Jump to content

నా జీవిత యాత్ర-3/బ్రిటిష్ వారికి పెట్టిన గడువు

వికీసోర్స్ నుండి

6

బ్రిటిష్ వారికి పెట్టిన గడువు

మహాత్మా గాంధీగారి సహకారంతో మోతీలాల్ నెహ్రూగారు కలకత్తా కాంగ్రెస్ అధ్యక్షుడుగా మదరాసు కాంగ్రెస్‌లో ఆమోదించబడిన 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని బుట్ట దాఖలు చేయడానికి చేసిన ప్రయత్నంపట్ల జవహర్‌లాల్ నెహ్రూ, సుభాస్‌చంద్రబోస్, శ్రీనివాసయ్యంగారు ప్రభృతులకు ప్రతికూల భావం ఉంది.

మదరాసు కాంగ్రెస్ ఆమోదించిన అ 'స్వాతంత్ర్య' తీర్మానాన్నే ఆశయంగా పెట్టుకుని, కలకత్తా కాంగ్రెస్ విషయ నిర్దారణ సంఘంలో, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాస్‌చంద్రబోసూ కూడా, గాంధీగారి సహకారంతో పండిత మోతీలాల్‌నెహ్రూ ప్రతిపాదించిన 'తగు మాత్రపు' కోర్కెలకే తమ ఆమోదాన్ని వెలిబుచ్చారు. కాని బాగా ఆలోచించిన మీదట వారికి 'స్వాతంత్ర్య' తీర్మానం బలహీనమయి పోతోందేమోననే అనుమానం కలిగి, మోతీలాల్‌నెహ్రూగారి ప్రతిపాదనకు ఒక సవరణ సూచించారు.

సుభాస్ - జవహర్ల సవరణ

మున్ముందుగా కలకత్తా కాంగ్రెస్ మదరాసు కాంగ్రెస్ ఆమోదించిన 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని బలపరుస్తూ, పూర్తిగా బ్రిటిషువారు భారతదేశం నుంచి వైతొలగితేగాని భారత దేశానికి సిసలయిన స్వాతంత్ర్యం లభించదనీ; 2. (మోతీలాల్) నెహ్రూ కమిటీవారి ప్రతిపాదనలు ఆంగ్లేయ ప్రభుత్వం వారికి అంగీకార యోగ్యం అయ్యే ఎడల ఆ ప్రతిపాదనలను మా అవసరాలుగా భావించి అంగీకరించి తీరాలనీ; 3. నెహ్రూ కమిటీవారి సూచనలు కాంగ్రెసు వారికి మాత్రమే నచ్చినవిగా ఉండి, మదరాసు కాంగ్రెస్ అసలు కోరికకి విరుద్ధంగా ఉన్న కారణాన్ని, ఆ సూచనలు అంగీకరించడమన్నది ఆంగ్లేయుల హృదయ పరివర్తనకు మొట్టమొదటి మెట్టుగానే భావించబడుతుందనీ ఆ సవరణలో సూచించబడింది.

సరిగా యోచిస్తే ఈ సవరణ తీర్మానానికీ, 'స్వాతంత్ర్యమే మా ఆశయం' అంటూ విషయ నిర్ధారణ సంఘం ప్రతిపాదించిన రాజీ తీర్మానానికీ, మొదటి మెట్టుగా ప్రతిపాదించిన అఖిల పక్ష సమావేశం వారి యోచనకీ తేడా ఉన్నట్లు లేదు. కాని జవహర్‌లాలూ, సుభాస్‌బోసూ తమ సవరణ అసలు దానికి భిన్నమని నమ్మాడాన్ని ఆ తీర్మానం ప్రతిపాదించినట్లు కనబడుతుంది. అసలు ఆ రాజీ తీర్మానం వీరి జోక్యం లేకుండా ప్రతిపాదించడం జరిగింది. అందువల్ల వీరికి అనుమానం కలిగి, దానినే తమ భాషలో సవరణ తీర్మాన రూపేణా తిరిగి ప్రతిపాదించారనుకోవలసి ఉంటుంది.

