నా జీవిత యాత్ర-3/కాంగ్రెసుపై నా తిరుగుబాటు

వికీసోర్స్ నుండి

7

కాంగ్రెసుపై నా తిరుగుబాటు

శాసన సభ నుంచి వై దొలగి, శాసన ధిక్కారానికి దిగిన ఉదంతాన్ని గురించి కాస్త ప్రస్తావించాలని ఉంది. సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం అత్యంత విజయవంతంగా, శాసన సభలో సభ్యులంగా ఉంటూనే నడిపించాము. చాలాకాలం తర్వాత 1940 లో ఏడు రాష్ట్రాలలో కాంగ్రెసు ప్రభుత్వాలను నడుపుతూ, శాసన సభ్యత్వాలకూ, మంత్రిత్వాది హోదాలకూ రాజీనామాలు ఇవ్వకుండానే జెయిళ్ళకి సిద్ధమయి పాల్గొనిన శాసన ధిక్కారపు టలజడిలో తిరిగీ ఒక ఘన విజయాన్నే సాధించాం.

మోతీలాల్‌గారితో భేదాభిప్రాయం

అ 1921 నాటి మొదటి శాసన ధిక్కారపు రోజులలో శాసన సభా సభ్యత్వాలకు రాజీనామా లిచ్చి ప్రత్యక్ష చర్యకు దిగి విజయాన్ని సాధించి ఉన్నా, 1930 లో బ్రిటిషువారికి సవాలుగా ఇచ్చిన సంవత్సరం గడువూ తీరి, 1930 లో ప్రత్యక్ష చర్యకు పూనుకునే ముందు మా శాసన సభా సభ్యత్వాలకు రాజీనామాలు ఇవ్వనవసరం లేదని నేను ఎంత వాదించినా, మోతీలాల్‌గారు ఒప్పుకోలేదు. ఆయన తనకు గలిగిన పార్ల మెంటరీ అనుభవాలతో విసుగు చెంది ఉన్నాడు. అందువల్ల ఆయన రాజీనామా లిచ్చి తీరాలని పట్టుపట్టాడు.

మోతీలాల్‌గారిని లాహోరు కాంగ్రెసు రోజులలో త్రివిధ బహిష్కరణ విధానాన్ని తిరిగీ అమలు జరుప వలసిందని కోరినప్పుడు, ఆయన ఈ విషయంలో తాను, గాంధీగారి అనుమతితోనే, పాల్గొన బోవటం లేదని చెప్పాడు. అటువంటి చికాకు పరిస్థితులలో ఆయన ఇచ్చే జవాబులు ఎప్పుడూ, మోటుగానూ, ఘాటుగానూ, అహంకార పూరితంగానూ ఉండేవి. హక్కునుబట్టి జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెసు అధ్యక్షుడే అయినా, పండిత మోతీలాల్ నెహ్రూ మాత్రం నిజంగా ప్రెసిడెంటే! జవహర్‌లాల్ నెహ్రూతో ఏ విషయం గురించీ విడిగా తర్కించవలసిన అవసరమే ఉండేది కాదు.

గాంధీగారు రాజీనామా లివ్వాలా, అక్కర లేదా అనే విషయంమీద ఆసక్తే చూపలేదు. నాకేమో మోతీలాల్ నెహ్రూగారితో ఏకీభవించాలని లేదు. రాజీనామా లివ్వకుండానే, శాసన సభా సభ్యత్వంతోనే జెయిళ్ళకు వెళ్ళడమనేదే మా ఉద్యమానికి బలం అని నా భావన. వారు నా ప్రతిపాదనకు అంగీకరించకపోయే సరికి నేను రాజీనామా ప్రతిపాదనకు వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తపరచి, అ కాంగ్రెస్ బహిరంగ సమావేశాలలో వారి విధానం సవాలు చేసి, నేను ఏ సంఘం తరపునా కాకుండా స్వశక్తిమీదనే ఎన్నికయి తిరిగి కౌన్సిల్‌లోకి రాగలనని ధీమాగా చెప్పాను.

