్యమానుషకదంబములోనుగఁ గల్గుజంగమ
స్థావరభూతసంచయము సర్వము విష్ణుశరీర మిందులో
నేవిధి నేశరీరమున కించుకనొప్పియుఁ జెందకుండఁగాఁ
గేవిలసత్కృపానిరతి గీల్కొనియున్న సమత్వ మారయన్.

166


చ.

విను దనుజేంద్ర యిట్టిసమవృత్తిఁ జరించువివేకశాలికిన్
వనరుహలోచనుం డజుఁ డవార్యుఁ డచింత్యుఁ డనంతుఁ డచ్యుతుం
డెనయఁగ మెచ్చు నట్టిపరమేశ్వరు మెచ్చొనరించుతీవ్రసం
జననజరానిరాససవిశారదసారసమగ్రసౌఖ్యముల్.

167


మహాస్రగ్ధర.

అనినం గల్పాంతవాత్యాహతవిబుధనగోగ్రాకృతిన్ హేమసింహా
సనభాగోత్తానవేగోజ్జ్వలుఁడు దశనవిస్పష్టదంష్ట్రాధరోష్ఠుం
డును రోషోత్కంపతీవ్రుండును ఘనరభసాటోపదీప్తుండు నై య
ద్దనుజుం డాపుణ్యువక్షస్థలముఁ గడువడిం దాఁచె నిశ్శృంఖలాంఘ్రిన్.

168


వ.

ఇవ్విధంబునం దాఁచి.

169


ఉ.

కోలుమసంగి చేచఱచికొంచు మొగంబునఁ గన్నుఁ గోనలన్
రాలఁగ నిప్పు లీత్రిభువనంబుల నొక్కట మ్రింగఁ జూచెనో
కాలుఁడొ యీతఁ డింతటికిఁ గాలము నిండెనొ కాక యంచు భూ
తాలి దలంక నిల్చి యసురాధిపుఁ డి ట్లని పల్కె బంట్లతోన్.

170


ఆ.

ఓయి విప్రజిత్త! యోయి రాహువ! యోయి, బలుఁడ! రండు వీనిఁ బట్టిపెట్టి
చటులనాగపాశసంచయంబులఁ గట్టి, యబ్ధినడుమఁ ద్రొక్కుఁ డదటణంగ.

171


క.

ఇటు సేయకున్న నిటమీఁ, దట మనయసురాన్వయంబుఁ దక్కినజగమున్
గుటిలుఁ డగువీనిమాటలఁ, దటమటగమనంబు లూని తప్పఁగ నడుచున్.

172


చ.

మనదెనఁ గీడు లేదు పలుమాఱును జప్పిడినోరి శత్రుకీ
ర్తన మిటు సేయఁగాఁ దగదు రా యని యిమ్మెయిఁ జాటి చెప్పినన్
వినఁడు దురాత్ము లైనయవివేకులకున్ బ్రతికార మెమ్మెయిన్
మును గలదే వెసం జదియ మోదుట చింపుట దక్క నెక్కడన్.

173

వ.

అని యాజ్ఞాపించిన నజ్ఞానదూషికులగు నద్దోషకారు లక్కుమారుఁ గ్రూరకుటిలభుజం
గపాశబద్ధుం జేసి కొనిపోయి మున్నీట వైచిన.

174


క.

ఘనభుజగశతఫణావృత, తనుఁ డై బాలుఁడు పయోధితరఁగలమీఁదన్
బెనుబాఁపసజ్జఁ బసడిం, చినవెన్నునిపాటి యగుచుఁ జెన్నెసలారెన్.

175


ఉ.

అంత నిరంతరోర్ములు దిగంతము లందుచు మ్రోతకుం జనం
బెంతయు భ్రాంతిఁ బొందఁ దెత లెత్తి కుమారునిపీడ సైఁప క
త్యంతరయంబునం బుడమియంతయు ముంచు ననంగఁ బొంగెఁ గ
ల్పాంతమునాఁడు నిట్ల యనునట్లు సరత్పతి భీకరాకృతిన్.

176


వ.

అట్టియద్భుతప్రకారంబుఁ గనుంగొని యసురేశ్వరుం డసురుల నందఱ రావించి
యిట్లనియె.

177


సీ.

అలఁగులఁ బొడిపించి యహికోటిఁ గఱపించి కరులచేఁ ద్రొక్కించి కనలుటగ్నిఁ
ద్రోయించి విషమున దోఁగినయన్నంబుఁ బెట్టించి కృత్య కొప్పించి పాడువు
నందుండి వెసఁ దలక్రిందుగాఁ గెడయించి క్రూరంపుమాయల కొంకులందుఁ
దవిలించి పవనుచే నివురించి యప్పుడు నీమహాంభోధిలో నిట్టు వైచి


ఆ.

యెట్టుఁ జాల మైతి మీఖలు మర్దింప, దాయ యింక మనకుఁ దాన చిక్కె
మాడుకొనఁగ వైవు డుర్వీధ్రములు నవి, మీఁద మెలఁగకుండ మిడుగకుండ.

178


శా.