ఏదయితేనేం, నేను లోగడ మనవి చేసినట్లు, ఆ 'స్వాతంత్ర్య' తీర్మానాన్నే కలకత్తాలో బలపరచి ఆంగ్లేయులకు అందజేసి ఉంటే, కాంగ్రెసుకున్న బలమూ, పట్టుదలా సైమన్ కమిషన్ వారికి పూర్తిగా గ్రాహ్యం అయి, వారి సలహా ఇతోధికంగా ఉపకారిగా ఉండేది. మన నాయకులలో ఉండే బలహీనత కారణంగానే, సైమన్ కమిషన్ వారు, ఏ విధమయిన పూచీగాని, బాధ్యతగాని లేని విధంగా, 'ప్రొవిన్షియల్ ఆటోనమీ' అనే దుష్టగ్రహ కూటంలోకి లాక్కు వెళ్ళగల విరుద్ధ భావాలతో కూడుకున్న ఒక పెడరేషన్ని (పరస్పర సహాయక రాజకీయ సంఘాన్ని) మన నెత్తిని రుద్దడానికి తయారయ్యేవారు. మన నాయకులు 1928 - 29 లో చేసిన పొరపాట్లకీ, 1917 - 18 లో మాంటేగ్ - ఛల్మ్‌స్పర్డు కమిషన్‌వారు వచ్చే ముందు చేసిన పొరపాట్లకీ తేడాలేదు. ఆనాటి పొరపాట్లే ఈనాడూ జరిగాయి. ఎటొచ్చీ ఒక్కటే తేడా - మాంటేగ్ కమిషన్ని ఆహ్వానించి వందనా లర్పించాం; సైమన్ కమిషన్ని బహిష్కరించి, గో బాక్, అన్నాం. ఆ మాంటేగ్ కూడా అంతే చేశా డనుకోండి. కాంగ్రెసు ఆశయాలకూ, కోర్కెలకూ భిన్నంగా ఏదో వాగి, ఏదో వ్రాసిపోయాడు. ఆ స్టేట్‌మెంట్లకు తన డయ్‌రీలో భాష్యాలు వ్రాసుకుని, తమ రిపోర్ట్‌లో అల్లా వ్రాయడానికి కారణాలుగా ఆ భాష్యాలను దర్మిలా ప్రకటించాడు.

శాసన ధిక్కారానికి ఉద్యుక్తత

1928 లో కాంగ్రెసువారి కోరిక బలీయంగా ఉన్నప్పుడు మోతీలాల్ నెహ్రూ తన అధ్యక్షోపన్యాసంలో ప్రభుత్వంవారు దయదలచి యేమిచ్చినా సరేనని; రౌండు టేబిల్ కాన్ఫరెన్స్‌కు పిలుపువచ్చే రోజులలో, ఆ సమావేశంలో ఏం జరిగినా, బ్రిటిషువారు తాము భారత దేశానికి ఇవ్వాలని అనుకుంటూన్న దేమిటో ఆ క్షణంలోనే విశదపరచ వలసిందనీ కోరారు. ఏదయితేనేం, కలకత్తా తీర్మానం కాంగ్రెసువారి ప్రతిభనూ, ప్రతిష్ఠనూ అధికం చెయ్యలేకపోయింది.

కాని కలకత్తా కాంగ్రెస్‌లో తేలినదల్లా ఒక్కటే: మోతీలాల్ నెహ్రూగారికి, తాము 1921 - 22 నుంచీ పి. ఆర్. దాస్‌గారితోపాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న పార్లమెంటరీ విధానంపట్ల విముఖత కలిగిందన్నది.

కాంగ్రెసువారు, శాసన సభల నుంచి బయటికి వచ్చి శాసన ధిక్కారం ఆరంభించే ముందు బ్రిటన్‌కి ఒక్క యేడాది గడువివ్వాలనీ, అ గడువులోపల ఇండియకి స్వాతంత్ర్యం ఇవ్వడానికి ఆంగ్లేయుల కంగీకారం కాకపోతే, అ గడువు దాటగానే శాసన ధిక్కార కార్యక్రమం అమలు పరచాలనీ నిర్ణయించుకున్నారు.