రాష్ట్ర కాంగ్రెసు సంఘంలో చర్చ

అ ప్రకారం కొద్దికాలం నేను కాంగ్రెసుపై తిరుగుబాటు చేశాను. నా చర్యకు మా రాష్ట్ర కాంగ్రెసు సంఘంమాత్రం బాధపడింది. 1930 ప్రారంభ దినాలలో నేను రాజీనామా ఇస్తాను, మళ్ళీ ఎన్నికలలో పాల్గొంటాను అని కాకినాడలో జరిగిన రాష్ట్ర కాంగ్రెసు కమిటీ మీటింగ్‌లో అన్నప్పుడు, నా సన్నిహిత మిత్రులు చాలా బాధ పడ్డారు. ఆ మీటింగులో నాకు బాగా సన్నిహితుడైన యువక మిత్రుడు, కీ॥ శే॥ డా. సుబ్రహ్మణ్యం, నిజంగా చాలా బాధపడ్డాడు. ఆయన చాలాకాలం నుంచీ నో - ఛేంజ్ వర్గానికి చెంది, గాంధీగారి అడుగు జాడలలో నడుస్తున్నాడు.

ఈ కాంగ్రెసు ఉద్యమం ఆరంభమయిన నాటినుంచీ, నా యందుండే గౌరవాభిమానాలతో, నాకు సన్నిహితుడుగా, నన్ను అంటిపెట్టుకునే ఉండేవాడు. పాపం, అతడు నిజంగా మన:క్లేశంతో, "మీరు కాంగ్రెసుతో కయ్యం బెట్టుకొని, రాజీనామా ఇచ్చి, తిరిగి ఎన్నికలకు నిలిస్తే, మీకు ఓటు ఎవ రిస్తా"రని అడిగాడు. "ఏం జరుగుతుందో కాస్త తమాయించుకుని చూడవోయి" అన్నాను నేను. "మీరూ, మీ కాంగ్రెసు మెంబర్లూ నాకు ఓటు చేయకపోయినా, నాకు వ్యతిరేకంగా ప్రచారంచేసి నన్ను పడగొట్టాలని చూసినా, ప్రజలు ఎప్పుడూ నావైపే ఉండి నన్ను గెలిపించి తీర్తా"రన్నాను.

ఆవెంటనే మిత్రులు ముళ్ళపూడి పళ్ళంరాజూ, మారిన నరసన్నా లేచి, "కాంగ్రెసు సభ్యులం అయిన మనం ఓటు చేసినా చెయ్యకపోయినా, ప్రజలలో నూటికి 95 మంది ఆయనకే నిస్సంశయంగా ఓటు చేస్తా" రన్నారు. "అంతేకాదు ఈమధ్య ఆయన ప్రజలకోసం చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా, ఆయన రీసెటిల్మెంట్ రేట్లు హెచ్చించాలన్న ఒక్క ప్రతిపాదన చాలు. దీనికి తోడు, ఆయనకున్న పలుకుబడీ అవీ అల్లాగే ఉన్నాయి. అందువల్ల ఎలాంటి పరిస్థితులలో నయినా ఆయన్ని ఎవ్వరూ వదులుకోరు. అంతా ఆయనకే మద్ధత్తు ఇస్తా" రని కూడా వారన్నారు.

ఆ ఇరువురూ ముఖ్యమయిన కమిటీ మెంబర్లు. వారే ఇలాంటి బహిరంగ ప్రకటన చేసే సరికి, డా॥ సుబ్రహ్మణ్యం లాంటి మిత్రులకు చాలా ఆశ్చర్యంవేసింది. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘ అధ్యక్ష పదవికి, శాసన సభా సభ్యత్వానికీ నేను ఇచ్చిన రాజీనామాలు అంగీకరించబడ్డాయి. నేనొక స్వతంత్ర్య వ్యక్తినయ్యాను. ఎన్నికలకి నన్ను నా సొంత టికెట్ మీదే నామినేట్ చేశారు.

