Jump to content

నృసింహపురాణము/పీఠిక

వికీసోర్స్ నుండి

శ్రీ

నృసింహపురాణము

పీఠిక

కి నిరంతరంబు కడుఁ జెన్నెసలారెడు రాగలీల ను
త్సేకముఁ బొంది యొప్పు తనచిత్తము చూపెడుమాడ్కి నిత్యర
మ్యాకృతి యైన కౌస్తుభము నక్కుపయిం బచరించునుత్తమ
శ్లోకుఁ డహోబలేశుఁ డతిలోకుఁడు లోకముఁ గాంచుఁ గావుతన్.

1


ఉ.

చందనచారుపత్రకము సంస్తుతకౌస్తుభకర్ణికంబు న
స్యందితలాంఛనభ్రమరసంగమనోజ్ఞము నైనయట్టిగో
విందునురస్తలంబ యరవిందముగా నొగియించి యున్న య
య్యిందిర సూచు గాతఁ గృప నింపగుచూపుల భక్తసంతతిన్.

2


ఉ.

గద్దియ యైనతమ్మివిరికమ్మనితావికిఁ గ్రమ్ముతేఁటు లే
ప్రొద్దును మ్రోయుచందమునఁ బ్రోడలు చట్టులు గూడి చుట్టులన్
బెద్దయెలుంగునం జదువఁ బేర్మియెలర్పఁగ నొప్పువేలుపుం
బెద్ద నయంపుమత్కృతి కభీష్టచిరస్థితిదాయి గావుతన్.

3


చ.

నఱలు జటాటవిం గుసుమవల్లరు లై చదలేటినీటి నె
త్తఱుల జనించుక్రొన్నురువుతండములై తలసుట్టుఁబాము మే
నఱువుఁడుఁ గుప్పుసంపుఁబొరలై చెలువార సితేందుచంద్రికల్
నెఱయఁగఁ బ్రోచు మన్ముఖమనీషితకావ్యకళాకుముద్వతిన్.

4


చ.

తనరఁగ గ్రుచ్చి యంబిక ముదంబునఁ గౌఁగిటఁ జేర్చుచో ఘన
స్తనయుగకుంభయుగ్మములు దార్కొని యొప్పునకై యసూయమైఁ
జెనకిపెనంగ నొండొకటిఁ జేరినలాగున నుల్లసిల్లఁ బెం
పెనసినవానిఁ బ్రీతి నుతియించెద నేనికమోమువేలుపున్.

5


చ.

కరకమలం బొసంగఁ బటికంపుఁగమండలువంటికాంతి భా
సుర మగుమౌక్తికంపుజపసూత్రము దాల్చుట బ్రహ్మవాదమై

పరఁగినహంసముం బిలిచి బాలమృణాళముఁ జూపుచంద మై
సిరి తిలకింప నొప్పుబుధసేవితమూర్తిఁ దలంతు భారతిన్.

6


ఉ.

వీనులు తేనెయై కురియ వింతగఁ గావ్యరసంబు గ్రోలి య
మ్మానవకోటికిం బశుసమానత మానఁగఁ జేసె నెవ్వఁ డె
వ్వానికి వీడు లేరు మునివర్గములోపల నమ్మహాత్ము మే
ధానిధి నాద్యు రాఘవకథానిధికీర్తిధురీణుఁ గొల్చెదన్.

7


ఉ.

వేదము నచ్చుకట్టి శ్రుతివీథులతత్వముఁ బట్టి చూచి య
వ్వేదముకంపునింపునకు వెగ్గలమై నిగుడంగఁ బాఱు నా
మోదము లెల్లఁ గొల్సి యనుమోదితకీర్తుల మిన్నుదాఁకు న
య్యాదిమపండితుం గొలుతు నచ్యుతమూర్తిఁ బరాశరాత్మజున్.

8


ఉ.

భాసురభారతార్థములభంగులు నిక్క మెఱుంగనేరమిన్
గాసట బీసటే చదివి గాథలు ద్రవ్వుతెనుంగువారికిన్
వ్యాసమునిప్రణీతపరమార్థము తెల్లఁగఁ జేసినట్టి య
బ్జాసనకల్పులం దలఁతు నాద్యుల నన్నయతిక్కనార్యులన్.

9


క.

వెండియుఁ దొల్లిఁటి యిప్పటి, పండితుల మహాకవిత్వపదవీగరిమా
ఖండితుల నతులతేజో, మండితులఁ దలంతు నిండుమనమున నెపుడున్.

10


ఉ.

యామము లెన్మిదింట నియతాకృతిఁ బ్రత్యయమున్ శివార్చనా
రామత యొప్ప నిత్యశివరాత్రి, వ్రతంబుగఁ బూని భవ్యయో
గామృతతృప్తి మైఁ ద్రిజగదర్చితలీలఁ దనర్చుశంకర
స్వామి మునీంద్రభక్తజనవత్సలు మద్గురు నాశ్రయించెదన్.