బ్రిటన్‌ కిచ్చిన అల్టిమేటం

బ్రిటిషువారికి ఆఖరి సంధి షరతుగా ఇచ్చిన ఈ అల్టిమేటం తీర్మాన రూపం దాల్చేముందు గాంధీగారికీ, సుభాస్‌చంద్రబోస్, శ్రీనివాసయ్యంగార్లకీ మధ్య ఒక ఆశాజనకమైన, ముచ్చట గొలిపే వాదన జరిగింది. గవర్నమెంట్‌వారు భారత దేశానికి రాజ్యవిధానంలో ఏవో మార్పులు చూపిస్తామని అంటున్నారు గనుక, వారికి 24 మాసాల గడువు ఇవ్వాలని గాంధీగారు సూచించారు. అ వాయిదా అతి దీర్ఘం అయిపోతుందని బోస్, శ్రీనివాసయ్యంగార్లు అన్నారు. అప్పుడు గాంధీగారు ఏడాది గడువుకు ఒప్పుకున్నారు.

ఒప్పుకుంటూ ఒప్పుకుంటూ, "మీరు యీ ఏడాది నాటికి దేశాన్ని శాసన ధిక్కారాదులకు తయారు చేయవలసిన బాధ్యత వహించవలసి ఉంటుం" దన్నారు. గాంధీగారు ఏడాది నాటికి దేశాన్ని సిద్ధం చెయ్యవలసి ఉంటుందన్న మాటలలోని అంతరార్థం శ్రీనివాసయ్యంగారికి గ్రాహ్యం అయినట్లు లేదు.

కలకత్తాలో అంగీకరించబడిన కాంగ్రెస్ తీర్మాన ప్రకారంగా తెలియవచ్చే దేమిటంటే, కాంగ్రెసువారు కోరిన ఆ కనీసపు కోరిక నయినా 1929 డిసెంబరు 31 వ తేదీ అర్ధరాత్రికి ఆంగ్లేయులు అంగీకరించకపోయినట్ల యితే దేశాన్ని శాసన ధిక్కారం చేయవలసిందని కోరవలసి ఉంటుందనీ, శాసనోల్లంఘనం అంటే పన్నుల నిరాకరణ సాగిస్తామనీ, ప్రభుత్వం వారినుంచి యే విధమయిన సహకారమూ కోరకుండా (తమ్ము తామే కాపాడుకుంటూ, ప్రత్యామ్నాయ ప్రభుత్వం నడపబడడం వరకూ) తమ్ము తామే చూచుకుంటామనీ ఆ తీర్మానంలో సూచించబడింది.

గాంధీగారికి తిరిగి కాంగ్రెసు అప్పగింత

దీన్తో కాంగ్రెసులోని రెండు విభాగాలవారూ ఐక్యమయి ప్రత్యక్ష చర్యలకు పూనుకుంటారని తేలింది. అంతేకాదు. 1924 లో బెల్గాంలో దాస్ - మోతీలాల్‌గార్ల పరమయిన కాంగ్రెసు నేడు తిరిగి గాంధీగారి చేతులలో ఉంచబడిందన్నమాట! మోతీలాల్ నెహ్రూగారు సత్యాగ్రహ సమర మూలసూత్రంతో వెంటనేగాని, సులభంగా గాని, మనస్ఫూర్తిగా గాని సమాధాన పడలేక పోయారు. అందువల్లనే, నిర్వీర్యమయిన జాతిని ఉత్తేజపరచి, దానికి కావలసిన అవసరాలను సరిగా గుర్తించి, ప్రత్యక్ష చర్యకు దిగందే దేశానికి ముక్తిలేదని గ్రహించడానికి ఆయనకి సుదీర్ఘమయిన అయిదు సంవత్సరాలు పట్టింది. ఈ అయిదేండ్లలో పార్లమెంటరీ విధానంతోనూ, రాజీ ప్రతిపాదనలతోనూ, కాళ్ళ బేరాలతోనూ జయాన్ని సాధించాలని తంటాలు పడ్డాడు, పాపం! రాజీ ప్రతిపాదనలకి కూడా వెనుక అనుమతి రూపేణా దమ్ము ఉండాలన్న విషయం ఆయన గ్రహించలేదో, మరచిపోయారో మరి!

1929 లో దేశ పరిస్థితి

ఉడుకురక్తపు యువలోకానికి ప్రాతినిధ్యం వహించే జవహర్‌లాల్ నెహ్రూ, సుభాస్ చంద్రబోసులకు కలకత్తా కాంగ్రెస్‌లో స్వాతంత్ర్య తీర్మానం ఉద్రిక్తత తగ్గి నీరసపడడం ఎంత మాత్రమూ సహింపరాని దయింది. మోతీలాల్ గారికీ, గాంధీగారికీ ఈ యువక నాయకుల తీరులు రుచించలేదని లోగడ చెప్పివున్నాను.