చావం డొండొకవెంట నేమిట మదిన్ జర్చించి యే నెప్పుడుం
భావం బేర్పడఁ గంటి నిట్టు లొనరింపన్ గ్రొవ్వు పెంపాఱడిం
బోవం బెద్దయుఁ గాలముండినవియుం బుత్రాకృతిన్ శత్రుఁడై
తా వేభంగుల నన్ను నేచుఁ దగ దీదర్పాంధు సైరింపఁగన్.

179


చ.

అనవుడు దానవేశ్వరునియానతి నష్టసహస్రసంఖ్య ల
ద్దనుజులు పేర్చి యార్చుచు నుదగ్రనగంబులు దెచ్చి తెచ్చి యో
జనములు పెక్కువేలయెడసాలగఁ బ్రబ్బిన బిట్టు వైచిరా
ఘనతరమూర్తిమీఁదఁ దదకంపితలీలకుఁ జోద్య మందుచున్.

180


ఉ.

వీఁపున నబ్ధి నొక్కపృథివీధరమున్ దగఁ దాల్చె నంచు ల
క్ష్మీపతిపేర్మి చాలఁ గడుఁ జిట్టలుగా శ్రుతు లుగ్గడించు నీ
రూపునఁ గోటిసంఖ్యలగరుల్ ధరియించినవిష్ణుదాసు పెం
పేపగిది న్నుతించునొకొ యింకని వెక్కస మందె లోకముల్.

181


ఉ.

పిండలిపండుగాఁ గలఁగెఁ బెల్లుగ నంబుధు లెల్ల మేదినీ
మండలి దిద్దిరందిరిగె మ్రగ్గె దిశాకరిసంచయంబు మా
ర్తాండుఁడు మాసె విశ్వమును దామరపాకుననీరువోలె నొం
డొండ చరించె నయ్యనఘుఁ డున్ననితాంతనిరోధభంగికిన్.

182

క.

అప్పుడు నెందును జెందక , చిప్పిలుభక్తిరసలీలఁ జిత్తము దనువున్
దొప్పఁగఁ దోఁపఁగ బాలుం, డెప్పటిక్రియ నుండె జగదధీశ్వరచింతన్.

183


వ.

ఇట్లు మహితసమాధినిష్ఠుం డైయున్న యబ్భాగవతశ్రేష్ఠుండు నిజగరిష్ఠభావనివాసుం
డై భాసిల్లు వాసుదేవు ననేకప్రకారంబుల వినుతించుచుం దలంపులుం దెలుపులం
జేయు మున్నీరుచొచ్చినయేఱులచందంబున గోవిందునందు డింద నానందకాంక్ష
నధిష్ఠించియుండ కొండొండ నయ్యురగరాజరజ్జువులు నజ్జరాలుటఁ గరాళ శైలసహ
స్రంబులరాసులు పృశ్నిపాసి వారాశింబడి మునింగిపోవం గసుగందక సుందరశరీరం
బుతో సముద్ధితుండై సముద్రతరంగతురంగమారూఢుండై రయంబునం దీరంబున
కరుగుదెంచి.

184


ఆ.

మనసు గొంతవెలికి గొని వచ్చి తాను ప్రహ్లాదుఁడని జగంబు లనఁగఁ గలుగు
నాత్మభిన్నభావ మౌపచారికదృష్టిఁ, జూచుచుండె వికృతి సోఁకకుండ.

185


క.

అని ప్రహ్లాదచరిత్రము, మునివరుఁ డగుగాలవునకు మోదాద్భుతసం
జనకంబుగ నుగ్రశ్రవుఁ, డనుపమతేజుందు చెప్పె నని తగ మఱియున్.

186


క.

తల్పితరత్నాకర సం, కల్పితభక్తజనకావ్యకల్పనచూడా
కల్పితశితికంఠచ్చద, శిల్పితజగదండచతురచిత్రవినోదా.

187


మందాక్రాంతవృత్తము.

వేలాక్రాంతత్రిభువన మహిద్విద్విషల్లక్ష్మసూక్ష్మ
స్థూలావిత్వస్ఫురితరచనాదుర్నిరూపాత్మఖేలో
త్కోలాకారక్షుభితవాయోత్కూలకల్లోలమాలో
ల్లోలాబ్ధీంద్రోల్లుఠితవసుధాలోకరక్షాసమక్షా.

188


క.

దైతేయభయదపృథుధర, పీతాంబరకంబుహస్త పీతాంబరస్ర
స్ఫీతాంబురుహేక్షణభవ, భీతాభయదానకరణ పేశలకరుణా.

189


అంబురుహవృత్తము.

దేశకులార్చితదేవశిరోమణి దేవదేవజగత్రయా
పావనమూర్తి కృపావనవర్తి విభావనామకచిత్తరా
జీవమధువ్రతజీవదశాపరిచేష్టితాఖిలలోకల
క్ష్మీసదనాసవశీతలసౌరభసేవానాంచితజీవనా.

190


గద్యము.

ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్యధు
ర్యశ్రీసూర్యసుకవిమిత్రసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతం బైన శ్రీలక్ష్మీనృసింహావతారం బనుపురాణకధయందుఁ జతుర్థాశ్వాసము.