సొంత టికెట్‌మీద పోటీ లేకుండా ఎన్నిక

నా నామినేషన్ బందరులో దాఖలు చేయవలసి ఉంది. నా నియోజక వర్గం కృష్ణాజిల్లా, తూర్పు పశ్చిమ గోదావరి మండలాలూను. నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీవరకూ దేశంలో రకరకాల పుకార్లుండేవి. నాకు పోటీ ఉంటుందనీ, మొదటినుంచీ కాంగ్రెసుపార్టీ వారికి పోటీ దారులే అయిన జస్టిస్ పార్టీవారూ, తదితర పార్టీలవారూ, నేను కాంగ్రెసును కాదని దెబ్బలాడి బయటికి వచ్చిన కారణంగా కాంగ్రెసు వారూ పోటీగా అభ్యర్థులను నిలబెడతారనీ ఎన్నోరకాల పుకార్లుండేవి. నేను స్థిరమయిన కాంగ్రెసువాదిగా జస్టిస్ పార్టీవారినీ, లిబరల్ పార్టీవారినీ, తదితర పార్టీలవారినీ విమర్శిస్తూ, వారిని చులకన చేస్తూ శాసన సభలోకూడా మాటాడుతూన్నా, నిజంగా ఆ పార్టీలలో నాకు విరోధు లెవ్వరూ లేరు. ఏ పార్టీ వారు నాకు ప్రత్యర్థిగా ఏ వ్యక్తినీ నిలబెట్టలేదు. దాన్తో ఇంకో పుకారు లేవదీశారు. నా సన్నిహితులయిన కాంగ్రెసువారే, నా విధానంవల్ల వచ్చిన చికాకులవల్ల, నాకు ఇబ్బంది కలుగజేయడంకోసం ఎవరినైనా ప్రత్యర్థిగా నిలబెట్టి తీరతారనీ, వారూ వీరూ అనడం ఆరంభించారు. కాని కాంగ్రెసువారూ బాగా ఆలోచించుకుని నాకు ప్రత్యర్థిగా ఇంకొకరిని నిలబెట్టాలనే అభిప్రాయం విడిచిపెట్టారు. దాన్తో, నా సొంత టికెట్ మీదనే నేను ఏవిధమయిన పోటీ లేకుండా, ఏకగ్రీవంగా కేంద్ర శాసన సభకి ఎన్నికయినట్లు నిర్ధారణయిపోయింది.

సభాప్రవేశం పట్ల నిరుత్సాహం

కాంగ్రెసు నాయకత్వంతో నాకు వచ్చిన అభిప్రాయ భేదాలవల్ల రాజీనామా ఇచ్చి, నా సొంత టికెట్‌మీద ఎన్నికయ్యానేగాని నాకు నిజంగా శాసన సభాకార్యక్రమాలలో పాల్గొనాలనే అభిలాష లేకపోయింది. నా ఉత్సాహము నీళ్ళుగారిపోయిందా? ఏమోమరి. నేను 1930 ఆరంభంలో జరిగిన శాసన సభా సమావేశాలకు హాజరు కాలేదు.

కాంగ్రెసు వారందరూ శాసన సభనుంచి వై దొలగినా, సభాధ్యక్షుడుగా విఠల్‌భాయ్ పటేల్ మాత్రం శాసన సభని అంటి పెట్టుకుని వుండక తప్పలేదు. ఏ పరిస్థితి కయినా తట్టుకుని నిర్వహించుకు రాగల ప్రజ్ఞాశాలి ఆయన.

కాంగ్రెసు ఆదేశాన్ని వ్యతిరేకించి, కాంగ్రెసు సభ్యులతోపాటు రాజీనామా ఇవ్వకుండా, శాసన సభనే అంటిపెట్టుకుని ఉండి, కొందరు పెద్దలు శాసన సభలో ఇంకో కొత్త పార్టీని లేవదీసి, దానికి "కాంగ్రెసు నేషనలిస్ట్ పార్టీ" అని నామకరణం చేశారు.