11


వ.

అని యీక్రమంబునఁ బ్రధానదేవతాసంకీర్తనంబును మహాకవిజనప్రార్థనంబును
సద్గురుచరణానుస్మరణకీర్తనంబును సమర్థించి కృతార్థతం బొంది కతిపయాక్షరపరి
గ్రహజనితం బైననైసర్గికచాపలంబుకతంబున.

12


ఉ.

మించిన వేడ్క వీనులకు మిక్కుటమై మధుసృష్టి గ్రమ్మ రా
యంచలు కూయఁ గ్రౌంచమును నావలఁ గూయఁ గడంగుభంగిఁ బ్రౌ
ఢాంచితశబ్దసారులు మహాకవు లాద్యులు కావ్యశయ్య గీ
లించిన కీర్తిసంగసుఖలీలకు నేనును గాంక్షఁ జేసితిన్.

13


వ.

అట్లు మహాప్రబంధకల్పనాకుతూహలాయత్తం బగుచిత్తంబుతో నొక్కనాఁడు
తదనుసంధానానుబంధసమాధినిమీలితేక్షణుండనై క్షణం బున్నసమయంబున.

14


సీ.

ప్రజ్ఞాపవిత్రుఁ డాపస్తంబసూత్రుండు శ్రీవత్సగోత్రుఁ డూర్జితచరిత్రుఁ
డగుబొల్లనకుఁ బోలమాంబకుఁ బుత్రుండు వెలనాటిచోడనివలన మిగుల

మన్నన గన్నభీమనమంత్రిపౌత్రుండు పేరమాంబామనఃప్రియుఁడు పోత
మాంబికావిభు సూరనార్యు మజ్జనకుని బొల్లధీనిధికిని బోలమకును


గీ.

జన్ననకు ననుజన్మునిఁ గన్నతండ్రి, వేఁగినాటఁ గరావర్తినృత్తిమంతుఁ
డనఘుఁ డెఱపోతసూరికంసారిచరణ, కమలమధుకరపతిసారవిమలయశుఁడు.

15


వ.

మదీయభావంబున నావిర్భావంబునొంది సదయానందమధురవాక్యంబుల నన్ను నిట్ల
ని యనుగ్రహించె.

16


ఉ.

ఉన్నతసంస్కృతాదిచతురోక్తిపదంబులఁ గావ్యకర్త వై
యెన్నికమైఁ బ్రబంధపరమేశుఁ డనంగ నరణ్యపర్వశే
షోన్నయ మంధ్రభాష సుజనోత్సవ మొప్పఁగ నిర్వహించి తా
నన్నయభట్టతిక్కకవినాథుల కెక్కినభక్తిపెంపునన్.

17


క.

గిరిశపదభక్తిరసత, త్పరభావము కలిమి కంభుదాసుం డనఁగా
బరఁగిన గోవిందగుణా, దరసంభృతసౌమనస్యధన్యుఁడ వెందున్.

18


క.

గురుభజనపురాయణుఁడవు, సరసబహుపురాణశాస్త్రకథావి
స్తరవేదివి వినయోదిత, ధరితుఁడ వతులానుభావభవ్యుడఁవు మహిన్.

19


క.

కావునఁ బ్రబంధరచనా, ప్రావీణ్యత నీకు సహజపరిణతసిద్ధం
బై వెలసినయది యొకకృతి, గావింపు జగద్ధితంబుగా నేఁ బనుతున్.

20


ఉ.

శ్రీమదహోబలేశనరసింహుఁడు నాప్రియదైవతంబు మ
త్స్వామి తదీయతీర్థవిభవంబును దన్మహితావతారమున్
నీ ధురోక్తిగుంభన మనీషులు మెచ్చఁగఁ బ్రస్తుతింపు నీ
కేమెయి సంభవించు నఖిలేప్సితపుణ్యఫలోదయోన్నతుల్.

21


తే.

అనినఁ బులకలు మై జాదుకొనఁగ నపుడు, మనసు వికసిల్లఁ గనువిచ్చి మహితలీల
నద్భుతానందరసమూర్తినై తలంపు, తద్గతంబుగ ధన్యత తలకొనంగ.

22


క.

ఇది యీశ్వరానుశాసన, ముదయోన్ముఖ మయ్యె నాకు నూర్జితశుభసం
పద నొనరింతుఁ బ్రబంధము, సదయనృసింహావతారసంస్తవసరణిన్.

23


చ.

ననుఁ దనపేరివాఁ డని మనంబున నెప్పుడు నాదరించుటన్
బనిచె గుణప్రసిద్ధియును భవ్యసమృద్ధియుఁ జేయుపుణ్యపుం
బని యఁట మత్పితామహుఁడు ప్రాక్తనసంయమితుల్యవర్తనుం
డనఘయశుండు పూర్ణపురుషాయుషజీవితధన్యుఁ డిమ్మహిన్.

24


తే.