కలకత్తా కాంగ్రెస్, సాంతం అయ్యేనాటికి, 1929 లో లాహోర్ కాంగ్రెస్ అనగానే శాసన ధిక్కారాది ప్రత్యక్ష చర్యలకు సిద్ధమవ్వాలి అన్నమాట అట్టే పట్టించుకున్నట్లు లేదు. అందుకు సాక్ష్యం ఆగష్టు 1929 లో నడచిన శాసన సభా సంరంభాలే. నాయకుల హృదయాలలో అస్థిరత్వం అలాగే ఉంది. కాంగ్రెసు వర్కర్లూ, కాంగ్రెసు కమిటీలూ అసందిగ్ధంగానే పనిచెయ్యటం జరిగింది.

1921 లో శాసన ధిక్కారాన్ని చవిచూసినా, అది యేనాటిమాటో అయిపోయింది. అప్పుడు ఆరంభించబడిన నిర్మాణ కార్యక్రమం నీళ్లుగారిపోయి యేళ్లూ - పూళ్లూ అయిపోయింది. దేశం యావత్తూ ఆ సంవత్సరం అంతా అధైర్యంతో అణగారిపోయి ఉంది. కాంగ్రెసువారి దృష్టిలో ఉన్న ఆ యుద్ధకాండ అప్పట్లో అవాంఛనీయమనీ, దానికి యుక్తకాలం రాలేదనీ కేంద్ర శాసన సభా కార్యక్రమ విమర్శకులు అన్నారంటే, వారు అల్లా అనడంలో పొరపాటు లేదనే అనవలసి ఉంటుంది.

కాని నిజానికి వారికిగాని, ప్రభుత్వానికి గాని ప్రజలు యుద్ధానికి ఏనాడో సిద్ధమయ్యేఉన్నారనీ, ఇన్నాళ్ళబట్టి వారి ఉద్రేకాలు నొక్కి పెట్టబడి ఉన్నాయనీ తెలియదు. గాంధీగారికి మాత్రం దేశం ఎప్పుడూ తనకు దమ్ముగా ఉంటూ, తనతోపాటు రంగంలో ఉరకడానికి సిద్ధంగానే ఉందని బాగా తెలుసు. ప్రజలు సిద్ధంగా లేకపోయినా, ఆయన మార్గదర్శిగా ఉంటే, జనం ఆయన వెనకే ఉంటారనీ ఆయన తిరుగులేని విశ్వాసంతో ఉన్నారు.

పరిస్థితుల యాథార్థ్యాన్ని గ్రహించి, ఆయన, కాంగ్రెసు నాయకులతో గాక, తన ఆశ్రమంలోని అనుచరులతో 1930 లో ఉప్పు సత్యాగ్రహానికి తలపడ్డారు. నాయకులచేత సరిగా ప్రబోధితులుగాని ప్రజలను ఎల్లా నడపాలో గాంధీగారికి బాగా తెలుసు.

అప్పట్లో నాయకులు తమకు కాంగ్రెసులో ఎటువంటి పలుకుబడి ఉందో, తమకు ఎంతెంత బలం ఉందో అని తమలో తాము తర్జన భర్జనలు పడుతూన్నారన్నా, ఆ మాట అసత్యం కాదు. అందుచేతనే గాంధీగారికి తన కార్యక్రమం యావత్తూ ముందుగా విప్పిచెప్పడం మామూలు లేదు. ఆయన ఇప్పుడూ అంతే చేశాడు.