పోలీస్‌గార్డ్ ఉదంతం

నేను విదేశాలలో పర్యటిస్తూన్న ఆ 1929 ఉత్తరార్ధంలో కేంద్ర శాసన సభలో బాంబులు విసరబడ్డాయి. అ కారణంగానూ, ఇతర కారణాలవల్లా, 1930 ఆరంభంలో అధ్యక్షుడు విఠల్‌భాయ్ పోలీసుగార్డ్ అసెంబ్లీలోపలికి రాకుండా తలుపులు మూయించాడు, ప్రభుత్వంవారు సభ్యుల రక్షణార్థం పోలీసుగార్డ్ లోపల ఉండితీరాలని పట్టుబట్టినా, విఠల్‌భాయ్ దానికి అభ్యంతరం చెప్పాడు.

ఈ పాయింటుమీద ప్రభుత్వంవారికీ, ప్రెసిడెంట్‌గారికీ మధ్య ఒక కలహం తలయెత్తింది. పోలీసు సహాయంతో తాను కార్యక్రమం నడిపించడ మన్నది తన ప్రతిష్ఠకు భంగకరం గనుక, ఎలాంటి పరిస్థితులలోనూ పోలీసుగార్డ్ లోపలికి రాకూడదన్నాడు. వారిని రానివ్వడమో, రానివ్వకపోవడమో అన్నది తన ఇష్టానిష్టాలతో కూడుకున్నదనీ, ఆ విషయం నిర్ధారణ చేయగల హక్కు తనకున్నదనీ ఆయన అన్నాడు.

పోలీసులు తన ఇష్టానికి వ్యతిరేకంగా లోపలికి రాకుండా ఉండడానికిగాను, అ శాసన సభా భవన ద్వారాలు బందు చేయించాడు. ప్రేక్షకులను రానీయడం విషయంలో కట్టుబాట్లు బిగించాడు. మూసిన తలుపుల వెనక కార్యక్రమాలన్నీ కొనసాగింప జేశాడు.

విఠల్‌భాయ్ పంపిన కబురు

కాంగ్రెసువారు సభనుంచి నిష్క్రమించడం విఠల్‌భాయ్‌కి కష్టంగానే ఉంది. నేను కాంగ్రెసు నుంచి వై దొలగడమూ, తిరిగీ నా సొంత టిక్కెట్టుమీద ఎన్నిక అవడమూ మొదలయిన కథంతా విని ఉండడాన్ని, ఆ సమావేశాల ఆఖరిరోజులలో, నన్ను ఢిల్లీవచ్చి ఆయనకు సహకారిగా ఉండమని ఆయన కోరాడు. నాకు టెలిగ్రాం ద్వారా కాంగ్రెసు నేషనలిస్ట్ పార్టీవారివద్ద నుంచి ఆహ్వానం వచ్చింది. నాకు పార్టీ నాయకత్వం ఇస్తామనీ, వెంటనే వచ్చి వారి పార్టీలో చేరమనీ ఆ ఆహ్వానం. ఇది నేను ఎన్నిక అయిన వెంటనే జరిగిన సంగతి.

అ ఆహ్వానానికి సమాధానమిస్తూ, నేను కాంగ్రెసువారి చిన్న చూపుకు సహించలేక రాజీనామా ఇచ్చి, మళ్ళీ నా సొంత టికెట్‌మీద, నా శక్తిని నిరూపించే ఉద్దేశంతో ఎన్నికయ్యానుగాని, నాకు శాసన సభా సభ్యత్వంమీద మోజుఉండి కాదనీ, అందువల్ల అసెంబ్లీ సభలకు హాజరవ్వాలనే ఉద్దేశం లేదనీ తెలియ జేశాను.