అమ్మహాతుఁడు నిత్యదయార్ద్రహృదయుఁ, డతులితానందజలధి నోలాడుఁగాత
విష్ణుధర్మప్రశంసాపవిత్ర మైన, యస్మదీయప్రబంధసామగ్రివలన.

25


శా.

ప్రాజ్ఞప్రస్తుతభవ్యభోగవిభవస్ఫారాత్ముఁ డారాధ్యస

ర్వజ్ఞుం డప్రతిమాద్భుతోభయకవిత్వప్రౌఢిశబ్దార్థయో
గాజ్ఞాసిద్ధిఘనుండు మజ్జనకుఁ డుద్యత్కీర్తిశ్రీసూర్యుఁ డీ
విజ్ఞానాత్మకవాజ్ఞ్మయంబున ముదావేశోజ్జ్వలుం డయ్యెడున్.

26


వ.

ఈనిశ్చయం బిట్టిది కావున బ్రహ్మాండాదిపురాణోక్తం బయినశ్రీనరసింహావతారం
బనుపురాణంబుఁ దెనుంగుబాసఁ బ్రకటింపలయు నమ్మహాప్రబంధంబునకు నస్మత్పి
తామహహృదయగుహావిహారమహాసింహం బగుశ్రీమదహోబలనరసింహదేవుం డధీ
శ్వరుండగుటంజేసి యవ్వాక్యరత్నరచనోపహారంబుల నమ్మహాదైవతంబు నారాధించి.

27


చ.

కృతికి విభుండు శ్రీవిభుఁడు కీర్తనపావన మైన తద్గుణ
స్తుతికృతివిష్ణుదాసులు యశోనిధు లూగ్జితపుణ్యు లుత్తముల్
కృతిం గొనియాడువారు కృతకృత్యుఁడనైతి మదీయవాంఛిత
ప్రతతిఁ జెందఁ గల్పతరుపాకము శ్రీకరకావ్యరూపతన్.

28


వ.

అని యుత్సాహంబు మిగులం జిత్తంబును వాగ్వృత్తంబును నుత్తమశ్లోకసంకీర్తనర
చనాయత్తంబును నగుచుండ నత్యుదాత్తభక్తిప్రయుక్తోల్లాసభాసితుండ నై కృతిఁ
జేయం దొడంగి.

29


షష్ఠ్యంతములు

క.

శ్రీమదహోబలతీర్థ, స్వామికి శరణాగతప్రసన్నునకుఁ గృపా
ధామునకున్ బ్రణమజ్జన, కామితఫలదునకుఁ బరమకల్యాణునకున్.

30


క.

లక్ష్మీవల్లభునకు శుభ, లక్ష్మోజ్జ్వలవక్షునకు నలభ్యాప్తనచ
స్ఫూక్ష్మార్థరూపునకు భవ, యక్ష్మనిరసనైక నిరుపమౌషధమునకున్.

31


క.

నిత్యవివేకాపేక్షని, రత్యయతత్వునకు నిరుపమాసత్త్వునకున్
నిత్యప్రహ్లాదవచః, ప్రత్యయసిద్ధునకుఁ బరమకపరిశుద్ధునకున్.

32


క.

ప్రసభసభాస్తంభారణి, విసృమరతేజోగ్నిమఖహవిర్భాగకళా
రసికాసురపశుయజనో, ల్లసనసుసంతర్పితాఖిలనిలింపునకున్.

33


క.

కంసారికి నాత్మేచ్ఛా, సంసారికి మౌనిమానసస్ఫుటకేలీ
హంసమునకు దైవికులో, త్తంసమునకు దళితకలికి దండితలలికిన్.

34


క.

ఆధారవీథిపథికా, రాధితున కగాధమధ్యరంధ్రసుధాధా
రాధౌతప్రసృమరధా, రాధరధామాంగుసకు ధరాభరణునకున్.

35


క.

భీమానుజవరదునకును, రామానుజవరదునకు శరణ్యునకును సు
త్రామానుప్రభువునకును, రామానుప్రభువునకుఁ బురాతనమునికిన్.

36

క.

భవనాశనీమహాన ,ద్యవగాహనవిమలబుధజనాంతఃకరణ
న్యవసితసులభున కురుత,ర భవనజసింహత్వదళితభవకలభునకున్.

37


క.

గరుడాచలాంచలోజ్జ్వల, గరుడాసీనునకు సిద్ధగరుడామరుకున్
నరసఖమిథునోద్ధతివి, స్ఫురదపదానునకు నిత్యశుభధానునకున్.

38


క.

సారాన్వయధీవిద్యా, సారలసత్పుత్త్రపౌత్త్రసంపద్గుణసం
భారమదీయహితార్యో, దారపరిజ్ఞాతకల్పతరుఫలమునకున్.

39


క.

జ్ఞానబలశౌర్యసుఖసం, తానైశ్వర్యాదివిభవదాయిదయావి
ద్యానిత్యశ్రీఘనునకు, శ్రీనరసింహునకు భక్తచింతామణికిన్.

40