దండీ యాత్ర

ఆయన ఉప్పుచట్టాన్ని తునాతునకలు చెయ్యాలని అంటే, ఆ మాట కాంగ్రెసు నాయకులకూ, కాంగ్రెసు సేవకులకూ దిగ్భ్రమ కలిగించింది. మామూలు జనానికి అంతూ పొంతూ చిక్కలేదు. ఉప్పేమిటి - చట్టాలేమిటి - వాటిని ఉల్లంఘించడమేమిటి అనుకున్నారు. మామూలు జనానికి ఏం అర్థమవుతుంది గనక! అసలు, ఆ చట్టాన్ని ఛిన్నాభిన్నం చెయ్యడం అంటే ఏమిటి? అది ఎలా సాధ్యం అవుతుందో అర్థమే కాలేదు. ఈ విషయాలన్నీ ప్రజలు గ్రహించడానికి వీలుగా ఆయన సబర్మతి నుంచి కాలినడకని, 'దండీ' చేరడానికి ఇరవయ్యొక్క రోజుల కార్యక్రమం వేశాడు. రోజు తర్వాత రోజు ఆయన తన ఆశ్రమవాసులైన స్త్రీ పురుషులతో కలిపి యాత్ర సాగిస్తూ, దారిలో అక్కడక్కడ ఇస్తూ వచ్చిన చిన్న చిన్న ఉపన్యాసాలు దేశానికి నిద్రమత్తు వదలగొట్టాయి. ఉప్పును ఏరుకోడానికి దండీకి ఆశ్రమవాసులతో దండయాత్రగా గాంధీగారు వెళ్ళడం అన్నది చరిత్రాత్మకమై, దేశీయుల కందరికీ ప్రత్యక్షపాఠం అయింది.

ఈ పరిస్థితులే నాకు ఉత్సాహా న్నిచ్చి కేంద్ర శాసనసభలో నాచేత జోస్యం చెప్పించి, జయం తధ్య మని పలికించాయి. దారి ఎప్పుడయితే చూపబడిందో, మూలసూత్రం చెడకుండా నూతన మార్గాన్వేషణలు చేయగలిగిన మన నాయకులు కొద్ది రోజులలోనే రకరకాల కార్యక్రమాలు నిర్ణయించుకో గలిగారు. ప్రభుత్వంవారు ఆయన్ని నిర్భందిస్తే చేయవలసిందేమిటో కూడా స్పష్టం చేయడంచేత కాంగ్రెసు కమిటీలూ, ప్రజాసమూహాలూ కలిసి, ప్రపంచం కనీ వినీ ఎరుగని రీతిగా, ఒక బ్రహ్మాండమయిన 'శాంతి' యుద్ధంలో ఊహించడానికి సాధ్యంకానంత ఘనంగా విజయాన్ని సాధించడం జరిగింది.

దక్షిణ హిందూ దేశంలో ఈ ఉప్పు సత్యాగ్రహం నడచిన తీరును గురించి చెప్పేలోపల, 1929 నాటి లాహోరు కాంగ్రెసు చరిత్ర, అచ్చట ఎగరవేసిన స్వతంత్ర పతాకాలను గురించీ టూకీగా చెపుతాను.

లాహూరు కాంగ్రెస్ అధ్యక్షత

1921 నుంచి జరిగిన ప్రతి కాంగ్రెస్సూ ఏదోవకరకంగా ఉత్సాహోద్రేకాలను కలిగించి చరిత్రాత్మకమే అయింది. ప్రతీకాంగ్రెస్‌కూ తండోపతండాలుగా జనం రావడమూ, ఉత్సాహపూరిత హృదయాలతో దానికి జీవం పొయ్యడమూ మామాలయింది. కాని ప్రత్యక్ష చర్యలతో విజయాన్ని సాధించడానికీ, విజయవంతంగా కాంగ్రెస్‌ను నడపడానికీ చాలా తేడా ఉంది. అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడం అన్నది ఒక పెద్ద ప్రాధమిక సమస్య. కలకత్తా కాంగ్రెస్‌లో మహాత్మా గాంధీగారి దర్శకత్వాన ప్రభుత్వాన్ని సవాలు చేయడం జరిగాక, రాబోవు కాంగ్రెస్ కెవర్ని అధ్యక్షుడుగా ఎన్నుకోవాలి అన్న సమస్య ఉత్పన్నం అయింది.

ఆరేడు మాసాలపాటు మలయా, సయాం, ఇండోచైనా దేశాలలోని కష్టజీవుల స్థితిగతులెల్లా ఉన్నాయో స్వయంగా తెలుసుకోవాలని ఆ ప్రాంతాలన్నీ కలయ తిరిగి, నేను భార్యా సమేతంగా చరిత్రాత్మకమూ, చిరస్మరణీయమూ అయిన ఆ లాహోరు కాంగ్రెస్‌కు అందుకోగలిగాను. ఆ మూడు దేశాలలోనూ జరిపిన పర్యటన విశేషాలు "స్వరాజ్య పేపరు" అన్న శీర్షిక క్రింద విడిగా వివరిస్తాను.