విఠల్‌భాయ్ వద్దనుంచి నా కా 'పిలుపు' వచ్చేవరకూ, నాకు ఆ అభిప్రాయమే (అసెంబ్లీకి వెళ్ళకూడదని) గట్టిగా ఉండేది. విఠల్‌భాయ్ గారు చెప్పి పంపించిన ఈ సమాచారం ఇంకొక అసెంబ్లీ సభ్యుడు మోసుకొచ్చాడు. ఆయన నాకు సన్నిహిత మిత్రుడు. పోలీసుకు శాసన సభలో ప్రవేశం లేకుండా ఆయన తీసుకున్న చర్యలగురించి, వాటి పర్యవసానాల గురించీ కూడా విన్నాను. నిజంగా ఆయనతప్ప ఏ ఇతర అధ్యక్షుడూ సాహసించి అల్లా వ్యవహరించి ఉండలేడన్న విషయం గ్రహించాను.

ఢిల్లీ ప్రయాణం

ఢిల్లీకి ప్రయాణమై వెళ్ళి, వారిని వారి ఇంటివద్ద కలుసుకుని, సంగతి సందర్భాలన్నీ దీర్ఘంగా చర్చించాను. ఆ తరవాతే అసెంబ్లీకి వెళ్లాను. నేను అసెంబ్లీ హాలులో ప్రవేశించిన తక్షణం, తమ తమ పార్టీలకు సన్నిహితుడను కావచ్చుననే ఆశతో కాంగ్రెసేతర పార్టీల వారందరూ నాకు అభినందనాలు చెప్పి నన్ను ఆహ్వానించారు. ఆ కాంగ్రెసు నేషనలిస్ట్ పార్టీవారు మళ్ళీ నన్ను స్వయంగా ఆహ్వానించి, తమ పార్టీనాయకత్వం వహించి, వారి బెంచీలమీద ఆసీనుణ్ణి కావలసిందని కోరారు. నమస్కార పురస్సరంగా వారి వారి ఆహ్వానాలను తిరస్కరించాను.

"నీవు ఒక్కడవూ విడిగా ఒక స్వతంత్ర అభ్యర్థిగా కూర్చున్నా సంతోషిస్తాను గాని, నీవు ఏ పార్టీ వారితోనూ కలవవ"ద్దని విఠల్‌భాయ్ కోరాడు.

అసెంబ్లీ హాలూ, పరిసరాలూ పర్యవేక్షించి, పండిత మదనమోహన మాలవ్యాగారితో ఆయన బ్లాకులో కూర్చోవాలనీ, ఆయన పార్టీలో సభ్యత్వంకూడా స్వీకరిద్దామని తలచాను. మాలవ్యా పండితుడు మితవాది అని కొందరూ, లిబరల్ అని కొందరూ అంటూఉన్నా నాకు మాత్రం ఆయనయందు అంత గౌరవం ఉంది. నా ఉద్దేశంలో దాదాబాయ్ నౌరోజీగారి స్వభావమూ, మాలవ్యా పండితుని స్వభావమూ ఒకటే. వారు లిబరల్స్ అయినా, మితవాదులయినా, మరేదయినా - పిరికివారు మాత్రం కారు.

మాలవ్యాగారి పార్టీలో చేరడంలో ఉద్దేశం

నేను మాలవ్యాగారికి సన్నిహితుడనయి, వారి పార్టీలో జేరాలని అనుకున్నా, ఎల్లాగయినా వారిని మార్చి ప్రత్యక్ష చర్యకు పూనుకునేలా చెయ్యాలన్నది నా ఆశయం. నేను మాలవ్యాగారితోటి, వారి పార్టీవారితోటి కొద్ది వారాలు మాత్రమే కలిసి కూర్చున్నాను. మేము ఒకర్ని ఒకరం బాగా ఎరిగిఉన్న కారణాన్నీ, మూడు సంవత్సరాలపాటు ఒకే సభలో కలిసి ఉన్న కారణాన్నీ, రెండు మూడు రోజులలోనే వారి పార్టీలో నాకు స్థానం దొరికింది. ఎం. ఆర్. జయకర్‌గారూ, ఎమ్. ఎస్. అనే, ఘనశ్యాందాస్ బిర్లా మొదలైనవారు మాలవ్యా పండితుని పార్టీ సభ్యులు.

విఠల్‌భాయ్ నన్ను అసెంబ్లీకి వస్తూ, తనకి సహకారిగా ఉండమని కోరాడు. నేను మాలవ్యాగారి పార్టీలో చేరి, అ పార్టీ ముఖ్యులలో కొందరిచేతనయినా, గాంధీగారు దండీ చేరుకునేనాటికి, ఆ 21 రోజుల లోపల, రాజీనామా ఇప్పించడమే విఠల్‌భాయ్‌కి చేయగల సహాయం అని తలచాను. ఎల్లాగయినా విఠల్‌భాయ్‌గారిచేత కూడా రాజీనామా ఇప్పించి జైలుకి తీసుకుపోవాలని నా వాంఛ. కొన్నాళ్ళపాటు విఠల్‌భాయ్‌గారిని వారి ఇంటివద్ద నిత్యమూ కలుస్తూ వచ్చాను. మాలవ్యాగారి పార్టీ డిప్యూటి లీడర్ జయకర్‌గారితో నాకు భేటీ వచ్చి, మేము తీవ్రంగా వాదించుకున్నా, తుదకు ఆయన్ని నా వైపు త్రిప్పుకుని, ఉప్పు సత్యాగ్రహ సంరంభంలో పాల్గొనడానికి వారి పార్టీ సభ్యులం పధ్నాలుగురం అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా ఇస్తామనీ, అ పద్నాలుగురిలోనూ మాలవ్యా పండితుడు, అనే, బిర్లా మొదలైనవారు ఉంటారనీ విఠల్‌భాయ్ గారితో చెప్పాను. బిర్లామాత్రం సూక్ష్మబుద్ధీ, వివే కమూ గల వర్తక వ్యాపారి అవడాన్ని, ఆయన తన రాజీనామా, మా అందరితోనూ కలిసి కాక, విడిగా ఇస్తానని చెప్పాడు.

జయకర్‌మాత్రం ప్రతి మీటింగులోనూ మాలవ్యాగారు రాజీనామా ఇవ్వకుండా చూడాలని అనేక విదాల తంటాలు పడ్డాడు. రాజకీయంగా మా దృక్పథాలు వేరయినా, నాకూ జయకర్‌గారికీ మధ్య సన్నిహితమైన మైత్రి ఉండేది. ఆయన తమ పార్టీని విచ్ఛిన్నం చేశానంటూ నన్ను ఆడిపోసుకునేవాడు. ఈ మా చర్యలను కనిపెడుతూన్న "టైమ్స్ ఆఫ్ ఇండియా" పత్రిక, ఒక మదరాసు సభ్యుడు వచ్చి, మాలవ్యాగారి పార్టీలో ఈ మధ్య చేరినట్లే చేరి వారి పార్టీని ఛిన్నాభిన్నం చేశాడని బొంబాయినుండి చాలాసార్లు వ్రాసింది. ఘనశ్యాందాసు బిర్లాకి శాసన ధిక్కార ఉద్యమంలో చేరాలని లేదు. అందుచేతనే ఆయన తన రాజీనామా విడిగా సమర్పించాడు.