గాంధీగారి నిర్ణయం

ఓటింగ్ సమయంలో అందరి కళ్లూ గాంధీగారిమీదే ఉన్నాయి. గాంధీగారికి అత్యధికంగా ఓట్లు వచ్చాయి. ఆయనకి వచ్చిన ఓట్లు పది; విఠల్‌భాయ్ పటేల్‌కి అయిదూ, జవహర్‌లాల్‌కి రెండో మూడో ఓట్లు వచ్చాయి. అయితేనేం, గాంధీగారు తగ్గిపోయారు. విఠల్‌భాయ్ తప్పుకున్నాడు. దాన్తో యువకుడయిన జవహర్‌లాల్ నెహ్రూ లాహోరు కాంగ్రెస్ అధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసి వచ్చించి.

అదే గాంధీగారి విచిత్ర పద్ధతి. మదరాసు కాంగ్రెస్‌లో జవహర్‌లాల్ 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని ప్రతిపాదిస్తే, "ఏదో స్కూలు పిల్లల తమాషా" అన్నాడు గాంధీ. కలకత్తాలో మోతీలాల్ నెహ్రూగారితో కలిసి, అ స్వాతంత్ర్య తీర్మానాన్ని వెనక్కి నెట్టి, అన్ని పార్టీలవారికీ అంగీకార యోగ్యమయిన విధంగా అ తీర్మానాన్ని మితవాదంలోకి దింపి, బాగా తేలికపరచి ఆమోదింపజేశాడు. ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా పరిశీలించి, చాలావరకూ నిర్వీర్యం చేయబడిన ఆ తీర్మానాన్నయినా బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించకపోతే ఏడాది నాటికి ప్రత్యక్ష చర్యలకు పూని, మా జాతీయ పతాకం ఎగరవేస్తాం అన్నాడు.

లాహోరు కాంగ్రెస్‌కి పెద్ద మెజారిటితో ఆయన్ని అధ్యక్షుడుగా ఎన్నుకుంటే, తాను మొదటినుంచీ మితవాదిననీ, మితవాదిగానే తాను ఉంటూవున్న కారణాన్ని ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి తాను తగననీ, ఉడుకు రక్తంతో ఉన్న జవహర్ లాంటి యువకుడే ఈ ఉద్రిక్త పరిస్థితులలో అధ్యక్ష స్థానాన్ని అధిష్టించి, దేశాన్ని ప్రత్యక్ష చర్యలకీ, సిసలయిన స్వాతంత్ర్యానికీ లాక్కుని వెళ్ళగలడని భావించే అల్లా చేశాననీ అన్నాడు.

స్వాతంత్ర్య మన్నది కోప తాపాలతోనూ, ఉద్రిక్త రక్తపు పటిమతోనూ సాధించేదికాదనీ, అల్లాంటి తొందరపాటులతోనూ, ఉద్రిక్త పరిస్థితులలోనూ సంపాదించిన స్వాతంత్ర్యం చిరకాలం నిలువదనీ, చిన్నవాళ్ళ కాపురం చితుకుల మంటలా గప్పున చల్లారుతుందనీ ఆయనకు తెలుసు. ప్రత్యక్ష చర్యకు పూనుకునేముందు నిర్మాణ కార్యక్రమమన్నదే ప్రాతిపదికగా ఉండాలనీ, ఆ పద్ధతే సరయినదనీ ఆయనకి తెలుసు.

కాని పరిస్థితులు విషమించి ప్రత్యక్ష చర్య తప్పని సరి అయినప్పుడు స్వయంగా ఆయనే నాయకత్వం వహించి ఉద్యమాన్ని నడిపేవాడు. కాని ఈ మాటు జవహర్‌లాల్ నెహ్రూను నాయకునిగా నిశ్చయించి, కాంగ్రెస్ అధ్యక్షుణ్ణిచేసి, తాను వెనక్కి తగ్గాడు. లాహోరులో "స్వాతంత్ర్య" పతాకం ఎగురవేయించి ఎటువంటి పరిస్థితులలో నయినా అ జెండాని కాపాడి తీరతాం అని ప్రమాణం చేయించి శాసన ధిక్కారానికి దారి చూపించింది లాహోరు కాంగ్రెస్. ఆంగ్లేయులకిచ్చిన గడువు వాయిదా 1929 డిసెంబరు 31 అర్ధ రాత్రితో ముగిసింది. అర్థరాత్రి దాటడంతోనే దేశీయమైన స్వాతంత్ర్య పతాకాన్ని ఎగుర వేయడమూ, సంపాదించిన స్వాతంత్ర్యాన్ని నిలుపుకు తీరతామనే 'స్వాతంత్ర్య' ప్రమాణాన్ని తీసుకోవడమూ జరిగాయి.