మాలవ్యా ప్రభృతులతో కలిసి రాజీనామా

మాలవ్యాగారితో కలసి పదముగ్గురం, జాయింటుగా ఒకే రాజీనామా పత్రం సమర్పించాము. మాలవ్యాగారూ, అనే మొదలైన వారు గొప్ప దేశభక్తులు. దేశానికి సేవ చెయ్యడానికి వా రెప్పుడూ సంసిద్ధులే. అందువల్ల వారి విషయంలో ప్రోద్బలం అంతగా అవసరం లేకపోయింది. కారణాంతరాలవల్ల తాము వేరే పార్టీ సభ్యులుగా చెలామణి అవుతూన్నా, నిజానికి వారు మంచి శక్తి మంతులు. మాలవ్యాగారు కాంగ్రెసు వారిని కూడా ఎటువంటి ప్రత్యక్ష చర్యా కార్యక్రమంలో నయినా నాయకత్వం వహించి, నడపగల యోధుడు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, వారికి నేను ఈ ప్రత్యక్ష చర్య మొదలైన విషయాలను గురించి చెప్పినప్పుడు, ఏ విధమయిన ప్రోద్బలమూ లేకుండానే, వారంతట వారే ముందుకు వచ్చి, అగ్ని గుండంలోనికి దూకడానికి సిద్దమయ్యారు. వారి పార్టీ చిహ్నం ఏదయినా, సహకార నిరాకరణ ఉద్యమం ఆరంభం అయినప్పటినుంచీ వారిని గమనిస్తూన్న కారణంగా, వారంటే నాకు అభిమానమూ, గౌరవమూ కూడా ఏర్పడ్డాయి. వారి ఘనతను గురించి, వారి దేశాభిమానం గురించి నాకున్న అభిప్రాయం సరి అయిందేనని, నేను కాంగ్రెసును వ్యతిరేకించి, తిరిగీ కౌన్సిల్ ప్రవేశంచేసి, వారి పార్టీలో జేరిన కొద్ది దినాలలోనే, వారి అభిమానాన్ని సంపాదించి, ప్రత్యక్షంగా వారి సంగతి సందర్భాలు గ్రహించి, నిర్ధారణ చేసుకున్నాను. 1930 సత్యాగ్రహ ప్రారంభ దినాలలో కేంద్ర శాసన సభనుంచి మాలవ్యా ప్రభృతులచేత ఇప్పించగలిగిన రాజీనామా విషయం చాలించి, విఠల్‌భాయ్‌గారి రాజీనామా సంగతి ప్రస్తావిస్తాను.

విఠల్‌భాయ్‌గారి రాజీనామా

నిజంగా విఠల్‌భాయ్ చాలా బలిష్ఠమయిన కాంగ్రెసు నాయకుడు. ఆయన ఎటువంటి త్యాగాన్ని చెయ్యడానికయినా ఎప్పుడూ సిద్ధమే. ఆయన చాలా స్వతంత్రంగా ఆలోచించగల దిట్ట. వాగ్దాటి, చాతుర్యమూ కలవాడు. మహాత్మా గాంధీగారితో సంప్రతింపు లప్పుడు వారి శక్తి సువ్యక్తం అయింది. ఆయన తాను నమ్మిన విషయాన్ని నిస్సంకోచంగా గాంధీగారికి వ్యక్తంచేసే సందర్భంలో ఆయనకి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడా అనిపించేదేగాని, వారికి అడుగడుక్కీ అడ్డం తగిలి తర్క వితర్కాలు చేసే బాపతుగా ఎప్పుడూ కనిపించలేదు.

విఠల్‌భాయీ, నేనూ కాంగ్రెసు సంరంభం ఆరంభం అయిన నాటినుంచీ ఒకరికి ఒకరం బాగా సన్నిహితుల మవుతూ వచ్చాము. అధ్యక్ష పదవిని వదిలి కాంగ్రెసు సంరంభంలో చేరమని సూచిస్తూ ఆయనతో వాదప్రతివాదాలకు దిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే: "ప్రకాశంగారూ! మీరు రోజూ నాకేదో ప్రబోదం చేస్తున్నారు. ఇటువంటి విషయాలలో నాకు ఒకరి ప్రబోదం అవసరమా? నా శరీర స్థితి మీకు తెలియదు. ఇంతవరకూ నా శరీర పరిస్థితిని మీకు చెప్పవలసిన అవసరం కలుగలేదు. రోజూ ఎనీమా చేసుకుంటేనేగాని నాకు విరోచనం కాదు. ఈ విషయంలో మీరేమంటారు?"