ఇండిపెండెంట్ పార్టీ

సుభాస్ చంద్రబోస్ - శ్రీనివాసయ్యంగార్ల అభిప్రాయాలకూ, కాంగ్రెసువా రవలంబిస్తూన్న విధానానికీ పొంతనం కుదరలేదు. 1922 గయా కాంగ్రెస్‌లో అపజయం సంభవించిన తరవాత దాస్ - నెహ్రూ గారలు కలిసి స్వరాజ్యపార్టీని స్థాపించడం, వారి మనోపథంలో మెదిలి, అటువంటి చర్యకే వారు దారి తీశారు.

కాంగ్రెసులో వ్యక్తంచేసిన వారి అభిప్రాయం యెప్పుడయితే అంగీకరించబడలేదో, ఆ తక్షణం 'ఇండిపెండెంట్‌' పార్టీ అన్న పేరుతో ఒక పార్టీని స్థాపించారు. దేశంలో వున్న ఇతర పార్టీ లన్నింటితోనూ కలిసి, పరస్పర సహాయ సహకారాలతో ముందుకు నడవా లనుకున్నారు.

ప్రత్యక్ష చర్యకు విరుద్ధంగా ఏర్పడిన ఈ 'ఇండిపెండెంట్‌' పార్టీలో నేను చేరలేదు. కాంగ్రెసు తీర్మానంతో అసంతృప్తి కలిగిన నాకు, ప్రత్యక్ష చర్యలో పాల్గొని జైలు శిక్షను వాంఛించే ముందు, కేంద్ర శాసన సభనుంచి వైదొలగడం న్యాయమని తోచింది. వేరే సందర్భంలో, కాంగ్రెసుపార్టీ సభ్యునిగా విరమించుకుని, స్వంత శక్తిమీద ఆధారపడి, తిరిగి కేంద్ర శాసన సభలో ప్రవేశించి, వెంటనే ఎల్లా సమర రంగంలోకి దూకిందీ వివరించే ఉన్నాను.

శ్రీనివాసయ్యంగారి తత్వం

ప్రత్యక్ష చర్య, యుద్ధం, జెయిలు లాటి ప్రశ్నలు ఉత్పన్నమయినప్పు డెప్పుడూ కూడా శ్రీనివాసయ్యంగారి ప్రవృత్తిలో గమనించ తగ్గ మార్పులు కనబడుతూనే ఉన్నాయి. ఇదివరలో సైమన్ కమిషన్ రాక సందర్భంలో, ఆయన నన్ను ఒక ఇరకాటంలో పెట్టి, తాను మదరాసు ప్రయాణం విరమించుకుని, నన్ను చికాకులపాలు చేసిన ఉదంతం వివరించే ఉన్నాను.

ఇప్పుడు మళ్ళీ ఈ "ఉప్పు" గొడవ ఒకటి ఆయన పీకలమీదికి అనుకోని విధంగా వచ్చి పడింది. ఆయన సుభాస్‌చంద్రునితో కలిసి, సవాలు వాయిదా కాలం రెండు సంవత్సరాలంటే చాలా దీర్ఘం అవుతుంది, దానిని ఒక్క సంవత్సరానికి తగ్గించమని కోరిన సందర్భంలో, గాంధీగారు ఆ సవరణ నంగీకరిస్తూ, సంవత్సరం ఆఖరు నాటికి మీరు సిద్ధంగా ఉండాలి అని అన్నప్పుడు, పాపం, శ్రీనివాసయ్యంగారికి ఆ పలుకులలోని అంతరార్థం అర్థమయి ఉండదు.

ఏడాది గడువు కాలంలోనూ, దేశాన్ని ఏ విధంగానూ ప్రత్యక్ష చర్యకు సిద్ధపరచకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని, చివరికి ప్రత్యక్ష చర్యలో పాల్గొనవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, ప్రత్యక్ష చర్య అంటే అపహ్యించుకునే ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తామంటూ ఒక క్రొత్త పార్టీ స్థాపించాడు. ఇవి ఆయన ఘనకార్యాలు.