ఈ విషయం నిజంగా నాకు విస్మయం కలిగించింది. ఆయనతో కలిసి బొంబాయిలో ఆయన 'బంద్రా' హౌస్‌లో చాలా రోజులపాటు ఉన్నా, ఈ విషయం ఆయన ఎప్పుడూ నాతో చెప్పలేదు. ఆయన చాలా మితభాషి. తన గొడవలతో ఇంకొకరు బాధపడకుండా దాచి పెట్టుకునే రకం. ఆయన సన్నిహిత మిత్రులతో, సహచరులతో, ఆఖరికి ఆయనకు బాగా సన్నిహితుడయిన లాట్‌వాలాగారితోకూడా అదే పద్దతిగా వ్యవహరించే బాపతు వ్యక్తి ఆయన. నిజానికి చాలా గొప్ప వ్యక్తి. ఉత్తమ దేశభక్తుడు. ఆయన అధ్యక్ష స్థానాన్ని, నిమిషాలమీద విడిచి, తన శారీరక పరిస్థితిని గూడా విస్మరించి అరెస్టవడానికి కూడా సిద్ధమయిన మహాపురుషుడు.

విషాద మరణం

ఆ రోజులలో రాజకీయ ఖైదీల అంతస్తులు కూడా గమనించకుండా, విఠల్‌భాయ్‌లాంటి ఉత్తమ దేశభక్తుల శారీరక స్థితిని కూడా గమనించకుండా, అందరినీ ఒకే తీరున చూచేవారు. ఆయన్ని ఖైదీగా చెన్నరాష్ట్రానికి బదిలీ చేయడం మా కందరికీ విస్మయం కలిగించింది. ఆయన శారీరక స్థితీ, జైయిలులో అమలు జరిపే శిక్షా విధానమూ ఆయనకు బాధా కారణాలయ్యాయి. ఆయన కోయంబత్తూరు జెయిల్లో ఉండే రోజులలో, నేను కన్ననూరు జెయిల్లో ఉండేవాడిని. కోయంబత్తూరుకూ, కన్ననూరుకూ అట్టే దూరం లేదుగా? అందువలన వార్తలందుతూ ఉండేవి.

జెయిలులో ఒక భాగంనుంచి ఇంకొక భాగానికి స్ట్రెచ్చరు మీద తీసుకువెళ్ళే సందర్భాలలో ఆయన్ని జారవిడిచేవారుట. ఈ సంగతివిని నేను చాలా బాధపడ్డాను. నేను నిజంగా చాలా తప్పుజేశానేమో! ఇప్పుడు ఎంత అనుకున్నా ఏం లాభం? నిజానికి ఆయన అరెస్టుకీ, ఈ జెయిలు పరిస్థితికీ, అన్నింటికీ మూలకారణం నేనే గదా! నేను అంతగా ఆయన్ని ప్రోద్బలంచేసి ఉండకపోతే, ఆయన అసెంబ్లీ అధ్యక్ష స్థానానికి రాజీనామా ఇవ్వకుండా, అలాగే సుఖంగా ఉండిపోయేవాడేమో! రాజీనామా ఇచ్చినా స్వాతంత్ర్య సమరంలో పాల్గొనకుండా నయినా ఉండేవాడు. కోయంబత్తూరు జెయిల్లో ఆయనకు దెబ్బతగిలిన కారణంగా ఆయన్ని విడుదల చేశారనీ, దర్మిలా ఆయన చనిపోయారనీ విని మరీ యెక్కువగా బాధపడ్డాను. ఆయన్ని నేను బలవంతంచేసి ఉండకపోతే ఆయన అలా బ్రతికి ఉండేవారేమో! ఈ సంఘటన జరిగి ఇన్నాళ్ళయినా ఈ విషయాన్ని మాత్రం ఇంకా మరవలేకుండా ఉన్నాను. ఈ ప్రకారంగా మా పార్ల మెంటరీ విధానం సాంతం అవడమూ, విఠల్‌భాయ్ పటేలూ, మాలవ్యా పండితుడూ, నేనూ 1930 లో జెయిళ్ళలో మ్రగ్గడమూ సంభవించింది.